Advertisement
Daily Current affairs January 05, 2024 | తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్
January Telugu Current Affairs

Daily Current affairs January 05, 2024 | తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్

January 05, 2024 Current affairs in Telugu. పోటీ పరీక్షల రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో పొందండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షల కొరకు సిద్దమవుతున్న ఆశావహులకు ఉపయోగపడతాయి.

నేషనల్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ) అవార్డులు 2023

ఆత్మనిర్భర్ భారత్ ఉత్సవ్ 2024 వేదికగా 2023 నేషనల్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ) అవార్డులను విజేతలకు అందజేశారు. ఈ కార్యక్రమంకు కేంద్ర విదేశాంగ మంత్రి డా. సుబ్రహ్మణ్యం జైశంకర్ మరియు కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు మరియు జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సంవత్సరం ఓడీఓపీ అవార్డ్స్ ఎడిషన్ కోసం రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా 25 జూన్ నుండి 31 జూలై 2023 వరకు ఎంట్రీలను స్వీకరించారు. దీని కోసం దేశ వ్యాప్తంగా 26 రాష్ట్రాలు/యుటిలు, 535 జిల్లాలు మరియు విదేశాల్లోని 19 భారతీయ మిషన్‌ల నుండి దాదాపు 580 దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. ఈ ఏడాది 3 విభాగాలలో మొత్తం 24 అవార్డులు అందజేశారు. జిల్లాలు, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు మరియు విదేశాలలో ఉన్న భారతీయ మిషన్‌ల ప్రతినిధులకు ఈ అవార్డులు అందజేశారు.

విదేశాలలో ఉన్న భారతీయ మిషన్‌లకు సంబంధించి వాంకోవర్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా మరియు నికోసియాలోని హైకమిషన్ ఆఫ్ ఇండియా వరుసగా గోల్డ్, సిల్వర్ మరియు బ్రాంజ్ మెడల్ అందుకున్నాయి.

వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అవార్డులు అనేవి భారతదేశంలోని ప్రతి జిల్లా నుండి ప్రత్యేకమైన స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడంలో మరియు అభివృద్ధి చేయడంలో అత్యుత్తమ ప్రయత్నాలను గుర్తిస్తూ అందించే గుర్తింపు. ఇవి గ్రామీణ సంఘాలను బలోపేతం చేయడం మరియు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

జిల్లాల వారి అవార్డులు (వ్యవసాయం)

ర్యాంక్ జిల్లా రాష్ట్రం ఉత్పత్తి అవార్డు
1 అల్లూరి సీతారామ రాజు ఆంధ్రప్రదేశ్ అరకు కాఫీ బంగారం
2 ఉత్తరకాశీ ఉత్తరాఖండ్ రెడ్ రైస్ వెండి
3 షోపియన్ J&K ఆపిల్ కంచు
4 కంధమాల్ ఒడిశా పసుపు కంచు
5 భటిండా పంజాబ్ తేనె ప్రత్యేక ప్రస్తావన
6 బుర్హాన్‌పూర్ మధ్యప్రదేశ్ అరటిపండు ప్రత్యేక ప్రస్తావన

జిల్లాల వారి అవార్డులు (వ్యవసాయేతర)

ర్యాంక్ జిల్లా రాష్ట్రం ఉత్పత్తి అవార్డు
1 కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఉప్పాడ జమ్దానీ చీర బంగారం
2 బండ ఉత్తర ప్రదేశ్ షాజర్ స్టోన్ క్రాఫ్ట్ వెండి
3 శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ పొందూరు కాటన్ చీరలు కంచు
4 కర్నూలు ఆంధ్రప్రదేశ్ చేనేత పట్టు చీరలు కంచు
5 అన్నమయ్య ఆంధ్రప్రదేశ్ మదనపల్లె సిల్క్ చీరలు ప్రత్యేక ప్రస్తావన
6 గుంటూరు ఆంధ్రప్రదేశ్ మంగళగిరి చేనేత ప్రత్యేక ప్రస్తావన

రాష్ట్రాలు (కేటగిరీ A) వారి విజేతలు

rank రాష్ట్రం అవార్డు
1 ఉత్తర ప్రదేశ్ బంగారం
2 గుజరాత్ వెండి
3 మహారాష్ట్ర కంచు
4 పంజాబ్ కంచు
5 రాజస్థాన్ కంచు

రాష్ట్రాలు (కేటగిరీ B) వారి విజేతలు

ర్యాంక్ రాష్ట్రం అవార్డు
1 జమ్మూ & కాశ్మీర్ బంగారం
2 ఉత్తరాఖండ్ వెండి
3 మేఘాలయ కంచు
4 సిక్కిం కంచు

మిషన్ అబోర్డ్ విజేతలు

ర్యాంక్ రాష్ట్రం అవార్డు
1 కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, వాంకోవర్ బంగారం
2 కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, న్యూయార్క్ వెండి
3 హైకమిషన్ ఆఫ్ ఇండియా, నికోసియా కంచు

ఢిల్లీలో ఆత్మనిర్భర్ భారత్ ఉత్సవ్ 2024

ఆత్మనిర్భర్ భారత్ ఉత్సవ్ 2024 వేడుకలను న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో 2024 జనవరి 3 నుండి 10వ తేదీ వరకు 7 రోజుల పాటు నిర్వహించారు. ఈ కార్యక్రమంను పీఎం విశ్వకర్మ అనే థీమ్ ఆధారంగా, స్వావలంబన దిశగా భారతదేశం యొక్క పురోగతిని ప్రదర్శించడానికి వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహించింది.

ఈ ఉత్సవ్ భారతదేశం మరియు విదేశాల నుండి ఒక మిలియన్ సందర్శకులను ఆకర్షించింది. ఇది భారతదేశం యొక్క పెరుగుతున్న ఆర్థిక మరియు సాంకేతిక పరాక్రమాన్ని ప్రదర్శించే ఒక ప్రధాన కార్యక్రమం. ఈ వేడుకల్లో దేశవ్యాప్తంగా భారతీయ ఉత్పత్తులు మరియు సేవల ప్రదర్శనలు, దేశ గొప్ప వారసత్వాన్ని ప్రదర్శించే సాంస్కృతిక ప్రదర్శనలు, స్వావలంబనకు సంబంధించిన అంశాలపై వ్యాపార సమావేశాలు మరియు వర్క్‌షాప్‌లు నిర్వహించారు.

  • ఈ ఉత్సవ్‌ను జనవరి 3, 2024 న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. తన ప్రసంగంలో, భారతదేశ భవిష్యత్తు కోసం స్వావలంబన యొక్క ప్రాముఖ్యతను మోదీ హైలైట్ చేశారు.
  • ప్రారంభం రోజున 2023 ఓడీఓపీ అవార్డులు అంజేశారు. ఈ అవార్డులు ఓడీఓపీ చొరవ కింద స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడంలో మరియు అభివృద్ధి చేయడంలో అత్యుత్తమ విజయాలకు అందించబడ్డాయి
  • ఈ ఉత్సవ్‌లో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 1,000 స్టాల్స్‌లో భారతీయ ఉత్పత్తులు మరియు సేవలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో ఉన్న ఉత్పత్తులలో హస్తకళలు, వస్త్రాలు, ఆహారం, ఎలక్ట్రానిక్స్ వంటివి ఉన్నాయి.

భారతీయ రైల్వేలలో 20 వేల జీపీఎస్ ఆధారితం ఫాగ్ సిగ్నల్ పోస్ట్‌లు

భారతీయ రైల్వే పొగమంచు ప్రభావిత రైలు మార్గాలలో దాదాపు 20 వేల జీపీఎస్ ఆధారిత నావిగేషన్ ఫాగ్ పాస్ పరికరాలను ఇన్‌స్టాల్ చేసినట్లు నివేదించింది. ఈ జీపీఎస్ ఆధారిత ఫాగ్ పాస్ నావిగేషన్ పరికరం,, దట్టమైన పొగమంచు పరిస్థితుల్లో లోకో పైలట్‌కి రైలు నావిగేట్ చేయడంలో సహాయపడుతుంది. ఇది సిగ్నల్, లెవల్ క్రాసింగ్ గేట్ మరియు శాశ్వత వేగ పరిమితుల వంటి స్థిర ల్యాండ్‌మార్క్‌ల స్థానానికి సంబంధించి లోకో పైలట్‌లకు ఆన్-బోర్డ్ రియల్ టైమ్ సమాచారాన్ని అందజేస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.

యేటా చలికాలంలో పొగమంచుతో కూడిన వాతావరణం భారతీయ రైల్వే సేవలకు పెద్ద మొత్తంలో ఆటంకం కల్పిస్తుంది, ముఖ్యంగా ఉత్తర భారత రాష్ట్రాలలో ఈ సమస్యతో పెద్ద సంఖ్యలో రైళ్లు ప్రభావితమవుతున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫాగ్ పాస్ చాల పోర్టబుల్, కాంపాక్ట్ సైజు మరియు బరువు తక్కువగా ఉన్నందున లోకో పైలట్ ఈ పరికరాన్ని తన వెంట సులభంగా తీసుకువెళ్లేందుకు అవకాశం ఉంటుందని వెల్లడించింది.

  • జీపీఎస్-ఆధారిత నావిగేషన్ ఫాగ్ పాస్ యొక్క రియల్-టైమ్ డేటా, రైళ్లు సురక్షితమైన దూరాలను అంచనా వేయడానికి మరియు పొగమంచు పరిస్థితులలో రైళ్లు ఢీకొనడాన్ని నిరోధించడానికి వీలు కల్పిస్తుంది.
  • ఈ డివైజ్‌లను ఇప్పటికే ఉన్న ట్రాక్‌సైడ్ వార్నింగ్ సిస్టమ్‌లతో ఏకీకృతం చేయవచ్చు. తద్వారా పొగమంచు ప్రాంతాలకు చేరుకునే రైళ్లకు ఆటోమేటిక్ హెచ్చరికలు మరియు వేగ పరిమితులను గ్రహించేందుకు అవకాశం కల్పిస్తుంది.
  • దీని ద్వారా రైలు మార్గాలను నిజ-సమయ పొగమంచు పరిస్థితుల ఆధారంగా రైలు సమయాలను డైనమిక్‌గా సర్దుబాటు చేయవచ్చు, ప్రయాణ సమయాలను ఆప్టిమైజ్ చేయడం వలన వాటి ఆలస్యాన్ని తగ్గించవచ్చు.
  • పొగమంచు సిగ్నల్ పోస్ట్ మొదటి స్టాప్ సిగ్నల్ నుండి 270 మీటర్ల వద్ద ఏర్పాటు చేయబడుతుంది . డబుల్ డిస్టెంట్ సిగ్నల్స్ ఉన్న స్టేషన్లలో మరియు డిటోనేటర్ల ప్లేస్‌మెంట్ కోసం అర్హత లేని స్టేషన్లలో ఫాగ్ సిగ్నల్ పోస్ట్‌లు అందించబడవు.
  • అయితే ఈ సాంకేతికత ఇంకా అభివృద్ధిలో దశలో ఉందని గమనించడం ముఖ్యం. వీటి ప్రభావం అమలు, శిక్షణ మరియు అవస్థాపన వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.

నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ కింద కోటి మందికి పరీక్షలు

నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ 2047 కింద ఇప్పటి వరకు కోటి మందికి పైగా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. వచ్చే మూడేళ్ళ కాలంలో 7 కోట్ల జనాభాను పరీక్షించేందుకు ఈ మిషన్ ప్రయత్నిస్తుందని కూడా వెల్లడించింది. నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్‌ను 1 జూలై 2023న మధ్యప్రదేశ్‌లోని షాడోల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ మిషన్ 2047 నాటికి దేశంలో సికిల్ సెల్ అనీమియాను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కార్యక్రమం అన్ని గిరిజన మరియు ఇతర అధిక ప్రబల ప్రాంతాలలో సికిల్ సెల్ అనీమియా స్క్రీనింగ్, నిర్దారణ మరియు దాని నిర్వహణ కోసం పని చేస్తుంది. ఈ కార్యక్రమం ప్రధానంగా సికిల్ సెల్ వ్యాధి ఎక్కువగా ఉన్న 17 రాష్ట్రాల్లోని 278 జిల్లాలపై దృష్టి సారిస్తుంది. ఈ 17రాష్ట్రాలలో  గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అస్సాం, ఉత్తరప్రదేశ్, కేరళ, బీహార్ మరియు ఉత్తరాఖండ్ ఉన్నాయి.

  • ఈ కార్యక్రమంలో కింద లబ్ధిదారులకు సికిల్ సెల్ జెనెటిక్ స్టేటస్ కార్డులను అందజేస్తున్నారు.
  • ఇందులో భాగంగా 0-40 సంవత్సరాల మధ్య ఉన్న వారికి మొదటి ప్రాధాన్యతగా స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు.
  • సికిల్ సెల్ డిసీజ్ జన్యు పరమైనది కావున, ఈ వ్యాధి తరువాతి తరానికి బదిలీ కాకుండా నివారణకు ప్రయత్నిస్తున్నారు.

నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ ప్రోగ్రామ్, యూనియన్ బడ్జెట్ 2023లో ప్రవేశపెట్టబడింది. ముఖ్యంగా దేశంలోని గిరిజన జనాభాలో సికిల్ సెల్ వ్యాధి ద్వారా ఎదురయ్యే ముఖ్యమైన ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి సారిస్తుంది. సికిల్ సెల్ డిసీజ్ అనేది దీర్ఘకాలిక రక్తహీనత, తీవ్రమైన బాధను కలిగించే వ్యాధి. ఇది అవయవ ఇన్ఫెక్షన్లకు మరియు దైహిక సిండ్రోమ్‌కు కారణమయ్యే దీర్ఘకాలిక సింగిల్ జన్యు రుగ్మత.

ఈ కార్యక్రమం జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా మిషన్ మోడ్‌లో అమలు చేయబడుతుంది. 2047 నాటికి సికిల్ సెల్ జెనెటిక్ ట్రాన్స్‌మిషన్‌ను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.  ఈ మిషన్ ఈ వ్యాధిని నిర్మూలించడంలో దీర్ఘకాలిక నిబద్ధతను చూపుతుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం నుండి 2025-26 వరకు ఈ కార్యక్రమం కింద సుమారు 7.0 కోట్ల మంది ప్రజలను పరీక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది.

తిరుచ్చి ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, జనవరి 2న తమిళనాడులో తిరుచిరాపల్లిలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఇదే వేదిక ద్వారా విమానయానం, రైలు, రోడ్డు, చమురు మరియు గ్యాస్, షిప్పింగ్ మరియు ఉన్నత విద్యా రంగాలకు సంబంధించిన రూ. 19,850 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

1100 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయబడిన తిరుచిరాపల్లి అంతర్జాతీయ టెర్మినల్ భవనం ఏటా 44 లక్షల మంది ప్రయాణీకులకు సేవలు అందించనుంది. ఇది రద్దీ సమయాల్లో దాదాపు ఏకధాటిన 3500 మంది ప్రయాణీకులకు సేవలను అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. కొత్త టెర్మినల్ యందు ప్రయాణీకుల సౌలభ్యం కోసం అత్యాధునిక సౌకర్యాలు మరియు ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇదే వేదిక ద్వారా ప్రధాని అంకితం చేసిన ఇతర ప్రోజెక్టులలో

  • 41.4 కి.మీల సేలం–మాగ్నసైట్ జంక్షన్–ఓమలూరు–మెట్టూర్ డ్యామ్ సెక్షన్ పొడిగింపు పనుల శంకుస్థాపన.
  • మదురై - టుటికోరిన్ వరకు 160 కి.మీ రైలు మార్గం పొడిగింపు పనుల శంకుస్థాపన.
  • కామరాజర్ పోర్ట్‌లోని జనరల్ కార్గో బెర్త్-II (ఆటోమొబైల్ ఎగుమతి/దిగుమతి టెర్మినల్-II & క్యాపిటల్ డ్రెడ్జింగ్ ఫేజ్-V)ని ప్రధాన మంత్రి జాతికి అంకితం చేసారు.
  • ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క 488 కి.మీల పొడవైన పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ ప్రాజెక్ట్ వ్యయం 9000 కోట్లు.
  • గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) యొక్క క్రిష్ణగిరి నుండి కోయంబత్తూరు వరకు 323 కి.మీ సహజ వాయువు పైప్‌లైన్ అభివృద్ధి ప్రాజెక్టు కూడా శంకుస్థాపన చేశారు.
  • కల్పక్కంలోని ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ యందు అభివృద్ధి చేసిన డెమోన్‌స్ట్రేషన్ ఫాస్ట్ రియాక్టర్ ఫ్యూయల్ రీప్రాసెసింగ్ ప్లాంటును జాతికి అంకితం చేస్తారు.
  • తిరుచిరాపల్లికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)కి చెందిన 500 పడకల బాలుర హాస్టల్ 'అమెథిస్ట్'ను ప్రారంభించారు.
  • తిరుచిరాపల్లిలోని భారతిదాసన్ యూనివర్సిటీ 38వ స్నాతకోత్సవానికి ప్రధాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తిరుచ్చి పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీరంగం ఆలయంపై రూపొందించిన ప్రతిష్టాత్మకమైన పుస్తకాన్ని అందుకున్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై ఆయనకు “శ్రీరంగం – ది రెప్లెండెంట్ కింగ్‌డమ్ ఆఫ్ రంగరాజా” అనే ప్రత్యేకమైన కాఫీ టేబుల్ పుస్తకాన్ని బహూకరించారు.

ది హిందూ గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తకం శ్రీరంగంలోని ప్రసిద్ధ శ్రీ రంగనాథస్వామి దేవాలయం యొక్క సాంస్కృతిక ప్రాముఖ్యతకు సంబదించిన 454 పేజీల సమగ్ర సంపుటి. 11 విభాగాలుగా విభజించబడిన ఈ పుస్తకంలో ఆలయ చరిత్ర, వాస్తుశిల్పం, పండుగలు, ఆచారాలు మరియు కళల వంటి విభిన్న అంశాలపై దృష్టి సారిస్తుంది. ఈ పుస్తకంలో దేవాలయం యొక్క అందం మరియు వైభవాన్ని ప్రదర్శించే అధిక-నాణ్యత ఛాయాచిత్రాలు మరియు దృష్టాంతాలు ఉన్నాయి.

నేవీ వైస్ చీఫ్‌గా వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి

వైస్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్‌గా జనవరి 4న బాధ్యతలు స్వీకరించారు. దినేష్ కె త్రిపాఠి ఈ నావల్ స్టాఫ్ వైస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు, పశ్చిమ నౌకాదళ కమాండ్ కమాండింగ్-ఇన్-చీఫ్ ఫ్లాగ్ ఆఫీసర్‌గా పనిచేశారు. సైనిక్ స్కూల్ రేవా మరియు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఖడక్వాస్లా యొక్క పూర్వ విద్యార్థి అయిన ఈయన 01 జూలై 1985లో భారత నౌకాదళంలో కెరీర్ ప్రారంభించారు.

అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి కమ్యూనికేషన్ మరియు ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ నిపుణుడు. ఈయన గతంలో నేవీ యొక్క ఫ్రంట్‌లైన్ యుద్ధనౌకలలో సిగ్నల్ కమ్యూనికేషన్ ఆఫీసర్ మరియు ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ ఆఫీసర్‌గా పనిచేశారు. తర్వాత దశలో గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ ముంబైకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు ప్రిన్సిపల్ వార్‌ఫేర్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు.

ఈయన భారత నౌకాదళ నౌకలైన వినష్, కిర్చ్ మరియు త్రిశూల్‌లకు కూడా నాయకత్వం వహించాడు. ముంబైలోని వెస్ట్రన్ ఫ్లీట్ యొక్క ఫ్లీట్ ఆపరేషన్స్ ఆఫీసర్, నేవల్ ఆపరేషన్స్ డైరెక్టర్, ప్రిన్సిపల్ డైరెక్టర్ నెట్‌వర్క్ సెంట్రిక్ ఆపరేషన్స్ మరియు న్యూ ఢిల్లీలో ప్రిన్సిపల్ డైరెక్టర్ నావల్ ప్లాన్‌లతో సహా పలు ముఖ్యమైన కార్యాచరణ మరియు సిబ్బంది నియామకాలను కూడా నిర్వహించారు. రియర్ అడ్మిరల్ స్థాయికి పదోన్నతి పొందిన తర్వాత, అతను నేవల్ హెడ్‌క్వార్టర్స్ యందు  అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ (పాలసీ అండ్ ప్లాన్స్)గా మరియు ఈస్టర్న్ ఫ్లీట్ కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్‌గా పనిచేశారు.

జూన్ 2019లో వైస్ అడ్మిరల్ ర్యాంక్‌కు పదోన్నతి పొందిన తర్వాత, కేరళలోని ఎజిమల వద్ద ఉన్న ప్రతిష్టాత్మకమైన ఇండియన్ నేవల్ అకాడమీకి కమాండెంట్‌గా నియమితులయ్యారు. జూలై 2020 నుండి మే 2021 వరకు నావల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. జూన్ 21 నుండి ఫిబ్రవరి 23 వరకు, ఫ్లాగ్ ఆఫీసర్ చీఫ్ ఆఫ్ పర్సనల్‌గా పనిచేశారు. వైస్ అడ్మిరల్ త్రిపాఠి కర్తవ్య భక్తికి గాను అతి విశిష్ట సేవా పతకం మరియు నౌసేనా పతకాన్ని అందుకున్నారు.

వెట్‌ల్యాండ్ సిటీ అక్రిడిటేషన్ కోసం మూడు భారతీయ నగరాలు నామినేషన్

రామ్‌సర్ కన్వెన్షన్ కింద వెట్‌ల్యాండ్ సిటీ అక్రిడిటేషన్ కోసం మూడు భారతీయ నగరాలను కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలను సమర్పించింది. ఈ నగరాల జాబితాలో ఇండోర్ (మధ్యప్రదేశ్), భోపాల్ (మధ్యప్రదేశ్) & ఉదయపూర్ (రాజస్థాన్)లు ఉన్నాయి. దీనితో ఈ మూడు నగరాలు, వెట్‌ల్యాండ్ సిటీ అక్రిడిటేషన్ కోసం నామినేషన్లు సమర్పించబడిన మొదటి భారతీయ నగరాలుగా అవతరించాయి.

స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ల సహకారంతో సంబంధిత రాష్ట్ర చిత్తడి నేలల అధికారుల నుండి స్వీకరించిన ప్రతిపాదనల ఆధారంగా, కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఈ నామినేషన్ సమర్పించింది. ఈ ప్రతిపాదనను రామ్‌సర్ కన్వెన్షన్ ఆమోదిస్తే ఈ నగరాల పరిధిలో ఉన్న చిత్తడి నేలల వరద నియంత్రణ, జీవనోపాధి అవకాశాలు మరియు వినోద మరియు సాంస్కృతిక విలువల పరంగా ప్రయోజనం చేకూర్చుతుంది.

  • ఇండోర్‌లోని రామ్‌సర్ సైట్ - సిర్పూర్ వెట్‌ల్యాండ్
  • ఇండోర్‌కు దగ్గరగా ఉన్న రామ్‌సర్ సైట్ - యశ్వంత్ సాగర్
  • భోపాల్‌లోని రామ్‌సర్ సైట్ - భోజ్ వెట్‌ల్యాండ్
  • ఉదయపూర్ మరియు చుట్టుపక్కల ఉన్న అనేక చిత్తడి నేలలు (సరస్సులు)

ఇండోర్ సిటీ : హోల్కర్స్ రాజవంశం ద్వారా స్థాపించబడిన ఇండోర్ నగరం, ఇటీవలే భారతదేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు పొందింది. 2023 ఏడాదికి గాను అత్యుత్తమ పారిశుధ్యం, నీరు మరియు పట్టణ పర్యావరణం కోసం భారతదేశం యొక్క స్మార్ట్ సిటీ అవార్డు అందుకుంది. ఈ నగరంలోని రామ్‌సర్ ప్రదేశం అయిన సిర్పూర్ సరస్స, స్థానిక నీటి పక్షుల సమూహానికి ఆవాసంగా ఉంది. ఇది పక్షుల అభయారణ్యంగా కూడా అభివృద్ధి చేయబడుతోంది.

భోపాల్ : మధ్యప్రదేశ్ రాజధాని నగరమైన భూపాల్  భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఒకటి. భోపాల్ మునిసిపల్ కార్పోరేషన్ ప్రత్యేక లేక్ కన్జర్వేషన్ సెల్‌ను కలిగి ఉంది. భూపాల్ నగర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా 2031 నాటికి స్థానిక చిత్తడి నేలల చుట్టూ, పరిరక్షణ జోన్‌లను అబివృద్దికి ప్రతిపాదించింది. ఈ నగరానికి  దగ్గరలోని భోజ్ వెట్‌ల్యాండ్, ప్రపంచ స్థాయి చిత్తడి నేలల వివరణ కేంద్రం, జల్ తరంగ్‌ను కలిగి ఉంది.

ఉదయపూర్ : రాజస్థాన్‌లో ఉన్న ఈ నగరం చుట్టూ ఐదు ప్రధాన చిత్తడి నేలలు ఉన్నాయి. అవి పిచోలా, ఫతే సాగర్, రంగ్ సాగర్, స్వరూప్ సాగర్ మరియు దూద్ తలై. ఈ చిత్తడి నేలలు నగరం యొక్క సంస్కృతి మరియు గుర్తింపులో అంతర్భాగంగా ఉన్నాయి. ఈ నగరం యొక్క మైక్రోక్లైమేట్‌ను నిర్వహించడంలో ఇవి సహాయపడటంతో పాటుగా విపరీత వాతావరణ సంఘటనల నుండి ఈ నగరానికి బఫర్‌ను అందిస్తున్నాయి.

వెట్‌ల్యాండ్ సిటీ అక్రిడిటేషన్ : రామ్‌సర్ కన్వెన్షన్ రిజల్యూషన్ కింద, స్వచ్ఛంద వెట్‌ల్యాండ్ సిటీ అక్రిడిటేషన్ సిస్టమ్‌ 2015 లో జరిగిన కాప్ 12 సమావేశాల సందర్భంగా ఆమోదించబడింది. ఇది అర్బన్ మరియు పెరి-అర్బన్ పరిధిలోని చిత్తడి నేలల ప్రాముఖ్యతను గుర్తిస్తూ, ఈ చిత్తడి నేలలను సంరక్షించడానికి మరియు రక్షించడానికి తగిన చర్యలు తీసుకోవడానికి బాధ్యత వహిస్తుంది. గత ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన అమృత్ ధరోహర్ చొరవలో భాగంగా, భారత్ ప్రభుత్వం కూడా దేశంలోని రామ్‌సార్ సైట్‌ల యొక్క ప్రత్యేక పరిరక్షణ విలువలను ప్రోత్సహించడం లక్ష్యంగా పనిచేస్తుంది.

Post Comment