తెలుగు ఎడ్యుకేషన్ రోజువారీ కరెంట్ అఫైర్స్ నవంబర్ 05, 2023. తాజా జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.
నేషనల్ గేమ్స్ 2023 విజేతలు
37వ నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా 25 అక్టోబర్ నుండి 9 నవంబర్ 2023 వరకు గోవా రాష్ట్రంలో నిర్వహించబడ్డాయి. ఈ క్రీడలను ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 25న ప్రారంభించారు. ఈ క్రీడలను ఒలింపిక్స్ క్రీడల స్పూర్తితో ఐదేళ్లకోసారి దేశీయ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 1924లో లాహోర్‌లో (ఇప్పుడు పాకిస్తాన్‌లో) తొలిసారి నిర్వహించారు. వీటిని మొదటిలో ఆల్ ఇండియా ఒలింపిక్ గేమ్స్ అని పిలిచేవారు. ఈ క్రీడలలో అత్యధికంగా 4 సార్లు సాయుధ దళాలు విజేతగా నిలిచాయి. 2002లో ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అత్యధిక పతకాలు సాధించి విజేతగా నిలిచింది.
జాతీయ క్రీడలు 2023 గోవాలోని ఐదు ప్రధాన నగరాలు అయిన మపుసా, మార్గోవ్, పంజిమ్, పోండా మరియు వాస్కోలలో నిర్వహించారు. ప్రారంభ వేడుక బాంబోలిమ్‌లోని జీఎంసీ అథ్లెటిక్ స్టేడియం యందు జరిగింది. ఈ క్రీడలను గోవా నిర్వహించడం ఇదే తొలిసారి. వాస్తవానికి గోవా 36వ ఎడిషన్‌కు (2019) హోస్ట్‌గా చేయాల్సి ఉంది, అయితే కోవిడ్-19 కారణంగా ఈవెంట్‌ను హోస్ట్ చేయడం సాధ్యం కాదని అప్పటిలో ప్రకటించింది. ఈ ఈవెంట్ గత అక్టోబర్ నెలలో గుజరాత్ యందు నిర్వహించారు.
ఈ ఈవెంట్ యందు 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు మరియు సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డులకు (భారత సాయుధ దళాలు) చెందిన దాదాపు పదివేల మంది క్రీడాకారులు 43 క్రీడలలో పోటీ పడ్డారు. ఈ ఏడాది జాతీయ క్రీడలలో కొత్తగా స్కే మార్షల్ ఆర్ట్స్, రోల్‌బాల్, సెపక్టక్రా, కలరిపయట్టు, పెన్‌కాక్ సిలాట్ మరియు మినీ గోల్ఫ్ జోడించారు. అలానే గుజరాత్ ఎడిషన్ 2022లో మినహాయించబడిన యాచింగ్ మరియు టైక్వాండోలను తిరిగి చేర్చారు. జాతీయ క్రీడలు 2023లో మహారాష్ట్ర 67 స్వర్ణ, 61 రజత, 65 కాంస్యా (మొత్తం 193) పతకాలతో పాయింట్ పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
గోవాలో జరిగే నేషనల్ గేమ్స్ 2023లో పోటీపడుతున్న క్రీడల పూర్తి జాబితా : ఆక్వాటిక్స్, ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బీచ్ వాలీబాల్, బీచ్ హ్యాండ్‌బాల్, బీచ్ ఫుట్‌బాల్, బిలియర్డ్స్ మరియు స్నూకర్, బాక్సింగ్, కానోయింగ్, సైక్లింగ్, ఫెన్సింగ్ , ఫుట్‌బాల్, గట్కా, గోల్ఫ్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, జూడో, కబడ్డీ, కలరిపయట్టు, ఖో-ఖో, లగోరీ, లాన్ బౌల్స్, లాన్ టెన్నిస్, మల్లఖాంబ్, మినీ గోల్ఫ్, ఆధునిక పెంటాథ్లాన్, నెట్‌బాల్, పెన్‌కాక్ సిలాట్, రోల్ బాల్, రోయింగ్, రగ్బీ , సెపక్టాక్రా, షూటింగ్, స్క్వే మార్షల్ ఆర్ట్స్, స్క్వాష్, టేబుల్ టెన్నిస్, టైక్వాండో, ట్రయాథ్లాన్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, వుషు, యాచింగ్, యోగాసన.
2023 జాతీయ క్రీడల పతక పట్టిక (టాప్ 10)
ర్యాంకు | రాష్ట్రం /యూటీ | పతకాలు (గోల్డ్ + సిల్వర్ + బ్రాంజ్) | మొత్తం పతకాలు |
---|---|---|---|
1 | మహారాష్ట్ర | 67 + 61 + 65 | 193 పతకాలు |
2 | సాయుధ దళాలు | 52 + 22 + 28 | 102 పతకాలు |
3 | హర్యానా | 48 + 33 + 47 | 128 పతకాలు |
4 | కర్ణాటక | 28 + 23 + 25 | 76 పతకాలు |
5 | మణిపూర్ | 25 + 19 + 22 | 66 పతకాలు |
6 | మధ్యప్రదేశ్ | 24 + 31 + 29 | 84 పతకాలు |
7 | ఢిల్లీ | 19 + 17 + 46 | 82 పతకాలు |
8 | తమిళనాడు | 17 + 20 + 24 | 61 పతకాలు |
9 | కేరళ | 15 + 19 + 21 | 55 పతకాలు |
10 | ఉత్తరప్రదేశ్ | 11 + 19 + 22 | 52 పతకాలు |
12 | గోవా (ఆతిధ్య నగరం) | 11 + 12 + 26 | 49 పతకాలు |
16 | ఆంధ్రప్రదేశ్ | 7 + 3 + 12 | 22 పతకాలు |
22 | తెలంగాణ | 3 + 8 + 8 | 19 పతకాలు |
ఒక్క పతకం కూడా సాధించని రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతాలు : మేఘాలయ, లడఖ్, పుదుచ్చేరి |
ఏడాది వారీగా నేషనల్ గేమ్స్ ఛాంపియన్స్
- 1985 జాతీయ క్రీడలు (న్యూఢిల్లీ) : విజేత మహారాష్ట్ర
- 1987 జాతీయ క్రీడలు (కేరళ) : విజేత కేరళ
- 1994 జాతీయ క్రీడలు (బొంబాయి & పూణే) : విజేత మహారాష్ట్ర
- 1997 జాతీయ క్రీడలు (బెంగుళూరు) : విజేత కర్ణాటక
- 1999 జాతీయ క్రీడలు (ఇంపాల్) : విజేత మణిపూర్
- 2001 జాతీయ క్రీడలు (పంజాబ్) : విజేత పంజాబ్
- 2002 జాతీయ క్రీడలు (హైదరాబాద్) : విజేత ఆంధ్రప్రదేశ్
- 2007 జాతీయ క్రీడలు (గౌహతి) : విజేత సాయుధ దళాలు
- 2011 జాతీయ క్రీడలు (జార్ఖండ్) : విజేత సాయుధ దళాలు
- 2015 జాతీయ క్రీడలు (కేరళ) : విజేత సాయుధ దళాలు
- 2022 జాతీయ క్రీడలు (సూరత్) : విజేత సాయుధ దళాలు
- 2023 జాతీయ క్రీడలు (గోవా) : విజేత మహారాష్ట్ర
కర్ణాటకలో పునీత్ రాజ్‌కుమార్ హృదయ జ్యోతి యోజన ప్రారంభం
కర్ణాటక ప్రభుత్వం కొత్తగా డా.పునీత్ రాజ్‌కుమార్ హృదయ జ్యోతి యోజన పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని నిరుపేద రోగులకు ఉచిత గుండె శస్త్రచికిత్స అందించేందుకు ఈ పథకం రూపొందించారు. దీనికి దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ పేరు పెట్టారు. పునీత్ రాజ్ కుమార్ 46 ఏళ్ళ వయసులో 29 అక్టోబర్ 2021న గుండెపోటుతో మరణించారు. దాతృత్వానికి మరియు సామజిక సేవకు పేరుగాంచిన దివంగత పునీత్ రాజ్‌కుమార్‌కు ఇది తగిన నివాళిగా భావిస్తున్నారు.
ఈ పథకం ఓపెన్-హార్ట్ సర్జరీ, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ సర్జరీ మరియు ఇతర కార్డియాక్ ప్రక్రియల ఖర్చును కవర్ చేస్తుంది. రోగులు దారిద్య్రరేఖకు దిగువన ఉండి, కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.2 లక్షల కంటే తక్కువ ఉన్నట్లయితే వారు ఈ పథకానికి అర్హులు. బెంగళూరులోని కర్ణాటక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కర్ణాటకలోని వేలాది మంది రోగులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.
ఇండియన్ నేవీ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్ 2023
ఇండియన్ నేవీ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్ 2023 ఈవెంట్ 05 నవంబర్ నుండి 09 నవంబర్ 2023 వరకు ముంబైలో నిర్వహించారు. ఈ ఈవెంట్ ఇండియన్ నేవల్ వాటర్‌మాన్‌షిప్ ట్రైనింగ్ సెంటర్ యందు నిర్వహించారు. ఇండియన్ నేవీ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్ అనేది నావల్ హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న ఇండియన్ నేవల్ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే వార్షిక కార్యక్రమం. ఇందులో నౌకాదళ అధికారులు, క్యాడెట్‌లు మరియు నావికుల (అగ్నివీర్స్‌తో సహా)తో కూడిన మూడు నావల్ కమాండ్‌ల బృందాలు పాల్గొన్నాయి.
ఈ ఛాంపియన్‌షిప్ మూడు ఫార్మాట్లలో నిర్వహించబడుతుంది. ఇందులో ఫ్లీట్ రేసింగ్, టీమ్ రేసింగ్ మరియు మ్యాచ్ రేసింగ్ ఉంటాయి. వీటిలో నావికా సిబ్బంది ఐదు రకాల బోట్లలో పోటీపడతారు. మహిళలకు ILCA-6 తరగతి, పురుషులకు ILCA-7 తరగతి, విండ్‌సర్ఫింగ్ ఓపెన్ కోసం బిక్ నోవా క్లాస్ బోర్డు, టీమ్ రేసింగ్ కోసం లేజర్ బహియా క్లాస్ బోట్ మరియు మ్యాచ్ రేసింగ్ కోసం J24 తరగతి పడవను ఉపయోగిస్తారు.
ఇండియన్ నేవీ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్ అనేది నావికాదళ సిబ్బందిలో సెయిలింగ్‌ను ప్రోత్సహించడానికి నిర్వహించబడే వార్షిక కార్యక్రమం. ఈ ఛాంపియన్‌షిప్ యందు సెయిలర్‌లు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి మరియు ఇండియన్ నేవీ సెయిలింగ్ ఛాంపియన్ టైటిల్ పొందేందుకు పోటీపడతారు.