Today Current affairs 2 December 2023. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.
ఐఎండి ప్రపంచ డిజిటల్ పోటీతత్వంలో ఇండియాకు 49వ స్థానం
ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ (ఐఎండి) నివేదిక ప్రకారం ప్రపంచ డిజిటల్ పోటీతత్వ ర్యాంకింగ్‌లో భారతదేశం 49వ స్థానంలో నిలిచింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని 14 దేశాలలో భారతదేశం 12వ స్థానంలో ఉంది. ఈ ర్యాంకింగులో యునైటెడ్ స్టేట్స్ మొదటి స్థానంలో నిలవగా తర్వాత స్థానాలలో నెదర్లాండ్స్ మరియు సింగపూర్ దేశాలు ఉన్నాయి. మరోవైపు 20 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న 27 దేశాలలో భారతదేశం 18వ స్థానంలో ఉంది. ఈ ర్యాంకింగ్ టాప్ ఆర్థిక వ్యవస్థలు కలిగిన 64 దేశాలకు సంబంధించి ఇవ్వబడింది.
ఐఎండి ప్రపంచ డిజిటల్ పోటీతత్వ ర్యాంకింగ్ ప్రభుత్వ విధానాలు, వ్యాపార నమూనాలు మరియు సమాజ పరివర్తనకు దారితీసే డిజిటల్ సాంకేతికతలను దేశాలు ఏ మేరకు అవలంబించి, అన్వేషిస్తున్నాయనే అనేదానిని అంచనా వేచి ర్యాంక్ చేస్తుంది.2022 నాటికి డెన్మార్క్ ప్రపంచంలోనే అత్యంత డిజిటల్ పోటీ దేశంగా ర్యాంక్ పొందింది. తాజా ర్యాంకింగులో నాల్గువ స్థానంలో నిలిచింది. ప్రపంచ డిజిటల్ పోటీతత్వంలో టాప్ 10 దేశాలు.
- యునైటెడ్ స్టేట్స్
- నెదర్లాండ్స్
- సింగపూర్
- డెన్మార్క్
- స్విట్జర్లాండ్
- దక్షిణ కొరియా
- స్వీడన్
- ఫిన్లాండ్
- తైవాన్, చైనా
- హాంగ్ కాంగ్
నాగాలాండ్ హార్న్‌బిల్ ఫెస్టివల్ 2023
నాగాలాండ్‌లోని నాగా హెరిటేజ్ విలేజ్ కిసామాలో 24వ హార్న్‌బిల్ ఫెస్టివల్ 2023 నిర్వహించారు. నాగాలాండ్‌లో ప్రసిద్ధి చెందిన ఈ హార్న్‌బిల్ ఫెస్టివల్ ఏటా డిసెంబర్ 1న ప్రారంభమై డిసెంబర్ 10కు నిర్వహిస్తారు. మొదటి హార్న్‌బిల్ పండుగ డిసెంబర్ 2000 లో నిర్వహించారు. నాగ సంస్కృతిని విస్తృతంగా వ్యాప్తి చేయడం మరియు రక్షించబడటం ఈ వేడుక యొక్క ప్రధాన లక్ష్యం. ఈ ఉత్సవానికి ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది సందర్శకులు హాజరౌతారు.
ఈ పండుగలో నాగా తెగల గొప్ప వారసత్వాన్ని ప్రదర్శించే వివిధ రకాల సాంప్రదాయ నృత్యాలు, పాటలు మరియు సంగీత ప్రదర్శనలు ఉంటాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జర్మనీ మరియు కొలంబియాలు ఈ సంవత్సరం భాగస్వామ్య దేశాలుగా పాల్గొంటున్నాయి. అస్సాం భాగస్వామి రాష్ట్రంగా హాజరవుతుంది. ఈ పండగను ఈశాన్య రాష్ట్రాలలో కనిపించే హార్న్‌బిల్ అనే పక్షి పేరుతొ నిర్వహిస్తారు. హార్న్‌బిల్ అరుణాచల్ ప్రదేశ్ మరియు కేరళ రెండింటికి రాష్ట్ర పక్షిగా ఉంది.
బెంగళూరు రచయితకు ఫ్రెంచ్ సాహిత్య గౌరవం
బెంగుళూరుకు చెందిన నవలా రచయిత్రి మరియు అనువాదకురాలు అర్షియా సత్తార్, సాహిత్యం మరియు సాంస్కృతిక మార్పిడికి చేసిన విశిష్టమైన కృషికి గాను ఫ్రెంచ్ సాహిత్య బహుమతి 'నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ (చెవలియర్ డాన్స్ ఎల్'ఆర్డ్రే డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్)" అందుకున్నారు. నవంబర్ 28న బెంగళూరులోని ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్‌లో జరిగిన కార్యక్రమంలో భారతదేశంలోని ఫ్రాన్స్ రాయబారి థియరీ మాథౌ ఈ అవార్డును ఆమెకు అందజేశారు.
అనువాదకురాలిగా మరియు రచయిత్రిగా సాహిత్య రంగంలో ఆమె సాధించిన అత్యుత్తమ విజయాలతోపాటు సాహిత్య రెసిడెన్సీ సంగమ్ హౌస్‌కి డైరెక్టర్‌గా సాహిత్య ప్రమోషన్‌పై ఆమె లోతైన నిబద్ధతకు గుర్తింపుగా ఆమెకు ఈ గౌరవం కల్పించారు. ఈమె 2022లో బాలల సాహిత్యానికి సాహిత్య అకాడమీ బహుమతిని కూడా అందుకున్నారు. ఈమె 2008లో ప్రాంతీయ భాషల రచయితలకు సహాయక స్థలాన్ని సృష్టించే ప్రయత్నాలలో భాగంగా డేవిడ్ విలియం గిబ్సన్‌తో కలిసి సంగమ్ హౌస్ అనే సాహిత్య నివాసంను బెంగుళూరులో స్థాపించారు.
ఇస్రోకు చెందిన మహిళా శాస్త్రవేత్తకు ఫ్రెంచ్ అత్యున్నత గౌరవం
ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త వీఆర్ లలితాంబికకు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం లెజియన్ డి ఆనర్ ఆఫ్ ప్రెంచ్ లభించింది. బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో భారత్‌లోని ఫ్రాన్స్ రాయబారి థియరీ మాథౌ ఆమెకు ఈ అవార్డును అందజేశారు. రెండు దేశాల మధ్య అంతరిక్ష సహకారాన్ని పెంపొందించినందుకు గాను ఈ అవార్డు అందజేశారు. లలితాంబిక గతంలో ఇస్రోలో డైరెక్టరేట్ ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్‌కు నాయకత్వం వహించారు.
లెజియన్ డి ఆనర్ ఆఫ్ ప్రెంచ్ అనేది మిలిటరీ మరియు పౌరులకు అందించే అత్యధిక ఫ్రెంచ్ మెరిట్ ఆర్డర్. ఇది మే 19, 1802 న నెపోలియన్ బోనపార్టేచే సృష్టించబడింది. దీనిని సామాజిక తరగతి లేదా నేపథ్యంతో సంబంధం లేకుండా ఫ్రాన్స్‌కు అత్యుత్తమ కృషి చేసిన వ్యక్తులకు ప్రదానం చేస్తారు. దీనిని గతంలో రాయల్ ఆర్డర్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ పేరుతొ పిలిచేవారు.
అంతర్జాతీయ మారిటైమ్ ఆర్గనైజేషన్‌కు భారతదేశం తిరిగి ఎన్నిక
భారతదేశం ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ (ఐఎంఓ) కౌన్సిల్‌కు విజయవంతంగా తిరిగి ఎన్నికైంది. డిసెంబర్ 2న లండన్‌లో జరిగిన ఐఎంఓ అసెంబ్లీ సమావేశంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నిక సముద్ర రక్షణ మరియు భద్రతలో భారతదేశం యొక్క నిరంతర నిబద్ధత మరియు ప్రపంచ సముద్ర రంగంలో దాని పెరుగుతున్న ప్రాముఖ్యతను సూచిస్తుంది.
అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంపై అత్యధిక ఆసక్తి ఉన్న దేశాలను కలిగి ఉన్న కేటగిరీ బి దేశాలలో భారతదేశం ఎన్నికైంది. ఈ వర్గంలోని ఇతర దేశాలలో ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్, స్వీడన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. ఈ కౌన్సిల్ పదవీకాలం 2024-25 ద్వైవార్షికానికి అమలులో ఉంటుంది.
అంతర్జాతీయ మారిటైమ్ ఆర్గనైజేషన్ అనేది సముద్ర పరిశ్రమను నియంత్రించే ప్రముఖ అధికార సంస్థ. ఇది ప్రపంచ వాణిజ్యం, రవాణా మరియు అన్ని సముద్ర కార్యకలాపాలకు మద్దతు ఇస్తుంది. ఐఎంఓ కౌన్సిల్ 40 సభ్య దేశాలతో రూపొందించబడి ఉంటుంది. ఈ కౌన్సిల్ రెండు సంవత్సరాల కాలానికి ఐఎంఓ అసెంబ్లీచే ఎన్నుకోబడుతుంది.
పూరిలో 34వ అంతర్జాతీయ కోణార్క్ డ్యాన్స్ ఫెస్టివల్
ఒడిశాలోని పూరిలోని కోణార్క్ సూర్య దేవాలయం నేపథ్యంలో 34వ అంతర్జాతీయ కోణార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ డిసెంబర్ 1 నుండి 5 మధ్య జరిగింది. ఈవెంట్ భారతదేశంలోని అత్యుత్తమ సాంప్రదాయ మరియు శాస్త్రీయ నృత్య రూపాల ప్రదర్శనుకు వేదిక అందిస్తుంది. ఈ డ్యాన్స్ ఫెస్టివల్ 1986 లో ప్రారంభమైనప్పటి నుండి గత 32 సంవత్సరాలుగా నిరాటంకంగా కోణార్క్‌లోని కవిత్వ ఇసుకలో నిర్వహించబడుతోంది.
కోణార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో 1 నుండి 5 వరకు ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. ఒడిశాలో జరిగే అతిపెద్ద నృత్య ఉత్సవాల్లో ఇది ఒకటి. ఒడిస్సీ, భరతనాట్యం, మణిపురి, కథకళి, కథక, కూచిపూడి మరియు సత్రియాతో సహా భారతదేశంలోని దాదాపు అన్ని ప్రధాన శాస్త్రీయ నృత్య రూపాలకు చెందిన ప్రముఖులు మరియు నృత్య ప్రియులు ఐదు రోజుల శాస్త్రీయ నృత్య కార్నివాల్‌లో పాల్గొంటారు.
2023 గ్లోబల్ స్నాప్‌షాట్ ఆన్ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్
యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్, హెచ్ఐవి అండ్ ఎయిడ్స్‌పై తన 2023 గ్లోబల్ స్నాప్‌షాట్ నివేదికను నవంబర్ 30, 2023 న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవానికి ముందు ప్రచురించింది. ఈ నివేదిక పిల్లలు, కౌమార మరియు గర్భిణీ స్త్రీలపై దృష్టి సారించి ప్రపంచ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ మహమ్మారి యొక్క సమగ్ర అవలోకనాన్ని అందిస్తుంది.
ఈ రిపోర్టు ప్రకారం పశ్చిమ మరియు మధ్య ఆఫ్రికాలో ఎయిడ్స్ మహమ్మారి ఇంకా కొనసాగుతోన్నట్లు నివేదించింది. ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవితో జీవిస్తున్న పిల్లలలో నాలుగింట ఒక వంతు (26%) మంది ఈ ప్రాంతంలో ఉన్నట్లు పేర్కొంది. ఈ ప్రాంతంలో ప్రతి 10 (38%) మందిలో 4 మంది పిల్లలలో కొత్త అంటువ్యాధులు సంభవిస్తున్నట్లు చెబుతుంది.
- 2023 – 2022లో దాదాపు 98,000 మంది 10-19 సంవత్సరాల వయస్సు గల కౌమార బాలికలు హెచ్ఐవి బారిన పడ్డారు.
- 2022లో 0-19 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలు మరియు కౌమారదశలో ఉన్నవారిలో 270,000 కొత్త హెచ్ఐవి ఇన్ఫెక్షన్లకు లోనయ్యారు. దీనితో మొత్తం హెచ్ఐవితో నివసిస్తున్న యువకుల సంఖ్య 2.6 మిలియన్లకు చేరుకుంది.
- ఉప-సహారా ఆఫ్రికాలో, 10-24 సంవత్సరాల వయస్సు గల కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులలో హెచ్ఐవి ప్రాబల్యం వారి పురుషుల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంది.
- తాజా డేటా తూర్పు మరియు దక్షిణాఫ్రికాలో 0-19 సంవత్సరాల మధ్య హెచ్‌ఐవి సంక్రమణ అధికంగా ఉంది. వీటి తర్వాత పశ్చిమ మరియు మధ్య ఆఫ్రికా, తూర్పు ఆసియా మరియు పసిఫిక్లా,టిన్ అమెరికా మరియు కరేబియన్ మరియు దక్షిణ ఆసియాలు ఉన్నాయి.
- గ్లోబల్ స్నాప్‌షాట్ చికిత్స ప్రాప్యత పరంగా పెద్దవారితో పోలిస్తే, పిల్లలు మరియు యుక్తవయస్కుల మధ్య గణనీయమైన అసమానతలను హైలైట్ చేస్తుంది.
- హెచ్ఐవితో జీవిస్తున్న 0-19 సంవత్సరాల వయస్సు గల దాదాపు ఒక మిలియన్ మంది ప్రజలు చికిత్స పొందడం లేదని నివేదించింది. ఈ సమూహంలో సగానికి పైగా దాదాపు 60 శాతం తూర్పు మరియు దక్షిణ ఆఫ్రికాలో ఉన్నారు.
- 15 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో 77 శాతం మందితో పోలిస్తే, 0-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో కేవలం 57 శాతం మంది మాత్రమే యాంటీరెట్రోవైరల్ చికిత్స పొందుతున్నారు.
- ఈ రిపోర్టు ఎయిడ్స్‌ను అంతం చేసే పురోగతి నెమ్మదిగా ఉన్నట్లు నివేదించింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా 0-19 సంవత్సరాల వయస్సు గల 99,000 మంది పిల్లలు మరియు యుక్తవయస్కులు ఎయిడ్స్ సంబంధిత కారణాల వల్ల మరణించినట్లు పేర్కొంది. ఈ వయస్సులో కేవలం 7 శాతం ఉన్నప్పటికీ, మొత్తం ఎయిడ్స్ సంబంధిత మరణాలలో 15 శాతం మంది ఉన్నట్లు వెల్లడించింది.
- 2022లో భారతదేశంలో దాదాపు 2.5 మిలియన్ల మంది ప్రజలు హెచ్ఐవితో జీవిస్తున్నారు. ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు అత్యధిక వయోజన హెచ్ఐవి ప్రాబల్యాన్ని కలిగి ఉన్నాయి. మిజోరంలో 2.70%, నాగాలాండ్‌లో 1.36% మరియు మణిపూర్‌లో 1.05% కేసులు నమోదు కాబడ్డాయి. దేశంలో అత్యధిక హెచ్ఐవి కేసులలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
ఇండియా-స్వీడన్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ పార్టనర్‌షిప్ - లీడ్‌ఐటి 2.0
భారతదేశం మరియు స్వీడన్ దేశాలు లీడర్‌షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ (లీడ్‌ఐటి 2.0) చొరవ యొక్క రెండవ దశను ప్రారంభించాయి. ఈ చొరవ తక్కువ-కార్బన్ సాంకేతికతలు మరియు స్థిరమైన భవిష్యత్తు వైపు భారీ పరిశ్రమల పరివర్తనను వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. దుబాయిలో జరిగిన కాప్28 వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , స్వీడన్ ప్రధాన మంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్‌తో కలిసి ఫేజ్-IIని ప్రారంభించారు.
భారతదేశం మరియు స్వీడన్ పరిశ్రమల పరివర్తన ప్లాట్‌ఫారమ్‌ను కూడా ఈ వేదికగా ప్రారంభించారు, ఇది రెండు దేశాల ప్రభుత్వాలు, పరిశ్రమలు, టెక్నాలజీ ప్రొవైడర్లు, పరిశోధకులు మరియు థింక్ ట్యాంక్‌లకు ఉమ్మడి వేదిక అందిస్తుంది. 2019లో న్యూయార్క్‌లో జరిగిన యూఎన్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్‌లో భారతదేశం మరియు స్వీడన్ కలిసి మొదటి లీడ్‌ఐటిని ప్రారంభించాయి.
లీడర్‌షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ (లీడ్‌ఐటి) 2050 నాటికి పరిశ్రమ నుండి నికర సున్నా కార్బన్ ఉద్గారాలను చేరుకోవడానికి కట్టుబడి ఉన్న దేశాలు మరియు కంపెనీలను సమీకరిస్తుంది. ప్రస్తుతం ఈ గ్రూపు యందు 18 దేశాలు, 20 కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి.