తెలుగులో 18 ఫిబ్రవరి 2024 కరెంట్ అఫైర్స్ అంశాలను చదవండి. వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాం. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహులకు ఇవి ఉపయోగపడతాయి.
ఐఈఏలో పూర్తి సభ్యత్వం కోసం భారత్ చర్చలు
31 దేశాల ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ)లో పూర్తి సభ్యునిగా చేరడానికి భారతదేశం సభ్య దేశాల మంత్రులతో చర్చలు ప్రారంభించింది. 2017లో అసోసియేషన్ దేశంగా ఐఈఏ కుటుంబంలో చేరిన భారత్, గత ఏడాది అక్టోబరులో ఐఈఏ మంత్రులకు తన పూర్తి సభ్యత్వం కోసం అధికారిక అభ్యర్థనను పంపింది. ఈ చర్చలకు సంబంధించి ఫిబ్రవరి 13-14 తేదీలలో ఈ సమావేశం నిర్వహించబడింది.
భారతదేశం ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో సభ్యుడిగా మారడం అంతర్జాతీయ ఇంధన పాలనలో భారీ, పర్యవసానమైన మార్పును సూచిస్తుంది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా, ఇంధన భద్రతను పరిరక్షించడం, ఇంధన పరివర్తనలు మరియు వాతావరణ మార్పులను ఎదుర్కోవడం వంటి ప్రయత్నాలలో భారతదేశం మరింత ప్రధాన పాత్ర పోషించనుంది.
రాబోయే మూడు దశాబ్దాలలో, పారిశ్రామికీకరణ మరియు పట్టణీకరణ పెరుగుదల మరియు తలసరి ఆదాయం బాగా పెరగడం వల్ల ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేనంత అతిపెద్ద ఇంధన డిమాండ్ వృద్ధిని భారతదేశం చూసేందుకు సిద్ధంగా ఉంది.
- ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది పారిస్ ఆధారిత స్వయంప్రతిపత్త ఇంటర్‌గవర్నమెంటల్ ఆర్గనైజేషన్.
- 1973 లో చమురు సంక్షోభం తర్వాత అంతర్జాతీయ చమురు సరఫరాలలో భౌతిక అంతరాయాలను పరిష్కరించేందుకు దీనిని ప్రారంభించారు.
- ఐఈఏ 1974లో ప్రాన్స్ ప్రధాన కేంద్రంగా స్థాపించబడింది.
- ఐఈఏ ప్రపంచ ఇంధన రంగంపై విధాన సిఫార్సులు, విశ్లేషణ మరియు డేటాను అందిస్తుంది.
- ఐఈఏ ప్రస్తుతం 31 సభ్య దేశాలు మరియు 13 అసోసియేషన్ దేశాలు సభ్యులుగా ఉన్నాయి.
- చిలీ, కొలంబియా మరియు ఇజ్రాయెల్ ప్రస్తుతం ఈ కూటమిలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాయి
- ఐఈఏ దేశాలు ప్రపంచ ఇంధన డిమాండ్‌లో 75% ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
- ఐఈఏ సభ్య ప్రభుత్వాలలో మూడింట రెండు వంతులు 2050 నాటికి ఉద్గార తటస్థతకు కట్టుబడి ఉన్నాయి.
ఫ్రాన్స్ మరియు జర్మనీతో భద్రతా ఒప్పందాలపై సంతకం చేసిన ఉక్రెయిన్
ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఫిబ్రవరి 16న జర్మనీ మరియు ఫ్రాన్స్‌లతో ద్వైపాక్షిక భద్రతా ఒప్పందాలపై సంతకం చేశారు. ఈ ఒప్పందం రష్యా తన పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రారంభించిన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పాశ్చాత్య మద్దతును పెంచడానికి జెలెన్‌స్కీ చేసిన విస్తృత చర్యలో ఇది భాగంగా భావించవచ్చు. జర్మనీ మరియు ఉక్రెయిన్ మధ్య కుదిరిన తాజా భద్రతా ఒప్పందంలో భాగంగా, బెర్లిన్ 1.13 బిలియన్ యూరోల (1.22 బిలియన్ డాలర్లు) విలువైన మరింత సైనిక మద్దతు ప్యాకేజీని అందిస్తుంది.
వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను కలవడానికి పారిస్ వెళ్లే ముందు బెర్లిన్‌లో జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌తో సమావేశమయ్యారు. గత జూలైలో జరిగిన నాటో సమ్మిట్‌లో భాగంగా ఉక్రెయిన్‌కు దీర్ఘకాలిక రక్షణ మద్దతును అందించే ప్రణాళికలను G7 దేశాలు ప్రకటించాయి. అయితే కూటమి నాయకులు ఉక్రెయిన్ కూటమిలో చేరేందుకు టైమ్‌టేబుల్‌ను ఇంకా సెట్ చేయడంలో విఫలమయ్యారు.
ఈ రెండు దేశాలతో జరిగిన ద్వైపాక్షిక భద్రత మరియు దీర్ఘకాలిక మద్దతు ఒప్పందాలు ఇటీవలే ఉక్రెయిన్ మరియు యూకే మధ్య జరిగిన భద్రతా ఒప్పందాన్ని అనుసరిస్తాయి. బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఈ ఏడాది జనవరి నెలలో కైవ్‌ను సందర్శించినప్పుడు దీనిపై సంతకం చేశారు. ఈ ఒప్పందం వచ్చే10 సంవత్సరాల వరకు వర్తిస్తుంది.
- వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఈ పర్యటనలో సీనియర్ సెక్యూరిటీ మరియు ఫారిన్ పాలసీ అధికారుల వార్షిక సమావేశమైన మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.
- ఈ వేదికలో ఆయన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో పాటు చెక్ రిపబ్లిక్, డెన్మార్క్ మరియు నెదర్లాండ్స్ నాయకులతో కూడా చర్చలు జరిపారు.
- యూరోపియన్ యూనియన్ మరియు నాటోలో ఉక్రెయిన్ యొక్క భవిష్యత్తు ఏకీకరణకు మార్గం సుగమం చేయడంలో కూడా ఈ ఒప్పందం కీలకంగా ఉండనుంది.
- భవిష్యత్తులో నాటోలో ఉక్రేనియన్ సభ్యత్వం ఐరోపాలో శాంతి మరియు స్థిరత్వానికి ఉపయోగకరమైన సహకారాన్ని కలిగిస్తుందని ఫ్రాన్స్ భావిస్తుంది.
- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నందున మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో మరిన్ని ఆయుధాల కోసం మిత్ర దేశాలను అభ్యర్ధించారు.
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ఇదివరకు ప్రపంచ నాయకుల మనస్సులలో ప్రధాన సంఘర్షణగా ఉండేది, అయితే ఇటీవలే హమాస్‌తో ఇజ్రాయెల్ యుద్ధం మరియు మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న సంక్షోభం కూడా ప్రపంచ నాయకులను కలవరపెడుతుంది. ఈ సంఘర్షణలపై కూడా తక్షణ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉండటంతో ఉక్రెయిన్ సహాయంపై ప్రపంచ నాయకుల దృష్టి మారుతూ వస్తుంది.
ఉచిత ఆన్‌లైన్ కోర్సుల కోసం ఎడ్ఎక్స్‌తో ఆంధ్రప్రదేశ్ అవగాహన ఒప్పందం
మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సులను నిర్వహించే ప్రముఖ గ్లోబల్ ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన ఎడ్ఎక్స్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 16న ఒక అవగహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఎమ్ఒయు ఆంధ్రప్రదేశ్‌లోని 12 లక్షల మంది విద్యార్థులకు ఎడ్ఎక్స్ వేదికలో ఉన్న 2,000 కోర్సులను ఉచితంగా పొందేందుకు అవకాశం కల్పిస్తుంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన క్యాంపు కార్యాలయంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్ వేదికల ద్వారా 26 విశ్వవిద్యాలయాల వైస్-ఛాన్సలర్లు మరియు విద్యార్థులు హాజరవ్వగా, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా శాఖ అధికారులు మరియు ఎడ్ఎక్స్ వ్యవస్థాపకుడు అనంత్ అగర్వాల్‌తో ఈ ఒప్పందంపై సంతకం చేశారు.
ఈ అవగాహన ఒప్పందం ద్వారా విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్సెస్, రియల్ ఎస్టేట్ మేనేజ్‌మెంట్, సైబర్ ఫోరెన్సిక్, స్టాక్ ఎక్స్ఛేంజ్, వెల్త్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ మరియు ఇతర ఆధునిక వర్టికల్స్ వంటి స్థానికంగా అందుబాటులో లేని కోర్సులను నేర్చుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి విద్యార్థులకు ఐబీ పాఠ్యాంశాలను ప్రవేశపెట్టేందుకు ఐబీ (ఇంటర్నేషనల్ బ్యాకలారియేట్)తో ఎంఓయూ చేసుకుంది, దీనికి సంబంధించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉపాధ్యాయులు శిక్షణ పొందుతారని ఇటీవలే ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఈ చొరవ ఉన్నత విద్యారంగంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన మరో విప్లవాత్మకమైన నిర్ణయంగా భావించవచ్చు. ఈ ఒప్పందం పేద, మధ్యతరగతి విద్యార్థులకు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల ద్వారా ఉచితంగా అందించే కోర్సులను పొందేందుకు వీలు కల్పిస్తుంది.
హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2024 : 85వ స్థానంలో భారత్ పాస్‌పోర్ట్
హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2024 విడుదల చేయబడింది. ఫిబ్రవరి 18న విడుదలైన తాజా ర్యాంకింగులో భారతదేశం గత సంవత్సరం కంటే ఒక ర్యాంక్ దిగజారి 85వ స్థానానికి పడిపోయింది. ఈ నివేదిక 199 దేశాల పాస్‌పోర్టుల సూచికలను కవర్ చేసింది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2024 లో 194 దేశాలకు వీసా-రహిత ప్రాప్యతతో ఫ్రాన్స్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.
- హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2024లో రికార్డు స్థాయిలో ఆరు దేశాలు అగ్రస్థానంలో నిలిచాయి.
- జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్ మరియు స్పెయిన్ వంటి ఇతర దేశాలు కూడా ఫ్రాన్స్‌తో పాటు అగ్రస్థానంలో ఉన్నాయి.
- 2023నుండి భారతీయులకు వీసా రహిత యాక్సెస్ ఉన్న దేశాలు 60 నుండి 62కి పెరిగినప్పటికీ, భారతదేశం గత సంవత్సర ర్యాంకు 84 నుండి 85వ స్థానానికి పడిపోయింది.
- గత ఏడాది శ్రీలంక, థాయ్‌లాండ్, కెన్యా వంటి పలు దేశాలు వీసా రహిత జాబితాలో భారత్‌ను చేర్చుకున్నాయి.
- హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2024లో వీసా లేకుండా కేవలం 28 దేశాలకు యాక్సెస్‌తో ఆఫ్ఘనిస్తాన్ ఈ జాబితాలో అట్టడుగున నిలిచింది.
- రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న మరో పొరుగు దేశం పాకిస్థాన్ 34 దేశాల వీసా ఫ్రీ యాక్సెస్‌తో 106 ర్యాంకులో నిలిచింది.
- అలానే మన ఇతర పొరుగు దేశాలలో నేపాల్ 103వ స్థానంలో, బంగ్లాదేశ్ 101, స్థానంలో, శ్రీలంక 99వ స్థానంలో, చైనా 62ఆ స్థానంలో, మాల్దీవులు 58వ స్థానంలో ఉన్నాయి.
భౌగోళిక రాజకీయ సమీకరణాల ప్రకారం దేశం యొక్క పాస్‌పోర్ట్ బలం దాని గ్లోబల్ శక్తిని కొలవడానికి ముఖ్యమైన మెట్రిక్‌గా భావించవచ్చు. బలమైన పాస్‌పోర్ట్ కలిగిన దేశాల పౌరులు వీసా అవసరం లేకుండా ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛగా ప్రయాణించడానికి అనుమతిస్తుంది.
హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2006 లో ప్రారంభించబడింది. గత 19 సంవత్సరాల తన చారిత్రక డేటాతో పాటుగా ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ నుండి ప్రత్యేకమైన డేటా ఆధారంగా అందించే ఏకైక పాస్‌పోర్ట్ ఇండెక్స్ హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ మాత్రమే.
హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో ప్రస్తుతం 199 విభిన్న పాస్‌పోర్ట్‌లు మరియు 227 విభిన్న ప్రయాణ గమ్యస్థానాలను కవర్ చేస్తుంది. గ్లోబల్ మొబిలిటీ స్పెక్ట్రమ్‌లో హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ గ్లోబల్ సిటిజన్‌లు మరియు సార్వభౌమ రాష్ట్రాలకు ప్రామాణిక సూచన సాధనంగా పరిగణించబడుతుంది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రతినెలా నవీకరించబడుతుంది.
ఈ సూచిక ఏటా ప్రపంచంలోని 199 పాస్‌పోర్ట్‌లను వాటి హోల్డర్‌లు వీసా అవసరం లేకుండా ప్రయాణించగల దేశాల సంఖ్యను బట్టి ర్యాంక్ చేస్తుంది. ఒక దేశం యొక్క నిర్దిష్ట పాస్‌పోర్ట్ యాక్సెస్ చేయగల దేశాల సంఖ్య దాని వీసా రహిత "స్కోర్" అవుతుంది.
2006లో సగటున 58 దేశాలకు మాత్రమే వీసా రహితంగా ప్రయాణించే అవకాశం ఉండేది. అయితే గత రెండు దశాబ్దాలుగా గ్లోబల్ మొబిలిటీలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నట్లు తాజా ర్యాంకింగ్‌లు సూచిస్తున్నాయి. ఈ ఏడాది దాదాపు 111 దేశాలు వీసా రహిత యాక్సెస్‌తో ఈ జాబిత రెట్టింపు అయ్యింది.
వీసా పొందకుండానే భారతీయులు వెళ్లగల 62 దేశాల జాబితా: అంగోలా, బార్బడోస్, భూటాన్, బొలీవియా, బ్రిటిష్, వర్జిన్ దీవులు, బురుండి, కంబోడియా, కేప్ వెర్డే దీవులు, కొమొరో దీవులు, కుక్ దీవులు, జిబౌటీ డొమినికా, ఎల్ సల్వడార్, ఇథియోపియా, ఫిజీ, గాబోన్, గ్రెనడా, గినియా-బిస్సావు, హైతీ, ఇండోనేషియా, ఇరాన్, జమైకా, జోర్డాన్, కజకిస్తాన్, కెన్యా, కిరిబాటి, లావోస్, మకావో (చైనా), మడగాస్కర్, మలేషియా, మాల్దీవులు, మార్షల్ దీవులు, మౌరిటానియా, మారిషస్, మైక్రోనేషియా, మోంట్సెరాట్, మొజాంబిక్, మయన్మార్, నేపాల్, నియు, ఒమన్, పలావు దీవులు, ఖతార్, రువాండా, సమోవా, సెనెగల్, సీషెల్స్, సియర్రా లియోన్, సోమాలియా, శ్రీలంక, సెయింట్ కిట్స్ మరియు నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడైన్స్, టాంజానియా, థాయిలాండ్, తైమూర్-లెస్టే, ట్రినిడాడ్ మరియు టొబాగో ట్యునీషియా, తువాలు, వనాటు, టోగో మరియు జింబాబ్వే
ఇండోనేషియా అధ్యక్ష ఎన్నికలలో ప్రబోవో సుబియాంటో విజయం
ఇండోనేషియా అధ్యక్ష ఎన్నికలలో ప్రబోవో సుబియాంటో విజయం సాధించారు. ఫిబ్రవరి 14న జరిగిన అధ్యక్ష ఎన్నికలలో 17,000 ద్వీపాలలోని 205 మిలియన్ల మంది నమోదిత ఓటర్లలో ఎనభై శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్-డే ఎన్నికలుగా నిలిచాయి. నమోదు కాబడిన ఓటర్లలో ప్రబోవో సుబియాంటో 59 శాతం ఓట్లు దక్కించుకోగా, మరో ఇద్దరు అభ్యర్థులు అనీస్ బస్వేదన్ 25 శాతం, గంజర్ ప్రనోవో 16 ఓట్లు దక్కించుకున్నారు.
ప్రబోవో సుబియాంటో ప్రస్తుతం ఇండోనేషియా రక్షణ మంత్రిగా ఉన్నారు, గతంతో ఆయన ప్రత్యేక దళాల కమాండరుగా కూడా సేవలు అందించారు. సైనిక కమాండరుగా ఆయన అనేక మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంన్నారు. జోకోవిగా ప్రసిద్ధి చెందిన ప్రస్తుత అధ్యక్షుడు జోకో విడోడో ఈ అక్టోబర్‌లో పదవీవిరమణ పొందిన తర్వాత ఆయన ఈ బాధ్యతలు స్వీకరిస్తారు.
ప్రబోవో సుబియాంటో గతంలో 2014, 2019 అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసి ఓటమి చెందారు. అయితే తాజా సార్వత్రిక ఎన్నికల సమయంలో అనేక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు చోటు చేసుకున్నాయి. ఈ అవకతవకలపై రాజ్యాంగ న్యాయస్థానానికి ఫిర్యాదు చేయాలని యోచిస్తున్నట్లు ఆయన ప్రత్యర్థులు అనిస్ మరియు గంజర్ తెలిపారు.
- ఇండోనేషియా ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.
- ఇది ఆగ్నేయాసియాలో భారతీయ మరియు పసిఫిక్ మహాసముద్రాల మధ్య ఉన్న ఒక దేశం.
- ఇండోనేషియా దాదాపు 17,000 ద్వీపాల సమూహం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపసమూహంగా ఉంది.
- ఇండోనేషియా ప్రపంచంలో నాల్గవ అత్యధిక జనాభా కలిగిన దేశం.
- ఇండోనేషియా రాజధాని : జకార్తా
- అధికారిక భాష : ఇండోనేషియన్
- ప్రస్తుత అధ్యక్షుడు : జోకో విడోడో
ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడలను ప్రారంభించిన పీఎం మోడీ
ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ యొక్క నాల్గొవ ఎడిషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 19న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ క్రీడా ఈవెంట్ ఈ ఏడాది ఈశాన్య ప్రాంతంలోని ఏడు రాష్ట్రాలలో నిర్వహించారు. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ యొక్క మస్కట్ సీతాకోకచిలుక ఆకారంలో ఉన్న అష్టలక్ష్మిగా డిజైన్ చేశారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు.
ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ 2024 ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర మరియు సిక్కింలలోని 18 వేర్వేరు వేదికల్లో నిర్వహించారు. ఈ క్రీడా ఈవెంటుకు దేశ వ్యాప్తంగా 4544 మంది అథ్లెట్లు హాజరయ్యారు. ఈ క్రీడా ఈవెంట్ అథ్లెటిక్స్, రగ్బీ, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, హాకీ మరియు ఫుట్‌బాల్‌తో సహా 20 క్రీడా విభాగాలను కవర్ చేస్తుంది.
2018 నుండి నిర్వహిస్తున్న ఖేలో ఇండియా గేమ్స్ ప్రస్తుతం ఖేలో ఇండియా వింటర్ గేమ్స్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మరియు ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ పేర్లతో నిర్వహిస్తున్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ చెన్నైలో, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఈశాన్య రాష్ట్రాల యందు, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ లడఖ్ యందు మరియు ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ డామన్ డయ్యు యందు నిర్వహించారు.