Advertisement
10వ తరగతి తర్వాత పాలిటెక్నిక్ డిప్లొమా
Career Guidance Career Options

10వ తరగతి తర్వాత పాలిటెక్నిక్ డిప్లొమా

టెన్త్ క్లాస్ పూర్తి చేశాక మెజారిటీ విద్యార్థులు ఎంపిక చేసుకునే కెరీర్ ఎంపికలలో పాలిటెక్నిక్ డిప్లొమాకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. 10వ తరగతి తర్వాత సాంకేతిక విద్య వైపు వెళ్లాలనుకునే వారికి పాలిటెక్నిక్ కోర్సులు చక్కని ప్రత్యామ్నాయం. కేవలం మూడేళ్ళలో టెక్నికల్ డిప్లొమా పొంది, ఉద్యోగ అన్వేషణ ప్రారంభించవచ్చు లేదా ఉన్నత విద్య కోసం ప్రయత్నించవచ్చు.

పాలిటెక్నిక్ కోర్సులు మొదటిలో ఉన్నత విద్యకు అవకాశం లేని గ్రామీణప్రాంత విద్యార్థులకు, టెన్త్ క్లాస్ తర్వాత టెక్నికల్ విద్యను అందించాలనే లక్ష్యంతో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ కోర్సులకు అన్ని వర్గాల నుండి డిమాండ్ పెరిగింది.

పాలిటెక్నిక్ కోర్సులు ఒక అప్పుడు వృత్తి విద్య కోర్సులుగా రాజ్యమేలేవి, పాలిటెక్నిక్ తర్వాత మెజారిటీ విద్యార్థులు ఉద్యోగ అన్వేషణలో పడేవారు. నేడు వీటిని బ్యాచిలర్ ఇంజనీరింగుకు ముందు బ్రిడ్జి కోర్సులుగా పరిగణించే వారి సంఖ్యా పెరుగుతుంది. ప్రస్తుతం మెజారిటీ విద్యార్థులు పాలిటెక్నిక్ తర్వాత ఈసెట్ ద్వారా బీటెక్ చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. ఏది ఏమైనా పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఏపీ తెలంగాణాలో పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్

ఇండియాలో పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్

ఇండియాలో పాలిటెక్నిక్ కోర్సులను డిప్లొమా కోర్సులుగా పరిగణిస్తారు. ఇవి మూడేళ్ళ నిడివితో టెక్నిక్ డిప్లొమా మరియు నాన్ టెక్నికల్ డిప్లొమా కోర్సుల రూపంలో అందుబాటులో ఉంటాయి. టెక్నిక్ డిప్లొమా కోర్సులను డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కోర్సులుగా, నాన్ టెక్నికల్ డిప్లొమా కోర్సులను డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కోర్సులుగా పరిగణిస్తారు.

పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ సెమిస్టరు పద్దతిలో అందిస్తారు. రెండు/మూడేళ్ళలో విద్యార్థులు మొత్తం నాలుగు/ఆరు సెమిస్టర్లకు హాజరు కావాల్సి ఉంటుంది. ఒక సెమిస్టరు యందు తప్పిన విద్యార్థులు, తర్వాత ఏడాది అదే సెమిస్టరు యందు పూర్తి చేయాల్సి ఉంటుంది. పాలిటెక్నిక్ కోర్సులు ఇంజనీరింగ్, అగ్రికల్చర్ సబ్జెక్టులకు సంబంధించి ప్రాథమిక స్థాయి ఆచరణాత్మక జ్ఞానాన్ని బోధిస్తాయి. ఒక్కో సెమిస్టరు యందు నాలుగు నుండి ఆరు పేపర్లు బోధిస్తారు. వీటికి అదనంగా ప్రాక్టీకల్ పేపర్లు ఉంటాయి.

ఇండియాలో పాలిటెక్నిక్ విద్యను ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) మరియు స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ & ట్రైనింగ్ ద్వారా అందిస్తారు. ఈ కోర్సుల అడ్మిషన్లు ప్రవేశ పరీక్ష ద్వారా నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్షలు రాష్ట్రాల పరిధిలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష రాసేందుకు కనీసం టెన్త్ పూర్తి చేసి ఉండాలి.

పాలిటెక్నిక్ కోర్సుల ఉపయోగాలు

పాలిటెక్నిక్ కోర్సులు వృత్తి విద్య నైపుణ్యాలను అందిస్తాయి. కేవలం పది పూర్తి చేసిన మూడేళ్లో టెక్నికల్ డిప్లొమాతో ఉద్యోగ అన్వేషణ చేసే అవకాశం ఈ కోర్సులు కల్పిస్తాయి. డిప్లొమా విద్యార్థులకు ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాలలో మెండుగా ఉద్యోగాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇండియన్ రైల్వే, పబ్లిక్ సెక్టార్ కంపెనీలు, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇతర ఇంజనీరింగ్ అంగాలలో వీరికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

  • పాలిటెక్నిక్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సులను అందిస్తుంది.
  • పాలిటెక్నిక్ కోర్సులు ప్రాక్టికల్ మరియు ప్రొఫెషనల్ పరిజ్ఞానాన్ని అందిస్తాయి.
  • పాలిటెక్నిక్ కోర్సులు తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో పూర్తి చేయొచ్చు.
  • పాలిటెక్నిక్ కోర్సులు 10 లేదా 12వ తరగతి తర్వాత ఇంజినీరింగ్ డిప్లొమాను అందిస్తాయి.
  • డిప్లొమా హోల్డర్లను జూనియర్ ఇంజనీర్లుగా పరిగణిస్తారు.
  • జూనియర్ ఇంజినీరు హోదాలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • పాలిటెక్నిక్ లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్‌లో ప్రవేశం పొందే అవకాశం ఉంది

ఏపీ & టీఎస్ అందిస్తున్న పాలిటెక్నిక్ కోర్సులు

ఏపీ & తెలంగాణ రాష్ట్రాలలో పాలిటెక్నిక్ కోర్సులు రెండు కేటగిర్లుగా అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకరకం టెక్నికల్/ఇంజనీరింగ్ డిప్లొమాలు కాగా మిగతా వాటిని నాన్ టెక్నికల్/అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులుగా పరిగణిస్తారు.

టెక్నికల్/ఇంజనీరింగ్ డిప్లొమాలు

సివిల్ ఇంజనీరింగ్
ఆర్కిటెక్చరల్ & అసిస్టెంట్షిప్
మెకానికల్ ఇంజనీరింగ్
ఆటోమొబైల్ఇంజినీరింగ్
ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్ & ఇనుస్ట్రుమెంటాషన్ ఇంజనీరింగ్
కంప్యూటర్ ఇంజనీరింగ్
మైనింగ్ ఇంజనీరింగ్
కమర్షియల్ & కంప్యూటర్ ప్రాక్టీస్
గార్మెంట్ టెక్నాలజీ
హోమ్ సైన్స్
మెటలర్జికల్ ఇంజనీరింగ్
కెమికల్ ఇంజనీరింగ్
ప్రింటింగ్ టెక్నాలజీ
ప్యాకేజింగ్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్ & వీడియో ఇంజనీరింగ్
బయో మెడికల్ ఇంజనీరింగ్
లెథర్ టెక్నాలజీ
ఫుట్‌వేర్‌ టెక్నాలజీ
టెక్స్‌టైల్ టెక్నాలజీ
ఎంబెడెడ్ సిస్టమ్స్

అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులు

యూనివర్సిటీ  (ఏపీ & తెలంగాణ) అందిస్తున్న కోర్సులు
ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (రెండేళ్లు)
డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ (రెండేళ్లు)
డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ (రెండేళ్లు)
డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ (మూడేళ్లు)
డా వైఎస్సార్ హార్టీకల్చర్ యూనివర్సిటీ డిప్లొమా ఇన్  హార్టీకల్చర్ (రెండేళ్లు)
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ డిప్లొమా ఇన్  యానిమల్ హస్బెండరీ (రెండేళ్లు)
ఏపీ ఫిషరీ యూనివర్సిటీ డిప్లొమా ఇన్ ఫిషరీ సైన్సెస్ (రెండేళ్లు)
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (రెండేళ్లు)

డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (రెండేళ్లు)

డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ (మూడేళ్లు)

పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ఆనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ డిప్లొమా (రెండేళ్లు)

ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా (రెండేళ్లు)

పాలిటెక్నిక్ ఇంటిగ్రేటెడ్ కోర్సులు (డిప్లొమా + ఇంజనీరింగ్)

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ 6 ఏళ్ళ ఇంటిగ్రేటెడ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును రెండు అంచెలలో అందిస్తున్నారు. మొదటి రెండేళ్లు ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూపును, తరువాత నాలుగేళ్లు ఇంజనీరింగ్ కోర్సును (బీటెక్) ఆఫర్ చేస్తారు. రెండేళ్ల ప్రీ యూనివర్సిటీ కోర్సును పూర్తిచేసిన వారు ఇంజనీరింగ్ కోసం ఎటువంటి ప్రవేశపరీక్ష రాయాల్సిన అవసరం ఉండదు.

రెండేళ్ల ప్రీ యూనివర్సిటీ కోర్సు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు/సంస్కృతం
నాలుగేళ్ళ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్
సివిల్ ఇంజనీరింగ్
కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్
మెటలర్జికల్ & మెటీరియల్స్ ఇంజనీరింగ్
మెకానికల్ ఇంజనీరింగ్.

ఏపీ & టీఎస్ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలు

ఏపీ & తెలంగాణ రాష్ట్రాలు, పాలిటెక్నిక్ ప్రవేశాల కోసం విడివిగా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల కోసం విడివిడిగా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం ఒకే పరీక్ష పేరుతో రెండు కోర్సులలో అడ్మిషన్లు నిర్వహిస్తుంది.

పాలిటెక్నిక్ అడ్మిషన్ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షను పాలీసెట్ అంటారు, పాలీసెట్ అనగా పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అర్ధం. ఈ ప్రవేశ ప్రకటన టెన్త్ క్లాస్ ఫలితాలకు ముందు లేదా తర్వాత స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా వెలువడుతుంది. ఈ పరీక్షకు హాజరయ్యేందుకు కనీసం పది ఉత్తీర్ణత పొంది ఉండాలి.

పాలిటెక్నిక్ అడ్మిషన్లు పాలీసెట్ యందు సాధించిన మెరిట్ ఆధారంగా నిర్వహిస్తారు. రెండు రాష్ట్రాలు విడివిగా నిర్వహించే ఈ పరీక్షలకు రెండు రాష్ట్రాల విద్యార్థులు హాజరయ్యేందుకు అర్హులు.

పాలిటెక్నిక్ తర్వాత కెరీర్ అవకాశాలు

పాలిటెక్నిక్ మూడేళ్ళ కోర్సును చేసిన విద్యార్థులకు రెండు రెండు కెరీర్ మార్గాలు అందుబాటులో ఉంటాయి. అందులో మొదటి డిప్లొమా అర్హుతతో ఉద్యోగ వేట మొదలు పెట్టాలి. రెండవది లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్‌లో జాయిన్ అవ్వడం లేదా ఇతర బ్యాచిలర్ డిగ్రీలలో ప్రవేశం పొందటం ద్వారా ఉన్నత విద్యను పూర్తిచేయాలి.

పాలిటెక్నిక్ తర్వాత పబ్లిక్ & ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాలు

పాలిటెక్నిక్ తర్వాత ఉద్యోగ వేట మొదలు పెట్టేవారికి ప్రభుత్వ, పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ యందు జూనియర్ ఇంజనీర్/జూనియర్ ట్రైనీ స్థాయి ఉద్యోగాలు చేసే అవకాశం లభిస్తుంది. ఈ ఉద్యోగ ప్రకటనలు సంవత్సరం పొడుగునా వెలువడుతూనే ఉంటాయి. ఈ ఉద్యోగ ప్రకటలు ఎంప్లాయిమెంట్ న్యూస్ లేదా ఆ సంబంధిత సంస్థల పోర్టల్స్ యందు అందుబాటులో ఉంటాయి.

  • ఇండియన్ రైల్వే
  • త్రివిధ దళాలు
  • గెయిల్ - గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్
  • ONGC - ఆయిల్ & నేచురల్ గ్యాస్ కార్పొరేషన్
  • DRDO - రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ
  • BHEL - భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
  • NTPC - నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్
  • BSNL - భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్
  • ఇరిగేషన్ డిపార్టుమెంట్ నియామకాలు
  • NSSO - నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్
  • IPCL - ఇండియన్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్
  • విమానయాన సంస్థలు - ఇండిగో, స్పైస్‌జెట్, జెట్ ఎయిర్‌వేస్ మొదలైనవి.
  • నిర్మాణ సంస్థలు – యూనిటెక్, DLF, జేపీ అసోసియేటెడ్, GMR ఇన్‌ఫ్రా, మిటాస్, మొదలైనవి.
  • కమ్యూనికేషన్ సంస్థలు – భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఐడియా సెల్యులార్ మొదలైనవి.
  • కంప్యూటర్ ఇంజనీరింగ్ సంస్థలు – TCS, HCL, Wipro, Polaris, మొదలైనవి.
  • ఆటోమొబైల్స్ - మారుతీ సుజుకి, టయోటా, టాటా మోటార్స్, మహీంద్రా, బజాజ్ ఆటో, మొదలైనవి.
  • ఎలక్ట్రికల్ / పవర్ సంస్థలు – టాటా పవర్, BSES, సీమెన్స్, L&T, మొదలైనవి.
  • మెకానికల్ ఇంగ్లండ్ సంస్థలు – హిందుస్థాన్ యూనిలీవర్, ACC లిమిటెడ్, వోల్టాస్

AIME సర్టిఫికెట్ డిగ్రీ

ఉద్యోగం చేస్తూనే, ఉన్నత విద్యను పూర్తి చేసే అవకాశం వీరికి ఉంటుంది. ఇంజినీరింగ్ డిప్లొమా హోల్డర్లు అసోసియేట్ మెంబెర్ ఆఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (AIME) సర్టిఫికేషన్ కోర్సును పూర్తి చేయడం ద్వారా బీటెక్ డిగ్రీకి సమానమైన హోదాను పొందొచ్చు. ఈ డిగ్రీ ఉద్యోగ పదోన్నతి లేదా పై స్థాయి ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అవకాశం కల్పిస్తుంది.

పాలిటెక్నిక్ తర్వాత స్వయం ఉపాధి

పాలిటెక్నిక్ తర్వాత ఉద్యోగం, ఉన్నత విద్య రెండు ఇష్టపడని వారు స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించవచ్చు. ఇలాంటి వారు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం లేదా సొంత పెట్టుబడితో సంబంధిత ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఇనిస్టిట్యూట్లు, గ్యారేజ్, వర్క్ షాపులు వంటివి ప్రారంభించి మీతో పాటు మరో పది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించొచ్చు.

పాలిటెక్నిక్ తర్వాత లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్

పాలిటెక్నిక్ తర్వాత ఉన్నత విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ రెండవ ఏడాదిలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. దీని కోసం రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో నిర్వహించే వివిధ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు హాజరవ్వడం ద్వారా ఈ అవకాశం అందిపుచ్చుకోవచ్చు. దీనికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు ఈసెట్ పేరుతొ ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష కూడా నిర్వహిస్తాయి.

ఈసెట్ అర్హుత సాధించిన విద్యార్థులు AICTE గుర్తింపు పొందిన అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ టెక్నికల్ ఇన్టిట్యూట్లలో అడ్మిషన్ పొందొచ్చు. ఈసెట్ ప్రవేశపరీక్ష పూర్తి ఆన్‌లైన్ విధానంలో జరపబడుతుంది. 3 గంటల కాలవ్యవధి ఉన్న ఈ ప్రశ్నపత్రంలో మొత్తం 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇవ్వబడతాయి.

ఈసెట్ లో అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా అడ్మిషన్ ప్రక్రియ నిర్వహించబడుతుంది. వివిధ ఇంజనీరింగ్ బ్రాంచులకు సంబంధించి జరిగే సీట్లు కేటాయింపులో ఆయా బ్రాంచుల్లో డిప్లొమా ఉత్తీర్ణతన సాధించిన మెరిట్ అభ్యర్థులకు మాత్రమే మొదటి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. ఇంజనీరింగ్ కాకుండా ఇతర బ్యాచిలర్ డిగ్రీలు చేసే అవకాశం కూడా వీరికి ఉంటుంది. వీటికి సంబంధించిన అడ్మిషన్ సమాచారం ఆయా యూనివర్సిటీ పరిధిలో అందుబాటులో ఉంటుంది.

Post Comment