తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ నవంబర్ 01, 2023. తాజా జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.
వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య పురస్కారాలు 2023
నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో అసమాన సేవలందించినవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ జీవిత సాఫల్య మరియు వైఎస్సార్ సాఫల్య పురస్కారాలను ప్రదానం చేసింది. వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, పాత తరం నేపథ్య గాయని రావు బాలసరస్వతి వంటి 23 మంది ప్రముఖులకు కి వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాం అందించగా, మరో నలుగురికి వైఎస్సార్ సాఫల్య అవార్డులను అందించారు.
విజయవాడలో నిర్వహించిన ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా, సీఎం జగన్, దివంగత వైఎస్ సతీమణి విజయలక్ష్మిలు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. వివిధ రంగాల్లో దశాబ్దాలుగా సేవలందిస్తూ సమాజాన్ని ప్రభావితం చేస్తున్న వారికి ఈ అవార్డు 2021 నుండి అందిస్తున్నారు. వ్యవసాయం, కళలు-సంస్కృతి, తెలుగు భాష-సాహిత్యం, క్రీడలు, వైద్యం, మీడియా, సామాజిక సేవా రంగాల వారికి వీటిని అందిస్తున్నారు. 2023 ఏడాదికి సంబంధించి ఈ అవార్డు విజేతల జాబితా కింద గమనించగలరు.
గ్రహీత పేరు | అవార్డు | అవార్డు కేటగిరి | గ్రహీత జిల్లా |
---|---|---|---|
డాక్టర్ వైవీ మల్లారెడ్డి | వ్యవసాయం (సామాజిక కార్యకర్త) | వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ | అనంతపురం |
పొంగి వినీత | వ్యవసాయం (మహిళా రైతు) | వైఎస్సార్ అచీవ్‌మెంట్ | అల్లూరి సీతారామరాజు |
యడ్ల గోపాల రావు | కళలు-సంస్కృతి (రంగస్థల కళాకారుడు) | వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ | శ్రీకాకుళం |
తలిశెట్టి మోహన్ | కళలు-సంస్కృతి (కలంకారీ కళాకారుడు) | వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ | తిరుపతి |
కోట సచ్చిదానందశాస్త్రి | కళలు-సంస్కృతి (హరికథకుడు) | వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ | ప్రకాశం |
కోన సన్యాసి | కళలు-సంస్కృతి (తప్పెటగుళ్లు) | వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ | శ్రీకాకుళం |
ఉప్పాడ హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ | కళలు-సంస్కృతి (కళాకారులకు శిక్షణ) | వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ | కాకినాడ |
ఎస్వీ రామారావు | కళలు-సంస్కృతి (చిత్రకారుడు) | వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ | కృష్ణా |
తల్లావజ్ఝుల శివాజీ | కళలు-సంస్కృతి (రచయిత) | వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ | ప్రకాశం |
డాక్టర్ చిగిచెర్ల కృష్ణారెడ్డి | కళలు-సంస్కృతి (జానపద కళాకారుడు) | వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ | అనంతపురం |
కలిసాహెబీ మహబూబ్-షేక్ మహబూబ్ సుభానీ దంపతులు | కళలు-సంస్కృతి (నాదస్వర కళాకారులు) | వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ | ప్రకాశం |
డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి | వైద్య రంగం | వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ | ఎన్టీఆర్ |
డాక్టర్ ఈసీ వినయ్ కుమార్ | వైద్య రంగం | వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ | వైఎస్సార్ |
ప్రొఫెసర్ బేతవోలు రామబ్రహ్మం | సాహిత్యం (అవధాని) | వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ | పశ్చిమగోదావరి |
ఎండీ ఖదీర్ బాబు | సాహిత్యం (రచయత) | వైఎస్సార్ అచీవ్‌మెంట్ | నెల్లూరు |
మహజబీన్ | సాహిత్యం ( కవయిత్రి) | వైఎస్సార్ అచీవ్‌మెంట్ | నెల్లూరు |
నామిని సుబ్రహ్మణ్యంనాయుడు | సాహిత్యం (రచయిత) | వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ | చిత్తూరు |
అట్టాడ అప్పలనాయుడు | సాహిత్యం (రచయిత) | వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ | శ్రీకాకుళం |
హెచ్ఆర్‌కే | సాహిత్యం (రచయిత) | వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ | కర్నూలు |
కె. హనుమంతరె డ్డి | మీడియా రంగం | వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ | కర్నూలు |
గోవిందరాజు చక్రధర్ | మీడియా రంగం | వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ | కృష్ణా |
నిర్మల హృదయ్ భవన్ | సామాజిక రంగం (మిషనరీ) | వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ | ఎన్టీఆర్ |
బెజవాడ విల్సన్ | సామాజిక రంగం | వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ | ఎన్టీఆర్ |
కుసుమ శ్యామ్ మోహనరావు | సామాజిక రంగం | వైఎస్సార్ అచీవ్‌మెంట్ | కోనసీమ |
డాక్టర్ జి. సమరం | సామాజిక రంగం | వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ | ఎన్టీఆర్ |
పుల్లెల గోపీచంద్ | క్రీడా రంగం | వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ | గుంటూరు |
కరణం మల్లేశ్వరి | క్రీడా రంగం | వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ | శ్రీకాకుళం |
నందిని దాస్‌కు బ్రిటిష్ అకాడమి బుక్ ప్రైజ్
భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత్రి నందిని దాస్ ప్రతిష్టాత్మక బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజును అందుకున్నారు. 2023 ఏడాదికి గానూ ఆమెకు ఈ అవార్డు అందజేశారు. ఆమె రచించిన 'కోర్టింగ్ ఇండియా : ఇంగ్లండ్, మొఘల్ ఇండియా అండ్ ఆరిజిన్స్ ఆఫ్ యూరప్' అనే పుస్తకానికిగానూ అంతర్జాతీయ సాంస్కృతిక అంశాల విశ్లేషణ విభాగంలో ఈ అవార్డు ఆమెకు అందించబడింది.
నందిని దాస్ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫడ్ యందు ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్నారు. 17వ శతాబ్దం ప్రారంభంలో భారత్లోకి తొలి బ్రిటీష్ రాయబారి సర్ థామస్ రో రాక నుంచి మొదలుకొని మొఘల్, బ్రిటిష్ సామ్రాజ్యాల మూలాల దాకా అన్ని అంశాలపై విశ్లేషణతో ఆమె ఈ పుస్తకాన్ని రాశారు. ఈ అవార్డు కింద ఆమెకు 25,000 జిబిపి విలువైన నగదు బహుమతి అందించబడుతుంది. నవంబర్ 1న లండన్ లోని బ్రిటిష్ అకాడమీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమెకు ఈ బహుమతిని అందజేశారు.
డబ్ల్యుహెచ్ఓ సౌత్-ఈస్ట్ ఆసియా రీజియన్ డైరెక్టర్‌గా సైమా వాజెద్
ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఆగ్నేయ ఆసియా ప్రాంత తదుపరి రీజినల్ డైరెక్టరుగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కుమార్తె సైమా వాజెద్ నామినేట్ అయ్యారు. డబ్ల్యుహెచ్ఓ రీజినల్ కమిటీ 67వసమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పదవికి సైమా వాజెద్‌తో పాటుగా నేపాల్ తరుపున డబ్ల్యుహెచ్ఓ సీనియర్ అధికారి డా. శంభుప్రసాద్ ఆచార్య కూడా పోటీపడ్డారు. ఢిల్లీలో నవంబర్ 1న జరిగిన రీజినల్ కమిటీ సమావేశంలో దీనిపై ఓటింగ్ చేపట్టారు. ఇందులో సైమా వాజెద్‌కు అనుకూలంగా 8 ఓట్లు పడగా, ఆచార్యకు రెండు ఓట్లు వచ్చాయి. దీంతో సైమా వాజెద్ నామినేట్ అయినట్లు కమిటీ పేర్కొంది.
వచ్చే ఏడాది జనవరి 22, 27 తేదీల మధ్య జెనీవాలో జరిగే 154వ డబ్ల్యుహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో ఆమె ఎన్నికను ఆమోదించనున్నారు. 2024 ఫిబ్రవరి 1 నుంచి వాజెద్ ఈ బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ ప్రకటనలో వెల్లడించింది. అయిదేళ్లపాటు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. సైమా వాజెద్ ప్రస్తుతం ఆటిజం, న్యూరోడెవలప్మెంట్ డిజార్డర్ వంటి వ్యాధులపై బంగ్లా జాతీయ అడ్వైజరీ కమిటీకి చైర్ పర్సన్‌గా ఉన్నారు.
ఆగ్నేయ ఆసియా రీజినల్ కమిటీలో బంగ్లాదేశ్, నేపాల్, ఇండియాతో పాటుగా భూటాన్, ఉత్తరకొరియా, ఇండోనేషియా, మాల్దీవులు, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, తూర్పు తైమూర్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఆరు రీజనల్ ప్రాంతాలలో ఆగ్నేయ ఆసియా ఒకటి. ఈ ప్రాంతం ప్రపంచ జనాభాలో నాలుగింట ఒక వంతు మందిని కలిగి ఉంది. దాదాపు రెండు బిలియన్ల ప్రజలకు మెరుగైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించేందుకు ఈ 11 సభ్య దేశాలతో కలిసి డబ్ల్యుహెచ్ఓ పని చేస్తోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఆరు రీజనల్ ప్రాంతాలు
- ఆఫ్రికన్ రీజియన్
- రీజియన్ ఆఫ్ ది అమెరికాస్
- సౌత్-ఈస్ట్ ఏషియన్ రీజియన్
- యూరోపియన్ రీజియన్
- ఈస్ట్రన్ మెడిటేరియన్ రీజియన్
- వెస్ట్ పసిఫిక్ రీజియన్
ఒడిశా ఆలివ్ రిడ్లీ తాబేళ్ల కారిడార్‌లో చేపల వేటపై నిషేధం
ఒడిశా ప్రభుత్వం ఆలివ్ రిడ్లీ తాబేళ్ల సంరక్షణ కోసం నదీ ముఖద్వారాల వద్ద తీరానికి 20 కి.మీ పరిధిలో చేపల వేట కార్యకలాపాలపై ఏడు నెలల పాటు నిషేధం విధించింది. ఆలివ్ రిడ్లీ తాబేళ్లు ఒడ్డుకు వచ్చి గూడు కట్టుకుని గుడ్లు పెట్టే ఈ సీజన్ యందు చేపలు పట్టే వలల్లో చిక్కుకోవడం లేదా ప్రొపెల్లర్ల ద్వారా ఎక్కువ సంఖ్యలో చనిపోతుండటంతో ప్రతి సంవత్సరం ఈ నిషేధం విధించబడుతుంది.
ఒడిశా మెరైన్ ఫిషింగ్ రెగ్యులేషన్ యాక్ట్ (OMFRA), 1982 మరియు వన్యప్రాణుల రక్షణ చట్టం, 1972 నిబంధనల ప్రకారం ఈ నిషేధం విధించబడుతుంది. ఆలివ్ రైడ్లీ తాబేళ్లు ఏటా నవంబర్ మరియు డిసెంబరు మధ్య ఒడిశా తీరంలోని బీచ్‌లకు గుడ్లు పెట్టడానికి వచ్చి, ఏప్రిల్ మరియు మే నెలలో తిరిగి సముద్రంలోకి పోతాయి.
జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకుల ప్రకారం గంజాం జిల్లాలోని రుషికుల్య, గహిర్మత, దేవి నది ముఖద్వారంలో ఇవి అధిక సంఖ్యలో చేరుకుంటాయి. ఈ మూడు ప్రాంతలలో ఏటా 10 లక్షలకు పైగా ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్లు సామూహిక గూడు కట్టేందుకు వస్తాయి. ఒడిశా తీరం అంతరించిపోతున్న ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మరియు ఇరావాడి డాల్ఫిన్‌లకు ఆవాసంగా ఉంది.
ఆలివ్ రిడ్లీలు ఇండియాలో గుజరాత్ తీరం నుండి అండమాన్ వరకు మరియు లక్షద్వీప్ నుండి ఒడిశా మరియు బెంగాల్ వరకు కనిపిస్తాయి. ఈ తాబేళ్లు తమ సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా నుండి భారతదేశానికి దాదాపు 9000 కి.మీ ప్రయాణం చేస్తాయి. ఈ సమయంలో వాటిని రక్షించడానికి మరియు వాటి నివాసాలను కాపాడేందుకు ఏటా ఆపరేషన్ ఒలివియా నిర్వహించబడుతుంది. 1980 నుండి ఏటా డిసెంబర్ నెలలో ఇండియన్ కోస్ట్ గార్డ్ దీనిని నిర్వహిస్తుంది.
భారత్ & బంగ్లాదేశ్ మధ్య మూడు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం
ప్రధాని నరేంద్ర మోదీ మరియు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మూడు అభివృద్ధి ప్రాజెక్టులను నవంబర్ 1న సంయుక్తంగా ప్రారంభించారు. వీటిలో రెండు భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య రైలు ప్రాజెక్టులు మరియు ఒక విద్యుత్ రంగ ప్రాజెక్టు ఉన్నాయి. ఇందులో అఖౌరా-అగర్తలా క్రాస్-బోర్డర్ రైలు లింక్, ఖుల్నా-మోంగ్లా పోర్ట్ రైలు మార్గం మరియు మైత్రీ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క యూనిట్ II అభివృద్ధి ఉన్నాయి.
బంగ్లాదేశ్‌కు అనుసంధిస్తున్న అఖౌరా-అగర్తలా క్రాస్-బోర్డర్ రైలు లింక్ ప్రాజెక్ట్ 392.52 కోట్ల భారతీయ గ్రాంట్‌తో అభివృద్ధి చేయబడుతుంది. ఈ రైలు మార్గం పొడవు 12.24 కి.మీలు. ఇందులో బంగ్లాదేశ్‌లో 6.78 కి.మీ మరియు ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో 5.46 కి.మీల డ్యూయల్ గేజ్ రైలు మార్గం ఉంది.
ఖుల్నా-మోంగ్లా పోర్ట్ రైలు మార్గం ప్రాజెక్ట్ మొత్తం విలువ 388.92 మిలియన్లు. ఇది భారత ప్రభుత్వం అందించిన రాయితీతో నిర్మించబడుతుంది. ఈ ప్రాజెక్ట్‌లో బంగ్లాదేశ్‌లోని ఖుల్నా ప్రాంతంలో మోంగ్లా పోర్ట్ మరియు ప్రస్తుత రైలు నెట్‌వర్క్ మధ్య దాదాపు 65 కిలోమీటర్ల బ్రాడ్ గేజ్ రైలు మార్గం నిర్మాణం ఉంది. ఇది బంగ్లాదేశ్‌లోని రెండవ అతిపెద్ద ఓడరేవు అయిన మోంగ్లా యొక్క బ్రాడ్-గేజ్ రైల్వే నెట్‌వర్క్‌కు అనుసంధానించబడింది. ఇది పశ్చిమ బెంగాల్ నుండి ఈశాన్య రాష్ట్రాలకు చటోగ్రామ్ మరియు మోంగ్లా ఓడరేవుల ద్వారా సరుకు రవాణా మరియు ట్రాన్స్ షిప్‌మెంట్‌కు ఉపయోగపడుతుంది.
మైత్రీ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ విలువ 1.6 బిలియన్లు. ఇది భారతీయ రాయితీ ఫైనాన్సింగ్ పథకం కింద నిర్మించబడుతోంది. ఇది 1,320 మెగావాట్ల సామర్థ్యంతో బంగ్లాదేశ్‌లోని ఖుల్నా డివిజన్‌లోని రాంపాల్ వద్ద అభివృద్ధిలో ఉంది. ఈ ప్రాజెక్ట్ బంగ్లాదేశ్-ఇండియా ఫ్రెండ్‌షిప్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అమలు చేయబడింది. ఇది భారతదేశం యొక్క నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ మరియు బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ మధ్య 50-50 జాయింట్ వెంచర్. ఈ పవర్ ప్లాంట్ యొక్క యూనిట్ I సెప్టెంబర్ 2022లో ప్రధానమంత్రులిద్దరూ సంయుక్తంగా ఆవిష్కరించారు.
ఈశాన్య రాష్ట్రాలకు మొదటి భారత్ గౌరవ్ రైలు
భారతీయ రైల్వే ఈశాన్య రాష్ట్రాలకు మొదటి భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలును నడపడానికి సిద్దమవుతుంది. ఈ రైలు నవంబర్ 16, 2023న ఢిల్లీ సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించి 15 రోజుల పాటు గౌహతి, శివసాగర్, జోర్హాట్ , కాజిరంగా , ఉనకోటి, అగర్తల, ఉదయపూర్ , దిమాపూర్, కొహిమా, షిల్లాంగ్ మరియు చిరపుంజీలను కవర్ చేస్తుంది. దీనిని నార్త్ ఈస్ట్ డిస్కవరీ పేరుతొ నిర్వహిస్తున్నారు.
ఈ రైలులో రెండు డైనింగ్ కార్లు, ఒక ఆధునిక వంటగది, ఏసీ I, ఏసీ II. మరియు ఏసీ III కోచ్‌లతో, సెన్సార్ ఆధారిత వాష్‌రూమ్ ఫంక్షన్‌లు, ఫుట్ మసాజర్ మరియు మినీ లైబ్రరీ వంటి అనేక ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు ఈశాన్య రాష్ట్రాల వైవిధ్యమైన మరియు శక్తివంతమైన సంస్కృతిని అన్వేషించడానికి ఒక గొప్ప అవకాశం. పర్యాటకులు గౌహతిలోని కామాఖ్య దేవాలయం, కజిరంగా నేషనల్ పార్క్, ఉనకోటి రాతి శిల్పాలు మరియు షిల్లాంగ్ శిఖరంతో సహా ఈ ప్రాంతంలోని కొన్ని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను సందర్శించవచ్చు.
ఈశాన్య రాష్ట్రాలలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి భారతీయ రైల్వే చొరవలో భాగంగా ఈ రైలు ప్రకటించబడింది. ఈ ప్రాంతం భారతదేశంలోని అత్యంత అందమైన మరియు అన్వేషించబడని కొన్ని ప్రకృతి దృశ్యాలకు నిలయంగా ఉంది. అయితే ఇవి మారుమూల ప్రాంతాలు కావటం కారణంగా ఇవి అభివృద్ధికి నోచుకోలేదు. భారత్ గౌరవ్ రైలు పర్యటన ఈ ప్రాంతానికి మరింత మంది పర్యాటకులను తీసుకురావడానికి మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచడానికి సహాయపడుతుందని భారతీయ రైల్వే భావిస్తోంది.
భారత్ గౌరవ్ రైలు అనేది భారతీయ రైల్వేలు నిర్వహించే పర్యాటక రైళ్ల శ్రేణి రైళ్లు. భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు అద్భుతమైన చారిత్రక ప్రదేశాలను సందర్శించడానికి ఈ రైళ్లు రూపొందించబడ్డాయి. మతపరమైన తీర్థయాత్రలు, చారిత్రక పర్యటనలు మరియు సాంస్కృతిక నేపథ్యంగా ఈ రైళ్లు ప్రయాణాలను అందిస్తాయి.
యునెస్కో సృజనాత్మక నగరాల జాబితాలో కోజికోడ్, గ్వాలియర్
ఇండియాలోని కోజికోడ్, గ్వాలియర్ యునెస్కో సృజనాత్మక నగరాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. కేరళలోని కోజికోడ్‌ని ' సిటీ ఆఫ్ లిటరేచర్'గా మరియు గ్వాలియర్‌ని ' సిటీ ఆఫ్ మ్యూజిక్'గా జాబితా చేయబడ్డాయి. ఈ హోదాలు యునెస్కో యొక్క క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో భాగం. ఇది వారి సంబంధిత సృజనాత్మక పరిశ్రమలలో అగ్రగామిగా ఉన్న నగరాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం కోసం అందించబడుతుంది.
15వ శతాబ్దానికి చెందిన కోళికోడ్ దాని గొప్ప సాహిత్య వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. ఈ నగరం చాలా మంది రచయితలు, కవులు మరియు ప్రచురణకర్తలకు నిలయం. ఇది మలయాళ సాహిత్యానికి ప్రధాన కేంద్రం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ సంగీత వారసత్వానికి ప్రసిద్ధి చెందింది.ఇది భారతీయ శాస్త్రీయ సంగీతం యొక్క ముఖ్యమైన శిక్షణ కేంద్రలకు నిలయంగా ఉంది. ఈ నగరం చాలా మంది సంగీతకారులకు, స్వరకర్తలు మరియు సంగీత ప్రియులకు నిలయం.
యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్ అనేది సృజనాత్మకత మరియు సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్న నగరాల ప్రపంచ నెట్‌వర్క్. ఈ నెట్‌వర్క్‌లో ప్రపంచం నలుమూలల నుండి 240 సభ్య నగరాలు ఉన్నాయి. కోళికోడ్ మరియు గ్వాలియర్‌లను "సాహిత్య నగరాలు" మరియు "సంగీత నగరాలు"గా పేర్కొనడం ఈ నగరాల ప్రొఫైల్‌ను మరియు వాటి సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచ వేదికపై పెంచడానికి సహాయపడుతుంది.
భారతీయ పర్యాటకులకు వీసా రహిత ఎంట్రీకి థాయ్‌లాండ్ ఆమోదం
భారతదేశం మరియు తైవాన్ నుండి వచ్చే పర్యాటకులకు వీసా అవసరాలను మినహాయించాలని థాయిలాండ్ ప్రభుత్వం ప్రకటించింది. వీసా నిబంధనను రద్దు చేయాలనే నిర్ణయం పర్యాటక రంగాన్ని పెంచడం మరియు భారతదేశం మరియు థాయ్‌లాండ్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు థాయ్ ప్రభుత్వం తెలిపింది. ఈ చర్య వచ్చే ఏడాది థాయ్‌లాండ్‌కు అదనంగా 1 మిలియన్ భారతీయ పర్యాటకులను ఆకర్షిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఈ నిర్ణయం మే 2024 వరకు వర్తిస్తుంది. థాయిలాండ్ చాలా సంవత్సరాలుగా భారతీయులకు అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. దేశంలోని అందమైన బీచ్‌లు, అద్భుతమైన దేవాలయాలు మరియు రుచికరమైన ఆహారం భారతీయ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణలు. థాయ్‌లాండ్‌ను సందర్శించాలనుకునే భారతీయ పర్యాటకులు ఇప్పటికీ చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ మరియు తిరుగు ప్రయాణానికి సంబంధించిన రుజువును కలిగి ఉండాలి.
లక్నోలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం
మాజీ ఉప ప్రధాని వల్లభాయ్ పటేల్ 148వ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్నోలో 'రన్ ఫర్ యూనిటీ' కార్యక్రమానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రక్షా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు.
ఈ ర్యాలీ హజ్రత్‌గంజ్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ప్రతిమ నుండి 1.5 కి.మీ దూరంలో ఉన్న ఆర్డీ సింగ్ బాబు స్టేడియం వరకు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, ఎన్‌సిసి క్యాడెట్లు, క్రీడాకారులు & రన్నింగ్ ఔత్సాహికులు మరియు హెచ్‌ఏఎల్ సిబ్బందితో సహా వేలాది మంది ప్రజలు ఈ రన్‌లో పాల్గొన్నారు.
జాతీయ ఐక్యతా దినోత్సవంను భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబరు 31న యేటా నిర్వహిస్తున్నారు. దీనిని భారత ప్రభుత్వం 24-10-2014న ప్రకటించింది. ఆయన సేవలకు మరింత గౌరవం అందించేందుకు గుజరాత్‌లోని కెవాడియాలో ప్రపంచంలోనే అతిపెద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీని' ఈ బీజేపీ ప్రభుత్వం నిర్మించింది.