Advertisement
తెలుగు ఎడ్యుకేషన్ రోజువారీ కరెంట్ అఫైర్స్ 08 నవంబర్ 2023
Telugu Current Affairs

తెలుగు ఎడ్యుకేషన్ రోజువారీ కరెంట్ అఫైర్స్ 08 నవంబర్ 2023

తెలుగు ఎడ్యుకేషన్ రోజువారీ కరెంట్ అఫైర్స్ నవంబర్ 08, 2023. తాజా జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

గ్లెన్ మాక్స్‌వెల్ 201 పరుగులతో రికార్డ్-బ్రేకింగ్ డబుల్ సెంచరీ

ఇండియాలో జరుగుతున్నా 2023 ఐసీసీ ఒన్డే ప్రపంచ కప్పులో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ 201 పరుగులతో రికార్డ్-బ్రేకింగ్ డబుల్ సెంచరీ నమోదు చేసాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన 292 పరుగుల పరుగుల ఛేదనలో 91/7 ఉన్న ఆస్ట్రేలియాను విజయ తీరానికి చేర్చే క్రమంలో మాక్స్‌వెల్ ఫిట్ సాధించాడు. ఈ గేమ్ యందు మాక్స్‌వెల్ కేవలం 128 బంతుల్లో 201 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచులో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించింది.

  • మ్యాక్స్‌వెల్ యొక్క డబుల్ సెంచరీ రెండవ ఇన్నింగ్స్‌లో ఒక బ్యాట్స్‌మన్ చేసిన అత్యధిక స్కోరుగా ఉంది. 2021లో జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై ఫఖర్ జమాన్ చేసిన 193 పరుగులే ఇప్పటి వరకు ఛేజింగ్‌లో అత్యధిక స్కోరుగా ఉంది.
  • మ్యాక్స్‌వెల్ డబుల్ సెంచరీ చేసిన మొదటి నాన్ ఓపెనర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు నమోదు అయినా డబల్ సెంచరీలు అన్నీ మొదటి మూడు నెంబర్ ఆటగాళ్లు చేసినవే ఉన్నాయి.
  • ఈ డబుల్ సెంచరీతో ఆస్ట్రేలియా తరఫున పురుషుల ఒన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డును కూడా మాక్స్‌వెల్ కైవసం చేసుకున్నాడు.
  • ఈ డబుల్ సెంచరీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌లో వచ్చిన మూడో డబుల్ సెంచరీగా రికార్డు సృష్టించింది. 2015లో వెస్టిండీస్‌పై మార్టిన్ గప్టిల్ (237*), జింబాబ్వేపై క్రిస్ గేల్ (215) మాత్రమే ఈ ఘనతను సాధించారు.
  • ఇది ఇప్పటి వరకు నమోదు అయిన డబల్ సెంచరీలలో రెండవ వేగవంతమైనది. 128 బంతుల్లో 200 పరుగుల స్కోరు చేసిన మ్యాక్స్‌వెల్, తృటిలో ఇషాన్ కిషన్ యొక్క 126 బంతుల డబల్ సెంచరీ రికార్డును కోల్పోయాడు.
  • ఈ మ్యాచులో మ్యాక్స్‌వెల్-కమ్మిన్స్ నెలకొల్పిన 202 పరుగుల భాగస్వామ్యం, వన్డే క్రికెట్టులొ ఏడో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది.

బీహార్‌లో మూడింట ఒక వంతు కుటుంబాల నెలవారీ ఆదాయం 6 వేలు

బీహార్ కుల సర్వే నివేదిక 2023 ప్రకారం ఆ రాష్ట్రంలో దాదాపు 2.97 కోట్ల కుటుంబాలు ఉండగా, అందులో 94 లక్షల కంటే ఎక్కువ మంది (34.13%) నెలకు రూ. 6,000 లేదా అంతకంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నట్లు పేర్కొంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరి సమర్పించిన నివేదిక ప్రకారం బీహార్‌లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారిలో అత్యధికంగా ఎస్సీలలో 43.93% పేదరికం ఉండగా 33.58% ఈబీసీ కుటుంబాలు ఈ జాబితాలో ఉన్నాయి.

బీహార్ కుటుంబాల్లో మూడోవంతు కంటే ఎక్కువ మంది రోజుకు రూ. 200తో జీవిస్తున్నట్లు ఈ సర్వే వెల్లడిస్తుంది. రాష్ట్ర జనాభాలో కేవలం 7% మాత్రమే గ్రాడ్యుయేట్లు ఉన్నట్లు, దాదాపు 96% మందికి సొంత వాహనాలు లేనట్లు నివేదించింది. రాష్ట్రంలో 14% పైగా ప్రజలు కచ్చా గృహాలలో నివసిస్తున్నారు, వీరిలో 15% మంది గుడిసెలలో మరియు మరో 26% మంది టిన్ షెడ్ ఇళ్లలో జీవనం సాగిస్తున్నారు.

బీహార్ జనాభాలో 37% మంది 8వ తరగతి వరకు చదివిన వారు ఉండగా వారిలో 22.67% మంది 5వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. 10వ తరగతి వరకు చదువుకున్నా వారు కేవలం 14.71% మంది మాత్రమే ఉన్నారు, అంటే ఆ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా (సుమారు 52%) 10వ తరగతి లేదా అంతకంటే తక్కువ చదువుకున్నా వారు ఉన్నట్లు వెల్లడించింది. 11వ తరగతి వరకు చదివిన వారు 9.19% ఉండగా, 12వ తరగతి ఉత్తీర్ణులైన వారు కేవలం 7% మాత్రమే ఉన్నారు.

ఈ ఏడాది జనవరి మరియు ఆగస్టు మధ్య నిర్వహించిన సమగ్ర బీహార్ కులాల సర్వే నివేదికను నవంబర్ 7న ఆ రాష్ట్ర ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. ఈ సర్వే ఒక్కో కులం, సామాజిక వర్గం, విద్యా, ఆర్థిక స్థితిగతులతో కూడిన సవివరమైన నివేదికను అందించింది. రాష్ట్రంలో ఈబీసీ మరియు ఒబిసి జనాభా కలిసి 63% ఉన్నట్లు ఈ నివేదిక చూపుతుంది. దీనితో కేంద్రం మొత్తం రిజర్వేషన్ పరిమితిని 50% నుండి 65%కి పెంచాలనే డిమాండ్లు వస్తున్నాయి.

చైనీస్ శాస్త్రవేత్తల యాంటీ ఏజింగ్ పరిశోధనలో పురోగతి

చైనీస్ శాస్త్రవేత్తలు యాంటీ ఏజింగ్ పరిశోధనలో పురోగతి కనబర్చారు. వృద్ధాప్య ప్రక్రియకు దోహదపడే ఒక ప్రత్యేకమైన కణాల సమూహాన్ని గుర్తించినట్లు చైనీస్ పరిశోధకులు పేర్కొన్నారు. ఈ కణ సమూహం వెన్నుపాములోని మోటారు న్యూరాన్‌లను చుట్టుముడుతుందని, అది వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుందని వీరు నమ్ముతున్నారు. రోజువారీ విటమిన్ సి వాడకంతో ఈ వృద్ధాప్యాన్ని తగ్గించవచ్చని ఈ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఈ పరిశోధన కథనం పీర్-రివ్యూడ్ జర్నల్ మరియు ది హాంగ్‌కాంగ్ పీర్-రివ్యూడ్ జర్నల్ పబ్లిష్ చేయబడింది. ఈ అధ్యయనాన్ని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జువాలజీకి చెందిన లియు గ్వాంగ్‌హుయ్, క్యూ జింగ్‌లు మరియు అకాడమీ బీజింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్‌ చెందిన జాంగ్ వీకి సంయుక్తంగా పర్యవేక్షించారు.

వీరు కనుగొన్న ప్రత్యేక కణాల సమూహం చిటినేస్ 1 (CHIT1) అనే ప్రోటీన్‌ను విడుదల చేస్తున్నట్లు నివేదించారు. ఇది మోటారు న్యూరాన్‌లలో వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు. కాకపోతే ఈ ప్రొటీన్ శరీరంలో చాలా తక్కువ గాఢతలో ఉంటుందని, "CHIT1 శరీరం చిటిన్‌ను కలిగి ఉన్న వ్యాధికారక క్రిములతో పోరాడటానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. అయితే కొన్ని పరిస్థితులలో ఇది వేలాది సార్లు గుణించేలా యాక్టివేట్ చేయబడి, వాపు లేదా కణాల నష్టానికి దారి తీస్తుందని వెల్లడించారు.

మోటారు న్యూరాన్‌లు మొత్తం వెన్నుపాము కణాలలో 0.3-0.4 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, అవి శరీర కదలికను నియంత్రించడంలో ప్రధాన పాత్రధారులుగా ఉంటాయి. శరీరం అంతటా అస్థిపంజర కండరాలను నిర్దేశించడం ద్వారా శరీరం యొక్క మోటార్ విధులను ఇవి నియంత్రిస్తాయి. వృద్ధాప్యం విషయానికి వస్తే వెన్నుపాములోని మోటారు న్యూరాన్లు అత్యంత సున్నితమైన కణాలు అని వీరి పరిశోధన ధృవీకరిస్తుంది. వృద్ధుల సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్ మరియు సీరంలో CHIT1 ప్రోటీన్ యొక్క అధిక సాంద్రతను ఈ పరిశోధకులు గమనించారు.

వీరి ఏడేళ్ల పరిశోధన ప్రకారం సీరంలో CHIT1 ప్రోటీన్ల సాంద్రతను నియంత్రించగలిగితే వృద్ధాప్యా ప్రక్రియను ఆలస్యం చేయొచ్చు అని తేల్చారు. అయితే వీరు విటమిన్ సి, CHIT1 ప్రోటీన్‌ నియంత్రణలో కీలకంగా పనిచేస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. 17-18 సంవత్సరాల వయస్సు గల 10 సైనోమోల్గస్ కోతులకు 30mg/kg చొప్పున విటమిన్ సి రోజువారీ మోతాదు ఇవ్వగా, ఆ వృద్ధ కోతుల మోటారు న్యూరాన్‌ల వృద్ధాప్య సంబంధిత సూచికలలో గణనీయమైన మెరుగుదల గుర్తించినట్లు ఈ పరిశోధకులు నివేదించారు.

నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ నుండి భారత్ ఆర్గానిక్స్ బ్రాండ్‌

భారత్ ఆర్గానిక్స్ బ్రాండ్ పేరుతో నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (NCOL) ప్రారంభించిన సేంద్రీయ ఆహార ఉత్పత్తులను కేంద్ర హోం మరియు సహకార మంత్రి అమిత్ షా నవంబర్ 8న ఆవిష్కరించారు. ఇదే వేదిక ద్వారా భారత్ ఆర్గానిక్స్‌కు చెందిన 6 ఉత్పత్తులను కూడా మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ సందర్బంగా వచ్చే ఐదేళ్లలో దేశంలోనే అతిపెద్ద సంస్థగా ఇది అవతరించనుందని, గ్లోబల్ ఆర్గానిక్ ఉత్పత్తుల మార్కెట్‌లో అత్యంత విశ్వసనీయమైన, అతిపెద్ద బ్రాండ్‌గా మారుతుందని అమిత్ షా పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ ఒక వేదిక కల్పించేందుకు, వారి ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఏర్పాట్లు చేసేందుకు నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేయబడింది. ఇది దేశంలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. అలానే భారత్ ఆర్గానిక్స్ బ్రాండ్ పేరుతొ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు మరియు మసాలా దినుసులతో సహా వివిధ రకాల సేంద్రీయ ఉత్పత్తులను విక్రయిస్తుంది.

నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్‌ని అమూల్, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF), నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED), నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB) మరియు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ ద్వారా సంయుక్తంగా ప్రమోట్ చేయాలని భావిస్తున్నారు.

నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ క్రింద ఒక చట్టబద్ధమైన కార్పొరేషన్. దీనిని 500 కోట్ల అధీకృత మూలధనంతో మార్చి 2003లో స్థాపించారు. ఇప్పటి వరకు ఇది మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మరియు నాగాలాండ్‌లో 950 సహకార సంఘాలను కలిగి ఉంది. మరో 2000 కంటే ఎక్కువ సహకార సంస్థల నుండి సభ్యత్వ దరఖాస్తులు స్వీకరించబడ్డాయి.

అలానే నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ కూడా బహుళార్ధసాధక చొరవ, ఇది భూమి మరియు నీటి సంరక్షణ మరియు ఆహార ఉత్పత్తిని పెంచే దేశం యొక్క మిషన్‌కు వేగాన్ని మరియు దిశను అందిస్తుంది. ఇది రాబోయే 5 సంవత్సరాలలో దేశం యొక్క అతిపెద్ద కార్యక్రమమవుతుంది. ప్రజలందరికీ మెరుగైన ఆరోగ్యాన్ని అందించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించే దిశగా ఇది ఒక పెద్ద ముందడుగుగా నిరూపించబడుతుంది. సహజ వ్యవసాయంలో నిమగ్నమైన రైతుల ఉత్పత్తుల మార్కెటింగ్, బ్రాండింగ్ మరియు ఎగుమతి కోసం కూడా ఈ సంస్థ ఒక వేదికగా పనిచేస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా 7.5 మిలియన్ల మందికి టీబీ

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే విడుదల చేసిన గ్లోబల్ ట్యూబర్‌క్యులోసిస్ నివేదిక 2023 ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా 7.5 మిలియన్ల మంది క్షయవ్యాధి బారిన పడినట్లు నివేదించింది. 1995లో ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ పర్యవేక్షణను ప్రారంభించినప్పటి నుండి ఇదే అత్యధిక రోగుల సంఖ్యాగా పరిగణించబడింది. 192 దేశాలు మరియు ప్రాంతాల నుండి వచ్చిన డేటా ప్రకారం 2021లో 10.3 మిలియన్ల నుండి 2022లో 10.6 మిలియన్ల మంది టీబీతో బాధపడుతున్నారని అంచనా వేయబడింది.

అయితే కోవిడ్ 19 తర్వాత 2022లో టీబీ నిర్ధారణ మరియు చికిత్స సేవల స్కేల్-అప్‌లో ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన పురోగతి కనిపించనట్లు ఈ నివేదిక పేర్కొంది. భారతదేశం, ఇండోనేషియా మరియు ఫిలిప్పీన్స్ దేశాలలో 2020 మరియు 2021లో కొత్తగా టీబీతో బాధపడుతున్న వారి సంఖ్య గ్లోబల్ తగ్గింపులో 60 శాతానికి పైగా ఉన్నట్లు పేర్కొంది.

భౌగోళికంగా 2022లో గుర్తించిన టీబీ కేసులలో ఆగ్నేయాసియా (46 శాతం), ఆఫ్రికా (23 శాతం), పశ్చిమ పసిఫిక్ (18 శాతం), తూర్పు మధ్యధరా ప్రాంతంలో (8.1 శాతం), అమెరికా (3.1 శాతం) మరియు యూరప్ (2.2 శాతం) ఉన్నట్లు ఈ రిపోర్టు నివేదించింది. టీబీ సంబంధిత మరణాల సంఖ్య (హెచ్ఐవి ఉన్నవారితో సహా) 2021లో 14 మిలియన్ల నుండి 2022లో 1.3 మిలియన్లకు తగ్గినట్లు పేర్కొంది. 2020-21 లో కొవిడ్ కారణంగా అత్యధిక మరణాలు చోటు చేసుకున్నట్లు పేర్కొంది.

అయితే మల్టీడ్రగ్-రెసిస్టెంట్ టీబీ ఇప్పటికీ ప్రజారోగ్య సంక్షోభంగానే ఉందని ఈ నివేదిక పేర్కొంది. 2022లో 4.1 లక్షల మంది వ్యక్తులలో మల్టీడ్రగ్-రెసిస్టెంట్ లేదా రిఫాంపిసిన్-రెసిస్టెంట్ టీబీని గుర్తించినట్లు పేర్కొంది. వీరిలో ప్రతి ఐదుగురిలో ఇద్దరు మాత్రమే చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. కొత్త టీబీ డయాగ్నస్టిక్స్, డ్రగ్స్ మరియు వ్యాక్సిన్‌ల అభివృద్ధిలో కొంత పురోగతి ఉన్నప్పటికి, ఈ రంగాలలో పెట్టుబడులు పరిమితంగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

క్షయవ్యాధి (టీబీ) అనేది మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఒక అంటు వ్యాధి. ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా ఉమ్మివేసినప్పుడు ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. అయితే క్షయవ్యాధిని 6 మరియు 9 నెలల చికిత్సతో నివారించవచ్చు.

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో సంఘర్షణ

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో అంతర్గతంగా వలసల సంఖ్య 6.9 మిలియన్లకు పెరిగినట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్ నివేదించింది. హింస, దౌర్జన్యాలు, తీవ్ర పేదరికం మరియు మైనింగ్ విస్తరణ ముప్పు కారణంగా ఈ అంతర్గత స్థానభ్రంశం చోటు చేసుకుంటున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. కాంగో భూభాగం మరియు సహజ వనరులపై తీవ్రవాద గ్రూపులతో కూడిన ఘర్షణలు, భద్రతా దళాలచే చట్టవిరుద్ధమైన హత్యలు, రాజకీయ హింస మరియు పొరుగు దేశాలతో పెరుగుతున్న ఉద్రిక్తతలు దీనికి దోహదం పడ్డాయి.

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ప్రపంచంలో రెండవ అత్యంత జాతిపరంగా భిన్నమైన దేశంగా గుర్తింపు పొందింది. కార్బో మరియు ముటిసి మూలాలు మరియు కీలకమైన సంఘటనల విశ్లేషణతో సహా ఈ ప్రాంతంలోని అనేక సంవత్సరాల జాతి సంఘర్షణ ఉంది. 1996 నుండి, తూర్పు కాంగోలో సంఘర్షణల వలన సుమారు ఆరు మిలియన్ల మరణాలు నమోదు అయ్యాయి. 1994 రువాండా మారణహోమం నేపథ్యంలో మొదటి కాంగో యుద్ధం (1996–1997) జరిగింది. ఈ సమయంలో హుటు జాతి తీవ్రవాదులు రువాండాలో ఒక మిలియన్ మైనారిటీ టుట్సీలు మరియు మితవాద హుటులను చంపారు.

ఈ మారణహోమం సమయంలో మరియు తరువాత దాదాపు రెండు మిలియన్ల హుటు శరణార్థులు కాంగో సరిహద్దును దాటారు. 1998లో కిగాలీ మరియు కిన్షాసా మధ్య సంబంధాలు క్షీణించడంతో రెండవ కాంగో యుద్ధం ప్రారంభమైంది. కాంగో ప్రభుత్వంపై రువాండా మితిమీరిన ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నంలో ఈ యుద్ధం పురుడు పోసుకుంది.

కాంగో-రువాండా సరిహద్దులోని ఇటూరి వంటి రాష్ట్రాల్లో గత రెండు దశాబ్దాలుగా ఈ సంఘర్షణలు కొనసాగుతున్నాయి. వీటికి మైనింగ్ కార్యకలాపాల విస్తరణ మరింత ఆజ్యం పోసింది. కాంగో ప్రపంచంలోని అతిపెద్ద లోహాల నిల్వలు మరియు అధునాతన ఎలక్ట్రానిక్‌లను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే అరుదైన భూమి ఖనిజాలకు నిలయంగా ఉంది. ప్రపంచం గతంలో కంటే కోబాల్ట్, రాగి, జింక్ మరియు ఇతర ఖనిజాలపై ఆధారపడటం వలన, స్థానిక మరియు బాహ్య సమూహాలు కాంగో సంఘర్షణలో పాల్గొనడానికి మరింత ప్రోత్సాహాన్ని పొందాయి.

కాంగో నేలలో లభించే విలువైన ఖనిజాలు తూర్పు కాంగోలో సంఘర్షణను ప్రపంచీకరించాయి. ఒకప్పుడు అమెరికా కంపెనీలు కాంగోలో విస్తారమైన కోబాల్ట్ గనులను కలిగి ఉండగా, బరాక్ ఒబామా మరియు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో అవి చాలా వరకు చైనా కంపెనీలకు విక్రయించబడ్డాయి. బీజింగ్‌కు అనుసంధానించబడిన చైనీస్ కంపెనీలు ఇప్పుడు కోబాల్ట్, యురేనియం మరియు రాగి గనుల మెజారిటీని నియంత్రిస్తున్నాయి.

చైనా ఆస్తులను రక్షించడానికి కాంగో సైన్యం తూర్పు కాంగోలోని మైనింగ్ సైట్‌లకు పదేపదే మోహరిస్తుంది. అదే సమయంలో కాంగో యొక్క అంతర్గత సంఘర్షణతో పాటు దాని ఆర్థిక వ్యవస్థలో చైనా దూకుడు మితిమీరుతుంది. కాంగో ప్రభుత్వం చైనీస్ డ్రోన్లు మరియు ఆయుధాల సహాయంతో M23 తిరుగుబాటుదారులతో పోరాడుతోంది. అదే సమయంలో తూర్పు కాంగో సరిహద్దుల్లో సైనిక కార్యకలాపాలను నిర్వహించడానికి ఉగాండా కూడా చైనా ఆయుధాలను కొనుగోలు చేసింది.

2022లో తూర్పు కాంగో మరియు రువాండా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. M23 తిరుగుబాటుదారులు ఐదు సంవత్సరాల నిష్క్రియాత్మకత తర్వాత మళ్లీ తెరపైకి వచ్చారు. జూలై 2023 నాటికి ఉత్తర కివు ప్రావిన్స్‌లోని పెద్ద భాగాలపై నియంత్రణ సాధించారు. కిగాలీ M23 యొక్క పునరుజ్జీవనానికి నిధులు మరియు మద్దతు ఇస్తున్నారని కిన్షాసా ఆరోపించింది. ఈ ఆరోపణకు ఆఫ్రికన్ యూనియన్, యూరోపియన్ యూనియన్ మరియు యునైటెడ్ స్టేట్స్ మద్దతు ఇచ్చాయి.

ప్రతిగా కిగాలీ కిన్షాసా మరోసారి హుటు తీవ్రవాద మిలీషియాలకు మద్దతు ఇస్తోందని మరియు కాంగోలో దాని సైనిక ఉనికిని పెంచిందని ఆరోపించారు. రువాండా మరియు ఉగాండా-మరియు వారి మద్దతుతో మిలీషియాలు- కాంగో గనులలో ఆర్థిక వాటాలను కలిగి ఉన్నట్లు తేలింది. 2023 అక్టోబర్‌లో, గ్రేట్ లేక్స్ రీజియన్‌కు వెళ్లిన యూఎన్ ప్రత్యేక రాయబారి జియా హువాంగ్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు బహిరంగ సైనిక ఘర్షణకు దారితీయవచ్చని హెచ్చరించాడు. ఈ రెండు దేశాలలో సైనిక బలోపేతం, ప్రత్యక్ష ఉన్నత స్థాయి సంభాషణ లేకపోవడం మరియు ద్వేషపూరిత ప్రసంగాలు కూడా దీనికి కారణం.

హింస మరియు దౌర్జన్యాలు, తీవ్ర పేదరికం మరియు మైనింగ్ విస్తరణ ముప్పు కారణంగా అంతర్గతంగా స్థానభ్రంశం చెందిన దాదాపు 7 మిలియన్ల మందికి కాంగో నిలయంగా ఉంది. వలస జనాభాకు తక్షణ భద్రతా మద్దతు, వైద్య సహాయం మరియు ఇతర మానవతా సహాయం అవసరం. సుమారు ఒక మిలియన్ కాంగో జాతీయులు కాంగో సరిహద్దులను దాటి ఆశ్రయం పొందుతున్నారు. M23 మరియు కాంగో ప్రభుత్వం మధ్య శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం కోసం పదే పదే చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వీటి మద్యే డిసెంబర్ 20, 2023న కాంగో జాతీయ ఎన్నికలను నిర్వహిస్తోంది.

సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా హితేష్ కుమార్ ఎస్. మక్వానా

తమిళనాడు కేడర్‌కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి హితేష్ కుమార్ ఎస్ మక్వానా నూతన సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమితులయ్యారు. సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క జాతీయ మ్యాపింగ్ ఏజెన్సీ అయిన సర్వే ఆఫ్ ఇండియాకు అధిపతిగా ఉంటారు.

భారతదేశం యొక్క జియోడెటిక్ మరియు టోపోగ్రాఫికల్ సర్వే, మ్యాప్‌లు మరియు జియోస్పేషియల్ డేటా యొక్క ఉత్పత్తి మరియు నిర్వహణ మరియు సర్వేయింగ్ మరియు మ్యాపింగ్ టెక్నాలజీల అభివృద్ధి మరియు అనువర్తనానికి సర్వే ఆఫ్ ఇండియా నేతృత్వం వహిస్తుంది. 1767లో స్థాపించబడిన సర్వే ఆఫ్ ఇండియా భారతదేశంలోని పురాతన శాస్త్రీయ విభాగాలలో ఒకటి. ఇది భారతదేశ అభివృద్ధిలో, దేశ సరిహద్దుల మ్యాపింగ్ నుండి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రణాళిక వరకు కీలక పాత్ర పోషించింది.

100 శాతం ఎఫ్‌డిఐ ఆమోదం పొందిన తొలి విదేశీ రక్షణ కంపెనీగా సాబ్

భారతదేశంలో రక్షణ ప్రాజెక్ట్ కోసం 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డిఐ) ఆమోదం పొందిన మొదటి విదేశీ కంపెనీగా స్వీడిష్ రక్షణ దిగ్గజం సాబ్ నిలిచింది. అక్టోబర్ 2023లో కార్ల్-గస్టాఫ్ M4 రాకెట్ లాంచర్‌ను తయారు చేయడానికి భారతదేశంలో కొత్త సదుపాయాన్ని ఏర్పాటు చేయాలనే సాబ్ ప్రతిపాదనను భారత ప్రభుత్వం ఆమోదించింది. ఈ 500 కోట్ల విలువైన ఎఫ్‌డిఐ ప్రతిపాదనకు గత నెలలో అనుమతి లభించింది.

విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు దేశీయ రక్షణ తయారీని పెంచే ప్రయత్నంలో భారతదేశం ఇటీవలి సంవత్సరాలలో రక్షణ రంగంలో తన ఎఫ్‌డిఐ నిబంధనలను సడలిస్తోంది. అయితే, ఇప్పటి వరకు, భారతదేశంలో పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థను స్థాపించడానికి ఏ విదేశీ రక్షణ సంస్థకు అనుమతి లేదు.

సాబ్‌కు 100% ఎఫ్‌డిఐ అనుబంధ సంస్థను ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వం అనుమతించడం ఒక ముఖ్యమైన పరిణామం. భారత్‌లో మరిన్ని విదేశీ రక్షణ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఇది మార్గం సుగమం చేస్తుందని, దేశ రక్షణ తయారీ రంగాన్ని పెంచేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు.

భారత్-ఇథియోపియా జాయింట్ ట్రేడ్ కమిటీ 6వ సెషన్

ఇండియా-ఇథియోపియా జాయింట్ ట్రేడ్ కమిటీ యొక్క 6వ సెషన్ ఇథియోపియాలోని అడిస్ అబాబాలో నవంబర్ 6 నుండి 7, 2023 వరకు జరిగింది. ఈ సమావేశానికి వాణిజ్య శాఖ ఆర్థిక సలహాదారు శ్రీమతి ప్రియా పి. నాయర్ సహ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఇథియోపియా మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ & రీజినల్ ఇంటిగ్రేషన్ ట్యాగ్ ములుగేట, ఇథియోపియాలోని భారత రాయబారి రాబర్ట్ షెట్‌కిన్‌టాంగ్ కూడా పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యానికి ఆటంకం కలిగించే అన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు మరియు రెండు దేశాల మధ్య వాణిజ్య ప్రమోషన్‌ను సులభతరం చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. ఇథియోపియాకు చెందిన ఎత్‌స్విచ్‌తో భారతదేశం యొక్క యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)లో అనుసంధానానికి భారతదేశం ఆహ్వానించింది.

అంతేకాకుండా, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడానికి మరియు విదేశీ మారకద్రవ్యాన్ని పరిరక్షించడానికి సహాయపడే స్థానిక కరెన్సీలో వాణిజ్య లావాదేవీలను పరిష్కరించే అవకాశాన్ని అన్వేషించాలని ఇథియోపియాను భారతదేశం కోరింది.

అలానే హెల్త్ అండ్ ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్, టెక్స్‌టైల్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లు, ఫుడ్ అండ్ ఆగ్రో ప్రాసెసింగ్ మొదలైన అంశాలలో ద్వైపాక్షిక వాణిజ్యం మరియు పెట్టుబడి సంబంధాలలో ఇటీవలి పరిణామాలపై ఇరుపక్షాలు ఒక వివరణాత్మక సమీక్షను చేపట్టాయి. స్టాండర్డైజేషన్ & క్వాలిటీ అస్యూరెన్స్ మరియు కస్టమ్స్ ప్రొసీజర్‌ల రంగంలో అవగాహన ఒప్పందం (ఎంఓయులు) కోసం జరుగుతున్న చర్చల పురోగతిని కూడా ఇరుపక్షాలు సమీక్షించాయి.

ఫెడరల్ డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇథియోపియా ఆఫ్రికన్ ప్రాంతంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటి, 2021-22 సంవత్సరంలో 6.4% వృద్ధి అంచనా వేయబడింది. భారతదేశం మరియు ఇథియోపియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2022-23లో 642.59 మిలియన్ల యూఎస్ డాలర్లుగా ఉంది. ఇథియోపియాకు భారతదేశం రెండవ అతిపెద్ద ఎగుమతిదారునిగా ఉంది. భారతీయ కంపెనీలు వ్యవసాయం మరియు పూల పెంపకం, ఇంజనీరింగ్, ప్లాస్టిక్స్, తయారీ, పత్తి మరియు వస్త్రాలు, నీటి నిర్వహణ, ఫార్మాస్యూటికల్స్ మరియు ఆరోగ్య సంరక్షణ వంటి వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టాయి.

Post Comment