తెలుగులో కరెంట్ అఫైర్స్ 08 మే 2023 ఉచితంగా పొందండి. యూపీఎస్‌సీ, ఎస్ఎస్‌సీ, ఏపీపీఎస్‌సీ, టీఎస్‌పీఎస్‌సీ, రైల్వే, బ్యాంకింగ్, డిఫెన్స్, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ వంటి వివిధ నియామక పరీక్షలకు సిద్దమౌతున్న ఔత్సాహికుల కోసం ప్రత్యేకంగా పోటీ పరీక్షల దృక్కోణంలో అందిస్తున్నాం.
వైభవంగా కింగ్ చార్లెస్ III పట్టాభిషేకం
యునైటెడ్ కింగ్‌డమ్ మరియు ఇతర కామన్వెల్త్ రాజ్యాలకు రాజు మరియు రాణిగా చార్లెస్ III మరియు అతని భార్య కెమిల్లా పట్టాభిషేకం 6 మే 2023 న వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో ఘనంగా జరిగింది. గత ఏడాది 8 సెప్టెంబర్ 2022న చార్లెస్ తన తల్లి ఎలిజబెత్ II మరణంతో ఆయన బ్రిటన్ సింహాసనాన్ని అధిష్టించారు. 21వ శతాబ్దంలో పట్టాభిషేకం చేసిన మొదటి బ్రిటిష్ చక్రవర్తి మరియు రాణీగా చార్లెస్ మరియు కెమిల్లా నిలిచారు.
బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి 203 దేశాల నుండి దాదాపు 2,200 మంది అతిథులు ఆహ్వానించబడ్డారు. వీరిలో బ్రిటీష్ రాజకుటుంబ సభ్యులు, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ మరియు ఇతర బ్రిటిష్ విశ్వాస సంఘాల ప్రతినిధులు, యునైటెడ్ కింగ్‌డమ్ మరియు కామన్వెల్త్ నుండి ప్రముఖ రాజకీయ నాయకులు మరియు విదేశీ దేశాధినేతలు ఉన్నారు. భారతదేశం నుండి ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్, ఆయన జీవిత భాగస్వామి సుదేష్ ధంఖర్ హాజరయ్యారు.
ఇకపోతే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 43 దేశాలలో రాచరికం అమలులో ఉంది. ఇందులో 15 కామన్వెల్త్ రాజ్యాలకు బ్రిటన్ చక్రవర్తినే రాజుగా వ్యవహరిస్తున్నారు. ఈ జాబితాలో ఆంటిగ్వా, బార్బుడా, ఆస్ట్రేలియా, బహామాస్, బెలిజ్, కెనడా, గ్రెనడా, జమైకా, న్యూజిలాండ్, పాపువా న్యూ గినియా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడైన్స్, సోలమన్ దీవులు, తువాలు మరియు యునైటెడ్ కింగ్‌డమ్ ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా రాచరికం వ్యవస్థ మూడు రకాలుగా అమలు అవుతుంది. ఆయా దేశాల సంస్కృతీ, భాషను బట్టి రాచరికంలోని దేశాధినేతలను రాజు, రాణీ, అమీర్, సుల్తాన్ వంటి హోదాల్లో వ్యవహరిస్తారు. ఇందులో రాజ్యాంగ పరమైన రాచరికం, పూర్తి రాచరికం, మిశ్రమ రాచరికం ఉన్నాయి. రాజ్యాంగ పరమైన రాచరికంలో రాజు ఆ దేశ రాజ్యాంగ పరిరక్షులుగా వ్యవహరిస్తారు. వీరికి రాజకీయ సంబంధిత జోక్యం ఉండదు. యూకేలో కనిపించే రాచరికం ఈ రకానికి చెందుతుంది. ఇదే రాచరికం జపాన్, డెన్మార్క్ దేశాల్లో కూడా కనిపిస్తుంది.
పూర్తి రాచరిక దేశాలలో రాజు పూర్తి స్థాయి దేశ అధినేతగా ఉంటారు. రాజ్యాంగ, రాజకీయ పాలనకు పూర్తి బాధ్యత వహిస్తారు. ఈ రకం రాచరికానికి సౌదీ అరేబియా, వాటికన్ సిటీ, యస్వటీని వంటి దేశాలు ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక మిశ్రమ రాచరికంలో కొన్ని ముఖ్యమైన అంశాలకు మాత్రమే రాజు బాధ్యత వహిస్తారు. మిగతా అంశాలలో ప్రజా ప్రభుత్వాలు స్వేచ్ఛగా విధులు నిర్వర్తిస్తాయి. ఉదాహరణకు జోర్డాన్, మొరాకో వంటి దేశాలలో ఈ రకం రాచరికం కనిపిస్తుంది.
అటామిక్ ఎనర్జీ కమిషన్ నూతన చైర్మన్‌గా ఎకె మొహంతి
ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త అజిత్ కుమార్ మొహంతి, అటామిక్ ఎనర్జీ కమిషన్ యొక్క కొత్త చైర్మన్‌గా మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ యొక్క నూతన సెక్రటరీగా నియమితులయ్యారు. అజిత్ కుమార్ ప్రస్తుతం భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ( బార్క్) డైరెక్టరుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1959లో ఒడిశాలో జన్మించిన మొహంతీ 1979లో బరిపడలోని ఎంపీసీ కళాశాల నుండి భౌతికశాస్త్రంలో ఆనర్స్ పొందారు. కటక్‌లోని రావన్‌షా కళాశాల నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేశారు.
అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలోని ఒక శాస్త్రీయ అణు పరిశోధన విభాగం. ఇది 03 ఆగష్టు 1948 లో ఏర్పాటు చేయబడింది. ఇది డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ మరియు ప్రధానమంత్రి ప్రత్యేక్ష కనుసన్నలలో పనిచేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. అటామిక్ ఎనర్జీ కమిషన్ దేశంలో అణు పరిశోధనలను నిర్వహించడం, అణు శాస్త్రవేత్తలకు శిక్షణ ఇవ్వడం మరియు భారతదేశంలోని అణు ప్రయోగశాలలలో అణు పరిశోధనలను ప్రోత్సహించడం వంటి కీలక సేవలు అందిస్తుంది. దీనికి భారతదేశంలో ఐదు పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి.
- భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) - ముంబై
- ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ (IGCAR), - కల్పక్కం (తమిళనాడు)
- రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ (RRCAT) - ఇండోర్
- వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ (VECC) - కోల్‌కతా
- అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ (AMD) - హైదరాబాద్.
లక్షద్వీప్‌లో సైన్స్ 20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ మీటింగ్
భారతదేశం యొక్క జీ 20 ప్రెసిడెన్సీలో సైన్స్ 20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ సమావేశంను, లక్షద్వీప్‌లోని బంగారం ద్విపంలో మే 1మరియు 2వ తేదీల్లో నిర్వహించారు. యూనివర్సల్ హోలిస్టిక్ హెల్త్ అనే అంశంపై నిర్వహించ ఈ సమావేశంలో మానవ శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపే వ్యవసాయ పద్ధతులు, పౌష్టికాహారం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మరియు పర్యావరణ స్పృహ విభాగాలపై చర్చలు నిర్వహించారు.
సార్వత్రిక సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి, దేశీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని గుర్తించడం, సాంప్రదాయ వైద్య పద్ధతులను ఆధునిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్లోకి చేర్చడం, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, అందరికీ నాణ్యమైన మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేలా ఒక బలమైన మానసిక ఆరోగ్య విధానాన్ని రూపొందించడం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ఈ సమావేశానికి ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ అశుతోష్ కుమార్ శర్మ సహాధ్యక్షత వహించారు.
మైక్రో & స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ యొక్క క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ పునరుద్ధరణ
మైక్రో & స్మాల్ ఎంటర్‌ప్రైజెస్‌కు అదనంగా 2 లక్షల కోట్ల క్రెడిట్ గ్యారెంటీని అందించడానికి దాని పూర్వపు క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో & స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (CGTMSE) పథకాన్ని తాజాగా కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ పునరుద్దించిన పథకాన్ని కేంద్రమంత్రి నారాయణ్ రాణే, ఏప్రిల్ 27న ముంబైలో ప్రారంభించారు. ఇది సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలకు అదనంగా 2 లక్షల కోట్ల రుణాలు మరియు అడ్వాన్సులకు హామీనిస్తుంది.
మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (MSE) విభాగానికి మెరుగైన రుణాలను అందించడానికి ఈ పథకాన్ని పునరుద్ధరించారు. దీని అమలు కోసం 2023-24 కేంద్ర బడ్జెట్‌లో 9,000 కోట్ల అదనపు కార్పస్ సపోర్టును అందుబాటులో ఉంచింది. ఈ నూతన పధకంలో 1 కోటి వరకు రుణాలకు గ్యారెంటీ రుసుములను 50% తగ్గించింది. అలానే కనీస హామీ రుసుమును సంవత్సరానికి 0.37% స్థాయికి తీసుకొచ్చింది. అదే సమయంలో గ్యారెంటీ సీలింగ్‌ను 2 కోట్ల నుండి 5 కోట్లకు పెంచడం ద్వారా చట్టపరమైన చర్య తీసుకోకుండానే క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం థ్రెషోల్డ్ పరిమితిని ₹10 లక్షలకు పెంచినట్లు చేసింది.
ఈ సంధర్బంగా ఈ క్రెడిట్ హామీ పథకాన్ని ఉత్తమంగా వినియోగించుకున్న బ్యాంకులను కేంద్ర మంత్రి సత్కరించారు. తాజా పునరుద్ధరణ పథకం దేశంలోని ఎంఎస్‌ఇలకు కొలేటరల్ ఫ్రీ లెండింగ్‌ను సులభతరం చేయడంలో పాటుగా పెద్ద ఎత్తున ఉపాధిని సృష్టించడంలో దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ పథకం అధికారికంగా ఆగస్ట్ 30, 2000 న ప్రారంభించబడింది. సూక్ష్మ మరియు చిన్న సంస్థలకు అనుషంగిక రహిత క్రెడిట్‌ను అందుబాటులో ఉంచడానికి భారత ప్రభుత్వం ప్రారంభించబడింది. దీని కోసం ప్రత్యేకంగా క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్‌ను కూడా ఏర్పాటు చేసింది. రెండేళ్ల కోవిడ్ సంక్షోభం వలన దేశంలోని ఎంఎస్‌ఇలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే ఉన్న రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. కోవిడ్-19 సమయంలో ప్రభుత్వం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) వంటి చర్యలను చేపట్టినా, మెజారిటీ నిపుణులు CGTMSE పథకాన్ని పునరుద్ధరించాలని కోరుకున్నారు.
హైదరాబాద్‌లో ఫుడ్ కాన్‌క్లేవ్ 2023
తెలంగాణ ప్రభుత్వం, ఏప్రిల్ 28 మరియు 29 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫుడ్ కాన్‌క్లేవ్ 2023ను విజయవంతంగా ముగించింది. దీనిని వ్యవసాయ ఆహార రంగానికి సంబంధించిన వార్షిక మేధోమథనం కార్యక్రమంగా ఏటా నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ మొదటి ఎడిషన్ ద్వారా తెలంగాణలోని వ్యవసాయ ఆహార పరిశ్రమలో 58,458 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించేలా 7217.95 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ సదస్సును ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. వ్యవసాయంలో సరికొత్త పోకడలు, ఆవిష్కరణలపై చర్చించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల ప్రముఖులు, నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని కోర్ థ్రస్ట్ ఏరియాగా రాష్ట్రం గుర్తించిందని వెల్లడించారు.
పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్‌ల క్రింద అద్భుతాలు ఎలా సృష్టించవచ్చో, మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్‌లను ఎలా ప్రోత్సహించవచ్చో తెలంగాణ ప్రభుత్వంను చూసి దేశంలోని మిగిలిన వారు నేర్చుకోవచ్చు అని అన్నారు. తెలంగాణ ఉత్పత్తి పరంగా విప్లవాలకు నాంది పలకడమే కాదు, పరిశ్రమల ప్రయోజనాల కోసం టాలెంట్ పూల్‌ను ఉత్పత్తి చేసే పర్యావరణ వ్యవస్థను కూడా సృష్టిస్తోందని పేర్కొన్నారు. తాజాగా ఆక్వా, డెయిరీ, ఆగ్రో ప్రాసెసింగ్ మరియు అనుబంధ రంగాలలో వచ్చిన పెట్టుబడులు ఆయా రంగాల్లో నూతన ఉత్తేజం రానుందని అన్నారు.
ఇ-రూపాయి (e₹)ని ఆమోదించిన మొదటి బీమా కంపెనీగా రిలయన్స్
రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) ఇ-రూపాయి (e₹)ని ఆమోదించిన మొదటి బీమా కంపెనీగా అవతరించింది. దీని కోసం ఈ సంస్థ ఎస్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ యొక్క ఖాతాదారులు తమ ప్రీమియం చెప్పింపు కోసం ఇ-రూపాయిని ఉపయోగించుకోవచ్చు.
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) అనేది దేశం యొక్క సాధారణ భౌతిక కరెన్సీ యొక్క డిజిటల్ రూపం. దీనిని ఇ-రూపాయి (e₹) అంటారు. దీనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తుంది. ప్రస్తుతం ఇది ఆర్‌బిఐ క్లోజ్డ్ యూజర్ గ్రూప్ మరియు ఎంచుకున్న బ్యాంకులలో హోల్‌సేల్ మరియు రిటైల్ లావాదేవీల్లో మాత్రమే ఉపయోగించబడుతుంది.
ఇ-రూపాయిని 2022-23 బడ్జెట్‌లో ప్రారంభించనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. 7 అక్టోబర్ 2022 న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC)పై కాన్సెప్ట్ నోట్‌ను విడుదల చేసింది. 01 డిసెంబర్ 2022న డిజిటల్ రూపాయి-రిటైల్ సెగ్మెంట్ (e₹-R) యొక్క మొదటి పైలట్ ప్రాజెక్టు ప్రారంభించింది.
రాజస్థాన్‌లో మూడు కొత్త యానిమల్ కన్జర్వేషన్ పార్కులు
రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మూడు యానిమల్ కన్జర్వేషన్ పార్కులను నోటిఫై చేసింది. ఈ జాబితాలో బరన్‌లోని సోర్సన్, జోధ్‌పూర్‌లోని ఖిచాన్ మరియు భిల్వారాలోని హమీర్‌ఘర్ ప్రాంతాలు ఉన్నాయి. రాజస్థాన్ అటవీ శాఖ ఈ జాబితాను ఏప్రిల్ 22న, ఎర్త్ డే సందర్భంగా ప్రకటించింది. దీనితో ఈ రాష్ట్రంలో యానిమల్ కన్జర్వేషన్ పార్కుల సంఖ్య 26కి చేరుకుంది.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మూడు రోజుల మాల్దీవుల పర్యటన
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మే 1 నుండి 3 మధ్య అధికారిక మాల్దీవుల పర్యటనకు వెళ్లారు. ఈ మూడు రోజుల పర్యటనలో మాల్దీవుల కౌంటర్ మరియా అహ్మద్ దీదీ మరియు ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్‌ను కూడా మంత్రి కలుసుకున్నారు.
ఇరు దేశాల మధ్య సైనిక సంబంధాలు పెంపొందిచడంలో భాగంగా మాల్దీవుల జాతీయ రక్షణ దళాలకు ఒక ఫాస్ట్ పెట్రోల్ వెసెల్ షిప్ మరియు ల్యాండింగ్ క్రాఫ్ట్‌ను బహుమతిగా ప్రకటించారు. ఈ సందర్బంగా సముద్ర భద్రత, తీవ్రవాదం, రాడికలైజేషన్, పైరసీ, అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలు మరియు ప్రకృతి వైపరీత్యాలతో సహా భాగస్వామ్య సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించడానికి ఇరు దేశాలు సన్నిహితంగా పని చేయనున్నాయి.
సదరన్ ఎయిర్ కమాండ్‌కి కొత్త చీఫ్‌గా బాలకృష్ణన్ మణికంఠన్
సదరన్ ఎయిర్ కమాండ్ యొక్క నూతన ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ (ఏఓసీ)గా ఎయిర్ మార్షల్ బాలకృష్ణన్ మణికంఠన్ మే 1న బాధ్యతలు స్వీకరించారు. సైనిక్ స్కూల్ కజకూటం మరియు నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయినా బాలకృష్ణన్, 7 జూన్ 1986న భారత వైమానిక దళంలోకి ప్రవేశించినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది.
బాలకృష్ణన్ ఫిక్స్‌డ్ వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో 5400 గంటలకు పైగా ప్రయాణ అనుభవాన్ని కలిగిఉన్నాడు. ఎయిర్ మార్షల్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మరియు టాక్టిక్స్ అండ్ ఎయిర్ కంబాట్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (TACDE)లో బోధనా సిబ్బందిగా పనిచేశారు. ఈయన అతి విశిష్ట సేవా పతకంతో పాటుగా వాయు సేన పతకం యొక్క రాష్ట్రపతి అవార్డు కూడా అందుకున్నారు.
ఆర్ఐటీఈఎస్‌తో హౌసింగ్ అండ్ అర్బన్ అవగాహన ఒప్పందం
గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సాలిడ్ వేస్ట్ అంశానికి సంబంధించి సాంకేతిక సహాయం కోసం రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. గృహనిర్మాణ & పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్తగా లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణాల కోసం యూజ్డ్ వాటర్ మేనేజ్‌మెంట్ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
పట్టణ పారిశుధ్యంలో ఒక నమూనా మార్పుగా సాలిడ్ వేస్ట్ మరియు వాడిన నీటి నిర్వహణను వేగవంతం చేయడంపై ఈ పాలసీ దృష్టి సారిస్తుంది. ఈ అంశంలో సాంకేతిక సహాయం కోసం రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్‌తో వచ్చే మూడేళ్ళ కాలానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0లో భాగంగా దీనిని అమలు చేయనుంది. చెత్త రహిత నగరాలను సృష్టించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.
ఎంఎస్ఎంఈల ఉపశమనం కోసం వివాద్ సే విశ్వాస్ పథకం
కోవిడ్-19 కాలంలో విఫలమైన సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు ఉపశమనాన్ని అందించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖర్చుల విభాగం కొత్తగా వివాద్ సే విశ్వాస్ I -రిలీఫ్ టూ ఎంఎస్ఎంఈస్ పథకాన్ని ప్రకటించింది. దీనిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్ 2023-24లో ప్రకటించారు. ఈ పథకం ద్వారా కోవిడ్ -19 కాలంలో ప్రభావితమైన ఎంఎస్ఎంఈలకు కింది అదనపు ప్రయోజనాలను ఇవ్వాలని నిర్ణయించింది.
- కాంట్రాక్టుల పూర్తిచేయడంలో విఫలమైన లేదా జప్తు చేయబడిన ఫెరఫార్మన్స్ సెక్యూరిటీలో 95% తిరిగి చెల్లిస్తారు.
- ఎంఎస్ఎంఈల బిడ్ సెక్యూరిటీలో 95% తిరిగి చెల్లిస్తారు.
- తొలగించిన లిక్విడేటెడ్ డ్యామేజెస్‌లో 95% తిరిగి చెల్లిస్తారు.
- సేకరించిన రిస్క్ కొనుగోలు మొత్తంలో 95% రీఫండ్ చెల్లిస్తారు.
- డిఫాల్ట్ కారణంగా డిబార్ చేయబడిన సంస్థలకు, ప్రొక్యూరింగ్ ఎంటిటీ ఆర్డర్ జారీ చేయడం ద్వారా డిబార్మెంట్ కూడా రద్దు చేయబడుతుంది.
ఈ పథకం 17.04.2023 నుండి అమలులోకి వచ్చింది. దీని పరిధిలో క్లెయిమ్‌ల సమర్పణకు 30.06.2023 చివరి తేదీగా ప్రకటించారు. మానవ చరిత్రలో అతిపెద్ద సంక్షోభాలలో ఒకటైన కొవిడ్-19 మహమ్మారి ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలపై వినాశకరమైన ప్రభావాన్ని చూపింది. ఈ పథకం కింద అందించబడిన ఉపశమనం ఎంఎస్ఎంఈల రంగాన్ని ప్రోత్సహించడంలో మరియు నిలబెట్టడంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కొనసాగింపుగా ఉంటుంది.
వివాద్ సే విశ్వాస్ పథకం అనేది పన్ను చెల్లింపుదారులు మరియు ఆదాయపు పన్ను శాఖ మధ్య వివాదాలను పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యక్ష పన్ను పథకం. ఇది 2020 లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పథకం కింద, వివాదాస్పద పన్ను మొత్తానికి సంబంధించిన వడ్డీ మరియు పెనాల్టీ పూర్తిగా మాఫీ చేశారు.
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగులో భారత జట్టుకు అగ్రస్థానం
ఐసీసీ పురుషుల టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో భారతదేశం తిరిగి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2021 డిసెంబర్‌లో ఒక నెల పాటు అగ్రస్థానంలో కొనసాగక తిరిగి నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ క్రికెట్ మండలి మే 2న విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ ఆస్ట్రేలియాను అధిగమించి నంబర్ వన్‌గా నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాపై భారత్ 2-1తో సిరీస్ గెలిచి వరుసగా నాలుగోసారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకుంది.
వచ్చే నెలలో జరగనున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ టెస్టులో భారత్ నెంబర్ వన్ ర్యాంకుతో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ప్రస్తుతం భారత్ 121 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, 116 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ (116), దక్షిణాఫ్రికా (104), న్యూజిలాండ్ (100)లు తర్వాత మూడు స్థానాలలో ఉన్నాయి.
దుబాయ్‌లో ఇంటర్నేషనల్ అపెరల్ & టెక్స్‌టైల్ ఫెయిర్
ఇంటర్నేషనల్ అపెరల్ & టెక్స్‌టైల్ ఫెయిర్ యొక్క పదిహేనవ ఎడిషన్‌ను మే 1 నుండి 3వ తేదీల మధ్య దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ ప్రదర్శనలో 22 దేశాల నుండి 200 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. దీనిని భారత ప్రభుత్వం, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ మరియు అపెరల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్ నిర్వహించాయి.
ఈ ఫెయిర్ ప్రధాన దుస్తులు, ఫ్యాషన్ వస్త్రాలు, ప్రింట్లు, ఉపకరణాలు, గృహ వస్త్రాలు, పాదరక్షలు వంటి మొదలగు ఫ్యాషన్ ఉత్పత్తులకు ఔట్ సోర్సింగ్ వేదికగా ప్రసిద్ధి చెందింది. ఇండియా పెవిలియన్‌లో దాదాపు 67 స్టాల్స్ ఏర్పాటు చేసారు. ఇండియన్ పెవిలియన్‌ను భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎఇపిసి ఛైర్మన్ అశోక్ జి రజనీ కూడా పాల్గొన్నారు.
దుబాయ్‌లో అరేబియన్ ట్రావెల్ మార్కెట్ 30వ ఎడిషన్
అరేబియన్ ట్రావెల్ మార్కెట్ యొక్క 30వ ఎడిషన్ మే 1 న దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో నిర్వహించబడింది. ఈ ఈవెంట్‌లో 150కి పైగా దేశాల నుండి 2,000 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. వీరిలో ప్రముఖ హోటళ్లు, ట్రావెల్ ఏజెన్సీలు, విమానయాన సంస్థలు మరియు టెక్నాలజీ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ 30వ ఎడిషన్ 'వర్కింగ్ టువర్డ్స్ నెట్ జీరో' అనే థీమ్‌తో నిర్వహించారు.
ఈ ఈవెంట్ యొక్క ఇండియా పెవిలియన్ మరియు ఇతర రాష్ట్ర పెవిలియన్‌లను యుఎఇలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ ప్రారంభించారు. ఈ సంవత్సరం ఈవెంట్ ట్రావెల్ పరిశ్రమలో కర్బన ఉద్గారాలను తగ్గించడంపై ప్రధానంగా దృష్టి సారించింది. భారతీయ పెవిలియన్ బాధ్యతాయుతమైన వన్యప్రాణి పర్యాటకంతో సహా దేశం యొక్క పర్యావరణ అనుకూల కార్యక్రమాలను హైలైట్ చేసింది.
ఉజ్బెకిస్థాన్ కొత్త రాజ్యాంగ నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ
ఉజ్బెకిస్థాన్ కొత్త రాజ్యాంగ నిర్మాణంపై ఆ దేశ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో దేశ రాజ్యాంగాన్ని తిరిగి వ్రాయాలన్న అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్ యొక్క ఆలోచనకు ఉజ్బెకిస్థాన్ ఓటర్లలో అత్యధికులు "అవును" అని ఓటు వేశారు.
ఉజ్బెకిస్తాన్‌లో పాలన మరియు జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు రాజ్యాంగాన్ని సరిదిద్దాలని మిర్జిజ్యోయెవ్ నొక్కిచెప్పారు. మానవ హక్కులు పరిరక్షణ, జండర్ ఈక్వాలిటీ, వ్యక్తిగత స్వాతంత్రం మరియు దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడే కీలక మార్పులు కొత్త రాజ్యాంగంలో పొందుపర్చేందుకు పిలుపునించారు. 2016లో ఇస్లాం కరీమోవ్ మరణం తర్వాత 65 ఏళ్ల మిర్జియోయెవ్ ఆ దేశ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించారు.
- ఉజ్బెకిస్తాన్ మధ్య ఆసియాలోని ఒక ఇస్లామిక్ దేశం
- ఇది మాజీ సోవియట్ రిపబ్లిక్ యందు భాగం.
- ఈ దేశం చైనా మరియు మధ్యధరా మధ్య పురాతన వాణిజ్య మార్గం అయిన సిల్క్ రోడ్‌తో అనుసంధానించబడి ఉంటుంది.
- రాజధాని నగరం : తాష్కెంట్
- అధికారిక కరెన్సీ : ఉజ్బెకిస్తానీ సోమ్
- అధికారిక భాష : ఉజ్బెక్
- ప్రస్తుత అధ్యక్షుడు : షావ్కత్ మిర్జియోయెవ్
మైరాజ్ అహ్మద్ ఖాన్ & గనేమత్ సెఖోన్‌లకు స్వర్ణం
ఈజిప్ట్‌లోని కైరోలో జరిగిన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ISSF)లో భారత షూటర్లు మైరాజ్ అహ్మద్ ఖాన్ మరియు గనేమత్ సెఖోన్‌లు స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ నిర్వహించిన ఈ క్రీడా ఈవెంటులో భారత్ మొత్తంగా రెండు బంగార పథకాలు, ఒక వెండి పథకం మరియు 4 కంచు పథకాలు గెలుచుకున్నారు.
కార్గిల్‌లో ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వ గ్రాంట్ ప్రకటించిన ఆస్ట్రేలియన్ హైకమిషన్
భారతదేశంలోని ఆస్ట్రేలియన్ హైకమిషన్ ఇటీవల కార్గిల్‌లో ఒక ప్రాజెక్ట్ కోసం తన ప్రభుత్వ గ్రాంట్‌ను ప్రకటించింది. భారత జాతీయ విద్యా విధానం యొక్క లక్ష్యాలకు అనుగుణంగా సాంప్రదాయ జ్ఞానాన్ని ప్రస్తుత పాఠశాల సైన్స్ పాఠ్యాంశాలతో ఏకీకృతం చేయడం లక్ష్యంగా చేపట్టిన ప్రాజెక్ట్ "రిటర్న్ టు రూట్స్" కోసం ఇది ప్రకటించబడింది. ఇటీవలే శ్రీనగర్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆస్ట్రేలియా హైకమిషనర్ఓ ఫారెల్ ఈ విషయాన్ని ప్రకటించారు.
గోవాలో ఎస్‌సిఓ విదేశాంగ మంత్రుల సమావేశం
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) యొక్క విదేశాంగ మంత్రుల రెండు రోజుల సమావేశం మే 3, 4 తేదీలలో గోవాలో నిర్వహించబడింది. ఈ కీలక సమావేశంకు పాకిస్థాన్, చైనా సహా 8 ఎస్‌సిఓ దేశాల విదేశాంగ మంత్రులు హాజరయ్యారు. గతేడాది సెప్టెంబరు నుండి భారత్ ఎస్‌సిఓ యొక్క అధ్యక్ష హోదాలో కొనసాగుతుంది.
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్, రష్యాకు చెందిన సెర్గీ లావ్‌రోవ్, పాకిస్థాన్‌కు చెందిన బిలావల్ భుట్టో-జర్దారీలు హజారయ్యారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడి మరియు కనెక్టివిటీ రంగాలతో సహా సభ్యదేశాల మధ్య సహకారాన్ని విస్తరించే అంశాలపై చర్చలు నిర్వహించారు. ఆఫ్గనిస్తాన్ ఉగ్రవాద సవాళ్లతో పాటు ఉక్రెయిన్‌లో యుద్ధ పరిస్థితులపై కూడా చర్చలు నిర్వహించారు.
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది యురేషియా రాజకీయ, ఆర్థిక, అంతర్జాతీయ భద్రత మరియు రక్షణ సంస్థ. ఇది 15 జూన్ 2001లో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం బీజింగ్ నగరంలో ఉంది. ఇందులో రష్యా, భారతదేశం, చైనా, పాకిస్తాన్ దేశాలతో పాటుగా నాలుగు మధ్య ఆసియా దేశాలైన కజకిస్తాన్, కిర్గిజ్‌స్థాన్, తజికిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ సభ్యులుగా ఉన్నాయి.
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో భారతదేశంకు 161వ ర్యాంక్
2023 ప్రపంచ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో భారతదేశ ర్యాంకు 11 స్థానాలు దిగజారి ఆల్ టైమ్ అట్టడుగు స్థానానికి చేరువయ్యింది. గ్లోబల్ మీడియా వాచ్‌డాగ్ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (RSF) తాజా నివేదిక ప్రకారం భారతదేశం 180 స్థానాల్లో 161 వ స్థానానికి పడిపోయింది. తాజా నివేదిక తజికిస్తాన్, ఇండియా మరియు టర్కీ అనే మూడు దేశాలలో మీడియా పరిస్థితి 'సమస్యాత్మక' నుండి 'చాలా చెడ్డ' స్థితికి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేసింది.
తజికిస్థాన్ గత ఏడాది కంటే ఒక స్థానం దిగజారి 153 వద్ద నిలవగా, భారత్ 11 స్థానాలు దిగజారి 161వ ర్యాంక్‌లో నిలిచింది. 2022లో 150వ ర్యాంకులో ఉండే టర్కీ 16 స్థానాలు దిగజారి 165వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో పాకిస్తాన్ 150వ స్థానంలో భారత్ కంటే 11 స్థానాలు ముందంజ ఉండటం గమనార్హం. ఇకపోతే నార్వే, ఐర్లాండ్ మరియు డెన్మార్క్ దేశాలు మొదటి మూడు స్థానాలలో ఉండగా వియత్నాం, చైనా, ఉత్తర కొరియాలు అట్టడుగు మూడు స్థానాలలో నిలిచాయి.
ప్రముఖ తమిళ నటుడు మనోబాల కన్నుమూశారు
ప్రముఖ తమిళ నటుడు మరియు దర్శకుడు మనోబాల మే 3న 69 ఏళ్ళ వయస్సులో అనారోగ్యంతో మరణించారు. మనోబాల 1979 భారతీరాజా చిత్రం పుతియా వార్పుగల్‌తో నటుడిగా మరియు సహాయ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఐదు దశాబ్దాల కెరీర్‌లో నటుడిగా 900కు పైగా చిత్రాల్లో నటించారు.
రష్యన్ కవయిత్రి మరియా స్టెపనోవాకు లీప్‌జిగ్ బుక్ ప్రైజ్
ప్రస్తుతం బెర్లిన్‌లో నివసిస్తున్న ప్రఖ్యాత రష్యన్ రచయిత్రి మరియా స్టెపనోవాకు యూరోపియన్ అండర్‌స్టాండిగ్ కోసం ప్రతిష్టాత్మక లీప్‌జిగ్ బుక్ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. ఆమె కవితా సంపుటి "గర్ల్స్ వితౌట్ క్లాత్స్" కోసం ఈ అవార్డును అందుకున్నారు.
ఇది స్త్రీ శరీరంపై తరచుగా దాగి ఉన్న హింస మరియు ఈ అణచివేతకు దారితీసే శక్తి అసమతుల్యతపై సున్నితమైన మరియు అత్యంత కవితాత్మకమైన అధ్యయనంగా వర్ణించబడింది. స్టెపనోవా 2021లో బుకర్ ప్రైజ్‌కు కూడా నామినేట్ అయ్యారు.
ఫోర్బ్స్ జాబితాలో 100 మిలియన్ డాలర్ల సంపాదనలో ఎనిమిది మంది అథ్లెట్లు
ఫోర్బ్స్ 2023 అత్యధిక పారితోషికం పొందుతున్న అథ్లెట్ల జాబితాలో క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీలు టాప్ రెండు స్థానాలలో నిలిచారు. ఈ జాబితాలో దాదాపు 8 మంది కీడాకారులు 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఈ ఏడాది ప్రపంచంలో అత్యధికంగా చెల్లించే 50 మంది అథ్లెట్లలో ఒక్క మహిళ (సెరెనా విలియమ్స్) మాత్రమే చోటు దాక్కించుకుంది.
- $136 మిలియన్లు. క్రిస్టియానో రోనాల్డో
- $130 మిలియన్. లియోనెల్ మెస్సీ
- $120 మిలియన్. కైలియన్ ఎంబాప్పే
- $119.5 మిలియన్. లేబ్రోన్ జేమ్స్
- $110 మిలియన్. కానెలో అల్వారెజ్
- $107 మిలియన్. డస్టిన్ జాన్సన్
- $106 మిలియన్. ఫిల్ మికెల్సన్
- $100.4 మిలియన్. స్టీఫెన్ కర్రీ
ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్ టైటిల్ విజేతగా లూకా బ్రెసెల్
28 ఏళ్ల బెల్జియన్ స్నూకర్ ఆటగాడు లూకా బ్రెసెల్, ఉత్కంఠభరితమైన ఫైనల్‌లో మార్క్ సెల్బీని ఓడించి తన మొదటి ప్రపంచ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. దీనితో లూకా బ్రెసెల్ యూరప్ నుండి టైటిల్ గెలుచుకున్న మొదటి ఆటగాడుగా నిలిచాడు.
ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్ అనేది ప్రొఫెషనల్ స్నూకర్‌లో సుదీర్ఘకాలం నడిచే మరియు అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్. ఇది అత్యంత సంపన్నమైన క్రీడ. ఇది 1927లో మొదటిసారి నిర్వహించారు, విజేతకు £2,395,000 బ్రిటన్ డాలర్ల ప్రైజ్ మనీ అందిస్తారు.
అంతర్జాతీయ మాస్టర్ టైటిల్ సాధించిన 11వ భారత మహిళగా వంతిక అగర్వాల్
చెస్‌లో అంతర్జాతీయ మాస్టర్ టైటిల్ సాధించిన 11వ భారతీయ మహిళగా వంతిక అగర్వాల్ నిలిచారు. గత 2 నెలల్లో 4 అంతర్జాతీయ టోర్నమెంట్‌లు ఆడిన వంతిక, తన ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ రేటింగ్‌ను 61 పాయింట్లు పెంచుకోవడంతో పాటుగా మొత్తం 2428 పాయింట్ల మార్కుకు చేరుకుంది. ఈమె ప్రస్తుతం భారతదేశంలో నం. 3 ఉమెన్ చెస్ ప్లేయర్‌గా ఉంది.
వంతిక గత నెలలో స్పెయిన్‌లో జరిగిన మెనోర్కా ఓపెన్‌లో వంటిక మహిళల ఛాంపియన్‌గా నిలిచింది. ఆమె జనవరి 2023లో కోహ్లాపూర్‌లో జరిగిన జాతీయ మహిళల ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని మరియు ఫిబ్రవరి 2023లో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరపున బంగారు పతకాన్ని కూడా గెలుచుకుంది.
ఎసీసీ పురుషుల ప్రీమియర్ కప్ విజేతగా నేపాల్
ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఎసీసీ) ప్రీమియర్ కప్ ఫైనల్‌లో యూఏఈని ఓడించి నేపాల్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. దీనితో ఈ ఏడాది జరిగే ఆసియా కప్ యందు ఆడే అవకాశాన్ని దక్కించుకుంది. ఎసీసీ ప్రీమియర్ లీగ్ అనేది ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్. లీగ్ విధానంలో జరిగే ఈ టోర్నమెంటులో ద్వితీయ స్థాయి ఆసియా జట్లు పోటీపడతాయి.
ఇందులో విజయం సాధించిన జట్టుకు ఆసియా కప్ యందు పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈ మొదటి టోర్నమెంట్ మే 2014లో మలేషియాలో జరిగింది. ఇందులో బహ్రెయిన్, భూటాన్, ఇరాన్, మాల్దీవులు, ఇండోనేషియా, మయన్మార్, సౌదీ అరేబియా, థాయిలాండ్, మలేషియా, నేపాల్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, హాంగ్ కాంగ్, కువైట్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు పాల్గొంటాయి. ఇందులో అత్యధిక సార్లు ఆఫ్గనిస్తాన్ విజేతగా నిలిచింది.
జైల్లో ఉన్న ముగ్గురు ఇరానియన్ మహిళా జర్నలిస్టులకు యూఎన్ అవార్డు
ఐక్యరాజ్యసమితి, జైలులో ఉన్న ముగ్గురు ఇరానియన్ మహిళా జర్నలిస్టులకు 2023 యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ ప్రకటించింది. ఈ ముగ్గురు విజేతలలో నీలౌఫర్ హమీది, ఎలాహెహ్ మొహమ్మది మరియు నర్గేస్ మొహమ్మదిలు ఉన్నారు. సత్యం మరియు జవాబుదారీతనం పట్ల వారు చూపిన నిబద్ధత కోసం ఈ గౌరవం అందించారు.
ఈ విజేతలలో ఒకరైన నీలోఫర్ హమేదీ, ప్రముఖ సంస్కరణవాద దినపత్రిక షార్గ్ యందు పనిచేస్తున్నారు. 16 సెప్టెంబర్ 2022న పోలీసు కస్టడీలో మరణించిన మాషా అమిని కేసుపై పరిశోదించడంతో ఆమె సెప్టెంబర్ 2022 నుండి ఇరాన్ యొక్క ఎవిన్ జైలులో ఏకాంత నిర్బంధంలో ఉంచబడింది.
మరో విజేత ఎలాహెహ్ మొహమ్మది, మరో సంస్కరణవాద వార్తాపత్రిక హమ్ - మిహన్ పత్రిక యందు పని చేస్తున్నారు. సామాజిక సమస్యలు మరియు లింగ సమానత్వా అంశాలను కవర్ చేసే ఈమె కూడా మాషా అమిని అంత్యక్రియల గురించి నివేదించింతో అదే జైలు యందు ఖైదీ అయ్యారు.
మరో విజేత నర్గేస్ మొహమ్మది, టెహ్రాన్ ఆధారిత పౌర సమాజ సంస్థ డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్ (DHRC)కి రచయిత మరియు వైస్ డైరెక్టర్ కూడా. ఆమె ప్రస్తుతం ఎవిన్ జైలులో 16 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తోంది.
ఢిల్లీలో 5వ భారత్-కువైట్ విదేశాంగ కార్యాలయ సంప్రదింపులు
5వ భారత్-కువైట్ విదేశాంగ కార్యాలయ సంప్రదింపులు మే 2న న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ ద్విపాక్షిక సమావేశాలలో పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ మరియు అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను ఇరుదేశాల నాయకులు పంచుకున్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న భారత ప్రతినిధి బృందానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ విపుల్ నాయకత్వం వహించగా, కువైట్ ప్రతినిధి బృందానికి కువైట్ ఆసియా వ్యవహారాల సహాయ మంత్రి సమీహ్ ఎస్సా జోహార్ హయత్ నేతృత్వం వహించారు. భారత అధ్యక్షత త్వరలో ఎస్‌సిఓ డైలాగ్ పార్టనర్‌గా కువైట్ చేరనుంది.
- కువైట్ పశ్చిమ ఆసియాలోని ఒక దేశం.
- ఇది తూర్పు అరేబియా యొక్క ఉత్తర అంచున పెర్షియన్ గల్ఫ్ యొక్క కొన వద్ద ఉంది.
- ఈ దేశానికి ఉత్తరాన ఇరాక్ మరియు దక్షిణాన సౌదీ అరేబియా సరిహద్దులుగా ఉన్నాయి.
- రాజధాని నగరం : కువైట్ సిటీ
- అధికారిక కరెన్సీ : కువైట్ దినార్
- అధికారిక భాష : అరబిక్
- ప్రధాన మంత్రి : అహ్మద్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబా
ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌదరి శ్రీలంక పర్యటన
ఎయిర్‌స్టాఫ్ చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి, నాలుగు రోజుల పర్యటన నిమిత్తం శ్రీలంకలో పర్యటించారు. ఈ పర్యటనలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో భేటీ అవ్వడంతో పాటుగా ఆ దేశ రక్షణ మంత్రి ప్రేమితా బండార తెన్నకోన్‌తో, చీఫ్ ఆఫ్ స్టాఫ్, జాతీయ భద్రతపై సలహాదారు సాగలా రత్నయ్యలతో కూడా సమావేశం అయ్యారు.
ఈ పర్యటనలో శ్రీలంక ఆధీనంలో ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్ యొక్క కార్యాచరణ కోసం శ్రీలంక వైమానిక దళ కమాండర్‌కు AN-32 విడిభాగాలను కూడా అందించారు. అలాన్ నేషనల్ డిఫెన్స్ కాలేజీలో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్బంగా భారత ప్రభుత్వం నుండి 1 కోటి రూపాయల విలువైన పుస్తకాలను బహుమతిగా అందించారు. ఈ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న సంబంధాలను బలోపేతం చేయడంతో పాటుగా ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత అంశాలపై మరింత దృష్టి సారించనున్నారు.
నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వేలో కర్ణాటక టాప్
నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వే (NMIS) లో కర్ణాటక అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో తెలంగాణ రెండవ స్థానంలో ఉండగా, తమిళనాడు, మహారాష్ట్ర మరియు హర్యానా రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలోని తయారీ రంగంలో ఆవిష్కరణల స్థాయిపై జరిగిన ఈ సర్వేను భారత సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం మరియు యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా నిర్వహించాయి.
ఈ నివేదిక 28 రాష్ట్రాలు మరియు ఆరు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 8,000 సంస్థలను సర్వే చేసింది. ఈ నివేదిక ప్రకారం బీహార్, అస్సాం మినహాయించి మిగిలిన అన్ని ఈశాన్య రాష్ట్రాలు దిగువ వరుసలో ఉన్నాయి. కొండ ప్రాంత రాష్ట్రాలలో ఉత్తరాఖండ్ అత్యున్నత స్థానంలో ఉండగా, దాద్రా & నగర్ హవేలీ మరియు డామన్ & డయ్యూలు యుటిలలో అగ్రస్థానంలో నిలిచాయి. జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లు తక్కువ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి.
అత్యధిక ఇన్నోవేషన్ సంస్థలను కల్గిన రాష్ట్రంగా తెలంగాణ
దేశంలో తయారీ రంగంలో ఆవిష్కరణల స్థాయిపై భారత సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం మరియు యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో అత్యధిక ఇన్నోవేషన్ సంస్థలను కల్గిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. మొత్తం ఉత్పత్తుల పరంగా కర్ణాటక అగ్రస్థానంలో నిలిచినప్పటికీ ఇన్నోవేషన్ సంస్థల వాటాలో తెలంగాణ 46.18 శాతంతో టాప్‌లో నిలిచింది.
ఈ జాబితాలో 39.10 శాతంతో కర్ణాటక రెండవ స్థానంలో ఉండగా, 31.90 శాతంతో తమిళనాడు మూడవ స్థానం దక్కించుకుంది. ఇదిలా ఉండగా, ఒడిశా, బీహార్ మరియు జార్ఖండ్‌లు వినూత్న సంస్థలలో అతి తక్కువ వాటాను కలిగి ఉన్నాయి. అవి వరుసగా 12.78 శాతం, 13.47 శాతం మరియు 13.71 శాతంగా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణతో సరిహద్దును పంచుకున్నప్పటికీ, ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ తెలంగాణ పరిధిలో ఉండిపోవడంతో ఏపీ ఈ ర్యాంకింగులో దిగువ వరుసలో నిలిచింది.
ఓవర్సీస్ విస్తరణ దిశగా ఎన్‌టిపీసీ
భారత ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయినా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, దేశం బయట నుండి మొదటి ఉత్పత్తి ప్లాంటును జోడించింది. ఇటీవలే బంగ్లాదేశ్‌లోని రాంపాల్, మోంగ్లా, బాగర్‌హాట్‌లో ఉన్న 1320 మెగావాట్ల మైత్రీ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ (MSTPP) యొక్క 660 మెగావాట్ల సామర్థ్యం గల యూనిట్-1ని భారత దేశానికి అనుసంధానం చేసింది. దీనితో బంగ్లాదేశ్ నుండి త్వరలో ఇండియాకు 660 మెగావాట్ల వరకు విద్యుత్ సరఫరా కానుంది.
ఎన్‌టిపీసీ లిమిటెడ్ యొక్క విదేశీ జాయింట్ వెంచర్ కంపెనీ అయిన బంగ్లాదేశ్-ఇండియా ఫ్రెండ్‌షిప్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (BIFPCL) సహకారంతో ఈ ప్రాజెక్ట్ అమలు చేయబడుతుంది. దీనితో ఎన్‌టిపీసీ యొక్క స్థాపిత సామర్థ్యం 72304 మెగావాట్లకి చేరుకోనుంది. ప్రస్తుతం ఎన్‌టిపీసీ 9 బొగ్గు ఆధారిత, 4 గ్యాస్ ఆధారిత, 8 జల ఆధారిత మరియు 5 పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను కలిగి ఉంది.
హిమాచల్ మహిళల నెలవారీ ప్రోత్సాహక పథకానికి ఆమోదం
ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సుఖు నేతృత్వంలోని హిమాచల్ ప్రదేశ్ క్యాబినెట్ స్పితి వ్యాలీలోని మహిళలకు నెలవారీ ప్రోత్సాహక పథకానికి ఆమోదం తెలిపింది. ఈ కొత్త పథకం కింద స్పితి వ్యాలీలోని 18 మరియు 45 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు 1,500 నెలవారీ ప్రోత్సాహకాన్ని అందిస్తారు. ఈ పథకాన్ని ఇందిరా గాంధీ మహిళా సమ్మాన్ నిధి ద్వారా అమలు చేయనున్నారు. ఈ పథకాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 15 న హిమాచల్ అవతరణ దినోత్సవం రోజున ప్రకటించారు.
తెలంగాణ గీత కార్మికుల కోసం గీత కార్మిక బీమా పథకం
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, తెలంగాణ గీత కార్మికుల కోసం కొత్తగా 'గీత కార్మికుల భీమా' పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ రైతులకు అందిస్తున్న బీమా కార్యక్రమం తరహాలో ఇది రూపొందించబడుతుంది. ఈ పథకం కింద ప్రమాదశాత్తు మరణించిన గీత కార్మికులకు రూ. 5 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించనున్నారు.
వైజాగ్ టెక్ పార్కుకు శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మే 3న వైజాగ్ టెక్ పార్క్‌కు శంకుస్థాపన చేశారు. ఈ టెక్ పార్కు యందు 21,844 కోట్ల వ్యయంతో అదానీ గ్రూప్ కంపెనీ 300 మెగా వాట్ల (MW) డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా 190 ఎకరాల విస్తీర్ణంలో మధురవాడలో 200 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్‌ను, కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల ఐటీ పార్కును ఏర్పాటుకు సిద్దమవుతుంది.
ఈ టెక్ పార్క్ ద్వారా వచ్చే ఏడేళ్లలో దశలవారీగా 39,815 మందికి ప్రత్యక్షంగా, మరో 10,610 మందికి పరోక్షంగా ఉపాధి లభించనున్నట్లు వెల్లడించారు. ఐటీ బిజినెస్ పార్కులు, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు మరియు రిక్రియేషన్ సదుపాయాలు ఈ టెక్ పార్క్‌లో భాగంగా ఉండనున్నాయి. ఇంటర్నెట్ కనెక్టివిటీ పెరగడం ద్వారా ఈ ప్రాంతం యొక్క సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. రాబోయో కాలంలో ఈ టెక్ పార్క్ వైజాగ్‌ను టైర్-1 సిటీగా మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదానీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ అదానీ, కరణ్ అదానీ తదితరులు పాల్గొన్నారు.
ఒలింపిక్ స్వర్ణ పతక విజేత టోరీ బౌవీ మరణించారు
అమెరికన్ స్ప్రింటర్ టోరీ బౌవీ 32 సంవత్సరాల వయస్సులో అనుమానాస్పదంగా మరణించారు. మూడుసార్లు ఒలింపిక్ పతక విజేత మరియు ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయినా టోరీ బౌవీ తన ఇంట్లో శవమై కనిపించిందని ఫ్లోరిడా పోలీసులు తెలిపారు.
టోరీ బౌవీ రియో ఒలింపిక్ 200 మీటర్ల యందు కాంస్యం మరియు 4x100 మీటర్ల రిలేలో స్వర్ణం పథకం గెలుచుకున్నారు. ఆగస్ట్ 2017, లండన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల ఫైనల్‌లో బంగారు పతకాన్ని సాధించారు.
సామాజిక కార్యకర్తలకు అత్యంత ప్రమాదకరమైన దేశల జాబితాలో భారత్
యూకేకి చెందిన బిజినెస్ & హ్యూమన్ రైట్స్ రిసోర్స్ సెంటర్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2022లో సామాజిక కార్యకర్తలపై నమోదైన 63 దాడులతో అత్యంత ప్రమాదకరమైన దేశాల జాబితాలో బ్రెజిల్ అగ్రస్థానంలో ఉండగా, భారత్ మరియు మెక్సికో వరుసగా 54 మరియు 44 దాడులతో రెండో స్థానంలో ఉన్నాయి.
ఈ నివేదిక కార్పోరేట్ దుర్వినియోగాలకు వ్యతిరేకంగా నిరసనలు చేసే మానవ హక్కులు మరియు కార్మిక కార్యకర్తలు తరచుగా ప్రభుత్వ-మద్దతుగల హింసను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. ఈ జాబితాలో ఉన్న ఇతర దేశాలలో 40 దాడులతో కంబోడియా, 32 దాడులతో ఫిలిప్పీన్స్ మరియు 31 దాడులతో హోండురాస్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
2022లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 550 కంటే ఎక్కువ దాడులు నమోదు అవ్వగా, వాటిలో 75 శాతం భూమి, వాతావరణం లేదా పర్యావరణ హక్కులను రక్షించే కార్యకర్తలకు ముడిపడి ఉన్నట్లు, ఐదవ వంతు దాడులు స్వదేశీ కార్యకర్తలపైనే జరిగినట్లు నివేదించింది.
మొదటి రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ టీకాకు యూఎస్ ఆమోదం
వృద్ధుల శ్వాసకోశ వ్యాధులకు ఉద్దేశించిన ప్రపంచంలోని మొట్టమొదటి రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV) వ్యాక్సిన్‌ను మే 3న యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేన్ ఆమోదించింది. అరెక్స్‌వీ అనే ఈ వ్యాక్సిన్ 60 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల కోసం ఉపయోగించేందుకు ఆమోదం పొందింది. దీనిని గ్లాక్సో స్మిత్‌క్లైన్ అనే ఫార్మా కంపెనీ అభివృద్ధి చేసింది.
యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ యేటా లక్షకు పైగా వృద్ధులపై ప్రభావం చూపడంతో పాటుగా వేల సంఖ్యలో వారి మరణాలకు కారణం అవుతుంది. ఇది సాధారణంగా తేలికపాటి జ్వరం, జలుబు వంటి లక్షణాలనే కలిగిస్తుంది, కానీ బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది.
ప్రపంచ బ్యాంకు తదుపరి అధ్యక్షుడిగా అజయ్ బంగా
భారత సంతతికి చెందిన అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్ తదుపరి అధ్యక్షుడిగా నియమించబడ్డారు. ప్రపంచ బ్యాంకు యొక్క 25 మంది సభ్యుల ఎగ్జిక్యూటివ్ బోర్డు ప్రపంచ బ్యాంకు 14వ అధ్యక్షుడిగా ఆయన ఎన్నికను ధ్రువీకరించింది. ఇది వరకు మాస్టర్‌కార్డ్ యొక్క సీఈఓగా పనిచేసిన అజయ్ బంగా, ఈ ఏడాది జూన్ 2 నుండి వచ్చే ఐదేళ్ల కాలానికి ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడుగా ఉన్న అమెరికన్ ఆర్థిక విశ్లేషకుడు డేవిడ్ రాబర్ట్ మాల్పాస్ త్వరలో పదవీ విరమణ పొందున్నారు. ప్రపంచ బ్యాంక్ అనేది ఒక అంతర్జాతీయ ఆర్థిక సంస్థ. ఇది మూలధన ప్రాజెక్టులను కొనసాగించే ఉద్దేశ్యంతో తక్కువ మరియు మధ్య-ఆదాయ దేశాల ప్రభుత్వాలకు రుణాలు మరియు గ్రాంట్‌లను అందిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా పేదరికంపై పోరాడే ఏకైక ప్రపంచ భాగస్వామ్యం. దీనిని 1944లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీలో ఉంది.
యూజీసీ ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ కోసం సియూ చయాన్ పోర్టల్ ప్రారంభం
సెంట్రల్ యూనివర్శిటీలలో ఫ్యాకల్టీల రిక్రూట్‌మెంట్ కోసం యూజీసీ ప్రత్యేకంగా రూపొందించబడిన ఏకీకృత రిక్రూట్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ 'సియూ చయాన్ పోర్టల్' ప్రారంభించింది. దరఖాస్తుదారుల ప్రయోజనం కోసం అన్ని సెంట్రల్ యూనివర్సిటీల ఉద్యోగ ఖాళీల వివరాలు మరియు నియామక ప్రక్రియను ఒకే వేదిక ద్వారా నిర్వహిచేందుకు దీనిని రూపొందించారు. సియూలు తమ సిబ్బంది రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో స్వయంప్రతిపత్తిని కలిగి ఉంటాయి.
మైఖేల్ డగ్లస్‌కు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గౌరవ పామ్ డి ఓర్‌తో సత్కారం
ప్రముఖ హాలీవుడ్ స్టార్ మైఖేల్ డగ్లస్‌ను 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గౌరవ పామ్ డి ఓర్‌తో సత్కరిస్తారు. మైఖేల్ డగ్లస్ యొక్క అద్భుతమైన కెరీర్‌కు గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందించారు. పామ్ డి ఓర్ అనేది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అత్యున్నత బహుమతిగా పరిగణించబడుతుంది. దీనిని 1955 నుండి అందిస్తున్నారు.
మైఖేల్ డగ్లస్ ఇప్పటి వరకు రెండు అకాడమీ అవార్డులు, ఐదు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డు, సెసిల్ బి. డిమిల్లే అవార్డు మరియు ఎఎఫ్ఐ లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సహా అనేక ప్రశంసలను అందుకున్నారు.
ఎంపీ టైగర్ రిజర్వ్‌లో 2000 ఏళ్ల నాటి మానవ నిర్మిత జలవనరులు
పురావస్తు శాస్త్రవేత్తలు 1,500 ఏళ్ల నాటి రాక్ పెయింటింగ్ మరియు అనేక 1,800-2,000 సంవత్సరాల పురాతన మానవ నిర్మిత జలవనరులను మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌ఘర్ నేషనల్ పార్క్ లోపల కనుగొన్నారు. భారీ ఎత్తులో నిర్మించబడిన ఈ నీటి వనరులు వర్షపునీటిని సేకరించేందుకు ఉపయోగించే వాటర్‌బాడీస్ ఉనికిని సూచిస్తున్నాయిని వెల్లడించించారు. గత ఏడాది ఇదే ప్రాంతంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన సర్వేలో 26 బౌద్ధ గుహలు బయటపడ్డాయి. ఈ గుహలు క్రీస్తుపూర్వం 2వ-5వ శతాబ్దానికి చెందినవని గుర్తించారు.
ఢిల్లీలో రివర్-సిటీస్ అలయన్స్ గ్లోబల్ సెమినార్
మే 4న ఢిల్లీలో రివర్-సిటీస్ అలయన్స్ గ్లోబల్ సెమినార్ నిర్వహబడింది. ఈ సమావేశాన్ని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్‌తో కలిసి ఉమ్మడిగా నిర్వహించాయి. పార్ట్‌నర్‌షిప్ ఫర్ బిల్డింగ్ ఇంటర్నేషనల్ రివర్-సెన్సిటివ్ సిటీస్ ధీమ్‌తో నిర్వహించిన కార్యక్రమం ప్రధానంగా పట్టణ నదీ వ్యవస్థల అభివృద్ధి సంబంధిత అంశాలపై దృష్టి సారించింది. ఈ సమావేశంలో నదీ నగరాల రాయబార కార్యాలయాలు/హైకమీషన్‌లు పాల్గున్నాయి.
జీ20 టెక్‌స్ప్రింట్ 4వ ఎడిషన్ ప్రారంభం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మరియు బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బిఐఎస్)లు సంయుక్తంగా జీ20 టెక్‌స్ప్రింట్ యొక్క నాల్గవ ఎడిషన్‌ను ప్రకటించాయి. 2023 ఏడాదికి సంబందించిన టెక్‌స్ప్రింట్ సరిహద్దు చెల్లింపుల కోసం వినూత్న సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించనుంది. దీనికి సంబంధించి ఈ ఏడాది జూన్ 4 వరకు దరఖాస్తు చేసుకున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్‌లు ఈ సాంకేతిక అభివృద్ధిలో పోటీ పడతారు.
ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో జరిగే తుది ఈవెంట్‌లో ఫలితాలు ప్రకటించబడతాయి. షార్ట్‌లిస్ట్ చేయబడిన బృందాలు ఆరు వారాల వ్యవధిలో వారి పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఆహ్వానించబడతాయి. ప్రతి బృందం ఎనిమిది లక్షల రూపాయల స్టైఫండ్ అందిస్తారు. విజేత బృందానికి 40 లక్షల వరకు ప్రైజ్ మనీ అందిస్తారు. జీ20 టెక్‌స్ప్రింట్ ఇనిషియేటివ్ అనేది నిర్దిష్ట పరిశ్రమ సాంకేతిక సవాళ్లను పరిష్కరించడానికి ఉద్దేశించబడిన ఇన్నోవేషన్ హబ్.
24వ జాతీయ యూత్ పార్లమెంట్ పోటీ విజేతలు
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జవహర్ నవోదయ విద్యాలయాలకు సంబందించిన 24వ జాతీయ పార్లమెంట్ పోటీల బహుమతి పంపిణీ కార్యక్రమాన్ని మే 4న న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో నిర్వహించింది. ఈ పోటీలో పశ్చిమ బెంగాల్ జవహర్ నవోదయ విద్యాలయ (నదియా) మొదటి బహుమతిని దక్కించుకుంది. దీనితో పాటుగా మరో 7 ప్రాంతీయ విజేతలు కూడా బహుమతులు అందుకున్నారు.
- జవహర్ నవోదయ విద్యాలయ, పూరి, ఒడిశా (భోపాల్)
- జవహర్ నవోదయ విద్యాలయ, చంద్రపూర్, మహారాష్ట్ర (పుణె)
- జవహర్ నవోదయ విద్యాలయ, మాండ్య, కర్ణాటక (హైదరాబాద్)
- జవహర్ నవోదయ విద్యాలయ, కథువా, జమ్ము & కాశ్మీర్
- జవహర్ నవోదయ విద్యాలయ, మేఘాలయ (షిల్లాంగ్)
- జవహర్ నవోదయ విద్యాలయ, కురుక్షేత్ర, హర్యానా (జైపూర్)
- జవహర్ నవోదయ విద్యాలయ, సహరన్‌పూర్ (లక్నో)
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత 26 సంవత్సరాలుగా జవహర్ నవోదయ విద్యాలయాల్లో యూత్ పార్లమెంట్ పోటీలను నిర్వహిస్తోంది. యువ తరాలలో స్వీయ-క్రమశిక్షణ, సహనం, అభిప్రాయాల వ్యక్తీకరణ మరియు ప్రజాస్వామ్య జీవన విధానానికి సంబంధించిన ఇతర సద్గుణాలను పెంపొందించడం యూత్ పార్లమెంట్ పథకం లక్ష్యం. ఈ పోటీల ద్వారా విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మరియు పబ్లిక్ స్పీకింగ్ నైపుణ్యాలను పెంపొందిస్తారు.
వలస పక్షుల రక్షణ కోసం మధ్య ఆసియా దేశాలు ఉమ్మడి వేదిక
సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే (సీఎఎఫ్) పరిధిలోని దేశాలు వలస పక్షులు మరియు వాటి ఆవాసాల కోసం పరిరక్షణ ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఒక ఉమ్మడి ప్రయత్నంతో ముందుకొచ్చాయి. వీరికి పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం/ కన్వెన్షన్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేషన్ స్పెసిస్ ఆఫ్ వైల్డ్ యానిమల్ (UNEP/CMS) సహకారం అందిస్తున్నాయి.
న్యూఢిల్లీలో మే 2 నుండి 4 వరకు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే ప్రారంభించారు. ఈ సమావేశానికి ఆర్మేనియా, బంగ్లాదేశ్, కజకిస్తాన్, కిర్గిజ్‌స్థాన్ కువైట్, మంగోలియా, ఒమన్, సౌదీ అరేబియా, తజికిస్థాన్ మరియు ఉజ్బెకిస్తాన్‌తో సహా సీఎఎఫ్ పరిధిలోని పదకొండు దేశాలు హాజరయ్యాయి.
దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా
మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, దేశవ్యాప్తంగా 200 జిల్లాల్లో మే 8, 2023 న ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళాని నిర్వహించింది. ఇది వివిధ పరిశ్రమలు మరియు రంగాలలో అప్రెంటిస్‌లకు ఉద్యోగ శిక్షణను అందించడానికి రూపొందించబడింది. ఈ కార్యక్రమం నూతన అప్రెంటిస్‌లకు మరియు వారికీ శిక్షణ అందించే సంస్థలకు ఉమ్మడి వేదికను అందిస్తుంది.
ఈ మేళాలో పాల్గొన్న అభ్యర్థులకు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ నుండి గుర్తింపు పొందిన ధృవపత్రాలను అందించడంతో పాటుగా స్థానిక సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. నైపుణ్యం/అప్‌స్కిల్‌ను కోరుకునే వారికి ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది.
వన్డేల్లో అత్యంత వేగంగా 5,000 పరుగులు చేసిన ఆటగాడిగా బాబర్ అజామ్
వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 5000 పరుగులు చేసిన ఆటగాడిగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం సరికొత్త రికార్డు సృష్టించాడు. బాబర్ కేవలం 97 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను సాధించాడు. దీనితో గతంలో 101 ఇన్నింగ్స్‌లలో 5000 పరుగుల మార్క్‌ను చేరుకున్న దక్షిణాఫ్రికాకు చెందిన హషీమ్ ఆమ్లా రికార్డు తుడిచి పెట్టుకుపోయింది. బాబర్ ఆజం ప్రస్తుతం ఐసీసీ ఒన్డే ర్యాంకింగులో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు.
దోహా డైమండ్ లీగ్ టైటిల్ విజేతగా నీరజ్ చోప్రా
డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా దోహాలో జరిగిన డైమండ్ లీగ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. మే 5న దోహాలో జరిగిన డైమండ్ లీగ్ జావెలిన్ ఈవెంట్‌లో 88.67 మీటర్ల త్రోతో విజేతగా నిలిచాడు. నీరజ్ చోప్రా తన కెరీర్‌లో డైమండ్ లీగ్ టైటిల్ గెలవడం ఇది రెండోసారి.
ఇలా ఉండగా టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతక విజేత అయిన చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వడ్లెజ్చ్ 88.63 మీటర్ల త్రోతో రెండవ స్థానంలో, గ్రెనడాకు చెందిన ప్రస్తుత ప్రపంచ జావెలిన్ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ 85.88తో మూడో స్థానంలో నిలిచారు.
భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య 10వ ల్యాండ్‌పోర్ట్ ప్రారంభం
భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య 10వ ల్యాండ్‌పోర్ట్‌ను మేఘాలయలోని డాకిలో ఆ రాష్ట్ర హోం వ్యవహారాల రాష్ట్ర మంత్రి నిత్యానంద రాయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మ, ల్యాండ్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆదిత్య మిశ్రా, బంగ్లాదేశ్ ల్యాండ్‌పోర్ట్ అథారిటీ చైర్మన్ మహ్మద్ అలంగీర్ కూడా పాల్గొన్నారు.
మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు 84 కిలోమీటర్ల దూరంలో డావ్కీ ల్యాండ్‌పోర్ట్ ఉంది. ఇది బంగ్లాదేశ్ యొక్క సిల్హెట్ జిల్లాలో తమబిల్‌తో కలుపుతుంది. దాకీ ల్యాండ్‌పోర్ట్ భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య ముఖ్యమైన ఆర్థిక మరియు రవాణా కేంద్రంగా ఉపయోగపడుతుంది. భారతదేశం వైపున ల్యాండ్‌పోర్ట్ తెరవడం వల్ల రెండు దేశాల సరిహద్దుల గుండా ప్రజలు మరియు వస్తువుల అక్రమ రాకపోకలు గణనీయంగా తగ్గనున్నాయి.
ల్యాండ్ పోర్ట్ అనేది జాతీయ, రాష్ట్ర రహదారులు మరియు అంతర్జాతీయ సరిహద్దుల్లో ఏర్పాటు చేసే చెక్ ఇన్ ప్రాంతాలు. ఇవి కస్టమ్స్ చట్టం, 1962 లేదా విదేశీయుల చట్టం, 1946 ప్రకారం ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ లేదా ఇమ్మిగ్రేషన్ చెక్-పోస్ట్‌లుగా పరిగణించబడతాయి. ఇవి అక్రమ వాణిజ్య, మారక ద్రవ్యాలు మరియు మానవ రవాణాను నియంత్రిస్తాయి.
మయన్మార్‌లోని సిట్వే పోర్ట్‌లో మొదటి భారత కార్గో షిప్
ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ నెల 9వ తేదీన మయన్మార్‌లోని సిట్వే పోర్ట్‌లో మొదటి భారతీయ కార్గో షిప్‌ను స్వీకరించారు. కలదాన్ మల్టీమోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ సిట్వే పోర్టును అభివృద్ధి చేశారు. సిట్వే పోర్ట్ ద్వారా ఇండియాకు సౌత్ ఈస్ట్ ఆసియాతో జల వాణిజ్య కనెక్టివిటీకి అవకాశం లభిస్తుంది.
కలదాన్ మల్టీమోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్ట్ అనేది మయన్మార్‌లోని సిట్వే ఓడరేవును మిజోరంతో కలుపుతూ కలదాన్ నదిపై నిర్మిస్తున్న మల్టీమోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ నిర్మాణం. భారతదేశం మరియు మయన్మార్ మధ్య ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం ప్రకారం ఈ నౌకాశ్రయం అభివృద్ధి చేయబడింది. ఈ మార్గం మొత్తం బంగాళాఖాతం ద్వీపకల్పానికి ఆర్థిక వాణిజ్యాన్ని అన్‌లాక్ చేసే అవకాశం ఇస్తుంది.
ఉత్తరాఖండ్‌లో రెండు రోజుల 'యూత్-20 కన్సల్టేషన్ ప్రోగ్రామ్
భారత జీ20 అధ్యక్షతన ఉత్తరాఖండ్‌లో రెండు రోజుల 'యూత్-20 కన్సల్టేషన్ ప్రోగ్రామ్ నిర్వహించబడింది. రిషికేశ్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ 5,మే 6 తేదీలలో సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని హెల్త్, పిట్‌నెస్ అండ్ స్పోర్ట్స్ అనే థీమ్‌తో నిర్వహించారు.
ఈ సందర్భంగా సదస్సులో యువత ఆరోగ్యం, దేహదారుఢ్యం, క్రీడలపై ప్రతినిధులు చర్చించారు. భారతదేశం మరియు విదేశాల నుండి దాదాపు 250 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సును ఉత్తరాఖండ్ క్రీడలు, మహిళా సాధికారత శాఖ మంత్రి రేఖా ఆర్య ప్రారంభించారు.
తెలంగాణాలో సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ రీసెర్చ్ ప్రారంభం
తెలంగాణలోని కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (కిట్స్) వరంగల్ క్యాంపస్‌లో సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ రీసెర్చ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (సి-ఐ2 ఆర్‌ఇ)ని మే 6న ఐటి మంత్రి కె తారక రామారావు ప్రారంభించారు. విద్యార్థులు, అధ్యాపకులు, యువ పరిశోధకుల్లో పరిశోధనలు, వినూత్న నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. దీనికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం ఐదు కోట్ల బడ్జెట్ కేటాయించారు.
కేకే శైలజ ఆత్మకథ 'మై లైఫ్ యాజ్ ఎ కామ్రేడ్' విడుదల
కేరళ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ యొక్క ఆత్మకథ మై లైఫ్ యాజ్ ఎ కామ్రేడ్ పుస్తకం విడుదల అయ్యింది. ఈ ఆత్మకతను ఆమె కొచ్చి బినాలే ఫౌండేషన్ మాజీ సీఈఓ మరియు జర్నలిస్టు అయిన మంజు సారా రాజన్ సహాయంతో కలిసి రాశారు. ఈ పుస్తకం ఢిల్లీకి చెందిన జగ్గర్నాట్ బుక్స్ ద్వారా ప్రచురించబడుతుంది.
ఈ ఆత్మకత కేరళ కమ్యూనిస్ట్ రాజకీయ చరిత్రతో లోతుగా పెనవేసుకున్న ఆమె వ్యక్తిగత అనుభవాలు మరియు కోవిడ్ సమయంలో ఆరోగ్య మంత్రిగా తన పరిపాలన దక్షత సంబంధిత అంశాలతో రూపొందించబడింది. శైలజ మట్టనూర్ నియోజకవర్గం నుండి కేరళ శాసనసభ సభ్యురాలు ఉన్నారు.
భారత యాపిల్స్ దిగుమతి పాలసీలో సవరణ
కిలో 50 రూపాయల కంటే తక్కువ ధర కలిగిన యాపిల్స్ దిగుమతిని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కిలో 50 కంటే ఎక్కువ ధర ఉన్న ఆపిల్‌లకు దిగుమతి విధానం "ఉచితం"గా కొనసాగుతున్నట్లు పేర్కొంది.
యాపిల్ దిగుమతి విధానంలో సవరణలు భారతదేశ పొరుగున ఉన్న భూటాన్‌కు వర్తించవని వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో తెలిపింది. అయితే ఆపిల్ దిగుమతి విధానంలో ఈ సవరణకు సంబంధించి ఎటువంటి కారణాన్ని పేర్కొనలేదు.
భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య కొత్త బోర్డర్ హాత్ ప్రారంభం
భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య కొత్త బోర్డర్-హాట్, మేఘాలయలోని భోలాగంజ్‌లో ప్రారంభించబడింది. దీనిని మే 6న బంగ్లాదేశ్ విదేశీ ఉపాధి శాఖ మంత్రి ఇమ్రాన్ అహ్మద్ మరియు భారత అసిస్టెంట్ హైకమిషనర్ నీరాజ్ కుమార్ జైస్వాల్ సంయుక్తంగా ప్రారంభించారు. ఇది బుధవారాలు మరియు శనివారాల్లో ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు పని చేస్తుంది.
భోలాగంజ్ బోర్డర్ హాట్‌లో భారతదేశం నుండి 26 స్టాల్స్ మరియు బంగ్లాదేశ్ నుండి 24 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ రెండు దేశాల నుండి సాంప్రదాయ వస్తువులు కస్టమ్ డ్యూటీ ఫ్రీగా విక్రయించబడతాయి. భోలాగంజ్ ఉన్న సిల్హెట్ జిల్లా డివిజన్‌లో ఇది నాల్గవ బోర్డర్ హాట్. మొదటి బోర్డర్ హాత్ 2011లో మేఘాలయలోని వెస్ట్ గారో హిల్స్ జిల్లాలో మరియు బంగ్లాదేశ్‌లోని కలైచర్ మరియు కురిగ్రామ్‌ల మధ్య ప్రారంభించబడింది.
బోర్డర్ హాత్ అనేవి భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య జీరో లైన్ పరిధిలో ఉండే ప్రత్యేక మార్కెట్ ప్రదేశాలు. ఇక్కడ సమీపంలోని ప్రాంతంలోని భారతీయ మరియు బంగ్లాదేశ్ పౌరులు, ఇరు దేశాల వర్తకులు అమ్మే వస్తువులను కొనుక్కోవచ్చు.
బంగ్లాదేశ్-మయన్మార్ తీరాన్ని తాకిన మోచా తుపాను
ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడ్డ అత్యంత తీవ్రమైన సైక్లోనిక్ తుఫాను మే 14వ తేదీన బంగ్లాదేశ్-మయన్మార్ తీరాల్ని తాకింది. ఇది గంటకు 280 కిలోమీటర్ల గాలుల వేగంతో కేటగిరీ 5 తుపానుగా నమోదు కాబడింది.
ఈ తుపాన్ కారణంగా దాదాపు 400లకు పైగా,మరణాలు సంభవించినట్లు మయన్మార్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మోచా లేదా మోఖా అనే ఈ పేరును యెమెన్ ప్రభుత్వం ద్వారా సూచించబడింది. ఇది కాఫీ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన ఒక ఎర్ర సముద్రపు ఓడరేవు నగరం పేరు.