తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 08 మార్చి 2024
March Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 08 మార్చి 2024

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 08 మార్చి 2024. పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నాం.

Advertisement

ఈజిప్టులో ఫారో రామ్‌సెస్ II యొక్క భారీ విగ్రహం వెలికితీత

ఈజిప్షియన్-యుఎస్ పురావస్తు మిషన్ ఈజిప్టు నగరమైన మిన్యాకు దక్షిణాన జరిపిన త్రవ్వకాలలో కింగ్ రామ్‌సెస్ II యొక్క భారీ విగ్రహం పై భాగాన్ని కనుగొన్నట్లు నివేదించింది. ఇది 1930లో జర్మన్ పురావస్తు శాస్త్రవేత్త గుంథర్ రోడర్ కనుగొన్న దిగువ భాగానికి సరిపోయే తల మరియు మొండెంగా భావిస్తున్నారు. ఇది ఈజిప్టు మధ్య సరిహద్దుకు సమీపంలో ఉన్న పురాతన నగరం హెర్మోపోలిస్‌లో త్రవ్వకాలలో కనుగొనబడింది.

  • ఈ బయటపడిన విగ్రహం 1279 నుండి 1213 బీసీ వరకు ఈజిప్టును పాలించిన శక్తివంతమైన ఫారో అయిన రామ్సెస్ IIకి చెందినది.
  • రామ్సెస్ II ను రామ్సెస్ ది గ్రేట్ అని కూడా పిలుస్తారు.
  • ఈజిప్షియన్-అమెరికన్ ఉమ్మడి పురావస్తు మిషన్‌లో భాగంగా పురాతన నగరం హెర్మోపోలిస్‌లో ఈ విగ్రహాన్ని కనుగొంది.
  • ఈ విగ్రహం దిగువ భాగం దాదాపు ఒక శతాబ్దం క్రితం 1930లో కనుగొనబడింది.
  • లైమ్‌స్టోన్ బ్లాక్ తో రూపొందించబడిన ఈ విగ్రహ భాగం 3.8 మీటర్ల (12.5 అడుగులు) ఎత్తుతో ఉంది.
  • దశాబ్దాల క్రితం వెలికితీసిన దాని దిగువ భాగంతో కలిపితే ఈ విగ్రహం మొత్తం పరిమాణం 7 మీటర్లకు చేరుకుంది.
  • ఈ విగ్రహం డబుల్ కిరీటం మరియు నాగుపాముతో అలంకరించబడిన శిరస్త్రాణం కలిగి ఉంది.

ఆసియాలోనే అతిపెద్ద ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిగా గెవ్రా మైన్

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కోల్ ఇండియా అనుబంధ సంస్థ సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్‌కు చెందిన గెవ్రా గని ఆసియాలోనే అతిపెద్ద బొగ్గు గనిగా అవతరించింది. ప్రస్తుతం 52.5 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగిన ఈ కోల్ మైన్, ఈ ఏడాది నుండి 70 మిలియన్‌ టన్నులకు విస్తరించేందుకు పర్యావరణ అనుమతి పొందింది.

  • గెవ్రా కోల్ మైన్ సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ యొక్క మెగాప్రాజెక్ట్‌లలో ఒకటి.
  • 2022-23 ఆర్థిక సంవత్సరంలో 52.5 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తితో దేశంలోనే అతిపెద్ద బొగ్గు గనిగా అవతరించింది.
  • గెవ్రా కోల్ మైన్ దాదాపు 40 సంవత్సరాలకు పైగా దేశ ఇంధన భద్రతకు దోహదపడుతుంది.
  • గెవ్రా కోల్ మైన్ దాదాపు 10 కి.మీ స్ట్రైక్ పొడవు మరియు 4 కి.మీ వెడల్పు విస్తీర్ణంలో ఉంది.
  • ఈ గనిలో సర్ఫేస్ మైనర్, రిప్పర్ మైనింగ్ రూపంలో పర్యావరణ అనుకూలమైన బ్లాస్ట్-ఫ్రీ మైనింగ్ టెక్నాలజీని ఏర్పాటు చేసారు.
  • ఈ గనిలో ఓవర్‌బర్డెన్ తొలగింపు కోసం 42 కమ్ షావెల్ మరియు 240-టన్నుల డంపర్ కాంబినేషన్ వంటి అత్యధిక కెపాసిటీ గల హెచ్ఈఎంఎం మెషీన్‌లు ఉపయోగిస్తున్నారు.

94 మంది కళాకారులకు సంగీత నాటక అకాడమీ అవార్డులు ప్రదానం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2022 మరియు 2023 ఏడాదికి సంబంధించి 94 మంది ప్రముఖ కళాకారులకు సంగీత నాటక అకాడమీ అవార్డులను ప్రధానం చేశారు. ఈ అవార్డులను మార్చి 6, 2024న న్యూఢిల్లీలోని న్యూ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రదానం చేశారు.

ఇదే వేదిక ద్వారా కళా రంగానికి విశేష కృషి చేసిన ప్రముఖ కళాకారులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ (అకాడెమీ రత్న)ను కూడా రాష్ట్రపతి ప్రదానం చేశారు. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అనేది ప్రదర్శన కళల రంగంలోని కళాకారులకు ఇచ్చే అత్యున్నత గౌరవం. ఈ ఏడాది ఢిల్లీకి చెందిన రాజా & రాధా రెడ్డిలకు జాయింట్ ఫెలోషిప్  అందజేశారు.

  1. వినాయక్ ఖేడేకర్ (భారతీయ సంగీతం) - గోవా
  2. ఆర్. విశ్వేశ్వరన్ (భారతీయ సంగీతం) - కర్ణాటక
  3. సునయన హజారిలాల్ (ఇండియానా డ్యాన్స్) - మహారాష్ట్ర
  4. రాజా & రాధా రెడ్డి (ఇండియన్ డ్యాన్స్ - జాయింట్ ఫెలోషిప్) - ఢిల్లీ
  5. దులాల్ రాయ్ (ఇండియన్ థియేటర్) - అస్సాం
  6. డిపి సిన్హా (ఇండియన్ థియేటర్) - ఉత్తర ప్రదేశ్

గత ఏడు దశాబ్దాలుగా వివిధ కళారూపాలను ప్రోత్సహిస్తున్న సంగీత నాటక అకాడమీని రాష్ట్రపతి అభినందించారు. ప్రదర్శన కళలు మరియు అవ్యక్త వారసత్వం రంగంలో అకాడమీ చేస్తున్న కృషి చాలా ముఖ్యమైనదని ఆమె అన్నారు. అకాడమీ ఫెలోషిప్ మరియు సంగీత నాటక అకాడమీ అవార్డులు పొందిన వారందరికీ రాష్ట్రపతి అభినందనలు తెలిపారు.

ఈ వేడుకలో ప్రసంగించిన కేంద్ర సాంస్కృతిక, పర్యాటక జి. కిషన్ రెడ్డి, దేశంలో అంతరించిపోయే దశలో ఉన్న 100కు పైగా అరుదైన కళారూపాలను ఇప్పుడు అకాడమీ 'కళాదీక్ష' పేరుతో శిక్షణా కార్యక్రమాల ద్వారా పునరుజ్జీవింపజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల నుండి ముగ్గురు కళాకారులకు అకాడమీ అవార్డులు అందుకున్నారు.

  1. ఎల్ వి గంగాధర శాస్త్రి (మ్యూజిక్) - తెలంగాణ
  2. మద్దాలి ఉషా గాయత్రి (కూచిపూడి) - తెలంగాణ
  3. పేరిణి ప్రకాష్ (క్లాసికల్ డాన్స్) - ఆంధ్రప్రదేశ్

సంగీత నాటక అవార్డులు

  • సంగీత నాటక అకాడమీ అవార్డులు 1952 నుండి ప్రదానం చేయబడుతున్నాయి.
  • ఈ గౌరవాలు వివిధ కళా రంగాలలో సాధించిన అత్యున్నత స్థాయి శ్రేష్ఠత మరియు విజయానికి ప్రతీకగా అందించబడతాయి.
  • అకాడమీ ఫెలో గౌరవం పొందిన వారికీ రూ. 3, 00, 000/-నగదు బహుమతి అందిస్తారు.
  • అకాడమీ అవార్డు గ్రహీతలకు లక్ష రూపాయల నగదు బహుమతితో పాటుగా తామ్రపాత్ర మరియు అంగవస్త్రం అందజేస్తారు.
  • సంగీత నాటక అకాడమీ అవార్డులు 2022-23 పూర్తి జాబితా 

నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ విజేతగా యతిన్ భాస్కర్

హర్యానాకు చెందిన యతిన్ భాస్కర్ దుగ్గల్ నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2024 లో ప్రధమ బహుమతి సాధించాడు. ఇదే పోటీలో తమిళనాడుకు చెందిన వైష్ణ పిచ్చై రెండవ బహుమతిని గెలుచుకోగా, రాజస్థాన్‌కు చెందిన కనిష్క శర్మ మూడవ బహుమతిని గెలుచుకున్నారు.

మార్చి 6న న్యూఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగిన నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2024 ముగింపు వేడుకలలో ఈ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మరియు కేంద్ర క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు.

  • 2024 నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్, దేశవ్యాప్తంగా 9 ఫిబ్రవరి 2024 నుండి 6 మార్చి 2024 వరకు నిర్వహించబడింది.
  • యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ దేశంలోని 785 జిల్లాలను కవర్ చేస్తూ మూడు స్థాయిలలో నిర్వహించబడింది.
  • 2024 జిల్లా యూత్ పార్లమెంట్ 9 ఫిబ్రవరి 2024 నుండి 14 ఫిబ్రవరి 2024 వరకు నిర్వహించబడింది.
  • 2024 జిల్లా యూత్ పార్లమెంట్ విజేతలు ఫిబ్రవరి 19 నుండి 24 వరకు రాష్ట్ర యూత్ పార్లమెంట్‌లో పాల్గొన్నారు.
  • ఇందులో గెలిచిన 87 రాష్ట్ర స్థాయి విజేతలు, మార్చి 5 మరియు 6 తేదీల్లో పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగిన నేషనల్ యూత్ పార్లమెంట్-2024 ఫైనల్స్ యందు పాల్గొన్నారు.
  • వీరిలో గెలుపొందిన 29 మంది నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ యందు పాల్గొంటారు. మిగిలిన 58 మంది జాతీయ యూత్ పార్లమెంట్‌కు ప్రేక్షకులుగా హాజరవుతారు.

నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ అనేది నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ మరియు నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్)సహాయంతో రాష్ట్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహించే వార్షిక ఈవెంట్. దేశం యొక్క ప్రజాస్వామ్య ప్రక్రియలో యువతను భాగస్వామ్యం చేయడంతో పాటుగా, పార్లమెంటరీ విధానాలు మరియు చర్చలను యువతకు పరిచయం చేయడం ద్వారా భారతదేశంలో ప్రజాస్వామ్య మూలాలను బలోపేతం చేయడం దీని లక్ష్యం.

ఈ కార్యక్రమం జిల్లా యూత్ పార్లమెంట్, రాష్ట్ర యూత్ పార్లమెంట్ మరియు నేషనల్ యూత్ పార్లమెంట్ స్థాయిలో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం యువతలో నాయకత్వ లక్షణాలను ప్రోత్సహిస్తుంది. అలానే వారి పూర్తి సామర్థ్యాన్ని గ్రహించేలా మరియు ఈ ప్రక్రియలో దేశ నిర్మాణానికి తోడ్పడేలా చేస్తుంది. చురుకైన పౌరుల ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించడం ద్వారా దేశ నిర్మాణంలో వారి భాగస్వామ్యాన్ని ఉండే తీర్చిదిద్దుతుంది.

  • నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2017 డిసెంబర్ 31న ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ ప్రసంగంలోని ఆలోచన ఆధారంగా రూపొందించబడింది.
  • తొలి నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2019లో నిర్వహించబడింది.
  • రెండవ జాతీయ యూత్ పార్లమెంట్ ఉత్సవాలు 2021లో నిర్వహించారు.
  • మూడవ జాతీయ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2022లో నిర్వహించారు.
  • నాల్గువ జాతీయ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2023లో నిర్వహించారు.
  • ఐదవ జాతీయ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2024లో నిర్వహించారు.

పాకిస్థాన్ పంజాబ్‌లో తొలి సిక్కు మంత్రిగా రమేష్ సింగ్ అరోరా

పాకిస్థాన్ పంజాబ్‌లో తొలి సిక్కు మంత్రిగా రమేష్ సింగ్ అరోరా చరిత్ర సృష్టించారు. భారత్, పాకిస్తాన్ విభజన తర్వాత మొదటిసారి ఒక మైనారిటీ సిక్కు కమ్యూనిటీ సభ్యుడు పంజాబ్ ప్రావిన్స్‌లో మంత్రిగా ప్రమాణం చేశారు. పాకిస్తాన్‌లోని ప్రావిన్షియల్ అసెంబ్లీ (ఎంపిఎ)కి మూడుసార్లు సభ్యుడిగా ఎన్నికైన సర్దార్ రమేష్ సింగ్ అరోరా, పంజాబ్ ప్రావిన్స్‌లో సిక్కు మైనారిటీ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

  • పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీకి చెందిన అరోరా, ఇటీవలే జరిగిన ఎన్నికలలో మూడవ సారి గెలుపొందారు.
  • 49 ఏళ్ల అరోరా ఇటీవలే పాకిస్థాన్ గురుద్వారా పర్బంధక్ కమిటీకి పర్ధాన్ (అధ్యక్షుడు)గా ఎన్నికయ్యారు.
  • అలానే కర్తార్‌పూర్ కారిడార్‌కు ఆయన అంబాసిడర్‌గా కూడా ఎన్నికయ్యారు.
  • అరోరా 2013లో పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీలో ప్రమాణం చేసిన మొట్టమొదటి సిక్కు సభ్యుడు.
  • 2016లో పాకిస్థాన్ అధ్యక్షుడిచే జాతీయ మానవ హక్కుల అవార్డును అందుకున్నారు.

భారతదేశపు మొదటి యూపీఐ-లీడ్ క్యూఆర్ బ్రాండ్ లాంచ్ చేసిన రేజర్‌పే

ప్రముఖ దేశీయ చెల్లింపుల సంస్థ రేజర్‌పే, ఎంటర్‌ప్రైజెస్ కోసం భారతదేశపు మొదటి యూపీఐ-లెడ్ క్యూఆర్ స్టాక్‌ను ప్రారంభించింది. ఇది క్యూఆర్-ఆధారిత చెల్లింపులు మరియు కాంటాక్ట్‌లెస్ ట్యాప్ కార్డ్‌కు మద్దతు ఇచ్చే ఒక ఆల్-ఇన్-వన్ పరికరం. దీనిని చెల్లింపు గేట్‌వే 3.0 పేరుతొ మార్కెట్లోకి విడుదల చేసింది.

ఇది కార్డ్-ఫస్ట్ అనే ఒకనాటి పరికరాల వలె కాకుండా, కార్డ్‌లు మరియు క్యూఆర్ ఆధారిత చెల్లింపులకు అనుమతిస్తుంది. రెడీ డైనమిక్ క్యూఆర్ (డిక్యూఆర్) స్టాక్ ఏకీకృత డ్యాష్‌బోర్డ్‌ను అందిస్తుంది. ఇది ఎఐ సాంకేతికతతో రిమోట్ డయాగ్నస్టిక్ మరియు కస్టమర్ ఎంగేజ్‌మెంట్‌ను పెంచే డిజిటల్ బిల్లులతో రిటైలర్‌లకు సాధికారతను అందిస్తుంది.

ఈ ప్రామాణిక పరికరం పిఓఎస్ టెర్మినల్ ధరలతో పోల్చుకుంటే మూడింట ఒక వంతుతో చెల్లింపులకు అవకాశం కల్పిస్తుంది. తద్వారా ఎంటర్‌ప్రైజెస్ సంస్థలకు యూపీఐ చెల్లింపులను అంగీకరించే విధానాన్ని ప్రాథమికంగా మారుస్తుందని ఈ సంస్థ భావిస్తుంది. అలానే వ్యవస్థీకృత రిటైల్ స్టోర్‌లలో భారీ యూపీఐ స్వీకరణను ప్రోత్సహించడంలో సహాయపడుతుందని రేజర్‌పే అభిప్రాయపడుతోంది.

2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ 6.8 శాతంగా అంచనా

దేశీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అయిన క్రిసిల్ నివేదిక ప్రకారం, భారతదేశం యొక్క వాస్తవ జీడీపీ వృద్ధి 2025 ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతానికి మధ్యస్థంగా వృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024) అంచనా వేసిన 7.6% వృద్ధి కంటే కొంచెం తక్కువగా ఉంది. 2031 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ $7 ట్రిలియన్‌కు చేరుకొని ప్రపంచ మూడవ ఎగువ మధ్య-ఆదాయ దేశంగా మారుతుందని ఈ క్రిసిల్ ఇండియా ఔట్‌లుక్ నివేదిక పేర్కొంది.

  • భారతదేశం ప్రస్తుతం $3.7 ట్రిలియన్ల జీడీపీ పరిమాణంతో, యూఎస్, చైనా, జపాన్ మరియు జర్మనీ తర్వాత ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది.
  • 2031 ఆర్థిక సంవత్సరం నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ $ 6.7 ట్రిలియన్‌కు విస్తరిస్తుందని క్రిసిల్ అంచనా వేస్తోంది.
  • తద్వారా దేశంలో తలసరి ఆదాయం $4,500కి పెరిగి భారత్ ఎగువ-మధ్య-ఆదాయ దేశాల క్లబ్‌లో చేరుతుందని అంచనా వేస్తుంది.
  • ప్రపంచ బ్యాంక్ నిర్వచనం ప్రకారం, $1,000-4,000 తలసరి ఆదాయం ఉన్న దేశాలు దిగువ-మధ్య ఆదాయ దేశాలుగా మరియు $4,000-12,000 మధ్య తలసరి ఆదాయం ఉన్న దేశాలు ఎగువ మధ్యతరగతి ఆదాయ దేశాలుగా భావించబడతాయి.
  • అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) కూడా 2027-28 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లతో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని అంచనా వేసింది.
  • అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024-25కి నిజమైన జీడీపీ వృద్ధిని 7 శాతంగా అంచనా వేసింది.
  • అలానే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ నివేదిక  2023-24లో దేశ ఆర్థిక వ్యవస్థ 7.6 శాతం వృద్ధి చెందుతుందని వెల్లడించింది.

అయితే ఈ నివేదిక భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ప్రపంచ రుణభారం, అసమాన ఆర్థిక పునరుద్ధరణ, వాతావరణ మార్పులు మరియు సాంకేతిక అంతరాయాల వల్ల సమీప మరియు మధ్యకాలిక సవాళ్లు ఎదురవుతాయిని హెచ్చరించింది. అయితే దేశీయ వృద్ధికి దేశీయ నిర్మాణ కారకాలు మరియు చక్రీయ లివర్ల నుండి మద్దతు లభిస్తుందని పేర్కొంది.

Advertisement

Post Comment