English Alphabet and Pronunciation in Telugu
Spoken English

English Alphabet and Pronunciation in Telugu

ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ సులభంగా నేర్చుకోండి. ప్రతి అక్షరాన్ని ఎలా ఉచ్చరించాలో తెలుసుకోండి. ఇంగ్లీషులో మొత్తం 26 అక్షరాలు ఉంటాయి. ఈ అక్షరమాలను ఇంగ్లీషులో ఆల్ఫాబెట్ అంటారు. మాట్లాడే భాష పదికాలాల పాటు నిలవాలంటే దానికి లిపి ఉండాలి. లిపి అనేది భాషకు చెందిన భౌతిక లేదా దృశ్య లేదా అక్షర రూపం అనొచ్చు.

ప్రపంచ వ్యాప్తంగా చాలా భాషలు లిపి లేకపోవడం వలన అంతరించిపోయాయి. లిపి ఉండి కూడా చాలా భాషలు, ప్రాశ్చత్య బాషల ఆధిపత్యంలో కనుమరుగయ్యాయి. భాషను అధ్యయనం చేసేందుకు లేదా ముందు తరాలకు అందించేందుకు దానికి అక్షర రూపం ఉండాలి.

ఇంగ్లీష్ అక్షరమాల

ఒక భాష కేవలం మాట్లాడేందుకు మాత్రమే అయితే, అక్షరాలతో అవసరం ఉండదు. ఆ భాష యొక్క సాహిత్యాన్ని చదవడానికి, రాయడానికి కూడా అయితే, ఆ భాష అక్షరాలను నేర్చుకోవడంతో ప్రారంభించాలి. ఇంగ్లీషులో మొత్తం అక్షరాలు 26 ఉంటాయి.

ఈ అక్షరమాలను ఇంగ్లీషులో ఆల్ఫాబెట్ అంటారు. తెలుగు అక్షరాలు అన్ని ఒకేవిధంగా రాసినట్లు కాకుండా, ఇంగ్లీషు అక్షరాలను చిన్న అక్షరాలు (Small Letters), పెద్ద అక్షరాలు (Capital letters) పేర్లతో రెండు రకాలుగా రాస్తారు.

ఇంగ్లీషుని నేర్చుకోవడంలో సవాలక్ష తలనొప్పులు ఉన్నాయి.  ఈ తలనొప్పులు ఇంగ్లీష్ అక్షరాలను రెండు రకాలుగా రాయడం దగ్గర నుండే ప్రారంభమౌతాయి. ఈ రెండు రకాల అక్షరమాలలలో పెద్దవాటి నుండి చిన్నవి కొంత భిన్నంగా ఉంటాయి.

Capital Letters (Upper Case)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Small Letters (Lower Case)

 a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z

అక్షరాల్ని "పెద్దా - చిన్నా" పేర్లతో, రెండు రకాలుగా రాసే పద్దతి తెలుగు భాషలో గాని, ఇతర భారతీయ భాషలలో గాని లేదు. ఈ పద్దతి యూరోపియన్ భాషలలో మాత్రమే కనిపిస్తుంది. ఈ పద్దతి ఎందుకు ఉందంటే ఆ భాషల్ని రాసేటప్పుడు, కొన్ని సందర్భాలలో పెద్ద అక్షరాలని, కొని సందర్భాలలో చిన్న అక్షరాలని రాయాలనే నియమం ఉంది. దాని కోసం ఆ భాషలో పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు కూడా కావాలి. అందుకే ఆ భాషల్లో అక్షరాలు రెండు రకాలుగా ఉంటాయి.

ఇంగ్లీష్ రాసేటప్పుడు పెద్ద-చిన్న అక్షరాలు ఎక్కడెక్కడ వస్తాయి

  • ప్రతీ వాక్యంలో మొదటి పదంలోని మొదటి అక్షరం క్యాపిటల్ లెటరులో రాయాలి.
  • నామవాచకాలు (Nouns) మొదటి అక్షరాన్ని ఎల్లప్పుడూ క్యాపిటల్ లెటరులో రాయాలి.
  • God మరియు దానికి సంబంధించే ఇతర పదాలు రాసేటప్పుడు క్యాపిటల్ లెటరులో రాయాలి.
  • I (నేను) అక్షరం వాక్యం మధ్యలో ఎక్కడ వచ్చిన క్యాపిటల్ లెటరులో రాయాలి.
  • ఇంగ్లీష్ పద్యాలలో ప్రతీ లైనులోని మొదటి అక్షరాన్ని క్యాపిటల్ లెటరుతో ప్రారంభించాలి.

ఇంగ్లీష్ అక్షరమాలలో అచ్చులు & హల్లులు

అక్షరాల శబ్దాలలో ఉండే తేడాల వలన ప్రతి భాషలో అచ్చులు, హల్లులు ఉంటాయి. ఆంగ్ల భాషలో అచ్చులు, హల్లులను Vowels and Consonants అని అంటారు. Vowels and Consonants అక్షరాలు కాదు. ఇవి అక్షరాల యొక్క శబ్ద రూపాలు. నోటివెంట పూర్తిగా పలికే శబ్దాలను అచ్చులు (Vowels) అంటారు. సగం వరకే పలికే అక్షరాలను హల్లులు (Consonants) అంటారు. ఈ అచ్చు శబ్దాలు, హాల్లు శబ్దాలలు కలిస్తేనే అక్షరాలు గాని మాటలు కాని ఏర్పడతాయి.

తెలుగు అక్షరాలలో "అ " నుండి "అః " వరకు వుండే అక్షరాలను అచ్చులు అంటారు. అలానే "క" నుండి చివరి వరకు ఉండే అక్షరాలను హల్లులు అంటారు. తెలుగులో ఉండే విధంగా ఇంగ్లీషు భాషలో అచ్చులు-హల్లులు విడివిడిగా ఉండవు. మూకుమ్మడిగా కలిసి ఉంటాయి.

ఇంగ్లీషులో మొత్తం 5 అచ్చులు (Vowels),  21 హల్లులు (Consonants) ఉన్నాయి. హల్లులలో ఉండే Y అక్షరం కొన్ని సంధర్భాలలో అచ్చుగాను, ఇంకొన్ని సార్లు హల్లుగాను పలుకుతుంది. దీన్ని సెమి ఒవెల్ అంటారు. అంటే ఇది ఉభయాక్షరం.

 A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

(ఎరుపు రంగులో ఉండే A E I O U లను Vowels అంటారు. మిగతా వాటిని Consonants అంటారు.)

భాష ఏదైనా దాన్ని మాట్లాడేటప్పుడు, నోటి నుండి వచ్చే శబ్దాలలో పూర్తిగా పలికే శబ్దాలు, సగం వరకు పలికే శబ్దాలు ఉంటాయి. A అనే శబ్దాన్ని చూడండి. దీన్ని పూర్తిగా పలకగలం. అలానే E అక్షరాన్ని కూడా పూర్తిగా పలకగలం. దీన్ని కొంతవరకే పలకాలని ప్రయత్నించినా అది సాధ్యం కాదు. ఇలా పూర్తిగా పలకగలిగే శబ్దాలనే అచ్చులు (vowels) అంటారు.

హల్లుల సంగతి అలా కాదు. B ని చూడండి. దీన్ని "బి" అని పలుకుతాం కాబట్టి ఇది కూడా పూర్తిగా పలికే శబ్దంలా అనిపిస్తుంది. నిజానికి ఈ శబ్దం "బి" కాదు "బ్" మాత్రమే. అంటే దీన్ని పూర్తిగా పలకలేము. సగం పలికే శబ్దాలను హల్లులు (Consonants) అంటారు. ఈ B + EE కలిపితే బీ వస్తుంది. మరి "బ్" ని "బి " అని ఎందుకు పలుకుతాం అంటే, పలికేందుకు వీలుగా ఉంటుందని మాత్రమే.

హల్లులు అన్ని ఈ విధంగానే ఉంటాయి. హల్లు శబ్దాలు లేకుండా కేవలం అచ్చు శబ్దాలతో పదాలు ఏర్పడవు. ప్రతి పదంలోనూ అచ్చులు, హల్లులు కలసి ఉంటాయి.

Syllable (సిలబుల్)

ఒకే సమయంలో పూర్తిగా పలకడానికి వీలైన ఒక శబ్దం గానీ, ఒకటి కన్నా ఎక్కువ శబ్దాలు కలిసి గానీ, ఒక సిలబుల్ అవుతుంది. తెలుగులో సిలబుల్ అంటే ఒక అక్షరం అని అర్ధం. భాష ఏదైనా అచ్చు అక్షరంలో ఒక శబ్దమే ఉంటుంది. అది పూర్తిగా పలికేదిగా ఉంటుంది. కాబట్టి అచ్చుల విషయంలో ప్రతీ అక్షరం ఒక సిలబుల్ గా వ్యవహరిస్తోంది. "అ" ఒక సిలబుల్, "ఆ" ఒక సిలబుల్, "A" ఒక సిలబుల్ అలానే "E" ఒక సిలబుల్.

హల్లుల విషయంలో తెలుగుకీ, ఇంగ్లీషుకు తేడా ఉంటుంది. భాష ఏదైనా పూర్తిగా పలకలేని శబ్దాలనే మనం హల్లులు అంటాం. దానికి ఏదో ఒక అచ్చు శబ్దం కలిసి, అది పూర్తిగా పలకడానికి వీలుగా మారితేనే అది సిలబుల్ అవుతుంది. Ex : క్ + అ = క (తెలుగు సిలబుల్), K +A = Ka (ఇంగ్లీష్ సిలబుల్)

తెలుగులో ఒక హల్లు అక్షరానికి, అచ్చు అక్షరం కలిస్తే, అవి రెండు అక్షరాలుగా ఒక దాని పక్క ఒకటి ఉండవు. ఒక అక్షరంగా అయిపోతాయి. "క" లో రెండు శబ్దాలు ఉన్న అది ఒకే అక్షరం. ఆ అక్షరం పూర్తిగా పలుకుతుంది. తెలుగులో హల్లులన్నీ ఇలాగే పూర్తిగా పలికే విధంగా మారిపోతాయి. ఉదాహరణకు "ఈగ" అనే మాటలో "ఈ" అనేది అచ్చు కాబట్టి అది సిలబులే. "గ" కూడా హల్లు అయినా. అది పూర్తిగా పలుకుతుంది కాబట్టి అదికూడా సిలబుల్ అవుతుంది.

ఉదాహరణకు "Man" మాన్ అనే పదంలో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి ? Ma అనే భాగం ఒక సిలబుల్ అవుతుంది. N హాల్లు విడిగా ఉండిపోతుంది. ఇది పూర్తిగా పలికే శబ్దం కాదు కాబట్టి అది సిలబుల్ కాదు. అంటే Man అంతా కలిసి ఒకటే సిలబుల్. అలానే Mango పదంలో Man ఒక సిలబుల్ గా, Go ఒక సిలబుల్ గా ఉంటుంది.

సారాంశం ఏమిటంటే, తెలుగు మాటల్లో ప్రతి అక్షరమూ సిలబులే. అందుకే తెలుగు లిపిని "సిలాబిక్ స్క్రిప్ట్" అంటారు. ఇంగ్లీష్ మాటల్లో ప్రతి అక్షరమూ ఒక సిలబుల్ కాదు. రెండేసి, మూడేసి అక్షరాలు కలిసిన మొత్తమే ఒక సిలబుల్. శబ్దాలతో మాటలు ఏర్పడతాయి. అన్నట్లే సిలబుల్స్ తో మాటలు ఏర్పడతాయి అని కూడా అనొచ్చు. సిలబుల్స్ కోసం తెలుసుకోవడం, ఇంగ్లీషులో కొన్ని రకాల మాటలు ఏర్పడే నియమాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

ఇంగ్లీష్ అక్షరమాల & అక్షరాల ఉచ్చారణ

ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఫోనిక్ సౌండ్  (ఉచ్చారణ) ఆల్ఫాబెట్
A /eɪ/, /æ/ a  (ఏ)
B /biː/ bee (బి)
C /siː/ cee (సి)
D /diː/ dee (డి)
E /iː/ e (ఈ)
F /ɛf/ ef (ఎఫ్)
G /dʒiː/ gee (జి)
H /(h)eɪtʃ/ (h)aitch (హెచ్)
I /aɪ/ i (ఐ)
J /dʒeɪ/ jay (జె)
K /keɪ/ kay (కె)
L /ɛl/ el (ఎల్)
M /ɛm/ em (ఎమ్)
N /ɛn/ en (ఎన్)
O /oʊ/ o (ఓ)
P /piː/ pee (పి)
Q /kjuː/ cue (క్యూ)
R /ɑːr/ ar (ఆర్)
S /ɛs/ ess (ఎస్)
T /tiː/ tee (టి)
U /juː/ u (యూ)
V /viː/ vee (వి)
W /ˈdʌbəl.juː/ double-u (డబ్ల్యూ)
X /ɛks/ ex (ఎక్స్)
Y /waɪ/ wy (వై)
Z /zi/zɛd/ zee / zed (జీ / జెడ్ )

Post Comment