Advertisement
తెలుగు ఎడ్యుకేషన్ రోజువారీ కరెంట్ అఫైర్స్ 04 నవంబర్ 2023
Telugu Current Affairs

తెలుగు ఎడ్యుకేషన్ రోజువారీ కరెంట్ అఫైర్స్ 04 నవంబర్ 2023

తెలుగు ఎడ్యుకేషన్ రోజువారీ కరెంట్ అఫైర్స్ నవంబర్ 04, 2023. తాజా జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

శ్రీ సోమనాథ్ ట్రస్ట్ ఛైర్మన్‌గా ప్రధాని మోదీ తిరిగి ఎన్నిక

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శ్రీ సోమనాథ్ ట్రస్ట్ ఛైర్మన్‌గా తిరిగి ఎన్నికయ్యారు. శ్రీ సోమనాథ్ ట్రస్ట్ (ఎస్‌ఎస్‌టీ) అనేది ఒక మతపరమైన స్వచ్ఛంద సంస్థ. ఎస్‌ఎస్‌టీ బోర్డు ఛైర్మన్‌గా ప్రధాని ఎన్నికవ్వడం ఇది వరుసగా మూడవ సారి. 2020లో అప్పటి ప్రస్తుత ఛైర్మన్ కేశూభాయ్ పటేల్ దురదృష్టవశాత్తూ మరణించిన తర్వాత 2021లో మొదటిసారి ప్రధాని మోడీ ఈ బాధ్యతలు స్వీకరించారు. కేశుభాయ్ పటేల్ 2004 నుండి 2020లో ఆయన మరణం వరకు సుదీర్ఘకాలం ఎస్‌ఎస్‌టీ ఛైర్మన్‌గా పనిచేశారు.

శ్రీ సోమనాథ్ ట్రస్ట్ అనేది భారతదేశంలోని గుజరాత్‌లోని ప్రభాస్ పటాన్‌లో ఉన్న శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగ్ ఆలయాన్ని నిర్వహించే ఒక పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్. ఈ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి, ఇది హిందూ మతంలో శివునికి అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయ పునర్నిర్మాణం మరియు నిర్వహణ లక్ష్యంతో 1950లో ఈ ట్రస్ట్ స్థాపించబడింది.

సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఐపీఎస్ ప్రవీణ్ మధుకర్ పవార్

సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ మధుకర్ పవార్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లో ఐదేళ్లపాటు జాయింట్ డైరెక్టర్‌గా నియమిస్తూ సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పవార్ కర్ణాటక కేడర్‌కు చెందిన 2003 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది భారతదేశంలో ఒక అగ్రగామి పోలీస్ విచారణ సంస్థ. దీనిని సంక్షిప్తంగా సిబిఐ అంటారు. ఇది 1941లో వార్ అండ్ సప్లై డిపార్ట్‌మెంట్‌లో లంచం మరియు అవినీతికి సంబంధించిన కేసులను పరిశోధించే సంస్థగా స్థాపించబడింది. స్వాతంత్రం అనంతరం 1 ఏప్రిల్ 1963 నుండి ఇది ప్రధాన దేశీయ నేర పరిశోధనా సంస్థగా రూపుమార్చుకుంది. ఇది పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. దీని ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ సూద్.

ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మనోరంజన్ మిశ్రా

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మనోరంజన్ మిశ్రా నియమితులయ్యారు. మిశ్రా నవంబర్ 01, 2023 నుండి ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈయన ఈ హోదాకు పదోన్నతి పొందకముందు, రెగ్యులేషన్ విభాగంలో చీఫ్ జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆర్‌బీఐ యొక్క ఎన్‌ఫోర్స్‌మెంట్, రిస్క్ మానిటరింగ్ మరియు ఎక్స్‌టర్నల్ ఇన్వెస్ట్‌మెంట్స్ & ఆపరేషన్స్ వంటి మూడు విభాగాల బాధ్యతలు మిశ్రా నిర్వహిస్తారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క నియంత్రణకు బాధ్యత వహించే భారతదేశపు సెంట్రల్ బ్యాంక్. ఇది దేశంలో ప్రధాన ఆర్థిక నియంత్రణ సంస్థ. ఇది భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ యాజమాన్యంలో ఉంది. ఇది భారత రూపాయి యొక్క నియంత్రణ, జారీ మరియు సరఫరా మరియు ఇతర బ్యాంకుల చట్టబద్దమైన నిర్వహణకు బాధ్యత వహిస్తుంది. దీనిని 1935 ఏప్రిల్ 1న భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం ద్వారా కోల్‌కతాలో స్థాపించారు. దీని ప్రస్తుత ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఆర్‌బీఐ ప్రస్తుత చైర్మనుగా శక్తికాంత దాస్ ఉన్నారు.

భారతదేశ స్వంత వాయు రక్షణ వ్యవస్థ అభివృద్ధిలో డిఆర్‌డిఒ

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మకమైన స్వదేశీ సుదూర వాయు రక్షణ వ్యవస్థ అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తుంది. ప్రాజెక్ట్ కుషా పేరుతొ 2028-29 నాటికీ భారత వైమానిక దళానికి సుదూర వైమానిక రక్షణ వ్యవస్థను అందించడానికి సిద్ధం అవుతుంది. దీని కోసం 21,700 కోట్ల అంచనా బడ్జెట్‌తో ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ స్వదేశీ ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రాజెక్ట్ కుషా అనేది భారత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ యొక్క సుదూర వాయు రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి చేపట్టిన ప్రతిష్టాత్మక స్వదేశీ ప్రాజెక్ట్. క్రూయిజ్ క్షిపణులు, స్టెల్త్ ఫైటర్ జెట్‌లు మరియు డ్రోన్‌లతో సహా వైమానిక ముప్పుల నుండి భారతదేశానికి బలమైన కవచాన్ని అందించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఇది 2028-29 నాటికి అమలులోకి వస్తుందని భావిస్తున్నారు.

యూఎన్ సలహా కమిటీలో భారత సభ్యుడుగా సురేంద్ర కుమార్ అధానా

అడ్మినిస్ట్రేటివ్ మరియు బడ్జెట్ ప్రశ్నలపై ఐక్యరాజ్యసమితి సలహా కమిటీలో పనిచేయడానికి భారత దౌత్యవేత్త సురేంద్ర కుమార్ అధానా తిరిగి ఎన్నికయ్యారు. ఆయన 2024-26 కాలానికి ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఐక్యరాజ్యసమితి అడ్వైజరీ కమిటీ అనేది విస్తృత భౌగోళిక ప్రాతినిధ్యం ఆధారంగా మూడు సంవత్సరాల కాలానికి యూఎన్ జనరల్ అసెంబ్లీచే ఎన్నుకోబడిన 21 మంది సభ్యులతో కూడిన నిపుణుల బృందం. ఈ సభ్యులు సభ్య దేశాల ప్రతినిధులుగా కాకుండా వ్యక్తిగత హోదాలో పనిచేస్తారు.

ఐక్యరాజ్యసమితి తన అనుబంధ సంస్థలు మరియు ఏజెన్సీలకు నిపుణుల సలహాలను అందించే అనేక సలహా కమిటీలను కలిగి ఉంది. ఈ కమిటీలు అకాడెమియా, ప్రభుత్వం, పౌర సమాజం మరియు ప్రైవేట్ రంగం నుండి తీసుకోబడిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వతంత్ర నిపుణులతో కూడి ఉంటాయి. అందులో అడ్మినిస్ట్రేటివ్ మరియు బడ్జెట్ ప్రశ్నలపై సలహా కమిటీ అనేది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి పరిపాలనా మరియు బడ్జెట్ విషయాలపై సలహాలను అందించే స్వతంత్ర నిపుణుల కమిటీ.

దేశంలో ఇ-బ్యాంక్ గ్యారెంటీ సేవలను ప్రారంభించిన హెచ్‌ఎస్‌బిసి

దేశంలో ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారెంటీ ప్లాట్‌ఫారమ్‌ను అందించిన మొదటి విదేశీ బ్యాంపైగా హెచ్‌ఎస్‌బిసి ఇండియా అవతరించింది. ఇటీవలే హెచ్‌ఎస్‌బిసి ఇండియా నేషనల్ ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎన్‌ఇఎస్‌ఎల్) తో కలిసి తన ఎంఎస్ఎంఈ మరియు కార్పొరేట్ క్లయింట్‌ల కోసం ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారెంటీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇ -స్టాంపింగ్ మరియు ఇ -సైనింగ్ సాంకేతికతో వాణిజ్యాన్ని డిజిటలైజ్ చేయడం దీని ప్రధాన లక్ష్యం.

ఇ-బిజి (e-BG) అని పిలువబడే ఈ ప్లాట్‌ఫారమ్ వ్యాపారాలకు ఆన్‌లైన్‌లో బ్యాంక్ గ్యారెంటీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి మరియు జారీ చేయడానికి అనుమతిస్తుంది. ఇది బ్యాంక్ గ్యారెంటీలను పొందే ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. ఇది సాంప్రదాయ కాగితం ఆధారిత బ్యాంక్ గ్యారెంటీ ప్రక్రియను భర్తీ చేసే డిజిటల్ పరిష్కారం. ఇది వ్యాపారాలకు పేపర్ డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా మొత్తం బ్యాంక్ గ్యారెంటీ ప్రక్రియను ఆన్‌లైన్‌లో పూర్తి చేయడానికి అనుమతిస్తుంది

గిఫ్ట్ సిటీ ఐఎఫ్ఎస్‌సి రిజిస్ట్రేషన్‌ పొందిన తోలి బీమా కంపెనీగా ఇండియాఫస్ట్ లైఫ్

గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్ సిటీ) యొక్క  ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్‌సి) రిజిస్ట్రేషన్‌ను అందుకున్న మొదటి భారతీయ జీవిత బీమా కంపెనీగా ఇండియాఫస్ట్ లైఫ్ నిలిచింది. ఈ రిజిస్ట్రేషన్ ఇండియా ఫస్ట్ లైఫ్ సేవల పరిధిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి వీలు కల్పిస్తుంది.

గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్ సిటీ) అనేది భారతదేశంలోని మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం (ఐఎఫ్ఎస్‌సి). ఇది భారత ఆర్థిక సంస్థలు, విదేశీ వ్యాపారాన్ని నిర్వహించడం కోసం ఏర్పాటు చేయబడింది. ఇది పన్ను మినహాయింపులు మరియు నియంత్రణ సౌలభ్యంతో సహా వ్యాపారాలకు అనేక ప్రోత్సాహకాలను అందించే ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) . గిఫ్ట్ సిటీ భారతీయ బ్యాంకులు, బీమా కంపెనీలు మరియు ఇతర ఆర్థిక సంస్థలకు అంతర్జాతీయ వేదిక అందిస్తుంది.

ఇది ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించే ఆర్థిక కేంద్రంగా ఏప్రిల్ 2015లో స్థాపించబడింది. ఇది బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, క్యాపిటల్ మార్కెట్‌లు మరియు అసెట్ మేనేజ్‌మెంట్ వంటి రంగాలలో పనిచేస్తున్న ఆర్థిక సంస్థలు మరియు కంపెనీలకు సేవలు అందిస్తుంది. ఇది ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీచే నియంత్రించబడుతుంది. గిఫ్ట్ సిటీ ఐఎఫ్ఎస్‌సి వద్ద ఐఎఫ్ఎస్‌సి బ్యాంకింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసిన మొదటి బ్యాంక్‌గా ఎస్ బ్యాంక్ ఉంది.

Post Comment