Advertisement
తెలుగు ఎడ్యుకేషన్ రోజువారీ కరెంట్ అఫైర్స్ 07 నవంబర్ 2023
Telugu Current Affairs

తెలుగు ఎడ్యుకేషన్ రోజువారీ కరెంట్ అఫైర్స్ 07 నవంబర్ 2023

తెలుగు ఎడ్యుకేషన్ రోజువారీ కరెంట్ అఫైర్స్ నవంబర్ 07, 2023. తాజా జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ కైవసం

మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. రాంచీలో జరిగిన ఫైనల్లో ఆతిథ్య భారత్ జట్టు, జపాన్‌ను 4-0తో ఓడించింది. సంగీత కుమారి, నేహా, లారెమ్‌సియామి, వందనా కటారియా గోల్స్‌తో భారత్ రెండవ సారి ఆసియా హాకీ ఛాంపియన్‌గా నిలిచింది. ఇది వరకు 2016లో సింగపూర్‌లో జరిగిన ఈవెంటులో భారతదేశం తమ తొలి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. కాగా జపాన్ కూడా 2013 మరియు 2021లో రెండుసార్లు ఈ కిరీటాన్ని కైవసం చేసుకుంది.

2023 మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోపి అనేది ఆసియా హాకీ ఫెడరేషన్ ద్వారా నిర్వహించబడే ద్వైవార్షిక ఫీల్డ్ హాకీ టోర్నమెంట్. దీనిలో ఆరు ఉత్తమ ఆసియా మహిళల జాతీయ జట్లు పాల్గొంటాయి. ఈ ఏడాది టోర్నమెంటులో భారత్, జపాన్, చైనా, దక్షిణ కొరియా, మలేషియా మరియు థాయిలాండ్ జట్లు పాల్గొన్నాయి.

ఈ టోర్నమెంటుకు ఈ ఏడాది భారత్ ఆతిధ్యం ఇచ్చింది. ఈ క్రీడా ఈవెంట్ రాంచీలోని జైపాల్ సింగ్ స్టేడియంలో అక్టోబర్ 27 నుండి నవంబర్ 5 వరకు నిర్వహించారు. ఈవెంట్ యందు జపాన్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా పాల్గొంది. మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క ఏడవ ఎడిషన్.

'టైమ్ అవుట్' అయిన మొదటి క్రికెటరుగా ఏంజెలో మాథ్యూస్

శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ అంతర్జాతీయ క్రికెట్‌లో 'టైమ్ అవుట్' అయిన మొదటి ఆటగాడుగా నిలిచాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన 2023 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. దీనితో 146 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో నిర్ణీత సమయం కంటే ఎక్కువ తీసుకున్న తర్వాత 'టైమ్ అవుట్' అయిన మొదటి ఆటగాడిగా ఏంజెలో మాథ్యూస్ నిలిచాడు.

మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిబంధనల ప్రకారం ఒక వికెట్ పడిన తర్వాత, ఒక కొత్త బ్యాటర్ 120 సెకన్లు (2 నిమిషాలు) లోపు తర్వాత బంతిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ నిర్ణీత సమయంలో తదుపరి బంతికి స్ట్రైక్ చేయడంలో విఫలమైతే సదురు బ్యాట్సమెన్ ఔట్‌గా పరిగణించబడతాడు. ఈ మ్యాచ్‌లో ఏంజెలో మాథ్యూస్‌ను ఆన్-ఫీల్డ్ అంపైర్లు ఇదే కారణంతో అవుట్ చేశారు.

ఈ నియమం 1980 నుండి అమలులో ఉంది. ఇది ఆటకు అనవసరమైన ఆలస్యాన్ని నిరోధించడానికి రూపొందించబడింది. అయితే ఇది చాలా అరుదైన తొలగింపు. సాధారణంగా ప్రత్యర్థి జట్టు కెప్టెన్లు దీనికి సమ్మతించారు. మానవీయ కోణంలో సదురు బ్యాట్సమన్స్ ఆడేందుకు అనుమతిస్తారు. అయితే ఈ మ్యాచులో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ దీనికి సమ్మతించకపోవడంతో మాథ్యూస్ ఔటుగా ప్రకటించబడ్డాడు.

ఫిడే గ్రాండ్ స్విస్ ఓపెన్‌లో భారత్ అగ్రస్థానం

భారత చదరంగం క్రీడాకారులు వైశాలి రమేష్‌బాబు మరియు విదిత్ గుజరాతీలు ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ యొక్క ఉమెన్స్ మరియు మెన్ గ్రాండ్ స్విస్ 2023 విజేతలుగా నిలిచారు. వీరిద్దరి విజయంతో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. దీనితో వచ్చే ఏడాది ప్రారంభంలో టొరంటోలో జరగనున్న ప్రతిష్టాత్మక అభ్యర్థుల టోర్నమెంట్‌లో ఇద్దరు ఆటగాళ్లు తమ స్థానాలను ఖాయం చేసుకున్నారు.

ఫిడే గ్రాండ్ స్విస్ ఓపెన్ అనేది ఒక అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్, ఇది ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించే చక్రంలో భాగం. ఇది ప్రపంచ నలుమూలల నుండి 100-114 మంది పాల్గొనే 11-రౌండ్ స్విస్-సిస్టమ్ టోర్నమెంట్. ఈ  టోర్నమెంట్‌ మొదటి రెండు స్థానాల్లో నిలిచిన వారు ప్రపంచ ఛాంపియన్‌షిప్ అర్హుత  సాధిస్తారు. ఇది 2019 నుండి యేటా నిర్వహించబడుతుంది.

ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ లేదా వరల్డ్ చెస్ ఫెడరేషన్ అనేది స్విట్జర్లాండ్‌లో ఉన్న ఒక అంతర్జాతీయ చెస్ సమాఖ్య, ఇది వివిధ జాతీయ చెస్ సమాఖ్యలను ఏకం చేస్తుంది. అంతర్జాతీయ చెస్ పోటీకి పాలకమండలిగా పనిచేస్తుంది. దీనిలో అంతర్జాతీయంగా 200 జాతీయ సంఘాలు సభ్యులుగా ఉన్నాయి. ఇది 20 జూలై 1924లో పారిస్ యందు స్థాపించబడింది. ప్రస్తుత దాని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ (లౌసాన్) యందు ఉంది. దీని ప్రస్తుత అధ్యక్షుడు - అర్కాడీ డ్వోర్కోవిచ్.

శ్రీలంక క్రికెట్ బోర్డు రద్దు

2023 ప్రపంచ కప్‌లో భారత్‌తో ఘోర పరాజయం తర్వాత శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేస్తున్నట్లు ఆ దేశ క్రీడా మంత్రి రోషన్ రణసింగ్ ప్రకటించారు. తిరిగి పూర్తిస్థాయి బోర్డు ఏర్పాటు చేసే వరకు ఈ క్రికెట్ బోర్డును నియంత్రించడానికి ఏడుగురు సభ్యులతో కూడిన తాత్కాలిక కమిటీని కూడా నియమించాడు. 1996లో శ్రీలంకకు వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ అర్జున రణతుంగ ఈ తాత్కాలిక కమిటీకి అధ్యక్షత వహిస్తాడు.

అయితే శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేసి మధ్యంతర కమిటీని ఏర్పాటు చేసిన మంత్రి రోషన్ రణసింగ్ చర్యను సవాలు చేస్తూ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని స్వీకరించిన అప్పీల్ కోర్టు, సంక్షోభంలో ఉన్న క్రికెట్ బోర్డును తొలగించాలనే క్రీడా మంత్రి నిర్ణయాన్ని రద్దు చేసింది. దీనికి సంబంధించి పూర్తి విచారణ పెండింగ్‌లో ఉన్నందున బహిష్కరించబడిన అధికారులను కూడా తిరిగి పునరుద్ధరించింది.

బోర్డు అసమర్థత, అవినీతి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాడు రాణాసింగ్ తెలిపారు. ఇటీవలి సంవత్సరాలలో ఆ జట్టు పేలవ ప్రదర్శనకు బోర్డు బాధ్యత వహించాలని ఆయన కోరారు. శ్రీలంక క్రికెట్ బోర్డు తొలగింపుపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అభిమానులు ఈ చర్యను స్వాగతించగా, మరికొందరు ఈ తొలగింపు శ్రీలంక క్రికెట్‌ను అస్థిరపరచడమే కాకుండా మరిన్ని సమస్యలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారత్ -కొరియా దౌత్య సంబంధాలు మొదలై 50 ఏళ్ళు

దక్షిణ కొరియాతో 50 సంవత్సరాల దౌత్య సంబంధాలను పురస్కరించుకుని 6వ ఇండియా-కొరియా వ్యాపార భాగస్వామ్య ఫోరం న్యూఢిల్లీలో నవంబర్ 7న నిర్వహించబడింది. ఈ ఫోరమ్‌కు ప్రభుత్వ అధికారులు, వ్యాపార ప్రముఖులు మరియు విద్యావేత్తలతో సహా రెండు దేశాల నుండి ప్రముఖ ప్రతినిధులు హాజరయ్యారు.

ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక-రాజకీయ అస్థిరతలు ఉన్నప్పటికీ భారతదేశానికి దక్షిణ కొరియా ఎల్లప్పుడూ విశ్వసనీయ వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఏప్రిల్ 2020 నుండి కొరియన్ కంపెనీలు 5.6 బిలియన్ డాలర్లకు పైగా దేశంలో పెట్టుబడులు పెట్టాయి. ఇది 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

భారతదేశం మరియు కొరియా మధ్య ఆర్థిక మరియు వ్యాపార సంబంధాలను బలోపేతం చేయడానికి మార్గాలను చర్చించడానికి ఈ ఫోరమ్ ఒక మంచి వేదిక. తయారీ, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత వంటి వివిధ రంగాల్లో ఇరుదేశాల భాగస్వామ్య ప్రాముఖ్యతను వక్తలు ఎత్తిచూపారు. ఈ ఫోరమ్ భారతదేశం మరియు కొరియా మధ్య దౌత్య సంబంధాలు మొదలై 50 ఏళ్ళు పూర్తికావడంతో వార్షికోత్సవాన్ని కూడా నిర్వహించింది.

గత 50 ఏళ్లలో ద్వైపాక్షిక సంబంధాలలో సాధించిన పురోగతిని వక్తలు గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తు పట్ల తమ ఆశావాదాన్ని కూడా వ్యక్తం చేశారు. భారతదేశం-కొరియా వ్యాపార భాగస్వామ్య ఫోరం రెండు దేశాల మధ్య బలమైన ఆర్థిక మరియు వ్యాపార సంబంధాలను ప్రదర్శించే ఒక ముఖ్యమైన కార్యక్రమం.

దేశవ్యాప్తంగా బాణాసంచా అమ్మకం, వాడకంపై నిషేధం

భారత సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా బాణాసంచా అమ్మకాలు మరియు వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ కార్యకర్తల బృందం దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై నవంబర్ 7, 2023న ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా బాణాసంచాలో బేరియం మరియు ఇతర నిషేధిత రసాయనాల వాడకాన్ని నిషేధిస్తూ తన ఉత్తర్వులను జారీ చేసింది.

బాణాసంచాల వల్ల గాలి నాణ్యతపైనా, మానవ ఆరోగ్యంపైనా దుష్ప్రభావాలే ఈ నిషేధానికి కారణమని కోర్టు పేర్కొంది. బాణాసంచా శబ్ద కాలుష్యానికి ప్రధాన కారణమని, ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులకు ఇది హానికరమని కోర్టు పేర్కొంది. ఈ నిషేధంపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు గాలి నాణ్యతను మెరుగుపరచడం మరియు మానవ ఆరోగ్యాన్ని రక్షించడం కోసం ఇలాంటి నిర్ణయాలు అవసరమని భావించగా, సంప్రదాయ పండుగలు, వేడుకలపై ఈ నిషేధం ప్రతికూల ప్రభావం చూపుతుందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ నిషేధానికి సుప్రీంకోర్టు కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఉదాహరణకు, స్పార్క్లర్లు మరియు ఇతర తక్కువ ఉద్గార పటాకులను అనుమతిసుంది. అదనంగా, కొన్ని షరతులకు లోబడి దీపావళి మరియు గురుపూరబ్ వంటి ప్రత్యేక సందర్భాలలో బాణసంచా వినియోగాన్ని కోర్టు అనుమతించింది.

Post Comment