తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : నేటి కరెంట్ అఫైర్స్ 03 నవంబర్ 2023
Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : నేటి కరెంట్ అఫైర్స్ 03 నవంబర్ 2023

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ నవంబర్ 03, 2023. తాజా జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి  వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

విశాఖపట్నంలో గ్లోబల్ ఇరిగేషన్ సమ్మిట్

నవంబర్ 2 నుంచి నవంబర్ 8 వరకు విశాఖపట్నంలో జరుగుతున్న అంతర్జాతీయ నీటి పారుదల కమిషన్ (ఐసీఐడీ) 25వ కాంగ్రెస్ మరియు 75వ అంతర్జాతీయ ఐసీఐడీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 2న ప్రారంభించారు. ఆరు దశాబ్దాల తర్వాత తొలిసారి ఈ సమావేశాలు భారతదేశంలో నిర్వహించారు. ఈ సమావేశాలను ఇండియన్ నేషనల్ కమిటీ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ (ఐఎన్‌సిఐడి) ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి.

ఈ అంతర్జాతీయ ఈవెంట్‌కు 90 దేశాల నుండి దాదాపు 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. నీటిపారుదల మరియు నీటి వనరుల పరిరక్షణకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై ఈ సదస్సులో చర్చలు జరిగాయి. నీటిపారుదల కొరకు ప్రత్యామ్నాయ నీటి వనరుల అభివృద్ధి, నీటి ఉత్పాదకతను పెంచడానికి వ్యవసాయ పద్ధతుల మార్పు, నీటిపారుదల వ్యవస్థల మూల్యాంకనం, వ్యవసాయంలో నీటి ఎద్దడి పరిస్కార మార్గాలు వంటి వివిధ అంశాలపై ఈ సదస్సులో సిఫార్సులు చేయబడ్డాయి.

ఇటలీతో మొబిలిటీ & మైగ్రేషన్ భాగస్వామ్య ఒప్పందం

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ రోమ్ పర్యటన సందర్భంగా నవంబర్ 3, 2023 న భారతదేశం మరియు ఇటలీల మధ్య మొబిలిటీ మరియు మైగ్రేషన్ భాగస్వామ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య కార్మికులు, విద్యార్థులు మరియు నిపుణుల కదలికలను చట్టపరమైన మరియు క్రమబద్ధమైన పద్ధతిలో సులభతరం చేస్తుంది.  ఒప్పందంపై ఎస్ జైశంకర్, ఇటలీ ఉప ప్రధాని మంత్రి ఆంటోనియో తజానీలు సంతకం చేశారు.

ఈ ఒప్పందం ఇరుదేశాల వీసా విధానాలను సరళీకృతం చేస్తుంది. ఇది అర్హత ఉన్న వ్యక్తులు లేదా విద్యార్థులు ఇరు దేశలలో పని చేయడానికి, చదువుకోవడానికి అనుమతిస్తుంది. ఈ సమావేశంలో ఆగ్రో-టెక్, ఇన్నోవేషన్, స్పేస్, డిఫెన్స్ మరియు డిజిటల్ డొమైన్‌లలో అంశాలపై కూడా చర్చలు జరిపారు. ఇద్దరు నేతలు పశ్చిమాసియా పరిస్థితి, ఉక్రెయిన్ వివాదం మరియు ఇండో-పసిఫిక్ ల్యాండ్‌స్కేప్ గురించి కూడా వివరంగా మాట్లాడారు. ఈ పర్యటనలో జైశంకర్ ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టోను కూడా కలిశారు.

ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ ఛైర్మన్‌గా జస్టిస్ రాజేంద్ర మీనన్

ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రాజేంద్ర మీనన్ సాయుధ బలగాల ట్రిబ్యునల్ (ఎఎఫ్‌టి) ఛైర్మన్‌గా నాలుగేళ్ల కాలానికి తిరిగి నియమితులయ్యారు. జస్టిస్ మీనన్ జూన్ 6, 2027 నాటికి 70 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ట్రిబ్యునల్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. రాజేంద్ర మీనన్ 2019లో ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేసిన తర్వాత ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ చైర్‌పర్సన్‌గా మొదటిసారి నియమితులయ్యారు, అప్పటి నుండి అయన ఇదే హోదాలో ఉన్నారు.

సాయుధ దళాల ట్రిబ్యునల్ అనేది త్రివిధ దళాల కమిషన్, నియామకాలు, నమోదులు మరియు సేవా షరతులకు సంబంధించి వివాదాలు మరియు ఫిర్యాదులను డీల్ చేస్తుంది. ఇది సాయుధ దళాల ట్రిబ్యునల్ చట్టం 2007 ద్వారా 2009లో ఏర్పాటు చేయబడింది. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. దీని ఛైర్మన్‌గా నాలుగేళ్ళ కాలానికి హైకోర్టు మాజీ న్యాయమూర్తులు నియమింపబడతారు.

హురున్ ఇండియా ఫిలాంత్రోపీ జాబితాలో శివ నాడార్ అగ్రస్థానం

హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ 2,042 కోట్ల వార్షిక విరాళంతో ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ జాబితాలో ఇండియా నుండి అగ్రస్థానంలో నిలిచారు. ఈ జాబితాలో విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ తర్వాతి స్థానంలో నిలిచారు. దీనితో శివ్ నాడార్ వరుసగా మూడవ సంవత్సరం 'భారతదేశంలో అత్యంత ఉదారత' అనే బిరుదును నిలబెట్టుకున్నారు.

ఆర్థిక సంవత్సరం 2022-23 సంబంధించి విడుదల చేసిన తాజా జాబితాలో నిఖిల్ కామత్ 110 కోట్ల విరాళంతో  అతి పిన్న వయస్కుడైన పరోపకారిగా నిలిచాడు. అలానే ప్రముఖ రచయిత రోహిణి నీలేకని 170 కోట్ల విరాళంతో అత్యంత ఉదారమైన మహిళా పరోపకారిగా అవతరించారు.

ఎడెల్‌గివ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితా 2023 ప్రకారం 119 మంది భారతీయులు ఈ ఏడాది 5 కోట్ల కంటే ఎక్కువ విరాళం అందించిన జాబితాలో ఉన్నారు. ఇది మునుపటి సంవత్సరం కంటే 59% ఎక్కువ మరియు 3 సంవత్సరాల క్రితం కాలం కంటే 200% ఎక్కువ. అంతేకాకుండా భారతదేశం నుండి ఈ ఏడాది 14 మంది వ్యక్తులు 100 కోట్ల కంటే ఎక్కువ విరాళాలు అందించిన జాబితాలో ఉండగా, 24 మంది వ్యక్తులు 50 కోట్ల కంటే ఎక్కువ విరాళాలు అందించిన లిస్టులో ఉన్నారు.

దాత పేరు వ్యాపార సంస్థ విరాళం
శివ నాడార్ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ 2,042 కోట్లు
అజీమ్ ప్రేమ్‌జీ విప్రో 1,774 కోట్లు
ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 376 కోట్లు
కుమార్ బిర్లా ఆదిత్య బిర్లా గ్రూప్ 287 కోట్లు
గౌతమ్ అదానీ అదానీ గ్రూప్ 285 కోట్లు
బజాజ్ ఫామిలీ బజాజ్ గ్రూప్ 264 కోట్లు
అనిల్ అగర్వాల్ వేదాంత గ్రూప్ 241 కోట్లు
నందన్ నీలేకని ఇన్ఫోసిస్ 189 కోట్లు
సైరస్ & ఆదార్ పూనావాలా సీరం ఇనిస్టిట్యూట్ 179 కోట్లు
రోహిణి నీలేకని రచయిత & పరోపకారి 170 కోట్లు

ప్రముఖ రచయిత టి పద్మనాభన్ కేరళ అత్యున్నత పౌర పురష్కారం

ప్రఖ్యాత మలయాళ రచయిత టి. పద్మనాభన్‌కు ఆ రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం కేరళ జ్యోతి అవార్డు లభించింది.  కేరళ ప్రభుత్వం 2021 నుండి కేంద్ర ప్రభుత్వం అందించే పద్మ అవార్డుల నమూనాలో మూడు రకాల పౌర పురష్కారాలు అందిస్తుంది. ఈ అవార్డులు సమాజానికి అమూల్యమైన సహకారం అందించిన వ్యక్తులకు అందిస్తున్నారు. అవార్డు గ్రహీతలను ప్రతి సంవత్సరం నవంబర్ 1న ప్రకటిస్తారు, దీనిని కేరళ పిరవిగా పాటిస్తారు.

  • కేరళ జ్యోతి : ఇది అత్యున్నత పురస్కారం. ఏడాదికి ఒక వ్యక్తికి మాత్రమే ప్రదానం చేయబడుతుంది.
  • కేరళ ప్రభ : ఇది రెండవ అత్యున్నత పురస్కారం. ఏడాదికి ముగ్గురు వ్యక్తులకు ప్రదానం చేయబడుతుంది.
  • కేరళ శ్రీ : ఇది మూడవ అత్యున్నత పురస్కారం. ఇది ఏడాదికి ఆరుగురికి ప్రదానం చేయబడుతుంది.

తొలి కేరళ అవార్డుల విజేతలను 1 నవంబర్ 2022న ప్రకటించారు. ఈ మొదటి కేరళ జ్యోతి అవార్డును ప్రముఖ మలయాళీ రచయత మడత్ తెక్కేపట్టు వాసుదేవన్ నాయర్ అందుకున్నారు. ఈ అవార్డులను గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్ భవన్‌లో జరిగే కార్యక్రమంలో పంపిణీ చేయబడతాయి.

2024 పురుషుల టి20 ప్రపంచ కప్‌కు నేపాల్ & ఒమన్ క్వాలిఫై

వెస్టిండీస్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆతిథ్యం ఇస్తున్న 2024 ఐసీసీ పురుషుల టి20 ప్రపంచ కప్‌కు ఆసియా రీజియన్ నుండి నేపాల్ మరియు ఒమన్ జట్లు అర్హుత సాధించాయి. ఖాట్మండులో జరిగిన ఆసియా క్వాలిఫయర్స్ ఫైనల్ మ్యాచ్‌లలో ఈ రెండు జట్లు విజయం సాధించడం ద్వారా ఈ అవకాశం దక్కించుకున్నాయి. తమ సెమీ-ఫైనల్‌ మ్యాచులలో బహ్రెయిన్‌ను ఒమన్ పది వికెట్ల తేడాతో ఓడించగా, నేపాల్ గమ్మత్తైన ఛేజింగ్‌లో యుఎఇని ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది.

2024 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ జూన్ 4 నుండి 30 జూన్ 2024 వరకు వెస్టిండీస్ మరియు యునైటెడ్ స్టేట్స్ యందు జరగనుంది. ఇది యునైటెడ్ స్టేట్స్‌ ఆతిధ్యం అందిస్తున్న మొదటి ఐసీసీ ప్రపంచ కప్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్‌లో 20 జట్లు పోటీపడుతున్నాయి. ఇందులో మునపటి 2022 టోర్నమెంట్ యందు పాల్గొన్న 8 ప్రధాన జట్లతో పాటుగా రీజియన్ వారీగా మరో 12 జట్లు పాల్గొననున్నాయి. ఇంగ్లాండ్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది. ఈ టోర్నమెంటు రెండేళ్లకోసారి నిర్వహించబడుతుంది.

  • ఆతిధ్య దేశాలు : యునైటెడ్ స్టేట్స్ & వెస్ట్ ఇండీస్
  • 2022 పాల్గొన్న దేశాలు : ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక
  • ఐసీసీ టీమ్ ర్యాంకింగులో టాప్ 9 & 10 జట్లు : ఆఫ్ఘనిస్తాన్ & బంగ్లాదేశ్
  • యూరోప్ క్వాలిఫైయర్ జట్లు : ఐర్లాండ్ & స్కాట్లాండ్
  • తూర్పు ఆసియా-పసిఫిక్ క్వాలిఫైయర్ దేశాలు : పాపువా న్యూ గినియా
  • అమెరికాస్ క్వాలిఫైయర్ దేశాలు : కెనడా
  • ఆసియా క్వాలిఫైయర్ దేశాలు : నేపాల్ & ఒమన్
  • ఆఫ్రికా క్వాలిఫైయర్ దేశాలు : కెన్యా & రువాండా

ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్ వ్యతిరేక ఒప్పందంపై 28 దేశాలు సంతకం

భారతదేశం, యుఎస్, యుకె మరియు యూరోపియన్ యూనియన్‌తో సహా 28 దేశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో సంబంధం ఉన్న ప్రమాదాలకు సంబంధించి ప్రపంచంలోని మొదటి ఒప్పందంపై సంతకం చేశాయి. బ్లెచ్లీ డిక్లరేషన్ అని పిలిచే ఈ ఒప్పందం యూకే లోని బ్లెచ్లీ పార్క్‌లో నిర్వహించిన ఎఐ భద్రతపై జరిగిన "ఎఐ సేఫ్టీ సమ్మిట్ 2023' యందు చోటు చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం కృత్రిమ మేధతో సంబంధం ఉన్న నష్టాలను అంచనా వేయడానికి సంబంధిత దేశాలు కలిసి పనిచేస్తాయి.

ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై జరిగిన ప్రపంచంలోనే మొట్టమొదటి గ్లోబల్ సమ్మిట్‌. మనవళ్ల దీర్ఘకాలిక భవిష్యత్తుకు భరోసా ఇవ్వడంలో సహాయపడే సాంకేతికత యొక్క నష్టాలను అర్థం చేసుకోవడం వెనుక ఉన్న ఆవశ్యకతను తెలుసుకోవడం మరియు తెలియజేయడం దీని ప్రధాన లక్ష్యం. ఈ సమావేశానికి ఇండియా తరుపున కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హాజరయ్యారు.

బ్లెచ్లీ డిక్లరేషన్‌పై సంతకం చేసిన 28 దేశాలలో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, కెనడా, చిలీ, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఎస్టోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హంగేరి, ఐస్లాండ్, భారతదేశం, ఐర్లాండ్, ఇజ్రాయెల్, ఇటలీ, జపాన్, లిథువేనియా, లక్సెంబర్గ్, మాల్టా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, నార్వే, పోలాండ్, పోర్చుగల్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సింగపూర్, స్లోవేకియా, స్లోవేనియా, స్పెయిన్, స్వీడన్ స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు యూరోపియన్ యూనియన్ ఉన్నాయి.

 

Post Comment