Advertisement
10వ తరగతి తర్వాత ఉత్తమ ఇంటర్మీడియట్ గ్రూపులు
Career Guidance Career Options

10వ తరగతి తర్వాత ఉత్తమ ఇంటర్మీడియట్ గ్రూపులు

ఏపీ మరియు తెలంగాణలోని జూనియర్ కాలేజీలు ప్రధానంగా 5 రకాల ఇంటర్మీడియట్ గ్రూపులను విద్యార్థులకు ఆఫర్ చేస్తున్నాయి. ఇవి సైన్స్, ఆర్ట్స్ మరియు కామర్స్ విభాగాలకు సంబంధించినవై ఉంటాయి. విద్యార్థులు తమ భవిష్యత్ ఉన్నతవిద్య ఆలోచనలను దృష్టిలో ఉంచుకుని వీటిలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

  • MPC : మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ & కెమిస్ట్రీ
  • BiPC : బయాలజీ, ఫిజిక్స్ & కెమిస్ట్రీ
  • CEC : కామర్స్, ఎకనామిక్స్ & సివిక్స్
  • MEC : మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ & కామర్స్
  • HEC : హిస్టరీ, ఎకనామిక్స్ & సివిక్స్

మెజారిటీ తెలుగు రాష్ట్రాల విద్యార్థులు టెన్త్ తర్వాత ఇంటర్ కోర్సులలో చేరేందుకు మొగ్గుచూపుతారు. ఇటు పాఠశాల చదువుకు, అటు ఉన్నత విద్యకు మద్య వారధిగా ఉండే ఇంటర్మీడియేట్ ఫేజ్ ప్రతి విద్యార్థికి ఎంతో ముఖ్యమైనది. విద్యార్థి భవితవ్యంని నిర్ణయించే ఈ రెండేళ్ళ ఇంటర్మీడియట్ విద్యను పిల్లలు, తల్లిదండ్రులు ఒక యజ్ఞంల స్వీకరిస్తారు.

ఇంటర్మీడియట్ యందు చక్కని ప్రతిభతో రాణిస్తే తర్వాత చేయబోయే ఉన్నత విద్యకు ఇక్కడ నుండే బంగారుబాట వేచే అవకాసం ఉన్నందున, ఇంటర్మీడియట్ గ్రూపుల ఎంపికలో అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇలా ఎన్నో కీలక అంశాలపై ఆదారపడే ఈ గ్రూపుల ఎంపికలో విద్యార్దులు, తల్లిదండ్రులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.

విద్యార్థి ఆసక్తి, అభిరుచిని లెక్కలోకి తీసుకుంటూ, భవిష్యత్ ట్రెండ్, అప్పటికి వివిధ రంగాలకు ఉండే డిమాండును దృష్టిలో పెట్టుకుని మీకు సరిపడే ఇంటర్మీడియట్ గ్రూపును ఎంపిక చేసుకోవాలి.

ఇంటర్ ఎంపీసీ గ్రూపు : మ్యాథమెటిక్స్, ఫిజిక్స్  కెమిస్ట్రీ

engineerS గణితంలో అమితమైన ఆసక్తి ఉండి, ఇంజనీరింగ్ చేయాలనుకునే వారందరూ ఎంపిక చేసుకోవాల్సిన ఏకైక ఇంటర్ గ్రూపు ఎంపీసీ. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులుగా ఉండే ఎంపీసీ గ్రూపుకు తెలుగు రాష్టాలలో డిమాండ్ ఎక్కువ.

ఇంటర్ ఎంపీసీ తర్వాత మెజారిటీ విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సులలో చేరుతున్నారు. ఇంజనీరింగ్ యందు కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ వంటి సాంప్రదాయ ఇంజనీరింగ్ బ్రాంచులతో పాటుగా ఏరోనాటికల్, కెమికల్, ఐటీ, రోబోటిక్స్, మెరైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునాతన కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఇంజినీరింగ్ కోర్సుల యందు అడ్మిషన్ పొందేందుకు ఏపీ ఈఎపీసెట్, టీఎస్ ఎంసెట్ ప్రవేశ పరీక్షలలో అర్హుత పొందాల్సి ఉంటుంది. వీటిలో పాటుగా జాతీయస్థాయిలో పదుల సంఖ్యలో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 500 లకు పైగా ఇంజనీరింగ్ కాలేజీల్లో 1.47 లక్షల ఇంజనీరింగ్ సీట్లు, తెలంగాణలో దాదాపు 280 ఇంజనీరింగ్ కాలేజీల్లో 79 వేలకు పైగా ఇంగీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఎంపీసీ అంటే ఒక్క ఇంజనీరింగ్ మాత్రమే కాదు ఇదో విస్తృత అవకాశాల గని. ఇంటర్ ఎంపీసీ పూర్తిచేసిన వారికి విస్తృతమైన ఉన్నత విద్యావకాశాలతో పాటుగా త్రివిధ దళాలు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే, పోస్టల్ వంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగావకాశాలు వెల్లువ. కేవలం రెండేళ్ల ఇంటర్ ఎంపీసీ పూర్తి చేయడం ద్వారా భవిష్యత్తులో అపారమైన అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

ఇంటర్ బైపీసీ గ్రూప్ : బయాలజీ, ఫిజిక్స్ & కెమిస్ట్రీ

mbbsజీవశాస్త్ర అంశాల యందు ఆసక్తి కలిగి ఉండి, వైద్య, వ్యవసాయ సంబంధిత వృత్తుల్లో స్థిరపడే ఆలోచన ఉన్నవారికి బైపీసీ గ్రూప్ మంచి ఎంపిక. బైపీసీ గ్రూపు బోటనీ, జూవాలజీ, ఫిజిక్స్, మరియు కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులుగా ఉంటుంది.

ఇంటర్ బైపీసీ పూర్తిచేసిన విద్యార్థులకు ఉన్నతవిద్యతో పాటుగా ఉద్యోగావకాశాలకు కొదవ లేదు. నీట్ ప్రవేశపరీక్ష ద్వార ఎంబీబీఎస్, డెంటల్ కోర్సులతో చేరి వైద్య రంగంలో స్థిరపడొచ్చు. అంతే కాకుండా బైపీసీ విద్యార్థులకు ఆయుర్వేదిక్, హోమియోపతి, ఫార్మసీ, లైఫ్ సైన్సెస్, ఫోరినిక్ సైన్స్, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్, జియాలజి, ఫిజియోథెరపీ వంటి ఎన్నో కోర్సులు అందుబాటులో ఉంటాయి.

ఏపీ తెలంగాణాలో అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సులలో చేరేందుకు ఏపీ ఈఎపీసెట్, టీఎస్ ఎంసెట్ ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అలానే ఇంటర్ బైపీసీ తర్వాత బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్, ఫిజియోథెరపీ, హోటల్ మానేజ్మెంట్, హోమ్ సైన్స్ వంటి కోర్సులలో చేరొచ్చు.

ఇంటర్ బైపీసీ సబ్జెక్టులలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఆయా రంగాల్లో స్థిరపడొచ్చు. అలానే యూపీఎస్సీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్ వంటి వివిధ నియామక పరీక్షలకు హాజరయ్యి, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. సీఎస్ఐఆర్ నెట్ వంటి పరీక్షలలో అర్హుత పొందటం ద్వారా పరిశోధన రంగాల్లో రానించవచ్చు.

ఇంటర్ ఎంఈసీ గ్రూప్ : మాథ్స్, ఎకనామిక్స్ & కామర్స్

mecఏంఈసీ గ్రూపుకు ఈమధ్య కాలంలో విద్యార్దుల తాకిడి ఎక్కువయ్యింది. చార్టర్డ్ అకౌంటెంట్ వంటి కామర్స్ కోర్సులలో చేరే విద్యార్థులు మ్యాథ్స్, కామర్స్ కాంబినేషన్‌లో ఉండే ఇంటర్ ఎంఈసీ గ్రూపును ఎంపిక చేసుకుంటున్నారు.

మాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టులతో ఉన్న ఎంఈసీ గ్రూపును పూర్తి చేయడం ద్వారా సీఏ, కంపెనీ సెక్రటరీ వంటి  ఉన్నత డిగ్రీలు  సాధించి  వివిధ ప్రబుత్వ, ప్రైవేటు రంగాలలో చార్టెడ్ అకౌంట్స్, కంపెనీ సెక్రటరీలు , ఇన్సురెన్స్ ఆఫీసర్స్, ఫైనాన్సియల్ అనలిస్ట్, టాక్స్ ఆడిటర్, కమర్షియల్ లాయర్లుగా వివిధ హోదాల్లో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు.

ఇంటర్ ఎంఈసీ తర్వాత మెజారిటీ విద్యార్థులు సీఏ సీపీటీ (కామన్ ప్రొఫిషియన్సీ) పరీక్షకు హాజరయ్యి చార్టర్డ్ అకౌంటెంట్  కోర్సులలో చేరుతున్నారు. మిగతా విద్యార్థులు సంబంధిత సబ్జెక్టులలో గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచేసి సంబంధిత రంగాల్లో స్థిరపడేందుకు అవకాశం ఉంటుంది.

ఇంటర్ సీఈసీ గ్రూప్ : కామర్స్, ఎకనామిక్స్ & సివిక్స్

CECచిట్టా పద్దులు, వ్యాపార గణాంకాలు, స్టాక్ మార్కెట్ అంశాల యందు ఆసక్తి ఉన్నవారికి సీఈసీ గ్రూపు మంచి ఎంపిక అవుతుంది. ఈ మధ్య కాలంలో  విద్యార్దులు మాథ్స్ కాంబినేషన్ తో ఉన్నా కామర్స్ (ఏంఈసీ) కోర్సుల వైపు  మొగ్గు చూపుతున్నా, అప్పటికి ఇప్పటికి కామర్స్ గ్రూప్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది సీఈసీ గ్రూపు మాత్రమే.

సివిక్స్, ఎకనామిక్స్ మరియు కామర్స్ ప్రధాన సబ్జెక్టులుగా ఉండే సీఈసీ గ్రూపు తీసుకున్నవారు కూడా కామర్స్ సంబందిత అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఉద్యోగ అవకాశాలు పరంగా ఎక్కువ ప్రయోజనం పట్టణ ప్రాంత కామర్స్ విద్యార్దులకు ఉన్నమాట నిజమేఅయినా, పట్టుదల, నేర్చుకునే తత్వం, అవకాశాలు అందిపుచ్చుకునే నేర్పు ఉంటె గ్రామీణ విద్యార్దులు కూడా కామర్స్ రంగంలో ఉన్నత అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు.

సీఈసీ విద్యార్థులు కూడా సీఏ సీపీటీ (కామన్ ప్రొఫిషియన్సీ) పరీక్షకు హాజరయ్యి చార్టర్డ్ అకౌంటెంట్  కోర్సులలో చేరొచ్చు. అలానే సంబంధిత సబ్జెక్టులలో గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచేసి సంబంధిత రంగాల్లో స్థిరపడేందుకు అవకాశం ఉంటుంది. యూపీఎస్సీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి వివిధ నియామక పరీక్షలకు సిద్దమవ్వడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ కావొచ్చు.

ఇంటర్ హెచ్ఈసీ గ్రూప్ : హిస్టరీ, ఎకనామిక్స్ & సివిక్స్

HEC-GROUPపోటీ పరీక్షలే పరమావధిగా భావిస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యం ఉన్నవారికి హెచ్ఈసీ గ్రూపు మంచి ఎంపిక అవుతుంది.

దాదాపు అన్నిరకాల పోటీపరీక్షలలో హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్టులకు సంబంధించి మెజారిటీ ప్రశ్నలు కవర్ చేయబడతాయి. ఇంటర్మీడియట్ నుండే ఆయా అంశాల యందు పట్టు సాధించాలంటే హెచ్ఈసీ గ్రూపును పావుగా ఉపయోగించుకోవచ్చు.

ఈ మధ్యకాలంలో కొన్ని కార్పరేట్ సంస్థలు ఇంటర్ + డిగ్రీ + ఐఏఎస్ ప్రాతిపదికన కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంతో ఆర్ట్స్ గ్రూపుల యందు విద్యార్దులలో మళ్ళీ క్రజ్ మొదలైంది. అలానే ఇంటర్ తర్వాత బీఏ, బీకామ్, తర్వాత ఎంఏ, ఎంకామ్ వంటి పీజీ కోర్సులు చేయడం ద్వారా ఉన్నత విద్యా అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు.

గ్రూపు ఏదైనా విద్యార్ది అంతిమ లక్ష్యం మంచి ఉద్యోగ సాధన కాబట్టి, తీసుకున్నా గ్రూప్ యందు ఉత్తమ ప్రతిభ చూపించి, విషయ పరిశోధన యందు ఆసక్తి పెంచుకుని, అవకాశాలు అందిపుచ్చుకుని ఉన్నత విజయాలు సాధించండి.

Post Comment