Advertisement
తెలుగు వీక్లీ కరెంట్ అఫైర్స్ 06 ఫిబ్రవరి 2023 | పోటీ పరీక్షల స్పెషల్
Telugu Current Affairs

తెలుగు వీక్లీ కరెంట్ అఫైర్స్ 06 ఫిబ్రవరి 2023 | పోటీ పరీక్షల స్పెషల్

వీక్లీ కరెంట్ అఫైర్స్ 06 ఫిబ్రవరి 2023 తెలుగులో ఉచితంగా పొందండి. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, నిరుద్యోగుల సౌలభ్యం కోసం జాతీయంగా, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న తాజా సమకాలిన అంశాలను మీకు ఇక్కడ అందిస్తున్నాం. ఈ సమాచారం మీ పోటీపరీక్షల సన్నద్ధతను మరింత మెరుగుపరుచుస్తుంది భావిస్తున్నాం.

ఉత్తర బెంగాల్‌లో త్రిశక్తి ప్రహార్‌ సైనిక శిక్షణ వ్యాయామం

భారత ఆర్మీ యొక్క త్రిశక్తి ప్రహార్ శిక్షణ వ్యాయామంను జనవరి 21 నుండి 31 మధ్య ఉత్తర బెంగాల్‌లో వ్యూహాత్మక 'సిలిగురి' కారిడార్‌కు సమీపంలో నిర్వహించారు. 11 రోజుల ఈ సైనిక వ్యాయామంలో భారత సాయుధ దళాలతో పాటుగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలు కూడా పాల్గొన్నాయి.

ఇంటిగ్రేటెడ్ వాతావరణంలో సరికొత్త ఆయుధాలు మరియు పరికరాలను ఉపయోగించి భద్రతా దళాల యుద్ధ సన్నద్ధతను సాధన చేయడమే ఈ వ్యాయామం యొక్క ప్రధాన లక్ష్యం. పశ్చిమ బెంగాల్‌లో ఉన్న సిలిగురి కారిడార్, బంగ్లాదేశ్, భూటాన్ మరియు నేపాల్‌లకు ఉమ్మడి సరిహద్దుగా ఉంటుంది. ఇది ఈశాన్య భారతదేశాన్ని దేశంలోని ఇతర ప్రాంతాతో కలుపుతుంది.

46వ అంతర్జాతీయ కోల్‌కతా బుక్ ఫెయిర్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జనవరి 30న అంతర్జాతీయ కోల్‌కతా పుస్తక ప్రదర్శన 46వ ఎడిషన్‌ను ప్రారంభించారు. ఈ పుస్తక ప్రదర్శన జనవరి 31 నుండి ఫిబ్రవరి 12 వరకు బిధాన్‌నగర్‌లోని సెంట్రల్ పార్క్ మేళా మైదానంలో జరగనుంది. ఈ ఏడాది అంతర్జాతీయ కోల్‌కతా బుక్ ఫెయిర్ యొక్క థీమ్ దేశంగా స్పెయిన్ ఉండనుంది.

ఈ బుక్ ఫెయిర్‌లో అంతర్భాగమైన కోల్‌కతా లిటరేచర్ ఫెస్టివల్ 2023 యొక్క 9వ ఎడిషన్ ఫెయిర్‌గ్రౌండ్‌లోని ఆడిటోరియంలో ఫిబ్రవరి 9 నుండి 11 వరకు నిర్వహించనున్నారు. ఈ వేడుకకు దేశ నలుమూలల నుండి పుస్తక రచయితలు హాజరవుతారు.

అంతర్జాతీయ కోల్‌కతా పుస్తక ప్రదర్శన ప్రపంచంలోనే అతిపెద్ద నాన్-ట్రేడ్ బుక్ ఫెయిర్‌గా గుర్తింపు పొందింది. ఇది ఫ్రాంక్‌ఫర్ట్ బుక్ ఫెయిర్ మరియు లండన్ బుక్ ఫెయిర్ తర్వాత ప్రపంచంలోని మూడవ అతిపెద్ద వార్షిక పుస్తక ప్రదర్శనగా నిలుస్తుంది. ఈ పుస్తక ప్రదర్శనను 1976లో కోల్‌కతా పబ్లిషర్స్ అండ్ బుక్ సెల్లర్స్ గిల్డ్ మొదటిసారి ప్రారంభించారు.

కొత్త డ్రగ్స్ కంట్రోలర్‌ జనరల్‌గా రాజీవ్ సింగ్ రఘువంశీ

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కొత్త డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాగా డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ పేరును సిఫార్సు చేసింది. 2019 నుండి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్న డా వీజీ సోమాని స్థానంలో ఆయన బాధ్యతలు స్వికరించనున్నారు. డాక్టర్ రాజీవ్ సింగ్ ప్రస్తుతం ఇండియన్ ఫార్మకోపోయియా కమీషన్ యొక్క సెక్రటరీ కమ్ సైంటిఫిక్ డైరెక్టర్‌గా ఉన్నారు.

డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనేది సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సిఓ) కి నాయకత్వం వహిస్తుంది. ఇది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ నియంత్రణ సంస్థ. ఇది దేశంలో విక్రయించే ఔషదాలు మరియు సౌందర్య సాధనాల నాణ్యతను నిర్దారిస్తుంది, కొత్త ఔషధాల ఆమోదం మరియు క్లినికల్ ట్రయల్స్‌ని నియంత్రిస్తుంది.

మధ్యప్రదేశ్‌లో లాడ్లీ బెహనా యోజన పథకం ప్రారంభం

శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం మధ్యప్రదేశ్ నిరుపేద మహిళల కోసం కొత్తగా లాడ్లీ బెహనా యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద పేద మహిళలకు నెలకు రూ. 1000/- చెప్పున ఆర్థిక చేయూతను అందిస్తారు.

శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం 2007లో బాలిక శిశుహత్యలను అణిచివేసేందుకు లాడ్లీ లక్ష్మీ యోజన పేరుతొ అప్పటిలో ఇలాంటి పథకాన్నే ప్రారంభించారు. ఆ రాష్ట్రంలో పుట్టిన ఆడ పిల్లలకు 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత రూ. 1,43000 అందుకునేలా ఈ పథకం రూపొందించారు.

తెలంగాణలో తొలి కేజీ టు పీజీ క్యాంపస్‌ ప్రారంభం

తెలంగాణ మన ఊరు-మన బడి పథకం కింద తొలి కేజీ టు పీజీ క్యాంపస్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ప్రారంభించారు. గంభీరావుపేటలోని ఈ కొత్త కేజీ టు పీజీ క్యాంపస్‌కు తెలంగాణ సిద్ధాంతకర్త, విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెడుతున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పటిష్టత కోసం తెలంగాణ ప్రభుత్వం 2022 మార్చి 8న వనపర్తిలోని జెడ్పీ హైస్కూల్ (బాలుర)లో మన ఊరు మన బడి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 26,065 పాఠశాలను నూతన సదుపాయాలతో అప్‌గ్రేడ్ చేస్తున్నారు. దీని కోసం వచ్చే మూడేళ్ళలో 7200 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

ఇదే పథకం పరిధిలో కొత్తగా కేజీ టు పీజీ క్యాంపస్లు నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలలే కాకుండా కస్తూర్బాయి గాంధీ బాలికా విద్యాలయాలు, మోడల్ స్కూళ్ళు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలను కేజీ టు పీజీ క్యాంపస్లుగా రూపుదిద్దుతున్నారు.

ప్రముఖ తెలుగు దర్శకుడు కె. విశ్వనాథ్ (92) కన్నుమూశారు

లెజెండరీ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ కె. విశ్వనాథ్ ఫిబ్రవరి 2 న హైదరాబాద్‌లో 92 సంవత్సరాల వయస్సులో వయో సంబంధిత అనారోగ్యంతో మరణించారు. కె. విశ్వనాథ్ పూర్తి పేరు కాశీనాధుని విశ్వనాథ్. ఈయన స్వస్థలం గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకాలోని పెద పులివర్రు అనే గ్రామం. గుంటూరు హిందూకాలేజీ, ఎ.సి కాలేజీ నుండి బి.ఎస్సీ డిగ్రీ చేశారు. 1965లో 'ఆత్మగౌరవం' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు.

కె. విశ్వనాథ్ చలనచిత్ర దర్శకుడుగా శంకరాభరణం, సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం వంటి భారతీయ కళల నేపథ్యంలో చిత్రాలు నిర్మించి తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తీసుకొచ్చారు. శంకరాభరణం చిత్రం జాతీయ పురస్కారం గెలుచుకుంది. సప్తపదికి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది. స్వాతిముత్యం సినిమా 1986లో ఆస్కార్ అవార్డుకు అధికారిక ప్రవేశం పొందింది.

2016 లో విశ్వనాథ్ గారు భారతదేశంలోని చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నాడు. 1992 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఆయనకు రఘుపతి వెంకయ్య పురస్కారం వరించించింది. అదే సంవత్సరంలోనే పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు. ఈయన్ని గౌరవంగా కళాతపస్వి అని సంబోధిస్తారు.

సోలమన్ దీవుల్లో యూఎస్ రాయబార కార్యాలయం తిరిగి ప్రారంభం

పసిఫిక్‌లో దౌత్య సంబంధాలను పెంపొందించుకోవడానికి యునైటెడ్ స్టేట్స్ 30 సంవత్సరాల తర్వాత సోలమన్ దీవులలో రాయబార కార్యాలయాన్ని పునఃప్రారంభించింది. 1993 లో ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక, సోలమన్ దీవుల రాజధాని హోనియారాలోని తన రాయబార కార్యాలయాన్ని మూసివేసింది.

సోలమన్ దీవులు సౌత్ పసిఫిక్‌లోని వందలాది ద్వీపాలతో కూడిన సమూహం. దీని రాజధాని నగరం హోనియారా. ప్రస్తుతం మనస్సే సోగావేర్ ఆ దేశ ప్రధానిగా ఉన్నారు. ఇది 7 జూలై 1978లో యూకే నుండి స్వాతంత్రం పొందింది. ఈ దీవులు 1942 నుండి 1943 మధ్య రెండో ప్రపంచ యుద్దంకు సంబంధించి ప్రధాన భూ, సముద్ర మరియు వాయు వేదికలుగా ఉన్నాయి.

ప్రచ్ఛన్న యుద్ధం (కోల్డ్ వార్) అనేది యునైటెడ్ స్టేట్స్ మరియు సోవియట్ యూనియన్ మరియు వాటి మిత్రదేశాల మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత కాలాన్ని సూచించడానికి సాధారణంగా ఉపయోగించే పదం. ఇది 1985లో ప్రారంభమై 1991 వరకు కొనసాగింది. సోవియట్ యూనియన్ లేదా యునైటెడ్ స్టేట్స్ అధికారికంగా పరస్పరం యుద్ధం ప్రకటించనందున దీనిని ప్రచ్ఛన్న యుద్ధం అని పిలుస్తారు.

మహారాష్ట్ర రాష్ట్ర గీతంగా జై జై మహారాష్ట్ర మజా

ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం 'జై జై మహారాష్ట్ర మాజా'ని ఆ రాష్ట్ర గీతంగా ఆమోదించింది. 1960లో మహారాష్ట్ర రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ప్రభుత్వం అధికారిక రాష్ట్ర గీతాన్ని ప్రకటించింది. ఇక మీదట అన్ని అధికారిక కార్యక్రమాలు మరియు ఉత్సవ కార్యక్రమాలలో ఈ గీతం ప్లే చేయబడుతుంది.

హిందూ ప్రజల స్వయం పాలనకు పునాది వేసిన పురాణ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జన్మదినమైన ఫిబ్రవరి 19న ఈ పాట రాష్ట్ర గీతంగా ఆమోదించబడుతుంది. ఈ గీతాన్ని రాజా బాదే రాశారు. శ్రీనివాస్ ఖలే సంగీతం సమకూర్చారు. బల్లధీరుడు కృష్ణారావు సాబ్లే పాడారు. ఈ గీతం 1.41 నిమిషాల నిడివి ఉంది.

ఈక్వటోరియల్ గినియా తొలి మహిళా పీఎంగా మాన్యులా రోకా బోటీని

ఈక్వటోరియల్ గినియా నూతన ప్రధానమంత్రిగా మాన్యులా రోకా బోటీని బాధ్యతలు స్వీకరించనున్నారు. దీనితో ప్రధాని పదవిని చేపట్టిన ఆ దేశ తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు. రోటీ 2020 నుండి ప్రస్తుత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆ దేశ ప్రస్తుత పీఎం ఫ్రాన్సిస్కో పాస్కల్ ఒబామా అసూ స్థానంలో ఆమె త్వరలో నియమితులు కానున్నారు.

ఈక్వటోరియల్ గినియా మధ్య ఆఫ్రికా పశ్చిమ తీరంలో ఉన్న ఒక చిన్న దేశం. దీని రాజధాని నగరం మలాబో. 2021లో దీని జనాభా 1.5 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఈ దేశ ప్రస్తుత అధ్యక్షుడుగా టియోడోరో ఒబియాంగ్ మబాసోగో ఉన్నారు.

ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్‌ విజేతగా సాయి సంజయ్

ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ 2023, ఎంఆర్ఎఫ్ ఫార్ములా 2000 విభాగంలో సాయి సంజయ్ విజేతగా నిలిచాడు. 2022 లో పూర్తికావాల్సిన ఈ సీజన్ చివరి పోటీ మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో జరిగింది. అలానే ప్రతీక్ సోనవానే మరియు విశ్వాస్ విజయరాజ్ వరుసగా పోలో కప్ మరియు ఫార్ములా ఎల్జీబీ 1300 టైటిళ్లను గెలుచుకున్నారు.

లావోస్‌లో భారత తదుపరి రాయబారిగా ప్రశాంత్ అగర్వాల్

లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్‌కు తదుపరి భారత రాయబారిగా ప్రశాంత్ అగర్వాల్ నియమితులయ్యారు. ప్రశాంత్ అగర్వాల్ ప్రస్తుతం రిపబ్లిక్ ఆఫ్ నమీబియాలో భారత హైకమిషనరుగా ఉన్నారు. ప్రశాంత్ అగర్వాల్ 1998 బ్యాచ్‌కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి.

లడఖ్ యొక్క మొదటి జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా యాయా త్సో

లడఖ్ యొక్క మొట్టమొదటి జీవవైవిధ్య వారసత్వ ప్రదేశం (బిహెచ్‌ఎస్)గా యాయా త్సో ప్రతిపాదించబడింది. సముద్ర మట్టానికి 4,820 మీటర్ల ఎత్తులో ఉన్న లడఖ్‌లోని యాయా త్సో సరస్సు పక్షుల స్వర్గధామంగా ప్రసిద్ధి చెందింది. ప్రతిపాదిత యాయా త్సో సైట్ సుమారు 60 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది, ఇందులో సరస్సు యొక్క పరీవాహక ప్రాంతం కూడా ఉంది. లడఖ్‌లోని అత్యంత అందమైన సరస్సులలో యాయా త్సో ఒకటి.

సుప్రీంకోర్టు 73వ వ్యవస్థాపక దినోత్సవంలో సింగపూర్ చీఫ్ జస్టిస్

సింగపూర్ ప్రధాన న్యాయమూర్తి గౌరవ అతిథిగా ఫిబ్రవరి 4న, భారత సుప్రీంకోర్టు 73వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. సుప్రీంకోర్టు వార్షికోత్సవాన్ని జరుపుకోవడం ఇదే తొలిసారి. 1950 జనవరి 26న భారతదేశం రిపబ్లిక్‌గా అవతరించిన రెండు రోజుల తర్వాత జనవరి 28న సుప్రీంకోర్టు ఉనికిలోకి వచ్చింది. సుప్రీంకోర్టు ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది.

సిజెఐ డివై చంద్రచూడ్ ఆహ్వానం మేరకు సుప్రీంకోర్టు 73వ వార్షికోత్సవానికి సింగపూర్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుందరేష్ మీనన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. "ది రోల్ ఆఫ్ ది రోల్" "మారుతున్న ప్రపంచంలో న్యాయవ్యవస్థ పాత్ర" అనే అంశంపై ఆయన ఉపన్యాసం ఇచ్చారు. సుందరేష్ మీనన్ 2012 నుండి సింగపూర్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.

36వ సూరజ్‌కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా ప్రారంభం

వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్‌ఖర్ హర్యానాలోని ఫరీదాబాద్‌లో 36వ సూరజ్‌కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళాను ప్రారంభించారు. భారతీయ హస్తకళలు, చేనేత మరియు జానపద సంప్రదాయాలను ప్రదర్శించే జాతర ఫిబ్రవరి 3 నుండి 19 వరకు నిర్వహిస్తారు.

"సూరజ్‌కుండ్ డిజైనర్స్ విలేజ్" అని పిలువబడే ఈ వార్షిక వేడుకలో దేశంలోని అన్ని ప్రాంతాల నుండి సాంప్రదాయ కళాకారులు, చిత్రకారులు, చేనేత కార్మికులు మరియు శిల్పులు పాల్గొంటారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రాఫ్ట్ ఫెయిర్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ ఉత్సవం 1987 లో తొలిసారిగా ప్రారంభమైంది.

న్యూ ఇండియా అస్యూరెన్స్ నుండి 'పే యాజ్ యు డ్రైవ్' పాలసీ

న్యూ ఇండియా అస్యూరెన్స్ (NIA) 'పే యాజ్ యు డ్రైవ్' (PAYD) అనే నూతన పాలసీని ప్రారంభించింది. ఈ నూతన పాలసీ వాహన వినియోగం ఆధారంగా ప్రీమియం వసూలు చేసే సమగ్ర మోటార్ బీమా పాలసీని ఆఫర్ చేస్తుంది. ఈ పాలసీలో రెండు భాగాలు ఉన్నాయి, ఇది థర్డ్-పార్టీ కవర్ మరియు సొంత-డ్యామేజ్ కవర్ సౌలభ్యన్ని అందిస్తుంది.

ఈ పాలసీ ద్వారా నిర్దిష్ట కిలోమీటర్లకు మించి నడపని వాహన వినియోగదారులు, పునరుద్ధరణ ప్రీమియంపై డబ్బును ఆదా చేయవచ్చు. ఇది వినియోగించని వాహనాల ఇన్సూరెన్స్ ప్రీమియం బెడదను తగ్గిస్తుంది.

వాహనం కిలోమీటర్ థ్రెషోల్డ్ పరిమితికి మించి నడిపినట్లయితే, పాలసీ యొక్క మిగిలిన వ్యవధి వరకు ఈ కవరేజ్ కొనసాగుతుంది. ఈ పాలసీ ద్వారా అదనంగా నిల్ తరుగుదల, ఇంజిన్ రక్షణ, ఇన్‌వాయిస్‌కు రిటర్న్, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి మొదలైన యాడ్-ఆన్స్ సదుపాయాలు కూడా కల్పిస్తుంది.

న్యూ ఇండియా అస్యూరెన్స్ అనేది ముంబై కేంద్రంగా ఉన్న భారతీయ ప్రభుత్వ రంగ జనరల్ బీమా కంపెనీ. ఇది విదేశీ కార్యకలాపాలతో సహా స్థూల ప్రీమియం సేకరణ ఆధారంగా భారతదేశంలో అతిపెద్ద జాతీయం చేయబడిన బీమా కంపెనీగా ఉంది. ఇది 1919లో సర్ దొరాబ్జీ టాటాచే స్థాపించబడింది. 1973లో జాతీయం చేయబడింది.

కర్ణటకలో ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ఫ్యాక్టరీ ప్రారంభం

కర్ణాటకలోని తుమకూరులో నిర్మించిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ యొక్క హెలికాప్టర్ ఫ్యాక్టరీని ఫిబ్రవరి 6న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్త దిశగా 2016లో దీనికి శంకుస్థాపన చేశారు. ఇది పూర్తిస్థాయి గ్రీన్‌ఫీల్డ్ హెలికాప్టర్ ఫ్యాక్టరీ. ప్రస్తుతం ఇది ఆసియాలో అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రంగా మారింది.

ఈ హెలికాప్టర్ తయారీ కేంద్రంలో మొదట లైట్ యుటిలిటీ హెలికాప్టర్లను (LUH) ఉత్పత్తి చేయనున్నారు. ఎల్‌యూహెచ్ హెలికాప్టర్లు అనేవి స్వదేశీంగా అభివృద్ధి చేయబడిన 3-టన్నుల సింగిల్-ఇంజిన్ మల్టీపర్పస్ యుటిలిటీ కాప్టర్లు. వీటిని సైనిక లాజిస్టిక్ కాఫ్టర్లుగా ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో లైట్ కంబాట్ హెలికాప్టర్ (LCH) మరియు ఇండియన్ మల్టీరోల్ హెలికాప్టర్ (IMRH) వంటి ఇతర హెలికాప్టర్‌లను తయారు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

దీనితో పాటు తుమకూరు ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌కు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. చెన్నై, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌ అభివృద్ధిలో భాగంగా నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద దాదాపు 8,484 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నారు. అలానే తుమకూరులోని తిప్టూరు, చిక్కనాయకనహళ్లిలో రెండు జల్‌ జీవన్‌ మిషన్‌ ప్రాజెక్టులకు కూడా మోదీ శంకుస్థాపన చేశారు.

గ్రామీ అవార్డు 2023 విజేతలు

65వ వార్షిక గ్రామీ అవార్డుల వేడుక ఫిబ్రవరి 5, 2023న యునైటెడ్ స్టేట్స్‌లోని లాస్ ఏంజిల్స్‌లో హాట్టహాసంగా నిర్వహించారు. అరేనాలో జరిగిన ఈ వార్షిక సంగీత అవార్డుల వేడుకలో అత్యుత్తమ రికార్డింగ్‌లు, కంపోజిషన్‌లు మరియు కళాకారులకు అవార్డులు అందిస్తారు.

  • భారతీయ సంగీత స్వరకర్త మరియు నిర్మాత రికీ కేజ్‌ తన కెరీరులో మూడవ గ్రామీ అవార్డు అందుకున్నారు. దీనితో మూడుసార్లు గ్రామీని గెలుచుకున్న ఏకైక సజీవ భారతీయుడుగా నిలిచాడు. రికీ 2015లో తన మొదటి గామీ గెలుచుకున్నాడు. ఇండియా నుండి గ్రామీ అవార్డులు అందుకున్న నలుగురు స్వరకర్తలలో రికీ మోస్ట్ యాంగేస్ట్.
  • రికార్డ్ ఆఫ్ ది ఇయర్ : అబౌట్ డామ్న్ టైమ్ (మెలిస్సా వివియన్ జెఫెర్సన్ (లిజ్జో) )
  • ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ : హ్యారీస్ హౌస్ (హ్యారీ స్టైల్స్)
  • సాంగ్ ఆఫ్ ది ఇయర్ : జస్ట్ లైక్ దట్ (బోనీ రైట్)
  • బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ : సమారా జాయ్ మెక్‌లెండన్
  • బెస్ట్ పాప్ సోలో పెర్ఫార్మెన్స్ : ఈజీ ఆన్ మి (అడెలె)
  • బెస్ట్ ఇమ్మర్సివ్ ఆడియో ఆల్బమ్‌ - డివైన్ టైడ్స్ (రికీ కేజ్)

మహీంద్రా ఫైనాన్స్‌కి ఎండి మరియు సిఇఒగా రౌల్ రెబెల్లో

మహీంద్రా & మహీంద్రా గ్రూప్ యొక్క వెహికల్ ఫైనాన్సింగ్ యూనిట్ అయిన మహీంద్రా ఫైనాన్స్ ఎండి మరియు సిఇఒగా రౌల్ రెబెల్లో నియమితులయ్యారు. ప్రస్తుత సీఈఓ రమేష్ అయ్యర్ ఏప్రిల్ 29న పదవీ విరమణ చేసిన వెంటనే ఆయన ఈ కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు. రౌల్ రెబెల్లో ప్రస్తుతం ఇదే కంపెనీలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు.

గర్వి గుజరాత్ పర్యటన కోసం భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు

గుజరాత్ రాష్ట్ర సాంస్కృతిక & ఆధ్యాత్మిక వారసత్వాన్ని సందర్శించేందుకు భారతీయ రైల్వే గర్వి గుజరాత్‌ టూర్ పేరుతొ కొత్త తీర్థ యాత్రను ప్రారంభించింది. ఈ యాత్రలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, చంపానేర్, సోమనాథ్, ద్వారక, నాగేశ్వర్, బేట్ ద్వారక, అహ్మదాబాద్, మోధేరా మరియు పటాన్ వంటి గుజరాత్‌లోని ప్రముఖ తీర్థయాత్ర మరియు వారసత్వ ప్రదేశాలను కవర్ చేస్తున్నారు.

భారతీయ రైల్వేలు 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' పథకం కింద భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలును నడుపుతున్నాయి. ఈ అత్యాధునికమైన భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైళ్లు ద్వారా దేశంలోని ప్రముఖ సందర్శన ప్రదేశాలకు తీర్ధయాత్రలు నిర్వహిస్తున్నారు.

ఈ రైళ్లలలో ఫస్ట్ క్లాస్ ఏసీ మరియు సెకండ్ క్లాస్ ఏసీతో పాటు, ప్యాంట్రీ కార్, రెండు రైల్ రెస్టారెంట్లు ఉంటాయి. ఇందులో 156 మంది పర్యాటకులు ప్రయాణించవచ్చు. ఈ యాత్రలు వారం నుండి 10 రోజుల నిడివితో నిర్వహిస్తున్నారు.

లక్నోలో 6వ షాంఘై సహకార సంస్థ నాయకుల సమావేశం

ఫిబ్రవరి 6 న లక్నోలో ప్రారంభమైన 6వ షాంఘై సహకార సంస్థ (SCO) సుప్రీం ఆడిట్ ఇన్‌స్టిట్యూషన్స్ (SAI) నాయకుల సమావేశానికి కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) హోస్టుగా వ్యవహరించింది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ సమావేశాలలో ఎనిమిది షాంఘై సహకార సంస్థ సభ్య దేశ ప్రతినిధి బృందాలు పాల్గున్నాయి.

షాంఘై సహకార సంస్థ అనేది 1996 లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా మరియు తజికిస్తాన్ మధ్య ఏర్పడిన యురేషియా రాజకీయ, ఆర్థిక, అంతర్జాతీయ భద్రత మరియు రక్షణ సంస్థ. ప్రస్తుతం దీనిలో ఇండియా, పాకిస్థాన్, ఉజ్బెకిస్తాన్ కలుపుకుని మొత్తం ఎనిమిది దేశాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, బెలారస్, ఇరాన్ మరియు మంగోలియాలు త్వరలో సభ్య దేశాలుగా మారనున్నాయి.

కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 148 ద్వారా స్థాపించబడిన భారతదేశ అత్యున్నత ఆడిట్ సంస్థ. దీనిని 1858లో స్థాపించారు. కాగ్ యూనియన్ మరియు రాష్ట్రంలోని అన్ని ట్రేడింగ్, తయారీ, లాభం మరియు నష్టాల ఖాతాలు మరియు బ్యాలెన్స్ షీట్లు మరియు ఇతర అనుబంధ ఖాతాలను ఆడిట్ చేస్తుంది.

ముంబైలో కాలా ఘోడా ఆర్ట్స్ ఫెస్టివల్ ప్రారంభం

కాలా ఘోడా అసోసియేషన్ యొక్క కాలా ఘోడా ఆర్ట్స్ ఫెస్టివల్ 2023 ముంబైలో ప్రారంభమైంది. ఈ వారీక్ష ఉత్సవం 1999 నుండి ఏటా నిర్వహిస్తున్నారు. ఇది ఏటా ఫిబ్రవరి మొదటి శనివారం ప్రారంభమయి ఫిబ్రవరి రెండవ ఆదివారం నాడు ముగుస్తుంది. ఇది ఆసియాలో అతిపెద్ద బహుళ సాంస్కృతిక వీధి కళా ఉత్సవాల్లో ఒకటి. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాభిమానులు హాజరవుతారు.

ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరామ్ కన్నుమూశారు

ప్రముఖ దక్షిణ భారత నేపథ్య గాయని వాణీ జయరామ్ చెన్నైలోని తన ఇంట్లో తుది శ్వాస విడిచారు. 1945 నవంబర్ 30న జన్మించిన ఈమె వెయ్యికి పైగా భారతీయ సినిమాలకు ప్లేబ్యాక్ గాయనిగా పనిచేశారు, 10 వేలకు పైగా పాటలను రికార్డ్ చేశారు. వాణీ జయరామ్‌కు భారత ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది.

వాణీ జయరామ్ తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం, మరాఠీ, ఒడియా, గుజరాతీ, హర్యాన్వి, అస్సామీ, తుళు మరియు బెంగాలీ భాషలలో ఆలపించారు. ఈమె మూడుసార్లు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది. అలానే ఫిల్మ్‌ఫేర్ ద్వారా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో పాటుగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిసా మరియు గుజరాత్ రాష్ట్రాల నుండి రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను అందుకున్నారు.

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు మరియు ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ సుదీర్ఘ అనారోగ్యంతో దుబాయ్‌లోని ఒక ఆసుపత్రిలో ఫిబ్రవరి 5 న మరణించారు. 1999లో తిరుగుబాటుతో పాకిస్తాన్ అధికారాన్ని చేజిక్కించుకున్న ముషారఫ్, 2001 మరియు 2008 మధ్య ఆ దేశ అధ్యక్షుడిగా పనిచేశారు.

2008లో జరిగిన ఆ దేశ మొట్టమొదటి ప్రజాస్వామ్య ఎన్నికలలో ముషారఫ్ పార్టీ ఓడిపోయింది. పార్లమెంటులో అభిశంసన ఎదుర్కొన్న ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేసి లండన్‌కు పారిపోయారు. 2013లో తిరిగి పాకిస్థాన్‌కు వెళ్లి పార్లమెంటులో స్థానం కోసం పోటీ చేసినా వెంటనే అనర్హత వేటు వేయబడింది.

ముషారఫ్ 2016లో దుబాయ్ వెళ్లేందుకు అనుమతి పొందారు. 2007లో ఎమర్జెన్సీ రూల్ విధించినందుకు గాను ఆ దేశ సుప్రీం కోర్టు 2019లో అతనికి మరణశిక్ష విధించింది, అయితే ఆ తీర్పు తర్వాత రద్దు చేయబడింది.

యూపీలో గ్లోబల్ జాయింట్ వీసా అప్లికేషన్ సెంటర్ ప్రారంభం

ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ ఆ రాష్ట్రంలో తొలి వీఎఫ్‌ఎస్ గ్లోబల్ జాయింట్ వీసా అప్లికేషన్ సెంటర్ ప్రారంభించారు. ఈ సెంటర్ ద్వారా ఆస్ట్రేలియా, చెక్ రిపబ్లిక్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, క్రొయేషియా, ఇటలీ, సౌదీ అరేబియా, హంగేరీ, జర్మనీ సహా పలు దేశాల వీసా దరఖాస్తులను స్వీకరించనున్నరు. ఈ వీసా దరఖాస్తు కేంద్రం సంవత్సరానికి 1.20 లక్షల వీసా దరఖాస్తులను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

యువ సంగం రిజిస్ట్రేషన్ పోర్టల్ ప్రారంభం

ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తితో ఈశాన్య ప్రాంత యువతతో మిగిలిన భారతదేశంలోని యువత మధ్య సన్నిహిత సంబంధాలను ఏర్పరచడానికి ప్రభుత్వం “యువ సంగం” రిజిస్ట్రేషన్ పోర్టల్ ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 20 వేలకు పైగా యువతకు క్రాస్ కల్చరల్ లెర్నింగ్ పేరిట దేశ వ్యాప్తంగా పర్యటించే అవకాశం కల్పిస్తారు.

ఈ పోర్టల్ విద్యా మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, సంస్కృతి మరియు పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, న్యాయ శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు మరియు క్రీడలు & యువజన వ్యవహారాల మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఇతర ప్రముఖుల సమక్షంలో ప్రారంభించబడింది. ఈ కార్యక్రమం భారతదేశాన్ని చూడడానికి, తెలుసుకోవటానికి, అర్థం చేసుకోవడానికి మరియు దేశం కోసం ఏదైనా చేసే అవకాశాన్ని కల్పిస్తుందని వీరు భావిస్తున్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆరోన్ ఫించ్

ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆరోన్ ఫించ్ టీ20ఐ జట్టు కెప్టెన్‌గా ఆస్ట్రేలియాకు రికార్డు స్థాయిలో 76 మ్యాచ్‌లలో నాయకత్వం వహించాడు. ఫించ్ నాయకత్వంలో ఆస్ట్రేలియా 2021 మొదటిసారి టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. గత ఏడాది సెప్టెంబర్‌లో వన్డే ఇంటర్నేషనల్స్ నుండి రిటైర్ అయిన ఫించ్, అరంగేట్రం చేసిన 12 ఏళ్ల తర్వాత అన్ని అంతర్జాతీయ క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

నేపాల్ జాతీయ క్రికెట్ జట్టుకు కొత్త కోచ్‌గా మాంటీ దేశాయ్‌

నేపాల్ క్రికెట్ అసోసియేషన్ నేపాల్ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ మాంటీ దేశాయ్‌ను నియమించింది. గత డిసెంబర్ 2022లో ఈ పదవికి రాజీనామా చేసిన మరో భారత మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ స్థానంలో మాంటీ దేశాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. దేశాయ్ గతంలో వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు, ఐపీఎల్ యందు రాజస్థాన్ రాయల్ జట్టుకు కోచ్‌గా పనిచేశారు.

టర్కీ మరియు సిరియాలో ఘోరమైన భూకంపం

6 ఫిబ్రవరి 2023న దక్షిణ టర్కీ మరియు సిరియాలో వినాశకరమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం కొన్ని గంటల వ్యవధిలో రిక్టర్ స్కేల్‌పై 7.8 మరియు 7.5 తీవ్రతతో టర్కీ మరియు సిరియాలను కదిలించింది. టర్కీలో 1939లో వచ్చిన భూకంపం తర్వాత ఇదే అతిపెద్దది.

ఈ భూకంపం కారణంగా లక్షల మంది నిరాశ్రయులు అవ్వడమే కాకుండా అనధికారిక గణాంకాల మేరకు 50 వేలకు పైగా మృత్యవాత పడినట్లు సమాచారం. 105 దేశాలు మరియు 16 అంతర్జాతీయ సంస్థలు భూకంప బాధితులకు మానవతా సహాయాన్ని అందించాయి.

భూకంపం అనేది భూమి యొక్క లిథోస్పియర్‌లో అకస్మాత్తుగా శక్తి విడుదలయ్యి భూకంప తరంగాలను సృష్టిస్తుంది. దీని వల్ల భూమి యొక్క ఉపరితలం వణుకుతుంది. భూకంపాలు సాధారణంగా భూగర్భ శిల అకస్మాత్తుగా విరిగిపోయినప్పుడు లేదా వేగవంతమైన చలనం ఏర్పడినప్పుడు సంభవిస్తాయి. 80 శాతానికి పైగా పెద్ద భూకంపాలు పసిఫిక్ మహాసముద్రం అంచుల చుట్టూ సంభవిస్తాయి , ఈ ప్రాంతాన్ని 'రింగ్ ఆఫ్ ఫైర్' అని పిలుస్తారు.

భూకంపాల తీవ్రతను కొలవడానికి శాస్త్రవేత్తలు రిక్టర్ స్కేల్‌ను ఉపయోగిస్తారు. దీనిని మాగ్నిట్యూడ్ స్కేల్ లేదా గుటెన్‌బర్గ్-రిక్టర్ స్కేల్ అని కూడా పిలుస్తారు. దీనిని 1934 లో చార్లెస్ ఫ్రాన్సిస్ రిక్టర్ అభివృద్ధి చేశాడు. రిక్టర్ స్కేల్ అనేది 1-10 లాగరిథమిక్ స్కేల్. రిక్టర్ స్కేల్ యందు ప్రతి పాయింట్  పెరుగుదల, భూమి వణుకుతున్న పరిమాణంను 10 రెట్లు సూచిస్తుంది మరియు విడుదలైన శక్తి మొత్తం 32 రెట్లుకు పెరుగుతుంది.

భారతీయ రైల్వేలో వాట్సాప్ ఫుడ్ డెలివరీ సదుపాయం

భారతీయ రైల్వే వాట్సాప్ ఫుడ్ డెలివరీ ఫెసిలిటీ 'జూప్ (Zoop)'ను ప్రారంభించింది. దీని ద్వారా భారతీయ రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులు ఇప్పుడు వాట్సాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. ప్రయాణికులు తమ పీఎన్ఆర్ నెంబర్ సహాయంతో ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఆర్డర్ చేసిన ఆహారాన్ని దగ్గరలో ఉండే రైల్వే రెస్టారెంటుల నుండి డెలివరీ చేస్తారు.

ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశంకు మొదటి స్థానం

ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కార్పొరేట్ స్టాటిస్టిక్స్ డేటాబేస్ (FAOSTAT) డేటా ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారునిగా నిలిచింది. 2021-22 ఏడాదికి సంబంధించిన ఈ నివేదికలో గ్లోబల్ పాల ఉత్పత్తికలో భారత దేశం 24 శాతం వాటాతో అగ్రస్థానం దక్కించుకుంది. ఇకపోతే భారతదేశంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ఉండగా. తర్వాత స్థానాలలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.

విదేశాల్లో ఫోన్‌పే పేమెంట్ సేవలు ప్రారంభం

భారతదేశపు అతిపెద్ద డిజిటల్ చెల్లింపు సంస్థ ఫోన్‌పే ఇంటర్నేషనల్ యూపీఐ చెల్లింపు సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఫోన్‌పే వినియోగదారులు ఇప్పుడు తమ భారతీయ బ్యాంకు ఖాతాలను ఉపయోగించి యుఎఇ, సింగపూర్, మారిషస్, నేపాల్ మరియు భూటాన్‌లోని వ్యాపారి అవుట్‌లెట్‌లలో చెల్లించవచ్చని నివేదించింది. దీనితో క్రాస్-బోర్డర్ యూపీఐ సేవలు ప్రారంభించిన మొదటి సంస్థగా ఫోన్‌పే నిలిచింది.

గోల్డెన్ బుక్ అవార్డులు 2023 విజేతలు

వింగ్స్ పబ్లికేషన్ గోల్డెన్ బుక్ అవార్డ్ 2023 విజేతలను ప్రకటించింది. ఈ అవార్డును ఏడాదిలో ప్రచురించబడిన అత్యుత్తమ రచనలకు అందిస్తారు. భారతదేశంలోని ప్రముఖ స్వతంత్ర ప్రచురణకర్త అయిన వింగ్స్ పబ్లికేషన్ ఇంటర్నేషనల్ ఈ అవార్డులను నిర్వహిస్తుంది.

డాక్టర్ కైలాష్ పింజాని (ప్రెసిడెంట్ ఇండియన్ ఆథర్స్ అసోసియేషన్), డాక్టర్ దీపక్ పర్బత్ (సూపర్ ఫాస్ట్ రచయిత వ్యవస్థాపకుడు) & మురళీ సుందరం (TLC వ్యవస్థాపకుడు) వంటి సాహిత్య నిపుణుల బృందం ఈ అవార్డ విజేతలను ఎంపిక చేసింది. గోల్డెన్ బుక్ అవార్డులు 2023 విజేతల పూర్తి జాబితా

ముంబైలో అరబిక్ అకాడమీని ప్రారంభించిన ప్రధాని మోదీ

ముంబైలోని మరోల్‌లో దావూదీ బోహ్రా కమ్యూనిటీకి చెందిన ప్రధాన విద్యా సంస్థ అల్జామియా-తుస్-సైఫియా అరబిక్ అకాడమీ (ది సైఫీ అకాడమీ) కొత్త క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దావూదీ బోహ్రా కమ్యూనిటీ అధినేత సయ్యద్నా ముఫద్దల్ సైఫుద్దీన్ కూడా పాల్గొన్నారు.

దావూదీ బోహ్రాలు షియా ఇస్లాం యొక్క ఇస్మాలీ శాఖలోని ఒక మతపరమైన తెగ. ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో స్థిరపడ్డారు. వీరిలో అత్యధిక మంది భారతదేశం, పాకిస్తాన్, యెమెన్, తూర్పు ఆఫ్రికా దేశాల్లో  నివసిస్తున్నారు.

వీపీ నందకుమార్‌కు హురున్ ఇండియా అవార్డు

మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ సీఈఓ వీపీ నందకుమార్‌కు ది హురున్ ఇండస్ట్రీ అచీవ్‌మెంట్ అవార్డ్ 2022 లభించింది. ముంబయిలో జరిగిన ఈ అవార్డు కార్యక్రమంలో హురున్ ఇండియా అధికారుల నుండి శ్రీ నందకుమార్ ది హురున్ ఇండస్ట్రీ అచీవ్‌మెంట్ అవార్డ్ 2022ని అందుకున్నారు. మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ వ్యాపార ప్రపంచంలో నందకుమార్ సాధించిన విజయాలకు గాను ఈ అవార్డు లభించింది.

విశ్వభారతికి త్వరలో లివింగ్ హెరిటేజ్‌ యూనివర్సిటీగా గుర్తింపు

కోల్‌కతాలోని విశ్వభారతి విశ్వవిద్యాలయం త్వరలో ప్రపంచంలోని మొట్టమొదటి 'జీవన వారసత్వ విశ్వవిద్యాలయం'గా చరిత్ర సృష్టించనుంది. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడంలో మరియు ప్రోత్సహించడంలో ఈ విశ్వవిద్యాలయం పాత్రను గుర్తించిన యునెస్కో, ఈ ఏడాది ఏప్రిల్ లేదా మేలో ఈ హెరిటేజ్‌ యూనివర్సిటీ గౌరవాన్ని ప్రకటించనుంది.

విశ్వభారతి విశ్వవిద్యాలయం 1921లో నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ చేత స్థాపించబడింది. విశ్వభారతి 1951లో పార్లమెంటు చట్టం ద్వారా కేంద్రీయ విశ్వవిద్యాలయంగా మరియు జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా ప్రకటించబడింది. దేశంలో ప్రధానిమంత్రి వైస్-ఛాన్సలర్‌గా ఉండే ఏకైక యూనివర్సిటీ ఇదే.

'సేవ్ వెట్‌ల్యాండ్స్ క్యాంపెయిన్' ప్రారంభించిన భూపేందర్ యాదవ్

కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఫిబ్రవరి 4 న 'సేవ్ వెట్‌ల్యాండ్స్ క్యాంపెయిన్'ని ప్రారంభించారు. చిత్తడి నేలల పరిరక్షణలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. దీని ద్వారా పర్యావరణ, ఆర్థిక మరియు వాతావరణ భద్రతను భద్రపరచడంలో చిత్తడి నేల పర్యావరణ వ్యవస్థ పోషించే కీలక పాత్రపై అవగాహన కల్పిస్తారు.

ఇదే వేదిక ద్వారా 'ఇండియాస్ 75 అమృత్ ధరోహర్- ఇండియాస్ రామ్‌సర్ సైట్స్ ఫ్యాక్ట్‌బుక్' మరియు 'మేజింగ్ క్లైమేట్ రిస్క్‌ ఇన్ వెట్‌ల్యాండ్స్ - ఎ ప్రాక్టీషనర్స్ గైడ్' అనే రెండు పుస్తకాలను విడుదల చేశారు.

భారతదేశంలో ప్రస్తుతం 75 రామ్‌సర్ సైట్‌లు ఉన్నాయి. ఒరిస్సాలోని చిలికా సరస్సు మరియు రాజస్థాన్‌లోని కియోలాడియో నేషనల్ పార్క్ భారతదేశంలోని మొదటి రామ్‌సర్ సైట్‌లుగా గుర్తించబడ్డాయి. భారతదేశంలోని అతిపెద్ద చిత్తడి నేల సుందర్‌బన్స్. ఇరాన్‌లోని రామ్‌సర్ కన్వెన్షన్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిత్తడి నెలలకు రామ్‌సర్ సైట్‌ గుర్తింపు కల్పిస్తుంది.

Post Comment