వార్తల్లో వ్యక్తులు | ఫిబ్రవరి 2022
Telugu Current Affairs

వార్తల్లో వ్యక్తులు | ఫిబ్రవరి 2022

యూజీసీ నూతన ఛైర్మన్‌గా ఎం జగదీష్ కుమార్

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) వైస్‌ఛాన్సలర్‌ మామిడాల జగదీష్‌ కుమార్‌, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నూతన చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. విద్యా మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఈ నియామకం ఐదేళ్ల కాలానికి లేదా అతనికి 65 ఏళ్లు వచ్చే వరకు, ఏది ముందైతే అంతవరకు ఉండనుంది.

Advertisement

జగదీష్‌ కుమార్‌ యూజీసీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించడం ఇది రెండవసారి. గతంలో 14 జనవరి 2016 నుండి 02 ఫిబ్రవరి 2016 మధ్య కొద్దికాలం యూజీసీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడంపై దుమారం రేగడంతో నాడు బాధ్యతలు నుండి తప్పుకోవాల్సి వచ్చింది.  యూజీసీ బాధ్యతలు స్వీకరించక ముందు జనవరి 2021 నుండి జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి తాత్కాలిక వైస్-ఛాన్సలర్‌గా ఉన్నారు.

జ‌గ‌దీష్ కుమార్‌ మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి. ఈయన తెలంగాణలోని నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందినవారు. 1994 నుంచి 1995 వ‌ర‌కు ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌లోని ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఎల‌క్ట్రిక‌ల్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్ డిపార్టుమెంట్‌లో విజిటింగ్ ఫ్యాక‌ల్టీగా, అసెస్టెంట్ ప్రొఫెస‌ర్‌గా బాధ్యత‌లు నిర్వహించారు. ఆ త‌ర్వాత 1997లో ఢిల్లీ ఐఐటీలోని ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్ డిపార్టుమెంట్‌కు అసోషియేట్ ప్రొఫెస‌ర్‌గా వెళ్లారు. 2005లో ప్రొఫెస‌ర్‌గా ప్రమోష‌న్ పొందారు.

బాటా ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా దిశా పటానీ

ప్రముఖ ఫుట్‌వేర్ మేకర్ బాటా ఇండియా లిమిటెడ్, తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటి దిశా పటానీని నియమించినట్లు వెల్లడించింది. బాటా తన యూత్ కనెక్షన్ మరియు ఫ్యాషన్-ఫార్వర్డ్ ఇమేజరీని మరింత పటిష్టం చేసేందుకు దిశాను ఎంపిక చేసుకున్నట్లు ప్రకటించింది. గతంలో బాటా అంబాసిడర్లుగా కృతి సనన్, స్మ్రితి మందానలు ఉండేవారు.

NCERT కొత్త డైరెక్టర్‌గా ప్రొఫెసర్ దినేష్ ప్రసాద్ సక్లానీ

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) కొత్త డైరెక్టర్‌గా ప్రొఫెసర్ దినేష్ ప్రసాద్ సక్లానీ నియమితులయ్యారు. ఏడాది క్రితం పదవీకాలం ముగిసిన హృషికేష్ సేనాపతి స్థానంలో ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు.

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనేది 1961లో సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద సాహిత్య, వైజ్ఞానిక మరియు స్వచ్ఛంద సంఘంగా స్థాపించబడిన భారత ప్రభుత్వం యొక్క స్వయంప్రతిపత్త సంస్థ. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలోని శ్రీ అరబిందో మార్గ్‌లో ఉంది. ఇది పాఠశాల విద్యలో గుణాత్మక అభివృద్ధి కోసం విధానాలు మరియు కార్యక్రమాలు నిర్వహించేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు అందిస్తుంది.

లెజెండరీ బాలీవుడ్ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూశారు

లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్, 92 సంవత్సరాల వయస్సులో అనారోగ్యంతో ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో మరణించారు. భారతీయ సినిమా పాటను మహోన్నతశిఖరంపై ఉంచిన మధురగాయనికి నివాళిగా భారత ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ఆమె ఈ ఏడాది జనవరి ప్రారంభంలో తేలికపాటి కోవిడ్ లక్షణాలతో హాస్పిటల్ యందు చేరారు.

'క్వీన్ ఆఫ్ మెలోడీ' మరియు ఇండియన్ నైటింగేల్ అని పిలవబడే లతా మంగేష్కర్ ప్రఖ్యాత మరాఠీ సంగీతకారుడు మరియు థియేటర్ ఆర్టిస్ట్ పండిట్ దీనానాథ్ మంగేష్కర్ మరియు శేవంతి మంగేష్కర్'ల కుమార్తె. ఆమె తన తండ్రి వద్దే సంగీత పాఠాలు అభ్యసించారు. ఆమె అన్ని భారతీయ భాషల్లో 30 వేలకు పైగా పాటలకు గానం ఇచ్చారు.

లతా మంగేష్కర్ 1969లో పద్మభూషణ్, 1999లో పద్మవిభూషణ్, 2001లో భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డులను అందుకున్నారు. అలానే ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం 'ఆఫీసర్ డి లా లెజియన్ డి' హానర్' (ఆఫీసర్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్)తో 2009లో ఆమె సత్కరించబడ్డారు.

ఉత్తరాఖండ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా అక్షయ్ కుమార్

స్వచ్ఛతా అభియాన్'కి ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నియమితులయ్యారు. అక్షయ్ కుమార్ కంటే ముందు, క్రికెటర్ రిషబ్ పంత్'ను కూడా డిసెంబర్ 2021లో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రధాన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని ప్రకటించారు.

జెఎన్‌యు మొదటి మహిళా వైస్ ఛాన్సలర్‌గా శాంతిశ్రీ పండిట్

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) కొత్త వైస్-ఛాన్సలర్‌గా శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌ను విద్యా మంత్రిత్వ శాఖ నియమించింది. మామిడాల జగదీష్‌ కుమార్‌ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నూతన చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించడంతో, ఖాళీ అయినా స్థానంలో శాంతిశ్రీ జెఎన్‌యు మొదటి మహిళా వైస్ ఛాన్సలరుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. శాంతిశ్రీ ఇప్పటికే యూజీసీ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్ యందు మెంబరుగా ఉన్నారు.

ఆసియా అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, సహచర భారతీయ బిలియనీర్ ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి గౌతమ్ అదానీ ఆసియాలో అత్యంత ధనవంతుడుగా నిలిచాడు. ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ తర్వాత అదానీ ఇప్పుడు ప్రపంచంలోని పదవ అత్యంత ధనవంతుడుగా ఉన్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం అదానీ ఆస్తుల విలువ $ 88.5 బిలియన్ డాలర్లు.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్‌గా ఎస్.కిషోర్

సీనియర్ బ్యూరోక్రాట్ ఎస్ . కిషోర్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నూతన ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు. ఈయన 1989 బ్యాచుకు చెందిన పశ్చిమ బెంగాల్‌ ఐఏఎస్‌ అధికారి.

ఫైజర్ ఇండియా ఛైర్మన్‌గా ప్రదీప్ షా

ఫైజర్ ఇండియా ఛైర్మన్‌గా ప్రపంచ బ్యాంకు మాజీ కన్సల్టెంట్ ప్రదీప్ షా నియమితులయ్యారు. ఆర్‌ఎ షా రాజీనామా చేయడంతో ఫైజర్ ఇండియా తన బోర్డు ఛైర్మన్‌గా ప్రదీప్ షాను నియమించింది. ప్రదీప్ షా, క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (క్రిసిల్) మాజీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు వ్యవస్థాపక సభ్యుడుగా ప్రసిద్ధి. క్రిసిల్‌ను స్థాపించడానికి ముందు, ఈయన 1977లో HDFCని స్థాపించడంలో సేవలు అందించారు.

పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ కన్నుమూశారు

బజాజ్ గ్రూప్ పితామహుడు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ (83) తన సన్నిహిత కుటుంబ సభ్యుల సమక్షంలో ఫిబ్రవరి 12, 2022 మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. రాహుల్ బజాజ్ కార్పొరేట్ భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన చైర్మన్లలో ఒకరుగా ఉన్నారు. ఈయన 1965 లో బజాజ్ గ్రూపులో చేరారు. 1968 లో బజాజ్ ఆటో సీఈఓ బాధ్యతలు స్వీకరించారు. ఈయనకు 2001లో భారతదేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ లభించింది.

సీబీఎస్ఈ కొత్త చైర్మన్‌గా ఐఏఎస్ అధికారి వినీత్ జోషి

సీబీఎస్ఈ కొత్త చైర్మన్‌గా ఐఏఎస్ అధికారి వినీత్ జోషి నియమితులయ్యారు. వినీత్ జోషి ఇదివరకు విద్యా మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా విధులు నిర్వర్తించే వారు. ప్రస్తుత సీబీఎస్ఈ ఛైర్మన్ మనోజ్ అహుజా ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీపై వెళ్లడంతో ఆయన స్థానంలో వినీత్ జోషి బాధ్యతలు స్వీకరించనున్నారు.

గేమింగ్ యాప్ A23 బ్రాండ్ అంబాసిడర్‌గా షారూఖ్ ఖాన్‌

గేమింగ్ యాప్ A23 తన ఆన్‌లైన్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్‌ను ప్రకటించింది. ఈ గేమింగ్ వేదిక ఆన్లైన్ యూజర్లకు క్యారమ్, ఫాంటసీ స్పోర్ట్స్, పూల్ మరియు రమ్మీ వంటి మల్టీ-గేమింగ్ వినోదాన్ని పంచుతుంది.

ఇండియన్ డిస్కో కింగ్ బప్పి లాహిరి కన్నుమూశారు

ప్రముఖ బాలీవుడ్ గాయకుడు మరియు స్వరకర్త బప్పి లాహిరి 69 సంవత్సరాల వయస్సులో అనారోగ్యంతో ముంబై ఆసుపత్రిలో మరణించారు. బప్పి లాహిరి భారతదేశపు 'డిస్కో కింగ్'గా ప్రసిద్ధి. భారతీయ సంగీత అభిమానులకు పాప్ సంగీతాన్ని పరిచయం చేసిన ఈయన, 1970లు మరియు 80లలో వరుస చార్ట్-టాపింగ్ పాటలతో భారత చలనచిత్ర సంగీతాన్ని శాసించారు.

Advertisement

Post Comment