Advertisement
Daily Current affairs January 04, 2024 | తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్
January Telugu Current Affairs

Daily Current affairs January 04, 2024 | తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్

January 04, 2024 Current affairs in Telugu. పోటీ పరీక్షల రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో పొందండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షల కొరకు సిద్దమవుతున్న ఆశావహులకు ఉపయోగపడతాయి.

సాంఘిక సంక్షేమ పెన్షన్‌లను 3 వేలకు పెంచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సామాజిక భద్రతా పెన్షన్‌ను రూ. 2,750 నుండి రూ. 3,000కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరుతొ అందిస్తున్న ఈ పథకం కింద దాదాపు 66.34 లక్షల మంది లబ్ధిదారులు ఈ జనవరి నెల నుండి నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ పొందనున్నారు. దీనికి ప్రభుత్వం ప్రతి నెల 1,968 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది.

పెంచిన పెన్షన్‌ మొత్తాన్ని జనవరి 1 నుండి 8 వరకు వేడుకగా అందించారు. దీనికి సంబందించిన రాష్ట్రవ్యాప్త కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనవరి 3 న కాకినాడలో ప్రారంభించారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో సంక్షేమ పింఛన్లను పెంచుతామని హామీ ఇచ్చారు. నాటి టీడీపీ ప్రభుత్వం అందించే రూ.2వేల పెన్షన్‌ మొత్తాన్నిరూ.3వేలకు పెంచుతామని ప్రజలకు ప్రకటించారు.

2019 ఎన్నికలలో గెలిచాక సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్‌ను రూ.2,250కి పెంచారు. తర్వాత ప్రతి ఏడాది రూ 250ల చెప్పున పెంచుకుంటూ వచ్చిన ఈ ప్రభుత్వం, తాజా పెంపుతో హామీ మొత్తానికి చేరుకుంది. ఈ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2.6 లక్షల గ్రామ మరియు వార్డు వాలంటీర్ల ద్వారా ప్రతి నెలా నిర్ణీత తేదీన లబ్ధిదారులకు వారి ఇంటి వద్దకే పింఛన్లు అందజేస్తూ వచ్చింది.

భారతదేశంలో 9.3 లక్షల క్యాన్సర్ మరణాలు

లాన్సెట్ రీజినల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఏషియా జర్నల్ ప్రకారం 2019 లో భారతదేశంలో 12 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు మరియు 9.3 లక్షల మరణాలు చోటు చేసుకున్నాయి. ఆసియా దేశాల క్యాన్సర్ కేసులలో చైనా తర్వాత భారత్ రెండవ స్థానంలో ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. కొత్త క్యాన్సర్ కేసులు మరియు మరణాల సంఖ్య పరంగా ఆసియాలో చైనా, భారత్ మరియు జపాన్‌లు మూడు అగ్రగామి దేశాలలో ఉన్నాయని తెలిపింది. 2019లో ఈ మూడు దేశాలలో 94 లక్షల కొత్త కేసులు మరియు 56 లక్షల మరణాలు సంభవించినట్లు పేర్కొంది.

వీటిలో చైనాలో అత్యధికంగా 48 లక్షల కొత్త కేసులు మరియు 27 లక్షల మరణాలు చోటు చేసుకోగా అత్యధికంగా సహకరించగా, భారతదేశంలో 12 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు మరియు 9.3 లక్షల మరణాలు, జపాన్‌లో 9 లక్షల కొత్త కేసులు మరియు 4.4 లక్షల మరణాలు నమోదయ్యాయి.

ఆసియాలో ట్రాచల్, బ్రోంకస్ మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో అగ్రగామిగా ఉందని ఈ నివేదిక వెల్లడించింది. దీని ఫలితంగానే భారతదేశంలో 13 లక్షల కేసులు మరియు 12 లక్షల మరణాలు జరిగినట్లు తెలిపింది. ప్రత్యేకించి మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ అనేక ఆసియా దేశాలలో రెండవ లేదా టాప్-5 క్యాన్సర్లలో ఒకటిగా ఉందని నివేదించింది. 2006లో ప్రవేశపెట్టిన హ్యూమన్ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్ ఎయిడ్స్ వ్యాధిని నివారించడంలో మరియు సంబంధిత మరణాలను తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేసిందని తెలిపింది.

ఇంకా, క్యాన్సర్‌కు సంబంధించిన 34 ప్రమాద కారకాలలో ధూమపానం, ఆల్కహాల్ వినియోగం మరియు కాలుష్యం ప్రధానమైనవని తెలిపింది. ఆసియాలో పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా రాబోయే సంవత్సరాలలో క్యాన్సర్ భారం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

పీఎల్ఐ ఆమోదం పొందిన మొదటి భారతీయ ఈవీ కంపెనీగా ఓలా ఎలక్ట్రిక్

ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమ్‌కు అర్హత పొందిన మొదటి భారతీయ ఇ-స్కూటర్ కంపెనీగా ఓలా ఎలక్ట్రిక్ అవతరించింది. నాలుగు నెలల సుదీర్ఘ ప్రక్రియ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ నుండి ఈ ఆమోదం పొందింది. ఓలా ఎలక్ట్రిక్‌ ఈ పీఎల్ఐ సర్టిఫికేషన్ పొందటం ద్వారా ఇక మీదట ప్రతి ఈవీ యూనిట్‌ తయారీకి 15,000 నుండి 18,000 వరకు ప్రయోజనాలను పొందేందుకు అర్హుత పొందుతుంది. ఈ ఆర్థిక ప్రోత్సాహం ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పెంచడంతో పాటుగా, దేశవ్యాప్తంగా ఈవీల వ్యాప్తిని పెంచుతుందని భావిస్తున్నారు.

ఈ స్కీమ్‌కు అర్హత సాధించాలంటే, ఇ-స్కూటర్ స్టార్టప్‌లు కనీసం రూ. 1,000 కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఇప్పటికే ఈ స్కీమ్ అర్హుత పొందేందుకు హీరో మోటోకార్ప్, టివిఎస్ మోటార్ కంపెనీ మరియు బజాజ్ ఆటో వంటి ఇతర ప్రధాన కంపెనీలు కూడా దరఖాస్తు చేసుకున్నాయి.

ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమ్‌ను ప్రభుత్వం 2021లో ప్రారంభించింది. వచ్చే ఐదేళ్లలో దీని అమలు కోసం 25,938 కోట్ల బడ్జెట్ కేటాయించింది. పీఎల్ఐ- ఆటో స్కీమ్, ఎలక్ట్రిక్ వాహనాలు మరియు వాటి విడిభాగాలతో సహా అధునాతన ఆటోమోటివ్ టెక్నాలజీ ఉత్పత్తుల దేశీయ తయారీని పెంచడం లక్ష్యంగా ఈ పథకం రూపొందించబడింది. ఈ పథకం ఎలక్ట్రిక్ వాహనాలు మరియు వాటి విడిభాగాల తయారీ కోసం అర్హత కలిగిన అమ్మకాలలో 18% వరకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తుంది.

డెన్మార్క్ క్వీన్ మార్గరెత్ II పదవీ విరమణ

డెన్మార్క్ క్వీన్ మార్గరెత్ II ఐదు దశాబ్దాలకు పైగా కొనసాగిన పాలన తర్వాత జనవరి 14, 2024న తన హోదాను వదులుకోనున్నట్లు ప్రకటించారు. 83 ఏళ్ల మార్గరెత్ II తన నూతన సంవత్సర ప్రసంగం సందర్భంగా ఈ నిర్ణయం ప్రకటించారు. ఆమె సింహాసనాన్ని అధిరోహించిన 52వ వార్షికోత్సవమైన జనవరి 14, 2024 న అధికారికంగా పదవీ విరమణ చేయనున్నారు. ఆమె కుమారుడు క్రౌన్ ప్రిన్స్ ఫ్రెడరిక్ ఆమె తర్వాత కింగ్ ఫ్రెడరిక్ X గా నియమితులు కానున్నారు.

క్వీన్ మార్గరెత్ II 1972లో సింహాసనాన్ని అధిష్టించారు. సెప్టెంబరు 2022లో బ్రిటన్ రాణి ఎలిజబెత్ II మరణించిన తర్వాత ఐరోపాలో ఎక్కువ కాలం పనిచేసిన చక్రవర్తిగా (క్వీన్) మార్గరెత్ II అవతరించారు. అలానే గత జూలైలో ఆమె డెన్మార్క్ చరిత్రలో ఎక్కువ కాలం రాణి హోదాలో ఉన్న వ్యక్తిగా కూడా రికార్డు నమోదు చేశారు. మార్గరెత్ యొక్క పదవీ విరమణ డెన్మార్క్‌లో ఒక శకానికి ముగింపు కానుంది.

డెన్మార్క్‌లో రాజ్యాంగ రాచరికం మరియు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అమల్లో ఉన్నాయి. 1849లో ఆమోదించబడిన డానిష్ రాజ్యాంగం (గ్రుండ్‌లోవ్) పురాతన రాజ్యాంగాలలో ఒకటి. పార్లమెంటు మరియు దాని ప్రభుత్వం అధికార కార్యక్రమాలు నిర్వహిస్తుంది. చక్రవర్తి రాజకీయాలకు అతీతంగా ఉంటారు. చక్రవర్తి కేవలం దేశ పర్యటనల నుండి జాతీయ దినోత్సవ వేడుకల వరకు సాంప్రదాయ విధులలో మాత్రమే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు.

సముద్ర ట్రయల్స్‌కి సిద్దమైన చైనా అల్ట్రా-డీప్‌వాటర్ డ్రిల్లింగ్ షిప్

చైనా యొక్క అల్ట్రా-డీప్‌వాటర్ డ్రిల్లింగ్ షిప్ అయిన మెంగ్జియాంగ్, సముద్ర ట్రయల్స్‌కి బయలుదేరింది. చైనీస్ భాషలో 'డ్రీమ్' అని అర్థం వచ్చే మెంగ్జియాంగ్ నౌక, సముద్రంలో 10000 మీటర్లు (32800 అడుగులు) కంటే ఎక్కువ లోతులో డ్రిల్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అత్యాధునిక సముద్ర డ్రిల్లింగ్ నౌక. ఇది భూమి యొక్క మాంటిల్ యొక్క రహస్యాలు మరియు లోతైన సముద్ర వనరుల సంభావ్యతను అన్వేషించడం లక్ష్యంగా పెట్టుకుంది.

మెంగ్జియాంగ్ నౌక, అల్ట్రా-డీప్‌వాటర్ రీసెర్చ్ మరియు డ్రిల్లింగ్ చేయగల చైనా యొక్క మొదటి నౌక. ఇది గరిష్టంగా 15,000 నాటికల్ మైళ్లు (27,780 కిలోమీటర్లు) ప్రయాణించగలదు. ఇది పోర్ట్‌కి వెలుపల నిరంతరం దాదాపు 120 రోజులు పనిచేసే సామర్థ్యం కలిగిఉంది. ఇది సముద్ర మట్టానికి 11,000 మీటర్ల లోతులో కూడా డ్రిల్ చేయగలదు.

డీప్ వాటర్ డ్రిల్లింగ్ లేదా డీప్ వెల్ డ్రిల్లింగ్ అనేది లోతైన సముద్రం కింద చమురు వెలికితీత కోసం డ్రిల్లింగ్ రిగ్‌ని ఉపయోగించి భూమి యొక్క క్రస్ట్‌లో రంధ్రాలను సృష్టించే ఒక ప్రక్రియ. డీప్‌వాటర్ డ్రిల్లింగ్ సాధారణంగా 4,000 అడుగుల (1219 మీటర్లు) కంటే ఎక్కువ నీటి లోతులో చేయబడుతుంది, అయితే అల్ట్రా డీప్‌వాటర్ 7,000 అడుగుల (2,134 మీటర్లు) కంటే ఎక్కువ లోతులో డ్రిల్లింగ్ ప్రారంభమవుతుంది.

$100 బిలియన్ల క్లబ్‌లో చేరిన తోలి మహిళగా ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్

లోరియల్ బ్యూటీ ఉత్పత్తుల సామ్రాజ్యానికి వారసురాలు అయిన ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ 100 బిలియన్ డాలర్లు సంపాదించిన మొదటి మహిళ వ్యాపారవేత్తగా అవతరించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆమె సంపద జనవరి 4 నాడు $100.1 బిలియన్లకు చేరుకుంది. ఆమె ప్రస్తుతం ప్రపంచ సంపన్నుల జాబితాలో 12వ స్థానంలో ఉన్నారు.

బెటెన్‌కోర్ట్ మేయర్స్ ఫ్రెంచ్ సౌందర్య సాధనాల దిగ్గజం లోరియల్ వ్యవస్థాపకురాలు అయిన యూజీన్ షుల్లర్ మనవరాలు. ఆమె మరణానంతరం ఆమె కుమార్తె లిలియన్ బెటెన్‌కోర్ట్, ఈ వ్యాపారం నిర్వహించారు. ఈమె 2017లో మరణించే సమయానికి ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళగా ఉన్నారు. లిలియన్ బెటెన్‌కోర్ట్ మరణానికి ముందు కూతురు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్‌కు $40 బిలియన్ల సంపదను షేర్ల రూపంలో బదిలీ చేశారు. ప్రస్తుతం ఈమె కంపెనీలో 34.7% వాటాను కలిగివున్నారు.

లోరియల్ కంపెనీలో ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ తమ కుటుంబంలో నుండి మూడవ తరం మహిళా. లోరియల్ యొక్క 16 మంది సభ్యుల డైరెక్టర్ల బోర్డులో ఆమె ప్రస్తుతం వైస్ చైర్‌గా ఉన్నారు. నాల్గవ తరానికి చెందిన ఆమె ఇద్దరు కుమారులు కూడా ఈ బోర్డులో ఉన్నారు. బెటెన్‌కోర్ట్ మేయర్స్ చాలా సంవత్సరాలుగా భారీ కంపెనీ డివిడెండ్ నగదు చెల్లింపులను అందుకుంటుంది, అయితే ఆమె కలిగిన లోరియల్ స్టాక్స్ ఆమె కలిగి ఉన్న అత్యంత విలువైన సంపద.

లోరియల్ అనేది ఫ్రెంచ్ పర్సనల్ కేర్ కంపెనీ. ఇది 1909లో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం పారిస్‌లో ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 85,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. నేడు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సౌందర్య సాధనాల తయారీదారునిగా ఉంది. దీని ప్రస్తుతం సీఈఓగా నికోలస్ హిరోనిమస్ ఉన్నారు. 2022లో ఈ కంపెనీ €38 బిలియన్ల ఆదాయాన్ని నివేదించింది.

కొత్త వెంచర్‌ను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్

ఫ్లిప్‌కార్ట్ సహ-వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ కొత్త స్టార్టప్ ఓప్‌డోర్‌ (OppDoor) తో తిరిగి ఇ-కామర్స్ ల్యాండ్‌స్కేప్‌లోకి ప్రవేశించారు. ఓప్‌డోర్‌ అనేది ఈకామర్స్ సంస్థలకు ఎండ్- టు -ఎండ్ పరిష్కారాలను అందించడానికి రూపొందించినబడిన సేవల ప్లాట్‌ఫారమ్. ఇది ఇ-కామర్స్ బ్రాండ్‌లు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో సహాయం అందిస్తుంది.

ఇది నూతన ఇ-కామర్స్ సంస్థల వ్యాపార డిజైన్, ఉత్పత్తి, కస్టమర్ ప్రవర్తన, పన్నులు, సమ్మతి, భాగస్వామ్యాలు మరియు థర్డ్-పార్టీ విక్రేతలతో సహా ఆన్‌లైన్ వ్యాపారం యొక్క వివిధ అంశాలలో ఎండ్-టు-ఎండ్ పరిష్కారాలను అందిస్తుంది. ఈ-కామర్స్ పరిశ్రమలో బన్సల్ యొక్క లోతైన అనుభవం, నైపుణ్యం మరియు ఫ్లిప్‌కార్ట్ నుండి అతని అనుభవజ్ఞులైన సహోద్యోగుల నెట్‌వర్క్ నుండి ఈ స్టార్టప్ ప్రయోజనాలను పొందుతుందని భావిస్తున్నారు.

ఈ కంపెనీ ప్రస్తుతం యూఎస్, కెనడా, మెక్సికో, యూకే, జర్మనీ, సింగపూర్, జపాన్ మరియు ఆస్ట్రేలియా వంటి ప్రధాన మార్కెట్లలోని ఇ-కామర్స్ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటోంది. గ్లోబల్ ఇ-కామర్స్ యొక్క సంక్లిష్టతలను సమర్థవంతంగా నావిగేట్ చేయగల మరియు దాని ఖాతాదారులకు విలువైన పరిష్కారాలను అందించగల సామర్థ్యంపై దీని విజయం ఆధారపడి ఉంటుంది.

బిన్నీ బన్సాల్ 2018లో ఫ్లిప్‌కార్ట్‌ను విడిచిపెట్టిన తర్వాత ఆయన ప్రారంభించిన మొదటి ఇ-కామర్స్ వెంచర్ ఇది. ఫ్లిప్‌కార్ట్-వాల్‌మార్ట్ డీల్‌లోని నాన్-కాంపిటేట్ క్లాజ్ కారణంగా ఆయన భారతీయ ఇ-కామర్స్ స్పేస్‌లో నేరుగా వ్యాపారం చేయకుండ పరిమితం చేయబడ్డాడు. ఫ్లిప్‌కార్డ్‌ను 2007లో బెంగళూరు ప్రధాన కేంద్రంగా సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ ఉమ్మడిగా ప్రారంభించారు. తర్వాత కాలంలో ఇది భారతదేశంలో ప్రముఖ ఇ-కామర్స్ సంస్థగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ఈ సంస్థ వాల్‌మార్ట్ యాజమాన్యంలో ఉంది.

2024ని మానవ వనరుల అభివృద్ధి సంవత్సరంగా ప్రకటించిన ఐఆర్ఈడిఎ

ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఐఆర్ఈడిఎ) 2024 ఏడాదిని మానవ వనరుల అభివృద్ధి మరియు క్రమశిక్షణ సంవత్సరంగా ప్రకటించింది. నూతన సంవత్సరం 2024 వేడుక సందర్భంగా, కొత్త వ్యూహాత్మక రంగాలు మరియు భౌగోళిక ప్రాంతాలలో ఐఆర్ఈడిఎ యొక్క భవిష్యత్తు రోడ్‌మ్యాప్‌ను గుర్తించడానికి ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు దాని సీఎండీ ప్రదీప్ కుమార్ దాస్ ప్రకటించారు.

ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ 1987లో భారత ప్రభుత్వం పరిధిలో మినీ రత్న ప్రభుత్వ సంస్థగా ఏర్పడింది. ఇది పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ద్వారా  నియంత్రించబడుతుంది. ఇది దేశీయ పునరుత్పాదక ఇంధన రంగంలో సమర్థవంతమైన ఫైనాన్సింగ్‌ను ప్రోత్సహిస్తుంది.

యూపీలో విపత్తు ముందస్తు హెచ్చరిక కోసం రహత్ వాణి కేంద్రం ప్రారంభం

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విపత్తుల ముందస్తు హెచ్చరిక కోసం రహత్ వాణి కేంద్రాన్ని ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీ దుర్గా శంకర్ మిశ్రా జనవరి 1న వీటిని అధికారికంగా లక్నోలో ప్రారంభించారు. ఇది వరదలు, హీట్‌వేవ్‌లు, భూకంపాలు మరియు మెరుపు దాడుల వంటి సహజ విపత్తులను పర్యవేక్షించడానికి ఒక అబ్జర్వేటరీ మరియు సమాచార కేంద్రంగా పనిచేస్తుంది.

రహత్ వాణి కేంద్రం విపత్తు సంభవించడానికి 30 నిమిషాల నుండి గంట ముందు అధికారులు మరియు ప్రజలకు సకాలంలో హెచ్చరికలు జారీ చేయడానికి అధునాతన సాంకేతికత మరియు డేటా విశ్లేషణను ఉపయోగిస్తుంది. సకాలంలో విపత్తు ప్రదేశం నుండి ప్రజలను తరలించడం ద్వారా ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టాన్ని తగ్గిస్తుంది.

ఇది భారత వాతావరణ విభాగం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ మరియు నేషనల్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ వంటి వివిధ వనరుల నుండి నిజ-సమయ డేటాను క్రోడీకరించి, ప్రమాద తీవ్రతను అంచనా వేస్తుంది. అవసరమైన సమయంలో మొబైల్ నోటిఫికేషన్‌లు మరియు ఇతర ఛానెల్‌ల ద్వారా విపత్తు ప్రమాద హెచ్చరికలను ప్రజలకు చేరవేస్తుంది.

Post Comment