ముఖ్యమైన రోజులు మరియు తేదీలు జులై 2023 కోసం చదవండి. జులై నెలలో జరుపుకునే వివిధ జాతీయ దినోత్సవాలు మరియు అంతర్జాతీయ దినోత్సవాల వివరాలు తెలుసుకోండి. ప్రముఖుల పుట్టిన రోజులు, మరణాల సమాచారం కూడా పొందండి. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది.
జాతీయ వైద్యుల దినోత్సవం | జులై 01
భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై 01వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనిని 01 జూలై 1991 నుండి డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జన్మదిన జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నారు. బిధాన్ చంద్ర రాయ్ భారతీయ వైద్యుడుగ, విద్యావేత్తగా, పరోపకారిగా, స్వాతంత్ర్య సమరయోధుడుగా మరియు రాజనీతిజ్ఞుడుగా దేశానికి సేవలు అందించారు. 1948 నుండి 1962లో ఆయన మరణించే వరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
జీఎస్‌టీ డే | జులై 01
వస్తు, సేవల పన్ను అమలుకు గుర్తుగా ఏటా జూలై 1వ తేదీన జీఎస్‌టీ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దేశంలో జీఎస్‌టీ పన్ను విధానం అమలులోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా జూలై 1, 2018న ఈ దినోత్సవాన్ని తొలిసారిగా జరుపుకున్నారు. ఇండియాలో జీఎస్‌టీ పన్ను విధానం 01 జులై 2017 న ప్రారంభమైంది. జీఎస్‌టీ అనగా గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అని అర్ధం.
జాతీయ పోస్టల్ వర్కర్ డే | జులై 01
జాతీయ తపాలా కార్మికుల దినోత్సవంను భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన జరుపుకుంటారు. ఈ కార్యక్రమంను పోస్టల్ ఉద్యోగుల సేవలు గుర్తిస్తూ, వారికీ ప్రశంసలను తెలియజేయడానికి నిర్వహిస్తారు.
జాతీయ చార్టర్డ్ అకౌంటెంట్స్ డే | జులై 01
భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన చార్టర్డ్ అకౌంటెంట్స్ డేని జరుపుకుంటారు. 01 జూలై,1949న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) ఏర్పాటును పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దేశంలో ఆర్థిక ఆడిట్ మరియు అకౌంటింగ్ వృత్తికి సంబంధించి ICAI మాత్రమే లైసెన్సింగ్ మరియు ఇతర విధులు నిర్వహిస్తుంది.
అంతర్జాతీయ పండ్ల దినోత్సవం | జులై 01
ఇంటర్నేషనల్ ఫ్రూట్ డే ఏటా జూలై 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మొదటి అంతర్జాతీయ పండ్ల దినోత్సవం 2007లో బెర్లిన్‌లోని మౌర్‌పార్క్‌లో నిర్వహించారు. ఈ వేడుకను స్థానిక ప్రజల మధ్య సానుకూల జీవన పరిస్థితులను కల్పించేందుకు జరుపుకుంటారు. ఈ రోజున ఇరుగుపొరుగు వారు పండ్లను ఇచ్చి పుచ్చుకుంటారు.
ప్రపంచ జూనోసెస్ డే | జులై 06
ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీన ప్రపంచ జూనోసెస్ డే జరుపుకుంటారు. జూనోటిక్ వ్యాధులకు వ్యతిరేకంగా మొదటి టీకా వేసిన ఫ్రెంచ్ జీవశాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ యొక్క విజయాన్ని పురస్కరించుకుని 1885 నుండి జూలై 6న ప్రపంచ జూనోసెస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
జూనోటిక్ వ్యాధులు వైరస్లు, పరాన్నజీవులు, బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాల వల్ల సంభవిస్తాయి. ప్రస్తుతం మానవులకు సంబంధించి దాదాపు 150 జూనోటిక్ వ్యాధులు ఉన్నట్లు కనుగొన్నారు. జూనోసిస్ అనేది మానవేతర జంతువు నుండి మానవులకు వ్యాపించే ఒక అంటు వ్యాధి. ఇవి పెంపుడు జంతువులు, ఆహారం, నీరు లేదా పర్యావరణం ద్వారా మానవులకు వ్యాపిస్తాయి.
వరల్డ్ ఫర్ గివ్ నెస్ డే | జులై 07
జాతీయ & అంతర్జాతీయ క్షమాపణ దినోత్సవాన్ని ఏటా జులై 07వ తేదీన జరుపుకుంటారు. ప్రపంచ క్షమాపణ దినోత్సవంను ప్రజలలో సద్భావనను పెంపొందించడానికి మరియు వ్యక్తిగత ఆరోగ్యం పెంపొందించడం కోసం వారిలో క్షమాపణ గుణనాన్ని ప్రోత్సహించేందుకు నిర్వహిస్తారు.
ప్రపంచ చాక్లెట్ దినోత్సవం | జులై 07
ప్రతి సంవత్సరం జూలై 7వ తేదీన ప్రపంచ చాక్లెట్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనిని 2009 లో మొదటిసారి ప్రారంభించారు. 1550లో యూరప్‌లో చాక్లెట్ ప్రవేశపెట్టిన వార్షికోత్సవంకు గుర్తుగా దీనిని జరుపుకుంటారు.
ప్రపంచ జనాభా దినోత్సవం | జులై 11
ప్రపంచ జనాభా దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన జరుపుకుంటారు. 1989లో యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ యొక్క గవర్నింగ్ కౌన్సిల్ ఈ ఈవెంట్‌ను స్థాపించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ జనాభా సమస్యలపై ప్రజలలో అవగాహన పెంపొందించనున్నారు.
ప్రపంచ మలాలా దినోత్సవం | జులై 12
పాకిస్తానీ సామాజిక కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ పుట్టినరోజును పురస్కరించుకుని, ఏటా జులై 12వ తేదీని ప్రపంచ మలాలా దినోత్సవం జరుపుకుంటారు. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి విద్యా కార్యకర్తగా ప్రపంచవ్యాప్తంగా మహిళల విద్యాహక్కు కోసం పనిచేస్తున్న మలాలా, తన ప్రాథమిక విద్యను పూర్తిచేయడానికి తన దేశ అరాచక శక్తులతో పోరాడాల్సి వచ్చింది.
ఐక్యరాజ్యసమితి 2014 లో 17 ఏళ్ళ మలాలాకు నోబెల్ శాంతి బహుమతి అందించి గౌరవించింది. ఈ బహుమతి అందుకున్న అతి పిన్న వయస్కురాలు ఆమె మాత్రమే. ఈ వేడుకను ప్రతి బిడ్డకు నిర్బంధ మరియు ఉచిత విద్యను అందించాలని ప్రపంచ నాయకులకు విజ్ఞప్తి చేయడానికి జరుపుకుంటారు.
మండేలా అంతర్జాతీయ దినోత్సవం | జులై 18
నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంను ప్రతి సంవత్సరం మండేలా పుట్టినరోజున జూలై 18న జరుపుకుంటారు. 2009లో ఐక్యరాజ్యసమితి అధికారికంగా ఈ రోజును ప్రకటించింది. మొదటి మండేలా దినోత్సవం 18 జూలై 2010న నిర్వహించబడింది.
నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాకు చెందిన జాతివివక్ష వ్యతిరేక కార్యకర్త, ఆయన 1994 నుండి 1999 వరకు దక్షిణాఫ్రికాకు మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు. నెల్సన్ మండేలా సమానత్వం కోసం, పౌర హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష వ్యవస్థను రూపుమాపడంలో మండేలా విజయవంతమయ్యారు.
ఇండియా ఫ్లాగ్ అడాప్షన్ డే | జులై 22
యేటా జులై 22 వ తేదీని జాతీయ జెండా స్వీకరణ దినోత్సవంగా జరుపుకుంటారు. పింగళి వెంకయ్య రూపొందించిన భారత జాతీయ పతాకం 1947 జూలై 22 న జరిగిన భారత మొదటి రాజ్యాంగ సభ సమావేశంలో ఆమోదించింది. ఆ రోజుకు గుర్తుగా యేటా ఆ తేదీని జాతీయ జెండా స్వీకరణ దినోత్సవంగా జరుపుకుంటారు.
జాతీయ థర్మల్ ఇంజినీర్ దినోత్సవం | జులై 24
ప్రతి సంవత్సరం జూలై 24వ తేదీన జాతీయ థర్మల్ ఇంజనీర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దేశంలోని థర్మల్ ఇంజనీర్ల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో థర్మల్ మేనేజ్‌మెంట్ యొక్క ప్రాముఖ్యతను, అలాగే దానిని సాధ్యం చేసే ఇంజనీర్లు మరియు వ్యాపారులను ఈ రోజు గౌరవిస్తుంది.
కార్గిల్ విజయ్ దివస్ | జులై 26
కార్గిల్ యుద్ధ వీరుల గౌరవార్థం ప్రతి సంవత్సరం జూలై 26వ తేదీన కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటారు. ఈ రోజున 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ దళాలపై భారత్ విజయం సాధించేందుకు తమ ప్రాణాలను కోల్పోయిన భారత అమర వీరులను స్మరించుకుంటారు. కాశ్మీరీ మిలిటెంట్ల వేషధారణలో-పాకిస్తానీ దళాలు కార్గిల్ పర్వతాల ద్వారా భారత వాస్తవాధీన రేఖ దాటి ఇండియాలో చొరబడటంతో ఈ యుద్ధం సంభవించింది. ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. ఆపరేషన్ విజయ్ పేరుతో జరిగిన ఈ యుద్ధం 1999 జులై 26వ తేదీన ముగిచింది.
ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం | జులై 28
ప్రపంచ హెపటైటిస్ దినోత్సవంను ప్రతి సంవత్సరం జూలై 28వ తేదీన జరుపుకుంటారు. హెపటైటిస్ గురించి ప్రపంచవ్యాప్త అవగాహన పెంపొందించడం కోసం దీనిని జరుపుకుంటారు. హెపటైటిస్ అనేది హెపటైటిస్ A, B, C, D, మరియు E అని పిలువబడే హెపటైటిస్ వైరస్ వల్ల ఏర్పడే తీవ్రమైన కాలేయ ఇన్‌ఫెక్షన్. ఇది వ్యాధి సోకిన వ్యక్తి యొక్క రక్తం లేదా శరీర ద్రవాల నుండి ఇంకో వ్యక్తికీ వ్యాపిస్తుంది. ఇది వ్యాక్సిన్ ద్వారా సులభంగా నివారించబడుతుంది.
ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం | జులై 28
ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని ఏటా జూలై 28వ తేదీన జరుపుకుంటారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ పర్యావరణం మరియు సహజ వనరుల సంరక్షించాల్సిన అవసరం గురించి ప్రజలలో అవగాహన కల్పిస్తారు.
ఇంటర్నేషనల్ టైగర్ డే | జులై 29
గ్లోబల్ లేదా ఇంటర్నేషనల్ టైగర్ డేను ప్రతి సంవత్సరం జులై 29వ తేదీన జరుపుకుంటారు. ఇది పులుల సంరక్షణ కోసం ప్రజలలో అవగాహన పెంచడానికి నిర్వహిస్తారు. ఇది 2010 లో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ టైగర్ సమ్మిట్‌లో ప్రారంభించబడింది. ప్రపంచంలో అత్యధిక పులుల జనాభా భారతదేశంలోనే ఉంది.