వ్లాదిమిర్ పుతిన్ నుండి ఒలింపిక్ ఆర్డర్ ఉపసంహరణ
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, ఉక్రెయిన్‌పై దాడికి ప్రతిస్పందనగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సహా అన్ని ఉన్నత స్థాయి రష్యన్ అధికారుల నుండి తమ అత్యున్నత పురస్కారమైన ఒలింపిక్ ఆర్డర్‌ను ఉపసంహరించుకుంది. అలానే ఉక్రెయిన్ కూడా పుతిన్ కి అందించిన గౌరవ టైక్వాండో బ్లాక్ బెల్ట్‌ను వెనక్కి తీసుకుంది.
ప్రపంచంలో అత్యధిక ఆంక్షలు ఎదుర్కుంటున్న దేశంగా రష్యా
ఇరాన్ మరియు ఉత్తర కొరియాలను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత ఆంక్షలు ఎదుర్కుంటున్న దేశంగా రష్యా అవతరించింది. ఉక్రెయిన్ పై ఏకపక్ష యుద్దానికి నిరసనగా రష్యాపై యూరోపియన్ మరియు అమెరికా దేశాలు వివిధ ఆర్థిక, వ్యాపార ఆంక్షలు విధించడంతో ఈ జాబితాలో రష్యా, ఇరాన్ ని అధిగమించింది.
ప్రపంచ ఆంక్షల-ట్రాకింగ్ డేటాబేస్ అయిన Castellum.AI ప్రకారం రష్యా ప్రస్తుతం 5,532 పైగా ఆంక్షలు ఎదుర్కుంటుంది. ఈ సైట్ ప్రకారం, ఆంక్షలతో రష్యాను లక్ష్యంగా చేసుకున్న దేశాలు మరియు ప్రాంతాలు జాబితాలో స్విట్జర్లాండ్ (568), యూరోపియన్ యూనియన్ (518), కెనడా (454), ఆస్ట్రేలియా (413), US (243), UK (35) మరియు జపాన్ ( 35) తో ముందు వరుసలో ఉన్నాయి.
దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడిగా యూన్ సుక్-యోల్
దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడుగా యూన్ సుక్-యోల్ ఎన్నికయ్యారు. ప్రధాని ప్రతిపక్ష పార్టీ అయినా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన యూన్ సుక్-యోల్, అధికార డెమోక్రటిక్ పార్టీకి చెందిన లీ జే-మ్యుంగ్‌పై 48.6% ఓట్లతో విజయం సాధించారు.
హంగరీ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా కటాలిన్ నోవాక్
హంగేరియన్ పార్లమెంట్, ఆ దేశ ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్‌కు సన్నిహిత విధేయరాలు అయినా కటాలిన్ నోవాక్‌ను దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నుకుంది. 44 ఏళ్ల కటాలిన్ నోవాక్, హంగేరి మాజీ అధ్యక్షుడు జనోస్ అదేర్ స్థానంలో వచ్చే ఐదేళ్ల కాలానికి బాధ్యతలు స్వీకరించనున్నారు.
చిలీ కొత్త అధ్యక్షుడిగా గాబ్రియేల్ బోరిక్
వామపక్ష భావాలు కలిగిన మాజీ విద్యార్థి నాయకుడు గాబ్రియేల్ బోరిక్, నూతన చిలీ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించారు. 36 ఏళ్ల గాబ్రియేల్ బోరిక్, దక్షిణ అమెరికా దేశాల నుండి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అత్యంత పిన్న వయస్కుడుగా రికార్డు కెక్కారు.
ఇంటర్నేషనల్ డే టూ కంబాట్ ఇస్లామోఫోబియాకు యూఎన్ ఆమోదం
ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (OIC) తరపున పాకిస్తాన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) ఏకాభిప్రాయంతో ఆమోదించింది, ఇకమీదట మార్చి 15వ తేదిని ఇస్లామోఫోబియాను ఎదుర్కోవటానికి అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకోనున్నట్లు ప్రకటించింది. తీర్మానాన్ని ఐఓసీలోని 57 మంది సభ్యులు మరియు చైనా మరియు రష్యాతో సహా ఎనిమిది ఇతర దేశాలు స్పాన్సర్ చేశాయి. అయితే ఈ తీర్మానంపై భారతదేశం, ఫ్రాన్స్ మరియు యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు అసంతృప్తి ప్రదర్శించారు.
ఇస్లామోఫోబియా అంటే ఇస్లాం పేరు వినగానే ద్వేషపూరిత మాటలు, వివక్ష మరియు హింస వంటివి ప్రదర్శించడం. ముస్లిం వ్యక్తులు మరియు వర్గాల పట్ల వివక్ష, శత్రుత్వం మరియు హింసాత్మక భావాన్ని పారదోలి, వారి యందు స్నేహపూర్వక భావాన్ని పొంపొందించే లక్ష్యంలో ఈ కార్యక్రమం జరుపుకోనున్నారు.
రష్యాలో ఇన్‌స్టాగ్రామ్‌కు ప్రత్యామ్నాయంగా రోస్‌గ్రామ్
రష్యన్ ఇంటర్నెట్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ అలెగ్జాండర్ జోబోవ్, ఇన్‌స్టాగ్రామ్‌కు ప్రత్యామ్నాయంగా రోస్‌గ్రామ్ ఫోటో షేర్ సోషల్ మీడియా యాప్ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సంస్థలు నిషేదించబడ్డయి. ఈ శున్యతను క్యాష్ చేసుకునేందుకు రష్యన్ టెక్ దిగ్గజాలు ప్రణాళిక చేస్తున్నాయి.
ఇండియాలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పర్యటన
తూర్పు లడఖ్ ప్రతిష్టంభన తర్వాత, చైనా, భారత్ సంబంధాలపై నెల్కొన్న ప్రతిష్టంభనను పటాపంచలు చేస్తూ.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, అత్యున్నత స్థాయి ప్రాధాన్యతతో భారత పర్యటనకు విచ్చేసారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌తో భేటీ కానున్నారు. ఇందులో భాగంగా ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి మరియు పర్యాటక రంగాలలో కొత్త కనెక్టివిటీ మార్గాల కోసం చర్చించారు. అలానే ఇరుదేశాల మధ్య డైలాగ్ ఆఫ్ సివిలైజేషన్స్ ఒప్పందానికి బీజం వేశారు.
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్‌గా గిల్బర్ట్ హౌంగ్‌బో
టోగోకు చెందిన గిల్బర్ట్ హౌంగ్బో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) తదుపరి డైరెక్టర్ జనరల్‌గా ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి జెనీవాలో జరిగిన సమావేశంలో వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, కార్మికులు మరియు యజమానులు మరియు యూఎన్ పాలకమండలి పాల్గునది. ఈయన అంతర్జాతీయ కార్మిక సంస్థ యొక్క 13 వ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అలానే ఆఫ్రికా నుండి ఎన్నికైన మొదటి డైరెక్టర్ జనరల్‌గా చరిత్రకెక్కారు.