Advertisement
తెలుగు కరెంట్ అఫైర్స్ జనవరి 2023 : ఆర్ట్ & కల్చర్
Telugu Current Affairs

తెలుగు కరెంట్ అఫైర్స్ జనవరి 2023 : ఆర్ట్ & కల్చర్

2023 జనవరి నెలకు సంబంధించిన సమకాలిన జాతీయ అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే, బ్యాంకింగ్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి వివిధ పోటీ పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థులకు ఈ అంశాలు ఉపయోగపడతాయి.

అతి పొడవైన రివర్ క్రూయిజ్ 'గంగా విలాస్' ప్రారంభం

జనవరి 13న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ 'ఎంవీ గంగా విలాస్'ను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ క్రూయిజ్ భారతదేశం మరియు బంగ్లాదేశ్‌లోని 27 నదీ వ్యవస్థల మీదుగా 3,200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించనుంది. నదీ మార్గాల్లో కార్గో ట్రాఫిక్‌ను పెంపొందించడంతో పాటుగా నదీ పర్యాటకంను ప్రోత్సహించేందుకు దీనిని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

గంగా విలాస్ క్రూయిజ్'ను షిప్పింగ్, ఓడరేవులు మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI) రూపొందించింది. ఈ నౌక 62 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు మరియు 1.4 మీటర్ల డ్రాఫ్ట్‌తో నిర్మించబడింది. ఇది 36 మంది పర్యాటకుల సామర్థ్యంతో మూడు డెక్‌లు, 18 సూట్‌లను కలిగి ఉంది.

తమిళనాడులో జల్లికట్టు వేడుకలు 2023

ఏటా మకర సంక్రాంతి సందర్బంగా నిర్వహించే సాంప్రదాయ జల్లికట్టు వేడుకలు తమిళనాడులో ఘనంగా నిర్వహించారు. జల్లికట్టు తమిళ సాంప్రదాయ వేడుకలలో అతి ప్రాచీనమైనవి. ఈ వేడుకలు 'ముల్లై' భౌగోళిక ప్రాంతంలో నివసించే ప్రాచీన తమిళ అయర్ తెగల (క్రీ.పూ 400-100) నుండి సంస్కృత వారసత్వంగా స్వీకరించారు. దీనిని పొంగల్ జల్లికట్టు అని అంటారు.

తమిళనాడు అంతటా వ్యాపించిన జల్లికట్టు ఉత్సవాలు ఎద్దులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించడం లేదా ఎద్దులను టామర్ల నుండి దూరంగా తరలించడంకు సంబంధించిన వేడుక. విజేతలకు ఖరీదైన బహుమతులు, సర్టిఫికెట్లు అందిస్తారు. మదురైకి సమీపాన ఉన్న అలంగనల్లూరులో జల్లికట్టు వేడుక అత్యంత ప్రసిద్ధమైనది.

అయోధ్య & జనక్‌పూర్‌ మధ్య భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు

భారతదేశంలోని అయోధ్య నగరం మరియు నేపాల్‌లోని జనక్‌పూర్‌ని కలిపే మార్గంలో భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలును నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ఈ రైలు 17 ఫిబ్రవరి 2023 నుండి ప్రారంభం కానుంది. తీర్థయాత్ర రూపంలో జరిగే ఈ ప్రయాణం నిడివి 7 రోజులు ఉంటుంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లు దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా 2021లో వీటిని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ రైలు నందిగ్రామ్, సీతామర్హి, వారణాసి, ప్రయాగ్‌లతో పాటు అయోధ్య మరియు జనక్‌పూర్ ధామ్ (నేపాల్) తీర్థయాత్ర మరియు వారసత్వ ప్రదేశాల సందర్శన కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. స్టేట్ ఆఫ్ ఆర్ట్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలుగా పిలుచుకునే దీనిలో రెండు ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు, ఆధునిక వంటగది, కోచ్‌లలో షవర్ క్యూబికల్స్, సెన్సార్ ఆధారిత వాష్‌రూమ్ ఫంక్షన్‌లు, ఫుట్ మసాజర్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

  1. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ - పూరీ గంగాసాగర్ యాత్ర (జలంధర్ నుండి పూరి)
  2. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ - షిర్డీ యాత్ర (కోయంబత్తూర్  నుండి షిర్డీ)
  3. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ - జ్యోతిర్లింగ యాత్ర (జైపూర్ నుండి పూణే)
  4. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ - శ్రీ రామాయణ యాత్ర (ఢిల్లీలో  నుండి రామేశ్వరం)
  5. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ - దక్షిణ భారత యాత్ర (ఢిల్లీ - దక్షిణ భారత ప్రసిద్ధ పట్టణాలు)
  6. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ - శ్రీ రామ్ -జానకీ యాత్ర ( అయోధ్య నుండి జనక్‌పూర్‌)

సరస్ మేళా 2023 కు జమ్మూ & కాశ్మీర్ ఆతిథ్యం

కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ మరియు కాశ్మీర్ మొదటిసారిగా ఫిబ్రవరి 4 నుండి ఫిబ్రవరి 14 వరకు సరస్ (SARAS) మేళా 2023కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేళా జమ్మూలోని బాగ్-ఎ-బహులో నిర్వహించబడనుంది. ఈ మేళాలో దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు మరియు మహిళా స్వయం సహాయక బృందాలు తమ చేతిపనులు, హస్తకళలు, చేనేత మరియు ఆహార పదార్థాలను ప్రదర్శనున్నారు.

సెకండ్ ఫేజ్ "విరాసత్" చీరల పండుగ ప్రారంభం

టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న చీరల పండుగ "విరాసత్" యొక్క రెండవ దశ న్యూఢిల్లీలో ప్రారంభమైంది. దాదాపు 75 రకాల చేనేత చీరలు ఈ ఎగ్జిబిషన్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నారు. చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించేందుకు దీనిని నిర్వహిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్16 నుండి 30 మధ్య 'మై శారీ, మై ప్రైడ్ - ఏక్ విరాసత్ ' పిలుపుతో మొదటి దశ ఎగ్జిబిషన్ పూర్తియింది.

ప్రస్తుతం నిర్వహిస్తున్న రెండవ దశ విరాసత్ ఎగ్జిబిషన్ జనవరి 3 నుండి 17వ తేదీ వరకు న్యూఢిల్లీలోని హ్యాండ్లూమ్ హాత్ యందు నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జిబిషనులో ఆంధ్రప్రదేశ్ నుండి ఉప్పాడ జమధాని చీర, వెంకటగిరి జమదాని కాటన్ చీర, కుప్పడం చీర, చీరాల సిల్క్ కాటన్ చీర, మాధవరం చీర మరియు పోలవరం చీరలు, తెలంగాణ నుండి పోచంపల్లి చీర, సిద్దిపేట గొల్లబమ్మ చీర, నారాయణపేట చీరలు ప్రదర్శనకు ఉండనున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లో చెర్ చేరా ఫెస్టివల్ 2023

ఛత్తీస్‌గఢ్‌ సాంప్రదాయ పండగలలో ఒకటైన చెర్ చేరా ఫెస్టివల్ జనవరి 6న ఘనంగా జరుపుకున్నారు. ఈ పండగను హిందూ క్యాలెండరులోని పౌష్  నెల పౌర్ణమి రోజున జరుపుకుంటారు. పంటలు చేతి కొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండగను జరుపుకుంటారు. ఈ రోజున కూరగాయలు, ఆహార ధాన్యాలను ఒకరికి ఒకరు పంచుకుంటారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘె.ల్ రాజధాని రాయ్‌పూర్‌లోని దుధాధారి మఠంలో సంప్రదాయ పండుగ జరుపుకున్నారు.

'బ్రేవింగ్ ఎ వైరల్ స్టార్మ్' పుస్తకం ఆవిష్కరణ

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా "బ్రేవింగ్ ఎ వైరల్ స్టార్మ్: ఇండియాస్ కోవిడ్-19 వ్యాక్సిన్ " అనే పుస్తకాన్ని అధికారికంగా ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ఆశిష్ చందోర్కర్ మరియు సూరజ్ సుధీర్'లు రచించారు.

2021 జనవరిలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించిన తేదీ యొక్క రెండవ వార్షికోత్సవం జరుపుకోనున్న సందర్భంగా ఈ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ పుస్తకం కోవిడ్ 19 ను భారత్ ఎదుర్కున్న తీరును, వాక్సిన్ ఆవిష్కరణ సంబంధించి తెలియజేస్తుంది.

ఇండియా అతిపెద్ద స్టూడెంట్ కల్చరల్ ఫెస్ట్ సారంగ్ ప్రారంభం

దేశంలోనే అతిపెద్ద విద్యార్థుల కల్చరల్ ఫెస్టివల్ సారంగ్ 2023 మద్రాస్ ఐఐటీలో జనవరి 11న ప్రారంభమైంది. జనవరి 11-15 మధ్య 5 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలలో 100 కంటే ఎక్కువ ఈవెంట్‌లను నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు దేశవ్యాప్తంగా 500 కంటే ఎక్కువ కళాశాలల నుండి 80,000 పైగా విద్యార్థులు హాజరవుతున్నారు.

ఇది సారంగ్ ఫెస్టివల్ యొక్క 28వ ఎడిషన్. ఈ ఏడాది 'మిస్టిక్ హ్యూస్' థీమ్'తో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా నిర్వహించని ఈ విద్యార్థి ఉత్సవాలకు ఈ ఏడాది ఐఐటీ మద్రాస్‌ ఆతిధ్యం ఇస్తుంది.

దేశ వ్యాప్తంగా వివిధ పేర్లతో మకర సంక్రాతి వేడుకలు

ప్రాంతీయ వైవిధ్యాలకు మరియు ఆచారాలకు పుట్టినిళ్లు అయినా భారతదేశంలో వివిధ పేర్లతో జనవరి 15న మకర సంక్రాతి వేడుకలు జరుపుకున్నారు. హిందూ ఆచారం ప్రకారం ఏటా జనవరి 15వ తేదీన సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశికి మారడాన్ని సూచికంగా ఈ వేడుకలు జరుపుకుంటారు. ఈ వేడుకలను దాదాపు అన్ని ప్రాంతాలలో విభిన్న పేర్లతో జరుపుకుంటారు.

  • తై పొంగల్ (తమిళనాడు)
  • ఉత్తరాయణ్ (గుజరాత్)
  • లోహ్రీ (పంజాబ్)
  • పౌష్ సంక్రాతి (బెంగాల్)
  • సుగ్గి హబ్బా (కర్ణాటక)
  • మకర చౌలా (ఒడిశా)
  • మాఘి సంక్రాంతి (మహారాష్ట్ర & హర్యానా)
  • మాఘ్/భోగాలి బిహు (అస్సాం)
  • శిశుర్ సంక్రాత్ (కాశ్మీర్)
  • ఖిచ్డీ పర్వ్ (యుపి మరియు బీహార్)
  • సంక్రాతి / పెద్ద పండగ (ఏపీ & తెలంగాణ)

గంగాసాగర్ మేళా ఉత్సవం 2023

ఏటా మకర సంక్రాతి సందర్బంగా నిర్వహించే గంగాసాగర్ మేళా ఉత్సవం 2023 ఘనంగా జరిగింది. ఈ ఉత్సవాన్ని కోల్‌కతాలోని సాగర్‌ద్వీప్‌లో ఏటా నిర్వహిస్తారు. ఇది గంగా నది, బంగాళాఖాతంలో కలిసే ప్రదేశం. గంగోత్రి వద్ద ప్రారంభమయ్యే గంగ నది, కోల్‌కతాలోని సాగర్ ద్వీపంవద్ద తన సుదీర్ఘ ప్రయాణాన్ని ముగుస్తుంది.

గంగాసాగర్ మేళా ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి సందర్భంగా నిర్వహించబడుతుంది. ఈ రోజున సూర్య భగవానుని ఆరాధిస్తూ ఉదయం పవిత్ర గంగా జలంలో స్నానం చేస్తారు. ఈ పవిత్ర స్నానం చేయడానికి భారతదేశంలోని అనేక రాష్ట్రాల నుండి లక్షలాది మంది యాత్రికులు ఇక్కడకు చేరుకుంటారు. ఇది కుంభ మేళ తర్వాత దేశంలో అతి పెద్ద మేళగా పరిగణించబడుతుంది.

Post Comment