Advertisement
Daily Current affairs in Telugu : 20 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్
Telugu Current Affairs

Daily Current affairs in Telugu : 20 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్

Daily Current affairs in Telugu 20 December 2023. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

ఐఎన్ఎస్ శివాజీకి దివంగత వైస్ అడ్మిరల్ వీర చక్ర

దివంగత వైస్ అడ్మిరల్ బెనోయ్ రాయ్‌కి ప్రదానం చేసిన ఒరిజినల్ ' వీర్ చక్ర'ను భారత నావికాదళం యొక్క ప్రధాన శిక్షణా సంస్థ ఐఎన్ఎస్ శివాజీకి అందించబడింది. 1971 భారతదేశం-పాకిస్తాన్ యుద్ధ సమయంలో దివంగత వైస్ అడ్మిరల్ బెనోయ్ రాయ్ చౌదరి తన సాహసోపేతమైన చర్యలకు గాను వీర చక్రను అందుకున్నారు. ఈ వేడుక డిసెంబర్ 18న పూణేకు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలోని లోనావాలాలో జరిగింది.

వీర్ చక్ర అనేది యుద్ధభూమిలో త్రివిధ దళాల సైనికుల శౌర్య చర్యలకు అందించే భారతీయ యుద్ధకాల సైనిక శౌర్య పురస్కారం. భారత నావికాదళానికి చెందిన ఏకైక సాంకేతిక అధికారి బెనోయ్ రాయ్ చౌదరి, ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో బెనోయ్ రాయ్‌  ఐఎన్ఎస్ విక్రాంత్‌లో ఇంజనీర్ ఆఫీసర్‌గా ఉన్నాడు. ఆ సమయంలో విక్రాంత్ బాయిలర్‌లలో వచ్చిన సమస్యలను పరిష్కరించి భారత్ యుద్ధంలో గెలిచేలా సహాయం అందించారు.

ఇస్రోకు ప్రతిష్టాత్మక లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్

భారత అంతరిక్ష సంస్థ తన విజయవంతమైన చంద్రయాన్-3 మిషన్ కోసం ఐస్‌లాండ్‌లోని హుసావిక్‌లోని ఎక్స్‌ప్లోరేషన్ మ్యూజియం ద్వారా 2023 లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్‌ను అందుకుంది. ఈ ప్రతిష్టాత్మక బహుమతిని భారత రాయబారి బాలసుబ్రమణియన్ శ్యామ్ ఇస్రో తరపున స్వీకరించారు. ఆగష్టు 23న, ల్యాండర్ మాడ్యూల్ చంద్రుని దక్షిణ ధృవాన్ని విజయవంతంగా తాకడంతో చంద్రయాన్-3 విజయం చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. ఈ విజయం భారతదేశాన్ని మూన్ ల్యాండింగ్‌ను సాధించిన అమెరికా, చైనా మరియు రష్యాల సరసన నిలిపింది.

లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ అనేది 11వ శతాబ్దనికి చెందిన నార్స్ అన్వేషకుడు లీఫ్ ఎరిక్సన్ పేరున అందించే వార్షిక బహుమతి. ఇది ఐస్‌లాండ్‌లోని హుసావిక్‌లోని ఎక్స్‌ప్లోరేషన్ మ్యూజియం ద్వారా అందించబడుతుంది. ఈ అవార్డు చంద్రుని అన్వేషణ రంగంలో ట్రయిల్‌బ్లేజర్‌లను గౌరవిస్తుంది. లీఫ్ ది లక్కీ అని కూడా పిలువబడే లీఫ్ ఎరిక్సన్, ఉత్తర అమెరికాపై అడుగు పెట్టిన మొదటి యూరోపియన్ అని భావిస్తారు.

దేశ జిడిపిలో 15 శాతానికి తగ్గిన వ్యవసాయం వాటా

భారతదేశపు జిడిపిలో వ్యవసాయం వాటా 1990-91లో 35 శాతం నుండి గత ఆర్థిక సంవత్సరంలో 15 శాతానికి క్షీణించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే భారతదేశంలో పారిశ్రామిక మరియు సేవా రంగాల వేగవంతమైన వృద్ధి కారణంగా ఈ క్షీణత నమోదు అయినట్లు వెల్లడించింది. వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి చెందినప్పటికీ, దాని వృద్ధి ఇతర రంగాలతో సమానంగా లేకపోవడంతో జిడిపిలో దాని వాటా తగ్గినట్లు తెలిపింది. ఈ వివరాలు కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

వృద్ధి పరంగా వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగం గత ఐదేళ్లలో సగటు వార్షిక వృద్ధిని 4 శాతం నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రపంచ అనుభవానికి సంబంధించినంతవరకు, ప్రపంచ జిడిపిలో వ్యవసాయం వాటా దశాబ్దాలుగా క్షిణిస్తూ వస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం, వనరుల వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించడం, సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం మరియు రైతులకు లాభదాయకమైన ధరలను అందించడం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు, సంస్కరణలు మరియు విధానాలను ప్రభుత్వం అవలంబించిందని/అమలు చేస్తుందని మంత్రి చెప్పారు. 2019లో ప్రారంభించిన పీఎం కిసాన్ పథకం ద్వారా ఏడాదికి ఆరు వేలు చెప్పున ఇప్పటి వరకు 11 కోట్ల మందికి పైగా రైతులకు, 2.81 లక్షల కోట్ల రూపాయలకు పైగా సహాయం అందించినట్లు తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌లో 57 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ప్రారంభం

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెరుగుతున్న సైబర్ నేరాల కేసుల దృష్ట్యా 57 జిల్లాల్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఘజియాబాద్, రాయ్‌బరేలి, సీతాపూర్, హర్దోయ్, కాన్పూర్ దేహత్, ఇటావా, బాగ్‌పత్, బారాబంకి, మెయిన్‌పురి మరియు రాంపూర్‌లతో సహా రాష్ట్రంలోని 57 జిల్లాల్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు యోగి ఆదిత్యంత్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు రాష్ట్ర ఖజానా నుండి రూ.125 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

యూపీలో సైబర్ నేరాల కేసులు పెరుగుతున్నందున, రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాల్లో ప్రత్యేక పోలీసు స్టేషన్లు అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. 18 డివిజనల్ హెడ్‌క్వార్టర్స్‌లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఇప్పటికే పనిచేస్తుండగా, మిగిలిన 57 జిల్లాల్లో కూడా అలాంటి స్టేషన్లను ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

సైబర్ క్రైమ్ కేసుల్లో నేరారోపణల విషయంలో ఉత్తరప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా ఉంది. సైబర్ క్రైమ్ కేసుల్లో జాతీయ నేరారోపణ రేటు 46.5 శాతం కాగా, యూపీలో నేరారోపణ రేటు 87.8 శాతంగా ఉంది. 2022లో ఉత్తరప్రదేశ్‌లో 10,117 సైబర్‌క్రైమ్ కేసులు నమోదయ్యాయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

గ్లోబల్ రెమిటెన్స్ చార్ట్‌లలో భారతదేశంకు అగ్రస్థానం

2023 ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ప్రపంచంలోని రెమిటెన్స్ గ్రహీత దేశాల జాబితాలో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. వివిధ దేశాల్లో నివసిస్తున్న భారతీయులు పంపిన మొత్తం $125 బిలియన్లతో భారత్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయం భారతీయ ప్రవాసులు తమ కుటుంబాలకు మద్దతు ఇవ్వడంతో పాటుగా భారతదేశం యొక్క ఆర్థిక స్థితిస్థాపకతకు తోడ్పడటంలో వారి కీలక పాత్రను గుర్తు చేస్తుంది. 2022తో పోలిస్తే, ఈ ఏడాది భారతదేశం యొక్క రెమిటెన్స్ ఇన్‌ఫ్లోలు 7. 2% పెరిగాయి.

  1. భారతదేశం $125 బిలియన్లు
  2. మెక్సికో $67 బిలియన్లు
  3. చైనా $50 బిలియన్లు
  4. ఫిలిప్పీన్స్ $40 బిలియన్లు
  5. ఈజిప్ట్ $24 బిలియన్లు

రెమిటెన్స్ అనేది ఒక విదేశీ కార్మికుడు, ప్రవాస సంఘం సభ్యుడు లేదా విదేశాలలో కుటుంబ సంబంధాలు ఉన్న పౌరుడు, వారి స్వదేశంలో ఉన్న కుటుంబం కోసం లేదా స్వదేశంలో గృహ ఆదాయం కోసం వాణిజ్య రహితంగా డబ్బును బదిలీ ఒక ప్రక్రియ. ఇది అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు కీలకమైన ఆదాయ వనరు.పేదరికం తగ్గింపు మరియు ఆర్థిక అభివృద్ధిలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

రెమిటెన్స్‌లను పంపేవారిలో 1983 నుండి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ స్టేట్స్ అగ్రగామిగా ఉంది. రష్యా , సౌదీ అరేబియా మరియు స్విట్జర్లాండ్ దేశాలు తర్వాతి స్థానంలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం 9 మిలియన్ల నుండి 11 మిలియన్ల మంది కార్మికులు రష్యా నుండి రెమిటెన్స్‌లను పంపుతున్నారు.

కేంద్ర వస్తు సేవల పన్ను 2వ సవరణ బిల్లు ఆమోదం

సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ( రెండవ సవరణ ) బిల్లు 2023 పార్లమెంటులో ఆమోదం పొందిం. కేంద్ర ప్రభుత్వం అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయడానికి అనుమతించే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (సిజీఎస్టీ) చట్టం 2017ని సవరించడానికి ఈ బిల్లులో కొత్త నిబంధనలు చేర్చింది.

ఇందులో ప్రధానంగా ట్రిబ్యునల్ అధ్యక్షుడి వయోపరిమితిని 67 నుంచి 70 ఏళ్లకు పెంచడంతో పాటుగా, సభ్యుల వయోపరిమితిని 65 నుంచి 67 ఏళ్లకు పెంచే నిబంధనలు ఈ బిల్లులో పొందుపర్చారు. అలానే కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉన్న న్యాయవాదులను న్యాయ సభ్యులుగా నియమించేందుకు కూడా ఈ బిల్లు అనుమతిస్తుంది.

ఈ బిల్లు, గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్స్‌ను అమలు చేయడం కోసం పరిపాలనా ప్రక్రియను ప్రారంభించడానికి సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ యాక్ట్, 2017 మరియు ట్రిబ్యునల్ రిఫార్మ్స్ యాక్ట్, 2021లోని వివిధ నిబంధనలను సమలేఖనం చేయడానికి తీసుకురాబడింది.

జీఎస్టీ విధానాల అమలులో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారం కోసం 2019లో కేంద్ర ప్రభుత్వం ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (GSTAT) జాతీయ బెంచ్ ఏర్పాటు చేసింది. ఢిల్లీలో ఉన్న ఈ జాతీయ బ్రాంచుకు గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ యొక్క అధ్యక్షుడు అధ్యక్షత వహిస్తాడు. ఇందులో కేంద్ర మరియు రాష్ట్రాల నుండి సభ్యులు నియమించబడతారు.

వస్తువులు మరియు సేవల పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ అనేది జీఎస్టీ చట్టాలలో రెండవ అప్పీల్ యొక్క ఫోరమ్. ఇది కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య వివాద పరిష్కారానికి మొదటి ఉమ్మడి వేదిక. ఇది జీఎస్టీ కింద ఉత్పన్నమయ్యే వివాదాల పరిష్కారంలో ఏకరూపత ఉండేలా చేస్తుంది. సిజీఎస్టీ చట్టం యొక్క XVIII అధ్యాయంలో జీఎస్టీ విధానంలో వివాద పరిష్కారం కోసం పూర్తిస్థాయి అప్పీల్ మరియు రివ్యూ మెకానిజం పోందుపర్చింది.

Post Comment