Advertisement
Daily Current affairs in Telugu : 18 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్
Telugu Current Affairs

Daily Current affairs in Telugu : 18 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్

Daily Current affairs in Telugu 18 December 2023. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

కాశీ తమిళ సంగమం 2023ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

వారణాసిలో కాశీ తమిళ సంగమం 2.0 కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇదే వేదిక ద్వారా కన్యాకుమారి - వారణాసి తమిళ సంగమం రైలును ప్రధాన మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుక్కురల్, మణిమేకలై మరియు ఇతర క్లాసిక్ తమిళ సాహిత్యం యొక్క బహుళ భాష మరియు బ్రెయిలీ అనువాదాలను కూడా ప్రారంభించారు.

ఈ కార్యక్రమం రెండు ప్రాంతాల మధ్య నిర్వహించే సాంస్కృతిక మరియు చారిత్రక సంబంధాల వేడుక. కాశీ తమిళ సంగమం రెండవ ఎడిషన్ డిసెంబర్ 15 నుండి డిసెంబర్ 30 మధ్య నిర్వహించారు. కాశీ తమిళ సంగమం యొక్క మొదటి ఎడిషన్ 16 నవంబర్ నుండి 16 డిసెంబర్ 2022 వరకు నిర్వహించబడింది. ఈ ఈవెంట్‌ను భారత ప్రభుత్వం, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం, మరియు తమిళనాడు ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్వహించాయి.

ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర రాష్ట్ర మంత్రులు డాక్టర్ ఎల్ మురుగన్ తదితరులు పాల్గొన్నారు. కాశీ-తమిళ సంగమం సంగమం భారతదేశ వారసత్వాన్ని బలోపేతం చేస్తూ, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తితో నిర్వహించబడింది.

ఆహార కల్తీ కేసుల్లో హైదరాబాద్‌ అగ్రస్థానం

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, ఆహార కల్తీ కేసులలో హైదరాబాద్ (తెలంగాణ) దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. అలానే మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉంది. 2022 ఏడాదికి సంబంధించి భారతదేశంలోని 19 ప్రధాన నగరాల్లో ఆహార కల్తీకి సంబంధించి మొత్తం 291 కేసులు నమోదు అవ్వగా, ఆశ్చర్యకరంగా, హైదరాబాద్‌లోనే 246 కేసులు నమోదయ్యాయి. ఇది ఈ నగరంలో ఆహార భద్రతలో ఆందోళనకరమైన ధోరణిని హైలైట్ చేస్తుంది.

ఆహార కల్తీ అనేది సాధారణ ప్రజలకు గణనీయమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగించే తీవ్రమైన సమస్య. కలుషితమైన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆహారం ద్వారా వచ్చే అంటువ్యాధులు, అలెర్జీలు మరియు మరణం కూడా సంభవించవచ్చు.

విజయ్ హజారే ట్రోఫీ 2023 విజేత హర్యానా

సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన 2023 విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్‌లో రాజస్థాన్‌ను 30 పరుగుల తేడాతో ఓడించి హర్యానా  విజేతగా నిలిచింది. ఇది హర్యానాకు మొదటి విజయ్ హజారే ట్రోఫీ. ఫైనల్ మ్యాచులో హర్యానా నిర్ణిత 50 ఓవర్లలో 287/8 పరుగులు చేయగా, రాజస్థాన్‌ 48 ఓవర్లలో 257 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది.

విజయ్ హజారే ట్రోఫీ అనేది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ద్వారా నిర్వహించబడే వార్షిక పరిమిత ఓవర్ల దేశీయ క్రికెట్ టోర్నమెంట్. ఇది రంజీ ట్రోఫీలో పాల్గొనే రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రాంతాల జట్లతో నిర్వహించబడుతుంది. ఈ టోర్నమెంట్ 1993-94 సీజన్‌లో ప్రారంభమైంది, అయితే 2002-03 నుండి జాతీయ పోటీగా నిర్వహిస్తున్నారు. డిసెంబరు 2004లో మరణించిన విజయ్ హజారే గౌరవార్థం దీని పేరు మార్చబడింది. తమిళనాడు జట్టు అత్యధికంగా ఐదుసార్లు ఈ ట్రోఫీని గెలుచుకుంది.

భారత్ మరియు ఒమన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య చర్చలు

భారతదేశం మరియు ఒమన్‌లు సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు నిర్వహిస్తున్నాయి. ఇటీవలే డిసెంబర్ 16న భారత్ సందర్శనుకు వచ్చిన ఒమన్ సుల్తాన్, హిస్ మెజెస్టి హైతం బిన్ తారిక్, కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, న్యూఢిల్లీలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మరియు పెట్టుబడి సంబంధాలపై చర్చలు జరిపారు. భారత్-ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సిఇపిఎ)పై సంతకం చేయడానికి చర్చలు వేగవంతమైనట్లు వెల్లడించారు. దీనికి చెందిన "విజన్ డాక్యుమెంట్"ను ఆమోదించారు.

దీనితో పాటుగా ఇరు దేశాల్లో పెట్టుబడులను పెంపొందించడంపై దృష్టి కేంద్రీకరించాల్సిన ఆవశ్యకతపై కూడా మంత్రులిద్దరూ చర్చించారు. ఇందుకోసం ఇన్వెస్ట్ ఇండియాలో ఒమన్ డెస్క్‌ను రూపొందించాలని నిర్ణయించారు. అదేవిధంగా ఇన్వెస్ట్ ఒమన్ యందు ఇండియా డెస్క్‌ను కూడా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. అలానే 300 మిలియన్ డాలర్ల ఇండియా-ఒమాన్ జాయింట్ ఫండ్ కూడా ఏర్పాటుకు కూడా ముందుకొచ్చారు.

ఒమన్ కీలకమైన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ మార్కెట్‌గా ఉన్నందున, ఈ వాణిజ్య ఒప్పందం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా పెంచుతుందని, గ్యాసోలిన్, ఇనుము & ఉక్కు, ఎలక్ట్రానిక్స్ మరియు యంత్రాలు వంటి రంగాలపై ప్రభావం చూపగలదని భావిస్తున్నారు.

రెండు దేశాల మధ్య 1955 నుండి సంబంధాలు ఉన్నాయి. 2008లో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం అప్‌గ్రేడ్ చేయబడిన తర్వాత ద్వైపాక్షిక వాణిజ్యం మరియు పెట్టుబడి సంబంధాలు వృద్ధి చెందాయి. 2021-2022లో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 82.64% వృద్ధి చెంది $9.99 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది 2020-2021లో 5.4 బిలియన్‌ డాలర్లతో పోల్చితే, మునుపటి రెండేళ్లలో 12.39 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ.

సమార్ వైమానిక రక్షణ ప్రయోగం విజయవంతం

భారత వైమానిక దళం 'సమార్' వాయు రక్షణ క్షిపణి వ్యవస్థను ఎక్సర్‌సైజ్ అస్త్రశక్తి వద్ద విజయవంతంగా పరీక్షించింది. భారత వైమానికదళం దాని పాత రష్యన్-మూలం ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి వ్యవస్థలను ఉపయోగించడం ద్వారా ఈ కొత్త సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ ఫర్ అష్యూర్డ్ రిటాలియేషన్ (SAMAR) వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసింది. దీనికి సంబందించిన ఫైరింగ్ ట్రయల్స్, ఆంధ్రప్రదేశ్ సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో నిర్వహించిన అస్త్రశక్తి వ్యాయామంలో ఇటీవలే నిర్వహించింది.

ఈ క్షిపణి వ్యవస్థ పనితీరును ఇప్పటికే చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ వీక్షించారు. అయితే ఏరో ఇండియా సమర్-1 సిస్టమ్ ప్రారంభ ఉత్పత్తిలోకి ప్రవేశించడానికి ముందు 17 రౌండ్ల టెస్ట్ ఫైరింగ్‌ను ఇప్పటికే పూర్తి చేసినట్లు ధృవీకరించింది.

సమార్ వ్యవస్థ 12-కిలోమీటర్ల పరిధినికవర్ చేసే లక్ష్యంతో రూపొందించబడింది. ఇది యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు మరియు మానవరహిత వైమానిక వాహనాలు వంటి తక్కువ-ఎగిరే వైమానిక లక్ష్యాలను ఛేదించేందుకు సహాయపడుతుంది. సిమ్రాన్ ఫ్లోటెక్ ఇండస్ట్రీస్ మరియు యమజుకి డెంకి అనే రెండు భారతీయ ప్రైవేట్ రంగ సంస్థల సహకారంతో ఈ సమర్ వ్యవస్థ రూపొందించబడింది.

ఎక్సర్‌సైజ్ అస్త్రశక్తిలో ఆకాష్ క్షిపణి ప్రదర్శన

25 కిలోమీటర్ల పరిధిలో ఏకకాలంలో నాలుగు వైమానిక లక్ష్యాలను ఛేదించగల ఆకాశ్ క్షిపణి వ్యవస్థ సామర్థ్యాన్ని ప్రదర్శించినాట్లు రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ ప్రకటించింది. డిసెంబర్ 17న ఆంధ్రప్రదేశ్ సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో నిర్వహించిన అస్త్రశక్తి వ్యాయామంలో ఈ ప్రదర్శన నిర్వహించింది. దీనితో ఒకే ఫైరింగ్ యూనిట్‌ని ఉపయోగించి ఇంత సామర్థ్యాన్ని కలిగి ఉన్న మొదటి దేశంగా భారత్ అవతరించింది.

ఆకాష్ అనేది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా అభివృద్ధి చేయబడిన మధ్యస్థ-శ్రేణి మొబైల్ ల్యాండ్-ఎయిర్ క్షిపణి వ్యవస్థ. దీనిని భారత్ డైనమిక్స్ లిమిటెడ్  ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. అలానే దీని యొక్క నిఘా మరియు అగ్ని నియంత్రణ రాడార్, టాక్టికల్ కంట్రోల్ మరియు కమాండ్ సెంటర్ మరియు క్షిపణి లాంచర్‌లను భారత్ ఎలక్ట్రానిక్స్, టాటా పవర్ స్ట్రాటజిక్ ఇంజనీరింగ్ డివిజన్ మరియు లార్సెన్ & టూబ్రో అభివృద్ధి చేశాయి.

ఆకాష్ క్షిపణి వ్యవస్థ 45 కిమీ దూరంలో ఉన్న విమానాలను లక్ష్యంగా చేసుకోగలదు. ఇది యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు మరియు గాలి నుండి ఉపరితల క్షిపణులు అలాగే బాలిస్టిక్ క్షిపణులు వంటి వైమానిక లక్ష్యాలను తటస్థీకరించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది ప్రస్తుతం భారత సైన్యం మరియు భారత వైమానిక దళం సేవలో ఉంది.

ఎంఆర్ఎఫ్ ఫార్ములా 2000 టైటిల్స్ విజేతగా సందీప్ కుమార్

మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో జరిగిన ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ ఎంఆర్ఎఫ్ ఫార్ములా 2000 రేసును బెంగళూరుకు చెందిన ఆదిత్య స్వామినాథన్ గెలుచుకున్నారు. అలానే చేతన్ సూర్నినేని ఎంఆర్ఎఫ్ ఫార్ములా 1600 టైటిళ్లను గెలుచుకున్నారు.

2022–23 ఎంఆర్ఎఫ్ ఫార్ములా 2000 సీజన్ భారతదేశంలో ఫార్ములా 2000-స్థాయి సింగిల్-సీటర్ ఛాంపియన్‌షిప్‌లో ఎనిమిదవ ఎడిషన్. మునుపు దీనిని ఎంఆర్ఎఫ్ ఛాలెంజ్ అని పిలిచేవారు. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా రెండు సీజన్‌లు రద్దు అయ్యాయి. 2022–23 సీజన్‌ ఎఫ్ఐఏ మద్దతు లేకుండా పునఃప్రారంభించబడింది. ప్రస్తుతం దీనిని ఎంఆర్ఎఫ్ ఫార్ములా 2000 అనిపిలవబడుతుంది.

Post Comment