Advertisement
బిజినెస్ & ఎకానమీ అఫైర్స్ | ఫిబ్రవరి 2022
Telugu Current Affairs

బిజినెస్ & ఎకానమీ అఫైర్స్ | ఫిబ్రవరి 2022

2022-23 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2022-23 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్'ను 01 ఫిబ్రవరి 2022 న లోకసభలో ప్రవేశపెట్టారు. వరుసగా రెండవ ఏడాది డిజిటల్ రూపంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ప్రసంగం నిరవధికంగా గంటన్నరకు పైగా సాగింది. భారత ఆర్థిక మంత్రిగా నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన నాల్గువ వార్షిక బడ్జెట్ ఇది. 2022 -23 ఆర్థిక సంవత్సరానికి మొత్తం బడ్జెట్ అంచనాలు 39 లక్షల కోట్లుగా ఆమె పేర్కొన్నారు. బడ్జెట్ పూర్తి స్వరూపం

భారతదేశపు స్టార్టప్ రాజధానిగా ఢిల్లీ

భారతదేశం యొక్క స్టార్టప్ రాజధానిగా బెంగళూరు స్థానంను ఢిల్లీ అధిగమించింది. బడ్జెట్ ముందురోజు వెలువడిన ఎకనామిక్ సర్వే 2021-22 ప్రకారం, ఏప్రిల్ 2019 మరియు డిసెంబర్ 2021 మధ్య కాలంలో ఢిల్లీలో కొత్త 5,000 గుర్తింపు పొందిన స్టార్టప్‌లు ప్రారంభించనట్లు వెల్లడించింది, 4,514 కొత్త స్టార్టప్‌లతో బెంగళూరు రెండవ స్థానంలో నిలిచింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో కొత్తగా 14,000 కొత్త స్టార్టప్‌లను ప్రారంభించినట్లు ప్రకటించారు, దీనితో దేశంలో గుర్తింపు పొందిన స్టార్టప్‌ల సంఖ్య 61,400కి చేరుకున్నట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది. తద్వారా యూఎస్ మరియు చైనాల తర్వాత భారతదేశం ప్రపంచ మూడవ అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థగా అవతరించినట్లు ప్రకటించింది.

ఇన్ఫోసిస్ మరియు విప్రో వంటి ప్రధాన కంపెనీలతో పాటుగా ఐటీ మరియు నాలెడ్జ్ ఆధారిత రంగంలో వందలాది స్టార్టప్‌లతో బెంగళూరు చాలా కాలంగా భారతదేశంలోని అతిపెద్ద ఐటీ (సమాచార సాంకేతికత) హబ్‌లలో ఒకటిగా ఉందని ఆర్థిక సర్వే తెలిపింది.

సోలార్ ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ కోసం టాటా పవర్‌తో ఎస్‌బీఐ భాగస్వామ్యం

దేశంలో అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఇప్పటికే ఉన్న ఫైనాన్సింగ్ ఏర్పాటును బలోపేతం చేసే లక్ష్యంతో 'సూర్య శక్తి సెల్' పేరుతో ప్రత్యేక కేంద్రీకృత ప్రాసెసింగ్ సెల్‌ను ప్రారంభించింది. దీనికి సంబంధించి సోలార్ ప్రాజెక్ట్‌లకు ఫైనాన్సింగ్ కోసం టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ (టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ అనుబంధ సంస్థ) తో ఒప్పందం కుదుర్చుకుంది. సోలార్ ప్రాజెక్ట్‌లకు ఫైనాన్సింగ్ కోసం దరఖాస్తు చేసే దరఖాస్తుదారులకు డిజిటల్ మరియు అవాంతరాలు లేని సదుపాయం కోసం ఈ ఎండ్-టు-ఎండ్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ &  పతంజలి భాగస్వామ్యంలో కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌

పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ ఉమ్మడిగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో కో-బ్రాండెడ్ కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డ్‌లను ప్రారంభించాయి. ప్లాటినం మరియు సెలెక్ట్ పేర్లతో విడుదల చేసిన ఈ కార్డులు 25,000 నుండి 10 లక్షల వరకు క్రెడిట్ పరిమితిని అందిస్తాయి. ప్రమాదవశాత్తు మరణించిన లేదా గాయాలపాలయినా వ్యక్తులకు 2 లక్షల నుండి 10 లక్షల ఆకర్షణీయమైన బీమా అవకాశాన్ని అందిస్తున్నాయి. అలానే 20-50 రోజుల నిడివితో పతంజలి ఉత్పత్తులను వడ్డీ రహిత కొనుగోళ్లకు అవకాసం కల్పిస్తుంది.

ఇండిగో ఎయిర్‌లైన్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా రాహుల్ భాటియా

ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఇండిగో తన సహ వ్యవస్థాపకుడు మరియు ప్రమోటర్ రాహుల్ భాటియాను కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. భారతదేశం మరియు అంతర్జాతీయ మార్కెట్‌లలో ఇండిగో ఎయిర్‌లైన్స్ ఉనికి మరియు విస్తరణపై ఈ సంస్థ దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది.

హెచ్‌పీసీఎల్‌ కొత్త చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టరుగా పుష్ప్ కుమార్ జోషి

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టరుగా పుష్ప్ కుమార్ జోషి నియమితులయ్యారు. హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ యొక్క అనుబంధ సంస్థ, ఇది మహారాష్ట్రలోని ముంబైలో ప్రధాన కార్యాలయంతో భారత ప్రభుత్వ పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ యాజమాన్యంలో ఉంది. ఇది దేశీయ అతిపెద్ద ఆయిల్ కంపెనీ. భారత కంపెనీల వ్యవస్థలలో ఇది మహారత్న హోదా కలిగిఉంది.

ఆర్‌బిఐ రెపో రేటు వరుసగా 9వ సారి 4% వద్ద యథాతథం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్య విధానం (మానిటరీ పాలసీ) యొక్క రెపో మరియు రివర్స్ రెపో రేట్లు రెండూను వరుసగా 9వ సారి బెంచ్‌మార్క్ వడ్డీ రేటును 4 శాతం మరియు 3.5 వద్ద మారకుండా యథాతథంగా ఉంచబడ్డాయి. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో దాని అనుకూల వైఖరిని మరికొన్నాళ్లు కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

రెపో రేటు అనేది దేశంలోని సెంట్రల్ బ్యాంక్ (భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఏదైనా నిధుల కొరత ఏర్పడినప్పుడు వాణిజ్య బ్యాంకులకు మరియు ఆర్థిక సంస్థలకు ఇచ్చే రుణాల వడ్డీ రేటు. దీనిని దేశ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఉపయోగిస్తారు. రెపో అంటే 'తిరిగి కొనుగోలు చేసే ఎంపిక' లేదా 'తిరిగి కొనుగోలు చేసే ఒప్పందం అని అర్ధం. ఈ రుణాలకు ఎటువంటి భద్రత ఉండదు.

టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ తిరిగి నియామకం

టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డు తన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల కాలానికి తిరిగి నియమించినట్లు ప్రకటించింది. ప్రస్తుతం కంపెనీ చైర్మన్‌గా ఉన్న చంద్రశేఖరన్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. చంద్రశేఖరన్ 2016లో టాటా సన్స్ బోర్డులో చేరారు. వివిధ వివాదాల నేపథ్యంలో ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తొలగించిన తర్వాత టాటా గ్రూప్ సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో 2017లో చంద్రశేఖరన్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.

ఇండియన్ మొదటి ప్లాస్టిక్ వేస్ట్ న్యూట్రల్ కంపెనీ'గా డాబర్

భారతదేశపు అతిపెద్ద ఆయుర్వేద సంస్థ డాబర్ ఇండియా, దేశంలో 100 % ప్లాస్టిక్ వ్యర్థాల తటస్థతను సాధించినట్లు ప్రకటించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 27,000 మెట్రిక్ టన్నుల పోస్ట్ కంజ్యూమర్ ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి తిరిగి ఉపయోగించినట్లు వెల్లడించింది.

టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా సీఈఓ & ఎండీగా ఇల్కర్ ఐసీ

మాజీ టర్కిష్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్‌ ఇల్కర్ ఐసీ, టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. గత నెలలో భారత ప్రభుత్వం నుండి స్వాధీనం చేసుకున్న ఎయిర్ ఇండియా విమానయాన సంస్థను ఇల్కర్ ఐసీ త్వరలో లీడ్ చేయనున్నారు. ఇల్కర్ ఐసీ ఈ బాధ్యతలను 01 ఏప్రిల్ 2022 నుండి స్వీకరించనున్నారు.

ఐకియా ఇండియా తొలి మహిళా సీఈఓగా సుసానే పుల్వెరర్

స్వీడిష్ ఫర్నిచర్ రిటైలర్ ఐకియా తన కొత్త మరియు మొదటి మహిళా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా సుసానే పుల్వెరర్‌ను నియమించినట్లు ప్రకటించింది. సుసానే పుల్వెరర్‌ త్వరలో పీటర్ బెట్జెల్ నుండి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నరు.  పుల్వెరర్‌, ప్రస్తుతం ఐకియా గ్రూప్‌లో బిజినెస్ రిస్క్ మరియు కంప్లయన్స్ మేనేజర్‌గా ఉన్నారు.

బెంగళూరులో ఐబీఎం సైబర్ సెక్యూరిటీ హబ్‌ ప్రారంభం

ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పోరేషన్ (IBM), బెంగుళూరు కేంద్రంగా భారతదేశంలో తన మొదటి సైబర్ సెక్యూరిటీ హబ్‌ను ప్రారంభించింది. ఈ సైబర్ సెక్యూరిటీ కేంద్రాలు యూఎస్ బయట కేవలం రెండు మాత్రమే ఉన్నాయి. బెంగుళూరు సైబర్ సెక్యూరిటీ హబ్‌, ఆసియా పసిఫిక్ (APAC) ప్రాంతంలోని తన క్లయింట్‌ల సమస్యలను పరిస్కారించడంతో పాటుగా తమ సంస్థలకు పెరుగుతున్న సైబర్‌టాక్‌ల ప్రమాదాన్ని నివారించే లక్ష్యంతో పనిచేయనుంది.

నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ సీఈఓగా అభిషేక్ సింగ్

సీనియర్ ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్‌ను కొత్త నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (NeGD )సీఈఓగా నియమిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నాగాలాండ్ కేడర్‌కు చెందిన 1995-బ్యాచ్ ఐఎఎస్ అధికారైనా అభిషేక్ సింగ్‌ ప్రస్తుతం డిజిటల్ ఇండియా కార్పొరేషన్ సీఈఓగా ఉన్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు ఈ రెండు బాధ్యతలను ఏక కాలంలో నిర్వహించనున్నారు. జాతీయ ఇ-గవర్నెన్స్ ప్లాన్ (NeGP), దేశవ్యాప్తంగా ఉన్న ఇ-గవర్నెన్స్ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను స్వీకరిస్తుంది.

సెబీ కొత్త చైర్‌పర్సన్‌గా మాధబి పూరీ బుచ్

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క కొత్త చైర్‌పర్సన్‌గా మాధబి పూరి బుచ్ బాధ్యతలు స్వీకరించారు. ఈమె వచ్చే మూడేళ్ళ కాలానికి ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు. ప్రస్తుత చైర్‌పర్సన్‌ అజయ్ త్యాగి యొక్క ఐదేళ్ల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఈమె నియమితులయ్యారు.

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో దేశంలో సెక్యూరిటీలు మరియు కమోడిటీ మార్కెట్ యొక్క లావాదేవీలు నియంత్రణ సంస్థ. ఇది 12 ఏప్రిల్ 1988న స్థాపించబడింది. 30 జనవరి 1992న సెబీ చట్టం రూపొందిచబడింది.

Post Comment