తెలుగులో కరెంట్ అఫైర్స్ 10 ఫిబ్రవరి 2024
February Telugu Current Affairs

తెలుగులో కరెంట్ అఫైర్స్ 10 ఫిబ్రవరి 2024

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 10 ఫిబ్రవరి 2024. పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నాం.

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి వయోశ్రీ యోజన పథకం

మహారాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వయోశ్రీ యోజన పేరుతొ నూతన పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం శారీరక లేదా మానసిక వైకల్యంతో బాధపడుతున్న 15 లక్షల మంది వృద్ధులకు ప్రయోజనం కల్పించే లక్ష్యంతో రూపొందించబడింది. 65 ఏళ్లు పైబడిన వారికి స్క్రీనింగ్ చేసి, అర్హులైన వారికి నెలకు మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ పథకం 480 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయబడుతుంది.

అలానే సహకార సంఘాలపై డిపాజిటర్ల విశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో వారి కోసం కొత్తగా సహాయ పథకాన్ని ప్రకటించింది. అధికారిక పత్రికా ప్రకటన ప్రకారం, ఏదైనా వ్యవసాయేతర సహకార సంఘం దివాళా తీస్తే ఒక లక్ష రూపాయల వరకు డిపాజిట్లను తిరిగి చెల్లిస్తుంది. దీని కోసం ఒక స్వతంత్ర సంస్థను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.

ఈ సంస్థకు ప్రభుత్వం తన సహకారంగా వంద కోట్ల రూపాయల ప్రారంభ కార్పస్‌ను ప్రకటించింది. అలానే దీనికి అదనంగా సహకార సంఘాలు కూడా వారు స్వీకరించే ప్రతి వంద రూపాయల డిపాజిట్లకు పది పైసలు విరాళంగా ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ నిర్ణయంతో దాదాపు మూడు కోట్ల మంది డిపాజిటర్లు లబ్ధి పొందుతారని ప్రభుత్వం అంచనా వేస్తుంది.

షిల్లాంగ్‌లో ఇంటర్నేషనల్ వాటర్ కాన్‌క్లేవ్ 2024

మేఘాలయలోని షిల్లాంగ్‌లో ఫిబ్రవరి 9, 10 తేదీలలో ఇంటర్నేషనల్ వాటర్ కాన్‌క్లేవ్ 2024 నిర్వహించారు. ఈ కార్యక్రమం పర్వత ప్రాంత రాష్ట్రాలలో నీటి సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో నిర్వహించబడింది. ఈ కార్యక్రమం నీటి సంరక్షణ నిపుణుల మధ్య ఆలోచనల మార్పిడి మరియు జ్ఞాన భాగస్వామ్యాన్ని పెంపొందించింది.

ఈ కాన్‌క్లేవ్ ప్రధానంగా కొండ ప్రాంతాలలో ప్రత్యేకమైన నీటి సంరక్షణ సవాళ్లను పరిష్కరించంపై చర్చలు నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా కొండ ప్రాంతాలలో విజయవంతమైన నీటి సంరక్షణ పద్ధతులను అధ్యయనం చేసింది. అలానే మేఘాలయలో స్థిరమైన నీటి సంరక్షణ ప్రణాళికలను అభివృద్ధి కోసం కూడా చర్చలు జరిపింది.

ఈ సదస్సుకు మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అలానే 30 దేశాల నుండి 500 మంది ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, నిపుణులు, విద్యావేత్తలు మరియు పౌర సమాజ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

ఇంటర్నేషనల్ వాటర్ కాన్‌క్లేవ్ 2024 అనేది నీటి భద్రతకు సంబంధించిన సవాళ్లు మరియు అవకాశాల గురించి చర్చించడానికి విస్తృత శ్రేణి వాటాదారులను ఒక చోటకు చేర్చిన విజయవంతమైన కార్యక్రమం. ఈ సమావేశం భవిష్యత్తులో నీటి విధానాలు మరియు కార్యక్రమాలను తెలియజేయడానికి ఉపయోగించే అనేక సిఫార్సులను రూపొందించింది.

ఈ కాన్‌క్లేవ్ ఇండియా వాటర్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ను ప్రారంభించింది. ఇది నీటి సవాళ్లకు వినూత్న పరిష్కారాల కోసం నిధులను అందిస్తుంది. షిల్లాంగ్ డిక్లరేషన్ సుస్థిర నీటి నిర్వహణ పట్ల కీలకమైన కట్టుబాట్లను వివరిస్తూ నీటి సవాళ్లను పరిష్కరించడానికి నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

మహారాష్ట్ర, గుజరాత్‌లలో కిల్కారి మొబైల్ హెల్త్ సేవలు ప్రారంభం

మొబైల్ హెల్త్ ఇనిషియేటివ్ కిల్కారి కార్యక్రమం గుజరాత్ మరియు మహారాష్ట్రలలో స్థానిక కంటెంట్‌తో ఫిబ్రవరి 7న ప్రారంభించబడింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భారతి ప్రవీణ్‌ పవార్‌ ఇటీవలే లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఈ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

కిల్కారి అనేది వారానికో సారి గర్భం, ప్రసవం మరియు శిశు సంరక్షణపై సమాచారాన్ని అందించే ఉచిత ఆడియో సందేశ సేవ. ఇది డిజిటల్ ఇండియా చొరవలో భాగంగా 15 జనవరి, 2016న ప్రారంభించబడింది. ఇది కొత్త మరియు కాబోయే తల్లులకు ప్రసవం మరియు శిశు సంరక్షణ సమాచారాన్ని అందిస్తుంది.

కిల్కారి ఆడియో-ఆధారిత సేవ, అందువల్ల ఇది గ్రామీణ భారతదేశంలోని అక్షరాస్యత సవాళ్లను కూడా అధిగమించింది. కిల్కారి ఆర్‌సిహెచ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న మహిళలకు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవిఆర్) ద్వారా గర్భం, ప్రసవం మరియు శిశు సంరక్షణ గురించి ఉచిత ఆడియో సందేశాలను అందజేస్తుంది. ఈ మెసేజింగ్ సేవ గర్భం యొక్క రెండవ త్రైమాసికంలో ప్రారంభమై, బిడ్డకు ఒక సంవత్సరం వయస్సు వచ్చే వరకు కొనసాగుతుంది.

ఈ కార్యక్రమం ప్రస్తుతం 18 రాష్ట్రాలు/యూటీలలో నిర్వహించబడుతుంది. వాటిలో అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, చండీగఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ & కాశ్మీర్, త్రిపుర, ఆంధ్రప్రదేశ్ మరియు అండమాన్ & నికోబార్ దీవులు ఉన్నాయి. ఇటీవల, 07 ఫిబ్రవరి, 2024న మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాలలో కూడా ప్రారంభించబడింది.

భారతీయ పర్యాటకులకు వీసా రహిత ప్రవేశం ప్రకటించిన ఇరాన్

ఇరాన్ కొత్తగా భారతీయ పర్యాటకుల కోసం 15 రోజుల వీసా-రహిత విధానాన్ని ప్రకటించింది. ఈ ప్రకటన ప్రకారం సాధారణ పాస్‌పోర్ట్‌లు కలిగి ఉన్న భారతీయ పౌరులు అర్హులు 15 రోజులు వరకు ఇరాన్ యందు సందర్శించవచ్చు. ఈ విధానం పర్యాటక ప్రయోజనాలకు మాత్రమే వర్తిస్తుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి అర్హులు ఈ విధానం కింద ఇరాన్ సందర్శించవచ్చు.

వ్యాపార లేదా విద్యా పర్యటనలకు ఈ సదుపాయం వర్తించదు. భారతీయ పౌరులు ఇరాన్ యందు ఎక్కువ కాలం ఉండాలనుకుంటే లేదా ఆరు నెలల వ్యవధిలో బహుళ ఎంట్రీలు చేయాలనుకుంటే అవసరమైన వీసాలను పొందడం తప్పనిసరి.

ప్రస్తుతం 27 దేశాలు భారతీయ పౌరులకు వీసా రహిత ప్రవేశాన్ని అందిస్తున్నాయి. ఈ దేశాల్లో మలేషియా, ఇండోనేషియా, వియాత్నం, థాయిలాండ్, శ్రీలంక, మాల్దీవులు, ఇరాన్, ఖతార్, నేపాల్, మారిషస్, కెన్యా, సీషెల్స్, ట్రినిడాడ్ మరియు టొబాగో, భూటాన్, సెర్బియా, సెనెగల్, సమోవా, బార్బడోస్, డొమినికా, గ్రెనడా, హాతి, హాంగ్ కాంగ్, మోంట్‌సెరాట్, నియు మరియు సెయింట్ విన్సెంట్ వంటివి ఉన్నాయి.

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డు

భారత మాజీ ప్రధాన మంత్రి పివి నరసింహారావుకు మరణానంతరం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డు అందించబడింది. ఫిబ్రవరి 9, 2024 న ఈ అత్యున్నత పౌర పురస్కారం ఆయనకు ప్రధానం చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన పివి నరసింహారావు పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. పీవీ 1991 నుండి 1996 వరకు భారతదేశ 9వ ప్రధానమంత్రిగా పనిచేసారు. పివి నరసింహారావు దక్షిణ భారతదేశం మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ప్రధానమంత్రిగా పని చేసిన మొదటి వ్యక్తిగా నిలిచారు. అలానే  హిందీ-మాట్లాడేతర ప్రాంతం నుండి ప్రధాని అయిన మొదటి వ్యక్తి కూడా. పీవీ నెహ్రూ-గాంధీ కుటుంబానికి వెలుపల ఐదు సంవత్సరాలు నిరంతరాయంగా ప్రధానమంత్రిగా పనిచేసిన మొదటి వ్యక్తి.

పివిని భారతదేశ ఆర్థిక వ్యవస్థ సంస్కరణ వాదిగా పేర్కొంటారు. ఈయన హయాంలోనే లైసెన్స్ రాజ్‌ చట్టం రద్దు చేయబడింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ ఈయన ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా సేవలు అందించారు. మన్మోహన్ సింగ్ నాడు దాదాపుగా దివాలా తీసిన దేశాన్ని ఆర్థిక పతనం నుండి రక్షించడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి విధానాలను అమలు చేసి, భారతదేశ ప్రపంచీకరణ కోణాన్ని ప్రారంభించారు.

పీవీ భారత జాతీయ అణు భద్రత మరియు బాలిస్టిక్ క్షిపణుల కార్యక్రమానికి శక్తినిచ్చారు. ఇది చివరికి 1998 పోఖ్రాన్ అణు పరీక్షలకు దారితీసింది. ఈ పరీక్షలు వాస్తవానికి 1995లో రావుగారి పదవీకాలంలో ప్రణాళిక చేయబడ్డాయి. అయితే అమెరికా నుండి వచ్చిన రాజకీయ ఒత్తిడితో వాటిని విరమించుకున్నారు. తర్వాత అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం వీటిని నిర్వహించింది. అయోధ్య వివాదం మరియు కాశ్మీర్ వివాదం పరిష్కారంలో కూడా పీవీ కీలక పాత్ర పోషించారు.

పివి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆవిర్భావం చోటు చేసుకుంది. ఇది తర్వాత రోజులలో భారత జాతీయ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగింది. పివి భారత స్వాతంత్యర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. భారత స్వాతంత్రం తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ సభ్యునిగా పూర్తి సమయం రాజకీయాల్లో సేవలు అందించారు.

పివి నరసింహారావు 1971లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణలు మరియు భూ సీలింగ్ చట్టాలను ఖచ్చితంగా అమలు చేశారు. తన పదవీ కాలంలో రాజకీయాల్లో అట్టడుగు కులాలకు రిజర్వేషన్ కల్పించారు. ఆయన హయాంలో జై ఆంధ్ర ఉద్యమాన్ని ఎదుర్కోవడానికి రాష్ట్రపతి పాలన విధించవలసి వచ్చింది.

పివి నరసింహారావు 1980 నుండి 1984 వరకు మరియు తరువాత 1988 నుండి 1989 వరకు భారత విదేశాంగ మంత్రిగా పనిచేశాడు. రాజీవ్ గాంధీల క్యాబినెట్‌లో భారత హోమ్ శాఖ మంత్రిగా కూడా సేవలు అందించారు. నరసింహారావు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మరియు ఒడిశా వంటి వివిధ ప్రాంతాల నుండి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. పీవీ 2004లో న్యూఢిల్లీలో గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.

పివి నరసింహారావుకు భారతరత్న పురస్కారం అందించడం భారతదేశానికి ఆయన చేసిన సేవలను గుర్తించే ముఖ్యమైన సంఘటన. ఇది ఆయన విజన్ మరియు నాయకత్వానికి నివాళి కూడా. పివి తెలుగు రాష్ట్రాల నుండి భారతరత్న పొందిన మొదటి వ్యక్తిగా నిలిచారు. ఈ అవార్డు పీవీ వారసత్వాన్ని మరియు ఆధునిక భారతదేశాన్ని రూపొందించడంలో ఆయన పాత్రను గుర్తు చేస్తుంది.

మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌కు భారతరత్న అవార్డు ప్రధానం

మాజీ ప్రధాన మంత్రి చౌదరి చరణ్ సింగ్‌కు మరణానంతరం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేశారు. ఈ అవార్డును ఫిబ్రవరి 9, 2024 న ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. స్వాతంత్ర సమరయోధుడు అయిన చరణ్ సింగ్‌, భారతదేశానికి 5వ ప్రధానమంత్రిగా మరియు ఉత్తరప్రదేశ్ 5వ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు.

చరణ్ సింగ్, మహాత్మా గాంధీ స్పూర్తితో బ్రిటీష్ ప్రభుత్వం నుండి స్వాతంత్రం కోసం అహింసాయుత పోరాటం చేశారు.  ఈ క్రమమంలో అనేక సార్లు జైలు శిక్ష అనుభవించారు. 1930లో ఉప్పు చట్టాలను ఉల్లంఘించినందుకు బ్రిటీష్ వారు అతన్ని 12 సంవత్సరాలు జైలుకు పంపారు.

చరణ్ సింగ్ 1979 నుండి 1980 మధ్య భారతదేశానికి 5వ ప్రధానమంత్రిగా పనిచేయడానికి ముందు 1970లో ఉత్తరప్రదేశ్‌కు 5వ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. మొదటి నుండి కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నప్పటికీ, తర్వాత 1980లో ఆయన సొంత రాజకీయ పార్టీ లోక్‌దల్‌ను స్థాపించారు.

1979లో లోక్‌సభలో సింగ్ తన మెజారిటీని నిర్ధారించడానికి ముందు కాంగ్రెస్ తన మద్దతును ఉపసంహరించుకుంది. దీనితో ఆయన 20 ఆగష్టు 1979న ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. చరణ్ సింగ్ కేవలం 23 రోజులు మాత్రమే ప్రధానిగా సేవలు అందించారు. దీనితో చరణ్ సింగ్ పార్లమెంటు విశ్వాసాన్ని ఎన్నడూ పొందలేని ఏకైక భారత ప్రధానమంత్రిగా నిలిచారు, అయితే జనవరి 1980 వరకు ఆయన తాత్కాలిక ప్రధానమంత్రిగా కొనసాగారు.

చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లో భూ సంస్కరణల ప్రధాన రూపశిల్పిగా గుర్తింపు పొందారు. ఈయన రైతు నాయకుడుగా గగుర్తింపబడ్డారు. యూపీలో భూసంస్కరణల కోసం పోరాడి వారికి శాశ్వత వారసత్వాన్ని మిగిల్చారు. యూపీ డిపార్ట్‌మెంట్ రిడెంప్షన్ బిల్లు 1939 యొక్క సూత్రీకరణ మరియు ఖరారులో ఆయన ప్రముఖ పాత్ర పోషించాడు. ఇది గ్రామీణ రుణగ్రస్తులకు గొప్ప ఉపశమనం కలిగించింది.

చరణ్ సింగ్ చొరవతోనే యూపీలో మంత్రులకు జీతాలు, ఇతర అధికారాలు భారీగా తగ్గాయి. రాష్ట్రమంతటా ఏకరీతిగా ఉండేలా భూ హోల్డింగ్‌లపై సీలింగ్‌ను తగ్గించే లక్ష్యంతో 1960 భూ హోల్డింగ్ చట్టం తీసుకురావడంలో ముఖ్యమంత్రిగా ఆయన కీలకపాత్ర పోషించారు.

ఈ కారణంగానే న్యూఢిల్లీలోని అతని స్మారకానికి కిసాన్ ఘాట్ అని పేరు పెట్టారు. అతని పుట్టినరోజు డిసెంబర్ 23న భారతదేశంలో కిసాన్ దివస్‌గా జరుపుకుంటారు. చరణ్ సింగ్ మూడవ వర్ధంతి (29 మే 1990) సందర్భంగా భారత ప్రభుత్వం స్మారక తపాలా స్టాంపును కూడా విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని అమౌసి విమానాశ్రయానికి అతని పేరు మీద చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చబడింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ విశ్వవిద్యాలయానికి అతని గౌరవార్థం చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం అని కూడా పేరు పెట్టారు.

రాజనీతిజ్ఞుడిగా మరియు రైతుల హక్కుల పోరాట యోధుడిగా భారతదేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా చరణ్ సింగ్‌కు ఈ అవార్డు లభించింది. ఈ అవార్డు చరణ్ సింగ్ వారసత్వాన్ని మరియు ఆధునిక భారతదేశాన్ని రూపొందించడంలో అతని పాత్రను గుర్తు చేస్తుంది. దేశానికి ఆయన చేసిన సేవలకు గాను ఇది ఘనమైన నివాళి.

Post Comment