తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 07 మార్చి 2024. పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నాం.
ఖేలో ఇండియా మెడల్ విజేతలు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు
ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్తగా అర్హత పొందే వారి జాబితాలో ఖేలో ఇండియా గేమ్స్ పతక విజేతలు చేరారు. ఖేలో ఇండియా పతక విజేత అథ్లెట్లు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులని కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మార్చి 4న ప్రకటించారు.
దీనికి సంబంధించి భారత ప్రభుత్వం అథ్లెట్ల నియామకం, ప్రమోషన్ మరియు ప్రోత్సాహకాల ఫ్రేమ్‌వర్క్‌లో సమగ్ర సంస్కరణలను ప్రవేశపెట్టింది. మార్చి 4న జారీ చేసిన మెమోరాండమ్‌లో ఈ కొత్త మార్గదర్శకాలు, మెరుగైన ప్రోత్సాహకాల వివరాలు పొందుపర్చబడ్డాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ మరియు ఇండియా స్పోర్ట్స్ మినిస్ట్రీతో సంప్రదించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్, ఖేలో ఇండియా పారా గేమ్స్ మరియు ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ విజేతలు దీని పరిధిలో చేర్చబడ్డారు. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్ విజేతలు అందరికి వాటి విలువ ఆధారంగా ఈ రిజర్వేషన్ కోటా వర్తిస్తుంది.
దేశంలో బలమైన క్రీడా పర్యావరణ వ్యవస్థ పెంపొందించడంతో పాటుగా, అట్టడుగు స్థాయిలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించడం మరియు క్రీడలను లాభదాయకమైన మరియు ఆచరణీయమైన కెరీర్ ఎంపికగా మార్చడం వంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
- ఖేలో ఇండియా యూత్ గేమ్స్ భారతదేశంలో నిర్వహించే వార్షిక జాతీయ స్థాయి మల్టీడిసిప్లినరీ గ్రాస్‌రూట్ గేమ్‌లు.
- ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 18 క్రీడలతో 2018లో ప్రారంభమయ్యాయి.
- వీటిని ఏటా జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించబడతాయి.
- వీటిని ప్రస్తుతం ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్, ఖేలో ఇండియా పారా గేమ్స్ మరియు ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ పేర్లతో నిర్వహిస్తున్నారు.
ఎఐ సెంటర్ ఏర్పాటు కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌తో కర్ణాటక ఒప్పందం
కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కేంద్రాన్ని స్థాపించడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యుఈఎఫ్)తో లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌ఓఐ)పై సంతకం చేసింది. ఇది దేశంలో ఏఐకి అంకితమైన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ యొక్క ఏకైక కేంద్రం కానుంది. కర్ణాటకను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ హబ్‌గా ఉంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ఏడాది జనవరిలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన డబ్ల్యూఈఎఫ్ సమావేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిటిజన్ సర్వీసెస్, సుస్థిరత, ఈ-గవర్నెన్స్ రంగాల్లో రూ. 23,000 కోట్ల విలువైన ఎనిమిది అవగాహన ఒప్పందాలపై కర్ణాటక ప్రభుత్వం సంతకాలు చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా ఉండాలనే కర్ణాటక ఆశయాలకు ఈ సహకారం ఒక ముఖ్యమైన అడుగు.
జమ్మూ & కాశ్మీర్ కొత్త స్టార్ట్-అప్ పాలసీ 2024-27 ప్రారంభం
జమ్మూ మరియు కాశ్మీర్‌లో, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, 3 మార్చి 2024న న్యూ జమ్మూ & కాశ్మీర్ స్టార్ట్-అప్ పాలసీ- 2024-27ని అవిన్య స్టార్టప్ సమ్మిట్‌లో ప్రారంభించారు. ఈ కొత్త స్టార్ట్-అప్ పాలసీ 2027 నాటికి జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రాన్ని ప్రముఖ స్టార్ట్-అప్ ఎకోసిస్టమ్‌లలో ఒకటిగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఈ ప్రాంతం యొక్క స్టార్టప్‌లు మరియు ఆవిష్కర్తలకు ఒక పెద్ద ముందడుగుగా భావించవచ్చు.
- న్యూ జమ్మూ & కాశ్మీర్ స్టార్ట్-అప్ పాలసీ 2027 నాటికి 2 వేల స్టార్టప్‌లను నెలకొల్పేందుకు ప్రణాళిక చేయబడింది.
- దీని కోసం 25 కోట్ల రూపాయల ప్రారంభ ఇన్ఫ్యూషన్‌తో 250 కోట్ల రూపాయల వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది.
- ఈ ప్రాంతంలో కొత్త స్టార్ట్-అప్ ఇంక్యుబేషన్ సెంటర్‌లను స్థాపించడానికి జమ్మూ & కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ సిద్దమౌతుంది.
- జమ్మూ & కాశ్మీర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా సీడ్ ఫండింగ్ మరియు మహిళా పారిశ్రామికవేత్తలకు అదనపు మద్దతును అందిస్తుంది.
- కొత్త విధానం పేటెంట్-సంబంధిత సహాయం, గుర్తింపు పొందిన స్టార్టప్‌లకు మెంటార్‌షిప్ కోసం ఆర్థిక సహాయం అందిస్తుంది.
- పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రమోషన్ శాఖ రిజిస్ట్రేషన్‌కు వెసులుబాటు కల్పిస్తుంది.
- జమ్మూ మరియు కాశ్మీర్‌లో ప్రస్తుతం 722 నమోదిత స్టార్టప్‌లు ఉన్నాయి, వీటిలో 254 మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌లు వ్యాపార కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నాయి.
నీతి ఆయోగ్ యొక్క నీతి ఫర్ స్టేట్స్ ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రభుత్వ థింక్ ట్యాంక్ నీతి ఆయోగ్ యొక్క 'నీతి ఫర్ స్టేట్స్' ప్లాట్‌ఫారమ్‌ను ఆవిష్కరించారు. ఇది జాతీయ అభివృద్ధి లక్ష్యాల సాధనలో రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల సాధికారత కోసం రూపొందించబడిన సమగ్ర డిజిటల్ చొరవ.
ఇదే వేదిక ద్వారా నీతి ఆయోగ్‌లో 'నీతి ఫర్ స్టేట్స్ - విక్షిత్ భారత్ స్ట్రాటజీ రూమ్'ని కూడా ప్రారంభించారు. అలానే న్యూఢిల్లీలోని ఆకాశవాణిలోని రంగ్ భవన్‌లో 'నీతి ఫర్ స్టేట్స్' ఎగ్జిబిషన్‌ను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యులు ప్రొఫెసర్ రమేష్ చంద్, డాక్టర్ వీకే సరస్వత్, & డాక్టర్ అరవింద్ వీరమణి మరియు నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
- నీతి ఫర్ స్టేట్స్ ప్లాట్‌ఫారమ్ రాష్ట్రాలకు సంబంధించి విస్తృతమైన నాలెడ్జ్ బేస్ కలిగి ఉంది.
- ఇందులో 7,500 క్యూరేటెడ్ బెస్ట్ ప్రాక్టీసులు, 5,000 పాలసీ డాక్యుమెంట్‌లు, 900+ డేటాసెట్‌లు, 1,400 డేటా ప్రొఫైల్‌లు మరియు 350 నీతి ఆయోగ్ ప్రచురణలు ఉన్నాయి.
- కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్‌ల కోసం బ్లాక్, జిల్లా మరియు రాష్ట్రం అధికారులకు తగిన డిజిటల్ శిక్షణ మాడ్యూల్స్ కలిగి ఉంది.
- ఈ ప్లాట్‌ఫారమ్ 22 ప్రధాన భారతీయ భాషల్లో మరియు 7 విదేశీ భాషల్లో అందుబాటులోకి తెస్తున్నారు.
- ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యాల ద్వారా రాష్ట్రాలు మరియు యూటీల నిర్దిష్ట సవాళ్లను పరిష్కరించడానికి నిపుణుల సహాయ డెస్క్ అందుబాటులో ఉంచింది.
- సమగ్రమైన మరియు క్రియాత్మకమైన అంతర్దృష్టుల కోసం నేషనల్ డేటా & అనలిటిక్స్ ప్లాట్‌ఫారమ్ నుండి సమాచారం అందిస్తుంది.
- ఇది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య జ్ఞానం మరియు క్రాస్-లెర్నింగ్‌కు సహకరించడం ద్వారా సమాఖ్య విధానాన్ని ప్రోత్సహిస్తుంది.
నీతి ఫర్ స్టేట్స్ ప్లాట్‌ఫారమ్ అనేది అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క సామూహిక దృక్పథానికి గణనీయమైన సహకారం అందించడానికి రాష్ట్రాలు మరియు యూటీలను శక్తివంతం చేసే ఒక మూలస్తంభమైన చొరవ. ఈ ప్లాట్‌ఫారమ్ సహకార పాలనను పెంపొందించడానికి మరియు దేశవ్యాప్తంగా సుపరిపాలన పద్ధతులను ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్ యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది.
ఇండియా ఫస్ట్ స్మాల్ స్కేల్ ఎల్‌ఎన్‌జి యూనిట్‌లు ప్రారంభం
కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రి హర్దీప్ సింగ్ పూరి, 17 రాష్ట్రాలలో 201 సంపీడన సహజ వాయువు స్టేషన్లను (సిఎన్‌జి) ప్రారంభించారు. అలానే గెయిల్ యొక్క భారతదేశంలో మొట్టమొదటి చిన్న తరహా ఎల్‌ఎన్‌జి యూనిట్‌ను కూడా ప్రారంభించారు.
17 రాష్ట్రాల్లోని 52 భౌగోళిక ప్రాంతాలలో గెయిల్ గ్రూప్‌కు చెందిన 15 సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సిజిడి) ఎంటిటీల పరిఫీలో 201 సిఎన్‌జి స్టేషన్‌లను జాతికి అంకితం చేశారు. మధ్యప్రదేశ్‌లోని విజయపూర్ ప్లాంట్ వద్ద భారతదేశ మొట్టమొదటి చిన్న-స్థాయి ఎల్‌ఎన్‌జి యూనిట్‌ను గెయిల్ ఏర్పాటు చేసింది.
15 సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సిజిడి) సంస్థలలో 53 స్టేషన్లు గెయిల్L గ్యాస్ లిమిటెడ్‌కు, 50 ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్‌కు, 43 గెయిల్ మరియు 20 మహానగర్ గ్యాస్ లిమిటెడ్‌కు చెందినవి ఉన్నాయి. మిగిలిన వాటిలో నాలుగు అవంతిక గ్యాస్ లిమిటెడ్‌కు, రెండు బెంగాల్ గ్యాస్ కంపెనీ లిమిటెడ్‌కు, మూడు సెంట్రల్ యుపి గ్యాస్ లిమిటెడ్‌కు, ఒకటి గోవా నేచురల్ గ్యాస్ ప్రైవేట్‌కి చెందినవి ఉన్నాయి.
150 కోట్ల ప్రాజెక్ట్ వ్యయంతో విజయపూర్ (మధ్యప్రదేశ్)లో గెయిల్ ఏర్పాటు చేసిన చిన్న తరహా ఎల్‌ఎన్‌జి యూనిట్‌ను ఏర్పాటు హర్దీప్ సింగ్ పూరి అభినంచారు. ఇవి దేశంలో స్మాల్ స్కేల్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ టెక్నాలజీకి అనుసంధానం చేయడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని అన్నారు.
201 సిఎన్‌జి స్టేషన్‌ల ప్రారంభోత్సవం దేశంలో కార్బన్ పాదముద్రను తగ్గించడానికి మరియు వాతావరణ మార్పుల యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి ప్రభుత్వం యొక్క సమిష్టి ప్రయత్నాలకు నిదర్శనం అని పేర్కొన్నారు. 2030 నాటికి దేశంలో దాదాపు 17,500 సిఎన్‌జి స్టేషన్‌లు మరియు 120 మిలియన్ పిఎన్‌జి (డొమెస్టిక్) కనెక్షన్‌లు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు.
గ్రీన్ హైడ్రోజన్ పాలసీకి ఆమోదం తెలిపిన యూపీ కేబినెట్
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మార్చి 5న గ్రీన్ హైడ్రోజన్ పాలసీ 2024ని ఆమోదించింది. యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్ ఆమోదించిన ఈ విధానం గ్రీన్ హైడ్రోజన్ పరిశోధన మరియు ఉత్పత్తికి అంకితమైన స్టార్టప్‌లకు మద్దతు ఇస్తుంది. పారిశ్రామిక, పెట్రోకెమికల్ మరియు రవాణా రంగాలకు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని ఉత్ప్రేరకపరచడానికి 5,000 కోట్ల రూపాయల ప్రోత్సాహక మరియు ఆర్థిక సహాయ ప్యాకేజీని కూడా కేటాయించింది.
- యూపీ గ్రీన్ హైడ్రోజన్ పాలసీ రాష్ట్రం ఏటా 1 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
- ఏ రంగంలో 2028 నాటికి 120,000 ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు ప్రణాళిక చేస్తుంది.
- కొత్త పాలసీ రాష్ట్రంలోని ప్రతి గ్రీన్ హైడ్రోజన్ స్టార్టప్‌కు ఐదేళ్లపాటు సంవత్సరానికి రూ. 25 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది.
- ఈ చొరవ 2070 నాటికి భారతదేశం యొక్క 'నెట్-జీరో' నిబద్ధతను సాధించడంలో దోహదపడటం లక్ష్యంగా పెట్టుకుంది.
- యూపీలోని ఎరువులు మరియు పెట్రోకెమికల్ పరిశ్రమలో గ్రీన్ హైడ్రోజన్‌ను స్వచ్ఛమైన ప్రత్యామ్నాయంగా ప్రచారం చేయాలని రాష్ట్రం నిర్ణయించింది.
- యుపిలో, ఎరువులు మరియు రిఫైనరీ రంగాలలో ప్రస్తుత హైడ్రోజన్ డిమాండ్ సంవత్సరానికి 900,000 టన్నులుగా అంచనా వేయబడింది.
- యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో దాదాపు 20 కంపెనీల నుండి రూ. 2.70 ట్రిలియన్ల గ్రీన్ హైడ్రోజన్ పెట్టుబడి ప్రతిపాదనలను పొందింది.
- గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల కోసం యూపీ 30 ఏళ్ల లీజు వ్యవధిలో ప్రభుత్వ భూములను అందిస్తోంది.
- పర్యావరణ అనుమతికి సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను 'వైట్ కేటగిరీ' కింద చేర్చింది.
పునరుత్పాదక శక్తిని ఉపయోగించి విద్యుద్విశ్లేషణలో నీటిని విచ్ఛిన్నం చేయడం ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియలో ఎటువంటి కార్బన్ ఉద్గారం ఉండదు. ఈ హైడ్రోజన్‌ను నైట్రోజన్‌తో కలిపి 'గ్రీన్' అమ్మోనియాను తయారు చేయవచ్చు, తద్వారా భూగ్రహం-వేడెక్కకుండా హైడ్రోకార్బన్‌లను నివారించవచ్చు. గ్రీన్ అమ్మోనియా శక్తిని నిల్వ చేయడానికి మరియు ఎరువులు తయారు చేయడానికి ఉపయోగించవచ్చు.
జార్ఖండ్‌లో వితంతు పునర్వివాహ ప్రమోషన్ పథకం ప్రారంభం
జార్ఖండ్ ప్రభుత్వం కొత్తగా వితంతు పునర్వివాహ ప్రమోషన్ పథకాన్ని ప్రారంభించింది. వితంతువులకు సాధికారత కల్పించడం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం మరియు వారిని ప్రధాన స్రవంతి సమాజంలోకి చేర్చడం ఈ పథకం యొక్క లక్ష్యం.
అర్హులైన వితంతువులు తమ వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌తో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వితంతువులకు సాధికారత కల్పించడం కోసం ప్రభుత్వం 2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది.
ఈ పథకం జార్ఖండ్‌లో వితంతువులు ఎదుర్కొంటున్న సామాజిక మరియు ఆర్థిక సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక సహాయం వారి జీవితాలను పునర్నిర్మించేటప్పుడు కొంత భద్రత మరియు మద్దతును అందించడానికి ఉద్దేశించబడింది
- ఈ పథకాన్ని జార్ఖండ్ వితంతు పునర్వివాహ ప్రమోషన్ స్కీమ్ అంటారు.
- ఈ పథకంను మార్చి 6, 2024 న ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ ప్రారంభించారు.
- పునర్వివాహం ఎంపిక చేసుకునే వితంతువులకు ఈ పథకం ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
సీస్పేస్ పేరుతొ సొంత ఓటిటిని ప్రారంభించిన కేరళ ప్రభుత్వం
భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రభుత్వ యాజమాన్యంలోని ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ను కేరళ ప్రభుత్వం ప్రారంభించింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సీస్పేస్ పేరుతొ ఈ ఓవర్-ది-టాప్ సేవలను మార్చి 7న ప్రారంభించారు. సీస్పేస్ కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించబడుతుంది.
- సీస్పేస్ అనేది భారతదేశంలోని మొట్టమొదటి ప్రభుత్వ-మద్దతుగల ఓటీటీ ప్లాట్‌ఫారమ్.
- సీస్పేస్ కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించబడుతుంది.
- సీస్పేస్ కేరళ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ మద్దతుతో పనిచేస్తుంది.
- సీస్పేస్ ప్రతి వీక్షణకు చెల్లించే మోడల్‌ను అవలంబిస్తుంది, ఒక్కో సినిమాకి వినియోగదారుల నుండి ₹ 75 వసూలు చేస్తుంది.
- విస్తృతమైన ప్రేక్షకులకు సమాచారం మరియు వినోదాన్ని అందించే క్యూరేటెడ్, అధిక-నాణ్యత కంటెంట్‌ను అందించడం దీని లక్ష్యం.
- ఈ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అవార్డు విన్నింగ్ చలనచిత్రాలు, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్‌లు & కళాత్మక మరియు సాంస్కృతిక యోగ్యతతో కూడిన కంటెంట్ అందిస్తుంది.