తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ : 18 July 2023 Current Affairs
Telugu Current Affairs

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ : 18 July 2023 Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 18 జులై 2023 కరెంట్ అఫైర్స్ అంశాలు తెలుగులో చదవండి. ఇవి వివిధ పోటీ పరీక్షల కోసం సిద్దమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.

Advertisement

భూమి సమ్మాన్ 2023 అవార్డులు అందజేసిన భారత రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రతిష్టాత్మకమైన “భూమి సమ్మాన్” అవార్డులను జులై 18న విజేతలకు అందజేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ ప్రోగ్రాం (డిఐఎల్‌ఆర్‌ఎంపి) లో కృషి చేసిన రాష్ట్ర కార్యదర్శులు మరియు జిల్లా కలెక్టర్లకు ఈ అవార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దేశ సమగ్రాభివృద్ధికి గ్రామీణాభివృద్ధి అత్యవసరమని పేర్కొన్నారు. గ్రామీణ జనాభాలో ఎక్కువ మంది జీవనోపాధి భూ వనరులపై ఆధారపడి ఉన్నందున భూ రికార్డుల ఆధునికీకరణ ప్రాథమిక అవసరమని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సమగ్ర సమీకృత భూ నిర్వహణ వ్యవస్థ అత్యంత ముఖ్యమైనదని తెలిపారు.

ల్యాండ్ డిజిటలైజేషన్ వల్ల పారదర్శకత పెరుగుతుందని రాష్ట్రపతి అన్నారు. భూ రికార్డుల ఆధునికీకరణ మరియు డిజిటలైజేషన్ దేశ అభివృద్ధిపై గొప్ప ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు. భూ రికార్డులను డిజిటలైజేషన్ చేయడంతోపాటు వివిధ ప్రభుత్వ శాఖలతో అనుసంధానం చేయడం వల్ల సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేసే అవకాశం లభిస్తుంది. వరదలు మరియు అగ్నిప్రమాదం వంటి విపత్తుల కారణంగా పత్రాలు పోగొట్టుకున్న సందర్భంలో కూడా ఇది చాలా సహాయపడుతుందని తెలిపారు.

డిజిటల్ ఇండియా ల్యాండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కింద, ఆధార్ కార్డ్ లాగా ఉపయోగపడే ప్రత్యేకమైన ల్యాండ్ పార్శిల్ ఐడెంటిఫికేషన్ నంబర్‌ను అందించడం పట్ల రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. భూములను సక్రమంగా వినియోగించుకోవడంతోపాటు కొత్త సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేసేందుకు ఈ నంబర్ దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు. భూమి రికార్డులు మరియు రిజిస్ట్రేషన్ డేటా-బేస్‌తో ఈ-కోర్టులను అనుసంధానించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. డిజిటలైజేషన్‌ ద్వారా వస్తున్న పారదర్శకత వల్ల భూమికి సంబంధించిన అనైతిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందని తెలిపారు.

ఆల్ ఇండియన్ ట్రై సర్వీసెస్ మోటార్ సైకిల్ ర్యాలీని ప్రారంభించిన ఇండియన్ ఆర్మీ

భారత సైన్యం ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ నుండి కార్గిల్ వార్ మెమోరియల్, ద్రాస్ వరకు ట్రై-సర్వీసెస్ 'నారీ సశక్తికరణ్ మహిళా మోటార్‌సైకిల్ ర్యాలీ'ని ప్రారంభించింది. 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై 24 ఏళ్ల విజయాన్ని స్మరించుకునేందుకు మరియు మహిళల అలుపెరగని స్ఫూర్తికి గౌరవార్దంగా దీని నిర్వహించింది.

ఈ మోటార్‌సైకిల్ ర్యాలీకి 18 జూలై 23న న్యూ ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ నుండి ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్‌పర్సన్ అర్చన పాండే కూడా పాల్గొన్నారు. 25 మంది సభ్యులతో కూడిన ఈ ట్రై-సర్వీసెస్ టీమ్‌లో ఇద్దరు వీర్ నారీలు కూడా ఉన్నారు.

ఈ బృందం కార్గిల్ యుద్ధంలో భారత సాయుధ దళాల నిర్ణయాత్మక విజయాన్నిసెలెబ్రేట్ చేస్తుంది. జాతి సేవలో అత్యున్నత త్యాగం చేసిన సైనికులకు నివాళులర్పిస్తుంది. ఈ ర్యాలీ మొత్తం 1000 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఈ ప్రయాణం హర్యానా, పంజాబ్ మైదానాలు మరియు జమ్మూ & కాశ్మీర్ మరియు లడఖ్‌లోని ఎత్తైన పర్వత మార్గాల గుండా 25 జూలై 23న ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్‌కు చేరుకుంటుంది.

 సహారా రీఫండ్ పోర్టల్‌ను ప్రారంభించిన అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో సిఆర్‌సిఎస్-సహారా రీఫండ్ పోర్టల్‌ను ప్రారంభించారు. సహారా గ్రూప్‌కు చెందిన 10 కోట్ల మందికి పైగా డిపాజిటర్లు తమ డబ్బును తిరిగి పొందేందుకు ఈ పోర్టల్ సహాయం చేస్తుంది. పోర్టల్‌ను ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, సహారా గ్రూప్‌కు చెందిన నాలుగు సహకార సంఘాలలో చిక్కుకుపోయిన డిపాజిటర్ల సొమ్మును తిరిగి ఇచ్చే ప్రక్రియ సహారా రీఫండ్ పోర్టల్ ప్రారంభంతో ప్రారంభమైందన్నారు.

ప్రారంభ దశలో, రిఫండ్ పోర్టల్ డిపాజిటర్లకు రూ. 5000 కోట్ల వరకు పంపిణీ చేస్తుంది. అయితే, ప్రతి డిపాజిటర్ మొదటి దశలో రూ.10,000 మాత్రమే పొందగలుగుతారు. వాపసు ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లో ఉంటుంది. హోం మంత్రి ప్రకారం, 10,000 రూపాయల వరకు పొందడానికి అర్హులైన డిపాజిటర్లు 4 కోట్ల మంది ఉన్నారు. ఈ చొరవ విజయవంతమైతే, సహారా గ్రూప్ సహకార సంఘాలలో ఎక్కువ డబ్బు చిక్కుకున్న డిపాజిటర్ల క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని అమిత్ షా చెప్పారు.

సహారా రీఫండ్ పోర్టల్‌ అనేది 2014లో ప్రభుత్వం ప్రారంభించిన సెంట్రల్ రీఫండ్ సెల్ స్కీమ్ (సిఆర్‌సిఎస్)లో ఒక భాగం. సిఆర్‌సిఎస్ అనేది పెట్టుబడిదారులు తమ చెల్లింపులపై డిఫాల్ట్ చేసిన కంపెనీల నుండి వాపసులను క్లెయిమ్ చేయడానికి రూపొందించిన ఒక యంత్రాంగం.

యూఏఈలో ఐఐటీ-ఢిల్లీ క్యాంపస్ ఏర్పాటుకు అవగహన ఒప్పందం

అబుదాబిలో ఐఐటీ ఢిల్లీ యొక్క క్యాంపస్‌ను స్థాపించడానికి విద్యా మంత్రిత్వ శాఖ మరియు అబుదాబి విద్యా మరియు నాలెడ్జ్ విభాగం మరియు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ మధ్య ఒక అవగాహన ఒప్పందం సంతకం చేయబడింది. టాంజానియాలో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ తర్వాత విదేశాల్లో రెండో ఐఐటీగా ఇది అవతరించనుంది.

అబుదాబిలోని ఐఐటి ఢిల్లీ క్యాంపస్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు రీసెర్చ్ ప్రోగ్రామ్‌ అందించనుంది. ఈ క్యాంపస్ 2024 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇటీవలే అబుదాబిలో యుఎఇ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్య జరిగిన చర్చల తరువాత ఎంఒయు సంతకం చేయబడింది.

ఢిల్లీ పోలీసులో 19 మంది 'మార్క్స్ ఉమెన్ మహిళా కమాండోలు

ఢిల్లీ పోలీసు విభాగంలో 19 మంది మార్క్స్ ఉమెన్ కమాండోలకు చోటు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ద్వారా గత రెండు నెలలుగా ఈ 19 మంది మహిళా కమాండోలకు 'మార్క్స్ ఉమెన్'గా శిక్షణ ఇచ్చింది . ఈ శిక్షణ పొందిన మహిళలు జీ-20 సమ్మిట్ యొక్క అన్ని ఈవెంట్లలో ఫ్రంట్‌లైన్ సెక్యూరిటీ గార్డు మరియు షార్ప్‌షూటర్‌గా వ్యవహరించనున్నారు.

అర్జెంటీనా రక్షణ మంత్రి 4 రోజుల భారత్ పర్యటన

అర్జెంటీనా రక్షణ మంత్రి జార్జ్ ఎన్రిక్ తయానా నాలుగు రోజుల భారతదేశ పర్యటన నిమిత్తం జులై 17న న్యూ ఢిల్లీ చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం కోసం చర్చించారు. అలానే ఇరువురు నేతలు రక్షణ కొనుగోళ్లు, సైనిక శిక్షణ మరియు ఉమ్మడి వ్యాయామాలతో సహా పలు అంశాలపై చర్చలు జరిపారు.

రక్షణ రంగంలో ఇరు దేశాలు తమ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని చూస్తున్న తరుణంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. భారతదేశం కొత్త ఆయుధాలు మరియు రక్షణ పరికరాలను కొనుగోలు చేయాలని చూస్తుండగా, అర్జెంటీనా తన రక్షణ పారిశ్రామిక స్థావరాన్ని విస్తరించాలని చూస్తోంది. ఈ పర్యటనలో, తయానా సీనియర్ భారత రక్షణ అధికారులతో సమావేశమయ్యారు. అలానే దేశంలోని వివిధ రక్షణ సంస్థలను సందర్శించారు. అనేక రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థలకు నిలయమైన బెంగళూరు నగరాన్ని కూడా ఆయన సందర్శించారు.

భారత్ మరియు అర్జెంటీనా మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఈ పర్యటన మంచి సంకేతం. రెండు దేశాలు ఇప్పటికే రక్షణ రంగంలో అనేక ఒప్పందాలపై సంతకాలు చేసి ఉన్నాయి. ఉమ్మడి వ్యాయామాలు, శిక్షణ మరియు సాంకేతికత బదిలీ వంటి రంగాలలో తమ సహకారాన్ని విస్తరించాలనే ఆలోచనలో ఉన్నాయి.

కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ కన్నుమూశారు

కేరళ మాజీ ముఖ్యమంత్రి మరియు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఊమెన్ చాందీ 79 సంవత్సరాల వయసులో జులై 18న బెంగళూరులోని ఆసుపత్రిలో మరణించారు. చాందీ 2004 నుండి 2006 వరకు మరియు 2011 నుండి 2016 వరకు రెండు పర్యాయాలు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2006 నుండి 2011 వరకు కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు.

కొట్టాయం జిల్లాలోని పుత్తుపల్లి నియోజకవర్గానికి ఊమెన్ చాందీ 50 ఏళ్లకు పైగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన ప్రస్తుతం ఇదే పుత్తుపల్లికి ఎమ్మెల్యేగా ఉన్నారు. 1970లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాందీ తొలిసారిగా పుత్తుపల్లికి ప్రాతినిధ్యం వహించారు. 1977లో కె కరుణాకరన్ కేబినెట్‌లో తొలిసారిగా మంత్రి అయ్యారు.

అరుణాచల్ ప్రదేశ్‌లో చాచిన్ గ్రేజింగ్ ఫెస్టివల్

అరుణాచల్ ప్రదేశ్‌లో చాచిన్ గ్రేజింగ్ ఫెస్టివల్ జులై 14, 15  ఘనంగా జరుపుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని బుమ్లా పాస్ సమీపంలోని తవాంగ్ ప్రాంతంలోని స్థానిక గ్రాజియర్లు ఈ వేడుకను జరుపుకుంటారు. ఇది యాక్స్ మరియు ఇతర పశువులకు మేత సీజన్ ప్రారంభంకు గుర్తుగా జరుపుకుంటారు. బమ్లా కనుమ సమీపంలో ఉన్న చచ్చిన్ మేత మైదానంలో ఈ పండుగ జరుగుతుంది.

ఈ పండుగ రెండు రోజుల నిడివితో జరుగుతుంది. ఇందులో వారి సాంప్రదాయ సంగీతం, నృత్యం మరియు విందు వంటి వివిధ కార్యక్రమాలు భాగంగా ఉంటాయి. యాక్ రెజ్లింగ్ మరియు ఇతర సాంప్రదాయ క్రీడల కోసం పోటీలు కూడా నిర్వహిస్తారు. ఇది మొన్పా ప్రజలు ఒకచోట చేరి వారి సంస్కృతి మరియు సంప్రదాయాలను జరుపుకునే పండుగ. చాచిన్ గ్రేజింగ్ ఫెస్టివల్ అనేది యునెస్కో గుర్తింపు పొందిన మానవాళి యొక్క అసంగతమైన సాంస్కృతిక వారసత్వం. ఇది మొన్పా ప్రజల సాంప్రదాయ జీవన విధానాన్ని ప్రదర్శించే ప్రత్యేకమైన పండుగ.

'భారత్ దాల్' బ్రాండ్ పేరుతొ సబ్సిడీ శనగ పప్పు

కేంద్ర ఆహార మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ 'భారత్ దాల్' బ్రాండ్ పేరుతో సబ్సిడీ చనా పప్పు విక్రయాన్ని ప్రారంభించారు. ఈ సబ్సిడీతో కూడిన శనగ పప్పు కిలో ప్యాక్‌కు రూ.60 చొప్పున, 30 కిలోల ప్యాక్‌కి కిలో రూ.55 చొప్పున విక్రయిస్తున్నారు.

ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (నాఫెడ్) రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా 'భారత్ దాళ్' విక్రయం జరుగుతోంది. ఇది కేంద్రీయ భండార్ మరియు మదర్ డైరీస్ సఫాల్ రిటైల్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటుంది. 'భారత్ దాళ్' బ్రాండ్‌తో విక్రయించడానికి ప్రభుత్వం 50,000 టన్నుల చనా పప్పును కేటాయించింది. దీని వల్ల ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో దాదాపు 20 లక్షల మంది వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా.

దేశంలో సిడిపి జియో ట్యాగింగ్‌లో జమ్మూ & కాశ్మీర్ నంబర్ వన్

దేశంలో క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ల (సిడిపిలు) జియో ట్యాగింగ్‌లో జమ్మూ మరియు కాశ్మీర్ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ జమ్మూ మరియు కాశ్మీర్‌తో సహా దేశంలో అన్ని రాష్ట్రాలలో క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లను అమలు చేస్తోంది. ఈ విజయం ఆ ప్రాంతంలో ప్రాజెక్టులకు వేగవంతమైన ఆమోదం మరియు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులను సకాలంలో విడుదల చేసేలా చేస్తుంది. అలానే ఎంఎస్ఎంఈల వేగవంతమైన వృద్ధికి మార్గం సుగమం చేస్తుంది.

పారా అథ్లెటిక్స్ పురుషుల జావెలిన్ త్రోలో అజీత్ సింగ్‌కు స్వర్ణం

పారిస్‌లో జరుగుతున్న పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల జావెలిన్ త్రో F46 ఫైనల్స్‌లో అజీత్ సింగ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అజిత్ 65.41 త్రో గతంలో 61.89 త్రోతో చైనాకు చెందిన చున్లియాంగ్ గువో పేరిట ఉన్న ఛాంపియన్‌షిప్ రికార్డును బద్దలు కొట్టాడు. భారత దేశానికి చెందిన రింకు 65.38 పాయింట్ల బెస్ట్ త్రోతో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. శ్రీలంక ఆటగాడు దినేష్ ప్రియంత హెరాత్ రింకూతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన సుందర్ సింగ్ గుజ్జర్ 61.81 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు.

Advertisement

Post Comment