Latest Current affairs in Telugu : 11 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్
Telugu Current Affairs

Latest Current affairs in Telugu : 11 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్

Latest Current affairs in Telugu 11 December 2023. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

స్టార్టప్‌ల సంఖ్యలో భారతదేశంకు నాల్గవ స్థానం

స్టార్టప్ జీనోమ్ యొక్క స్కేలప్ నివేదిక ప్రకారం, $50 మిలియన్లు లేదా అంతకంటే ఎక్కువ నిధులను సేకరించిన స్టార్టప్‌ల సంఖ్య పరంగా భారతదేశం ప్రపంచంలో నాల్గవ స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి స్టార్టప్‌లు 12,400 ఉన్నాయని తెలిపిన ఈ నివేదిక, అందులో 429 భారత్‌కు చెందినవేనని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం 7184 స్టార్టప్‌లతో యూఎస్ అగ్రస్థానంలో ఉండగా, 1491 స్టార్టప్‌లతో చైనా రెండవ స్థానంలో మరియు 623 స్టార్టప్‌లతో యూకే మూడవ స్థానంలో నిలిచింది.

ఈ ర్యాంకింగ్ భారతదేశం యొక్క స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ యొక్క వృద్ధిని మరియు గణనీయమైన పెట్టుబడిని ఆకర్షించగల సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుంది. ఇది గ్లోబల్ టెక్ సీన్‌లో ప్రధాన ప్లేయర్‌గా భారతదేశం యొక్క స్థానాన్ని కూడా బలోపేతం చేస్తుంది. ఈ విజయం భారతీయ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ యొక్క గణనీయమైన పురోగతి మరియు పెరుగుతున్న సామర్థ్యాన్ని సూచిస్తుంది. భారతీయ స్టార్టప్‌లు ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు వ్యవసాయం వంటి వివిధ రంగాలలో వినూత్న పరిష్కారాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి.

ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ ఛాంపియన్‌గా నిఖిల్ డే

భారతీయ సామాజిక కార్యకర్త నిఖిల్ డేను అమెరికా విదేశాంగ శాఖ అంతర్జాతీయ అవినీతి నిరోధక ఛాంపియన్‌గా ఎంపిక చేసింది. భారతదేశంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో అవినీతిని వ్యతిరేకించే సామాజిక ఉద్యమాలకు ఆయన చేసిన తెగువకు గాను ఈ గౌరవం కల్పించారు. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత మరియు జవాబుదారీతనం, పబ్లిక్ ఆడిట్‌లు మరియు భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆయన గుర్తింపు పొందారు.

మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ సహ-వ్యవస్థాపకుడిగా నిఖిల్ డే యొక్క ప్రయత్నాలు భారతదేశంలో అవినీతి నిరోధక మరియు పారదర్శకత సంస్కరణలకు దోహదపడ్డాయి. రాజస్థాన్ ప్రభుత్వం మరింత  జవాబుదారీతనం మరియు పారదర్శకతో పనిచేసేందుకు ఈయన ఉద్యమాలు సహాయపడ్డాయి.

మేఘాలయ లకడోంగ్ పసుపు మరియు ఇతర ఉత్పత్తులకు జిఐ ట్యాగ్

మేఘాలయలోని లకడాంగ్ పసుపుకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జిఐ) ట్యాగ్ లభించిందని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అంపారీన్ లింగ్డోహ్ తెలిపారు. లకడాంగ్ పసుపుతో పాటుగా, ఆ రాష్ట్రానికి చెందిన గారోడక్మండ (సాంప్రదాయ దుస్తులు), లార్నై కుండలు మరియు గారో చుబిట్చీ (మద్యపానం) కూడా జిఐ ట్యాగ్ అందించబడింది.

1. లకడాంగ్ పసుపు : మేఘాలయలోని జైంతియా కొండల పశ్చిమ పాదాలలో ఉన్న ఒక మాల్ గ్రామంలో లకడాంగ్ పసుపును పండిస్తారు. లకడాంగ్ పసుపు 6.8- 9% కర్కుమిన్ ఇండెక్స్‌తో ప్రపంచంలోనే అత్యుత్తమమైనది. జైంతియా హిల్స్‌లోని ఒక గ్రామం పేరు మీదుగా దీనికి ఆ పేరు పెట్టారు.

2. గారో దక్మండ : ఇది మేఘాలయలోని గారో తెగకు చెందిన మహిళలు ధరించే సాంప్రదాయ గారో దుస్తులు. ఇవి సాధారణంగా పత్తి లేదా పట్టుతో తయారు చేయబడిన పొడవైన వస్త్రాలు. దక్మండ సాధారణంగా ముదురు రంగులో ఉంటుంది. క్లిష్టమైన ఎంబ్రాయిడరీతో అలంకరించబడుతుంది.

3. లార్నై కుండలు : మేఘాలయలోని జైంతియా హిల్స్‌లోని లార్నై గ్రామంలో ఈ నల్ల కుండలను తయారు చేస్తారు. ఇవి స్థానిక సాంస్కృతిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందాయి. వీటిని స్థానిక భాషలో స్థానిక భాషలో ఖీవ్-రానే అంటారు. వీటిని నల్లమట్టి, పాము రాళ్ల సూర్ణంతో రూపొందిస్తారు. ఈ కుండలకు యు డియెంగ్ సోహ్లియా నుండి సంగ్రహించిన రంగులతో రంగులు వేస్తారు.

4. గారో చుబిట్చీ : చుబిట్చి లేదా చుబోక్ అనేది భారతదేశంలోని మేఘాలయలోని గారో తెగ వారు తయారుచేసే ఒక ప్రసిద్ధ సాంప్రదాయ మద్య పానీయం. ఇది గారో తెగల డైట్‌లో అత్యంత ముఖ్యమైన పానీయం. బియ్యం పులియబెట్టడం ద్వారా దీనిని రూపొందిస్తారు. పండగ సమయాల్లో దీన్ని ఎక్కువ వినియోగిస్తారు.

ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన 18 ఉత్పత్తులకు జిఐ ట్యాగ్

ఉత్తరాఖండ్ ఒక్క రోజులో అత్యధిక సంఖ్యలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ సర్టిఫికెట్‌లను పొందిన దేశంలోనే తోలి రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్రానికి చెందిన 18 స్థానిక ఉత్పత్తులకు ఒకే రోజు జిఐ ట్యాగ్‌ని పొందినట్లు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ వెల్లడించారు. దీనితో జిఐ ట్యాగ్‌లు పొందిన ఉత్తరాఖండ్‌ ఉత్పత్తుల సంఖ్య 27కి చేరుకుంది. వన్ డిస్ట్రిక్ట్, టూ ప్రొడక్ట్స్ కార్యక్రమంలో భాగంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ ఘనత సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల నుండి మొత్తం 27 ఉత్పత్తులు ప్రస్తుతం జిఐ ట్యాగ్ పొంది ఉన్నాయి.

తాజాగా జిఐ గుర్తింపు పొందిన ఉత్పత్తుల జాబితాలో ఉత్తరాఖండ్ చౌలై, ఝంగోరా, మండువ, రెడ్ రైస్, అల్మోరా లఖోరి మిరపకాయ, బెరినాగ్ టీ, బురాన్స్ షర్బత్, రామ్‌నగర్ నైనిటాల్ లిచ్చి, రామ్‌గఢ్ పీచ్, మాల్టా, పహారీ టోర్, గహత్, కాలా భట్, బిచ్చుబూటీ, నైనిటాల్ కొవ్వొత్తి, కుమావోని రంగు పిచ్చోడా, చమోలి రమ్మన్ మాస్క్ మరియు లిఖాయ్ చెక్క చెక్కడం వంటి ఉత్పత్తులు ఉన్నాయి. ఇప్పటికే గుర్తింపు పొందిన ఉత్పత్తులను కింద గమనించగలరు.

  1. ఉత్తరాఖండ్ తేజ్‌పత : దీనిని ఇండియన్ బే లీఫ్ అని కూడా పిలుస్తారు, ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్ వంటకాలలో ఉపయోగించే ప్రసిద్ధ మసాలా. ఇది హిమాలయ ప్రాంతానికి చెందిన సిన్నమోమమ్ తమల చెట్టు యొక్క ఆకు.
  2. ఉత్తరాఖండ్ బాస్మతి రైస్: ఉత్తరాఖండ్ బాస్మతి బియ్యం భారతదేశంలోని ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వత ప్రాంతాలలో పండించే పొడవైన సుగంధ బియ్యం. వీటిని సముద్ర మట్టానికి 400 నుండి 600 మీటర్ల ఎత్తులో పండిస్తారు.
  3. ఉత్తరాఖండ్ ఐపాన్ కళ : ఐపాన్ ఆర్ట్ అనేది భారతదేశంలోని ఉత్తరాఖండ్‌లోని కుమావోన్ ప్రాంతం నుండి ఉద్భవించిన ఆకర్షణీయమైన ఆచార జానపద కళారూపం.
  4. మున్సియారి వైట్ రాజ్మా ఇది ఉత్తరాఖండ్‌లోని మున్సియారి జిల్లాలో పండించే ఒక రకమైన కిడ్నీ బీన్. ఇది తెలుపు రంగుతో గొప్ప రుచికి ప్రసిద్ధి చెందింది. ఈ రాజ్మా సముద్ర మట్టానికి 2, 200 మీటర్ల ఎత్తులో పెరుగుతుంది.
  5. రింగల్ క్రాఫ్ట్ : రింగాల్ బాస్కెట్రీ అని కూడా పిలువబడే రింగల్ క్రాఫ్ట్ అనేది ఉత్తరాఖండ్‌లోని కుమావోన్ మరియు గర్హ్వాల్ ప్రాంతాలలో ఆచరించే అందమైన మరియు సాంప్రదాయ వెదురు కర్రలతో నేచే హస్తకళ.
  6. ఉత్తరాఖండ్ తుల్మా : తుల్మా అనేది భారతదేశంలోని ఉత్తరాఖండ్‌లోని కుమావోన్ ప్రాంతానికి చెందిన సాంప్రదాయ చేతితో నేసిన గొర్రె ఉన్ని దుప్పటి.
  7. భోటియా డాన్ : భోటియా డాన్ అనేది ఉత్తరాఖండ్‌లోని కుమావోన్ ప్రాంతానికి చెందిన సాంప్రదాయ హస్తకళ . ఇది యాక్స్ మరియు గొర్రెల ఉన్ని నుండి తయారు చేయబడిన చేతితో నేసిన కార్పెట్ రకం.
  8. చియురా ఆయిల్ : దీనిని అమరాంత్ ఆయిల్ లేదా చోలేయి టెల్ అని కూడా పిలుస్తారు. ఇది చోలేయి (అమరాంత్) మొక్క యొక్క విత్తనాల నుండి సేకరించిన ఒక ప్రత్యేకమైన మరియు సువాసనగల నూనె.
  9. కాపర్‌వేర్ క్రాఫ్టింగ్ : ఉత్తరాఖండ్‌లోని కాపర్‌వేర్ క్రాఫ్టింగ్ కళ శతాబ్దాల నాటిది. ఇది వాటి ప్రత్యేక డిజైన్ అంశాలు మరియు ఖచ్చితమైన హ్యాండ్‌క్రాఫ్టింగ్ టెక్నిక్‌ కోసం ప్రసిద్ధి పొందాయి.

చైనాలో నాల్గవ తరం న్యూక్లియర్ రియాక్టర్‌ ప్రారంభం

చైనా ప్రపంచంలోని మొట్టమొదటి తదుపరి తరం, గ్యాస్-కూల్డ్ న్యూక్లియర్ రియాక్టర్ పవర్ ప్లాంట్ యొక్క వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించినట్లు పేర్కొంది. దీనికి సంబదించిన షిడోవాన్ అణు విద్యుత్ ప్లాంట్ వాణిజ్య కార్యకలాపాలను డిసెంబర్ 6 న ప్రారంభించింది. దీనిని చైనా నేషనల్ న్యూక్లియర్ కార్పొరేషన్ నిర్మించింది.

ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎమర్జెన్సీ కోర్ కూలింగ్ సిస్టమ్‌లు లేకుండా వాణిజ్య-స్థాయి రియాక్టర్‌లను సహజంగా చల్లబరచవచ్చని ఈ ప్లాంట్ నిరూపించింది. హెచ్‌టిఆర్-పిఎమ్ వంటి నాల్గవ తరం రియాక్టర్‌లు సాంప్రదాయ డిజైన్‌లతో పోలిస్తే తక్కువ ఇంధనం నుండి ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇది శక్తి ఉత్పత్తి నుండి గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ రియాక్టర్లలో అధునాతన ఇంధన చక్రాలు అణు వ్యర్థాల వాల్యూమ్ మరియు రేడియోధార్మికతను గణనీయంగా తగ్గించగలవు.

ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు

రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసే రాష్ట్రపతికి ఉన్న అధికారాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా సమర్థిస్తూ డిసెంబర్ 11న చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. ఆగస్టు 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు మరియు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించింది.

ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తూ, వచ్చే ఏడాది సెప్టెంబర్ 30లోగా అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఈవిదంగా ఆదేశాలు జారీచేసింది. అలానే లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా పునర్వ్యవస్థీకరించడాన్ని కూడా సుప్రీం కోర్టు ధర్మశనం సమర్థించింది.

భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్, సూర్యకాంత్‌లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును డిసెంబర్ 11న వెలువరించింది. దీనిపై 16 రోజుల పాటు సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు, సెప్టెంబర్ 5న ఈ తీర్పును రిజర్వ్ చేసింది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించే తాత్కాలిక నిబంధన. ఇది రక్షణ, విదేశీ వ్యవహారాలు మరియు కమ్యూనికేషన్లకు సంబంధించిన మినహాయింపులతో ఈ రాష్ట్రానికి దాని స్వంత రాజ్యాంగం, ప్రత్యేక జెండా మరియు అంతర్గత పరిపాలనపై పూర్తి నియంత్రణను అందిస్తుంది.

1947 అక్టోబర్ 26న భారతదేశ విభజన తర్వాత జమ్మూ కశ్మీర్ స్వతంత్ర దేశంగా ఉండడానికి అప్పటి కాశ్మీర్ పాలకుడు మహారాజా హరిసింగ్ మొగ్గు చూపారు. ఇటు ఇండియాలో గానీ, పాకిస్తాన్ యందు గానీ విలీనం కాబోమని ప్రకటించారు. ఇంతలో పాకిస్తాన్ సైన్యం అండతో అక్కడి గిరిజనులు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంపై దండెత్తారు. మహారాజా హరిసింగ్ భారత ప్రభుత్వ సహకారాన్ని కోరారు. ఇండియాలో విలీనానికి అంగీకరించారు. కొన్ని షరతులతో ఈ విలీన ఒప్పందంపై సంతకం చేశారు.

1949లో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 పొందుపరచబడింది. ఈ ప్రాంతం యొక్క సాంస్కృతిక మరియు మతపరమైన గుర్తింపు గురించి ఆందోళనలను పరిష్కరిస్తూ, ప్రధానంగా ముస్లిం జనాభా కలిగిన ఏకైక రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్ ప్రజలకు రక్షణ కల్పించేందుకు అప్పటి భారత ప్రభుత్వం దీనిని రూపొందించింది.  1949 మే 27న రాజ్యాంగాన్ని రూపకల్పనకు ఏర్పాటైన రాజ్యాంగ సభ విలీన ఒప్పందం ప్రకారం ఆర్టికల్ 370 ముసాయిదాను ఆమోదించింది.

2019లో భారత ప్రభుత్వం రాష్ట్రపతి (రామనాధ్ కోవింద్) ఉత్తర్వు ద్వారా ఆర్టికల్ 370ని రద్దు చేసి, ఈ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయం భారతదేశంలో మరియు అంతర్జాతీయంగా గణనీయమైన వివాదానికి దారితీసింది. దీనిని బీజేపీ ప్రభుత్వం జాతీయ ఐక్యతను ప్రోత్సహించేందుకు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని పూర్తిగా భారతదేశంలో విలీనం చేసేందుకు మరియు ఈ ప్రాంతంలో అభివృద్ధిని సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాదించింది.

అయితే ప్రతిపక్షాలు దీనిని రాజ్యాంగ విరుద్ధమని, ఈ నిర్ణయం జమ్మూ మరియు కాశ్మీర్ స్వయంప్రతిపత్తి మరియు ప్రత్యేక హోదాను బలహీనపరుస్తుందని వాదించారు. ఆర్టికల్ 370 సమస్య బహుళ దృక్కోణాలు మరియు ముఖ్యమైన చిక్కులతో సంక్లిష్టమైనది. అయితే తాజా సుప్రీం కోర్టు తీర్పుతో ఈ సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారం అయినట్లు భావించాలి.

370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ యొక్క ప్రత్యేక పతాకం, రాజ్యాంగం, జాతీయ గీతం రద్దయ్యాయి. అన్ని రాష్ట్రాల మాదిరిగానే కేంద్ర చట్టాలు ఇక్కడ అమలవుతాయి. ఈ ప్రాంతానికి మునుపటిలా స్వయం ప్రతిపత్తి ఉండదు. జమ్ము కశ్మీర్ యందు ఎవరైనా భూమి కొనుగోలు చేయొచ్చు. బదిలీ చేసుకోవచ్చు. కశ్మీరీలకు ద్వంద్వ పౌరసత్వం వర్తించదు. ఆర్సీసీ(రణబీర్ శిక్షా స్మృతి) స్థానంలో ఐపీసీ (భారత శిక్షా స్మృతి) అమలు చేయబడుతుంది. జిల్లా స్థాయి అభివృద్ధి మండళ్లను (డీడీసీ) ఏర్పాటు చేస్తారు. మండలి సభ్యులు నేరుగా ప్రజలతోనే ఎన్నిక కావాల్సి ఉంటుంది.

  • 1949 మే 27: రాజ్యాంగాన్ని రూపకల్పనకు ఏర్పాటైన రాజ్యాంగ సభ విలీన ఒప్పందం ప్రకారం ఆర్టికల్ 370 ముసాయిదాను ఆమోదించింది.
  • 1949 అక్టోబర్ 17: జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ ఆర్టికల్ 370ని భారత రాజ్యాంగంలో చేర్చారు.
  • 1951 మే 1: జమ్మూకశ్మీర్లో రాజ్యాంగ అసెంబ్లీని ఏర్పాటు చేస్తూ రాజకుమారుడు డాక్టర్ కరణ్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
  • 1952: ఇండియా, జమ్మూ కాశ్మీర్ మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి 'ఢిల్లీ అగ్రిమెంట్' పై భారత ప్రధాని నెహ్రూ, జమ్మూ కశ్మీర్ ప్రధానమంత్రి షేక్ అబ్దుల్లా సంతకం చేశారు.
  • 1954 మే 14: రాష్ట్రపత్తి ఉత్తర్వు మేరకు ఆర్టికల్ 370 అమల్లోకి వచ్చింది.
  • 1954 మే 15: జమ్మూ కాశ్మీర్ శాశ్వత నివాసితుల హక్కుల విషయంలో రాష్ట్ర శాసనసభ చేసిన చట్టాలకు రక్షణ కల్పించడానికి రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా 'ఆర్టికల్ 35ఏ'ను భారత రాజ్యాంగంలో చేర్చారు.
  • 1957 నవంబర్ 17: జమ్మూకశ్మీర్ రాజ్యాంగాన్ని ఆమోదించారు.
  • 1958 జనవరి 26: జమ్మూ కాశ్మీర్ సొంత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
  • 1965: జమ్మూకశ్మీర్ ప్రధానమంత్రి, సదర్-ఇ-రియాసత్ పదవులను ముఖ్యమంత్రి, గవర్నర్ అధికారికంగా మార్చారు.
  • 2018 డిసెంబర్ 20: జమ్మూకశ్మీర్ రాష్ట్రపతి పాలన విధించారు.
  • 2019 జూలై 3: రాష్ట్రపతి పాలనను మరోసారి పొడిగించారు.
  • 2019 ఆగస్టు 5: ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.
  • 2019 ఆగస్టు 6: ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ అడ్వొకేట్ ఎం.ఎల్. శర్మ సుప్రీంకోర్టులో కేసు వేశారు. తర్వాత మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి.
  • 2019 ఆగస్టు 9: జమ్మూకశ్మీర్ పునర్వ్యస్థీకరణ చట్టం-2019ను పార్లమెంట్ ఆమోదించింది. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు.
  • 2019 సెప్టెంబర్ 19: ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ కోసం ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.
  • 2023 ఆగస్టు 2: పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ మొదలైంది.
  • 2023 సెప్టెంబర్ 5: మొత్తం 23 పిటిషన్లపై ధర్మాసనం విచారణ పూర్తి చేసింది. తుది తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించింది.
  • 2023 డిసెంబర్ 11: ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ప్రకటించింది. 2024 సెప్టెంబర్ 30లోగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.

Post Comment