తెలుగులో కరెంట్ అఫైర్స్ 22 మే 2023 ఉచితంగా పొందండి. యూపీఎస్‌సీ, ఎస్ఎస్‌సీ, ఏపీపీఎస్‌సీ, టీఎస్‌పీఎస్‌సీ, రైల్వే, బ్యాంకింగ్, డిఫెన్స్, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ వంటి వివిధ నియామక పరీక్షలకు సిద్దమౌతున్న ఔత్సాహికుల కోసం ప్రత్యేకంగా పోటీ పరీక్షల దృక్కోణంలో అందిస్తున్నాం.
ట్విట్టర్ కొత్త సీఈఓగా లిండా యాకారినో
ప్రముఖ మీడియా ఎగ్జిక్యూటివ్ లిండా యాకారినో ట్విట్టర్ యొక్క కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా నియమింపబడ్డారు. లిండా యాకారినో ఇదివరకు ఎన్‌బిసి యూనివర్సల్ యొక్క గ్లోబల్ అడ్వర్టైజింగ్ హెడ్‌గా పనిచేసారు. ఈమె ట్విట్టర్ యొక్క ఉత్పత్తి రూపకల్పన మరియు కొత్త సాంకేతికత ఉత్పత్తుల అభివృద్ధికి బాధ్యత వహిస్తారు.
అమెరికన్ సోషల్ మీడియా కంపెనీ అయినా ట్విట్టరును గత ఏడాది అక్టోబర్ 27 న ఎలోన్ మస్క్ చేజెక్కించుకున్నాక, అప్పటి ట్విట్టర్ సీఈఓగా ఉన్న పరాగ్ అగర్వాల్ తోపాటుగా మొత్తం పాలక వర్గం వేటుకు గురయ్యింది. ఈ బాధ్యతలను ఎలోన్ మస్క్ తీసుకున్నారు. ఇటీవలే ట్విట్టర్ సీఈఓ బాధ్యతల నుండి తప్పుకోనున్నట్లు ప్రకటించిన ఎలోన్ మస్క్, ఆయన స్థానంలో నూతన బాసును నియమించారు.
ముంబైలో 3వ ఎనర్జీ ట్రాన్సిషన్స్ వర్కింగ్ గ్రూప్ సమావేశం
భారతదేశం యొక్క జీ20 ప్రెసిడెన్సీలో 3వ ఎనర్జీ ట్రాన్సిషన్స్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్, మే 15-17 తేదీలలో ముంబైలో నిర్వహించబడింది. 2070 నాటికి కర్బన ఉద్గారాలను సున్నాకి తగ్గించాలనే భారత్ లక్ష్యానికి అనుగుణంగా శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలపై ఈ సమావేశంలో చర్చలు నిర్వహించారు.
ఈ మూడు రోజుల సమావేశంకు జీ20 సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాలు మరియు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ , వరల్డ్ బ్యాంక్ మరియు వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్ ఇండియా వంటి అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయి.
సీబీఐ కొత్త డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్
సీబీఐ కొత్త డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌సూద్ బాధ్యతలు స్వీకరించారు. వచ్చే రెండేళ్ల కాలానికి ఆయన ఈ హోదాలో ఉండనున్నారు. ప్రవీణ్‌సూద్ దీనికి ముందు కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుత సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ స్థానంలో ఆయన త్వరలో ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది భారతదేశంలోని ప్రధాన దర్యాప్తు సంస్థ. ఇది పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. దీనిని 1 ఏప్రిల్ 1963లో అవినీతి కేసులను డీల్ చేసే లక్ష్యంతో ఏర్పాటు చేసారు. ప్రస్తుతం ఇది భారత ప్రభుత్వం యొక్క ఆదేశంతో అన్ని రకాల కేసులను దర్యాప్తు చేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది.
ఒడిశాలో రెండవ జీ20 కల్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశం
భారత్ జీ20 అధ్యక్షతన రెండవ జీ20 కల్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశం, మే 17-17 తేదీలలో ఒడిశాలోని భువనేశ్వర్‌లో నిర్వహించబడింది. ఈ సమావేశం మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో జరిగిన 1వ జీ20 కల్చర్ వర్కింగ్ గ్రూప్ సదస్సుకు కొనసాగింపుగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సాంస్కృతిక, పర్యాటక మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సదస్సు 'సంస్కృతి అందరినీ ఏకం చేస్తుంది (కల్చర్ యూనిటెస్ ఆల్)' అనే థీమ్‌తో నిర్వహించారు. ఈ సదస్సు భారతీయ సంస్కృతిక అంశాలకు సంబంధించి 4 కీలక ప్రాధాన్యతా రంగాలపై దృష్టి సారించింది. అందులో సాంస్కృతిక ఆస్తుల రక్షణ మరియు పునరుద్ధరణ, స్థిరమైన భవిష్యత్తు కోసం జీవన వారసత్వాన్ని ఉపయోగించడం, సాంస్కృతిక మరియు సృజనాత్మక పరిశ్రమలను ప్రోత్సహించడం, మరియు సంస్కృతి యొక్క రక్షణ మరియు ప్రమోషన్ కోసం డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించడం వంటివి ఉన్నాయి.
2వ జీ20 కల్చర్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్‌లో భాగంగా, భువనేశ్వర్‌లోని కళా భూమి - ఒడిశా క్రాఫ్ట్స్ మ్యూజియంలో 'సస్టెన్: ది క్రాఫ్ట్ ఇడియమ్ ' పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహించబడింది. ఈ ప్రదర్శనను మే 15 న ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ నవీన్ పట్నాయక్ ప్రారంభించరు. ఇది పై వివరించిన రెండవ ప్రాధాన్యతపై దృష్టి సారిస్తుంది.
లడఖ్ వార్షిక పండుగ 'మోన్లామ్ చెన్మో'
లడఖ్‌లో నిర్వహించే వార్షిక పండుగ 'మోన్లామ్ చెన్మో' మే 11 నుండి ఐదు రోజులు పాటు నిర్వహించారు. ఇది ప్రపంచ శాంతి మరియు సంతోషం కోసం బౌద్ధ సన్యాసులు చేసే సామూహిక ప్రార్థన ఉత్సవం. కోవిడ్ కారణంగా గత మూడేళ్లపాటు నిలిపివేసిన ఈ పండగను ఈ సంవత్సరం పునఃప్రారంభించారు. దీనిని ఆల్ లడఖ్ గొంపా అసోసియేషన్ నిర్వహించింది.
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ దళం ఈ ఐదు రోజుల పాటు నిర్వహించే 'సేవా ఫర్ సంఘా' శిబిరంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. ఈ ఫెస్టివల్ టిబెటన్ చాంద్రమాన క్యాలెండర్ యొక్క మూడవ నెలలో 21 నుండి 25 రోజులలో వస్తుంది మరియు ఇది 1991 నుండి నిర్వహించబడుతోంది.
ఆఫ్ఘనిస్తాన్‌లో ఈ ఏడాది మొదటి పోలియో కేసు
ఆఫ్ఘనిస్తాన్ 2023 ఏడాదికి సంబంధించి మొదటి పోలియోవైరస్ కేసును నివేదించింది. ఆ దేశంలోని ఆరోగ్య అధికారులు మే 13న నంగర్హర్ ప్రావిన్స్‌లోని 4 ఏళ్ల చిన్నారిలో దీనిని గుర్తించారు. ఈ చిన్నారి సంబంధిత వ్యాధి లక్షణాలతో మరణించినట్లు కూడా నివేదించింది.
గత రెండేళ్లుగా తాలిబాన్ నియంత్రణతో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం, పోలియో ఇమ్యునైజేషన్ కవరేజీకి సంబందించి సరైన పనితీరు కనబర్చకపోయావడంతో ఈ కేసులు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్థాన్‌లు మాత్రమే ప్రపంచంలో మిగిలిన రెండు పోలియో సంబంధిత దేశాలుగా ఉన్నాయి.
పోలియో లేదా పోలియోమైలిటిస్ అనేది పోలియోవైరస్ వలెనే వచ్చే వైకల్యం మరియు ప్రాణాంతక వ్యాధి. ఈ వైరస్ వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపిస్తుంది. పోలియో కలుషితమైన నీరు లేదా ఆహారం లేదా సోకిన వ్యక్తి నుండి వ్యాపిస్తుంది. దీనికి రాకుండా ఇమ్యూనైజ్ అవ్వడం మినహా చికిత్స లేదు.
జఖండ్‌లో జనాభా గణనలో భాగంగా ఏనుగుల డిఎన్ఏ ప్రొఫైలింగ్
జార్ఖండ్‌లోని పలమావు టైగర్ రిజర్వ్‌లో జనాభా గణనలో భాగంగా ఏనుగుల డిఎన్ఏ ప్రొఫైలింగ్ ప్రక్రియను ప్రారంభించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. ఈ చొరవ ఏనుగుల శారీరక కణజాల నమూనా నుండి నిర్దిష్ట డిఎన్ఏ నమూనా లేదా ప్రొఫైల్‌ను సేకరించి భద్రపర్చుతారు. ఇది ఒకరకంగా ఏనుగుల ఆధార్ కార్డ్‌గా పనిచేస్తుంది. ఇది జంబో జనాభాను అంచనా వేయడానికి ఉపయోగించే అధునాతన శాస్త్రీయ పద్ధతి.
యూపీఎస్సీ నూతన చైర్మన్‌గా మనోజ్ సోనీ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క నూతన చైర్మన్‌గా ప్రముఖ విద్యావేత్త మనోజ్ సోనీ నియమితులయ్యారు. మనోజ్ సోనీ 2017లో యూపీఎస్సీలో సభ్యునిగా చేరారు. 2022 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 316 (ఎ) ప్రకారం యూపీఎస్సీ చైర్మన్ పదవికి బాధ్యతలు నిర్వర్తించడానికి నియమించబడ్డారు.
మనోజ్ సోనీ యూపీఎస్సీలోకి చేరక ముందు ఇంటర్నేషనల్ రిలేషన్ స్టడీస్‌లో స్పెషలైజేషన్‌తో పాటు పొలిటికల్ సైన్స్‌ను అభ్యసించారు. సర్దార్ పటేల్ విశ్వవిద్యాలయం నుండి అంతర్జాతీయ సిస్టమిక్ ట్రాన్సిషన్ మరియు ఇండో-యుఎస్ రిలేషన్స్"లో డాక్టరేట్ పొందారు. గుజరాత్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీకి రెండు పర్యాయాలు వైస్-ఛాన్సలర్‌గా పని చేసారు. ఈయన స్వతంత్ర భారతదేశంలో అతి పిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలరుగా కూడా గుర్తింపు పొందారు.
మేరీ లైఫ్, మేరా స్వచ్ఛ్ ప్రచార కార్యక్రమం ప్రారంభం
గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ ఎస్ పూరి తన మంత్రిత్వ శాఖ యొక్క మెగా క్యాంపెయిన్ 'మేరీ లైఫ్ , మేరా స్వచ్ఛ్ షెహర్'ను న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ ప్రచార కార్యక్రమం వేస్ట్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి రిడ్యూస్, రీయూజ్ మరియు రీసైకిల్ (ఆర్ఆర్ఆర్) భావనను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడింది.
ఈ దేశవ్యాప్త ప్రచారం కింద, పౌరులు తాము ఉపయోగించి పడేసిన బట్టలు, బూట్లు, పాత పుస్తకాలు, బొమ్మలు మరియు ప్లాస్టిక్‌ను తిరిగి ఉపయోగించుకోవడానికి లేదా రీసైకిల్ చేయడానికి ఇవ్వగలిగే ఆర్ఆర్ఆర్ కేంద్రాలు లేదా వన్-స్టాప్ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి. ఈ ఆర్ఆర్ఆర్ కేంద్రాలు ఈ నెల 20న దేశవ్యాప్తంగా ప్రారంభించబడ్డాయి. సేకరించిన ఈ వస్తువులు వివిధ వాటాదారులకు పునర్వినియోగం కోసం పునరుద్ధరించబడతాయి.
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా రవ్‌నీత్ కౌర్
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నూతన ఛైర్మన్‌గా రవ్‌నీత్ కౌర్ నియమితులయ్యారు. గత ఏడాది ఆక్టోబరులో అశోక్ కుమార్ గుప్తా పదవీ విరమణ చేసినప్పటి నుండి ఈ పోస్టు ఖాళీగా ఉంది. సీసీఐ సభ్యురాలు సంగీత వర్మ గత సంవత్సరం అక్టోబర్ నుండి తాత్కాలిక చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.
రవ్‌నీత్ కౌర్ 1988 పంజాబ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిని, ఆమె ఇదివరకు ఫెయిర్ ట్రేడ్ రెగ్యులేటర్‌కి ఛైర్‌పర్సన్‌గా పనిచేసారు. కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా అనేది కాంపిటీషన్ యాక్ట్, 2002 ను అమలు చేయడానికి బాధ్యత వహించే చట్టబద్ధమైన భారత ప్రభుత్వ సంస్థ. ఇది కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పరిధిలో పనిచేస్తుంది. ఇది దేశంలో కార్పొరేట్ సంస్థల ఆధిపత్య ధోరణిని నియంత్రిస్తుంది. దీనిని 14 అక్టోబర్ 2003 లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది.
37వ జాతీయ క్రీడల్లో గట్కా మార్షల్ ఆర్ట్స్‌కి స్థానం
భారత ఒలింపిక్ సంఘం అధికారికంగా పంజాబ్ యొక్క సాంప్రదాయ యుద్ధ కళ అయినా గట్కా మార్షల్ ఆర్ట్ క్రీడను, ఈ ఏడాది అక్టోబర్‌లో గోవాలో జరిగే 37వ జాతీయ క్రీడల జాబితాలో చేర్చింది. ఈ సాంప్రదాయ యుద్ధ కళకు ప్రాచుర్యం మరియు ప్రోత్సాహం కల్పించే ఉద్దేశ్యంతో దీనిని ప్రవేశపెడుతున్నారు. గట్కా అనేది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రత్యర్థుల మధ్య ప్రామాణిక శైలిలో జరిగే స్టిక్ లేదా నైఫ్ ఫైటింగ్. దీనితో 37వ జాతీయ క్రీడలు 43 రకాల కీడలతో జరగనున్నాయి.
గౌరీ ఖాన్ కొత్త పుస్తకం ' మై లైఫ్ ఇన్ డిజైన్' విడుదల
ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ భార్య అయినా గౌరీ ఖాన్, ' మై లైఫ్ ఇన్ డిజైన్' పేరుతొ కొత్త పుస్తకాన్ని మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ పుస్తకం ఇంటీరియర్ డిజైనర్‌గా గౌరీ యొక్క వృత్తిపరమైన అనుభవాలను మరియు మార్కెట్ సంబంధిత అంశాలకు సంబంధించి వ్రాయబడింది.
గౌరీ 2014 ప్రారంభంలో ముంబైలోని వర్లీలో 'ది డిజైన్ సెల్' అనే పేరుతో తన మొదటి ఇంటీరియర్ డిజైనర్ కాన్సెప్ట్ స్టోర్‌ను ప్రారంభించారు. ఈ పుస్తకాన్ని బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ మే 15న ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు.
ఒక క్యాలెండర్ ఇయర్‌లో అన్ని పార్మట్లలో సెంచరీ చేసిన క్రికెటరుగా శుభ్‌మాన్ గిల్
ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఐపిఎల్‌తో పాటు, అంతర్జాతీయ 3 క్రికెట్ ఫార్మాట్‌లో వంద పరుగులు చేసిన తోలి క్రికెటరుగా శుభ్‌మాన్ గిల్ నిలిచాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2023 యందు హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున గిల్ కేవలం 58 బంతుల్లో 101 పరుగులు చేశాడు.
ఈ ఏడాది మొదటిలో హైదరాబాద్‌లో జరిగిన న్యూజిలాండ్ ఒన్డే సిరీసులో 149 బంతుల్లో 208 పరుగులు నమోదు చేసాడు. ఇదే పర్యటనలో అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌పై తన తొలి టి20ఐ సెంచరీని సాధించాడు. కేవలం 99 బంతుల్లో 126 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఈ ఏడాది ప్రారంభంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గవ టెస్టులో అహ్మదాబాద్‌లోనే తన సొంతగడ్డపై తన మొదటి టెస్ట్ సెంచరీని సాధించాడు. ఆ ఇన్నింగ్స్‌లో అతను 128 పరుగులు నమోదు చేసాడు.
ఇండియా-ఈయూ ట్రేడ్ & టెక్ కౌన్సిల్ మొదటి సమావేశం
మే 16 న బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ఇండియా - ఈయూ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ మొదటి మంత్రివర్గ సమావేశం నిర్వహించబడింది. వ్యూహాత్మక సాంకేతిక ఉత్పత్తులు, డిజిటల్ కనెక్టివిటీ, క్లీన్ ఎనర్జీ, వాణిజ్యం వంటి అంశాలలో సహకారాన్ని పెంపొందించే మార్గాలను చర్చించడానికి ఈ సదస్సును నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర వాణిజ్యం & పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హాజరయ్యారు.
గత ఏడాది ఏప్రిల్‌లో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ భారతదేశ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి ఈ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్‌ను ప్రారంభించారు. కౌన్సిల్ కింద ఇరుపక్షాలు మూడు వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేశాయి. అవి
- వర్కింగ్ గ్రూప్ ఆన్ స్ట్రాటజిక్ టెక్నాలిజీస్, డిజిటల్ గవర్నెన్స్ & డిజిటల్ కనెక్టివిటీ
- వర్కింగ్ గ్రూప్ ఆన్ గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్
- వర్కింగ్ గ్రూప్ ఆన్ ట్రేడ్, ఇన్వెస్ట్‌మెంట్ & రెసిలెంట్ వాల్యూ చెయిన్
ఈ మొదటి మంత్రివర్గ సమావేశం పై మూడు వర్కింగ్ గ్రూపుల క్రింద సహకారం కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది. రాబోయే సంవత్సరంలో జరిగే తదుపరి మంత్రివర్గ సమావేశానికి ముందు ఆశించిన ఫలితాలను సాధించడానికి ఇది దిశానిర్దేశం చేస్తుంది.
వేదాంత చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా సోనాల్ శ్రీవాస్తవ
ప్రముఖ మైనింగ్ మరియు మెటల్స్ కంపెనీ వేదాంత, తన నూతన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా సోనాల్ శ్రీవాస్తవను నియమించింది. ఈమె జూన్ 1 నుండి బాధ్యతలు స్వీకరించనున్నారు. శ్రీవాస్తవకు 26 సంవత్సరాలకు పైగా ఈ రంగంలో నాయకత్వ అనుభవం కలిగి ఉన్నారు.
ఈమె బిఐటి, సింద్రీ నుండి కెమికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని మరియు జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేస్తారు. ఇది వరకు ఆమె అముజా సిమెంట్స్ లిమిటెడ్ యొక్క చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేసారు.
డ్యూరోఫ్లెక్స్ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా విరాట్ కోహ్లీ
డ్యూరోఫ్లెక్స్ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా విరాట్ కోహ్లీని ప్రకటించింది. ఇండియన్ మ్యాట్రెస్ బ్రాండ్ అయినా డ్యూరోఫ్లెక్స్, వారి సుదీర్ఘమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని పెంపొందించడంలో నాణ్యమైన నిద్ర యొక్క ప్రాముఖ్యత నినాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కోహిని ఎంపిక చేసుకుంది.
విరాట్ ప్రస్తుతం గాటోరేడ్ బై పెప్సికో అస్సాం (స్టేట్ బ్రాండ్ అంబాసిడర్), ఫైర్-బోల్ట్, వైజ్, బ్లూ స్ట్రా, వెల్ మ్యాన్, హిమాలయ, మైంత్రా, గూగుల్ డ్యుయో, మొబైల్ ప్రీమియర్ లీగ్, శ్యామ్ స్టెల్, అమేజ్ (ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీస్), హీరో మోటోకాప్, కోగేట్, సన్ ఫార్మా- వోలిని, వ్రాగ్న్, మూవ్ ఎకౌస్టిక్స్, టూ యమ్, టిస్సాట్, ఆడి వంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.
డేటా గవర్నెన్స్ క్వాలిటీ ఇండెక్స్‌లో షిప్పింగ్ మంత్రిత్వ శాఖకు రెండవ స్థానం
ఆర్థిక ఏడాది 23 డిసెంబర్ త్రైమాసికం (క్యూ3)కి సంబంధించిన డేటా గవర్నెన్స్ క్వాలిటీ ఇండెక్స్ (డిజిక్యూఐ) అంచనాలో 66 మంత్రిత్వ శాఖలలో ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ రెండవ స్థానంలో నిలిచింది.
డెవలప్‌మెంట్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీస్, నీతి ఆయోగ్ ద్వారా నిర్వహించబడిన ఈ డేటా గవర్నెన్స్ క్వాలిటీ ఇండెక్స్ సర్వే, ప్రభుత్వ రంగ అడ్మినిస్ట్రేటివ్ డేటా సిస్టమ్‌ల మెచ్యూరిటీ స్థాయిని మరియు కేంద్ర రంగ ప్రాయోజిత పథకాలు అమలుపై వివిధ మంత్రిత్వ శాఖలు మరియు డిపార్ట్‌మెంట్‌ల పనితీరును అంచనా వేస్తుంది.
ఈ నివేదిక ప్రభుత్వ విధానాలు, పథకాలు మరియు కార్యక్రమాల అమలు ఫ్రేమ్‌వర్క్‌ను మెరుగుపరచడానికి సంస్కరణలను గుర్తించడానికి మరియు కావలసిన లక్ష్యాలు సాధించడానికి మంత్రిత్వ శాఖను సన్నద్ధం చేస్తుంది.
హైదరాబాద్‌లో ఇంటిగ్రేటెడ్ బయోలాజికల్ కంట్రోల్ లాబొరేటరీ ప్రారంభం
కేంద్ర వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్లో ఇంటిగ్రేటెడ్ బయోలాజికల్ కంట్రోల్ లాబొరేటరీని ప్రారంభించారు. ఈ కొత్త ఇంటిగ్రేటెడ్ బయో కంట్రోల్ లాబొరేటరీ, ఎంటోమోపాథోజెనిక్ ఫంగైస్, బయో ఫెర్టిలైజర్స్, ఫెరోమోన్ మరియు బొటానికల్స్ వంటి బయోపెస్టిసైడ్స్, ప్రెడేటర్స్ మరియు పారాసిటోయిడ్స్ ఉత్త్పత్తికి సహాయపడుతుంది.
ఈ బయో కంట్రోల్ ఏజెంట్లు, రసాయన పురుగుమందులు మరియు ఎరువుల వాడకాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. తత్ఫలితంగా పర్యావరణం మరియు మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది. దీనితో పాటుగా నేల మరియు మొక్కల ఆరోగ్యం మెరుగుపడటానికి దోహదం చేస్తుంది.
బయో కంట్రోల్ లాబొరేటరీలో వ్యవసాయపరంగా ఉపయోగపడే ముఖ్యమైన కీటకాలు మరియు కలుపు మొక్కల నమూనాలను సంరక్షించడానికి లేదా ప్రత్యక్ష రూపాల్లో ప్రదర్శించడానికి అవసరమయ్యే కీటకాల మ్యూజియం, కలుపు మ్యూజియం, ఎగ్జిబిషన్ హాల్, నేచురల్ ఫార్మింగ్ సెల్ వంటివి కూడా ఉన్నాయి. ఈ సదుపాయం రాబోయే రోజుల్లో భారతదేశంలో రసాయన రహిత సుస్థిర వ్యవసాయం అభివృద్ధిలో కీలక పాత్ర వహించనుంది. వ్యవసాయ మరియు ఉద్యాన పంటలలో తెగుళ్ల నిర్వహణ యొక్క రసాయనేతర ఎంపికలను ఇది ప్రోత్సహిస్తుంది.
దుబాయ్ ఆధారిత బేస్ బాల్ లీగ్‌లో ముంబై కోబ్రాస్
దుబాయ్ ఆధారిత బేస్‌బాల్ యునైటెడ్, ముంబై నుండి మొదటి బేస్ బాల్ జట్టు ఫ్రాంఛైజీని ప్రకటించింది. ముంబై కోబ్రాస్ పేరుతొ వెలిచిన ఈ ఫ్రాంఛైజీ దేశంలో మొదటి ప్రొఫెషనల్ బేస్‌బాల్ జట్టుగా అవతరించింది. దుబాయ్‌కు చెందిన బేస్‌బాల్ యునైటెడ్, మిడిల్ ఈస్ట్ మరియు దక్షిణాసియాలో మొదటి ప్రొఫెషనల్ బేస్ బాల్ లీగ్‌ను ప్రారంభిస్తుంది. దీనికి సంబంధించి ప్రకటించిన నాలుగు జట్లలో ముంబై కోబ్రాస్ మొదటిది.
ముంబై కోబ్రాస్, మరియు మరో మూడు కొత్త ప్రొఫెషనల్ బేస్‌బాల్ ఫ్రాంచైజీలు ఈ ఏడాది నవంబర్‌లో జరిగే బేస్‌బాల్ యునైటెడ్ యొక్క దుబాయ్ షోకేస్‌లో పోటీపడతాయి. దీనితో ముంబై కోబ్రాస్, భారతదేశం మరియు దక్షిణాసియా ప్రాంతం రెండింటిలోనూ ప్రధాన లీగ్‌లలో ఆడే మొదటి బేస్ బాల్ జట్టు ఫ్రాంఛైజీ అవుతుంది. అలానే బేస్‌బాల్ యునైటెడ్ కూడా మిడిల్ ఈస్ట్ మరియు సౌత్ ఆసియాలో మొట్టమొదటి ప్రొఫెషనల్ బేస్ బాల్ లీగుగా మారనుంది.
మిజోరంలో కొత్త ఫ్లయింగ్ గెక్కో జాతులు
ఈశాన్య భారతదేశమైన మిజోరంలో కొత్త ఫ్లయింగ్ గెక్కో జాతులు కనుగొనబడ్డాయి. కొత్త జాతికి మిజోరం రాష్ట్రం పేరు మీద గెక్కో మిజోరామెన్సిస్ అని పేరు పెట్టారు. మిజోరం విశ్వవిద్యాలయం మరియు జర్మనీలోని టుబింజెన్‌లోని మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ బయాలజీ పరిశోధకులు ఇండో-మయన్మార్ సరిహద్దులో వీటిని కనుగొన్నారు.
ఆగ్నేయాసియాలో కనిపించే వీటిని ఫ్లయింగ్ జెక్కోస్, గ్లైడింగ్ జెక్కోస్ లేదా పారాచూట్ గెక్కోస్ అని కూడా పిలుస్తారు. ఇవి రాత్రి సమయంలో మాత్రమే సంచరిస్తాయి. ఆగ్నేయాసియా అంతటా దాదాపు పదమూడు జాతుల ఎగిరే గెక్కోలు కనిపిస్తాయి. మిజోరాం యూనివర్శిటీలో జువాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ హ్మార్ త్లామ్టే లాల్‌రెంసంగా ఈ పరిశోధన బృందానికి నాయకత్వం వహించారు.
భారతదేశం & బంగ్లాదేశ్ '50 స్టార్ట్-అప్స్ ఎక్స్‌చెంజ్ ప్రోగ్రాం
భారతదేశం మరియు బంగ్లాదేశ్ తమ స్టార్టప్ కమ్యూనిటీల మధ్య సహకారం మరియు భాగస్వామ్యాన్ని ప్రారంభించే స్టార్టప్ మార్పిడి కార్యక్రమాన్ని ప్రారంభించాయి. '50 స్టార్ట్-అప్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్' పేరుతొ ప్రారంభమైన ఈ కార్యక్రమం కింద బంగ్లాదేశ్ నుండి 50 స్టార్ట్-అప్‌లు మరియు భారతదేశం నుండి 50 స్టార్టప్‌లు పరస్పరం దేశాల సందర్శన ద్వారా వ్యాపార అనుభవం మరియు జ్ఞానాన్ని పంచుకోనున్నాయి. ఇది యువ వ్యవస్థాపకులకు సహకారాన్ని విస్తరించడం కోసం రూపొందించబడింది.
ఈ ప్రోగ్రాం ప్రధానంగా యువ వ్యవస్థాపకులకు అవసరమయ్యే స్టార్ట్-అప్ మరియు బిజినెస్ మోడల్ క్రియేషన్ ప్రాసెస్, ఇంక్యుబేటర్ పాత్ర, ప్రాజెక్ట్‌లు మరియు సేవల మార్కెటింగ్, సైబర్ సెక్యూరిటీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సహా డేటా రక్షణ, స్టార్ట్-అప్ మూల్యాంకనం మరియు నిధులను పొందే పద్ధతులపై దృష్టి సారిస్తుంది.
ఎవరెస్ట్ శిఖరాన్ని 28వ సారి అధిరోహించిన నేపాలీ షెర్పా
నేపాల్ దేశానికీ చెందిన ప్రముఖ పర్వతారోహకుడు కమీ రీటా షెర్పా 28వ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. ఈ 17న 27వ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన ఆయన, కొద్దీ రోజుల వ్యవధితో రెండో సారి ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకొని 28వ సారి అధిరోహించిన రికార్డును నమోదు చేసాడు.
మరొక అనుభవజ్ఞుడైన షెర్పా గైడ్ పసాంగ్ దావా అతని మునుపటి రికార్డు అయినా 27 సార్లును సమం చేయడంతో అత్యధిక సంఖ్యలో అధిరోహణ రికార్డును తిరిగి పొందేందుకు కొద్దీ రోజుల వ్యవధిలో తిరిగి అధిరోహించాడు. 49 ఏళ్ల కమీ రీటా షెర్పా 2004 లో మొదటిసారి ఈ పర్వతాన్ని అధిరోహించారు.
ఫెడరేషన్ కప్‌లో తజిందర్‌పాల్ టూర్, అన్నూ రాణిలకు బంగార పతకాలు
సీనియర్ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో అన్నూ రాణి మరియు తాజిందర్‌పాల్ టూర్ వారి సంబంధిత ఈవెంట్‌లలో బంగారు పతకాలను గెలుచుకున్నారు. తాజిందర్‌పాల్ షాట్‌పుట్‌లో 20.42 మీటర్ల బెస్ట్ త్రోతో బంగారు పతకాన్ని సాధించగా, ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అన్నూ రాణి జావెలిన్‌ను 59.24 మీటర్ల త్రొతో బంగారు పతకాన్ని దక్కించుకుంది.
పురుషుల 400 మీటర్ల పరుగు పందెంలో తమిళనాడుకు చెందిన రాజేష్ రమేష్ 45.75 సెకన్లతో స్వర్ణం సాధించగా, కేరళకు చెందిన మహ్మద్ అజ్మల్ (45.85) రెండో స్థానంలో నిలిచాడు. ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2023 ని మే 15 నుండి జార్ఖండ్‌లోని రాంచీలో నిర్వహిస్తున్నారు.
మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్‌లో జ్యోతి యర్రాజీ 13.20 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకం గెలుపొందగా, పురుషుల 400 మీటర్ల ఈవెంట్‌లో మహ్మద్ అఫ్సల్ పులిక్కలకత్ 48.43 సెకన్లతో మూడో స్థానంలో నిలిచారు.
ఆసియా పెట్రోకెమికల్ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ 2023కి భారత్ ఆతిథ్యం
ఆసియా పెట్రోకెమికల్ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ 2023కి భారత్ ఆతిథ్యం ఇచ్చింది. మే 18-19 తేదీలలో న్యూఢిల్లీలో జరిగిన ఈ సదస్సు కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించబడింది. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమానికి ఏడు సభ్య దేశాల నుండి 1200 మంది ప్రతినిధులు అలాగే యూరప్, చైనా, అమెరికా, మిడ్ ఈస్ట్ మరియు ఇతర ఆసియా దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సు ప్రధానంగా పెట్రోకెమికల్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం మరియు సుస్థిర ఆర్థిక వృద్ధిపై లోతైన దృష్టి సారించింది.
ఆసియా పెట్రోకెమికల్ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ (APIC) అనేది భారతదేశం, జపాన్, కొరియా, మలేషియా, సింగపూర్, తైవాన్ మరియు థాయిలాండ్ దేశాలతో కూడిన పెట్రోకెమికల్ పరిశ్రమ సమావేశం. ఇది సభ్యదేశాలకు చెందిన వాణిజ్య సంస్థల ఉమ్మడి వేదిక. ఇందులో కింది అసోసియేషన్లు సభ్యులుగా ఉన్నాయి.
- భారతదేశం (CPMA) – కెమికల్స్ మరియు పెట్రోకెమికల్స్ తయారీదారుల సంఘం
- జపాన్ (JPCA) - జపాన్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీ అసోసియేషన్
- కొరియా (KPIA) - కొరియా పెట్రోకెమికల్ ఇండస్ట్రీ అసోసియేషన్
- మలేషియా (MPA) - మలేషియా పెట్రోకెమికల్ అసోసియేషన్
- సింగపూర్ (SCIC) - సింగపూర్ కెమికల్ ఇండస్ట్రీ కౌన్సిల్
- తైవాన్ (PAIT) - పెట్రోకెమికల్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆఫ్ తైవాన్
- థాయిలాండ్ (FTIPC) - పెట్రోకెమికల్ ఇండస్ట్రీ క్లబ్ ది ఫెడరేషన్ ఆఫ్ థాయిలాండ్.
ఇది 40 సంవత్సరాల క్రితం 1979లో జపాన్, కొరియా మరియు తైవాన్‌లచే తూర్పు ఆసియా పెట్రోకెమికల్ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ (EAPIC)గా స్థాపించబడింది, తర్వాత కాలంలో భారతదేశం, మలేషియా, సింగపూర్ మరియు థాయ్‌లాండ్‌లను కలుపుకుని 2000లో ఆసియా పెట్రోకెమికల్ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ (APIC)గా పేరు మార్చబడింది.
12 కోట్ల గ్రామీణ కుటుంబాలకు చేరువైన జల్ జీవన్ మిషన్
జల్ జీవన్ మిషన్ 12 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలకు సురక్షితమైన కుళాయి నీటి కనెక్షన్‌లను అందించడంలో గొప్ప మైలురాయిని సాధించింది. 2024 నాటికి ప్రతి గ్రామీణ ఇంటికీ ఖచ్చితంగా కుళాయి నీటి సరఫరాను అందించాలనే లక్ష్యంతో 2019లో ఈ మిషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
ఈ కార్యక్రమం కింద ఇప్పటి వరకు ఐదు రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు 100 శాతం కవరేజీని పూర్తి చేసినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ జాబితాలో గోవా, తెలంగాణ, హర్యానా, గుజరాత్, పంజాబ్, పుదుచ్చేరి, డామన్ మరియు డయ్యూ మరియు దాద్రా మరియు నగర్ హవేలీ మరియు అండమాన్ మరియు నికోబార్ దీవులు ఉన్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవిశ్రాంత ఉమ్మడి ప్రయత్నాల ఫలితంగా దేశంలోని తొమ్మిది లక్షల పాఠశాలలు, తొమ్మిది లక్షల 39 వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా కుళాయి నీటి సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
సంచార్ సాథి పోర్టల్ ప్రారంభించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అశ్విని వైష్ణవ్, మే 16న న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సంచార్ సాథి పోర్టల్ పేరుతో సిటిజన్ సెంట్రిక్ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ పోర్టల్ కోల్పోయిన మొబైల్ ఫోన్‌లను ట్రాక్ చేయడం మరియు బ్లాక్ చేయడం వంటి అవసరమైన సేవలను అందించడం కోసం ఏర్పాటు చేయబడింది. మొబైల్ ఫోన్లను దుర్వినియోగం చేయడం ద్వారా గుర్తింపు చౌర్యం, నకిలీ కేవైసీ, బ్యాంకింగ్ మోసాలు వంటి పలు మోసాలను నిరోధించేందుకు ఈ పోర్టల్‌ను రూపొందించారు. ఈ వేదిక ద్వారా మూడు రాకాల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు.
- సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) – దొంగిలించబడిన/పోగొట్టుకున్న మొబైల్‌లను ట్రాక్/బ్లాక్ చేయడం కోసం
- మీ మొబైల్ కనెక్షన్ తెలుసుకోండి - మీ పేరుపై నమోదైన మొబైల్ కనెక్షన్‌లను తెలుసుకోవడానికి.
- టెలికాం సిమ్ సబ్‌స్క్రైబర్ వెరిఫికేషన్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & ఫేషియల్ రికగ్నిషన్ పవర్డ్ సొల్యూషన్ - మోసపూరిత చందాదారులను గుర్తించడానికి.
సంచార్ సాథీ పోర్టల్‌ని ఉపయోగించడం ద్వారా ఇప్పటి వరకు 40 లక్షలకు పైగా మోసపూరిత కనెక్షన్‌లు గుర్తించినట్లు మరియు ఇప్పటివరకు 36 లక్షలకు పైగా కనెక్షన్‌లు డిస్‌కనెక్ట్ చేసినట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 117 కోట్ల మంది చందాదారులతో భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద టెలికాం పర్యావరణ వ్యవస్థగా అవతరించినట్లు తెలిపారు. కమ్యూనికేషన్‌తో పాటు, బ్యాంకింగ్, వినోదం, ఇ-లెర్నింగ్, ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వ సేవలను పొందడంలో ఈ మొబైల్ ఫోన్‌లు ప్రజలకు ఉపయోగించబడుతున్నాయి పేర్కొన్నారు.
లిబియా ప్రధాన మంత్రి ఫాతి బషాఘా సస్పెండ్
లిబియా ప్రధాన మంత్రి, ఫాతి బషాఘాను అతని పదవి నుండి సస్పెండ్ చేసినట్లు లిబియా పార్లమెంట్ ప్రకటించింది. అంతేకాకుండా ఆర్థిక మంత్రి ఒసామా హమదాను తాత్కాలిక ప్రభుత్వ ప్రతినిధిగా ఓటు వేసి ఎన్నుకుంది. లిబియా పార్లమెంట్ 2022 ఫిబ్రవరిలో మాజీ అంతర్గత మంత్రి బాషాఘాను తూర్పు ఆధారిత పార్లమెంటుకు కొత్త ప్రధానమంత్రిగా నియమించింది.
అయితే పశ్చిమ ప్రాంతంలో ఆ దేశ రాజధాని ట్రిపోలీని ఆదీనంలో పెట్టుకున్న మాజీ ప్రధాన మంత్రి అబ్దుల్‌హమీద్ అల్-ద్బీబా అతని నియామకాన్ని తిరస్కరించడంతో పాటుగా ఆయనను రాజధానిలో ఇప్పటి వరకు అడుగు పెట్టనీయలేదు. మరో వైపు తిరుగుబాటు సైనిక కమాండర్ ఖలీఫా హఫ్తార్ ఇద్దరికీ సహకారం అందించడంతో పాటుగా, అల్-ద్బీబా మరియు బషాఘా మధ్య ప్రతిష్టంభన నెలల తరబడి కొనసాగడంతో బషాఘా పదవిని కోల్పోవాల్సి వచ్చింది.
లిబియాలోని యునైటెడ్ నేషన్స్ సపోర్ట్ మిషన్ (UNSMIL) రాజకీయ, చట్టపరమైన మరియు భద్రతా అవసరాల కోసం ఒత్తిడి చేస్తోంది. 2023 ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తుంది. ఓటు కోసం ఎన్నికల చట్టాన్ని రూపొందించడానికి రెండు పార్లమెంటులు ఉమ్మడి కమిటీకి అంగీకరించాయి, అయితే ఇందులో ఎటువంటి పురోగతి కనిపించట్లేదు.
కిరణ్ రిజిజు స్థానంలో న్యాయశాఖ మంత్రిగా అర్జున్ రామ్ మేఘ్వాల్
నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, మే 18న న్యాయ మంత్రిగా కిరణ్ రిజిజును తొలగించి, అతని స్థానంలో అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌ను కొత్తగా నియమించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సలహా మేరకు కేంద్ర మంత్రి మండలిలోని మంత్రులకు శాఖలను ఈ మార్పు చేశారు. అర్జున్ రామ్ మేఘ్వాల్‌కు ప్రస్తుతం ఉన్న శాఖలతో పాటుగా న్యాయ మంత్రిత్వ శాఖలో స్వతంత్ర బాధ్యతలు కూడా అప్పగించబడ్డాయి.
కిరణ్ రిజిజుకు కొత్తగా ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ యొక్క పోర్ట్‌ఫోలియో కేటాయించారు. రిజిజు జూలై 8, 2021న న్యాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీనికి ముందు, అతను మే 2019 నుండి జూలై 2021 వరకు యువజన వ్యవహారాలు మరియు క్రీడల రాష్ట్ర (స్వతంత్ర బాధ్యత) మంత్రిగా పనిచేశారు. ఇదే సమయంలో న్యాయ మంత్రిత్వ శాఖ రాష్ట్ర మంత్రి ప్రొఫెసర్ ఎస్‌పి బఘెల్‌ను కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు బదిలీ చేసింది.
ఒడిశాలో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని
ప్రధాని మోదీ ఒడిశాలో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మే 18న జెండా ఊపి ప్రారంభించారు. పూరీ-హౌరా మధ్య నడిచే ఈ వందే భారత్ రైలును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పూరీ నుండి ఫ్లాగ్ ఆఫ్ చేశారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పూరీ స్టేషన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. హౌరా మరియు న్యూ జల్పైగురి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తర్వాత పశ్చిమ బెంగాల్ పొందుతున్న రెండవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇది.
ఈ రైలు జగన్నాథుని నివాసమైన పూరీ మరియు హౌరా మధ్య 500 కి.మీ దూరాన్ని దాదాపు ఆరున్నర గంటల్లో చేరుకుంటుంది. ఇది దేశంలో మొత్తంగా 16వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఇకపోతే ఇదే వేదిక ద్వారా ఒడిశాలో 8,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన అనేక రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.
ఇటానగర్‌లో దక్షిణాసియా యూత్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్
దక్షిణాసియా యూత్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ 2023 ఇటానగర్‌లో మే 15 - 17 వ తేదీల మధ్య నిర్వహించబడింది. ఇందులో ఆరు దక్షిణాసియా దేశాలైన భూటాన్, బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, శ్రీలంక మరియు నేపాల్ నుండి 100 మందికి పైగా అథ్లెట్లు మరియు అధికారులు పాల్గొన్నారు.
అండర్-19 బాలుర సింగిల్స్‌లో అంకుర్ భట్టాచార్జీ 4-2తో పయాస్ జైన్‌ను ఓడించి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. అండర్-19 బాలికల సింగిల్స్‌లో సుహానా సైనీ 4-1తో యశస్విని ఘోర్‌పడేను ఓడించి విజేతగా నిలిచింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో పయస్ జైన్-యశస్విని జోడీ మాల్దీవుల ప్రత్యర్థులు అఖ్యర్ అహ్మద్ ఖలీద్, ఫాతిమత్ ధీమా అలీ జోడీని ఓడించి స్వర్ణం సాధించింది. విజేతలకు అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ కెటి పర్నాయక్ పతకాలు అందించారు.
జల్లికట్టుకు అనుమతిస్తూ తమిళనాడు చట్టాన్ని సమర్ధించిన సుప్రీంకోర్టు
పాపులర్ తమిళనాడు జల్లికట్టు కార్యక్రమానికి సుప్రీంకోర్టు అనుమతినిస్తూ, దీనికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం ఆమోదించిన సవరణ చట్టాన్ని సమర్థించింది. దీనితో పాటుగా కర్నాటక, మహారాష్ట్రలు కంబళా మరియు ఎద్దుల బండి పందెం కోసం ఆమోదించిన చట్టాలను కూడా సుప్రీం కోర్టు సమర్థించింది.
ఈ రాష్ట్రాలు చేసిన సవరణలు జంతువులకు అదనపు రక్షణ అందించడం ద్వారా జంతువుల పట్ల క్రూరత్వాన్ని తగ్గించాయని మరియు 2014 తీర్పు లేదా రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించలేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. జల్లికట్టు తమిళనాడు రాష్ట్ర సాంస్కృతిక వారసత్వమని, ఆర్టికల్ 29 (1) ప్రకారం ఇది రక్షించబడుతుందని పేర్కొంటూ జల్లికట్టును రక్షించే తమిళనాడు చట్టాన్ని కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లకు సంబంధించి ఈ తీర్పునిచ్చింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 (1) ప్రకారం తమిళనాడు తన సాంస్కృతిక హక్కుగా జల్లికట్టును కాపాడుకోవచ్చో లేదో నిర్ణయించే బాధ్యతను బెంచ్‌కి అప్పగించింది. ఆర్టికల్ 29 (1) భారత భూభాగంలో లేదా దానిలోని ఏదైనా ప్రాంతంలో నివసిస్తున్న పౌరుల ప్రత్యేక భాష, లిపి లేదా దాని స్వంత సంస్కృతిని కాపాడుతుంది.
శ్రీనగర్‌లో జీ-20 టూరిజం సమావేశం
భారతదేశం అధ్యక్షతన మూడవ జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం మే 22 మరియు 24 మధ్య కాశ్మీర్ లోయలో నిర్వహించబడింది. సమావేశాన్ని భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ విజయవంతంగా పూర్తిచేసింది. ఈ సమావేశానికి జీ20 సభ్య దేశాలు, ఆహ్వానించబడిన దేశాలు మరియు వివిధ అంతర్జాతీయ సంస్థలు హాజరయ్యాయి.
ఈ సమావేశం ప్రధానంగా ఫిల్మ్ టూరిజంను ప్రోత్సహించే వ్యూహాలపై దృష్టి సారించింది. ఫిల్మ్ టూరిజం ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ కల్చరల్ ప్రిజర్వేషన్' అనే అంశంపై సైడ్ ఈవెంట్ కూడా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జీ20 షెర్పా అమితాబ్ కాంత్, పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డా. జితేంద్ర సింగ్ పాల్గున్నారు. పర్యాటక ప్రాంతాలను ప్రచారం చేయడంలో సినిమాల పాత్రను ఉపయోగించుకునేందుకు రోడ్‌మ్యాప్‌ను అందించే 'నేషనల్ స్ట్రాటజీ ఆన్ ఫిల్మ్ టూరిజం' డ్రాఫ్ట్‌ను ఆవిష్కరించారు.
హిందూజా గ్రూప్ చైర్మన్ ఎస్పీ హిందుజా కన్నుమూశారు
హిందూజా గ్రూప్ చైర్మన్ ఎస్పీ హిందుజా 87 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో కన్నుమూశారు. శ్రీచంద్ పర్మానంద్ హిందూజా నలుగురు హిందూజా సోదరులలో పెద్దవాడు. బ్రిటన్‌లోని అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన ఈయన యూకే, భారత్ మధ్య బలమైన సంబంధాన్ని నిర్మించడంలో తన సోదరులతో కలిసి చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈయన 1990 తర్వాత యూకే మరియు ఆసియాలోని అత్యంత సంపన్న వ్యక్తులలో స్థిరంగా స్థానం పొందాడు.
సస్టైనబుల్ ఇంధనంతో భారతదేశపు మొట్టమొదటి ప్రయాణీకుల విమానం
స్వదేశీ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (SAF) మిశ్రమాన్ని ఉపయోగించి, దేశంలో మొదటి ప్రయాణికుల ఎయిర్ ఏషియా విమానం పూణె నుండి ఢిల్లీకి ప్రయాణించింది. దేశంలో విమానయాన రంగాన్ని డీకార్బనైజ్ చేయడంలో భాగంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సహాయంతో ఈ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (SAF) మిశ్రమాన్ని తయారు చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, 2070 నాటికి నికర జీరో ఉద్గారాల వైపు దేశం చేస్తున్న ప్రయత్నాలలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా పేర్కొన్నారు. ఇటీవలి సంవత్సరాలలో సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ఉత్పత్తి సాంకేతికత గణనీయంగా పురోగమించింది.
సాంప్రదాయ జెట్ ఇంధనాల మాదిరిగా కాకుండా, వ్యవసాయ వ్యర్థాలు, పురపాలక ఘన వ్యర్థాలు మరియు అటవీ అవశేషాలు వంటి పునరుత్పాదక వనరుల నుండి ఉత్పత్తి చేయబడే ఈ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్, సాంప్రదాయ జెట్ ఇంధనంతో పోలిస్తే గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను 80 శాతం వరకు తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
హిరోషిమాలో జీ7 నాయకుల సమావేశం
49వ జీ7 శిఖరాగ్ర సమావేశం 19 నుండి 21 మే 2023 వరకు జపాన్‌లోని హిరోషిమా నగరంలో జరిగింది. ఈ శిఖరాగ్ర సమావేశానికి జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మిచెల్, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, భారత్ ప్రధాని మోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ హాజరయ్యారు.
ఈ సదస్సులో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర యొక్క పరిస్థితి, ప్రపంచం వాతావరణ సంక్షోభం, కోవిడ్ మహమ్మారి, ఆహార భద్రత, ఆరోగ్య భద్రత, ఆర్థిక భద్రత మరియు భౌగోళిక రాజకీయ సంక్షోభంతో సహా బహుళ సంక్షోభాలపై చర్చలు నిర్వహించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో అణుబాంబు కారణంగా చాలా వరకు ధ్వంసమైన హిరోషిమా ఈ సదస్సుకు ఆతిధ్యం ఇచ్చింది.
గ్రూప్ ఆఫ్ సెవెన్ అనేది కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్‌లతో కూడిన అంతర్ ప్రభుత్వ రాజకీయ వేదిక. వీటికి అదనంగా యూరోపియన్ యూనియన్ నాన్-ఎన్యూమరేటెడ్ సభ్యునిగా ఉంది. దీనిని 1975లో స్థాపించారు. జపాన్ 2023 ఏడాదికి సంబంధించి జీ7 అధ్యక్ష పదవిని నిర్వహిస్తుంది.
గ్లోబల్ సౌత్ దేశాలకు దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగా ఆస్ట్రేలియా, బ్రెజిల్, కొమొరోస్, కుక్ దీవులు, భారతదేశం, ఇండోనేషియా, దక్షిణ కొరియా నాయకులను ఈ సదస్సుకు ఆహ్వానించారు. అలానే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్, ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థలు కూడా ఇందులో పాల్గున్నాయి.
త్రిపుర 'క్వీన్ పైనాపిల్'ని ఆవిష్కరించిన నరేంద్ర సింగ్ తోమర్
కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, త్రిపురలో ఉత్పత్తి చేయబడిన ప్రసిద్ధ సేంద్రీయ క్వీన్ పైనాపిల్‌ను మే 19న ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో త్రిపుర వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి రతన్‌లాల్ నాథ్ కూడా పాల్గొన్నారు.
ఈ సంధర్బంగా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ, ఈశాన్య ప్రాంత అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను అమలు చేయడంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ చురుకైన పాత్ర వహిస్తుదని, సేంద్రియ వ్యవసాయంలో ఈ ప్రాంతం ఘనవిజయం సాధించిందన్నారు. సిక్కిం ఇప్పటికే ఆర్గానిక్ రాష్ట్రంగా ప్రకటించబడిందని, త్రిపుర కూడా అదే బాటలో పయనిస్తోందని పేర్కొన్నారు.
భారతదేశంలో పైనాపిల్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రాల్లో మణిపూర్ ఒకటి. ఈ రాష్ట్రంలో క్వీన్ మరియు క్యూ రకాల పైనాపిల్ పండిస్తున్నారు. క్వీన్ రకం పండ్ల పరిమాణంలో దాదాపు 1 కిలోల వరకు లోతుగా పాతుకుపోయిన కళ్ళు మరియు పెద్ద కిరీటంతో ఉంటుంది . మణిపూర్‌లో పండించే ఈ రకం రుచి మరియు సువాసనలో చాలా మంచి నాణ్యతను కలిగి ఉంటుంది. క్యూ రకానికి చెందిన పండ్లు పెద్ద పరిమాణం, వెడల్పు మరియు నిస్సారమైన కళ్ళు, లేత పసుపు రంగులో ఉంటుంది.
12 ఏళ్ల తర్వాత తొలి అరబ్ లీగ్ సమ్మిట్‌కు హాజరైన సిరియా అసద్
సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్, అరబ్ లీగ్ సమ్మిట్‌కు 12 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా హాజరయ్యారు. సౌదీ అరేబియాలో జరిగిన ఈ శిఖరాగ్ర సమావేశానికి మే 19న ఆయన అటెండ్ అయ్యారు. 2011లో సిరియాలో అంతర్యుద్ధానికి దారితీసిన ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనకారులపై క్రూరమైన అణిచివేత తర్వాత ఈ కూటమి సిరియాను సస్పెండ్ చేసింది.
సౌదీ అరేబియా గత కొద్దీ కాలంగా అరబ్ లీగ్ దేశాల మధ్య శాంతి, సామరస్యాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తుంది. విభేదాలను అంతం చేయడానికి మరియు వివాదాల నిర్మూలనకు పిలుపునిస్తుంది. అయితే ఈ ప్రాంతంలోని మిగతా దేశాలు సిరియా వంటి దేశాలతో సంబంధాలను సరిదిద్దుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. అయితే ఇది అరబ్ లీగ్ పునరేకీకరణకు అడ్డంకి కాదని పేర్కొంటున్నారు
అరబ్ లీగ్ కైరోలో 22 మార్చి 1945న స్థాపించబడింది. దీనిని ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఎగుమతిదారుల కూటమిగా చెప్పొచ్చు. ఇది ప్రారంభంలో ఈజిప్ట్, ఇరాక్, ట్రాన్స్‌జోర్డాన్, లెబనాన్, సౌదీ అరేబియా, సిరియా మరియు యెమెన్ దేశాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం, లీగ్‌లో 22 సభ్య దేశాలు ఉన్నాయి.
2023 అరబ్ లీగ్ సమ్మిట్ అనేది అధికారికంగా కౌన్సిల్ ఆఫ్ అరబ్ స్టేట్స్ కౌన్సిల్ యొక్క 32వ సాధారణ సెషన్ సమ్మిట్. ఇది లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్‌లోని సభ్య దేశాల అధినేతలు మరియు ప్రభుత్వాల సమావేశం. ఈ సమావేశం సౌదీ అరేబియాలోని జెడ్డాలో 19 మే 2023న నిర్వహించబడింది.
22 అరబ్ సభ్య దేశాలు : అల్జీరియా, బహ్రెయిన్, కొమొరోస్, జిబౌటీ, ఈజిప్ట్, ఇరాక్, జోర్డాన్, కువైట్, లెబనాన్, లిబియా, మౌరిటానియా, మొరాకో, ఒమన్, పాలస్తీనా, ఖతార్, సౌదీ అరేబియా, సోమాలియా, సూడాన్, సిరియా, ట్యునీషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు యెమెన్.
పాకిస్థాన్, ఇరాన్ మధ్య సరిహద్దు మార్కెట్ ప్రారంభం
10 సంవత్సరాల తర్వాత ఇటీవలే సమావేశమైన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ, ఇరు దేశాల మధ్య మొదటి సరిహద్దు మార్కెట్‌ను ప్రారంభించారు. గత కొద్దీ కాలంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగ్గా ఉండడంతో వాటిని మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సరిహద్దు మార్కెట్లను తెరవాలనే నిర్ణయాన్ని రెండు దేశాలు ఏప్రిల్ 2021లోనే ఒక అవగాహనా ఒప్పందం (ఎంఓయు) పై సంతకం చేశాయి. పాకిస్తాన్ యొక్క నైరుతి మరియు ఇరాన్ యొక్క ఆగ్నేయంలో ఉన్న దాదాపు 750 కిమీల సరిహద్దును ఇరుదేశాలు పంచుకుంటున్నాయి.
పీఎన్‌జీఆర్‌బి నూతన ఛైర్మన్‌గా ఏకే జైన్
పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ నూతన చైర్మనుగా సీనియర్ బ్యూరోక్రాట్ అనిల్ కుమార్ జైన్ నియమితులయ్యారు. గతంలో బొగ్గు శాఖ కార్యదర్శిగా పని చేసిన ఎకె జైన్‌వచ్చే ఐదేళ్ల కాలానికి ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
పీఎన్‌జీఆర్‌బి అనేది పెట్రోలియం ఉత్పత్తులు మరియు సహజ వాయువుకు సంబంధించిన నిర్దిష్ట కార్యకలాపాలలో నిమగ్నమైన వినియోగదారులు మరియు సంస్థల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఏర్పాటు చేయబడింది. ఇది పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ యాక్ట్, 2006 ప్రకారం ఏర్పాటైంది. ఇది పూర్తి ప్రభుత్వ ఆదీనంలో ఉంటుంది.
వార్షిక హౌసింగ్ గ్రోత్ రిపోర్టులో ముంబైకు 6వ ర్యాంక్
రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం , ముంబై వార్షిక గృహ వృద్ధి నివేదికలో 38వ స్థానం నుండి 6వ ర్యాంక్‌కు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 46 నగలకు సంబంధించి రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ క్యూఐ 2023లో ఇండియా నుండి ముంబై, బెంగళూరు మరియు న్యూఢిల్లీ నగరాలు వార్షిక ధరలలో పెరుగుదలను నమోదు చేసాయి. మునపటి ఇండెక్స్ ర్యాంకింగ్‌లో 37, మరియు 39వ ర్యాంక్‌లలో ఉన్న బెంగుళూరు, ఢిల్లీలు వరుసగా 16వ మరియు 22వ ర్యాంక్‌లలో నిలిచాయి.
ఎన్ చంద్రశేఖరన్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం
టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర గౌరవం " చెవాలియర్ డి లా లెజియన్ డి'హోన్నూర్" లభించింది. టాటా ఛైర్మనుగా ఎన్ చంద్రశేఖరన్ భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య వాణిజ్య సంబంధాన్ని బలోపేతం చేయడంలో చేసిన కృషికి గాను ఐరోపా & విదేశాంగ వ్యవహారాల ఫ్రెంచ్ మంత్రి కేథరీన్ కొలోనా నుండి ఈ గౌరవాన్ని స్వీయకరించారు.
మయన్మార్‌కు తుపాన్ నష్టాల సహాయార్థం ఆపరేషన్ కరుణ
మోచా తుఫాను వల్ల ప్రభావితమైన మయన్మార్‌లోని ప్రజలకు మానవతా సహాయం అందించడానికి భారతదేశం "ఆపరేషన్ కరుణ" అనే కార్యక్రమాన్ని మే ప్రారంభించింది. మే 18న భారత నౌకాదళానికి శివాలిక్, కమోర్తా మరియు సావిత్రి అనే మూడు నౌకలు ఆహార సామాగ్రి, టెంట్లు, అవసరమైన మందులు, పోర్టబుల్ నీటి పంపులు వంటి అత్యవసర సహాయ సామగ్రితో యాంగోన్‌కు చేరుకున్నాయి.
ఉత్తర హిందూ మహాసముద్రంలో మే 9న ఏర్పడిన శక్తివంతమైన మోచా సైక్లోన్, మయన్మార్ మరియు బంగ్లాదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. మోచా తుఫాను బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ మరియు మయన్మార్‌లోని సిట్వే మధ్య గంటకు 195 కిలోమీటర్ల వేగంతో తీరం దాటింది.
ముంబయిలో 2వ G-20 డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్
భారత జీ20 అధ్యక్షతన 2 వ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం మే 23, 2023న ముంబైలో నిర్వహించారు. ఈ సమావేశం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తర్వాత వర్కింగ్ గ్రూప్ ప్రతినిధులకు ఇటీవలే పునఃరుద్దించిన పాత మున్సిపల్ భవనం యొక్క హెరిటేజ్ టూర్ ఏర్పాటు చేసారు. అదే సమయంలో విపత్తు నిర్వహణ విభాగం యొక్క కంట్రోల్ రూమ్‌ను కూడా పరిశీలించారు.
ఈ సమావేశం ప్రధానంగా విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాల యొక్క ప్రాముఖ్యత మరియు విపత్తు ప్రమాద తగ్గింపు కోసం నిర్వహించింది. ఈ అంశాలకు సంబంధించి జీ-20 దేశాల నుండి మంచి అభ్యాసాలు మరియు కేస్ స్టడీస్ మార్పిడికి ద్వారాలు తెరిచారు. దీనికి సంబందించిన మొదటి డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్ సమావేశంను ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో గాంధీనగర్‌లో ఏర్పాటు చేసారు.
వరల్డ్ ఫుడ్ ఇండియాపై మొదటి ఇంటర్-మినిస్టీరియల్ కమిటీ
వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 పై మొదటి అంతర్-మంత్రిత్వ కమిటీ సమావేశం మే 16న న్యూఢిల్లీలో జరిగింది. ఈ ఏడాది నవంబర్ 3-5 తేదీల్లో నిర్వహించే వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 సమావేశ సన్నద్ధత కోసం మంత్రిత్వ శాఖ యొక్క కార్యాచరణ ప్రణాళికలో భాగంగా దీనిని నిర్వహించారు.
భారత ప్రభుత్వ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడే వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 అనేది భారతీయ ఆహార ఆర్థిక వ్యవస్థకు గేట్‌వే వంటిది. ఇది భారతీయ మరియు విదేశీ పెట్టుబడిదారుల మధ్య భాగస్వామ్యాన్ని సులభతరం చేస్తుంది. ఈ సమావేశం గ్లోబల్ ఫుడ్ ఎకోసిస్టమ్ లోని పెట్టుబడిదారులు, తయారీదారులు, ఉత్పత్తిదారులు, ఫుడ్ ప్రాసెసర్‌లకు ఉమ్మడి వేదికను అందిస్తుంది.
అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై 20 శాతం టీసీఎస్
2023 బడ్జెట్‌లో వాగ్దానం చేయబడిన అధిక టీసీఎస్ లెవీని జూలై 1 నుండి కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్ ఖర్చులపై జూలై 1 నుండి 20 శాతానికి లోబడి టీసీఎస్ రేటు అమలు చేయనున్నట్లు వెల్లడించింది.
ఇకమీదట అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల చెల్లింపులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సరళీకృత చెల్లింపు పథకం (LRS) కింద కవర్ చేయబడతాయి. ఈ నెల 16న, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) కింద సవరించిన నిబంధనలలో ఈ అంశాలను నోటిఫై చేసింది. ఇది వరకు ఇది డెబిట్ కార్డ్‌లు, ఫారెక్స్ కార్డ్‌లు మరియు బ్యాంక్ బదిలీలకు మాత్రమే అమలు చేయబడేది.
గోరఖ్‌పూర్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ జనతా దర్శన్ కార్యక్రమం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మే 20న గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు జనతా దర్శన్ పేరుతొ నూతన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలు అమలు తీరును పరిశీలించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలు అర్హులైన లబ్దిదారులకు ఎలాంటి జాప్యం జరగకుండా చేరడానికి సంబంధించి అధికారులకు నిర్దిష్ట ఆదేశాలు జారీచేశారు.
ఢిల్లీ కేంద్ర అధికారుల బదిలీ కోసం ఆర్డినెన్స్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
ఢిల్లీ గ్రూప్-ఎ అధికారుల బదిలీ, పోస్టింగ్ మరియు క్రమశిక్షణా చర్యల కోసం నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీని రూపొందించడానికి కేంద్రం ఒక ఆర్డినెన్స్‌ను జారీచేసింది. జాతీయ రాజధాని ప్రాంతం పరిధిలోని పబ్లిక్ ఆర్డర్, పోలీసు మరియు బ్యూరోక్రాట్‌లను నియమించడానికి మరియు బదిలీ చేయడానికి ఆప్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు అధికారాన్ని ఇచ్చిన నేపథ్యంలో దానిని పరోక్షంగా అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దీనిని జారీ చేసింది.
ఈ ఆర్డినెన్స్ ప్రకారం, పోస్టింగ్‌లు మరియు బదిలీలపై నిర్ణయం తీసుకునేందుకు కొత్తగా ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ మరియు ప్రిన్సిపల్ హోం సెక్రటరీ సభ్యులుగా నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ ముగ్గురు సభ్యుల కమిటీలోలో ఇద్దరు కేంద్ర ప్రభుత్వ బ్యూరోక్రాట్లు ఉండటంతో ఈ కమిటీ నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండనున్నాయి. దీన్ని అనుమతించకూడదని ఆప్ నిర్ణయించుకుంది. దీనిని సుప్రీం కోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి ఇచ్చిన అధికారాన్ని "కొల్లగొట్టే" ప్రయత్నంగా పేర్కొంది.
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అని పిలుస్తారు. సాధారణంగా కేంద్ర పాలిత ప్రాంతాలు లెఫ్టనెంట్ గవర్నర్ల ఆదీనంలో ఉంటాయి. అయితే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలోని ఎగ్జిక్యూటివ్, న్యాయవ్యవస్థ మరియు శాసనసభను కలిగి ఉంటుంది. శాసన సభకు ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 239ఎఎ ప్రకారం లెఫ్టనెంట్ గవర్నర్లకు పూర్తి స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఢిల్లీలో మాత్రం ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రుల మండలి యొక్క సహాయం మరియు సలహాను అనుసరించవలసి ఉంటుంది.
అనగా ఇతర రాష్ట్రాల వలె రాష్ట్ర జాబితాలోని అన్ని అంశాలు ఢిల్లీ ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. అయితే ఉమ్మడి జాబితాలో ఉండే పోలీస్, పబ్లిక్ ఆర్డర్ విషయాలపై లెఫ్టనెంట్ గవర్నర్ ఆదేశాలను పాటించవలసి ఉంటుంది. దీనితో ఢిల్లీలో స్థానిక, కేంద్ర ప్రభుత్వాలు రెండు వేరు వేరు పార్టీలకు చెందినవి అయినప్పుడు ఇలాంటి ఆధిపత్య సమస్యలు తరుసుగా ఉత్పన్నమౌతాయి.
భారతదేశం, దక్షిణ కొరియా వ్యూహాత్మక భాగస్వామ్యంపై సమీక్ష
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 20న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌తో ఉత్పాదక ద్వైపాక్షిక చర్చలు జరిపారు. హిరోషమాలో జరిగిన జీ7 నాయకుల శిఖరాగ్ర సమావేశంకు హాజరైన ఇరువురు నేతలు, ఇదే వేదికలో ద్వైపాక్షిక భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య వాణిజ్యం మరియు పెట్టుబడులు, ఐటీ హార్డ్‌వేర్ తయారీ మరియు రక్షణ వంటి రంగాలలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి అంగీకరించారు.
ఇరు దేశాల మధ్య సంబంధాలు ప్రారంభమై 50 ఏళ్ళు పూర్తికావడంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఇదే సందర్భంలో భారతదేశం యొక్క జీ20 ప్రెసిడెన్సీ మరియు దక్షిణ కొరియా యొక్క ఇండో-పసిఫిక్ వ్యూహంపై కూడా చర్చలు నిర్వహించారు.
గుడ్ గవర్నెన్స్ రూల్స్‌కు ఆమోదం తెలిపిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర
దేశంలో మొట్టమొదటి సుపరిపాలన నిబంధనలను ఆమోదించిన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో మరింత జవాబుదారీతనం, ప్రాప్యతను, పారదర్శకతను పెంపొందించడంలో భాగంగా దేశంలోని మొట్టమొదటి సుపరిపాలన నిబంధనలను ఆమోదించింది. ఈ నిబంధనలలో పాటుగా వాతావరణ మార్పుల ప్రభావాలపై చర్య తీసుకోవడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటుచేయనుంది.
ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం 'ఆపిల్ సర్కార్ సేవా కేంద్రం' పరిధిని విస్తరించడం ద్వారా పౌరులకు నిర్ణీత గడువులోగా ఎండ్-టు-ఎండ్ ఆన్‌లైన్ సేవలను అందిస్తుంది. ఇదే వేదికలో పౌరుల ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం అందివ్వనుంది
గత ఏడాది సెప్టెంబర్‌లో సుపరిపాలన నిబంధనలను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం మంత్రివర్గ అధికారులు, నిపుణులు, స్వచ్ఛంద సంస్థలతో చర్చించి ఈ నిబంధనలను సిద్ధం చేశారు. ఇందులో శాఖల వారీగా 161 సూచీలను సిద్ధం చేసి, వాటి ఆధారంగా సుపరిపాలన పనితీరును అంచనా వేస్తారు.
మధ్యప్రదేశ్ యువత కోసం ముఖ్యమంత్రి సిఖో-కామావో యోజన
మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం ముఖ్యమంత్రి సిఖో - కామావో యోజన అనే నూతన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ఐటీఐ, గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన విద్యార్థులకు ఏడాదిపాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తూ, శిక్షణ సమయంలో యువతకు 8 నుంచి 10 వేల రూపాయల స్టైపెండ్ అందిస్తుంది.
ఈ పథకం కింద లక్ష మంది నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద పిల్లలకు ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, హోటల్ మేనేజ్‌మెంట్, టూరిజం, ట్రావెల్, హాస్పిటల్, రైల్వే, ఐటీఐ, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అకౌంటింగ్, చార్టర్డ్ అకౌంటెంట్ వంటి 700 రకాల ఉపాధి అవకాశాలపై శిక్షణ ఇవ్వనుంది.
తమిళనాడులో భారతదేశపు అతిపెద్ద స్కైవాక్ వంతెన
భారతదేశంలోనే అతిపెద్ద స్కైవాక్ వంతెనను మే 16న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. 570 మీటర్ల పొడవు మరియు 4.2 మీటర్ల వెడల్పుతో నిర్మించిన ఈ వంతెన మాంబలం రైల్వే స్టేషన్ మరియు టి నగర్ బస్ టెర్మినస్‌లను కలుపుతుంది. ఇది అత్యంత రద్దీగా ఉండే మాంబలం రైల్వే స్టేషన్ నుండి ప్రయాణికులను నేరుగా బస్సు స్టాండుకు చేరుకునే అవకాశం కలిపిస్తుంది.
దీనిని స్మార్ట్ సిటీ నిధుల కింద 28.45 కోట్ల రూపాయల వ్యయంతో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జిసిసి) నిర్మించింది. ఈ వంతెన రంగనాథన్ స్ట్రీట్, మాడ్లీ రోడ్, మార్కెట్ స్ట్రీట్ వద్ద ట్రాఫిక్‌ను తగ్గించే లక్ష్యంతో నిర్మించారు. దీన్ని రోజూ దాదాపు లక్ష మంది వినియోగిస్తారని అంచనా.
2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ఆర్‌బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 2000 రూపాయల డినామినేషన్ బ్యాంక్ నోట్లను చలామణి నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. అయితే అవి చట్టబద్ధమైన చెల్లుబాటును కలిగి ఉంటాయని ప్రకటించింది. తక్షణం అమలులోకి వచ్చేలా రూ. 2000 డినామినేషన్ నోట్ల జారీని నిలిపివేయాలని బ్యాంకులకు సూచించింది.
2016లో 500 మరియు 1000 రూపాయల నోట్ల రద్దు తర్వాత త్వరతగతిన మార్కెట్లోకి డబ్బును చొప్పించేందుకు 2వేల నోట్లను జారీ చేసింది. ఆర్‌బీఐ చట్టం, 1934లోని సెక్షన్ 24(1) ప్రకారం రూ. 2000 డినామినేషన్ బ్యాంక్ నోట్ నవంబర్ 2016లో ప్రవేశపెట్టబడింది. ప్రస్తుతం ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఉపసంహారానికి అవకాశం కల్పించింది. ఆ తర్వాత కూడా ఈ నోట్లు మార్కెట్టులో అందుబాటులో లేకున్నా చెల్లుబాటు అవుతాయి .