తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 27 జనవరి 2024
January Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 27 జనవరి 2024

January 27, 2024 Current affairs in Telugu. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో పొందండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షల కొరకు సిద్దమవుతున్న ఆశావహుల కోసం వీటిని అందిస్తున్నాం.

Advertisement

43 ఏళ్ల వయసులో రోహన్ బోపన్నకు ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు

భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న 43 ఏళ్ల వయసులో పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్న అతి పెద్ద వయస్కుడిగా నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌తో జతకట్టిన బోపన్న 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్-ఫైనల్స్‌లో అర్జెంటీనా ద్వయం మాక్సిమో గొంజాలెజ్ మరియు ఆండ్రెస్ మోల్తేనిని 6-4, 7-6 వరుస సెట్లలో ఓడించి ఈ చారిత్రాత్మక ఘనతను సాధించాడు.

అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ప్రకారం, ప్రస్తుత ప్రపంచ నెంబర్ ఒన్‌గా బోపన్న సాధించిన ఘనత 2019లో 41 సంవత్సరాల 76 రోజుల వయస్సుతో మైక్ బ్రయాన్ పేరిట ఉన్న మునుపటి రికార్డును అధిగమించింది. 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ ముగిసే సమయానికి బోపన్నకు 43 ఏళ్ల 330 రోజులు నిండాయి.

రోహన్ బోపన్నమరియు మాథ్యూ ఎబ్డెన్‌ జోడి ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్ డబల్ టైటిల్ కూడా సొంతం చేసుకుంది. ఇది పురుషుల డబుల్స్‌లో అతని మొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌. అలానే 43 ఏళ్ల వయసులో పురుషుల డబుల్స్ టైటిల్ విజేతగా నిలిచిన క్రీడాకారుడిగా కూడా అవతరించాడు.

ఇది ఓవరాల్‌గా బోపన్నకు రెండవ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌. 2017లో కెనడా టెన్నిస్ క్రీడాకారిణి గాబ్రియేలా డబ్రోవ్స్కీతో కలిసి ఫ్రెంచ్ ఓపెన్‌లో మిక్స్‌డ్-డబుల్స్ టైటిల్ సాధించాడు. ఈ విజయం బోపన్నకు తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఇవ్వడంతో పాటుగా గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్న నాల్గవ భారత ఆటగాడిగా నిలిపింది.

భారతదేశం నుండి మొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ విజేత లియాండర్ పేస్. ఇండియా నుండి పేస్ ఎనిమిది పురుషుల డబుల్స్ మరియు పది మిక్స్‌డ్ డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్‌స్ సాధించిన ఘనత కలిగి ఉన్నాడు. పేస్ తర్వాత ఇండియా నుండి మహేష్ భూపతి అత్యధికంగా 12 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించాడు, వీటిలో నాలుగు పురుషుల డబుల్స్ మరియు ఎనిమిది మిక్స్‌డ్ డబుల్స్ ఉన్నాయి.

ఇండియా నుండి గ్రాండ్ స్లామ్ సాధించిన ఘనత సానియా మీర్జా దక్కించుకుంది. ఆమె కెరీర్ మొత్తంలో ఆరు ప్రధాన టైటిళ్లను గెలుచుకుంది. వాటిలో మూడు మహిళల డబుల్స్‌ మరియు మూడు మిక్స్‌డ్ డబుల్స్‌ టైటిల్స్ ఉన్నాయి.

వివాదాస్పద ఆన్‌లైన్ భద్రతా బిల్లును ఆమోదించిన శ్రీలంక

వివాదాస్పద ఆన్‌లైన్ సేఫ్టీ బిల్లుకు శ్రీలంక పార్లమెంటు జనవరి 24న కొన్ని సవరణలతో ఆమోదం తెలిపింది. ఈ బిల్లు సోషల్ మీడియా కంటెంట్ పైన నిఘా ఉంచడంతో పాటుగా ఆన్‌లైన్ కంటెంట్‌ను నియంత్రిస్తుంది. అయితే ఇది వాక్ స్వాతంత్య్రాన్ని అణిచివేస్తుందని ప్రతిపక్షాల విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఏడాది పార్లమెంటరీ మరియు అధ్యక్ష ఎన్నికల ముందు ప్రభుత్వం అసమ్మతిని అణిచివేసేందుకు మరియు వాక్ స్వాతంత్య్రాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని పౌర హక్కుల సంఘాలు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఈ ఆన్‌లైన్ భద్రతా బిల్లు ప్రకారం, ఆన్‌లైన్ కంటెంట్‌ సమీక్ష కోసం ఐదుగురు సభ్యుల కమిషన్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ కమిషన్ చట్టవిరుద్ధమైన విషయాలను పోస్ట్ చేస్తున్నట్లు భావించిన కంటెంట్ సృష్టికర్తలకు జైలు శిక్ష లేదా జరిమానా విదిస్తుంది. ఇది తమ ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేసిన కంటెంట్‌కు గూగుల్, ఫేస్బుక్ మరియు ట్విట్టర్  వంటి కంపెనీలను కూడా జవాబుదారీగా ఉంచుతుంది.

ఈ బిల్లు 108-62 ఓట్ల తేడాతో ఆమోదించబడింది. ప్రభుత్వం ఈ బిల్లును పిల్లల దుర్వినియోగం, డేటా చౌర్యం మరియు ఆన్‌లైన్ మోసంతో సహా సైబర్ క్రైమ్‌లను పరిష్కారం కోసం రూపొందించినట్లు వాదిస్తుంది. హానికరమైన కంటెంట్‌ను పరిష్కరించడానికి మరియు సురక్షితమైన ఆన్‌లైన్ స్పేస్‌లను ప్రోత్సహించడానికి ఇది ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుందని పేర్కొంది.

మానవ హక్కుల సంఘాలు మరియు జర్నలిస్టులతో సహా విమర్శకులు, ఇది భావప్రకటనా స్వేచ్ఛను అణిచివేస్తుందని మరియు ప్రభుత్వ సెన్సార్‌షిప్‌ను అనుమతిస్తుంది అని భయపడుతున్నారు. ఆన్‌లైన్ సేఫ్టీ కమీషన్‌కు మంజూరు చేయబడిన విస్తృత అధికారాల గురించి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లులోని నేరాలకు భారీ జరిమానాలు మరియు ఐదేళ్ల వరకు జైలు శిక్షవిధించబడుతుంది.

80 మంది సాయుధ దళాల సిబ్బందికి గ్యాలంట్రీ అవార్డులు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 75 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 80 మంది సాయుధ దళాల సిబ్బందికి గ్యాలంట్రీ అవార్డులను ఆమోదించారు. ఈ ఏడాది 12 మందికి మరణానంతరం ఈ అవార్డులు కేటాయించారు. వీటిలో 6 కీర్తి చక్రా అవార్డులు, 16 శౌర్య చక్రా అవార్డులు సహా 53 సేన పతకాలు ఉన్నాయి.

అలానే వీటిలో ఒక నావో సేన పతకం (శౌర్యం) మరియు నాలుగు వాయు సేన పతకాలు (శౌర్యం) తో పాటుగా సాయుధ దళాలు మరియు ఇతర సిబ్బందికి 311 రక్షణ అలంకరణలను అందజేశారు. వీటిలో 31 పరమ విశిష్ట సేవా పతకాలు, 4 ఉత్తమ యుద్ధ సేవా పతకాలు, 59 అతి విశిష్ట సేవా పతకాలు, 10 యుద్ధ సేవా పతకాలు, 38 సేన పతకాలు, 10 నావో సేన పతకాలు, 14 వాయు సేన పతకాలు, 130 విశిష్ట సేవా పతకాలు ఉన్నాయి.

అవార్డు గ్రహీత సాయుధదళం
కీర్తి చక్ర అవార్డులు
1. మేజర్ దిగ్విజయ్ సింగ్ రావత్ ఆర్మీ
2. మేజర్ దీపేంద్ర విక్రమ్ బాస్నెట్ ఆర్మీ
3. కెప్టెన్ అన్షుమాన్ సింగ్ ( మరణానంతరం ) ఆర్మీ
4. హవిల్దార్ పవన్ కుమార్ యాదవ్ ఆర్మీ
5. హవీల్దార్ అబ్దుల్ మజీద్ ( మరణానంతరం ) ఆర్మీ
6. సిపాయి పవన్ కుమార్ ( మరణానంతరం ) ఆర్మీ
శౌర్య చక్ర అవార్డులు
1. మేజర్ మానియో ఫ్రాన్సిస్ ఆర్మీ
2. మేజర్ అమందీప్ జఖర్ ఆర్మీ
3. కెప్టెన్ ఎంవి ప్రాంజల్ ( మరణానంతరం ) ఆర్మీ
4. కెప్టెన్ అక్షత్ ఉపాధ్యాయ్ ఆర్మీ
5. సంజయ్ కుమార్ భామర్ సిన్హ్ ఆర్మీ
6. హవిల్దార్ సంజయ్ కుమార్ ఆర్మీ
7. రైఫిల్‌మ్యాన్ అలోక్ రావు ఆర్మీ
8. పర్షోతం కుమార్ ఆర్మీ (సివిలియన్)
9. కె లెఫ్టినెంట్ బిమల్ రంజన్ బెహెరా నౌకాదళం
10. వింగ్ కమాండర్ శైలేష్ సింగ్ వాయు సైన్యము
11. ఫ్లైట్ లెఫ్టినెంట్ హృషికేష్ జయన్ కరుతేదత్ వాయు సైన్యము
12. అసిస్టెంట్ కమాండెంట్ బిభోర్ కుమార్ సింగ్ సీఆర్పీఎఫ్
13. ఎస్పీ మోహన్ లాల్ జమ్మూ &కాశ్మీర్  పోలీస్
14. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ అమిత్ రైనా జమ్మూ &కాశ్మీర్  పోలీస్
15. సబ్ ఇన్‌స్పెక్టర్ ఫరోజ్ అహ్మద్ దార్ జమ్మూ &కాశ్మీర్  పోలీస్
16. కానిస్టేబుల్ వరుణ్ సింగ్ జమ్మూ &కాశ్మీర్  పోలీస్

సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలను ప్రారంభించిన ప్రధాన మంత్రి

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, ఢిల్లీలోని సుప్రీంకోర్టు ఆడిటోరియంలో జ‌న‌వ‌రి 28న భార‌త అత్యున్న‌త న్యాయ‌స్థానం వ‌జ్రోత్సవ వేడుక‌లను ప్రారంభించారు. ఇదే వేదిక ద్వారా డిజిటల్ సుప్రీం కోర్టు నివేదికలు (డిజి ఎస్‌సిఆర్), డిజిటల్ కోర్టులు 2.0 మరియు సుప్రీంకోర్టు కొత్త వెబ్‌సైట్ కూడా లాంచ్ చేశారు.

డిజిటల్ సుప్రీం కోర్ట్ నివేదికలు (ఎస్‌సిఆర్) సుప్రీంకోర్టు తీర్పులను దేశంలోని పౌరులకు ఉచితంగా మరియు ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచుతుంది. ఇది 1950 నుండి సుప్రీం కోర్ట్ నివేదికల యొక్క మొత్తం 519 వాల్యూమ్‌ల డేటాను డిజిటల్ ఫార్మాట్‌లోకి అందుబాటులోకి తెస్తుంది. అలానే 36,308 కేసుల తీర్పులను కూడా పబ్లిక్ డొమైన్ యందు అందుబాటులో ఉంచుతుంది. పౌరులు యూజర్ ఫ్రెండ్లీ మరియు ఓపెన్ యాక్సెస్‌తో వీటిని ఉపయోగించుకోవచ్చు.

డిజిటల్ కోర్టులు 2.0 అప్లికేషన్ అనేది ఎలక్ట్రానిక్ రూపంలో జిల్లా కోర్టుల న్యాయమూర్తులకు కోర్టు రికార్డులను అందుబాటులో ఉంచడానికి ఇటీవలే ఇ-కోర్టుల ప్రాజెక్ట్ కింద చేపట్టిన చొరవ. ఇది నిజ-సమయ ప్రాతిపదికన ప్రసంగాన్నిఅక్షర రూపంలో లిప్యంతరీకరించడానికి కృత్రిమ మేధస్సు (ఎఐ)ని ఉపయోగిస్తుంది. అలానే సుప్రీంకోర్టు యొక్క కొత్త వెబ్‌సైట్ కూడా ఇంగ్లీష్ మరియు హిందీభాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ సంధర్బంగా ప్రసంగించిన ప్రధాని మోడీ, న్యాయస్థానాల భౌతిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం కోసం గత 9 ఏళ్లలో 7000 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించినట్లు వెల్లడించారు. ప్రస్తుత సుప్రీంకోర్టు భవనంలోని సమస్యలను గుర్తిస్తూ, సుప్రీంకోర్టు బిల్డింగ్ కాంప్లెక్స్ విస్తరణకు మరో 800 కోట్లకు గత వారం ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.

2047 నాటికి విక్షిత్‌ భారత్‌గా మారాలన్న భారత దృక్పథాన్ని సాకారం చేయడంలో పౌరులందరి సమిష్టి బాధ్యతను ప్రధాని మోదీ మరోమారు పునరుద్ఘాటించారు. రాబోయే 25 ఏళ్లలో దేశ భవిష్యత్తును రూపొందించడంలో సుప్రీంకోర్టు పోషించనున్న ముఖ్యమైన పాత్రను గుర్తిస్తూ, ఆ సంస్థను అభినందిస్తూ ఆయన ప్రసంగం ముగించారు. అలానే జెస్టిస్ ఎం. ఫాతిమా బీవీకి మరణానంతరం పద్మభూషణ్‌ను ప్రదానం చేయడాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు.

ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ డివై చంద్రచూడ్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా మరియు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఆదిష్ సి అగర్వాల్ మరియు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రాలు పాల్గొన్నారు.

భారత్ మండపంలో 7వ పరీక్షా పే చర్చా కార్యక్రమం

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ జనవరి 29న న్యూ ఢిల్లీలోని భార‌త్ మండ‌పంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు త‌ల్లిదండ్రుల‌తో ప‌రీక్ష పే చర్చా 7వ ఎడిష‌న్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాది కార్యక్రమం కోసం మై గోవర్నమెంట్ పోర్టల్ ద్వారా 2.26 కోట్ల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. 16 ఫిబ్రవరి 2018 లో ప్రారంభించిన ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమం, యేటా వార్షిక సంప్రదాయంగా మారింది. పబ్లిక్ పరీక్షల మందు పాఠశాల విద్యార్థులకు మానసిక ధైర్యాన్ని, పరీక్షల మెళుకువలు చెప్పేందుకు ప్రధాని మోడీ ఈ కార్యక్రమం ప్రారంభించారు.

ప్రధాని నరేంద్ర మోదీ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 3000 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు హాజరయ్యారు. పరీక్షా పే చర్చా 2024 కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులతో సంభాషిస్తూ, జీవితంలో ఎలాంటి సవాళ్లు లేకుంటే, జీవితం స్ఫూర్తిదాయకంగా మరియు నిరుత్సాహకరంగా మారుతుందని మోదీ అన్నారు. విద్యార్థుల సవాళ్లను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమష్టిగా పరిష్కరించాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లల రిపోర్ట్ కార్డులను తమ విజిటింగ్ కార్డ్‌గా చేసుకోవద్దని ఆయన మనవి చేశారు.

ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకునేలా పిల్లలను తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ అన్నారు. జీవితంలో ఒత్తిడి ఒక భాగమని, దాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని, పిల్లల ఒత్తిడిని తగ్గించడంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర అని గుర్తుచేశారు. విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల మధ్య బంధం సిలబస్ మరియు పాఠ్యాంశాలకు అతీతంగా ఉండాలని, విద్యార్థుల సవాళ్లను తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు సమిష్టిగా పరిష్కరించాలని ప్రధాన మంత్రి కోరారు.

ఫిట్‌నెస్‌కు సమతుల్య ఆహారం మరియు వ్యాయామం చాలా ముఖ్యమైనవి అని ప్రధాన మంత్రి అన్నారు. ఆరోగ్యవంతమైన మనస్సుకు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరమని ఆయన అన్నారు. సరైన నిద్ర కూడా చాలా ముఖ్యమని మోదీ అన్నారు. మొబైల్ టెక్నాలజీ ప్రయోజనాలను వినియోగించుకుంటూ పరీక్షల ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించేలా విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, ప్రోత్సహిస్తూ, భారంగా భావించే బదులు సాంకేతికతను తెలివిగా ఉపయోగించుకోవాలని మోదీ నొక్కి చెప్పారు.

విద్యార్థులు నిర్ణయాత్మకంగా ఉండేలా అలవాటును పెంపొందించుకోవాలని ప్రధాన మంత్రి కోరారు. ఏదైనా గందరగోళం ఉంటే మాట్లాడి పరిష్కరించుకుని ముందుకు సాగాలని అన్నారు. పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య నమ్మకానికి లోటు ఉండకూడదని, విద్యార్థులు సమాధానాలు రాయడాన్ని వీలైనంత వరకు ప్రాక్టీస్ చేయాలని, ప్రాక్టీస్ చేస్తే పరీక్ష హాల్ ఒత్తిడి చాలా వరకు దూరమవుతుందని ఆయన అన్నారు.

వర్తమాన మరియు భవిష్యత్తు తరాలు ప్రకాశించే మరియు తమ సామర్థ్యాలను చూపించే అవకాశం ఉన్న దేశాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కూడా ప్రధాన మంత్రి అన్నారు. ఏదైనా చేయాలనే సంకల్పం దృఢంగా ఉంటేనే నిర్ణయం తీసుకోవడం సులభమవుతుందని అన్నారు.

స్వార్థం లేనప్పుడు నిర్ణయంలో గందరగోళం ఉండదని, తన పదేళ్ల పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. యువత నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. పరీక్షా పే చర్చా కార్యక్రమం ప్రజాఉద్యమంగా మారిందన్నారు.

Advertisement

Post Comment