తెలుగులో కరెంట్ అఫైర్స్ 15 మే 2023 ఉచితంగా పొందండి. యూపీఎస్‌సీ, ఎస్ఎస్‌సీ, ఏపీపీఎస్‌సీ, టీఎస్‌పీఎస్‌సీ, రైల్వే, బ్యాంకింగ్, డిఫెన్స్, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ వంటి వివిధ నియామక పరీక్షలకు సిద్దమౌతున్న ఔత్సాహికుల కోసం ప్రత్యేకంగా పోటీ పరీక్షల దృక్కోణంలో అందిస్తున్నాం.
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం
కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య మే 20న ప్రమాణస్వీకారం చేసారు. మరో సీనియర్ నాయకుడైన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ప్రబాధ్యతలుస్వీకరించారు. సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండవసారి. గతంలో 2013 నుండి 2018 వరకు పూర్తి ఐదేళ్ల కాలానికి ఆయన సీఎంగా ఉన్నారు.
ఇటీవలే జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి మెజారిటీ సాధించడంతో కాంగ్రెస్ పార్టీ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మే 10వ తేదీన 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా, మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో కాంగ్రెస్ 135 స్థానాలను, భారతీయ జనతా పార్టీ 66 స్థానాలను దక్కించుకున్నాయి. దీనితో దక్షిణ భారత దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కూడా చేజారిపోయింది.
ప్యూమా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా కె బాలగోపాలన్
ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ మరియు యాక్సెసరీస్ బ్రాండ్ అయినా ప్యూమా ఇండియా యొక్క నూతన మేనేజింగ్ డైరెక్టర్‌గా కార్తీక్ బాలగోపాలన్ నియమితులయ్యారు. గత 17 ఏళ్లుగా ప్యూమా ఇండియా యొక్క మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న అభిషేక్ గంగూలీ స్థానంలో వచ్చే ఆగష్టు నుండి కార్తీక్ బాలగోపాలన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
6 ఏళ్లలోపు పిల్లల కోసం పోషన్ భీ, పధాయి భీ ప్రోగ్రాం ప్రారంభం
ఆరు ఏళ్లలోపు పిల్లలకు నాణ్యమైన పోషకాహారంతో పాటు, ప్రాధమిక నైపుణ్య విద్యను అందించేందుకు "పోషణ్ భీ, పధాయి భీ” అనే నూతన కార్యక్రమాన్ని కేంద్రప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. 10 మే 2023 న ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ బలోపేతం చేయడంపై ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో, కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సక్షం అంగన్‌వాడీ మరియు పోషణ్ 2.0 ప్రోగ్రామ్ కింద ఈ ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్యా కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న 1.3 మిలియన్లకు పైగా అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రత్యేక టీచింగ్ శిక్షణను అందించి, ప్లే స్కూల్ ఆధారిత విద్యా విధానాన్ని పిల్లలకు అందించనున్నారు.
ప్రొఫెసర్ జయంత్ విష్ణు నార్లికర్‌కు గోవింద్ స్వరూప్ అవార్డు
ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ జయంత్ విష్ణు నార్లికర్ భారతదేశపు తొలి ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క గోవింద్ స్వరూప్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఐఐటీ ఇండోర్‌లో జరిగిన ఏఎస్ఐ యొక్క 41వ సమావేశంలో ఈ అవార్డును ప్రకటించినప్పటికీ, ప్రొఫెసర్ నార్లికర్ ఆరోగ్య కారణాలతో ఈ అవార్డును అందుకోలేపోయాయరు. ప్రస్తుత ఏఎస్ఐ అధ్యక్షుడు, ప్రొఫెసర్ దీపాంకర్ బెనర్జీ, వ్యక్తిగతంగా ఈ అవార్డును అందజేసి సత్కరించారు.
ప్రొఫెసర్ జయంత్ విష్ణు నార్లికర్, భారతీయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్తగా, ఇంటర్-యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ (IUCAA) వ్యవస్థాపకుడిగా ప్రసిద్ధి. ఈయన సర్ ఫ్రెడ్ హోయల్‌తో కలిసి హోయల్-నార్లికర్ సిద్ధాంతంగా పిలువబడే కన్ఫార్మల్ గ్రావిటీ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశాడు. ఈయన గతంలో ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క అధ్యక్షుడుగా కూడా పనిచేశారు.
నార్లికర్ భారత ప్రభుత్వం నుండి పద్మ విభూషణ్ , పద్మ భూషణ్ అవార్డులతో పాటుగా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి స్మిత్ అవార్డు మరియు ఆడమ్స్ ప్రైజ్ కూడా అందుకున్నారు. వీటితో పాటుగా ప్రఖ్యాత సైన్స్ అవార్డు అయినా కళింగ బహుమతి, ప్రిక్స్ జూల్స్ జాన్సెన్ మరియు మహారాష్ట్ర భూషణ్ వంటి అవార్డులు కూడా అయన ఖాతాలో ఉన్నాయి.
కంబోడియాను సందర్శించిన ఐఎన్ఎస్ ఢిల్లీ & సాత్పురా
ఆసియాన్ దేశాలకు భారత నౌకాదళ విస్తరణలో భాగంగా, భారతీయ నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ ఢిల్లీ & ఐఎన్ఎస్ సాత్పురాలు కంబోడియాలోని సిహనౌక్‌విల్లే పోర్టును సందర్శించాయి. మే 11 నుండి 14 జరిగిన ఈ పోర్ట్ కాల్ రియర్ అడ్మిరల్ గుర్చరణ్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సంధర్బంగా రెండు నౌకాదళాల సిబ్బంది వివిధ ప్రొఫెషనల్ ఇంటరాక్షన్‌లు, డెక్ విజిట్‌లు మరియు స్పోర్ట్స్ ఎక్స్ఛేంజీలలో పాల్గొన్నారు. ఈ సందర్శన ఇరుదేశాల నౌకాదళాల మధ్య సహకారాన్ని, స్నేహాన్ని పెంపొందించనుంది.
ఆసియాన్ (ASEAN) అనేది పది ఆగ్నేయాసియా దేశాలకు చెందిన అంతర్ ప్రభుత్వ సంస్థ. ఇందులో బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్ మరియు వియాత్నం సభ్యదేశాలుగా ఉన్నాయి. దీనిని 1967 బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం జకార్తాలో ఉంది.
సోషలిస్ట్ పండిట్ రామ్‌కిషన్‌కి "మ్యాన్ ఆఫ్ ది సెంచరీ" బిరుదు
ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు పండిట్ రామ్‌కిషన్‌కు "శతాబ్ది పురుష్" బిరుదును ప్రదానం చేశారు. సోషలిస్టు నాయకుడిగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని కల్పించారు. భారతీయ సోషలిస్టు సిద్ధాంతకర్త మరియు ప్రముఖ పార్లమెంటేరియన్ మధు లిమాయే జయంతి వేడుకలను పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో దీనిని ప్రధానం చేశారు.
97 ఏళ్ళ రామ్‌కిషన్ దేశంలోని అత్యంత సీనియర్-మోస్ట్ సోషలిస్ట్ నాయకుడుగా ఉన్నారు. ఈయన ప్రముఖ సోషలిస్టు నాయకులు జయప్రకాష్ నారాయణ్ మరియు లోహియా ప్రారంభించిన అనేక ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో సహా అనేక సార్లు కటకటాల వెనక్కి వెళ్ళారు. రామ్‌కిషన్ 1977లో ఒకసారి లోక్‌సభకు, మరో నాలుగుసార్లు రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ , సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఐఎన్‌ఎల్‌డీ నేత అభయ్ సింగ్ చౌతాలా, జేడీయూ నేత కేసీ త్యాగి సహా సీనియర్ రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
మేడ్ ఇన్ ఇండియా : 75 ఇయర్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ఎంటర్‌ప్రైజ్ బుక్ విడుదల
నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ రచించిన 'మేడ్ ఇన్ ఇండియా : 75 ఇయర్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ఎంటర్‌ప్రైజ్' బుక్ మార్కెట్లోకి విడుదల అయ్యింది. ఈ పుస్తకం భారత సంవృత మరియు సాంప్రదాయిక ఆర్థిక వ్యవస్థ నుండి అభివృద్ధి చెందుతున్న ఆవిష్కరణ మరియు సాంకేతిక ప్రతిభ మరియు నైపుణ్యం యొక్క 75 సంవత్సరాల భారతదేశ ప్రయాణాన్ని వివరిస్తుంది.
అమితాబ్ కాంత్ మేడ్ ఇన్ ఇండియా పుస్తకం సునీల్ భారతి మిట్టల్ మరియు రాహుల్ భాటియా వంటి వ్యాపారవేత్తల స్ఫూర్తిదాయకమైన కథలతో జీవం పోసుకుంది. ఈ పుస్తకం దేశం యొక్క వ్యాపార వారసత్వం మరియు సంస్కృతిపై బహుముఖ పరిశోధన నివేదికను అందిస్తుంది. ఈ పుస్తకం రూపా & కో ద్వారా ప్రచురితం అయ్యింది.
ట్రిపుల్ జంప్ జాతీయ రికార్డును బద్దలు కొట్టిన ప్రవీణ్ చిత్రవేల్
క్యూబాలోని హవానాలో జరిగిన అథ్లెటిక్స్ మీట్ యొక్క పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో భారత అథ్లెట్ ప్రవీణ్ చిత్రవేల్ 17.37 మీటర్ల రికార్డు మార్క్‌తో బంగారు పతాకాన్ని కైవసం చేసుకున్నాడు. దీనితో పాటుగా 2016లో బెంగళూరులో జరిగిన మూడో ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో రెంజిత్ మహేశ్వరి నమోదు చేసిన 17.30 మీటర్ల పురుషుల ట్రిపుల్ జంప్ జాతీయ రికార్డును అధిగమించాడు.
భారత వైమానిక దళంలో మొదటి బ్యాచ్ స్వదేశీ వీటీఓఎల్ లాటరింగ్ ఆయుధాలు
భారత వైమానిక దళంలో మొదటి బ్యాచ్ స్వదేశీ వర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ (వీటీఓఎల్) లాటరింగ్ ఆయుధాలు చేరాయి. ఈ కొత్త ఆయుధాలు అన్ని రకాల భూభాగాలు మరియు ఎత్తైన ప్రాంతాల నుండి పనిచేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇవి సిబ్బందిని ఎటువంటి ప్రమాదానికి గురిచేయకుండా 50 కి.మీ కంటే ఎక్కువ పరిధిలో లక్ష్యాలను ఛేదించగలవు.
వీటిని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్‌ఎల్) అభివృద్ధి చేసింది. ఇవి పూర్తి స్వయంప్రతిపత్తి, సెమీ అటానమస్, లొయిటర్, ఎటాక్ మరియు రిటర్న్ హోమ్. సిస్టమ్ వర్టికల్ టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంటే ఇది టేకాఫ్ మరియు క్వాడ్‌కాప్టర్ లాగా ల్యాండ్ అవుతుంది. ఇది తూర్పు లడఖ్ మరియు అరుణాచల్‌లోని ఇరుకైన లోయల వంటి ఇరుకైన ప్రాంతాల నుండి సిస్టమ్‌ను ఆపరేట్ చేయడానికి ఉపయోగపడనున్నాయి.
వెయిట్ లిఫ్టింగ్ 55 కేజీల విభాగంలో బింద్యారాణి దేవికి రజతం
దక్షిణ కొరియాలోని జింజులో జరిగిన ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 55 కేజీల విభాగంలో భారత క్రీడాకారిణి బింద్యారాణి దేవి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఈపోటీలో సోరోఖైబామ్ బింద్యారాణి దేవి ఏకంగా 194 కిలోలబరువును ఎత్తి రెండవ స్థానంలో నిలవగా, చైనాకు చెందిన చెన్ గువాన్ లింగ్ ఏకంగా 204 కిలోల బరువును ఎత్తి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
ఇదిలా ఉంటే 67 కేజీల విభాగంలో కామన్‌వెల్త్ గేమ్స్ ఛాంపియన్ జెరెమీ లాల్‌రిన్నుంగా కూడా రజత పథకం సొంతం చేసుకున్నారు. ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్ 2023. 2024లో పారిస్ నగరంలో ఒలింపిక్ క్రీడలకు సంబంధించిన క్వాలిఫైయింగ్ ఈవెంట్‌ల సిరీస్‌లో రెండవది.
36 ఏళ్ల సర్వీసు తర్వాత ఐఎన్‌ఎస్ మగర్‌కు డికమిషన్
భారత నావికాదళానికి చెందిన అత్యంత పురాతనమైన ల్యాండింగ్ షిప్ ఐఎన్ఎస్ మగర్ 36 ఏళ్లపాటు దేశానికి ప్రతిష్టాత్మకమైన సేవలందించిన తర్వాత సర్వీస్ నుండి తొలగించబడింది. కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్‌లో దీనికి సంబందించిన ఉపసంహరణ కార్యక్రమం మే 6న నిర్వహించబడింది.
ఈ నౌకను 1984లో కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజనీర్స్ లిమిటెడ్ దేశీయంగా నిర్మించింది. ఈ ఓడ 5,600 టన్నుల బరువుతో, 125 మీటర్ల పొడవు, 17 మీటర్ల వెడల్పును కలిగి ఉభయచర అసాల్ట్ షిప్ ఆఫ్ ఇండియన్ నేవీగా కీలక సేవలు అందించింది. డిసెంబర్ 2004 సునామీ సమయంలో ప్రభావిత ప్రాంతాల నుండి 1,300 మంది పౌరులను తరలించడంలో ఇది కీలక పాత్ర పోషించింది. దీనికి మొసలి జాతికి 'మగర్' అని పేరు పెట్టారు.
గత ఏడాది జూన్ 3న ఐఎన్ఎస్ నిశాంక్ మరియు ఐఎన్ఎస్ అక్షయ్ నౌకలు 32 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నక ముంబయిలోని నేవల్ డాక్‌యార్డ్‌లో డీకమిషన్ చేయబడ్డాయి. ఇదే ఏడాది 19 సెప్టెంబర్ 2022న ఐఎన్ఎస్ అజయ్ కూడా 32 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని ముంబయిలోని నేవల్ డాక్‌యార్డ్‌లో డీకమిషన్ చేయబడింది.
చండీగఢ్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెరిటేజ్ సెంటర్
రక్షణ రాజ్‌నాథ్ సింగ్ మే 08, 2023 న చండీగఢ్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) యొక్క హెరిటేజ్ సెంటర్‌ను ప్రారంభించారు. దీనిలో భారత వైమానిక దళానికి చెందిన చారిత్రాత్మక, వారసత్వ ప్రతిరూపలను, కళాఖండాలను, కుడ్యచిత్రాలను, 3డి డయోరామాల సేకరణను ఇందులో పొందుపర్చుతారు. ఈ హెరిటేజ్ సెంటర్ వైమానిక దళం యొక్క వారసత్వ & సాంకేతిక పురోగతుల ప్రదర్శన వేదికగా ఉండనుంది.
వారాసిగూడలో ప్రధానమంత్రి జన్ ఔషధి కేంద్రం ప్రారంభం
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, మే 7న సికింద్రాబాద్‌లోని వారాసిగూడలో ప్రధానమంత్రి జన్ ఔషధి కేంద్రాన్ని ప్రారంభించారు. నాణ్యమైన జనరిక్ ఔషధాలను అందరికీ అందుబాటు ధరల్లో అందించే లక్ష్యంతో 2008లో జన్ ఔషధి పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంభించింది.
దీనిని సెప్టెంబర్ 2015 లో 'ప్రధాన్ మంత్రి జన్ ఔషధి యోజన' (PMJAY)గా పునరుద్ధరించారు. ఈ పథకం పరిధిలో దేశ వ్యాప్తంగా 9400 లకు పైగా జన్ ఔషధి కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కేంద్రాలలో న్యూట్రాస్యూటికల్స్, ఆయుష్ ఉత్పత్తులు మరియు సువిధ సహా 1600 కంటే ఎక్కువ మందులు మరియు 250 శస్త్రచికిత్స పరికరాలు అందుబాటులో ఉంటాయి.
యూజీ & పీజీ విద్యార్థుల కోసం కొత్త ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇస్రో
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కొత్తగా స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్‌నెస్ ట్రైనింగ్ (START) పేరుతొ ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం చివరి ఏడాది చదువుతున్న పోస్టుగ్రాడ్యుయేట్ మారియు అండర్ గ్రాడ్యుయేట్ ఫిజిక్స్ & ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ కార్యక్రమం ఖగోళ శాస్త్రం & ఖగోళ భౌతిక శాస్త్రం, హీలియోఫిజిక్స్ & సన్-ఎర్త్ ఇంటరాక్షన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ మరియు ఏరోనమీతో సహా అంతరిక్ష శాస్త్రంలోని వివిధ డొమైన్‌లను కవర్ చేస్తుంది. ఆసక్తి ఉండే విద్యార్థులు దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. యువ విద్యార్థులకు స్పేస్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్ మరియు స్పేస్ అప్లికేషన్‌లపై ప్రాథమిక జ్ఞానాన్ని అందించడమే దీని ప్రధాన లక్ష్యం.
యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్‌లో యూత్20 కన్సల్టేషన్ ఈవెంట్
భారత జీ20 అధ్యక్షతన, యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్‌లో మే 10, 11 తేదీల మధ్య యూత్20 కన్సల్టేషన్ ఈవెంట్ నిర్వహించబడింది. వాతావరణ మార్పులపై జరిగిన ఈ యూత్20 కార్యక్రమంలో ఆతిథ్య భారతదేశంతో సహా 10 దేశాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ జాబితాలో అమెరికా, బ్రెజిల్, టర్కీ, జపాన్, దక్షిణ కొరియా, నైజీరియా మరియు మెక్సికో వంటి ఉన్నాయి.
ఈ సమావేశంలో వాతావరణ మార్పు మరియు విపత్తు ప్రమాదాల తగ్గింపు అనే అంశంపై నాలుగు ప్యానెల్ చర్చలు జరిగాయి. మొదటి ప్లీనరీ సెషన్ 'జీవవైవిధ్యం మరియు మానవ సంక్షేమంపై వాతావరణ మార్పుల ప్రభావం' అనే అంశంపై జరగగా, దీనిని జమ్మూ & కాశ్మీర్ ఇస్లామిక్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ షకిల్ ఎ. రోమ్‌షూ మోడరేట్ చేశారు.
రెండవ ప్లీనరీ సెషన్, 'సురక్షిత రేపటి కోసం డిజాస్టర్ రిస్క్ రిడక్షన్' అనే అంశంపై జరగగా, దీనికి ప్రొఫెసర్ ఎం. సుల్తాన్ భట్ నాయకత్వం వహించారు. మూడవ ప్లీనరీ సెషన్ 'గ్రీన్ ఎనర్జీ- ఇన్నోవేషన్స్ అండ్ ఆపర్చునిటీస్' అనే అంశంపై జరగగా, చివరి నాల్గవ ప్లీనరీ 'నీటి వనరులు: సవాళ్లు మరియు అవకాశాలు' అనే అంశంపై జరిగింది. ఆధునిక యువతని వాతావరణ, పర్యావరణ మార్పులకు సంబందించిన అంశాల యందు భాగస్వామ్యం చేయడమే దీని ప్రధాన లక్ష్యం.
భారతదేశంలో మకోటో షింకై ఫిల్మ్ ఫెస్టివల్
భారతదేశంలో ప్రముఖ జాపనీస్ దర్శకుడు మకోటో షింకై ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు పీవీఆర్ సినిమాస్ సిద్దమయ్యింది. జపనీస్ దిగ్గజ యానిమే దర్శకుడు మకోటో షింకై, తన కొత్త సినిమా 'సుజుమ్' ప్రమోట్ చేయడానికి ఇటీవల భారత్ విచ్చేసారు. ఈ సందర్బంగా పీవీఆర్ సినిమాస్ ఆయనతో ఈ ఒప్పందం చేసుకుంది.
ఇందులో భాగంగా ప్రస్తుతం విడుదల అవుతున్న సుజుమ్‌తో పాటు షింకై యొక్క నాలుగు మునుపటి హిట్ చిత్రాలు మే 19 నుండి భారతదేశం అంతటా పీవీఆర్ సినిమాస్ మరియు ఐనాక్స్ సినిమాల్లో ప్రదర్శించబడ్డాయి. భారతీయ యానిమే అభిమానులకు ఇది గొప్ప వార్తగా చెప్పొచ్చు.
మకోటో షింకై జాపనీస్ యానిమషన్ చిత్రాల దర్శుకుడుగా ప్రసిద్ధి. ఈయన 2002లో "వాయిసెస్ ఆఫ్ ఎ డిస్టాంట్ స్టార్" చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. తర్వాత దశలో వెదరింగ్ విత్ యు, యూవర్ నేమ్, 5 సెంటీమీటర్స్ పర్ సెకండ్ వంటి గొప్ప చిత్రాలను నిర్మించారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు
అత్యంత ప్రజాదరణ కలిగిన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, మే 9న అవినీతి ఆరోపణల కేసులో అరెస్ట్ చేయబడ్డారు. ఇమ్రాన్ ఖాన్‌ను ఇస్లామాబాద్‌లోని హైకోర్టు లోపల ఆ దేశ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో అదుపులోకి తీసుకుంది. ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ ఖాన్ నిర్వహించే అల్-ఖాదిర్ ట్రస్ట్‌కు సంబంధించి అవినీతి ఆరోపణల కేసు నేపథ్యంలో ఈ అరెస్టు చోటు చేసుకుంది. ఆమె నిర్వహిస్తున్న ఈ ట్రస్టు లావాదేవీల ముసుగులో ఇమ్రాన్ విదేశాల నుండి భారీ ఎత్తును విరాళాలు, బహుమతులు పొందినట్లు అభియోగాలు మోపబడ్డాయి.
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అయినా ఇమ్రాన్, ఆ దేశ 22వ ప్రధాన మంత్రిగా 2018లో ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత కాలంలో ఆ దేశ సైన్య అధ్యక్షుడు జనరల్ కమర్ జావేద్ బజ్వాతో పొరపొచ్చాలు రావడంతో, అనేక రాజకీయ దోబూచులు తర్వాత గత ఏడాది ఏప్రిల్ నెలలో ఇమ్రాన్ ప్రభుత్వం, ఆ దేశ పార్లమెంట్ యందు మెజారిటీ కోల్పోయింది. దీనితో ఇమ్రాన్ ప్రధానిగా రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఈ పరిణామాల తర్వాత సైనిక సహాయంతో ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్‌ను అదుపులో పెట్టేందుకు అవకాశం ఉన్న అన్ని అంశాలపైనా కేసులు బనాయించింది. ప్రస్తుతం 150కి పైగా చట్టపరమైన కేసులు మోపబడ్డాయి. అందులో దేశ ద్రోహం కేసు కూడా ఉంది.
బార్బరా కింగ్‌సోల్వర్, హెర్నాన్ డియాజ్‌లకు ఫిక్షన్ పులిట్జర్ ప్రైజ్
2023 ఏడాదికి సంబంధించి ఫిక్షన్ పులిట్జర్ బహుమతిని బార్బరా కింగ్‌సోల్వర్ యొక్క "డేవిడ్ కాపర్‌ఫీల్డ్" మరియు హెర్నాన్ డియాజ్ యొక్క "ట్రస్ట్" నవలకు సంయుక్తంగా ఇవ్వబడింది. ఈ రెండు రచనలు ఈ ఏడాది గొప్ప ప్రజాదరణను పొందాయి.
డేవిడ్ కాపర్‌ఫీల్డ్ నవలను ది వాషింగ్టన్ పోస్ట్ 2022 యొక్క టాప్ రిలీజ్‌గా పేర్కొంది. ఈ రచన దక్షిణ అప్పలాచియాలోని ఒక ఒంటరి యువకుడి కష్టాలు మరియు పట్టుదలకు చెందిన కథ. హెర్నాన్ డియాజ్ యొక్క "ట్రస్ట్" నవల, 1920లలో న్యూయార్క్‌లో చోటుచేసుకున్న సంపద మరియు మోసానికి సంబంధించిన వినూత్న కథనం.
పులిట్జర్ ప్రైజ్ అనేది వార్తాపత్రిక, మ్యాగజైన్, ఆన్‌లైన్ జర్నలిజం, సాహిత్యం మరియు యునైటెడ్ స్టేట్స్‌లోని మ్యూజిక్ కళాకారుల విజయాలకు కొలంబియా విశ్వవిద్యాలయంచే అందించబడే అవార్డు. ఈ అవార్డు జోసెఫ్ పులిట్జర్ యొక్క వీలునామాలోని నిబంధనల ద్వారా ఇది 1917లో స్థాపించబడింది. 23 కేటగిరీల వారీగా అందించే ఈ అవార్డు విజేతలకు $15,000 నగదు పురస్కారం మరియు సర్టిఫికేట్‌ను అందిస్తారు. జర్నలిజం & పబ్లిక్ సర్వీస్ విభాగంలో విజేతలకు బంగారు పతకం ఇవ్వబడుతుంది.
భారత్‌లో ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్ 3 రోజుల పర్యటన
ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్, మే 9 నుండి 11అవా తేదీల మధ్య మూడు రోజుల అధికారిక పర్యటన కోసం భారతదేశంకు విచ్చేశారు. ఈ పర్యటనలో భాగంగా మొదటి రోజు హైదరాబాద్ హౌస్‌లో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌తో చర్చలు నిర్వహియించారు. ఇదే రోజున ఇండస్ట్రీ ఛాంబర్ సీఐఐ నిర్వహించిన ఇండియా-ఇజ్రాయెల్ బిజినెస్ ఫోరమ్ సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత రెండు రోజులలో గోవా, మరియు ముంబైలలో వివిధ అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యారు.
ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి పర్యటన ఈ ఏడాది చివర్లో ఇండియాకు రానున్న ఆ దేశ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు పర్యటనకు సన్నాహకంగా ఉంది. ఇకపోతే గడిసిన ఏప్రిల్ నెలలో ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి నిర్ బర్కత్ కూడా భారతదేశాన్ని సందర్శించారు.
గోవాలో మూడవ జీ20 డెవలప్‌మెంట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్
మూడవ జీ20 డెవలప్‌మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశంను మే 09 - 11 వ తేదీల మధ్య గోవాలోని తాజ్ రిసార్ట్ అండ్ కన్వెన్షన్ సెంటర్ యందు నిర్వహించారు. ఈ సమావేశంలో జీ20 సభ్యు దేశాలు, 9 ఆహ్వానిత దేశాలు మరియు వివిధ అంతర్జాతీయ మరియు ప్రాంతీయ సంస్థల నుండి 80 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సమావేశం లింగ సమానత్వం & మహిళల నేతృత్వంలో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక & రాజకీయ అభివృద్ధి సంబంధిత అంశాలపై చర్చలు నిర్వహించారు. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో జీ 20 సెక్రటేరియట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
- భారతదేశం యొక్క జీ 20 ప్రెసిడెన్సీలో డెవలప్‌మెంట్ వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశం డిసెంబర్ 13-16, 2022 వరకు ముంబైలో నిర్వహించబడింది.
- భారతదేశం యొక్క జీ 20 ప్రెసిడెన్సీలో డెవలప్‌మెంట్ వర్కింగ్ గ్రూప్ రెండవ సమావేశం 9 ఏప్రిల్ 2023న కేరళలోని కుమరకోమ్‌లో నిర్వహించారు.
సాక్షం లెర్నింగ్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రారంభం
కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ యొక్క లెర్నింగ్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (LMIS) అయిన సాక్షం (స్టిమ్యులేటింగ్ అడ్వాన్స్‌డ్ నాలెడ్జ్ ఫర్ సస్టెయినబుల్ హెల్త్ మేనేజ్‌మెంట్)ని ప్రారంభించారు. ఈ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ అభివృద్ధి చేసింది.
సాక్షం అనేది దేశంలోని ఆరోగ్య నిపుణులందరికీ ఆన్‌లైన్ శిక్షణ మరియు వైద్య విద్యను అందించడానికి అంకితమైన ఏకీకృత వేదిక. ఈ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్ గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి మెట్రోపాలిటన్ నగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రుల వరకు ఆరోగ్య నిపుణులను అనుసంధానం చేస్తుంది.
ప్రస్తుతం ఈ వేదిక ఆన్‌లైన్ మోడ్ ద్వారా 200 కంటే ఎక్కువ పబ్లిక్ హెల్త్ మరియు 100 క్లినికల్ కోర్సులను నిఅందిస్తుంది. ఆరోగ్య నిపుణులు ఈ కోర్సుల కోసం పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు. శిక్షణ పూర్తిచేసుకున్న వారు సంబంధిత ధృవీకరణను పొందవచ్చు.
ఇండోనేషియాలో 42వ ఆసియాన్ సమ్మిట్
42వ ఆసియాన్ సమ్మిట్, ఇండోనేషియాలోని లాబువాన్ బాజోలో ఈ నెల 10, 11వ తేదీలలో నిర్వహించారు. ఆసియాన్ అనగా అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని అర్ధం. దీనిని 1967లో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం ఇండోనేషియాలోని జకార్తాలో ఉంది. ఈ శిఖరాగ్ర సమావేశం రెండు సార్లు నిర్వహిస్తారు. ఆగ్నేయాసియాలో మతం, సంస్కృతి మరియు చరిత్రలో అద్భుతమైన వైవిధ్యం కలిగిన పదకొండు దేశాలలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి.
ఈ జాబితాలో బ్రూనై, బర్మా (మయన్మార్), కంబోడియా, తైమూర్-లెస్టే, ఇండోనేషియా, లావోస్, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్ మరియు వియత్నాం దేశాలు ఉన్నాయి. డైలాగ్ పార్ట్‌నర్‌లుగా చైనా, జపాన్ మరియు దక్షిణ కొరియాలు చేరాయి. భారతదేశం దక్షిణాసియాలో ఉండటంతో దాని భౌగోళిక స్థానం కారణంగా ఈ సంఘంలో సభ్యత్వం పొందలేకపోయింది.
ఆసియాన్ (ASEAN) సభ్య దేశాల ఆంగ్ల పేర్ల అక్షరక్రమం ఆధారంగా ఏటా దీని ఛైర్మన్‌షిప్ మారుతూ ఉంటుంది. అధ్యక్ష పదవిని స్వీకరించే సభ్య దేశం దీనిని ఒక క్యాలెండర్ సంవత్సరం పాటు నిర్వహిస్తుంది. 2023 యొక్క ఛైర్మన్‌షిప్ ఇండోనేషియా చేతిలో ఉంది.
- ఆసియాన్ అధ్యక్ష హోదా : ఇండోనేషియా
- ఆసియాన్ చైర్మెన్ : ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో
- 42వ ఆసియాన్ సమ్మిట్ హోస్ట్ : ఇండోనేషియాలోని లాబువాన్ బాజో (మే 10, 11)
- 43వ ఆసియాన్ సమ్మిట్ : ఇండోనేషియాలోని జకార్తా (సెప్టెంబర్ 5,7)
'రైటింగ్ విత్ ఫైర్' డాక్యుమెంటరీ చిత్రానికి యూఎస్ పీబాడీ అవార్డు
రింటు థామస్ మరియు సుష్మిత్ ఘోష్ దర్శకత్వం వహించిన రైటింగ్ విత్ ఫైర్ చిత్రం, డాక్యుమెంటరీ విభాగంలో అమెరికన్ పీబాడీ అవార్డును గెలుచుకుంది. ఈ డాక్యుమెంటరీ చిత్రం, దళిత స్త్రీలు నిర్వహించే భారతదేశపు ఏకైక వార్తాపత్రిక ఖబర్ లహరియాకు సంబందించిన కథాంశంతో రూపొందించబడింది. దీనిని యూపీకి చెందిన కవితా దేవి, మీరా జాతవ్ 2002లో స్థాపించారు. ఈ డాక్యుమెంటరీ ఈ ఏడాది ఆస్కార్ అవార్డు నామినేషన్ కూడా పొందింది.
పీబాడీ అవార్డు అనేది అమెరికన్ వ్యాపారవేత్త మరియు పరోపకారి జార్జ్ పీబాడీ పేరుతో 1942లో ఏర్పాటు చేసారు. ఈ అవార్డులను ఏటా టెలివిజన్, రేడియో మరియు ఆన్‌లైన్ మీడియాలో అత్యంత శక్తివంతమైన, విజ్ఞాన సంబంధిత మరియు ఉత్తేజపరిచే కథనాలతో వచ్చిన చిత్రాలకు ఇవ్వబడుతుంది.
2027లో పురుషుల బాస్కెట్‌బాల్ ప్రపంచ కప్‌కు ఖతార్ ఆతిథ్యం
2027లో జరిగే ఇంటర్నేషనల్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ (FIBA) యొక్క పురుషుల బాస్కెట్‌బాల్ ప్రపంచ కప్‌కు ఖతార్ ఆతిథ్యం ఇవ్వనుంది. మధ్యప్రాచ్య దేశమైన ఖతార్ ఏడాది విజయవంతంగా ఫిఫా వరల్డ్ కప్‌ను నిర్వహించడంతో మరో ప్రధాన క్రీడా ఈవెంట్‌ను హోస్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. ఇటీవలే ఈ దేశాన్ని సందర్శించిన ఫిబా పాలక మండలి, సంబంధిత క్రీడా ఈవెంట్ అంశాలను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 32 జట్లు పాల్గొనే ఈవెంట్‌లోని అన్ని గేమ్‌లు ఆ దేశ రాజధాని నగరం దోహాలో జరగనున్నాయి. అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ సమాఖ్య అనేది ప్రపంచవ్యాప్తంగా బాస్కెట్‌బాల్ క్రీడను నిర్వహించే జాతీయ సంస్థల సంఘం. 18 జూన్ 1932లో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం మీస్ (స్విట్జర్లాండ్) లో ఉంది. దీని ప్రస్తుత సెక్రటరీ జనరల్‌గా ఆండ్రియాస్ జాగ్లిస్ ఉన్నారు.
నిజామాబాద్‌లో డెక్కన్ ప్రీమియర్ క్యారమ్ లీగ్
వజ్ర స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పిస్తున్న డాక్టర్ అఖిలేష్ మెమోరియల్ డెక్కన్ ప్రీమియర్ క్యారమ్ లీగ్, ఆగస్టు 23 నుంచి ఆగస్టు 27 వరకు తెలంగాణలోని నిజామాబాద్ నవ్యభారతి గ్లోబల్ స్కూల్ యందు జరగనుంది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో సహా కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ మరియు ఒడిశా రాష్ట్రాల నుండి టాప్ 30 మంది ఆటగాళ్లను ఆరు జట్లుగా పోటీ పడతారు.
భారతదేశంలో మొదటిసారిగా క్యారమ్ క్రీడకు సంబంధించి పేపర్‌లెస్ స్కోరింగ్, మొబైల్‌ల ద్వారా స్కోర్‌ల ఎంట్రీ, లైవ్ స్కోర్‌లు మరియు ఆన్‌లైన్ గణాంకాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మొదటి నాలుగు స్థానాలలో నిలిచిన జట్లకు నగదు బహుమతులు అందిస్తారు. అలానే సింగిల్స్ విజేతలలో మొదటి స్థానంకు రూ. 60,000, రెండవ స్థానంలో రూ. 40,000, మూడో స్థానంలో రూ. 20,000 మరియు నాల్గవ స్థానంలో రూ. 10,000 అందిస్తారు.
తెలంగాణ స్టేట్ రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్ విడుదల
రాష్ట్రంలో స్థిరమైన రోబోటిక్స్ పర్యావరణ వ్యవస్థను స్థాపించడానికి తెలంగాణ ప్రభుత్వం స్టేట్ రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రారంభించింది. దీనితో దేశంలో రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. రోబోటిక్స్ డిజైన్, టెస్టింగ్‌కు సంబంధించి రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చే లక్ష్యంతో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్ పాలసీని రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు మే 9న ప్రకటించారు.
ఈ ఫ్రేమ్‌వర్క్ వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, పారిశ్రామిక ఆటోమేషన్ మరియు వినియోగదారుల అనువర్తనాలలో రోబోటిక్స్ వినియోగానికి సంబంధించి విధివిధానాలను అందిస్తుంది. ఇది తెలంగాణ రోబోటిక్స్ పరిశ్రమ వృద్ధిని ప్రోత్సహించడంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా చెప్పొచ్చు.
టీఎస్‌ఆర్‌ఎఫ్‌ను అమలు చేసేందుకు తెలంగాణ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్ (టీఆర్‌ఐసీ) అనే ప్రత్యేక సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ సంస్థ టీ-హబ్, వుయ్ హబ్, టీ వర్క్స్, టీఎస్ ఇన్నోవేషన్ సెల్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ మరియు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ వంటి స్టార్ట్-అప్ సపోర్ట్ సిస్టమ్‌లతో కలిసి పరిశోధనలను మార్కెట్‌లోకి తీసుకెళ్లడానికి పని చేస్తుంది.
అనారోగ్యాన్ని గుర్తించే సెన్సర్ పేస్ మాస్క్‌ను అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ
బిట్స్ పిలానీ హైదరాబాద్ పరిశోధకులు అనారోగ్యాన్ని గుర్తించేందుకు సెన్సార్‌తో కూడిన ఫేస్ మాస్క్‌ను రూపొందించారు. ఈ బృందం 'కిరిగామి' ఆధారిత సాంకేతికతో స్ట్రెచబుల్, ఫ్లెక్సిబుల్ లేజర్ ప్రేరిత గ్రాఫేన్ సహాయంతో నిజ-సమయ జోడింపు ఫేస్ మాస్క్ రూపొందించారు. ఇది కోవిడ్ మరియు ఇతర శ్వాసకోశ వ్యాధుల నుండి రక్షించగలదని భావిస్తున్నారు.
కిరిగామి అనేది ఓరిగామి యొక్క వైవిధ్య కళారూపం. ఇది కాగితంను వివిధ రూపాలలో మడతపెట్టే ఒక జపనీస్ కళ. కిరిగామిలో కాగితాన్ని కత్తిరించడంతో పాటు మడతపెట్టడం ద్వారా ఒక త్రిమితీయ డిజైన్ రూపుదిద్దుకుంటుంది. కిరిగామిలో సాధారణంగా ఎటువంటి జిగురు ఉపయోగించబడదు.
2023 లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ విజేతలు
2023 లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డులు ప్రకటించబడ్డాయి. అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ 2023 సంవత్సరపు లారస్ స్పోర్ట్స్ మాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును, జమైకన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ షెల్లీ-ఆన్ ఫ్రేజర్-ప్రైస్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు.
- లారస్ స్పోర్ట్స్ మాన్ ఆఫ్ ది ఇయర్ - లియోనెల్ మెస్సీ
- స్పోర్ట్స్ మాన్ ఆఫ్ ది ఇయర్ - షెల్లీ-ఆన్ ఫ్రేజర్-ప్రైస్
- కమ్ బ్యాక్ ఆఫ్ ది ఇయర్ - క్రిస్టియన్ ఎరిక్సెన్
- టీమ్ ఆఫ్ ది ఇయర్ - అర్జెంటీనా జాతీయ ఫుట్‌బాల్ జట్టు
- యాక్షన్ స్పోర్ట్స్ పర్సన్ - ఎలీన్ గు
లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ అనేది ఏడాది పొడవునా క్రీడా విజయాలతో రాణించిన క్రీడా ప్రపంచానికి చెందిన వ్యక్తులు మరియు జట్లను గౌరవించే వార్షిక అవార్డు వేడుక. ఇది 1999లో లారెస్ స్పోర్ట్ ఫర్ గుడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డైమ్లర్ మరియు రిచెమోంట్ ద్వారా స్థాపించబడింది.
ఢాకాలో 6వ హిందూ మహాసముద్ర సదస్సు
బంగ్లాదేశ్ రాజధాని నగరం ఢాకా, మే 12-13 తేదీలలో హిందూ మహాసముద్ర సదస్సు యొక్క ఆరవ ఎడిషన్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఇది హిందూ మహాసముద్ర ప్రాంతం యొక్క భౌగోళిక రాజకీయ, ఆర్థిక మరియు వ్యూహాత్మక ప్రాముఖ్యతపై దృష్టి సారించే వార్షిక అంతర్జాతీయ సమావేశం. దాదాపు 25 దేశాల నుంచి అత్యున్నత స్థాయి ప్రభుత్వ ప్రతినిధులు మరియు థింక్ ట్యాంక్‌లు ఈ ఐఓసీలో పాల్గొన్నారు. ఇండియా నుండి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ సదస్సుకు హాజరయ్యారు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రారంభించిన ఈ సదస్సును ఇండియా ఫౌండేషన్, బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఎస్. రాజారత్నం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌తో కలిసి నిర్వహించింది. హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై ఈ సమావేశంలో వివిధ చర్చలు నిర్వహించారు.
గూచీ యొక్క మొదటి భారతీయ గ్లోబల్ అంబాసిడరుగా అలియా భట్
ప్రముఖ ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ గూచీ యొక్క మొదటి భారతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా అలియా భట్ నియమితులయ్యారు. అలియా భట్ ప్రస్తుతం క్యాడ్‌బరీ, మేక్ మై ట్రిప్, బ్లెండర్స్ ప్రైడ్, లేస్, కాప్రెస్, మాన్యవర్, కార్నెట్టో, టైటాన్ రాగా, ఫోన్‌పే, ఫిలిప్స్ వంటి మరెన్నో బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు
ముంబైలో భారతదేశం యొక్క మొట్టమొదటి మైనింగ్ స్టార్ట్-అప్ సమ్మిట్
భారతదేశం యొక్క మొట్టమొదటి మైనింగ్ స్టార్ట్-అప్ సమ్మిట్‌ను మే 29న ముంబైలో నిర్వహించారు. దేశంలో మైనింగ్ మరియు మెటలర్జీ రంగంలో స్టార్టప్‌ల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం కోసం కేంద్ర బొగ్గు మరియు గనుల మంత్రిత్వ శాఖ దీనిని నిర్వహించింది.
కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మే 29న ముంబైలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో దీనిని ప్రారంభించారు. ఈ సదస్సు మైనింగ్ మరియు మెటలర్జీ రంగానికి సంబంధించి పనితీరు, భద్రత, నూతన ఆవిష్కరణలు మరియు నూతన సాంకేతికతలపై చర్చలకు వేదిక అయ్యింది.
ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో రిథమ్ సాంగ్వాన్‌కు కాంస్యం
అజర్‌బైజాన్‌లోని బాకులో జరిగిన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ప్రపంచ కప్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌లో భారతదేశానికి చెందిన రిథమ్ సాంగ్వాన్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. షూటింగ్ ప్రపంచకప్‌లో సాంగ్వాన్‌కు ఇది తొలి వ్యక్తిగత సీనియర్ పతకం.
ఆమె ఫైనల్‌లో 219.1 స్కోరుతో గ్రీస్‌కు చెందిన 2016 రియో ఒలింపిక్ ఛాంపియన్ అన్నా కొరకాకి మరియు ఉక్రెయిన్‌కు చెందిన 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత ఒలెనా కోస్టెవిచ్ తర్వాత మూడవ స్థానంలో నిలిచింది.
ప్రపంచ బాక్సింగ్‌లో భారత బాక్సర్లకు మూడు పతకాలు
తాష్కెంట్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు తొలిసారిగా మూడు కాంస్య పతకాలు సాధించారు. 51 కేజీల విభాగంలో దీపక్ భోరియా, 57 కేజీల విభాగంలో మహ్మద్ హుసాముద్దీన్, 71 కేజీల బరువుతో నిశాంత్ దేవ్ తమ క్వార్టర్ ఫైనల్ బౌట్‌లలో విజయం సాధించడంతో భారత్ ఈ చరిత్ర సృష్టించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత పురుషుల బాక్సర్లు మూడు పతకాలను దక్కించుకోవడం ఇదే తొలిసారి.
2023 ఐబీఏ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో గత 30 ఏప్రిల్ నుండి 14 మే వరకు నిర్వహించబడ్డాయి. మొత్తం ఐదు ఖండాల లోని 107 దేశాల నుంచి 538 మంది అథ్లెట్లు, 13 వెయిట్ కేటగిరీలలో పతకాల కోసం పోటీ పడ్డారు. బంగారు పతక విజేతలకు $200,000, వెండి పతక విజేతలకు $100,000 మరియు కాంస్య పతక విజేతలకు $50,000 ప్రైజ్ మనీ అందిస్తారు.
తమిళనాడులో సిస్కో తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళిక
ప్రముఖ అమెరికా డిజిటల్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ సమ్మేళన సంస్థ అయినా సిస్కో, తమిళనాడులోతయారీ ప్లాంట్ ఏర్పాటుకు సిద్దమవుతుంది. ఇటీవలే భారతదేశానికి వ్యాపార పర్యటనకు విచ్చేసిన సిస్కో చైర్ మరియు సీఈఓ చక్ రాబిన్స్, ఈ ప్రకటన చేశారు. తమిళనాడులో ఏర్పాటు చేయబోయే ఈ తయారీ ప్లాంట్ దాదాపు 1,200 పైగా ఉద్యోగాలను సృష్టిస్తుంది వెల్లడించారు. ఈ పర్యటనలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో కూడా సమావేశమయ్యారు.
ఇండియాలో గూగుల్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ బార్డ్ ప్రారంభం
గూగుల్ యొక్క జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ బార్డ్ ఇప్పుడు భారతదేశంతో సహా 180 దేశాలలో అందుబాటులోకి వచ్చింది. ఇటీవలే ఇంటర్నెట్ యందు పాపులర్ అయినా చాట్‌జిపిటికి ప్రత్యామ్నాయంగా దీనిని ప్రవేశపెట్టింది. ఆసక్తి ఉన్న వినియోగదారులు గూగుల్ బార్డ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా చాట్‌బాట్‌ను ఇప్పుడు యాక్సెస్ చేయవచ్చు.
ఢిల్లీలో అంతర్జాతీయ మ్యూజియం ఎక్స్‌పో 2023
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 18వ తేదీన న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో 3 రోజుల అంతర్జాతీయ మ్యూజియం ఎక్స్‌పో 2023ని ప్రారంభించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ రెండవ దశలో భాగంగా 47వ అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టబడింది. ఈ మూడు రోజుల ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్‌పోలో, వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు, మాస్టర్ క్లాసులు, ప్యానెల్ డిస్కషన్‌లు నిర్వహించారు.
ఇదే వేదికలో ఈ కార్యక్రమానికి సంబంధించి బ్రోచర్‌ను కూడా విడుదల చేశారు. మ్యూజియంల యందు అవగాహన కల్పన కోసం మొబైల్ వ్యాన్ “మ్యూజియం ఆన్ వీల్స్”ను కూడా జెండా ఊపి ప్రారంభించారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఇప్పటి వరకు దేశంలో 383 మ్యూజియంలను ఏర్పాటు చేసింది. అలానే 5,000 సంవత్సరాల భారతదేశ చరిత్రను సంగ్రహించే ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం యుగే యుజీన్ భారత్‌కు సంబంధించిన ప్రణాళికను కూడా ఆవిష్కరించారు.
'హరిత్ సాగర్' గ్రీన్ పోర్ట్ మార్గదర్శకాలు 2023 విడుదల
ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ 'హరిత్ సాగర్' గ్రీన్ పోర్ట్ మార్గదర్శకాలను ప్రారంభించారు. మంత్రిత్వ శాఖ నిర్దేశించిన జీరో కర్బన ఉద్గార లక్ష్యాన్ని సాధించే విశాల దృక్పథానికి అనుగుణంగా ఈ మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి. ఈ మార్గదర్శకాలు పోర్ట్ డెవలప్‌మెంట్, ఆపరేషన్ మరియు మెయింటెనెన్స్‌లో పర్యావరణ వ్యవస్థ గతిశీలతను అంచనా వేస్తాయి. 'హరిత్ సాగర్' అనేది భారతీయ ఓడరేవుల పర్యావరణ పనితీరును పెంపొందించడంతో పాటుగా భారతీయ ఓడరేవులను గ్రీన్ పోర్ట్‌లుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది.
దీనిని అమలు చేసేందుకు వర్కింగ్ విత్ నేచర్ కాన్సెప్ట్‌తో హార్బర్ ఎకోసిస్టమ్ యొక్క బయోటిక్ భాగాలపై కర్బన ఉద్గారాల ప్రభావాన్ని నియంత్రించనున్నారు. పోర్ట్ ఆపరేషన్‌లో క్లీన్ లేదా గ్రీన్ ఎనర్జీని ఉపయోగించడం అనగా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా మరియు గ్రీన్ మిథనాల్ లేదా ఇథనాల్ వంటి ఇంధనాలను వాడటం ద్వారా పోర్ట్ సామర్థ్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది.
ఇదే వేదికలో జీరో కర్బన ఉద్గార లక్ష్యం వైపు అడుగులు వేస్తున్న ప్రధాన ఓడరేవులకు 'ది సాగర్ శ్రేష్ఠ సమ్మాన్' అవార్డులను కూడా ప్రధానం చేశారు. ఈ ఏడాది విశాఖ ఓడరేవు ఈ అవార్డు గెలుచుకుంది. కొచ్చిన్ పోర్ట్ అథారిటీ, నాన్-కంటెయినర్ కేటగిరీలో సాగర్ శ్రేష్ఠ సమ్మాన్ అవార్డు దక్కించుకుంది.
ఢిల్లీలో బుద్ధం శరణం గచ్చామి ఎగ్జిబిషన్
కేంద్ర విదేశాంగ మరియు సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి, మే 11న బుద్ధం శరణం గచ్ఛామిప్రదర్శనను ఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని బౌద్ధమతానికి సంబంధించిన జ్ఞానం, కరుణ మరియు శాంతి యొక్క సార్వత్రిక విలువలను ప్రజలలోకి తీసుకుపోయేందుకు నిర్వహించారు.
ఈ కార్యక్రమంకు అనేక దేశాల నుండి వివిధ బౌద్ధ మత మిషన్లు హాజరయ్యాయి. ఈ ఎగ్జిబిషన్ యందు శ్రీలంక మరియు మయన్మార్ వంటి దేశాలకు చెందిన చిత్రాలను కూడా ప్రదర్శించారు. వేదిక వద్ద బౌద్ధమతం యొక్క కళాత్మక రచనలు, చరిత్ర మరియు తత్వశాస్త్రంలో ఒక సంగ్రహావలోకనంను అందుబాటులో ఉంచారు.
విశాఖలో సీ హారియర్ మ్యూజియాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
విశాఖపట్నం మెట్రోపాలిటన్ అభివృద్ధి చేసిన సీ హారియర్ జెట్ మ్యూజియాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే 11న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నావికాదళ కమాండర్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్‌గుప్తా, పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కె రోజా కూడా పాల్గొన్నారు.
ఇదే రోజున పోతినమల్లయ్యపాలెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసిన యశస్వి జైస్వాల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధశతకం సాధించిన కేఎల్ రాహుల్ రికార్డును రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైస్వాల్ బద్దలు కొట్టాడు. 21 ఏళ్ళ ఈ ఓపెనర్ బ్యాట్సమెన్ కేవలం 13 బంతుల్లోనే ఈ రికార్డు సాధించాడు. రాజస్థాన్ రాయల్స్ మరియు కోల్‌కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వేగవంతమైన అర్ధ సెంచరీ చోటుచేసుకుంది.
- యశస్వి జైస్వాల్ - 13 బంతుల్లో (రాజస్థాన్ / కోల్‌కతా 11-మే-2023) : కోల్‌కతాలో
- లోకేష్ రాహుల్ - 14 బంతుల్లో (పంజాబ్ / ఢిల్లీ 08-ఏప్రిల్-2018 ) : మొహాలిలో
- పాట్ కమిన్స్ - 14 బంతుల్లో (కోల్‌కతా / ముంబై 06-ఏప్రిల్-2022) : పూణేలో
- యూసుఫ్ పఠాన్ - 15 బంతుల్లో ( కోల్‌కతా / హైదరాబాద్ 24-మే-2014) హైదరాబాద్
- సునీల్ నరైన్ - 15 బంతుల్లో (కోల్‌కతా / బెంగళూరు 07-మే-2017 ) : బెంగళూరు
- నికోలస్ పూరన్ - 15 బంతుల్లో (లక్నో / బెంగళూరు 10-ఏప్రిల్-2023) : బెంగళూరు
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా యుజ్వేంద్ర చాహల్
రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. దీనితో పాటుగా మొత్తం టీ20 క్రికెట్‌లో 300 వికెట్లు తీసిన మొదటి భారతీయ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇది వరకు ఈ రికార్డు వెస్ట్ ఇండీస్ బౌలర్ డ్వేన్ బ్రావో పేరిట ఉండేది.
- యుజ్వేంద్ర చాహల్ - 143 మ్యాచుల్లో 187 వికెట్లు
- డ్వేన్ బ్రావో - 161 మ్యాచుల్లో 183 వికెట్లు
- పీయూష్ చావ్లా - 177 మ్యాచుల్లో 176 వికెట్లు
- అమిత్ మిశ్రా - 160 మ్యాచుల్లో 172 వికెట్లు
వాయు పేరుతొ ఫుడ్ డెలివరీ యాప్ ప్రారంభించిన సునీల్ శెట్టి
ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్‌లకు పోటీగా కొత్తగా పోటీగా 'వాయు' అనే యాప్‌ను ప్రారంభించారు. ఈ కొత్త ఫుడ్ డెలివరీ యాప్ ఇతర సంస్థల మాదిరిగా కాకుండా ప్రజలకు చౌకైన మరియు మంచి ఆహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ యాప్ ఎలాంటి కమీషన్ లేకుండా ఫుడ్ డెలివరీ ఆర్డర్‌లను లాగ్ చేయడానికి హోటల్‌లు మరియు రెస్టారెంట్‌లకు సహాయం చేస్తుంది.
హర్యానాలో క్రైమ్ అండ్ సెక్యూరిటీపై జీ20 కాన్ఫరెన్స్
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ హర్యానాలోని గురుగ్రామ్‌లో జూలై 13 మరియు 14 తేదీల్లో నాన్ ఫంగబుల్ టోకెన్‌లు, ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్ మరియు మెటావర్స్ యుగంలో సైబర్ నేరాలు మరియు ఇంటర్నెట్ భద్రతపై జీ20 కాన్ఫరెన్స్‌ను నిర్వహించనుంది. రెండు రోజుల నిడివితో ఐటీ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ మరియు సీబీఐ భాగస్వామ్యంతో ఈ సదస్సు నిర్వహించబడింది.
భారత్ జీ20 అధ్యక్ష్యతన నిర్వహించిన ఈ సమావేశంలో జీ-20 సభ్య దేశాలు, అతిథి/ ఆహ్వానిత దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయి. అలానే సైబర్ నిపుణులు, న్యాయవాదులు, విద్యాసంస్థలు, శిక్షణా సంస్థలు, ఫిన్‌టెక్, సోషల్ మీడియా మధ్యవర్తులు, సైబర్ ఫోరెన్సిక్స్, స్టార్టప్‌లు, ఓవర్ ది టాప్ సర్వీస్ ప్రొవైడర్లు మరియు వివిధ ఇ-కామర్స్ కంపెనీలు కూడా దీనికి హాజరయ్యాయి.