కరెంటు అఫైర్స్ – జూన్ 2022 | స్పోర్ట్స్ అఫైర్స్
Magazine 2022

కరెంటు అఫైర్స్ – జూన్ 2022 | స్పోర్ట్స్ అఫైర్స్

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021 జూన్ 4 న ప్రారంభం

ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2021 ఈ ఏడాది జూన్ 4 నుండి 13 వరకు హర్యానాలో నిర్వహించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ మరియు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్‌ పాల్గున్నారు. కాలేజీ విద్యార్థులలో కీడల యందు ఆసక్తి కల్పించేందుకు ఏటా నిర్వహిస్తున్న ఈ యూత్ గేమ్స్ యందు దేశవ్యాప్తంగా అండర్-18 ఏజ్ కేటగిరీలో సుమారు 8500 మంది క్రీడాకారులు, మొత్తం 25 క్రీడ విభాగాలలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

Advertisement

అంతర్జాతీయ క్రికెట్ నుండి మిథాలీ రాజ్ రిటైర్

భారత లెజెండరీ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్‌ ఫార్మేట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. 39 ఏళ్ల మిథాలీ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన అత్యుత్తమ మహిళా క్రికెటర్లలో ఒకరిగా గుర్తింపు పొందింది. ఆమె 1999 లో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అరంగేట్రం చేసింది. తన కెరీర్లో మొత్తం 232 అంతర్జాతీయ వన్డేలలో ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన ఆమె, 50.68 సగటుతో మొత్తం 7805 పరుగులు సాధించింది.

మిథాలీ రాజ్ ప్రస్తుతం మహిళల వన్డేలలో ఆల్ టైమ్ రన్ స్కోరర్‌ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. అలానే అత్యధిక క్రికెట్ వరల్డ్ కప్'లకు ప్రాతినిథ్యంవహించిన మహిళా క్రికెటరుగా ఆమె రికార్డుకెక్కారు. మిథాలీ భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ, అర్జున అవార్డు, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులు అందుకున్నారు.

ఫ్రెంచ్ ఓపెన్ 2022 విజేతలు

ఫ్రెంచ్ ఓపెన్ 2022, మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా ఇగా స్విటెక్ (పోలాండ్) నిలిచింది. పారిస్‌లోని కోర్ట్ ఫిలిప్-చాట్రియర్‌లో జరిగిన ఫైనల్‌లో కోకో గౌఫ్‌ (యూఎస్)ను 6-1, 6-3 తో వరుస సెట్లలో ఓడించడం ద్వారా విజేతగా అవతరించింది. ఇగా స్విటెక్'కు ఇది రెండవ ఫ్రెంచ్ సింగిల్స్ టైటిల్‌. గతంలో 2020 లో ఈమె తన మొదటి ఫ్రెంచ్ ఓపెన్ సాధించింది.

ఫ్రెంచ్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ 2022ను రాఫెల్ నాదల్ దక్కించుకున్నాడు. కింగ్ ఆఫ్ క్లే కోర్టుగా గుర్తింపు పొందిన రాఫెల్ నాదల్ (స్పెయిన్) కు తుది పోరులో నార్వేకు చెందిన కాస్పర్ రూడ్‌ను ఓడించి రోలాండ్ గారోస్‌లో రికార్డు స్థాయిలో 14వ ఫ్రెంచ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అలానే ఈ టైటిల్ ద్వారా టెన్నిస్ చరిత్రలో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ (22) పొందిన టెన్నిస్ క్రీడాకారుడిగా కూడా అవతరించాడు.

ఫ్రెంచ్ ఓపెన్ 2022 మిక్స్‌డ్ డబుల్స్ విజేతలుగా ఎనా షిబహారా, వెస్లీ కూల్‌హోఫ్ నిలిచారు. ఫైనల్ గేములో 7-6 (5), 6-2తో ఉల్రిక్కే ఐకెరి మరియు జోరాన్ వ్లీగెన్‌లను ఓడించి ఫ్రెంచ్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ 2022ను గెలుచుకున్నారు. డబుల్స్‌లో నం.8 ర్యాంక్‌లో ఉన్న షిబహరా తన మొదటి మేజర్ టైటిల్‌ను గెలుచుకుంది మరియు 25 ఏళ్లలో మిక్స్‌డ్ డబుల్స్‌ను గెలుచుకున్న మొదటి జపనీస్ ప్లేయర్‌గా నిలిచింది.

ట్రిపుల్ జంప్ జాతీయ రికార్డును బద్దలుకొట్టిన ఐశ్వర్యబాబు

ట్రిపుల్ జంప్ మహిళల ఈవెంట్‌లో కర్ణాటకకు చెందిన ఐశ్వర్యబాబు 14.14 మీటర్ల ప్రదర్శనతో కొత్త జాతీయ రికార్డు సృష్టించింది. గతంలో బెంగళూరుకు చెందిన 24 ఏళ్ల మయూఖా జానీ 2011లో నెలకొల్పిన 14.11 మీటర్ల రికార్డును కేవలం 0.03 మీటర్ల తేడాతో  ఈమె అధిగమించింది. ఈ ప్రయత్నంతో ఐశ్వర్య అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AFI) నిర్దేశించిన 13.70 మీటర్ల 2022 కామన్వెల్త్ గేమ్స్ క్వాలిఫైయింగ్ ప్రమాణాలను కూడా అధిగమించింది.

చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలేను ప్రారంభించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో 44వ చెస్ ఒలింపియాడ్ ఎడిషన్ ఈవెంట్ కోసం తొలిసారిగా చారిత్రాత్మిక చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలేను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సంవత్సరం, మొట్టమొదటిసారిగా, ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (FIDE) ఒలింపిక్ సంప్రదాయంలో భాగమైన చెస్ ఒలింపియాడ్ టార్చ్‌ను ఏర్పాటు చేసింది. దీనితో చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలేను కలిగి ఉన్న మొట్టమొదటి దేశంగా భారతదేశం నిలిచింది.

ప్రారంభ జ్యోతిని FIDE ప్రెసిడెంట్ ఆర్కాడీ డ్వోర్కోవిచ్, ప్రధానమంత్రికి అందజేసారు. ప్రధానిని దానిని గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు అందజేస్తారు. చెన్నై సమీపంలోని మహాబలిపురం వద్ద తుది ముగింపుకు ముందు ఈ జ్యోతిని 40 రోజుల వ్యవధిలో 75 నగరాలలో స్థానిక చెస్ గ్రాండ్‌మాస్టర్ల ద్వారా ప్రదర్శించబడుతుంది.

44వ చెస్ ఒలింపియాడ్ చెన్నైలో జూలై 28 నుండి ఆగస్టు 10, 2022 వరకు జరగనుంది. 1927 నుండి నిర్వహించబడుతున్న ఈ ప్రతిష్టాత్మక పోటీ మొదటిసారిగా భారతదేశంలో మరియు 30 సంవత్సరాల తర్వాత ఆసియాలో నిర్వహించబడుతోంది. దీనిలో 189 దేశాల నుండి గ్రాండ్ మాస్టర్లు పాల్గుననున్నారు.

ధోని ఓల్డెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టిన దినేష్ కార్తీక్

రాజ్‌కోట్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన 4వ టీ20లో మ్యాచులో హాఫ్ సెంచరీ సాధించిన భారత వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తీక్, గతంలో ఎంఎస్ ధోని పేరిట ఉన్న ఓల్డెస్ట్ ఏజ్ హాఫ్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో 37 ఏళ్ల 16 రోజుల వయసులో 27 బంతుల్లో 55 పరుగులు చేసిన దినేష్ కార్తీక్, గతంలో 36 ఏళ్ళ 229 రోజులలో వయస్సులో హాఫ్ సెంచరీ  సాధించిన రికార్డును అధిగమించాడు.

2022 కుర్టానే గేమ్స్‌లో నీరజ్ చోప్రాకు స్వర్ణం

టోక్యో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా, ఫిన్‌లాండ్‌లో జరిగిన 2022 కుర్టానే గేమ్స్‌లో స్వర్ణం సాధించాడు. గ్రెనడాకు చెందిన ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్‌ను నీరజ్ నాలుగు రోజుల్లో రెండోసారి ఓడించాడు. భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ 86.69 మీటర్ల దూరం విసరడం ద్వారా విజేతగా నిలిచాడు.

ఎఫ్ఐసీఏ మొదటి మహిళా అధ్యక్షురాలుగా లిసా స్థలేకర్

లెజెండరీ ఆస్ట్రేలియా క్రికెటర్ లిసా స్థలేకర్, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అసోసియేషన్ (FICA) యొక్క మొదటి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. 2001-13 మధ్య ఆస్ట్రేలియా తరుపున 125 వన్డేలు ఆడిన స్థలేకర్, 1,000 పరుగులు, 100 వికెట్లు తీసిన తొలి మహిళగా గుర్తింపబడింది. ఈమె 2013 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌ను ఆస్ట్రేలియా జట్టు గెలుచుకున్న తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.

మధ్యప్రదేశ్ ఖాతాలో తొలి రంజీ ట్రోఫీ టైటిల్‌

26 జూన్ 2022 న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో మధ్యప్రదేశ్ ఆరు వికెట్ల తేడాతో ముంబై జట్టును ఓడించి తొలిసారిగా రంజీ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధికంగా 41 సార్లు విజేతగా నిలిచిన ముంబై జట్టు 2015-16 తర్వాత ఒక్క టైటిల్ కూడా నెగ్గలేకపోయింది. ఆదిత్య శ్రీవాస్తవ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ జట్టు, ఆ రాష్ట్రానికి మొదటి రంజీ ట్రోఫీని అందించింది.

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇయాన్ మోర్గాన్

2019 క్రికెట్ ప్రపంచ కప్పులో ఇంగ్లండును విజేతగా నిలిపిన ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 35 ఏళ్ల మోర్గాన్ 126 వన్డేలు, 72 ట్వంటీ20లకు ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతను రెండు ఫార్మాట్లలో కెప్టెన్‌గా 118 విజయాలు సాధించడం కూడా ఒక రికార్డు. అలానే ఇంగ్లాండుకు మొదటి క్రికెట్ వరల్డ్ కప్ అందించిన ఘనత కూడా మోర్గాన్'కు చెందుతుంది.

Advertisement

Post Comment