ఫోటోగ్రఫీ ఒకప్పుడు అభిరుచితో కూడుకున్న వ్యాపకం మాత్రమే, ప్రస్తుతం దీనిని వృత్తిగా స్వీకరించి కెరీర్ పరంగా రాణించే వారి సంఖ్యా ఏటా పెరుగుతుంది. ఫోటోగ్రఫీని కెరీరుగా ఎన్నుకున్న వారు ఫోటో జర్నలిస్ట్‌లుగా, ఫీచర్ ఫోటోగ్రాఫర్లుగా, ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్లుగా, స్టాక్ ఫోటోగ్రాఫర్లుగా, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్లుగా, కమర్షియల్ ఫోటోగ్రాఫర్లుగా, ఫాషన్ ఫోటోగ్రాఫర్లుగా రాణించేందుకు అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
-
ఫోటోగ్రఫీ కెరీర్ అవకాశాలు
-
ఇండియాలో ఫోటోగ్రఫీ కోర్సులు & యూనివర్సిటీలు
-
ఫోటోగ్రఫీ రకాలు & ఉపాధి మార్గాలు
-
ఫోటో జర్నలిజం & ఉపాధి అవకాశాలు
-
ఫీచర్ ఫోటోగ్రఫీ & కెరీర్ అవకాశాలు
-
ట్రేడ్ & అడ్వర్టైజింగ్ ఫోటోగ్రఫీ
-
ఫ్యాషన్ ఫోటోగ్రఫీ & కెరీర్ అవకాశాలు
-
వెడ్డింగ్ ఫోటోగ్రఫీ & కెరీర్ అవకాశాలు
-
సినిమాటోగ్రఫీ & కెరీర్ అవకాశాలు
-
ఫోటోగ్రఫీ ఉపాధి అవకాశాలు
-
మీ ఫోటోలు సేల్ చేయండి
ఫోటోగ్రఫీ కెరీర్ అవకాశాలు
ఫోటోగ్రఫీ అనేది ఆప్షనల్ కెరీర్ మార్గం కాదు. ఫోటోగ్రఫీ రంగం చాలా వైవిధ్యభరితమైనది. ఆసక్తి, అభిరుచి ఉన్నవారు మాత్రమే దీని యందు రాణించగలరు. ఒక చిన్న లెన్స్ ద్వారా ప్రపంచాన్ని బంధించగల ఫోటోగ్రాఫర్లకు అపరిమితమైన సృజనాత్మకత ఉండాలి. రాతలు, మాటలు ద్వారా చెప్పలేని సున్నితమైన దృశ్యాలను కూడా ఒక ఫోటో ద్వారా చూపించే నైపుణ్యం కలిగివుండాలి.
భారతదేశం డిజిటల్ యుగం నడుస్తుంది. భవిష్యత్తులో ఫోటోగ్రఫీ అత్యధిక డిమాండ్ ఉన్న వృత్తులలో ఒకటిగా మారనుంది. ప్రకటనలు, మీడియా మరియు ఫ్యాషన్ పరిశ్రమలో ఫొటోగ్రాపర్లకు అపారమైన అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రోఫిసినల్ ఫొటోగ్రాపర్లకు ఈ రంగంలో లాభదాయకమైన వ్యాపార మరియు ఉపాధి అవకాశాలను దక్కించుకోవచ్చు.
పరిశ్రమలో ఫోటోగ్రాఫర్లకు భారీ స్కోప్ ఉంది. ప్రొఫిషినల్ ఫోటోగ్రాఫర్లకు వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్, ఫిల్మ్ & ఫాషన్ ఇండస్ట్రీ, ఈకామర్స్ మరియు టెలివిజన్ రంగాల్లో అవకాశాలకు కొదవ లేదు. వీటితో పాటుగా ఫిలాన్సు ఫోటోగ్రఫీ, స్టాక్ ఫోటోగ్రఫీ, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, ట్రావెల్ ఫోటోగ్రఫీ, సోషల్ మీడియా ఫోటోగ్రఫీ ద్వారా స్వయం ఉపాధిని పొందొచ్చు.
దేశంలో సగటు ఫొటోగ్రాపర్ ఏడాదికి 3 లక్షల నుండి గరిష్టంగా 6 లక్షల వరకు వార్షిక వేతనం పొందుతున్నారు. స్వయం ఉపాధి పొందుతున్న వారు దానికి మించి సంపాదిస్తున్నారు. సగటున నెలకు 60వేల నుండి గరిష్టంగా రెండు లక్షలు ఆదాయం ఆర్జిస్తున్నారు.
ఇండియాలో ఫోటోగ్రఫీ కోర్సులు & యూనివర్సిటీలు
ఇండియాలో ఫోటోగ్రఫీ కోర్సులు ఇంటర్మీడియట్ (10+2) తర్వాత అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ తర్వాత విద్యార్థుల ఆసక్తి బట్టి సర్టిఫికెట్, డిప్లొమా మరియు బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఫోటోగ్రఫీ కోర్సులు చేసే అవకాశం ఉంటుంది. ఏపీలో ఏడీసెట్ ద్వారా డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ యందు బ్యాచిలర్ ఆఫ్ ఫొటోగ్రఫీ యందు ప్రవేశాలు కల్పిస్తున్నారు. అలానే ఆంధ్ర యూనివర్సిటీ 6 నెలల నిడివితో డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ కోర్సును ఆఫర్ చేస్తుంది.
తెలంగాణాలో ఉస్మానియా, జేఎన్టీయూ ద్వారా బీఏ ఫోటోగ్రఫీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అదే విదంగా జాతీయ స్థాయిలో పదుల సంఖ్యలో యూనివర్సిటీలు మరియు ఫిలిం ఇనిస్టిట్యూట్లు ప్రొఫిషినల్ ఫోటోగ్రఫీ కోర్సలను అందిస్తున్నాయి. ఈ కోర్సులు సాధారణంగా ఫైన్ ఆర్ట్స్ లేదా మీడియా & మాస్ కమ్యూనికేషన్ కేటగిరిలో అందిస్తారు. ఆసక్తి ఉన్నవారు ఆయా యూనివర్సిటీల ద్వారా దరఖాస్తు చేసుకొండి.
ఫోటోగ్రఫీ రకాలు & ఉపాధి మార్గాలు
ఫోటోగ్రఫీ ఖచ్చితంగా ఇన్ని రకాలు అంటూ చెప్పడం కష్టం. ఫోటోగ్రఫీ చేసే ఇండస్ట్రీ అనుచరించి దీనిని వివిధ రకాలుగా వర్గీకరిస్తారు. ఇందులో సినిమాటోగ్రఫీ, ఫోటో జర్నలిజం, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ, స్టిల్ లైఫ్ ఫోటోగ్రఫీ, ఎడిటోరియల్ ఫోటోగ్రఫీ, ట్రావెల్ ఫొటోగ్రఫీ, ఆర్కిటెక్చరల్ ఫోటోగ్రఫీ వంటి విభిన్న రకాలు ఉంటాయి.
ఫొటోగ్రాఫర్ల ఉపాధి అవకాశాలు వారి యొక్క వృత్తి నైపుణ్యాలపైనా ఆధారపడి ఉంటాయి. ఉపాధి అవకాశాల కోసం వెదికే ముందు వృత్తి యందు పూర్తిస్థాయి నైపుణ్యం పొందాల్సి ఉంటుంది. దీని కోసం సీనియర్ లేదా ప్రొఫిషినల్ ఫొటోగ్రాపర్ల వద్ద ఇంటెర్షిప్ చేయడం లేదా ఫ్రీలాన్సు ఫోటోగ్రఫీ ద్వారా వృత్తి అనుభవం పొందాల్సి ఉంటుంది. ఈ వృత్తి అనుభవం సంబంధిత రంగంలో స్థిరపడేందుకు అవకాశం కల్పిస్తుంది.
ఫోటోగ్రాఫర్‌లకు తమ పని యందు ఓపిక, అంకితభావం అవసరం, ఎందుకంటే ఫోటోగ్రఫీ సృజనాత్మకమైన వృత్తి. దాని యందు ఫలితం సాధించడానికి సమయం, కృషి మరియు డబ్బు పెట్టుబడి అవసరం. ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఒక అద్భుతమైన దృశ్యాన్ని తన కెమెరాలో బంధించడానికి ఎన్నో రోజులు వేచిచూడాలి, ఒక ఫాషన్ ఫోటోగ్రాఫర్ తన వృత్తి యందు రాణించాలంటే ప్రతి క్లిక్ యందు వైవిద్యం చూపించగలగాలి.
ఫోటో జర్నలిజం & ఉపాధి అవకాశాలు
ఫోటో జర్నలిజం అత్యంత సాహసవంతమైనది, సున్నితమైనది మరియు బాధ్యతాయుతమైనది. ఫోటో జర్నలిజం ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు సజీవ సాక్ష్యం. ఫోటో జర్నలిస్టులు తాజా వర్తమాన వార్తంశాలను చిత్రాల రూపంలో జాతీయ మరియు అంతర్జాతీయ పత్రికలకు, మ్యాగజైన్‌లకు, టెలివిజన్లకు అందిస్తారు.
ఫోటో జర్నలిస్టులు సమాజంలో జరిగే రోజువారీ జరిగే సంఘటనలు, సమస్యలు, వ్యక్తులు, ప్రదేశాలు, క్రీడలు, రాజకీయ మరియు కమ్యూనిటీ కార్యకలాపాలను విస్తృత స్థాయిలో కవర్ చేయాల్సి ఉంటుంది. వీరు తీసే చిత్రాలు పౌరులను, ప్రభుత్వాలను, వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. వీరు వృత్తి యందు బాధ్యతగా ఉండటం యెంత ముఖ్యమో నిజాయతీగా ఉండటం అంతకంటే ముఖ్యం.
ఫోటో జర్నలిస్టులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. వీరు వార్త పత్రికలు, న్యూస్ ఛానెళ్లు, మ్యాగజైన్‌లు, డిజిటల్ న్యూస్ మీడియా పబ్లిష్ చేసే సంస్థల్లో ఉపాధి పొందొచ్చు. దీనికి సంబంధించి స్థానిక, జాతీయ స్థాయిలో వందల మీడియా సంస్థలు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి.
ఫీచర్ ఫోటోగ్రఫీ & కెరీర్ అవకాశాలు
ఫీచర్ ఫోటోగ్రఫీ ఒక విస్తుతమైన ఎంపిక. ఇది వ్యక్తులు, ప్రదేశాలు, సంఘటనలు, వేడుకలు, విషాదాలకు సంబంధించిన ఫోటో ఆర్కైవ్ లేదా డేటాబేస్ రూపొందించే అంశం. ఈ ఫోటో కలెక్షన్ ఫీచర్ కథనాలు రాసేందుకు, వివిధ ప్రోజెక్టుల యందు ఉపయోగించేందుకు, చరిత్రను తెలియజెప్పేందుకు ఉపయోగిస్తారు.
ఫీచర్ ఫోటోగ్రాఫర్లు అన్ని రంగాలకు సంబంధించి ఫోటోలను సేకరిస్తారు. మీడియా సంస్థల యందు పనిచేసే ఫోటోగ్రాఫర్లు నిత్యం చోటుచేసుకునే అన్నిరకాల సంఘటనలను A-Z సేకరించి దానికి సంబంధించి డేటా బేస్ రూపొందిస్తారు. ఫీలాన్సర్ ఫోటోగ్రాఫర్లు సేకరించిన ఫోటోలను మీడియా సంస్థలకు, కార్పొరేట్ సంస్థలకు విక్రయించడం ద్వారా వీరు ఆదాయం పొందుతారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు, ట్రావెల్ ఫోటోగ్రాఫర్లు, ఆర్కిటెక్చరల్ ఫోటోగ్రాఫర్లు, ఈవెంట్ ఫోటోగ్రాఫర్లు వీరికి ఉదాహరణగా చెప్పొచ్చు.
ట్రేడ్ & అడ్వర్టైజింగ్ ఫోటోగ్రఫీ
ట్రేడ్ & అడ్వర్టైజింగ్ ఫోటోగ్రఫీ ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. వ్యాపార మరియు ఈకామర్స్ సంస్థల ట్రెండ్ నడుస్తుండటంతో ఈ కేటగిరికి చెందిన ఫోటోగ్రాఫర్లకు డిమాండ్ పెరిగింది. వీరు వివిధ ఉత్పత్తులు, మిషనరీ, ఇంటీరియల్స్ సంబంధించి ఫోటోలను క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. వ్యాపార సంస్థలు వినియోగదారులను ఆకర్షించేందుకు వీరు విస్తృత స్థాయిలో వైవిధ్యంగా పనిచేయాల్సి ఉంటుంది.
ట్రేడ్ & అడ్వర్టైజింగ్ ఫోటోగ్రాఫర్లకు అడ్వర్టైజింగ్ సంస్థలతో పాటుగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, షాప్‌క్లూస్, స్నాప్‌డీల్ వంటి ఈకామర్స్ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అత్యధిక డిమాండ్ ఉండే ఈ రంగంలో రాణించాలనుకుంటే నైపుణ్యం, సమర్థత, మరియు సరైన వ్యక్తిత్వం ఉండాలి.
ఫ్యాషన్ ఫోటోగ్రఫీ & కెరీర్ అవకాశాలు
భారతదేశంలో ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్‌లకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ ఉద్యోగం చాలా సృజనాత్మకంగా మరియు కళాత్మకంగా ఉంటుంది. వీరికి ఆధునిక ఫ్యాషన్‌పై బలమైన అవగాహనతో పాటు, వైవిద్యభరితమైన నైపుణ్యం కలిగివుండాలి.
ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్లు ప్రధానంగా ఫ్యాషన్ షూట్‌లలో పాల్గొంటారు. వీరు మోడల్‌లు, హెయిర్ స్టైలిస్ట్‌లు, ఫ్యాషన్ స్టైలిస్ట్‌లు, మేకప్ ఆర్టిస్ట్‌లతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అలానే ప్రీమియర్ ఫ్యాషన్ బ్రాండ్ ఉత్పత్తులను వినియోగదారులకు చేరేందుకు పోర్ట్‌ఫోలియోలు రుపొందాల్సి ఉంటుంది. ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్లు ఇండస్ట్రీలో డిమాండ్ ఎక్కువ. వీరి సంపాదన కూడా అంచనాలకు మించి ఉంటుంది.
వెడ్డింగ్ ఫోటోగ్రఫీ & కెరీర్ అవకాశాలు
వెడ్డింగ్ ఫోటోగ్రఫీ సాధారణ స్వయంఉపాధి ఎంపిక. భారతీయ సంస్కృతిలో వివాహ వేడుక ఒక అపూర్వమైన ఘట్టం. జీవితంలో ఒక్కసారి మాత్రమే జరుపుకునే ఈ వేడుకలో ఫొటోగ్రాపర్ల పాత్ర కీలకమైంది. దీని కారణంగా పనిమంతులు అయినా వెడ్డింగ్ ఫొటోగ్రాపర్లకు మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంది. ఈ మధ్యకాలంలో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్ పేరుతో మరోకొత్త వరవడి మొదలైంది.
వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఉత్తమమైన స్వయం ఉపాధి ఎంపిక. వీరికి ఏడాది పొడుగునా పని దొరుకుతుంది. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనేది కేవలం వెడ్డింగ్ ఈవెంట్లకు మాత్రమే పరిమితం కాదు. ఇతర శుభకార్యాలు, వేడుకలు, ఉత్సవ ఈవెంట్లను కూడా వీరి పరిధిలోకే వస్తాయి. వెడ్డింగ్ ఫొటోగ్రాపర్లు ఒక నెలకు సగటున యాభై వేల నుండి లక్ష రూపాయల వరకు సంపాదిస్తారు. వెడ్డింగ్ సీజన్లో ఈ మొత్తం రెట్టింపు ఉంటుంది.
సినిమాటోగ్రఫీ & కెరీర్ అవకాశాలు
ఈ మధ్యకాలంలో బాగా డిమాండ్ ఉన్న రంగాల్లో సినిమాటోగ్రఫీ ఒకటని చెప్పొచ్చు. సినిమా, సీరియల్స్ నిర్మాణంలో వర్క్ చేసే వారిని సినిమాటోగ్రాఫర్ అంటారు. సినిమాటోగ్రాఫర్ కెమెరా మరియు లైటింగ్ సిబ్బందికి బాధ్యత వహిస్తాడు. వీరు దర్శకుడు రాసుకున్న కథకు దృశ్యం రూపం అందిస్తారు. సినిమా మరియు టెలివిజన్ రంగులలో వైవిద్యం, నైపుణ్యం ఉన్న సినిమాటోగ్రాఫర్లకు మంచి డిమాండ్ ఉంది.
ఈరంగంలో పనిచేసే సినిమాటోగ్రాఫర్లలు సాధారణంగా ఎటువంటి ఎడ్యుకేషన్ అర్హుత అవసరంలేదు. కేవలం పని తెలిస్తే సరిపోతుంది. ఆధునిక సినిమాటోగ్రఫీ టెక్నిక్స్ యందు పట్టు ఉన్నవారికీ అవకాశాలు వెదుక్కుంటూ వస్తాయి. కాకుంటే పని అనుభవం కోసం లైట్ మ్యాన్ స్థాయి నుండి పనిచేయాల్సి ఉంటుంది. ఈ రంగంలో పని అనుభవం, వృత్తి నైపుణ్యం పైనే ఉపాధి అవకాశాలు ఆధారపడి ఉంటాయి.
ఫోటోగ్రఫీ ఉపాధి అవకాశాలు
ఫొటోగ్రాపర్ల ఉపాధి అవకాశాలు ప్రధానంగా ప్రకటనలు, మీడియా, టెలివిజన్ మరియు ఫ్యాషన్ పరిశ్రమలో ఎక్కువగా ఉంటాయి. వీరి కెరీర్ పని అనుభం, వృత్తి నైపుణ్యం మరియు వ్యక్తిగత నడవడిక పైన ఆధారపడి ఉంటుంది. ఒకరివద్ద పనిచేయడం ఇష్టంలేని వారు స్వయం ఉపాధి మార్గాలను అనుచరించాల్సి ఉంటుంది.
స్వయం ఉపాధి మార్గాలలో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అత్యంత లాభదాయకమైనది మరియు సురక్షితమైంది. కొద్దిపాటి పెట్టుబడితో మీరు ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టొచ్చు. అలానే ట్రావెల్ & ఫుడ్ అంశాల యందు ఆసక్తి ఉండే వారు, బ్లాగ్ & సోషల్ మీడియా వేదికల ద్వారా ఉపాధిని పొందాల్సి ఉంటుంది. పని తీరుతో ఎక్కువ మంది ఫాలోయర్స్ రాబట్టుకోవడం ద్వారా ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అవకాశాలు దక్కించుకోవచ్చు.
ఫొటోగ్రాపర్లకు మరోమంచి ఉపాధిమార్గం ఫ్రీలాన్సర్షిప్. ఫ్రీలాన్సర్ వేదికలలో ఫోటో పోర్టుఫోలియో రూపొందించుకోవడం ద్వారా వ్యక్తులను, సంస్థలను ఆకర్షించవచ్చు. వారికీ అవసరమయ్యే ఫోటోలను అందించడం ద్వారా ఉపాధి పొందొచ్చు.
ఇక చివరిది స్టాక్ ఫోటోగ్రఫీ. ఆన్‌లైన్ వేదికల ద్వారా ఫోటోలను సేల్ చేసే స్టాక్ ఫోటోగ్రఫీ సంస్థలకు మీ ఫోటోలను అమ్ముకోవడం ద్వారా ఉపాధి పొందొచ్చు. వైవిధ్యమైన ఫోటోలకు, ఫీచర్ ఫోటోలకు ఈ రంగంలో అత్యధిక డిమాండ్ ఉంటుంది.
వినియోగదారులను ఆకర్షించగల పోర్టుఫోలియా రూపొందించగలిస్తే ఈ రంగంలో ఉపాధి బాగుటుంది. అలానే మీరుకూడాఇటువంటి స్టాక్ ఫోటోగ్రఫీ పోర్టల్ రూపొందించి నేరుగా మీ ఫోటోలను వినియోగదారులకు సేల్ చేసి ఉపాధి పొందొచ్చు.