Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 27 ఫిబ్రవరి 2024
February Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 27 ఫిబ్రవరి 2024

తెలుగులో 27 ఫిబ్రవరి 2024 కరెంట్ అఫైర్స్ అంశాలను చదవండి. వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాం.

ప్రపంచ బ్యాంక్ జీఈఎఫ్‌లో తొలి మహిళా డైరెక్టర్‌గా గీతా బాత్రా

ప్రపంచ బ్యాంక్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ యొక్క స్వతంత్ర మూల్యాంకన కార్యాలయంలో భారతీయ ఆర్థికవేత్త గీతా బాత్రా కొత్త డైరెక్టర్‌గా నియమితులయ్యారు. దీనితో ఈ బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు. 57 ఏళ్ల బాత్రా ప్రస్తుతం ఇదే సంస్థలో చీఫ్ ఎవాల్యుయేటర్ మరియు డిప్యూటీ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు.

ఫిబ్రవరి 9న వాషింగ్టన్‌లో జరిగిన 66వ జీఈఎఫ్‌ కౌన్సిల్ సమావేశంలో ఈ గౌరవనీయమైన పదవికి బాత్రా పేరు ఏకగ్రీవంగా సిఫార్సు చేయబడింది. న్యూఢిల్లీలో జన్మించిన బాత్రా, ముంబైలోని విల్లా థెరిసా హైస్కూల్ (1984)లో ప్రైమరీ ఎడ్యుకేషన్ చదువుకున్నారు, తర్వాత చెన్నైలోని స్టెల్లా మేరీస్ కళాశాలలో ఎకనామిక్స్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. విలే పార్లేలోని నర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుండి ఎంబీఏ పూర్తి చేశారు.

గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెసిలిటీ అనేది జీవవైవిధ్యం, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ జలాలు, భూమి క్షీణత, నిరంతర సేంద్రీయ కాలుష్య కారకాలు, ఆహార భద్రత, అటవీ నిర్వహణ వంటి సంబంధిత ప్రాజెక్టులకు గ్రాంట్లు మరియు ఆర్థిక సహాయం అందించే బహుపాక్షిక పర్యావరణ నిధి. అంతర్జాతీయ సంబంధిత పర్యావరణ సవాళ్లను పరిష్కరించడానికి సగటున సంవత్సరానికి $1 బిలియన్ కంటే ఎక్కువ సహాయం అందజేస్తుంది.

  • జీఈఎఫ్‌ 1992 రియో ​​ఎర్త్ సమ్మిట్‌కు ముందు స్థాపించబడింది.
  • ఇందులో అంతర్జాతీయ సంస్థలు, పౌర సమాజ సంస్థలు మరియు ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో కలిపి 184 దేశాలు సభ్యులుగా ఉన్నాయి.
  • ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ ప్రయోజత అభివృద్ధి కార్యక్రమాలకు ఇది మద్దతు ఇస్తుంది.

బికనీర్ జిల్లాలో ఇండో-జపాన్ మిలటరీ డ్రిల్ - ధర్మ గార్డియన్

రాజస్థాన్‌లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో భారత్-జపాన్ సంయుక్త మిలిటరీ వ్యాయామం ధర్మ గార్డియన్ 2024 నిర్వహించబడింది. ఈ వ్యాయామం 25 ఫిబ్రవరి 2024 నుండి 9 మార్చి 2024 వరకు 15 రోజుల నిడివితో నిర్వహించబడింది. ఇది ధర్మ గార్డియన్ 5 వ ఎడిషన్.

ఈ వ్యాయామంలో ఇరుపక్షాల నుండి 40 మంది సైనిక సిబ్బంది పాల్గొన్నారు. జపాన్ సైన్యం నుండి 34 వ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌కు చెందిన సైనికులు ప్రాతినిధ్యం వహించగా, రాజ్‌పుతానా రైఫిల్స్‌కు చెందిన బెటాలియన్‌తో భారత ఆర్మీ బృందం ఇందులో పాల్గొంది.

ఐక్యరాజ్యసమితి యొక్క చార్టర్ VII అధ్యాయం ప్రకారం ఇరుదేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంపొందించడం మరియు సెమీ-అర్బన్ ప్రాంతాలలో ఉమ్మడి సైనిక కార్యకలాపాలను అమలు చేయడానికి సంయుక్త సామర్థ్యాలను మెరుగుపరచడం ఈ వ్యాయామం యొక్క లక్ష్యం. ఈ వ్యాయామం శారీరక దృఢత్వం, ఉమ్మడి ప్రణాళిక, ఉమ్మడి వ్యూహాత్మక కసరత్తులు మరియు ప్రత్యేక ఆయుధ నైపుణ్యాల ప్రాథమిక అంశాలపై దృష్టి పెడుతుంది.

భారతదేశం మరియు జపాన్ సైనిక సహకారాన్ని బలోపేతం చేసే అనేక వ్యాయామాలలో ధర్మ గార్డియన్ ఒకటి. ఇది రెండు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారాన్ని సూచిస్తుంది. దీనితో పాటుగా ఇరు దేశాల నావికాదళంతో కూడిన సముద్ర వ్యాయామం అయిన జపాన్-ఇండియా మారిటైమ్ ఎక్సర్‌సైజ్ (జిమెక్స్) మరియు వైమానిక దళాలతో కూడిన వీర్ గార్డియన్ వైమానిక వ్యాయామం కూడా ఉన్నాయి.

రాష్ట్రపతి భవన్‌లో పర్పుల్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి భవన్‌లోని అమృత్ ఉద్యాన్‌లో వికలాంగుల సాధికారిత కోసం నిర్వహించిన పర్పుల్ ఫెస్ట్ ఈవెంట్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిబ్రవరి 26న ప్రారంభించారు. ఈ ఏడాది జనవరి 8 నుండి 13 వరకు గోవాలో జరిగిన అంతర్జాతీయ పర్పుల్ ఫెస్ట్ 2024 విజయవంతం అయిన తర్వాత సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వికలాంగుల సాధికారత విభాగం ఈ ఆహ్లాదకరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

ఈ కార్యక్రమానికి 10 వేల మందికి పైగా దివ్యాంగులు హాజరయ్యారు. దీనదయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజేబిలిటీస్ ఈ ఫెస్ట్‌కు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించింది. ఈ వేడుకలో యాక్సెసిబిలిటీ, ఇన్‌క్లూజన్ మరియు డిసేబిలిటీ రైట్స్‌ కోసం పనిచేస్తున్న సంస్థలు కూడా పాల్గొన్నాయి.

పర్పుల్ ఫెస్ట్ వివిధ వైకల్యాలు మరియు ప్రజల జీవనంపై వాటి ప్రభావం గురించి అవగాహన పెంచడం కోసం నిర్వహించబడింది. వైకల్యాల చుట్టూ తిరుగుతున్న దురభిప్రాయాలు, కళంకం మరియు మూస పద్ధతులను సవాలు చేయడంతో పాటుగా, వికలాంగులపై సమాజంలో అవగాహన, అంగీకార ధోరణి పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

రంగ్‌పోలో సిక్కిం తొలి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఫిబ్రవరి 26న సిక్కింలోని రంగ్‌పోలో మొదటి రైల్వే స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. దీనితో సిక్కిం ఇప్పుడు రైల్వే లైన్‌తో అనుసంధానించబడుతుంది. ఇది ఇప్పటి వరకు విమాన ప్రయాణం మరియు రోడ్లపై ఆధారపడిన ఆ రాష్ట్ర పౌరులకు మూడవ రవాణా మార్గం అందుబాటులో రానుంది.

రంగ్‌పో స్టేషన్ ఏర్పాటు సిక్కిం పర్యాటకంకు నూతన ఊపిరి పోయనుంది, సిక్కింకు ఇంతకు ముందు రైల్వే లైన్ లేదు. ఈ రైల్వే ప్రాజెక్టును భారత్ రైల్వే మూడు దశల్లో పూర్తి చేసిందుకు సంతకం చేసింది. మొదటి దశలో సేవోక్ నుండి రంగ్‌పో రైలు ప్రాజెక్టును, రెండవ దశలో రంగ్‌పో నుండి గ్యాంగ్‌టక్ వరకు, మూడవ దశలో గాంగ్టక్ నుండి నాథులా వరకు రైల్వే మార్గం ఏర్పాటు చేయనున్నారు.

ఈ ప్రాజెక్టు 2024 ప్రారంభం నాటికి పూర్తి చేయాలని షెడ్యూల్ చేసారు, అయితే వరదలు మరియు కొండచరియలు విరిగిపడటం వంటి బాహ్య కారకాల కారణంగా ఈ ప్రాజెక్ట్ కాలక్రమం 2025 వరకు పొడిగించబడింది. ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 14 సొరంగాలు, 13 పెద్ద వంతెనలు మరియు 9 చిన్న వంతెనలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పనులు అరవై నుండి అరవై ఐదు శాతం పూర్తియినట్లు రైల్వే నివేదించింది.

ఇదే వేదిక ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ 41,000 కోట్ల విలువైన 2,000 రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద దేశ వ్యాప్తంగా 553 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి కార్యక్రమం కూడా ఇందులో భాగంగా ఉంది. 27 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్న ఈ స్టేషన్లు పునరాభివృద్ధి కోసం రూ. 19,000 కోట్లు ఖర్చు చేయనున్నారు.

ప్రపంచంలోనే అతి చిన్న వాషింగ్ మెషీన్‌ను రూపొందించిన ఆంధ్ర ప్రదేశ్ నివాసి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సాయి తిరుమలనీడి, ప్రపంచంలోనే అతి చిన్న వాషింగ్ మెషీన్‌ను కనిపెట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. ఈ వాషింగ్ మెషీన్‌ కేవలం 37*41*43 మిమీ కొలతతో ప్రపంచంలోనే అతి చిన్న వాషింగ్ మెషీన్‌గా నిలిచింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ అతి చిన్న ఫంక్షనల్ వాషింగ్ మెషీన్‌ వీడియోను వారి ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేశారు.

ఈ వాచింగ్ మెషిన్ పరిమాణం సూక్షమంగా ఉన్నప్పటికీ, ఇది ఒక స్విచ్ మరియు సూక్ష్మ పైపుతో సహా పూర్తి ఫంక్షనల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది మైక్రో-ఇంజనీరింగ్ ప్రతిభకు సంబంధించి అద్భుత పనితీరుగా గుర్తింపు పొందింది. సాయి తిరుమలనీడి ఆంధ్రప్రదేశ్‌లోని తుని సిటీకి చెందిన నివాసి.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ విడుదల చేసిన ఈ వీడియో క్లిప్ మిలియన్ల కొద్దీ వీక్షణలను సంపాదించింది, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉత్సుకత మరియు ప్రశంసలను రేకెత్తించింది. ఈ విశేషమైన ఫీట్ సాయి తిరుమలనీడి ప్రతిభను మరియు చాతుర్యాన్ని హైలైట్ చేయడమే కాకుండా భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న వినూత్న స్ఫూర్తిని కూడా ప్రదర్శిస్తుంది. సాయి తిరుమలనీడి ఆవిష్కరణ మానవ సృజనాత్మకత సరిహద్దులను నెట్టివేసే శక్తికి నిదర్శనం.

Post Comment