31st డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్ | Today Current affairs in Telugu
Telugu Current Affairs

31st డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్ | Today Current affairs in Telugu

31st December 2023 Current affairs in Telugu. పోటీ పరీక్షల రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో పొందండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షల కొరకు సిద్దమవుతున్న ఆశావహులకు ఉపయోగపడతాయి.

Advertisement

ద్వారకలో భారతదేశపు మొట్టమొదటి జలాంతర్గామి పర్యాటకం

ద్వారకా నగరాన్ని అన్వేషించడానికి నీటి అడుగున పర్యాటకం కోసం జలాంతర్గామిని నిర్మించేందుకు గుజరాత్ ప్రభుత్వం మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్‌తో  చేసుకుంది. దీనితో ఇది భారతదేశపు మొట్టమొదటి జలాంతర్గామి టూరిజం చొరవగా నిలవనుంది. ద్వారక తీరం నుండి దగ్గరలో ఉన్న బెట్ అనే ఒక చిన్న ద్వీపం చుట్టూరా ఈ పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నారు.  పర్యాటకులు ప్రత్యేకంగా రూపొందించిన జలాంతర్గామిలో సముద్ర ఉపరితలం నుండి 100 మీటర్ల వరకు డైవ్ చేసి, ఆ ద్విపం చుట్టూ ఉండే సముద్ర జీవులను విక్షించనున్నారు.

ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రణాళికా దశలో ఉంది, 2024లో దీపావళికి ముందు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గుజరాత్ ప్రభుత్వం ఈ జలాంతర్గాముల నిర్మాణం మరియు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మజ్‌గావ్ డాక్ లిమిటెడ్ సంస్థతో  భాగస్వామ్యం కుదుర్చుకుంది. ద్వారకా నగరం మహాభారతం యొక్క ప్రాచీన పురాణ కాలంలో ప్రస్తావించబడింది. పురాణాల ప్రకారం, కృష్ణుడు మధురలో తన మామ అయిన కంసుడిని ఓడించి చంపిన తర్వాత ఇక్కడే స్థిరపడ్డాడు.

శ్రీకృష్ణుని రాజ్యం యొక్క రాజధానిగా భావించబడే ఈ పురాతన మరియు సంపన్న నగరం, ప్రపంచం నలుమూలల నుండి హిందువులను ఆకర్షిస్తుంది. ఈ పుణ్యక్షేత్రం గుజరాత్ పశ్చిమ తీరంలో, గోమతి నది ఒడ్డున ఉంది. ఈ నగరం గోమతి నది మరియు అరేబియా సముద్రం కలిసే కోట నగరంగా దాదాపు 84 కి.మీ.ల మేర విస్తరించి ఉంది.

ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ 2024

బీసీసీఐ 2024లో ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పీఎల్) అని పిలువబడే టెన్నిస్ బాల్ టీ10 టోర్నమెంట్‌ నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం ఆరు జట్లు మార్చి 2, 2024 నుండి మార్చి 9, 2024 వరకు మొత్తం 19 మ్యాచ్‌లు ముంబైలో ఆడనున్నాయి. ఈ టెన్నిస్-బాల్ క్రికెట్ పోటీ ప్రధానంగా వీధి క్రికెట్ ఆటగాళ్ల క్రీడా ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ జాతీయ సరిహద్దులను దాటి, భవిష్యత్ క్రికెట్ సూపర్‌స్టార్‌ల అభివృద్ధికి మద్దతు ఇచ్చే ప్రపంచ వేదికగా మారనుంది.

ఈ టోర్నమెంట్ రౌండ్ రాబిన్ ఫార్మెట్లో ప్రతి జట్లు ఒకదానికొకటి ఒకసారి ఆడతాయి. పాయింట్ టేబుల్ యందు మొదటి నాలుగు జట్లు ప్లేఆఫ్‌లకు అర్హత సాధిస్తాయి. ఇక్కడ మొదటి రెండు జట్లు ఒకదానితో ఒకటి క్వాలిఫయర్‌లో ఆడతాయి. రెండవ పోటీ మూడు మరియు నాల్గవ స్థానంలో ఉన్న జట్లు మధ్య జరుగుతుంది. వర్చువల్ క్వార్టర్-ఫైనల్‌లో మొదటి క్వాలిఫైయర్‌లో విజేత ఫైనల్‌కు చేరుకుంటాడు, క్వాలిఫైయర్‌లో ఓడిన వారు ఎలిమినేటర్ మ్యాచులో గెలిచిన వారితో ఆడుతారు. ఇందులో విజయం పొందిన వారు తుదిపోరులో పోటీ పడతారు.

ఈ టోర్నమెంట్‌లో మొత్తం ఆరు జట్లు ఉంటాయి, ఒక్కొక్కటి ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా మరియు శ్రీనగర్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ ఫ్రాంచైజీల యాజమాన్య హక్కులను సంబంధిత రాష్ట్రాలకు చెందిన సినిమా ప్రముఖులు సొంతం చేసుకున్నారు.

  • ముంబై టైగర్స్: అమితాబ్ బచ్చన్
  • శ్రీనగర్ లయన్స్: అక్షయ్ కుమార్
  • హైదరాబాద్ స్ట్రైకర్స్: రామ్ చరణ్
  • చెన్నై సూపర్ కింగ్స్: సూర్య శివకుమార్
  • బెంగళూరు బ్లాస్టర్స్: హృతిక్ రోషన్
  • కోల్‌కతా వారియర్స్: యజమానిని ఇంకా ప్రకటించలేదు

2 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 30, 2023న రెండు కొత్త అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది భారతీయ రైల్వేలచే నిర్వహించబడే నూతన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు. ఇవి వందే భారత్ రైళ్లను పొలిఉన్నప్పటికి, ఇవి నాన్-ఎసి స్లీపర్ కమ్ అన్‌రిజర్వ్‌డ్ బోగీలను కలిగి ఉంటాయి.

ఈ రైళ్లను 800 కిమీ కంటే ఎక్కువ దూరంలో ఉన్న భారతీయ నగరాలను కలిపే నైట్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులుగా ఉపయోగించేందుకు ప్లాన్ చేస్తున్నారు. వీటిని భారతదేశంలోని అతిపెద్ద లోకోమోటివ్ తయారీ యూనిట్లలో ఒకటైన చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ యందు తయారు చేస్తున్నారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రస్తుతం 22 కోచ్‌లు ఉన్నాయి. ఇందులో 02 గార్డ్ వ్యాన్‌లు, 08 అన్‌రిజర్వ్డ్ కోచ్‌లు మరియు 12 స్లీపర్ కోచ్‌లు ఉంటాయి.

ఈ ఎక్స్‌ప్రెస్ రైలును డిసెంబర్ 30న అయోధ్య ధామ్ జంక్షన్ నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ మొదటి సర్వీస్ 1 జనవరి 2024న దర్భంగా నగరం నుండి న్యూఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ వరకు ప్రారంభమవుతుంది. మరో ట్రైన్ జనవరి 5న బెంగుళూరు నుండి మాల్డా టౌన్ వరకు ప్రయాణిస్తుంది.

  • దర్భంగా-ఆనంద్ విహార్ టెర్మినల్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (1,137 కిమీ/21 గంటలు 35 నిమిషాలు)
  • మాల్దా టౌన్-బెంగళూరు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (2,247 కిమీ/42 గంటలు 10 నిమిషాలు)

మరో 6 వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 30న మరో ఆరు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించిన వాటిలో శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా-న్యూ ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, అమృత్‌సర్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, కోయంబత్తూరు-బెంగళూరు కాంట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, మంగళూరు-మడ్గావ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, జల్నా-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరియు అయోధ్య-ఆనంద్ విహార్ టెర్మినల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్లు ఉన్నాయి. దీనితో దేశంలో మొత్తం వందే భారత్ రైళ్ల సంఖ్య 41కి చేరుకుంది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ దూరం ప్రయాణ సమయం
ఆనంద్ విహార్ టెర్మినల్-అయోధ్య ధామ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 628 కిమీ 8గం 20ని
శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా -ఢిల్లీ జంక్షన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 655 కిమీ 8గం 00ని
కోయంబత్తూరు-బెంగళూరు కంటోన్మెంట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 375 కిమీ 06గం 20ని
మంగళూరు సెంట్రల్-మడ్గావ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 319 కిమీ 04గం 35ని
అమృత్‌సర్-ఢిల్లీ జంక్షన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 448 కిమీ 05గం 20ని
జల్నా-ముంబై సిఎస్ఎంటీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 435 కిమీ 06గం 50మీ

Advertisement

Post Comment