Advertisement
Daily Current affairs in Telugu : 21 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్
Telugu Current Affairs

Daily Current affairs in Telugu : 21 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్

Daily Current affairs in Telugu 21 December 2023. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డులు

ఇంధన పొదుపు ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించడంతో పాటుగా ఇంధన సామర్థ్యం మరియు పరిరక్షణలో దేశం సాధించిన విజయాలను గుర్తించడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 14న జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం రోజున నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డులు అందించబడతాయి.

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ద్రౌపది ముర్ము 2023 విజేతలను సత్కరించారు. ఈ అవార్డులను బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) మరియు విద్యుత్ మంత్రిత్వ శాఖ అందిస్తున్నాయి. నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ 2023 కింద 20 ప్రథమ బహుమతులు, 16 ద్వితీయ బహుమతులు మరియు 27 మెరిట్ సర్టిఫికేట్‌లతో కూడిన మొత్తం 63 బహుమతులు అందించబడ్డాయి.

  • భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రికల్ కంజ్యూమర్ కంపెనీలలో ఒకటైన క్రాంప్టన్ గ్రీవ్స్ కంజ్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ 2023 అందుకుంది. ఈ అవార్డు కంపెనీ యొక్క స్టోరేజీ వాటర్ హీటర్ కోసం మోస్ట్ ఎనర్జీ ఎఫిషియెంట్ అప్లయన్స్ ఆఫ్ ది ఇయర్ 2023 విభాగంలో అందుకుంది. ఇదే విభాగంలో వర్ల్‌పూల్ రిఫ్రిజిరేటర్, శామ్‌సంగ్ వాషింగ్ మిషన్ కూడా ఈ అవార్డు అందుకున్నాయి.
  • రైల్వే స్టేషన్ల విభాగంలో ఇంధన సంరక్షణ చర్యలకు గాను దక్షిణ మధ్య రైల్వే మొదటి మరియు రెండవ బహుమతిని అందుకుంది. కాచిగూడ స్టేషన్‌కు ప్రథమ బహుమతి లభించింది. రెండో బహుమతి గుంతకల్ రైల్వే స్టేషన్‌కు లభించింది. కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్, రాజమండ్రి రైల్వే స్టేషన్, తెనాలి రైల్వే స్టేషన్ లకు మెరిట్ సర్టిఫికేట్ లభించింది.
  • భవనాల కేటగిరీ కింద నార్త్ వెస్ట్రన్ రైల్వేకు చెందిన అజ్మీర్ వర్క్‌షాప్‌కు మొదటి బహుమతి లభించింది. రైల్వే హాస్పిటల్ గుంతకల్, ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్, విజయవాడ మరియు డివిజనల్ రైల్వే హాస్పిటల్, ప్రతాప్‌నగర్ లకు మెరిట్ సర్టిఫికేట్ లభించింది.
  • నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డులలో స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీ (ఎస్డిఏ గ్రూప్-1) విభాగంలో కర్ణాటక మొదటి బహుమతిని గెలుచుకోగా, ఎస్డిఏ గ్రూప్-2 లో ఆంధ్రప్రదేశ్, ఎస్డిఏ గ్రూప్-3లో అస్సాం, ఎస్డిఏ గ్రూప్-4లో చండీఘర్ మొదటి బహుమతి దక్కించుకున్నాయి.
  • భవనాల కేటగిరీ కింద ముంబైలోని రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సర్టిఫికెట్ మెరిట్ అందుకుంది.
  • అలానే పరిశ్రమల విభాగంలో పెట్రోలియం రిఫైనరీలకు సంబంధించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, రైల్వే వర్క్‌షాప్‌లకు సంబంధించి విజయవాడ సెంట్రల్ రైల్వే, థర్మల్ పవర్ స్టేషన్ సంబంధించి అల్ట్రాటెక్ నాథద్వారా సిమెంట్ లిమిటెడ్ ఈ అవార్డు అందుకున్నాయి. పూర్తి అవార్డుల జాబితా

ఈ వేదిక ద్వారా 2021 నుండి అందిస్తున్న నేషనల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇన్నోవేషన్ అవార్డ్స్ కూడా ఇవ్వబడ్డాయి. పరిశ్రమల విభాగంలో టాటా స్టీల్ లిమిటెడ్, రవాణా విభాగంలో లోహమ్ క్లీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్, బిల్డింగ్ విభాగంలో యాంట్ స్టూడియోలు సంబంధిత విభాగంలో మొదటి బహుమతులు అందుకున్నాయి.

ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్, 2001 లోని నిబంధనల ప్రకారం మార్చి 1, 2002న బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశంలో శక్తి వాడకాన్ని తగ్గించే ప్రాథమిక లక్ష్యంతో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఏర్పాటు చేసారు. ఇది ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్, 2001 యొక్క అమలును పర్యవేక్షించడంతో పాటుగా దాని నిబంధనలు అమలు అయ్యేలా పనిచేస్తుంది.

సాహిత్య అకాడమీ విజేతలు 2023

సాహిత్య అకాడమీ ఇటీవల తన వార్షిక సాహిత్య అకాడమీ అవార్డులను 24 భాషల్లో ప్రకటించింది. ఈ ఏడాది తొమ్మిది కవితా పుస్తకాలు, ఆరు నవలలు, ఐదు కథా సంకలనాలు, మూడు వ్యాసాలు, ఒక సాహిత్య అధ్యయనంకు సాహిత్య అకాడమీ అవార్డులు అందించారు. సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్ బోర్డు వీటిని ఎంపిక చేసింది. ఈ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 12, 2024న న్యూ ఢిల్లీలోని కోపర్నికస్ మార్గ్‌లోని కమనీ ఆడిటోరియంలో జరగనుంది.

కవిత్వం

  • విజయ్ వర్మ (డోగ్రీ)
  • వినోద్ జోషి (గుజరాతీ)
  • మన్షూర్ బనిహాలి (కాశ్మీరి)
  • సోరోఖైబం గంభీని (మణిపురి)
  • అశుతోష్ పరిదా (ఒడియా)
  • స్వర్ణజిత్ సవి (పంజాబీ)
  • గజే సింగ్ రాజ్‌పురోహిత్ (రాజస్థానీ)
  • అరుణ్ రంజన్ మిశ్రా (సంస్కృతం)

నవల

  • స్వప్నమయ్ చక్రబర్తి (బెంగాలీ)
  • నీలం సరన్ గౌర్ (ఇంగ్లీష్)
  • సంజీవ్ (హిందీ)
  • కృష్ణత్ ఖోట్ (మరాఠీ)
  • రాజశేఖరన్ (దేవిభారతి) (తమిళం)
  • సాదిక్వా నవాబ్ సాహెర్ (ఉర్దూ)

చిన్న కథలు

  • ప్రణవ్జ్యోతి దేకా (అస్సామీ)
  • నందీశ్వర్ దైమారి (బోడో)
  • ప్రకాష్ ఎస్. పరియంకర్ (కొంకణి)
  • తారాసీన్ బాస్కీ (తురియా చంద్ బాస్కీ) (సంతాలి)
  • టి. పతంజలి శాస్త్రి (తెలుగు)

వ్యాసాలు

  • లక్ష్మీషా తోల్పాడి (కన్నడ)
  • బసుకినాథ్ ఝా (మైథిలి)
  • జుధాబీర్ రాణా (నేపాలీ)

సాహిత్య అధ్యయనం

  • ఈవీ రామకృష్ణన్ (మలయాళం)

ఆయా భాషల్లో ముగ్గురు సభ్యుల జ్యూరీలు చేసిన సిఫార్సుల ఆధారంగా ఈ ముఖ్యమైన రచనలు ఎంపిక చేయబడ్డాయి. ఎగ్జిక్యూటివ్ బోర్డు ఏకగ్రీవ ఎంపికలు లేదా మెజారిటీ ఓట్ల ఆధారంగా ఈ అవార్డులను ప్రకటించింది. ఎంపిక అయిన రచనలు జనవరి 1, 2017 మరియు డిసెంబర్ 31, 2021 మధ్య ప్రచురించబడినవి. అవార్డు గ్రహీతకు లక్ష రూపాయల నగదు బహుమతి మరియు పురస్కారం అందజేస్తారు.

ఎన్నికల కమిషనర్ల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

అత్యంత వివాదాస్పదమైన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సర్వీస్ షరతులు మరియు పదవీకాలం) బిల్లు 2023, ప్రతిపక్షాలు వాకౌట్ మధ్య పార్లమెంటులో ఆమోదించబడింది. ఈ బిల్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)లోని ముగ్గురు సభ్యుల నియామకానికి సంబంధించిన విధానాలను అందిస్తుంది.

ఈ బిల్లు ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు మరియు భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్యానెల్ ఎన్నికల కమిషన్‌ను ఎంపిక చేయాలనే సుప్రీంకోర్టు ఆదేశాను నేరుగా విభేదిస్తుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే సుప్రీంకోర్టు ఆదేశాలను రద్దు చేసినట్టే అవుతుంది. ఈ ఏడాది మార్చిలో, జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం, ఎన్నికల కమిషనర్లను ఎంపికను ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు మరియు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ  చేస్తుందని తీర్పు ఇచ్చింది. ఎన్నికల కమిషనర్ల స్వతంత్ర ప్రతిపత్తిని నిర్ధారించేందుకు సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది.

అయితే, ఈ ఎంపిక ప్రక్రియ నుండి సుప్రీంకోర్టును దూరంగా ఉంచే ప్రయత్నంలో భాగంగా ఈ కొత్త బిల్లు రూపొందించబడింది. ఇది భారత ప్రధాన న్యాయమూర్తిని ఎంపిక కమిటీ నుండి తొలగించింది. ఈ బిల్లు సీఈసీ & ఈసీల హోదాను సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా ఉంచేందుకు అవకాశం కల్పిస్తుంది. ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ కొత్త చట్టంలో, ప్రధానమంత్రి నామినేట్ చేసిన మంత్రి ద్వారా ఎంపికైన సభ్యుడు సీజేఐ స్థానంలో ఉంటారు. న్యాయ మంత్రి నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ఈ ఎంపిక కమిటీని ఏర్పాటు చేస్తుంది.

ఈ కొత్త బిల్లు ప్రకారం, న్యాయస్థానాలు ప్రస్తుత లేదా మాజీ-సీఈసీ లేదా ఈసీకి వ్యతిరేకంగా చేసిన చర్యలు లేదా అధికారిక విధి లేదా విధి నిర్వహణలో మాట్లాడే పదాలకు వ్యతిరేకంగా సివిల్ లేదా క్రిమినల్ ప్రొసీడింగ్‌లను నిర్వహించడంను నిషేదీస్తుంది. ఈ వివాదాస్పదమైన బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద ఉంది. ఇది ఆమోదం పొందితే, తర్వాత సుప్రీం కోర్టు ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి కొలీజియం తరహా వ్యవస్థను కోరుతూ దాఖలైన పిటిషన్లను ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు విచారించింది. దేశంలోని కీలక ఎన్నికల అధికారుల నియామకం కోసం ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నేతతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుత లోక్‌సభను దృష్టిలో ఉంచుకుని, ప్రతిపక్ష నాయకుడు లేకుంటే , ప్యానెల్‌లో ఏకైక అతిపెద్ద ప్రతిపక్ష నాయకుడిని చేర్చాలని సుప్రీం కోర్టు నాడు పేర్కొంది.

ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు 2023

ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ , 1867ని రద్దు చేస్తూ ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు, 2023 ని లోక్ సభ డిసెంబర్ 21న ఆమోదించింది. ఈ బిల్లును ఇప్పటికే వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ ఆమోదించింది. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు, 2023 ఎలాంటి భౌతిక ఇంటర్‌ఫేస్ అవసరం లేకుండా ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా పీరియాడికల్స్ టైటిల్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళంగా మరియు ఏకకాలంలో పూర్తిచేసే అవకాశం కల్పిస్తుంది.

ప్రచురణకర్తలు, ప్రత్యేకించి చిన్న మరియు మధ్యస్థ పబ్లిషర్లు, ప్రచురణను ప్రారంభించడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇది తొలగిస్తుంది. మరీ ముఖ్యంగా, ప్రచురణకర్తలు ఇకపై జిల్లా మేజిస్ట్రేట్‌లు లేదా స్థానిక అధికారుల వద్ద డిక్లరేషన్‌ను ఫైల్ చేయాల్సిన అవసరం ఉండదు. పబ్లిషర్లు తమ పీరియాడికల్‌లను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు, దీని వలన అవసరమైన సమయం మరియు శ్రమ గణనీయంగా తగ్గుతుంది.

కొత్త బిల్లు టైటిల్ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేయడానికి మరియు ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మంజూరు చేయడానికి ఒక సాధారణ ఆన్‌లైన్ మెకానిజంను అందిస్తుంది. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ 1867లో భాగమైన పుస్తకాలు పిఆర్పి బిల్లు 2023 పరిధిలోకి చేర్చబడలేదు, ఈ పుస్తకాలు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడతాయి.

ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతితో మరియు ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్‌తో నమోదు చేసుకోవడంతో విదేశీ పత్రిక యొక్క ఫాక్సిమైల్ ఎడిషన్‌ను కూడా భారతదేశంలో ముద్రించేందుకు అనుమతిని ఇస్తుంది. అలానే ఉగ్రవాద కార్యక్రమాలు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడే లేదా పాల్పడిన వ్యక్తులు పత్రికను పబ్లిష్ చేసేందుకు ఇది అనుమతించదు.

టెలి కమ్యూనికేషన్స్ బిల్లు 2023

1885 నాటి ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, 1933 నాటి వైర్‌లెస్ టెలిగ్రాఫీ చట్టం మరియు 1950 నాటి టెలిగ్రాఫ్ వైర్లు (చట్టవిరుద్ధమైన స్వాధీనం) చట్టం వంటి వివిధ భారతీయ టెలికాం చట్టాలని సంస్కరించడానికి భారత పార్లమెంటు టెలి కమ్యూనికేషన్స్ బిల్లు, 2023ని ఆమోదించింది. బిల్లు స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం నియమాలను రూపొందించడంతో పాటుగా ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సేవలకు వాయు తరంగాలను అందించడానికి వేలం రహిత మార్గాన్ని అందిస్తుంది.

ఈ బిల్లు ఫోన్ నంబర్ స్పూఫింగ్, సిమ్ దుర్వినియోగం వంటి మోసాలను నిరోదించడంతో పాటుగా మోసగాళ్లకు కఠిన శిక్షలను ప్రతిపాదిస్తుంది. అలానే టెలికం వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడానికి "డిజిటల్-బై-డిజైన్" ఆన్‌లైన్ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్నికూడా అందుబాటులోకి తెస్తుంది.

  • టెలి కమ్యూనికేషన్స్ బిల్లు 2023 ఫోన్ నంబర్ స్పూఫింగ్, సిమ్ దుర్వినియోగం వంటి మోసాలకు పాల్పడే వారికీ మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 50 లక్షల జరిమానా విధిస్తుంది.
  • కొత్త బిల్లు ప్రకారం కంపెనీలు అడ్వర్టైజింగ్ మెసేజ్‌ల వంటి నిర్దిష్ట సందేశాలను స్వీకరించడానికి చందాదారుల నుండి ముందస్తు అనుమతిని పొందడం తప్పనిసరి చేసింది.
  • టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు నూతన సబ్‌స్క్రైబర్‌ల గుర్తింపును ఏదైనా ధృవీకరించదగిన బయోమెట్రిక్ ఆధారిత గుర్తింపు (ఆధార్ కార్డ్‌తో లింక్ చేయబడింది) ద్వారా మాత్రమే ధృవీకరించాలి. ఇది నకిలీ ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉపయోగించి నేరస్థులు సిమ్ కార్డు పొందే ప్రక్రియను నిషేధిస్తుంది.
  • ఒక వ్యక్తి తొమ్మిది కంటే ఎక్కువ సిమ్‌లను కలిగి ఉంటే (ఆధార్ కార్డ్‌కు), మొదటి నేరానికి రూ. 50,000 మరియు తదుపరి ప్రతి నేరానికి రెండు లక్షల రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది.
  • కేంద్ర ప్రభుత్వం టెలికమ్యూనికేషన్ కంపెనీలకు వేలం ద్వారా మాత్రమే స్పెక్ట్రమ్‌ను కేటాయించాల్సి ఉంటుంది.
  • అధీకృతం లేకుండా టెలికాం సేవలను అందించడం లేదా టెలికాం నెట్‌వర్క్ లేదా డేటాకు అనధికారిక యాక్సెస్‌ను పొందడం వంటి నేరాలకు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, రెండు కోట్ల వరకు జరిమానా లేదా రెండూ విధిస్తుంది.
  • దేశ భద్రత దృష్ట్యా, టెలికాం కంపెనీలు ప్రభుత్వం గుర్తించిన 'విశ్వసనీయ వనరుల' పరికరాలను మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
  • ట్రాయ్ ఛైర్మన్ నియామకానికి, అభ్యర్థికి కనీసం 30 సంవత్సరాల వృత్తిపరమైన అనుభవం ఉండాలి మరియు సభ్యులుగా పనిచేయడానికి కనీసం 25 సంవత్సరాల వృత్తిపరమైన అనుభవం కలిగి ఉండాలి.
  • ఈ బిల్లు పబ్లిక్ ఎమర్జెన్సీ మరియు పబ్లిక్ ఆర్డర్‌కు వర్తించే నిబంధనల ప్రకారం న్యూస్ ప్రచారాలను అడ్డుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇస్తుంది. అయితే సాధారణ సమయాల్లో గుర్తింపు పొందిన కరస్పాండెంట్ల ప్రెస్ సందేశాలు అడ్డుకోవడం లేదా నిర్బంచేందుకు కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు నీరాకరిస్తుంది.

Post Comment