Latest Current affairs in Telugu : 10 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్
Telugu Current Affairs

Latest Current affairs in Telugu : 10 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్

Latest Current affairs in Telugu 10 December 2023. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లు 2023

జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు 2023 మరియు జమ్మూ & కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు 2023 రాజ్యసభలో ఆమోదం పొందాయి. ఈ ఏడాది డిసెంబర్ మొదటి వారంలో లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టబడింది. ఈ బిల్లు జమ్మూ మరియు కాశ్మీర్ రిజర్వేషన్ చట్టం 2004ను సవరించాలని కోరుతోంది. ఈ చట్టం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు ఓబీసీ సభ్యులకు ఉద్యోగాలు మరియు వృత్తిపరమైన సంస్థల్లో ప్రవేశాలను అందిస్తుంది.

జమ్మూ మరియు కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు 2023, జమ్మూ మరియు కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019ని సవరించింది. ఈ బిల్లు జమ్మూ మరియు కాశ్మీర్ శాసనసభలోని మొత్తం సీట్ల సంఖ్యను పెంచేందుకు 1950 చట్టంలోని రెండవ షెడ్యూల్‌ను సవరించింది. దీనితో ప్రస్తుతం జమ్మూ మరియు కాశ్మీర్ అసెంబ్లీలో ఉన్న 107 సీట్ల సంఖ్యను 114కి పెంచింది. వీటిలో షెడ్యూల్డ్ కులాలకు ఏడు సీట్లు, షెడ్యూల్డ్ తెగలకు తొమ్మిది స్థానాలను రిజర్వ్ చేసింది.

అలానే లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా 1989 తర్వాత వచ్చిన కాశ్మీరీ వలస సమూహం నుండి ఇద్దరు సభ్యులను శాసనసభకు నామినేట్ చేసేఅవకాశాన్ని కల్పించింది. ఈ నామినేట్ చేయబడిన సభ్యులలో ఒకరు తప్పనిసరిగా మహిళ అయి ఉండాలని సూచించింది. ఈ సవరణ తర్వాత జమ్మూలో గతంలో 37 సీట్లు ఉండగా ఇప్పుడు కొత్త డీలిమిటేషన్ కమిషన్ తర్వాత 43 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. గతంలో కశ్మీర్‌లో 46 సీట్లు ఉండగా ఇప్పుడు 47 సీట్లకు చేరుకున్నాయి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో 24 సీట్లు కూడా రిజర్వ్‌ చేయబడ్డాయి. దీనితో పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్‌ యందు భాగంగా పరిగణించబడింది.

జమ్మూ మరియు కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019, జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ అని పిలువబడే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ బిల్లును హోం వ్యవహారాల మంత్రి అమిత్ షా 5 ఆగస్టు 2019 న రాజ్యసభలో ప్రవేశపెట్టారు, అదే రోజు ఆమోదించారు. 9 ఆగస్టు 2019న రాష్ట్రపతి ఆమోదం పొందింది. ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని పరోక్షంగా సవరించింది. దీని ద్వారా  జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసింది.

రెండవ అతిపెద్ద సోలార్ ఫోటో పివి డెవలపర్‌గా అదానీ గ్రీన్ ఎనర్జీ

మెర్కామ్ క్యాపిటల్ గ్రూప్ తాజా వార్షిక నివేదిక ప్రకారం ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ ఫోటో వోల్టాయిక్ సెల్ డెవలపర్‌లలో అదానీ గ్రీన్ ఎనర్జీ రెండవ స్థానంలో నిలిచింది. పునరుత్పాదక ఇంధన రంగంలో దాని సహకారం మరియు పనితీరు ఆధారంగా అదానీ గ్రీన్ ఎనర్జీ ఈ స్థానానికి ర్యాంక్ చేయబడింది.41.3 గిగా వాట్స్ సామర్థ్యంతో ఫ్రాన్స్‌కు చెందిన టోటల్‌ఎనర్జీస్ అగ్రస్థానంలో నిలవగా, 18 గిగా వాట్స్ సామర్థ్యంతో కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ రెన్యూవబుల్ పార్ట్‌నర్స్ మూడవ స్థానంలో నిలిచింది.

టాప్ 10 గ్లోబల్ లార్జ్-స్కేల్ సోలార్ ఫోటో వోల్టాయిక్ సెల్ డెవలపర్‌లలో ఆరుగురు ఐరోపాలో మరియు ముగ్గురు ఉత్తర అమెరికాలో ఉండగా, ప్రపంచ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక దక్షిణాసియా ఆధారిత కంపెనీగా అదానీ గ్రీన్ ఎనర్జీ నిలిచింది. అదానీ గ్రీన్ ఎనర్జీ అనేది క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్‌ని ఎనేబుల్ చేసే భారతదేశపు అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పరిష్కారాల భాగస్వామి. అదానీ కంపెనీ ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో 8.4 గిగా వాట్స్ ఆపరేటింగ్ పునరుత్పాదక పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది.

టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా టేలర్ స్విఫ్ట్

ప్రముఖ అమెరికన్ సింగర్ టైలర్ స్విఫ్ట్ 2023 ఏడాదికి సంబంధించి టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచారు. బార్బీ, కింగ్ చార్లెస్ III మరియు ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్‌తో సహా తొమ్మిది మంది ఫైనలిస్టుల బృందం నుండి స్విఫ్ట్ దీని కోసం ఎంపిక చేయబడింది. ఆమె ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని అందుకోవడం రెండవసారి. గతంలో ఆమె 2017లో టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యింది.

టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అనేది అమెరికన్ న్యూస్ మ్యాగజైన్ మరియు వెబ్‌సైట్ టైమ్ యొక్క వార్షిక సంచిక. ఇది ఆ ఏడాదిలో ప్రభావితం చేసిన వ్యక్తులకు, సంస్థలకు లేదా ఉత్పత్తులకు అంకితం చేయబడుతుంది. ఇది 1927 నుండి ప్రచురించబడుతుంది. 1999 వరకు దీనిని మ్యాన్ ఆఫ్ ది ఇయర్ లేదా ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అని పిలిచేవారు.

మిజోరం ముఖ్యమంత్రిగా లాల్దుహోమా ప్రమాణ స్వీకారం

మిజోరం కొత్త ముఖ్యమంత్రిగా జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ నాయకుడు లాల్దుహోమా డిసెంబర్ 8న ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణస్వీకార వేడుకలో గవర్నర్ హరిబాబు కంభంపాటి సమక్షంలో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే జరిగిన మిజోరాం ఎన్నికలలో లాల్దుహోమా నాయకత్వంలోని జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ పార్టీ అత్యధికంగా 27 సీట్లు సాధించి విజయం సాధించింది. మిజోరాం శాసనసభలోని మొత్తం 40 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 7 నవంబర్ 2023న ఎన్నికలు జరిగాయి.

జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ అనేది మాజీ ఐపీఎస్ అధికారి లల్దుహోమా నాయకత్వంలో ఏర్పడిన ఆరు ప్రాంతీయ పార్టీల కూటమి. 2018 మిజోరాం శాసనసభ ఎన్నికలలో ఈ జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ ఉద్భవించింది. అయితే ఈ ఎన్నికలలో కేవలం 8 సీట్లకే పరిమితం అయ్యింది. 2023 మిజోరాం శాసనసభ ఎన్నికలలో ఈ పార్టీ 27 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

మిజోరం ఈశాన్య భారతదేశంలోని ఒక చిన్న రాష్ట్రం. దీని రాజధాని నగరం ఐజ్వాల్. ఈ రాష్ట్రం త్రిపుర,అస్సాం మరియు మణిపూర్ రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకుంటుంది. అలానే పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ మరియు యన్మార్‌లతో కూడా సరిహద్దును కలిగి ఉంది. ఈ రాష్ట్రం 1972కి ముందు అస్సాంలో భాగంగా ఉండేది. 21 జనవరి 1972లో కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడింది. 20 ఫిబ్రవరి 1987లో రాష్ట్రంగా అవతరించింది.

విన్‌బాక్స్ సైనిక వ్యాయామం 2023

భారతదేశం మరియు వియత్నాం సైన్యం మధ్య జరిగే వార్షిక సైనిక వ్యాయామం విన్‌బాక్స్, డిసెంబర్ 11 నుండి 21 వరకు వియత్నాంలోని హనోయిలో నిర్వహించబడింది. ఈ వ్యాయామం భారతదేశం మరియు వియత్నామీస్ సాయుధ దళాల మధ్య అవగాహన మరియు సహకారాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ వ్యాయామంలో బెంగాల్ ఇంజనీర్ గ్రూప్ యొక్క ఇంజనీర్ రెజిమెంట్ నుండి 39 మంది సిబ్బంది మరియు ఆర్మీ మెడికల్ కార్ప్స్ యొక్క ఆరుగురు సిబ్బంది భారత బృందంకు నాయకత్వం వహించారు. వియత్నాం పీపుల్స్ ఆర్మీ కంటెంజెంట్‌ నుండి 45 మంది సిబ్బంది ప్రాతినిధ్యం వహించారు.

విన్‌బాక్స్ 2018 నుండి నిర్వహిస్తున్నారు. మొదటి ఎడిషన్ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో నిర్వహించబడింది. ఇది భారతదేశం మరియు వియత్నాంలో ప్రత్యామ్నాయంగా నిర్వహించబడే వార్షిక శిక్షణ కార్యక్రమం. చివరి ఎడిషన్ ఆగస్టు 2022లో చండీమందిర్ మిలిటరీ స్టేషన్‌లో నిర్వహించబడింది.

వియత్నాం 11 ఆగ్నేయాసియా దేశాలలో ఒకటి. ఇది ఉత్తరాన చైనాతో పశ్చిమాన లావోస్ మరియు కంబోడియాతో భూ సరిహద్దులను పంచుకుంటుంది. అలానే గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ ద్వారా థాయ్‌లాండ్‌తో మరియు దక్షిణ చైనా సముద్రం ద్వారా ఫిలిప్పీన్స్, ఇండోనేషియా మరియు మలేషియాతో సముద్ర సరిహద్దులను పంచుకుంటుంది.

  • అధ్యక్షుడు : వో వాన్ థుంగ్
  • ప్రధాన మంత్రి : ఫామ్ మిన్ చిన్
  • రాజధాని నగరం : హనోయి
  • అధికారిక భాష : వియత్నామీస్
  • అధికారిక కరెన్సీ : వియత్నామీస్ డాంగ్

కెన్యాలోని పోర్ట్ లామును సందర్శించిన ఐఎన్ఎస్ సుమేధా

ఆఫ్రికాలో కొనసాగుతున్న సుదీర్ఘ-ప్రయాణంలో భాగంగా, భారతీయ నావికాదళ నౌక సుమేధ 09 డిసెంబర్ 2023న కెన్యాలోని పోర్ట్ లామును సందర్శించింది. దీనితో కెన్యాలో ఇటీవల అభివృద్ధి చేసిన     ఈ  ఓడరేవును సందర్శించిన మొదటి భారతీయ నౌకాదళ నౌకగా నిలిచింది.

ఐఎన్ఎస్ సుమేధ స్వదేశీంగా అభివృద్ధి చేసిన సరయూ-క్లాస్ ఆఫ్ ఇండియన్ నేవీలో మూడవది. ఇది 07 మార్చి 2014న ప్రారంభించబడింది. ఈ నౌక స్వతంత్రంగా మరియు వివిధ ఫ్లీట్ కార్యకలాపాలకు మద్దతుగా రూపొందించబడింది. ఈ ఓడ అనేక రకాల అత్యాధునిక ఆయుధాలు మరియు సెన్సార్లతో అమర్చబడి ఉంది. ఇది విశాఖపట్నంలో ఉన్న ఇండియన్ నేవీ యొక్క ఈస్టర్న్ ఫ్లీట్‌లో భాగం. ఇది ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్, ఈస్టర్న్ నేవల్ కమాండ్ యొక్క ఆపరేషనల్ కమాండ్‌లో విధులు నిర్వహిస్తోంది.

ప్రస్తుతం ఈ నౌక భారత నౌకాదళం యొక్క బ్రిడ్జెస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కార్యక్రమంలో భాగంగా స్నేహపూర్వక దేశాలతో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడం అనే మిషన్‌ కోసం వివిధ ఆఫ్రికా దేశాల పోర్టులను సందర్శిస్తుంది. అలానే భారత్ ప్రభుత్వం ప్రారంభించిన సాగర్ విజన్ కార్యక్రమంలో భాగంగా పొరుగు దేశాలతో సముద్ర ఆర్థిక మరియు భద్రతా సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని ప్రయత్నిస్తుంది.

Post Comment