తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 06 మార్చి 2024. పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నాం.
చైనా, మాల్దీవులు కొత్త రక్షణ ఒప్పందాలపై సంతకాలు
భారత సైన్యం ఉపసంహరణ, ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో మాల్దీవులు చైనాతో సైనిక ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా చైనా మాల్దీవులకు ఉచిత సైనిక సహాయాన్ని అందజేస్తుంది.
ఈ ఒప్పందంపై మాల్దీవుల రక్షణ మంత్రి మొహమ్మద్ ఘసన్ మౌమూన్ మరియు చైనా డిప్యూటీ డైరెక్టర్ మేజర్ జనరల్ జాంగ్ బావోకున్ సంతకం చేశారు. అయితే ఈ సహాయంపై నిర్దిష్ట స్పష్టత లేదు. భారత సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని మాల్దీవుల అభ్యర్థనతో సహా భారతదేశం మరియు మాల్దీవుల మధ్య ఉద్రిక్తత ఉన్న సమయంలో ఈ ఒప్పందం చోటు చేసుకుంది.
- ఈ ఒప్పందం మాల్దీవుల విదేశాంగ విధానంలో మార్పును ప్రతిబింబిస్తుంది.
- ఇది భారతదేశం నుండి దూరంగా మరియు చైనాకు దగ్గరయ్యే సూచనను తెలియజేస్తుంది.
- ఈ ఒప్పందం హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా యొక్క పెరుగుతున్న ప్రభావానికి సంకేతంగా పరిగణించబడుతుంది.
- దీనిని భారతదేశం మరియు ఇతర ప్రాంతీయ శక్తులు నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. ఈ ప్రాంతం ఇండియాకు కీలకమైనది.
ఫిబ్రవరి 22న చైనా పరిశోధనా నౌక జియాంగ్ యాంగ్ హాంగ్ 03ని మాలే నౌకాశ్రయంలో డాక్ చేయడానికి మాల్దీవులు అనుమతించిన తర్వాత కూడా ఈ సైనిక ఒప్పందం కుదిరిందని గమనించాలి. మరో వైపు డిసెంబరు 2023లో తమ నౌకాశ్రయాల్లో ఈ నౌకను డాకింగ్ చేయడంపై శ్రీలంక ప్రభుత్వంతో కూడా భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
భారత అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఫిబ్రవరిలో మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు చైనా పర్యటన, మాలేలో డాక్ చేయడానికి పరిశోధన నౌకకు అనుమతి ఇవ్వడం, చైనాతో రక్షణ సహకార ఒప్పందంపై సంతకం చేయడం, బీజింగ్‌తో తన సంబంధాన్ని మరింతగా పెంచుకునే ప్రయత్నాల్లో ముయిజు పరిపాలన చేపట్టిన చర్యల శ్రేణిని హైలైట్ చేస్తుంది.
కల్పక్కంలో ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ప్రారంభం
తమిళనాడులోని కల్పక్కంలో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్‌లో కోర్ లోడింగును ప్రధాని మోడీ ప్రారంభించారు. 500 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేయగల ఈ రియాక్టర్ భారతదేశం యొక్క అణు విద్యుత్ కార్యక్రమం ద్వారా ఇంధన భద్రత మరియు స్థిరమైన అభివృద్ధి యొక్క జంట లక్ష్యాలను చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 4 మార్చి 2024న దీని మొదటి కోర్ లోడింగ్ దీక్షను చూసేందుకు కల్పక్కంను సందర్శించారు.
- ఈ ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ రియాక్టర్, తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలోని కల్పక్కం సమీపంలోని కొక్కిలమేడు వద్ద నిర్మించారు.
- ఈ రియాక్టర్ నిర్మాణంకు ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ బాధ్యత వహించింది.
- 2003 లో భారతీయ నభికియ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (భవినీ) దీని నిర్మాణ హక్కులను దక్కించుకుంది.
- 2024లో దీని నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.
- 3,500 కోట్ల ప్రారంభ వ్యయం గల ఈ ప్రాజెక్ట్, బహుళ జాప్యాల కారణంగా 7,700 కోట్లకు చేరుకుంది.
- ఈ రియాక్టర్ 200 కంటే ఎక్కువ భారతీయ పరిశ్రమల సహకారంతో స్వదేశీంగా రూపొందించబడింది.
- ఈ ప్రాజెక్ట్ యొక్క పవర్ ఐలాండ్‌ను భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బెల్) రూపొందించింది.
- ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పొడవైన నిర్మాణంలో ఉన్న అణు రియాక్టర్ ప్రాజెక్ట్‌గా రికార్డును కలిగి ఉంది.
- దీని ప్రారంభం ద్వారా రష్యా తర్వాత వాణిజ్య నిర్వహణ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్‌ను కలిగి ఉన్న రెండవ దేశంగా భారతదేశం అవతరించింది.
- ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ప్రారంభంలో యురేనియం 238-ప్లుటోనియం మిశ్రమ ఆక్సైడ్ (ఎంఒఎక్స్) ఇంధనాన్ని ఉపయోగిస్తుంది.
- ఇది భద్రత పరంగా అధునాతన మూడవ తరం రియాక్టర్, ఈ ప్లాంట్ అంతర్లీన నిష్క్రియ భద్రతా సదుపాయాన్ని కలిగి ఉంది.
- ఇది అత్యవసర పరిస్థితుల్లో ప్లాంట్‌ను వెంటనే మరియు సురక్షితంగా మూసివేయడానికి సహకరిస్తుంది.
- భారతదేశం 10,000 సంవత్సరాలకు పైగా అణు శక్తిని అందించగల ప్రపంచంలోని అతిపెద్ద థోరియం నిల్వలు కలిగిన దేశంగా ఉంది.
రాబోయే ఆరేళ్లలో నేచురల్ గ్యాస్ సెక్టార్‌లో భారత్ 67 బిలియన్ల పెట్టుబడులు
సహజవాయువు రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు భారత ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. వచ్చే ఆరేళ్లలో సహజవాయువు రంగంలో కేంద్ర ప్రభుత్వం 67 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ పూరి తెలిపారు. న్యూఢిల్లీలో నిర్వహించిన పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ 12వ సిజిడి బిడ్డింగ్ రౌండ్ ముగింపు వేడుకలో ఆయన ఈ ప్రకటన చేసారు.
సహజవాయువు రంగంలో కేంద్రం చేపడుతున్న ప్రస్తుత చర్యల వల్ల 2030 నాటికి సహజవాయువు వినియోగం మూడు రెట్లు పెరుగుతుందని హర్‌దీప్ పూరి తెలియజేసారు. సహజ వాయువు రంగంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దేశం గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారేందుకు దోహదపడుతుందని ఆయన అన్నారు.
భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఇంధనం, చమురు మరియు ఎల్పీజీ వినియోగదారుగా ఉందని, భారత్ నాల్గవ అతిపెద్ద ఎల్ఎన్జీ దిగుమతిదారునిగా ఉందని, భారత్ నాల్గవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ వ్యవస్థను కలిగి ఉన్నట్లు ఆయన వెల్లడించారు. భారత దేశం యొక్క ఇంధన డిమాండ్ 2045 నాటికి రెట్టింపు అవుతుందని ఆయన అంచనా వేశారు.
ఈ ముఖ్యమైన పెట్టుబడి పైప్‌లైన్‌లు, ఎల్‌ఎన్‌జి టెర్మినల్స్ మరియు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లతో సహా భారతదేశ సహజ వాయువు మౌలిక సదుపాయాల యొక్క ప్రధాన విస్తరణకు దారితీస్తుందని భావిస్తున్నారు. ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను కూడా ఆకర్షించాలని ప్రభుత్వం చూస్తోంది.
ఢిల్లీలో నేవల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2024 మొదటి ఎడిషన్
ద్వివార్షిక నావల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2024 యొక్క మొదటి ఎడిషన్ 05 నుండి 08 మార్చి 2024 వరకు ఢిల్లీలో నిర్వహించబడింది. ఈ కాన్ఫరెన్స్ భారత సముద్ర భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక, కార్యాచరణ మరియు పరిపాలనా విషయాలపై నావికాదళ కమాండర్‌లకు ఒక వేదిక అందిస్తుంది. ఈ కాన్ఫరెన్స్ ప్రారంభ సెషన్ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో జరిగింది.
దీని ఫాలో-ఆన్ ప్రొసీడింగ్స్ 2024 మార్చి 07 మరియు 08 తేదీలలో న్యూ ఢిల్లీలో హైబ్రిడ్ ఫార్మాట్‌లో జరిగాయి. ఈ ప్రారంభ సెషన్‌కు రక్షా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, డిఫెన్స్ సెక్రటరీ మరియు ఇతర సీనియర్లు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అధికారులు మరియు నౌకాదళ కమాండర్లు హాజరయ్యారు.
నేవల్ కమాండర్ల సదస్సును ఈసారి హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించారు. అభివృద్ధి చెందుతున్న భౌగోళిక రాజకీయ గతిశీలత, ప్రాంతీయ సవాళ్లు మరియు ఈ ప్రాంతంలో ప్రస్తుత అస్థిర సముద్ర భద్రత పరిస్థితుల నేపథ్యంలో జరిగిన ఈ సదస్సు భారత నౌకాదళం యొక్క భవిష్యత్తు గమనాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఉమ్మడి జాతీయ భద్రతా వాతావరణం దృష్ట్యా మూడు సర్వీసుల కలయికపై చర్చించేందుకు భారత సైన్యం మరియు భారత వైమానిక దళం చీఫ్‌లతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కూడా ఈ కాన్ఫరెన్స్‌లో నేవల్ కమాండర్‌లతో చర్చిస్తారు. దేశ రక్షణలో ట్రై-సర్వీస్ సినర్జీ మరియు సంసిద్ధతను పెంపొందించే మార్గాలను వీరు అన్వేషించారు.
ఈ కాన్ఫరెన్స్‌లో భాగంగా, 08 మార్చి 2024న సాగర్ మంథన్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నావికాదళ కమాండర్లు వివిధ థింక్ ట్యాంక్‌లతో ఇంటరాక్ట్ అయ్యారు. ఆత్మనిర్భర్త కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి మరియు రక్షణ ఉత్పత్తిలో స్వావలంబనను పెంపొందించడానికి ఎంఎస్ఎంఈలు, ఆవిష్కర్తలు మరియు విద్యాసంస్థలతో ఇంటరాక్ట్ అయ్యారు.
స్టీల్ సెక్టరులో ప్రపంచంలోని మొట్టమొదటి ఆఫ్-గ్రిడ్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ప్రారంభం
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా, దేశంలో స్టెయిన్‌లెస్ స్టీల్ సెక్టార్ యొక్క మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్‌ను మార్చి 4న ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు హిసార్‌లోని జిందాల్ స్టెయిన్‌లెస్ లిమిటెడ్‌లో నిర్మించారు. ఇది స్టెయిన్‌లెస్ స్టీల్ పరిశ్రమలో రూఫ్‌టాప్ & ఫ్లోటింగ్ సోలార్‌తో ప్రపంచంలోనే మొట్టమొదటి ఆఫ్-గ్రిడ్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అవుతుంది.
ఈ ప్రాజెక్ట్ అత్యాధునిక గ్రీన్ హైడ్రోజన్ సదుపాయంతో కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుంది. ఇది సంవత్సరానికి 2,700 మెట్రిక్ టన్నులు మరియు రాబోయే రెండు దశాబ్దాలలో 54,000 టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో నిర్మించబడింది. ఈ ప్లాంటును హైజెన్‌కో మరియు జిందాల్ స్టెయిన్‌లెస్ స్టీల్ నిర్మించాయి.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన జ్యోతిరాదిత్య ముడి ఉక్కును ఉత్పత్తి చేసే ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా అవతరించడం లక్ష్యంగా ఉక్కు రంగంలో భారతదేశం యొక్క పురోగతిని హైలైట్ చేశారు. గ్రీన్ హైడ్రోజన్ మరియు దాని ఉత్పన్నాల ఉత్పత్తి, వినియోగం మరియు ఎగుమతి కోసం భారతదేశాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు పేర్కొన్నారు.
ఈ రంగంలో సుమారు ₹20,000 కోట్ల వ్యయంతో గత ఏడాది జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఆర్థిక సంవత్సరం 2029-30 వరకు సుమారు ₹500 కోట్ల బడ్జెట్‌తో ఉక్కు రంగంలో పైలట్ ప్రాజెక్ట్‌లకు కూడా మద్దతు ఇస్తోందని తెలిపారు.
తమ ప్రభుత్వం 2070 నాటికి భారత్ నికర సున్నా కార్బన్ ఉద్గార లక్ష్యాన్ని సాధించడానికి గ్రీన్ గ్రోత్ మరియు గ్రీన్ జాబ్స్ అంశాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. దీనికి అనుగుణంగా కంపెనీలు, పౌరులు మరియు రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహిస్తున్నాట్లు తెలిపారు.
ముంబయిలో త్వరలో డ్రైవర్ లెస్ పాడ్ ట్యాక్సీలు ప్రారంభం
వ్యాపార కేంద్రమైన బాంద్రా - కుర్లాకు ప్రయాణాన్ని సులభతరం చేయడానికి పాడ్ టాక్సీ సేవను ప్రారంభించనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనితో ముంబై భారతదేశపు మొట్టమొదటి పాడ్ టాక్సీ ప్రాజెక్ట్‌కు నిలయంగా మారింది.
- రద్దీగా ఉండే బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి మరియు కనెక్టివిటీని మెరుగుపరచడానికి ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
- పాడ్ టాక్సీ అని పిలిచే ఆటోమేటెడ్ రాపిడ్ ట్రాన్సిట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్, 5 మీటర్ల పొడవు, 1.47 మీటర్ల వెడల్పు మరియు 1.8 మీటర్ల ఎత్తు ఉన్న ఒక్కో పాడ్‌లో 6 మంది ప్రయాణికులు హాయిగా కూర్చునే సామర్థ్యం ఉంది.
- దీనిని పర్సనల్ రాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ (పీఆర్టీ) అని కూడా పిలుస్తారు.
- ఈ ప్రతిపాదిత వ్యవస్థ నిర్మాణ అంచనా వ్యయం రూ. 1016.38 కోట్లుగా అంచనా వేయబడింది.
- బాంద్రా-కుర్లా రైల్వే మార్గంలో 8.80 కిలోమీటర్ల దూరంతో మరియు 38 స్టేషన్ల నెట్‌వర్కుతో ఇది రూపుదిద్దుకోనుంది.
- పాడ్ టాక్సీలు గరిష్టంగా గంటకు 40 కిమీ వేగంతో పనిచేసేలా రూపొందించబడుతున్నాయి.
- ఈ పాడ్ టాక్సీ వ్యవస్థ, బాంద్రా మరియు కుర్లా రైల్వే స్టేషన్‌ల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు సౌకర్యవంతమైన మరియు సమర్థవంతమైన ప్రయాణ మోడ్‌ను అందిస్తాయి.
- ఈ పాడ్ టాక్సీ వ్యవస్థ ముంబై వాసులకు వ్యక్తిగత వాహనాలు లేదా సుదీర్ఘ నడకలపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి.
- ఇవి బస్సులు లేదా క్యాబ్‌ల వంటి సాంప్రదాయ ఎంపికలతో పోలిస్తే త్వరితగత ప్రయాణ సమయాన్ని అందించగలవు.
పర్సనల్ రాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ లేదా పాడ్ టాక్సీ అనేది పరిమిత ప్రయాణీకులు లేదా కార్గో కోసం రూపొందించబడిన చిన్న, డ్రైవర్‌లెస్ వాహనాలను ఉపయోగించే ప్రత్యేకమైన ప్రజా రవాణా వ్యవస్థను సూచిస్తుంది. యూకే, అబుదాబి, నెదర్లాండ్స్ మొదలైన అభివృద్ధి చెందిన దేశాలలో పాడ్ టాక్సీలు ప్రజా రవాణా సాధనంగా ఉపయోగించబడుతున్నాయి. ఇవి ప్రత్యేకంగా నిర్మించిన మార్గదర్శకాల నెట్‌వర్క్‌లో పనిచేసే చిన్న ఆటోమేటెడ్ కార్లు.
ఇరాన్‌లో రికార్డు స్థాయిలో 834 ఉరిశిక్షలు అమలు
ఇరాన్ గత ఏడాది 834 మందికి ఉరిశిక్ష విధించినట్లు నార్వేకు చెందిన ఇరాన్ మానవ హక్కులు (ఐహెచ్ఆర్) మరియు పారిస్‌కు చెందిన టుగెదర్ ఎగైనెస్ట్ ది డెత్ పెనాల్టీ సంయుక్త నివేదికలో పేర్కొన్నాయి. ఇటీవలి సంవత్సరాలలో ఇరాన్‌లో ఉరిశిక్ష అమలు 2022 నాటికి 43 శాతం పెరిగినట్లు ఇవి నివేదించాయి. 2015 నుండి ఇరాన్‌లో ఉరిశిక్షలు అత్యధికంగా ఉన్నాయని ఈ రెండు హక్కుల సంఘాల నివేదిక తెలిపింది.
- 2015లో 972 ఉరిశిక్షల తర్వాత, గత రెండు దశాబ్దాల్లో 800 మరణశిక్షలు నమోదు కావడం ఇది రెండోసారి మాత్రమే.
- 2022 సెప్టెంబర్‌లో పోలీసు కస్టడీలో ఉన్న మహ్సా అమినీ మరణంతో ఏర్పడిన నిరసనలను అణగదొక్కడానికి ఇరాన్ మరణశిక్షను ఉపయోగిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి.
- సామాజిక భయాన్ని కలిగించడం ద్వారా అధికారాన్ని నిలబెట్టుకోవలనే ఆలోచనలో అక్కడ ప్రభుత్వం ఉన్నట్లు ఈ నివేదికలు చెబుతున్నాయి.
- 2022 నిరసనల సందర్భంగా భద్రతా దళాలపై దాడులకు సంబంధించిన కేసుల్లో ఇరాన్ తొమ్మిది మంది వ్యక్తులను ఉరితీసింది.
- ఇదే విధమైన కేసుల్లో 2022లో ఇద్దరు, 2023లో ఆరుగురు మరియు 2024లో ఇప్పటివరకు ఒకరు మరణ శిక్షకు గురైనట్లు పేర్కొంది.
- అయితే 2023లో మాదకద్రవ్యాల సంబంధిత ఉరిశిక్షల సంఖ్య నాటకీయంగా పెరిగింది. గత ఏడాది ఈ కేసుల్లో 471 మందికి ఉరిశిక్ష విధించింది.
- ఇది 2020లో నమోదైన గణాంకాల కంటే 18 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది.
- ఈ విధమైన ఉరిశిక్షలపై యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ (యుఎన్‌ఒడిసి) పర్యవేక్షణ లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది.
- ఇరాన్‌లో చాలా వరకు ఉరిశిక్షలను జైలు పరిధిలోనే అమలు చేస్తారు, అయితే 2023లో ఇరాన్‌లో బహిరంగంగా ఉరితీయబడిన వారి సంఖ్య 2022 నుండి మూడు రెట్లు పెరిగింది.
- గత ఏడాది ఏడుగురిని బహిరంగ ప్రదేశాల్లో ఉరితీశారు.
- గత ఏడాది కనీసం 22 మంది మహిళలకు మరణశిక్ష విధించబడింది, ఇది గత దశాబ్దంలోనే అత్యధిక సంఖ్యలో ఉందని ఈ నివేదిక పేర్కొంది.
- 2023లో నమోదు చేయబడిన మరణశిక్షలలో కేవలం 15 శాతం మాత్రమే అధికారిక ఇరాన్ మీడియా ద్వారా ప్రకటించబడింది.
ఇరాన్‌లో ఉరిశిక్షలు పెరగడం, ముఖ్యంగా నిరసనకారులను లక్ష్యంగా చేసుకోవడం మరియు హత్యకు మించిన ఆరోపణలకు ఉరిశిక్షను ఉపయోగించడం గురించి మానవ హక్కుల సంఘాలు తీవ్రమైన ఆందోళనలను వ్యక్తం చేస్తున్నాయి. ఇది అభివృద్ధి చెందుతున్న మానవ హక్కుల సమస్యగా అవి భావిస్తున్నాయి, అంతర్జాతీయ సమాజం ఇరాన్‌ను ఉరిశిక్షలను నిలిపివేయాలని కోరుతోంది.