తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 20 ఫిబ్రవరి 2024
February Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 20 ఫిబ్రవరి 2024

తెలుగులో 20 ఫిబ్రవరి 2024 కరెంట్ అఫైర్స్ అంశాలను చదవండి. వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాం. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహులకు ఇవి ఉపయోగపడతాయి.

Advertisement

కుల గణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుల గణనను నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేసింది. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పలు సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేసేందుకు ఈ సమగ్ర కుల సర్వే చేపడుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని సభలో చర్చ అనంతరం ఫిబ్రవరి 16న ఆమోదించారు. 4వ మంత్రి మండలి నిర్ణయం మేరకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి సమగ్ర సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కులాల సర్వే) చేపట్టాలని ఈ సభ తీర్మానించింది.

రాష్ట్రంలోని అన్ని వర్గాల సమాచారాన్ని సేకరిస్తూనే తమ ప్రభుత్వం ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ, విద్యా రంగాల్లో వెనుకబడిన తరగతులను ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తోందని పొన్నం వెల్లడించారు. కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ ఇచ్చిన ఈ హామీని ప్రభుత్వం నెరవేర్చినట్లు పేర్కొన్నారు.

గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో కుల సర్వే కూడా ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్, బీహార్ తర్వాత కుల గణన నిర్వహించిన మూడో రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుంది. ఈ సర్వే ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది.

  • గత ఏడాది బీహార్ నిర్వహించిన కులాల సర్వే, స్వతంత్ర భారతదేశంలో జరిపిన తోలి కుల గణనగా నిలిచింది. ఈ సర్వే ఈ రాష్ట్రంలో 63.13 శాతం ఓబీసీలు, 19.65 శాతం ఎస్సీలు మరియు 1.68 శాతం ఎస్టీలు ఉన్నట్లు నివేదించింది. అలానే ఆ రాష్ట్రంలో ఉన్నత కులాల జనాభా 15.52% ఉన్నట్లు పేర్కొంది.
  • ఈ సర్వే తర్వాత బీహార్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యా రిజర్వేషన్లను 75%కి పెంచింది. ఈ సర్వేకు సంబంధించిన కొన్ని సవాళ్లు ప్రస్తుత్తం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.
  • జనవరి 19న సమగ్ర కుల సర్వే నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కులాల ఆధారంగా వ్యక్తుల సమగ్ర డేటాబేస్‌ను రూపొందించే లక్ష్యంతో కసరత్తు చేస్తుంది.
  • తెలంగాణ ప్రభుత్వం 2014లో నిర్వహించిన గృహ సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో 51 శాతం ఓబీసీ ఉన్నారు. అలానే 17 శాతం ఎస్సీలు, 11 శాతం ఎస్టీలు మరియు 14 శాతానికి పైగా మైనారిటీలు ఉన్నారు.

స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేసిన మొదటి ఆర్థడాక్స్ క్రైస్తవ దేశంగా గ్రీస్

స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేసిన మొదటి ఆర్థడాక్స్ క్రైస్తవ దేశంగా గ్రీస్ అవతరించింది. 16 ఫిబ్రవరి 2024 న జరిగిన రాజకీయ స్పెక్ట్రమ్‌ ఓటింగులో 176 మంది శాసనసభ్యులు దీనికి అనుకూలంగా, 76 మంది వ్యతిరేకంగా ఓటు వేయడంతో అదే అర్థరాత్రి ఈ తీర్మానాన్ని గ్రీస్ పార్లమెంటు ఆమోదించింది.

300 మంది సభ్యుల గ్రీస్ పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందాలంటే 151 సభ్యుల సాధారణ మెజారిటీ అవసరం. సభలో రెండు రోజుల చర్చ మరియు కొన్ని వారాల ప్రజా స్పందనల తర్వాత వచ్చిన ఓటింగ్ ద్వారా ప్రభుత్వం ఈ ఆమోదానికి తలొంచింది. ఈ బిల్లు ఆమోదం ద్వారా ఇప్పుడు స్వలింగ జంటలు కూడా పిల్లలను దత్తత తీసుకునేందుకు చట్టబద్ధంగా అనుమతి లాభిస్తుంది. అయితే ఈ చట్టం సరోగసీ ద్వారా స్వలింగ జంటలు తల్లిదండ్రులు కావడాన్ని ఇప్పటికీ నిషేధిస్తుంది.

  • యూరోపియన్ యూనియన్‌లో స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేసిన 16వ సభ్య దేశంగా గ్రీస్ అవతరించింది.
  • ఐరోపాలో స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేసిన 21వ దేశంగా గ్రీస్ అవతరించింది.
  • ప్రపంచంలో స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేసిన 36వ  దేశంగా గ్రీస్ అవతరించింది.

అక్టోబరు 2009 వరకు అధికారంలో ఉన్న ప్రధాన మంత్రి కోస్టాస్ కరామన్లిస్ ఆధ్వర్యంలోని గ్రీస్ ప్రభుత్వం ఈ స్వలింగ వివాహాలను వ్యతిరేకించింది. అయితే జూలై 2023లో న్యూ డెమోక్రసీ పార్టీ నేతృత్వంలోని తిరిగి ఎన్నికైన కిరియాకోస్ మిత్సోటాకిస్ ప్రభుత్వం స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలనే ఉద్దేశాన్ని నాడు ప్రకటించింది.

సొంత ప్రభుత్వంలో వ్యతిరేకం ఉన్న, ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఈ చట్టం చేయగలిగింది. గ్రీస్ యొక్క మొట్టమొదటి బహిరంగ స్వలింగ సంపర్కుల రాజకీయ పార్టీ (సిరిజా) నాయకుడు స్టెఫానోస్ కస్సెలాకిస్ నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్ష వామపక్ష పార్టీ కూడా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చింది. స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేసిన 36 దేశాల జాబితా కింది పట్టికలో చూడగలరు.

అండోరా ఆస్ట్రేలియా బెల్జియం
అర్జెంటీనా ఆస్ట్రియా బ్రెజిల్
కెనడా చిలీ కొలంబియా
క్యూబా కోస్టా రికా డెన్మార్క్
ఈక్వెడార్ ఫిన్లాండ్ గ్రీస్
 ఎస్టోనియా ఫ్రాన్స్ జర్మనీ
ఐర్లాండ్ ఐస్లాండ్ నెదర్లాండ్స్
లక్సెంబర్గ్ మాల్టా న్యూజిలాండ్
మెక్సికో పోర్చుగల్ నార్వే
స్లోవేనియా దక్షిణ ఆఫ్రికా స్పెయిన్
 స్వీడన్ స్విట్జర్లాండ్  తైవాన్
ఉరుగ్వే యునైటెడ్ కింగ్‌డమ్ యునైటెడ్ స్టేట్స్

భారతదేశ అతి పొడవైన రైలు సొరంగంను ప్రారంభించిన పీఎం మోడీ

ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్‌పై భారతదేశంలోనే అతి పొడవైన రైల్వే సొరంగాన్ని ఫిబ్రవరి 21న ప్రధాని మోదీ ప్రారంభించారు. 48.1 కిలోమీటర్ల పొడవైన బనిహాల్-ఖారీ-సంబర్-సంగల్దాన్ సెక్షన్‌ యందు ఈ పొడవైన 12.77 కిలోమీటర్ల  పొడవైన సొరంగం నిర్మించారు. ఈ సొరంగంకు టీ-50 అని నామకరణం చేశారు.

ఉత్తర రైల్వే ప్రకారం ఈ మార్గంలో రైళ్లు ఇప్పుడు బారాముల్లా నుండి బనిహాల్ మీదుగా సంగల్దాన్ వరకు నడిపేందుకు అవకాశం లబిస్తుంది. బనిహాల్-ఖారీ-సంబర్-సంగడల్ విభాగంలోని 11 సొరంగాలలో టీ-50 అత్యంత సవాలుగా నిర్మించబడింది. ఈ సొరంగం సర్వే పనులు 1996 లో ప్రారంభమయ్యాయి, అయితే నిర్మాణ టెండర్ డిసెంబర్ 2013 లో ఇవ్వబడింది. ఈ నిర్మాణ  పూర్తికావడానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది.

అత్యవసర పరిస్థితుల కోసం సొరంగం లోపల అన్ని భద్రతా చర్యలు చేపట్టబడ్డాయి. ఈ సొరంగానికి సమాంతరంగా ఒక ఎస్కేప్ టన్నెల్ నిర్మించబడింది. ఇది ప్రమాదాల సమయంలో ప్రయాణికుల తరలింపుకు సహాయపడుతుంది. అలానే అగ్ని ప్రమాదాన్ని పరిష్కరించడానికి, సొరంగం యొక్క రెండు వైపులా నీటి పైపులు ఏర్పాటు చేశారు. ప్రతి 375 మీటర్లకు ఒక ఓపెనింగ్ వాల్వ్ అమర్చారు. తద్వారా మంటలను ఆర్పడానికి రెండు వైపుల నుండి నీటిని పిచికారీ చేయవచ్చు.

ఇదే  వేదిక ద్వారా కాశ్మీర్ లోయలో తొలి ఎలక్ట్రిక్ రైలును, సంగల్దాన్ మరియు బారాముల్లా స్టేషన్ల మధ్య ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. త్వరలో ఎనిమిది విద్యుద్దీకరించబడిన రైళ్లు ఈ మార్గంలో నడవనున్నాయి.ఈ ప్రారంభ వేడుకకు 100 మందికి పైగా పాఠశాల పిల్లలు మరియు వారి ఉపాధ్యాయులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

హౌతీ దాడులను ఎదుర్కోవడానికి ఆపరేషన్ ఆస్పైడ్స్‌ ప్రారంభించిన ఈయూ

హౌతీ దాడుల నుండి ఎర్ర సముద్రంలో కార్గో షిప్‌లను రక్షించడానికి మరియు ప్రపంచ వాణిజ్య మార్గాలకు భద్రత కల్పించడానికి 'ఆస్పైడ్స్' అనే నావికా మిషన్ యురోపియన్ యూనియన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ చేయడానికి యుద్ధనౌకలు మరియు గాలిలో ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఈయూ మోహరించింది.

యూరోపియన్ కమీషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ నేవల్ ఫోర్స్ ఫిబ్రవరి 19న ఈ ఆపరేషన్ ఆస్పైడ్స్‌ కోసం ప్రకటించారు. ఈ ఆపరేషన్ ఎర్ర సముద్రంలో నావిగేషన్ స్వేచ్ఛను నిర్ధారించడానికి అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పని చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

  • యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు గత నవంబర్ నుండి రద్దీగా ఉండే ఎర్ర సముద్ర మార్గంలో వాణిజ్య మరియు మిలిటరీ షిప్పింగ్‌పై దాడి చేస్తున్నారు.
  • ఇజ్రాయెల్ దాడిలో ఉన్న గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనియన్లకు సంఘీభావంగా ఇజ్రాయెల్-అనుసంధానిత నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఈ బృందం మొదటలో ప్రకటించింది.
  • అయితే ఈ షిప్పింగ్‌ దాడులకు ప్రతిస్పందనగా యెమెన్‌లోని హౌతీ సైట్‌లపై వాషింగ్టన్ మరియు లండన్ వైమానిక దాడులు చేసిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ మరియు యునైటెడ్ కింగ్‌డమ్‌లకు అనుసంధానించబడిన ఓడలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తిరుగుబాటుదారులు ప్రకటించారు.
  • ఈ మార్గం దాదాపు 12 శాతం అంతర్జాతీయ సముద్ర వాణిజ్యానికి కేంద్రంగా ఉంది.
  • వాస్తవానికి ఇజ్రాయెల్ లక్ష్యంగా జరుగుతున్న ఈ హౌతీ దాడుల వల్ల ఈజిప్టు ఎక్కువగా నష్టపోయింది.
  • ఈ మార్గంలో తగ్గిన షిప్పింగ్ ట్రాఫిక్ వలన సూయజ్ కెనాల్ అథారిటీకి 40 శాతం ఆదాయాన్ని కోల్పోయింది.
  • అలానే ఈ దాడుల నేపథ్యంలో మార్చిన సముద్ర మార్గాల వలన ఆసియా మరియు ఈయూ మధ్య ఎగుమతుల డెలివరీ సమయం 10 నుండి 15 రోజులు పెరిగింది.
  • తద్వారా ఈ సరుకు రవాణా ఖర్చులు సుమారు 400 శాతం పెరిగాయి.

ఈ నేపథ్యంలో యురోపియన్ యూనియన్ ఈ ప్రత్యేక ఆస్పైడ్స్ అనే నావికా మిషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ యందు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ మరియు బెల్జియం నౌకలు కూడా పాల్గొంటాయి. గ్రీకు నగరమైన లారిస్సాలో దీని కార్యాచరణ కమాండ్ సెంటర్‌ ఏర్పాటు చేసారు. ఈ సెంటర్ ఆదేశాల మేరకు హెచ్చరికలు, అవసరమైతే దాడులు నిర్వహిస్తారు.

ఈఐయూ డెమోక్రసీ ఇండెక్స్ 2023 విడుదల

ది ఎకనామిస్ట్స్ ఇంటిలిజెన్స్ (ఈఐయూ) యొక్క 2023 డెమోక్రసీ ఇండెక్స్ ఫిబ్రవరి 15న విడుదల చేయబడింది. ఈఐయూ నివేదిక ప్రపంచ దేశాల ప్రజాస్వామ్యం, యుద్ధం మరియు శాంతి మధ్య సంబంధాన్ని విశ్లేషిస్తుంది. సంఘర్షణ యొక్క భౌగోళిక రాజకీయ కారణాలను విశ్లేషిస్తుంది. ఇది గ్లోబల్ ర్యాంకింగ్స్‌లోని మార్పుల వివరణను మరియు వాటి లోతైన ప్రాంతీయ అవలోకనాన్ని కూడా అందిస్తుంది.

  • 2023 డెమోక్రసీ ఇండెక్స్ ప్రకారం ప్రపంచ జనాభాలో కేవలం 24 దేశాలలోని 7.8% మంది ప్రజలు మాత్రమే పూర్తి ప్రజాస్వామ్యంలో నివసిస్తున్నారు.
  • 50 దేశాలలో 37.6% మంది లోపభూయిష్ట ప్రజాస్వామ్యంలో జీవనం సాగిస్తున్నట్లు నివేదించింది.
  • 34 దేశాలలో 15.2%  మంది పౌరులు హైబ్రిడ్ ప్రభుత్వ పాలనలో ఉన్నట్లు పేర్కొంది.
  • 59 దేశాల్లోని 39.4% ప్రజలు అధికార పాలన పరిధిలో ఉన్నట్లు తెలిపింది.
  • 2023లో ప్రపంచ సగటు డెమోక్రసీ స్కోరు 2022తో పోలిస్తే 5.29 నుండి 5.23కి పడిపోయినట్లు నివేదించింది.
  • ఇది 2006లో ఈఐయూ ఇండెక్స్ ప్రారంభించినప్పటి నుండి అత్యల్ప స్కోర్‌గా గుర్తించబడినట్లు వెల్లడించింది.
  • ఎకనామిస్ట్ పరిశోధకుల ప్రకారం కోవిడ్ సంక్షోభం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా డెమోక్రసీ తిరోగమనం మరియు స్తబ్దత కొనసాగుతున్నట్లు పేర్కొంది.

1946-1991తో పోల్చితే ప్రచ్ఛన్న యుద్ధానంతర సంఘర్షణలు తగ్గుముఖం పట్టినప్పటికీ, ఇటీవలి సంవత్సరాలలో ప్రపంచ వ్యాప్తంగా సంఘర్షణలు పెరుగుతున్నాయని ఈ నివేదిక పేర్కొంది. గత రెండేళ్లలో 1980ల తర్వాత అత్యధిక పోరాట మరణాలు నమోదయ్యాయని ఈ నివేదిక తెలిపింది. ఇది పెరుగుతున్న ప్రజాస్వామ్య క్షీణతను సూచిస్తున్నట్లు పేర్కొంది.

ప్రాంతీయ దృక్కోణంలో ప్రపంచవ్యాప్తంగా 24 పూర్తి ప్రజాస్వామ్యా దేశాలలో 15 దేశాలు పశ్చిమ ఐరోపా ప్రాంతంలో ఉన్నాయి. ఈ దేశాల సగటు స్కోరు 2022లో 8.36 నుండి 2023లో 8.37కి మెరుగుపరుచుకున్నాయి. అదే సమయంలో లోఉత్తర అమెరికా దేశాలు అయిన యూఎస్ మరియు కెనడా దేశాలలో ఈ 8.37 నుండి 8.27 పడిపోయింది.

అలానే మధ్యప్రాచ్యం మరియు ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో సగటు డెమోక్రసీ 3.34 నుండి 3.23కి తగ్గుదల కనిపించింది. సబ్-సహారా ఆఫ్రికా దేశాలలో కూడా ఈ స్కోరు 4.14 నుండి 4.04కి క్షిణించింది మారిషస్ (8.14) మాత్రమే "పూర్తి ప్రజాస్వామ్యం"గా నిలుస్తాయి. లాటిన్ అమెరికా మరియు కరేబియన్‌లు 2022లో 5.79తో పోలిస్తే 2023లో సగటు స్కోరు 5.68తో ఎనిమిదవ సంవత్సరం ప్రజాస్వామ్య క్షీణతను చవిచూశాయి.

ఈఐయూ డెమోక్రసీ ఇండెక్స్ 2006 నుండి ఏటా ప్రచురించబడుతోంది. ఇది 165 స్వతంత్ర రాష్ట్రాలు మరియు రెండు భూభాగాల్లో ప్రజాస్వామ్య స్థితిని అంచనా వేస్తుంది. ఈ నివేదిక ప్రతి దేశం యొక్క ఐదు ప్రజాస్వామ్య సూచికల పరిధి ఆధారంగా 0-10 స్కోర్‌ను అందిస్తుంది.

పరిగణలోకి తీసుకునే ప్రజాస్వామ్య సూచికల జాబితాలో ఎన్నికల ప్రక్రియ, పౌర స్వేచ్ఛ, ప్రభుత్వ పనితీరు, రాజకీయ భాగస్వామ్యం మరియు రాజకీయ సంస్కృతి వంటి అంశాలు ఉంటాయి. ఈ అంశాలలో దేశాల సగటు స్కోరు ఆధారంగా ఈ నివేదిక రూపొందించబడుతుంది.

ఈఐయూ డెమోక్రసీ ఇండెక్స్ ర్యాంకింగులో పూర్తి ప్రజాస్వామ్యా దేశాలకు 8+ నుండి 10 స్కోర్‌ను, లోపభూయిష్ట ప్రజాస్వామ్యాలకు 6+ నుండి 8 స్కోర్‌ను, హైబ్రిడ్ పాలనలో ఉన్న దేశాలకు 4+ నుండి 6 స్కోర్‌ను మరియు అధికార పాలనలలో ఉన్న దేశాలకు 0 నుండి 4 మధ్య స్కోరును కేటాయిస్తుంది.

యూరోపియన్ యూనియన్ లేదా ఐక్యరాజ్యసమితి వంటి ట్రాన్స్‌నేషనల్ గవర్నెన్స్ సంస్థలలో ప్రజాస్వామ్య స్థాయి కవర్ చేయబడదు. అలానే ఈ నివేదిక చిన్న రాజకీయ భూభాగాలను మినహాహిస్తుంది. ఈ నివేదికలో నార్వే, న్యూజిలాండ్, ఐస్‌లాండ్ టాప్ 3లో ఉండగా ఉత్తర కొరియా, మయన్మార్ మరియు ఆఫ్గనిస్తాన్ దేశాలు దిగువ మూడు స్థానాలలో ఉన్నాయి.

దేశం డెమోక్రసీ స్కోరు ర్యాంకు
నార్వే 9.81 1
న్యూజిలాండ్ 9.61 2
ఐస్‌లాండ్ 9.45 3
స్వీడన్ 9.39 4
ఫిన్లాండ్ 9.30 5
డెన్మార్క్ 9.28 6
ఐర్లాండ్ 9.19 7
స్విట్జర్లాండ్ 9.14 8
నెదర్లాండ్స్ 9.00 9
తైవాన్ 9.92 10
ఆస్ట్రేలియా  8.66 14
జపాన్  8.40 16
యునైటెడ్ కింగ్‌డమ్ 8.28 18
అమెరికా సంయుక్త రాష్ట్రాలు 7.85 29
ఇండియా  7.18 41

ఢిల్లీలో రైసినా డైలాగ్ యొక్క 9వ ఎడిషన్

రైసినా డైలాగ్ యొక్క తొమ్మిదవ ఎడిషన్ ఫిబ్రవరి 21 నుండి ఫిబ్రవరి 23 వరకు న్యూఢిల్లీలో నిర్వహించబడింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కాన్ఫరెన్స్ ప్రారంభించారు. గ్రీస్ ప్రధాన మంత్రి కిరియాకోస్ మిత్సోటాకిస్ ప్రారంభ సెషన్‌లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ప్రపంచ ఆర్థిక మరియు భౌగోళిక సవాళ్లను చర్చించడానికి ప్రపంచ నాయకులను ఒకచోట చేర్చుతుంది.

9వ రైసినా డైలాగ్‌లో 115 దేశాల నుండి మంత్రులు, మాజీ దేశాధినేతలు మరియు ప్రభుత్వాధినేతలు, మిలిటరీ కమాండర్లు, పరిశ్రమల కెప్టెన్లు, సాంకేతిక నిపుణులు, విద్యావేత్తలు, జర్నలిస్టులు, వ్యూహాత్మక వ్యవహారాలపై నిపుణులు, ప్రముఖ థింక్ ట్యాంక్‌ల నిపుణులు మరియు యువకులు పాల్గొన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కొత్త యుద్ధాలు, పునరుత్థాన సంఘర్షణలు మరియు మానవ సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమర్థవంతంగా మరియు న్యాయంగా పనిచేయగల సామర్థ్యంను ఈ సమావేశం గుర్తు చేసింది. గాజా మరియు ఉక్రెయిన్‌లోని యుద్ధాలు భద్రతా మండలి పాత్ర ప్రశ్నర్ధకం కావడంతో, దాని సమానమైన మరియు న్యాయమైన సంస్కరణల కోసం పిలుపునిచ్చింది.

  • రైసినా డైలాగ్ అనేది ప్రపంచ భౌగోళిక మరియు ఆర్థిక అంశాలపై దృష్టి సారించే భారత వార్షిక సమావేశం.
  • ఇది గ్లోబల్ కమ్యూనిటీ ఎదుర్కొంటున్న అత్యంత సవాలుగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తుంది.
  • రైసినా డైలాగ్ 2016లో తొలిసారి ఏర్పాటు చేశారు.
  • అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సహకారంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తుంది.
  • రైసినా డైలాగ్ అనే పేరు న్యూ ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాలకు నిలయమైన రైసినా హిల్ నుండి పెట్టబడింది.
  • రైసినా డైలాగ్ 2024 యొక్క థీమ్ : "చతురంగ: కాన్‌ప్లిక్ట్, కాంటెస్ట్, కోపరేట్, క్రియేట్".
  • సమావేశం తోలి రోజు భారత్ మరియు ఆర్మేనియా సంభాషణ జరిగింది.
  • భారతదేశం-అర్మేనియా మధ్య గ్లోబల్ జియో-ఎకనామిక్స్ యొక్క సంబంధాలు పునరావిష్కరణ జరిగింది.

Advertisement

Post Comment