ప్రభుత్వ పథకాలు & పాలసీలు | ఫిబ్రవరి 2022
Telugu Current Affairs

ప్రభుత్వ పథకాలు & పాలసీలు | ఫిబ్రవరి 2022

పశ్చిమ బెంగాల్‌లో ఓపెన్-ఎయిర్ క్లాస్‌రూమ్ ప్రోగ్రామ్

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రైమరీ మరియు ప్రీ-ప్రైమరీ విద్యార్థుల కోసం ఓపెన్ - ఎయిర్ క్లాస్‌రూమ్ ప్రోగ్రామ్ 'పరాయ్ శిక్షాలయ (పొరుగు పాఠశాలలు)' ప్రారంభించింది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో పాఠశాలలకు వెళ్ళటం కుదరక కోల్పోయిన పాఠశాల విద్యను ఈ పాఠశాలల ద్వారా అందిస్తారు. ఈ ప్రాజెక్టులో పారా టీచర్లు మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు భాగం అవుతారు. ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వంచే ఆమోదించబడింది. అలానే ‘పరే శిక్షలయ’ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన అమలులో టాప్-10లో 7 తెలంగాణ గ్రామాలు

గ్రామీణ ప్రాంతాల సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి అద్భుత విజయాన్ని సూచిస్తూ, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన (SAGY) కింద ఎంపిక చేసిన మొదటి 10 గ్రామాలలో ఏడు ఆదర్శ గ్రామాలు తెలంగాణ నుండి ఎంపికయ్యాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2021 ర్యాంకింగ్ ప్రకారం, తెలంగాణలోని ఏడు గ్రామాలు మొదటి 10 స్థానాల్లో నిలిచాయి.

ఆదర్శ గ్రామానికి సంబంధించి కరీంనగర్‌లోని సైదాపూర్ మండల పరిధిలోని వెన్నంపల్లి గ్రామం 90.25 శాతం స్కోర్‌తో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలవడమే కాకుండా దేశంలో కూడా ప్రథమ స్థానంలో నిలిచిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఈ జాబితాలో నిజామాబాద్‌ జిల్లా జుక్కల్‌ మండలానికి చెందిన కోలాస్‌ రెండో స్థానంలో, కరీంనగర్ నుంచి బెజ్జంకి మండలం- గన్నేరువరం (నాల్గవ), వెర్నపల్లి - ఎల్లారెడ్డిపేట(6), రామకృష్ణాపురం - వీణవంక (9) ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి కందకుర్తి - రెంజల్ (5) మరియు ఠాణాకుర్ధ (10) గ్రామాలు టాప్ పదిలో చోటు సంపాదించుకున్నాయి.

సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన ( SAGY ) అనేది భారత ప్రభుత్వం అక్టోబర్ 2014 లో ప్రారంభించిన గ్రామాభివృద్ధి ప్రాజెక్ట్, దీనిలో భాగంగా ప్రతి పార్లమెంట్ సభ్యుడు తన పరిధిలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.

జగనన్న చేదోడు రెండో విడత నిధులు విడుదల చేసిన వైఎస్ జగన్

నయీ బ్రాహ్మణ,రజక టైలర్లకు ఆర్థిక చేయూతను అందించే జగనన్న చేదోడు పథకం యొక్క రెండో విడత నిధులను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేసారు. దీనికి సంబంధించి ₹285.35 కోట్ల రూపాయలను ప్రత్యక్ష ప్రయోజన నగదు బదిలీ పద్దతిలో వారి అకౌంటులో జమ చేసారు. నవరత్నాలలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పధకంలో భాగంగా లబ్ధిదారులకు 10 వేలు ఆర్థికసాయం అందిస్తారు.

అనాథ పిల్లల పునరావాసం కోసం 'మిషన్ వాత్సల్య' పథకం

అనాథ మరియు నిరాశ్రయులైన పిల్లలకు పునరావాసం కల్పించేందుకు కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రాయోజిత 'చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ (CPS) పథకం' - మిషన్ వాత్సల్యను అమలులోకి తెచ్చింది. దేశంలోని ప్రతి పిల్లోడికి ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన బాల్యాన్ని అందించడమీ లక్ష్యంగా ఈ పథకం రూపొందింది. 'చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ (CPS) పథకం కింద, ఇన్‌స్టిట్యూషనల్ కేర్, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ కేర్, మానవ వనరులు మొదలైన సేవలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు/UT ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం అందించబడుతుంది.

'న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్'కు ప్రభుత్వం ఆమోదం

వయోజన విద్య యొక్క అన్ని అంశాలను కవర్ చేయడంతోపాటుగా జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా 2022-2027 ఆర్థిక సంవత్సరాల్లో అమలు చేసేందుకు "న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్" అనే కొత్త పథకాన్ని భారత విద్యా మంత్రిత్వ శాఖ ఆమోదించింది. దీనిలో భాగంగా వయోజన అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని పెంపొందించడమే కాకుండా 21వ శతాబ్దపు పౌరునికి అవసరమైన క్లిష్టమైన జీవన నైపుణ్యాల వంటి ఇతర భాగాలను కూడా అందించనున్నారు.

ఇండియా గ్రీన్ హైడ్రోజన్ పాలసీ ప్రారంభం

భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జాతీయ హైడ్రోజన్ పాలసీలో మొదటి భాగాన్ని 17 ఫిబ్రవరి 2022న విద్యుత్ మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ ప్రారంభించారు. 85% చమురు మరియు 53% గ్యాస్ అవసరాలను దిగుమతి చేసుకునే భారతదేశం, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ఈ పాలసీని రూపొందించనుంది.

Advertisement

Post Comment