తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 15 ఫిబ్రవరి 2024
February Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 15 ఫిబ్రవరి 2024

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 15 ఫిబ్రవరి 2024. పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నాం.

Advertisement

తమిళనాడు మొదటి ట్రాన్స్ రైలు టికెట్ ఎగ్జామినర్‌గా సింధు గణపతి

కన్యాకుమారి జిల్లాకు చెందిన సింధు గణపతి అనే ట్రాన్స్ ఉమెన్, తమిళనాడులో మొట్టమొదటి ట్రాన్స్ ట్రైన్ టికెట్ ఎగ్జామినర్‌గా అవతరించారు. ఆమె ఫిబ్రవరి 8న దిండిగల్ రైల్వే స్టేషన్‌లో ఈ బాధ్యతలు స్వీకరించారు. నాగర్‌కోయిల్‌కు చెందిన సింధు 2003లో సదరన్ రైల్వేలో ఎలక్ట్రికల్ విభాగంలో కెరీర్ ప్రారంభించారు.

ఈమె మొదట కేరళలోని త్రివేండ్రం డివిజన్ పరిధిలోని ఎర్నాకులంలో పనిచేశారు. 2009లో మధురై డివిజన్ పరిధిలోని దిండిగల్‌కు బదిలీ చేయబడ్డారు. అయితే ప్రమాదంలో ఆమె చేతికి గాయం కావడంతో టెక్నికల్ విభాగం నుండి నాన్-టెక్నికల్ ఉద్యోగానికి మారవలసి వచ్చింది. ఆ విదంగా ఆమె తమిళనాడు మొదటి ట్రాన్స్ ట్రైన్ టికెట్ ఎగ్జామినర్‌గా మారారు.

కెందు ఆకుల కార్మికులకు ఆర్థిక సహాయం ప్రకటించిన ఒడిశా ప్రభుత్వం

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 9 లక్షలకు పైగా ఉన్న కెందు ఆకుల కార్మికుల కోసం ఆర్థిక సహాయం ప్రకటించారు. కెందు ఆకుల కార్మికులు మరియు బైండర్ల కోసం 150 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం పంట సీజన్‌లో కెందు ఆకులను తెంచుకునే వారికి 50 శాతం బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సహాయం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) ద్వారా పంపిణీ చేయబడుతుంది.

అదనంగా ఈ సెక్టార్‌లోని బైండర్‌లు మరియు సీజనల్ సిబ్బందికి 10% ప్రోత్సాహకం కూడా ప్రకటించారు. అలాగే సీజనల్ ఉద్యోగులకు అదనంగా మరో నెల ఉపాధిని కల్పించనున్నట్లు ప్రకటించారు. కార్మికులకు మరింత సాధికారత కల్పిస్తూ ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కెందు ఆకుల ధరను పెంచింది. 20 ఆకుల కట్ట రూ.1.40 నుంచి రూ.1.60కి చేరగా, 40 ఆకుల కట్ట రూ.2.80 నుంచి రూ.3.20కి పెరిగింది.

  • అంతేకాకుండా ప్రయాణ మరియు సైకిల్ అలవెన్సులలో 50% పెంపుతో పాటు సీజనల్ సిబ్బందికి వేతనాలలో సవరణను ప్రభుత్వం ఆమోదించింది.
  • ముఖ్యంగా కెందు ఆకులను తెంచేవారు ఇప్పుడు 62 ఏళ్ల వయస్సు వరకు సామాజిక భద్రతా ప్రతిఫలాన్ని పొందవచ్చు.
  • వీటితో పాటుగా కెందు ఆకుల కార్మికుల కుమార్తెల వివాహానికి 25,000/- ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
  • ఈ సహాయం గరిష్టంగా ఇద్దరు కుమార్తెలకు అందిస్తారు.
  • ఈ కార్యక్రమాలు సుమారు 9 లక్షల మంది కార్మికులకు లబ్ది చేకూర్చేలా ఏర్పాటు చేయబడినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

కెందు ఆకు లేదా టెండు ఆకు అనేది టెండు చెట్టు (డయోస్పైరోస్ మెలనోక్సిలోన్) నుండి లభ్యమయ్యే ఒక రకమైన ఆకు. ఇది మధ్య మరియు తూర్పు భారతదేశంలో విస్తృతంగా దొరుకుతుంది. వీటిని భారతదేశంలో సిగరెట్లు లేదా బీడీల తయారీలో ఉపయోగిస్తారు. కెందు ఆకు గిరిజన వర్గాలకు ముఖ్యమైన ఆదాయ వనరు. ఈ ఆకులను అడవి నుండి సేకరించి బీడీ తయారీదారులకు అమ్ముతారు.

యుఎఇ, భారత్ మధ్య సహకారం కోసం 10 ఒప్పందాలు

యూఏఈ, భారత్ తమ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంధనం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు వంటి కీలక రంగాలలో సహకారం కోసం 10 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇటీవలే ఫిబ్రవరి 13-14 మధ్య యూఏఈలో ప్రధాని మోడీ పర్యటన సందర్బంగా ఈ ఒప్పందాలు చోటు చేసుకున్నాయి. ఈ 10 అవగాహన ఒప్పందాలపై యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ మరియు ప్రధాని నరేంద్ర మోదీ సంతకాలు చేశారు.

  • ఎలక్ట్రికల్ ఇంటర్‌కనెక్షన్ మరియు వాణిజ్య సహకారంపై జరిగిన ఎంఓయు ఇంధన భద్రత మరియు వాణిజ్య రంగంలో గ్రీన్ హైడ్రోజన్ భరోసాపై ద్రుష్టి సారిస్తుంది.
  • ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్ సాధికారత మరియు ఆపరేషన్ కోసం జరిగిన అంతర్-ప్రభుత్వ ముసాయిదా ఒప్పందం ప్రాంతీయ అనుసంధానాన్ని మరింత పెంచుతుంది. గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన జి20 సదస్సు సందర్భంగా న్యూఢిల్లీలో ఈ కారిడార్‌ను ప్రకటించారు. ఇది చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌కి ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేయబడుతుంది. ఈ సముద్ర కారిడార్ భారతదేశం, యూఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్ మరియు యూరప్‌లను కలుపుతుంది.
  • డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లలో సహకారంపై జరిగిన అవగాహన ఒప్పందం డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పెట్టుబడి సహకారం అందిస్తుంది. ఈ రంగంలో విస్తృత సహకారం కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడంతో పాటుగా సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాన్ని పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది.
  • నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అభివృద్ధిపై జరిగిన అవగాహన ఒప్పందం గుజరాత్‌లోని లోథాల్‌లోని మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్‌కు మద్దతునిచ్చే లక్ష్యంతో ఉంది.
  • నేషనల్ లైబ్రరీ అండ్ ఆర్కైవ్స్ ఆఫ్ యుఎఇ మరియు నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన ఒప్పందం ఆర్కైవల్ మెటీరియల్ పునరుద్ధరణ మరియు సంరక్షణతో సహా ఈ రంగంలో విస్తృతమైన ద్వైపాక్షిక సహకారాన్ని అందిస్తుంది.
  • తక్షణ చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌ల ఇంటర్‌లింక్‌పై జరిగిన ఒప్పందం యూపీఐ (ఇండియా) మరియు ఎఎఎన్ఐ (యూఏఈ) రెండు దేశాల మధ్య అతుకులు లేని సరిహద్దు లావాదేవీలను సులభతరం చేస్తాయి.
  • దేశీయ డెబిట్/క్రెడిట్ కార్డ్‌లను అంతర్-లింకింగ్ కోసం జరిగిన ఒప్పందం జయవాన్ (యుఎఇ)తో రూపే (ఇండియా) ఆర్థిక రంగ సహకారాన్ని పెంపొందిస్తుంది. ఇది యుఎఇ అంతటా రూపే యొక్క సార్వత్రిక ఆమోదాన్ని పెంచుతుందని భావిస్తున్నారు.

ప్రధాని మోడీ  ఫిబ్రవరి 13-14 మధ్య యుఎఇలో పర్యటించారు. దుబాయ్‌లో జరిగే ప్రపంచ ప్రభుత్వ సదస్సులో ప్రపంచ నేతలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. అలానే అబుదాబిలో జరిగిన భారీ 'అహ్లాన్ మోడీ' కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో మోడీ మాట్లాడారు. యూఏఈలో 3.5 మిలియన్ల భారతీయులు నివసిస్తున్నారు.

రెండవ విడతలో ఫిబ్రవరి 14-15 మధ్య ఆయన ఖతార్‌లో పర్యటించారు. 2014 నుండి ఖతార్‌లో మోడీ పర్యటించడం ఇది రెండొవసారి. ఈ పర్యటనలో ఆయన ఖతార్ అధ్యక్షుడు అమీర్, షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ మరియు ఇతర ప్రముఖులను ఆయన కలిశారు. ఖతార్‌లో 8 లక్షలకు పైగా భారతీయులు నివసిస్తున్నారు.

జాతీయ చలనచిత్ర అవార్డుల పేర్ల మార్పు

సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ జాతీయ చలనచిత్ర అవార్డుల నుండి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మరియు దివంగత నటి నర్గీస్ దత్ పేర్లను తొలగించింది. ఈ అవార్డులకు నూతన పేర్లను నామకరణం చేయడంతో పాటుగా వాటి నగదు బహుమతి విలువను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అవార్డులకు ఉన్న వ్యక్తిగత పేర్లను హేతుబద్ధీకరించడం అనే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ మార్పులు చేసింది.

  • 1980 నుండి అందిస్తున్న ఇందిరాగాంధీ అవార్డ్‌ ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఆఫ్ డైరెక్టర్, ఇప్పుడు బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఆఫ్ డైరెక్టర్ అవార్డుగా అందించబోతుంది.
  • 1965 నుండి నేషనల్ ఇంటిగ్రేషన్‌పై బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌ కోసం అందిస్తున్న నర్గీస్ దత్ అవార్డును జాతీయ, సామాజిక మరియు పర్యావరణ విలువలను ప్రోత్సహించే ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా మార్చింది.
  • అలానే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రైజ్ మనీని రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
  • స్వర్ణ్ కమల్ మరియు రజత్ కమల్ పేరిట అందించే అవార్డుల ప్రైజ్ మనీ వరుసగా రూ. 3 లక్షలు మరియు రూ. 2 లక్షలకు పెంచింది. గతంలో ఈ అవార్డులకు 50వేల నుండి రెండు లక్షల మధ్య నగదు బహుమతి అందించేంది.
  • ఉత్తమ యానిమేషన్ ఫిల్మ్ మరియు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డులు కొత్త కేటగిరీ క్రింద క్లబ్ చేయబడ్డాయి
  • ఉత్తమ స్క్రిప్ట్ కోసం కొత్త అవార్డు ప్రవేశపెట్టబడింది.
  • రాజ్యాంగంలోని షెడ్యూల్ VIIIలో పేర్కొన్న ప్రతి భాషలో అందించే ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును ఉత్తమ (భాష పేరు) ఫీచర్ ఫిల్మ్‌గా పేరు మార్చారు.
  • ఈ మార్పులు అన్ని ఈ ఏడాది చివర్లో ప్రకటించే 2022లో విడుదలైన చిత్రాలకు వర్తిస్తాయి.

గత ఏడాది ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డుల 69వ ఎడిషన్‌లో వివేక్ అగ్నిహోత్రి యొక్క ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం నర్గీస్ దత్ అవార్డులను కైవసం చేసుకోగా, మలయాళ చిత్రం మెప్పడియాన్‌కు ఇందిరా గాంధీ అవార్డు అందించబడింది. ఈ పేర్లతో అవార్డు అందుకున్న చివరి చిత్రాలుగా ఈ రెండు నిలిచాయి.

జాతీయ చలనచిత్ర అవార్డులు 1954లో స్థాపించబడ్డాయి. వీటిని 1973 నుండి భారత ప్రభుత్వం యొక్క డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ద్వారా అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వంచే నియమించబడిన జాతీయ ప్యానెల్ విజేతల ఎంట్రీని ఎంపిక చేస్తుంది. ఈ అవార్డు ప్రదానోత్సవం న్యూఢిల్లీలో జరుగుతుంది. భారత రాష్ట్రపతి ఈ అవార్డులను అందజేస్తారు. ఈ అవార్డుల ప్రధానోత్సవం తర్వాత నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం జరుగుతుంది.

చంద్రబాబుపై మహా స్వప్నికుడు పుస్తకం ఆవిష్కరణ

తన జీవిత కథ ఆధారంగా రచించబడ్డ మహా స్వప్నికుడు (ఒక గొప్ప దార్శనికుడు) అనే పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు సమక్షంలో ఫిబ్రవరి 11న ఆవిష్కరించారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన చంద్రబాబు బాల్యంతో ఈ పుస్తకం ప్రారంభమవుతుంది. చంద్రబాబు పట్టుదల, ఆయన చేసిన కృషి, ఆయన ఎదిగిన తీరును ఈ పుస్తకంలో వివరించారు.

మహా స్వాప్నికుడు పుస్తకాన్ని రిటైర్డ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ గోపాల గౌడ ఆవిష్కరించారు. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పూల విక్రమ్ దీనిని రచించారు. వెంకట్ కోడూరి ఈ పుస్తకాన్ని ప్రచురించారు. చంద్రబాబు దార్శనికతతో అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నిర్దేశించిన తీరును వాస్తవాలకు దగ్గరగా ఈ పుస్తకంలో పొందుపరిచారు.

రాజకీయాలలో చంద్రబాబుపై కక్షసాధింపు చర్యలకు పాల్పడిన ప్రస్తుత ఏపీ సీఎం జగన్ గురించి, ఆయన ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసుల గురించి కూడా ప్రత్యేకంగా వివరించారు. ప్రభుత్వం పెట్టిన కేసులును చంద్రబాబు ఎలా ఎదుర్కున్నారో ఇందులే పేర్కొన్నారు. 53 రోజుల పాటు జైల్లో పెట్టినా వెన్నక్కుతగ్గని ఆయన మొక్కవోని దీక్ష గురించి ప్రత్యేకంగా తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశాన్ని కూడా ఈ పుస్తకంలో ప్రత్యేకంగా స్పృశించారు రచయిత పూల విక్రమ్. 20 ఏళ్ల క్రితమే విజన్ 2020 పేరుతో తన కున్న దార్శనికతనతో చంద్రబాబు రాజధాని నగరాలను ఎలా అభివృద్ధి పదంలో నడిపారనే ప్రస్థావన ఇందులో తీసుకొచ్చారు.

హుక్కా పార్లర్లపై తక్షణమే నిషేధం విధించిన తెలంగాణ ప్రభుత్వం

ఫిబ్రవరి 12న హుక్కా పార్లర్ల నిర్వహణను నిషేధించే బిల్లును తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనికి సంబందించిన 2003 సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం సవరణ బిల్లును ఎలాంటి చర్చ లేకుండా వాయిస్ ఓటుతో ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి.

  • ప్రస్తుతమున్న సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల (ప్రకటనల నిషేధం, వాణిజ్యం, ఉత్పత్తి, సరఫరా మరియు పంపిణీ నియంత్రణ) చట్టానికి ఈ సవరణను బిల్లు ప్రతిపాదించింది.
  • ఈ బిల్లును ప్రవేశపెట్టిన శాసనసభా వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ హుక్కా పార్లర్‌లు నడుపుతున్న వారు యువతలో ఉన్న క్రేజ్‌ను సద్వినియోగం చేసుకుని, యువతకు హుక్కా తాగే అలవాటుకు గురిచేస్తున్నారని అన్నారు.
  • ఇక మీదట ఎవరైనా హుక్కా పార్లర్లు నడుపుతున్నట్లు తేలితే ఏడేళ్ల వరకు కఠిన జైలు శిక్షతో పాటు 50 వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు జరిమానా విధించనున్నట్లు మంత్రి తెలిపారు.
  • అలానే రాబోయే రోజుల్లో హుక్కా ధూమపానానికి వ్యతిరేకంగా ప్రభుత్వం కళాశాలల్లో అవగాహన ప్రచారాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభిస్తుందని, రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు మరియు డ్రగ్స్‌పై ప్రభుత్వం పోరాటాన్ని ఉధృతం చేస్తుందని ఆయన అన్నారు.

ఈ బిల్లు గవర్నర్ ఆమోదంతో ప్రతిపాదిత చట్టం అమల్లోకి వస్తుంది. హుక్కా ధూమపానం వల్ల కలిగే సంభావ్య హాని గురించి, ముఖ్యంగా యువతలో మరియు ప్రజారోగ్యంపై దాని ప్రతికూల ప్రభావం గురించి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. యువత పొగాకు ఉత్పత్తులకు బానిసలుగా మారడానికి హుక్కా పార్లర్‌లు గేట్‌వేలుగా ఉన్నాయని ప్రభుత్వం భావించింది.

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య పొగాకు వినియోగానికి సంబంధించిన ప్రజారోగ్య సమస్యలను పరిష్కరించడానికి భారతదేశంలో విస్తృత ధోరణిలో భాగం. అనేక ఇతర రాష్ట్రాలు ఇప్పటికే హుక్కా పార్లర్‌లపై ఇలాంటి నిషేధాన్ని అమలు చేస్తున్నాయి.

Advertisement

Post Comment