పరీక్షలలో మంచి మార్కులు పొందేందుకు చిట్కాలు మరియు వ్యూహాలు
Career Guidance Career Options Career Tips

పరీక్షలలో మంచి మార్కులు పొందేందుకు చిట్కాలు మరియు వ్యూహాలు

పరీక్షలు అన్నాక ప్రతీ విద్యార్థిలో ఏదో ఒక రూపంలో భయం ఉంటుంది. ఈ భయం కొందరిలో ఉత్తీర్ణత పొందేందుకు అయితే, మరి కొందరిలో ఎక్కువ మార్కుల సాధన కోసమై ఉంటుంది. ప్రధాన పరీక్షలు దగ్గర పడేకొద్దీ ఈ భయం కాస్త ఆందోళనగా మారి, ఒత్తిడికి గురి చేస్తుంది. . దీనితో నిద్రాహారాలు లేకుండా తెల్లవార్లులా చదివి అనారోగ్యం పాలవుతారు. తీరా పరీక్షల సమయంలో సరైన ప్రతిభను కనబర్చలేక తమ లక్ష్య సాధనలో విఫలమౌతారు.

కర్ణుడి చావుకు బోలెడు కారణాలు అన్నట్లు, విద్యార్థి పరీక్షలో విఫలం కావడానికి కూడా చాల కారణాలు ఉంటాయి. అందులో ప్రధానమైనవి పాఠ్య అంశాలు సరిగా అర్ధం కాకపోవడం, పరీక్షల సన్నద్ధతలో సరైన ప్రణాళిక లేకపోవడం, విద్యార్థికి ఏకాగ్రత కుదరకపోవడం వంటివి ఉంటాయి. విద్యార్థి విఫలం కావడానికి వీటిలో ఏది కారణం అవుతుందో తెలుసుకుంటే, పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించడం ఎలా అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.

చదువు అంటే ఏమిటి ?

ఎక్కువ మార్కులు సాధించడం కోసం కొంచెపు పక్కన పెడితే,  చదువు అంటే ఏమిటో ముందు తెలుసుకుందాం. చదువు అంటే ప్రశ్నకు సమాధానం బట్టీపట్టడం కాదు. చదువు అంటే ప్రశ్నకు సమాధానం వెతకడం. ఈ వెతికే ప్రక్రియలో జ్ఞానాన్ని పెంపొందించుకోవడం. బట్టీ చదువుల వలన మంచి మార్కులు సాధించవచ్చు, అయితే అర్థవంతమైన, అనుభవ సహితమైన విద్య వలనే ఉత్తమ ఫలితాలు ఒనగూరుతాయి.

అనుభవ సహిత విద్య అంటే, పాఠ్యఅంశాన్ని వాస్తవంగా అర్ధం చేసుకోవడం ద్వారా అలవడేది. ఉదాహరణకు ఆవుకి ఎన్ని కాళ్లు ఉంటాయి అనే ప్రశ్నకు సమాధానం నాలుగు కాళ్ళు అనుకుంటే, బట్టీపట్టి చదివే వాడు నేరుగా అడిగే ప్రశ్నకు మాత్రమే సమాధానం చేయగలడు. నాలుగు కాళ్ళు ఉండే జంతువుకు ఒక ఉదాహరణ ఇవ్వండి అనే ప్రశ్నకు ఆ విద్యార్థి సమాధానం చేయలేడు.

అనుభవ సహిత విద్యలో ఈ సమస్య ఉండదు. సదురు విద్యార్థి ఆవుతో పాటుగా, నాలుగు కాళ్ళు ఉండే మిగతా జంతువుల కోసం అవగాహన పొందే ప్రయత్నం చేస్తాడు. కావున ప్రశ్న ఏవిధంగా అడిగినా సమాధానం చేయగలుగుతాడు. బట్టీ చదువులు పరీక్షల వరకే ఉపయోగపడితే, అనుభవ సహిత విద్య జీవితాంతం ఉపయోగపడుతుంది. ఈ పాయింట్ మీకు అర్ధమైతే, మంచి మార్కులు పొందడం ఎలా అనే ప్రశ్నకు సగం సమాధానం దొరికినట్లు భావించాలి.

పరీక్షల్లో ఎక్కువ మార్కుల కోసం వ్యూహాలు మరియు చిట్కాలు

పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించడం అనేది బ్రహ్మ రహస్యం కాదు. నిరంతర అభ్యాసన, క్రమశిక్షణ, ఏకాగ్రత ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. వీటికి సంబంధించి కొన్ని వ్యూహాలు, చిట్కాలు ఉపయోగించడం ద్వారా ఆ లక్ష్యాన్ని మీరు సులువుగా చేరుకోవచ్చు.

మహాభారతంలో గురుభక్తిని చాటే ఒక గొప్ప ఔన్నత్యం ఉన్న పాత్ర ఏకలవ్యుడుది. తక్కువ కులానికి చెందిన ఏకలవ్యుడు, ద్రోణాచార్యుని గురుకులంలో విలువిద్యను అభ్యసించాలని ఆశ పడతాడు. ఈ కోరికను ద్రోణుడు తిరస్కరించడంతో, బంకమట్టితో అతని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని, స్వాధ్యయనం ద్వారా ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసిస్తాడు. ద్రోణుడి ప్రియశిష్యుడు అవుతాడు. మేటి విలుకాడైన అర్జునునితో సమానంగా విలువిద్యలో నైపుణ్యాన్ని సాధిస్తాడు.

ఈ కథలో ఏకలవ్యుడుకి గురువు లేడు, గురుకులం కూడా ఉండదు. తన సొంత అభ్యసన ద్వారా, తను చేసిన పొరపాట్ల నుండి గ్రహించిన అనుభవం ద్వారా విలువిద్య యందు అపారమైన నైపుణ్యం సాధిస్తాడు. మన భాషలో చెప్పాలంటే టీచర్, క్లాస్ రూమ్ లేకుండా ఎంసెట్ పరీక్షలో స్టేట్ ర్యాంకు సాధించడంతో సమానం. ఇంతటి  గొప్ప నైపుణ్యం సాధించేందుకు ఏకలవ్యుడుకి సహాయపడ్డ మూడే మూడు ఉత్పెరకాలు నిరంతర అభ్యాసన, క్రమశిక్షణ, ఏకాగ్రత.

మంచి మార్కుల కోసం క్లాస్ రూమ్ పాఠాలు శ్రద్దగా వినాలి

విద్యార్థి జ్ఞాన నిర్మాణానికి మొదటి బీజం తరగతి గదిలో పడుతుంది. సబ్జెక్టు అంశాల యందు ప్రాథమిక అవగాహన పొందేందుకు క్లాస్ రూమ్ పాఠాలు విద్యార్థికి ఎంతో అవసరం. ఎవరైతే తరగతి గదిలో శ్రద్దగా టీచర్ పాఠాలు వింటారో, వారు పరీక్షల ప్రిపరేషన్ సంబంధించి 30 శాతం సన్నద్ధతను పూర్తి చేసినట్లు అవుతుంది.

అలానే క్లాసు జరుగుతున్న సమయంలో తలెత్తే సందేహాలను అక్కడే నివృత్తి చేసుకోవడం ద్వారా, సబ్జెక్టు అంశాలకు సంబంధించి కీ పాయింట్లతో క్లాసు నోట్స్ రాసుకోవడం ద్వారా సంబంధిత అంశాల యందు క్లాసు రూములోనే పూర్తి పట్టు సాధించవచ్చు.

తరగతి గదిలో విన్న పాఠాలను, అదే రోజు సాయంత్రం ఇంటి వద్ద రివిజన్ చేసుకోవడం ద్వారా ఆ పాఠ్య అంశానికి సంబంధించి అదనపు జ్ణానాన్ని పొందేందుకు వీలు కలుగుతుంది. ఈ జ్ఞానం పరీక్షల సన్నద్ధతను మరింత సులభం చేస్తుంది. ఇంటి వద్ద చేయాల్సిన హోంవర్క్‌లు, అసైన్‌మెంట్‌లను చేయక తప్పదు అనే కారణంతో కాకుండా, సబ్జెక్టు సాధన మాదిరిగా భావించి చేస్తే, ఆ పాఠ్య అంశం మీ బుర్రలో మరింతా స్పష్టత ఏర్పడుతుంది.

అదే సమయంలో మరుచటి రోజు చెప్పబోయే పాఠాల ప్రాథమిక విషయాలను ముందుగా చదివి, తరగతికి హాజరుకావడం ద్వారా టీచర్ చెప్పే పాఠాలు మరింత సులువుగా అర్ధమౌతాయి. ఈ పాయింట్స్ అన్ని సక్రమంగా అమలు చేయగలిగితే, ప్రతి సబ్జెక్టు యందు ప్రాథమిక అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ అవగాహన పరీక్షల ముందర అదనపు ఒత్తిడికి గురి కాకుండా, ఉత్తమ ఫలితాలను పొందేందుకు వీలు కల్పిస్తుంది.

మంచి మార్కుల కోసం జ్ఞాపక శక్తిని మెరుగుపర్చుకోవాలి

కొందరు విద్యార్థులు రాత్రింబవళ్ళు కష్టపడి చదివినా, పరీక్షలలో విఫలం కావడం లేదా తక్కువ మార్కులు పొందటం చూస్తుంటాం. వీరు పరీక్షల ఒత్తిడికి తలొగ్గుతారు. ఈ ఒత్తిడి కారణంగా పరీక్షలలో సమయంలో చదువుకున్న అంశాలు గుర్తుకురాక, ఉత్తమ ఫలితాలు సాధించడంలో విఫలం అవుతారు.

ఈ సమస్య సాధారణంగా బట్టీపట్టే విద్యార్థులలో, ఏకాగ్రత లేనివారిలో మరియు పరీక్షల ముందర చదివే విద్యార్థులలో కనిపిస్తుంది. ఈ సమస్యను అధిగమించాలి అంటే ముందుగా పరీక్షల ఒత్తిడిని జయించాలి. అలానే జ్ఞాపక శక్తి పెంపొందించుకోవాలి.

మానవుని మెదడు అపరిమితమైన డేటా సేవింగ్ సామర్థ్యన్ని కలిగి ఉంటుంది. మీ బ్రెయిన్ మెమరీ కార్డు ఫుల్ అవుతుంది అనే భయం మీకు అవసరం లేదు. మీరు చేయాల్సిందంతా జ్ఞానాన్ని ఒక పద్దతిగా భద్రపర్చుకోవడం మాత్రమే. మానవ మెదడు ప్రతీ మెమరీని ఇమేజ్ రూపంలో భద్రపరుస్తుంది. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి తాత్కాలిక మెమరీ, అంటే పరీక్ష ముందు రోజు చదివి, పరీక్ష పూర్తియ్యాక మర్చిపోయేది.

రెండవది శాశ్వత మెమరీ, ఇది మనిషి చనిపోయే వరకు ఉండేది. ఇష్టంతో, శ్రద్ధతో చేసే ప్రతి పని శాశ్వత మెమరీగా భద్ర పర్చబడుతుంది. ఏకాగ్రత లేకుండా చేసే పనులు, ఆసక్తి లేకుండా చేసే పనులు తాత్కాలిక మెమరీగా సేవ్ చేయబడతయి. జ్ఞాపక శక్తిని పెంపొందించేందుకు కొన్ని టాస్కులు ఉంటాయి. వాటి ద్వారా జ్ఞాపకశక్తి సామర్ధ్యాన్ని పెంచుకునే అవకాశం మీకు ఉంటుంది.

  • మెదడుకు పదునుపెట్టే చదరంగం వంటి ఆటలు ఆడటం, అలానే కవితలు, పద్యాలు, సినిమా పాటలు వంటివి నేర్చుకుని, తిరిగి ఆలపించడం ద్వారా జ్ఞాపకశక్తిని మెరుగుపర్చుకోవచ్చు.
  • సమయాన్ని వృధా చేసే సోషల్ మీడియా, చెడు స్నేహాలు, చెడు అలవాట్లను మానుకోవడం ద్వారా మీకు కావాల్సిన అంశాలపై ఏకాగ్రతను పొందొచ్చు.
  • జ్ఞాపక శక్తికి విఘాతం కల్గించే మరో అంశం మల్టీటాస్కింగ్. ఒకే సమయంలో ఒకటికి మించి పనులు చేసేటప్పుడు ఈ సమస్య ఎదురౌతుంది. దీన్ని అధిగమించాలి అంటే మీకు ఖచ్చితమైన సమయపాలన ఉండాలి.
  • మీకు ఏ సమయంలో చదవాలి, ఏ సమయంను ఇతర వ్యాపకాల కోసం కేటాయించాలి అనే క్లారిటీ ఉంటే ఈ సమస్యను అధిగమించవచ్చు.

ఇక చివరిది అందరూ చెప్పే అంశం 'ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ '. నిరంతర అభ్యాసం మనిషిని పరిపూర్ణుడిని చేస్తుంది. ఒకే పనిని పదేపదే చేయడం ద్వారా సంబంధిత పనులలో పూర్తిస్థాయి నైపుణ్యం సాధించవచ్చు.

మిగతా విషయాల్లో ఇది సరైనదే అయినా, చదువు విషయంలో ఒకరకంగా బట్టీపట్టడమే అవుతుంది. అయితే జ్ఞాపకశక్తి లోపంతో బాధపడే విద్యార్థులకు ఈ టెక్నిక్ సహాయపడుతుంది. మీరు నేర్చుకోవాలనుకునే అంశాన్ని పేపర్ పైన పదేపదే వ్రాయడం ద్వారా, చదవడం ద్వారా సంబంధిత అంశంపై పట్టు సాధించవచ్చు.

ప్రణాళికాబద్ధమైన చదువుతో మెరుగైన ఫలితాలు

  1. క్రమబద్ధంగా చేసే పనుల నుండి ఉత్తమ ఫలితాలను సాధించవచ్చు. ఆర్గనైజడ్ స్టడీ అంటే చదివే ప్రదేశం, చదివే సమయం, చదివే తీరు, సరైన తిండి, సరిపడేంత నిద్ర వంటి మొదలగు అంశాలు ఈ కోవలోకి వస్తాయి. చదివే ప్రదేశం లేదా స్టడీ రూమ్ విద్యార్థి చదువులో కీలక భూమిక పోషిస్తుంది. ఇది యెంత ప్రశాంతంగా ఉంటె విద్యార్థి చదువు అంత చక్కగా సాగుతుంది.
  2. స్టడీ రూమ్ ఎప్పుడూ రణగొణ ధ్వనులకు దూరంగా ఉండాలి. ఇతర వ్యక్తుల రాకపోకలకు ఆస్కారం ఉండకూడదు. పరీక్షల వేళ ఈ అంశాలు విద్యార్థి ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. విద్యార్థి దృష్టిని కేంద్రీకరించగలిగే ఇతర అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ జాబితాలో రూమ్ పెయింటింగ్, లైటింగ్, వెంటిలేషన్ వంటి అంశాల యందు జాగ్రత్త వహించాలి.
  3. పరీక్షల సమయంలో విద్యార్థులకు సరైన పోషకాహారం అవసరం. ఈ సమయంలో బౌతికంగా ఎటువంటి పని చేయకపోయినా, మానసికంగా అధిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. దానికి తగ్గ పోషకాలు శరీరానికి, మెదడుకు అందకపోతే విద్యార్థి నిరశించిపోయే అవకాశం ఉంటుంది. అదేసమయంలో పఠన సామర్ధ్యాన్ని కూడా కోల్పోతారు.
  4. సరైన డైట్ ప్లానుతో ఈ సమస్యను అధిగమించవచ్చు. ఒకేసారి అధిక మొత్తంలో తిని, కునుకు తెప్పించే ఆహారం కంటే, తేలికగా జీర్ణమయ్యే అన్ని రకాల పోషకాలను ప్రతి రెండు గంటలకోసారి కొద్దికొద్దిగా తీసుకోవడం ద్వారా దీనిని అమలుపర్చవచ్చు.
  5. పరీక్షల సమయంలో విద్యార్థులు చేసే మరో తప్పిదం రాత్రంతా మేల్కొని చదవడం. దీని కారణంగా నిద్రలేమితో మానసికంగా శక్తిహీనులు అవుతారు. రాత్రిపూట నిద్రలేమితో చదవటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
  6. దీనితో రాత్రంతా మేల్కొని చదివిన చదువంతా వృధా అవుతుంది. మనిషికి కనీసం 6 నుండి 7 గంటల నిద్ర అవసరం. జ్ఞాపకశక్తిని ఏకీకృతం చేయడంలో నిద్ర సహాయపడుతుంది. రాత్రి మేల్కొని చదివే అలవాటు ఉన్నవారు త్వరగా నిద్రపోయి, ఉదయం మూడు తర్వాత నిద్రలేచి చదువుకోవడం ద్వారా ఈ సమస్యని అధిగమించవచ్చు.
  7. చదివే సమయం కూడా పరీక్షల ఫలితాలపై ప్రభావం చూపుతుంది. వేకువ జామున ఫ్రెస్ మైండుతో చదివే అంశాలు చక్కగా గుర్తుంటాయి. ఈ సమయంలో చదివే విద్యార్థులు, మిగతా విద్యార్థుల కంటే ఉత్తమ ఫలితాలు సాధించినట్లు కొన్ని పరిశోధనలు రుజువు చేసాయి.

విద్యార్థికి ఏకాగ్రత అవసరం

వృత్తి నిపుణులను గమించినట్లు అయితే, వారికీ సంబంధించిన అంశాల యందు పూర్తిస్థాయి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఒక క్రికెటర్ గొప్పగా ఆడుతుంటే, కుమ్మరి చక్కగా కుండను తయారు చేస్తుంటే, పెయింటర్ అందమైన బొమ్మ గీస్తుంటే మనకు వావ్ అనిపిస్తుంది. వీరంతా ఎంతో ఏకాగ్రతతో, ఎన్నో త్యాగాలు చేసి, నిరంతర కృషి, సాధనతో ఆయా నైపుణ్యాన్ని సాధిస్తారు.

మీరు విద్యార్థిగా ఉన్నంత వరకు, విద్యను అభ్యసించడమే మీ ప్రధానమైన వృత్తి కాబట్టి, విద్యార్థిగా విజయం సాధించాలంటే తప్పనిసరిగా కొన్ని త్యాగాలు చేయాలి. మీ బంగారు భవిష్యత్తు కోసం స్వల్పకాలిక వినోదాలకు దూరంగా ఉండాలి. స్నేహాలు, సరదాలు, షికార్లకు ఒక పరిమితి విధించుకోవాలి. ఒక దానిపై మనకు ఫోకస్ కుదరాలి అంటే, ఇంకో దానిపై మనకు ఆసక్తి పోవాలి. ఏకాగ్రత పొందేందుకు కొన్ని చిట్కాలు.

  • ఏకాగ్రత కుదరకపోవడానికి ప్రధాన కారణాలలో ఒకటి మల్టీ టాస్కింగ్. విద్యార్థి అనేవాడు ఎప్పుడూ ఏకసంథాగ్రాహిగా ఉండాలి. తనకు ఏం కావాలో దానికోసమే పోటీపడాలి. నువ్వు క్రికెటర్ కావాలనుకుంటే గ్రౌండుకు పోయి ప్రాక్టీస్ చేయాలి, మంచి మంచి మార్కులు సాధించాలి అంటే ఇంట్లో కూర్చొని చదువుకోవాలి. గ్రౌండులో పరీక్షల కోసం, స్టడీ రూములో క్రికెట్టు కోసం ఆలోచిస్తూ సమయం వృధా చేస్తే, రెండిటిలో విఫలమౌతావు.
  • ఏకాగ్రత అనేది మన ఇంట్లో వైఫై సిగ్నల్ వంటిది. దానికి దూరం జరిగే కొద్దీ సిగ్నల్ తగ్గిపోయినట్లు, మనం చదువుకు దూరమయ్యే కొలది ఫలితాలు తగ్గిపోతుంటాయి.
  • ఏకాగ్రతను కోల్పోడానికి మరో కారణం పరధ్యానం. ఈ లక్షణం సహజంగా దాదాపు అందరు విద్యార్థులలో కనిపిస్తుంది. పుస్తకం కళ్ళ ముందరే ఉంటుంది. అయితే ఆలోచనలు మాత్రం అట్లాంటిక్ మహా సముద్రం దాటి అమెజాన్ అడవుల వరకు పోతాయి. అక్కడ నుండి తిరిగి వచ్చే సరికి పుణ్యకాలం కాస్త కరిగిపోతుంది.
  • ఈ పరధ్యానం పోవాలంటే ముందు పగటి కలలు మానేయాలి. ఏకాగ్రతను పోగొట్టే మొబైల్, సోషల్ మీడియా, సినిమాల వంటి వ్యాపకాలకు దూరంగా ఉంటూ, ఏకాగ్రతను పెంచే చదరంగం, యోగ, మెడిటేషన్, వ్యాయామం వంటి వ్యాపకాలకు దగ్గర అవ్వాలి.
  • విరామం లేకుండా చదవడం కంటే ప్రతి గంటకు ఒకసారి బ్రేకు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు.
  • రోజువారీ లక్ష్యాలను పెట్టకోవడం ద్వారా, ఏ సమయానికి, ఏ అంశాన్ని పూర్తిచేయాలనే టార్గెట్ నిర్ణయించుకోవడం ద్వారా ఇతర అంశాలపైకి ఆలోచనలు మళ్లకుండా, మీ లక్ష్యాలపై ఫోకస్ కుదురుతుంది.

ఎక్కువ మార్కులు సాధించడం కోసం ఎటువంటి షార్ట్ కట్ మార్గాలూ ఉండవు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. పరధ్యానంలో అమెజాన్ అడవులు చూసివచ్చేటంత సులభం కాదు. రాత్రియంబవళ్ళు శ్రమించాలి. సబ్జెక్టు అంశాల యందు అవగాహనా పెంపొందించుకోవాలి. మీ సొంత పఠన నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి. నేర్చుకున్న అంశాలను కథలుగా చెప్పగలగాలి, పాటలుగా పాడగలగాలి, బొమ్మలుగా చిత్రించ గలగాలి..ఇవన్నీ మీ జీవితంలో భాగమైతే ఫలితాలు వాటింతగా అవే వస్తాయి.

 

Post Comment