కరెంటు అఫైర్స్ – జూన్ 2022 | అవార్డులు & గౌరవాలు
Magazine 2022

కరెంటు అఫైర్స్ – జూన్ 2022 | అవార్డులు & గౌరవాలు

డచ్ చిత్రం 'టర్న్ యువర్ బాడీ టు ది సన్'కు గోల్డెన్ కాంచ్ అవార్డు

ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 యందు డచ్ దేశానికీ చెందిన డాక్యుమెంటరీ చిత్రం 'టర్న్ యువర్ బాడీ టు ది సన్' గోల్డెన్ కాంచ్ అవార్డు దక్కించుకుంది. ఈ చిత్రం 2వ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలచే బంధించబడిన టాటర్ సంతతికి చెందిన సోవియట్ సైనికుడి జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది. ఈ అవార్డు గ్రహీతకు 10 లక్షల ప్రైజ్ మనీ అందిస్తారు.

ఆర్‌జే ఉమర్ నిసార్‌కు యునిసెఫ్ ఉత్తమ కంటెంట్ అవార్డు

జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఆర్‌జే ఉమర్ నిసార్‌కు యునిసెఫ్ ఉత్తమ కంటెంట్ అవార్డు మరియు ఇమ్యునైజేషన్ ఛాంపియన్ అవార్డుతో సత్కరించింది. కోవిడ్ 19 మహమ్మారి సమయంలో ప్రజలలో అవగాహన పెంపొందించడంలో మరియు ప్రేక్షకులకు ప్రభుత్వ ప్రకటనలు చేరువయ్యేలా, అలానే అసంబద్దమైన పుకార్లను నియంత్రించడంలో ఆయన చేసిన అద్భుతమైన పనికి గాను ఈ అవార్డు లభించింది.

22వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు

22వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA ) అవార్డు ఉత్సవాలు జూన్ 3 నుండి 4 మధ్య అబుదాబీలో ఘనంగా నిర్వహించారు. ఈ అవార్డుల ఉత్సవంలో సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన షేర్షా చిత్రం అత్యధికంగా ఆరు అవార్డులు దక్కించుకుంది. ఇందులో ఉత్తమ చిత్రం అవార్డు కూడా ఉంది. అలానే ఉత్తమ నటుడుగా సర్దార్ ఉదమ్ చిత్రానికి గాను విక్కీ కౌశల్ అందుకోగా, మీమి చిత్తానికి గాను కృతి సనన్ ఉత్తమ నటి అవార్డు అందుకుంది.

కెనడియన్ రచయిత్రి రూత్ ఒజెకి 2022 విమెన్స్ ప్రైజ్

ప్రముఖ యుఎస్-కెనడియన్ రచయిత్రి రూత్ ఒజెకి, తాను రచించిన 'ది బుక్ ఆఫ్ ఫారమ్ అండ్ ఎంప్టినెస్'  కోసం 2022 మహిళా ప్రైజ్‌ని గెలుచుకుంది. ఈ ఫిక్షన్ నవల, తండ్రి విషాదకరమైన మరణం తర్వాత, అతనితో మాట్లాడే వస్తువుల గొంతులను వినడం ప్రారంభించిన పదమూడేళ్ల బాలుడి గురించి వ్రాయబడింది. విమెన్స్ ప్రైజ్ ఏటా అత్యుత్తమ ఇంగ్లీష్ రచనలు చేసిన మహిళా రచయితలకు అందజేస్తారు. ఈ అవార్డు గ్రహీతకు సుమారు 36 వేల యూఎస్ డాలర్ల ప్రైజ్ మనీ అందిస్తారు.

తొలి కెంపేగౌడ అంతర్జాతీయ అవార్డు విజేతలు

ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం ప్రారంభించిన కెంపేగౌడ అంతర్జాతీయ అవార్డును, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ, భారతీయ ఐటీ మార్గదర్శకుడు నారాయణ మూర్తి మరియు బ్యాడ్మింటన్ లెజెండ్ ప్రకాష్ పదుకొణెలకు అందజేశారు. 513వ కెంపేగౌడ జయంతిని పురస్కరించుకుని జూన్ 27న కర్ణాటక విధానసౌధలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అవార్డులను ప్రదానం చేసారు.

Post Comment