తెలుగు ఎడ్యుకేషన్ రోజువారీ కరెంట్ అఫైర్స్ నవంబర్ 06, 2023. తాజా జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఐదేళ్లు పొడిగింపు
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పేరుతొ అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకంను మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. ఇటీవలే ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ విషయాన్నీ వెల్లడించారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 80 కోట్ల మంది పేదలకు ప్రతి నెలా 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలు అందజేస్తున్నారు.
ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన 2020లో ఒక కరోన మహమ్మారి ఉపశమన చర్యగా కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హులైన పేదలకు 5 కిలోల సబ్సిడీ ఆహార ధాన్యంతో పాటుగా నెలకు మరో 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలను ఈ పథకం కింద అందజేస్తుంది. ఇప్పటికే రెండు సార్లు పొడిగించిన ఈ పథకం ఈ ఏడాది డిసెంబరులో ముగియనుంది. అయితే దానికి ముందే ప్రధానమంత్రి వచ్చే ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
కొత్త చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా హీరాలాల్ సమరియా
కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) చీఫ్‌గా సమాచార కమిషనర్ హీరాలాల్ సమరియా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్ యందు జరిగిన కార్యక్రమంలో ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ఏడాది అక్టోబర్ 3న వైకే సిన్హా పదవీకాలం పూర్తయిన తర్వాత సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ పదవి ఖాళీగా ఉంది. సమరియా గతంలో లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ సెక్రటరీగా పనిచేశారు. నవంబర్ 7, 2020న సీఐసీలో సమాచార కమిషనర్‌గా ఉన్నారు.
ప్రస్తుతం సమాచార కమిషన్‌లో ఇద్దరు సమాచార కమిషనర్లు ఉన్నారు. సమాచార కమిషన్ ప్రధాన సమాచార కమిషనర్ నేతృత్వంలో పనిచేస్తుంది. ఇందులో గరిష్టంగా 10 మంది సమాచార కమిషనర్లు ఉండవచ్చు. ప్రధాన సమాచార కమిషనర్ మరియు సమాచార కమిషనర్లు 65 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఈ పదవిలో ఉండవచ్చు.
సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అక్టోబర్ 2005లో సమాచార హక్కు చట్టం, 2005 (ఆర్టీఐ చట్టం) కింద స్థాపించబడి. సమాచార కమిషన్ అధికార పరిధి అన్ని కేంద్ర ప్రభుత్వ అధికారులకు వర్తిస్తుంది. సమాచార హక్కు చట్టం కింద దాఖలైన ఫిర్యాదులు మరియు అప్పీళ్లను పరిష్కరించేందుకు ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది.
ప్రధాన సమాచార కమీషనర్ మరియు సమాచార కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. ఈ నియామక కమిటీకి ప్రధానిమంత్రి అధ్యక్షుడుగా ఉంటారు. రాష్ట్ర సమాచార కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేస్తుంది. దీని పరిధిలోకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వస్తారు. భారత రాజ్యాంగం దాని పౌరులకు కొన్ని ప్రాథమిక హక్కులను హామీ ఇచ్చింది. వాటిలో ఆర్టికల్ 19(1)(ఎ) మరియు ఆర్టికల్ 21, అంతర్లీనంగా, భారత పౌరులకు ప్రభుత్వ ఉద్యోగులు చేసే ప్రతి విషయాన్ని తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నాయి.
అంతర్జాతీయ సౌర కూటమిలో 95వ సభ్య దేశంగా చిలీ
అంతర్జాతీయ సౌర కూటమిలో చిలీ 95వ సభ్య దేశంగా చేరింది. నవంబర్ 6న న్యూఢిల్లీలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అభిషేక్ సింగ్‌తో చిలీ రాయబారి జువాన్ అంగులో సమావేశమైన సందర్భంగా ఈ జాయినింగ్ ధృవీకరణ పత్రాన్ని చిలీ అందచేసింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది భారతదేశం మరియు ఫ్రాన్స్‌లచే 2015లో స్థాపించబడిన ఒక అంతర్ ప్రభుత్వ సంస్థ.
2015లో పారిస్‌లో జరిగిన యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్‌కు ముందు జరిగిన ఇండియా ఆఫ్రికా సమ్మిట్ మరియు సభ్య దేశాల సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ చొరవను ప్రారంభించారు. సౌరశక్తిని ఒక ఆచరణీయ మరియు స్థిరమైన శక్తి వనరుగా ప్రోత్సహించడం మరియు సౌరశక్తి సాంకేతికతల అభివృద్ధి మరియు విస్తరణలో సభ్య దేశాల మధ్య సహకారాన్ని సులభతరం చేయడం దీని ప్రధాన లక్ష్యం.
అంతర్జాతీయ సౌర కూటమి యొక్క ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం నవంబర్ 2016లో మొరాకోలోని మరాకేష్‌లో చోటు చేసుకుంది. నాడు దీనిపై 102 దేశాలు సంతకాలు చేసాయి. దీని ప్రధాన కార్యాలయం ఇండియాలోని హర్యానాలో ఉంది. 2016లో,నరేంద్ర మోడీ మరియు అప్పటి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే సంయుక్తంగా దీనికి శంకుస్థాపన చేశారు.
- స్థాపించిన సంవత్సరం : 30 నవంబర్ 2015
- వ్యవస్థాపకులు : నరేంద్ర మోదీ, ఫ్రాంకోయిస్ హోలాండ్
- అధ్యక్షుడు : ఆర్కే సింగ్
- డైరెక్టర్ జనరల్ : అజయ్ మాథుర్
- అత్యధిక సౌరశక్తిని ఉత్పత్తి చేసే టాప్ 5 దేశాలు : చైనా, యునైటెడ్ స్టేట్స్, జపాన్, జర్మనీ, భారతదేశం
గాంధీనగర్‌లో తోలి ఆస్ట్రేలియా ఇండియా ఎడ్యుకేషన్ & స్కిల్ కౌన్సిల్ సమావేశం
గాంధీనగర్‌లో తొలి ఆస్ట్రేలియా ఇండియా ఎడ్యుకేషన్ మరియు స్కిల్స్ కౌన్సిల్ సమావేశంను నవంబర్ 6న నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర విద్యశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ హెచ్ఈ జేసన్ క్లేర్ అధ్యక్షత వహించారు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ మంత్రి క్లేర్ భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి. ఈ సంధర్బంగా మంత్రులిద్దరూ విద్య మరియు నైపుణ్యంలో ద్వైపాక్షిక సహకారాన్ని సమగ్రంగా సమీక్షించారు.
రెండు దేశాల్లోని ప్రజల చైతన్యం, ఉపాధి మరియు శ్రేయస్సు కోసం విజ్ఞానం మరియు నైపుణ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి అంగీకరించారు. ఈ వేదికగా ఇరు మంత్రులు కొన్ని అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసారు. వాటిలో మొదటిది,
- ఇన్నోవేటివ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ కన్సార్టియం క్యాంపస్ ఒప్పందం : ఇన్నోవేటివ్ రీసెర్చ్ యూనివర్శిటీలు అనేది ఆస్ట్రేలియాలోని 7 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల కూటమి. ఇందులో ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయం, జేమ్స్ కుక్ విశ్వవిద్యాలయం, లా ట్రోబ్ విశ్వవిద్యాలయం, ముర్డోక్ విశ్వవిద్యాలయం, గ్రిఫిత్ విశ్వవిద్యాలయం, కాన్‌బెర్రా విశ్వవిద్యాలయం మరియు వెస్ట్రన్ సిడ్నీ విశ్వవిద్యాలయం ఉన్నాయి. ఆస్ట్రేలియా-భారత్ విద్యా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో పార్టీల మధ్య సన్నిహిత సహకారం కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అందించడం ఈ ఒప్పందం యొక్క లక్ష్యం.
- డీకిన్ యూనివర్సిటీ మరియు నేషనల్ స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఒప్పందం : ఈ ఒప్పందంలో భాగంగా డీకిన్ విశ్వవిద్యాలయం, భారతదేశం యొక్క నేషనల్ స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో దేశంలోని నైపుణ్యాల కొరతను పరిష్కరించడానికి 'గ్లోబల్ జాబ్ రెడీనెస్ ప్రోగ్రామ్' అందిస్తుంది. 30-గంటల నిడివి గల ఈ కార్యక్రమం ఆన్‌లైన్ ద్వారా పంపిణీ చేయబడుతుంది. దీని ద్వారా వచ్చే మూడేళ్లలో 15 మిలియన్ల భారతీయులకు నైపుణ్యం అందించాలని భావిస్తున్నారు.
- డీకిన్ యూనివర్సిటీ మరియు ఐఐటీ గాంధీనగర్ ఒప్పందం : గిఫ్టు సిటీలో ఏర్పాటు చేసిన డీకిన్ యూనివర్శిటీ క్యాంపస్ మరియు ఐఐటీ గాంధీనగర్ ద్వారా స్థానిక యువతకు నాణ్యమైన ఉన్నత విద్య మరియు పరిశోధన పర్యావరణ వ్యవస్థకు మద్దతు అందించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ భాగస్వామ్యం సైన్స్ మరియు ఇన్నోవేషన్, మొబిలిటీలో సహకారంపై దృష్టి పెడుతుంది.
- మోనాష్ యూనివర్సిటీ మరియు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ఒప్పందం : కీలకమైన ఖనిజాలు మరియు పరస్పర ఆసక్తి ఉన్న ఇతర రంగాలలో అకడమిక్ మరియు రీసెర్చ్ కార్యకలాపాలపై సహకారం అందించడం ఈ ఎమ్ఒయు లక్ష్యం. ఈ ఎమ్ఒయులో అకడమిక్ మెటీరియల్స్, సెమినార్లు, వర్క్‌షాప్‌లు మరియు ఇతర విద్యా కార్యకలాపాలు ఉంటాయి.
- మోనాష్ యూనివర్సిటీ మరియు ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మైనింగ్ ఒప్పందం : భారతదేశంలో మైనింగ్ మరియు మినరల్ డెవలప్‌మెంట్ రంగానికి మద్దతుగా మోనాష్ మరియు ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మైనింగ్ మధ్య పరిశోధన మరియు ఆవిష్కరణ సహకారాన్ని పెంపొందించడం ఈ ఎమ్ఒయు లక్ష్యం.
వైజాగ్ నేవీ మారథాన్ 8వ ఎడిషన్ 2023
తూర్పు నావికాదళం వైజాగ్ నేవీ మారథాన్ యొక్క 8వ ఎడిషన్ నవంబర్ 5న విశాఖపట్నంలోని ఆర్‌కె బీచ్ రోడ్‌లో ఘనంగా నిర్వహించింది. నాలుగు అంచెలలో నిర్వహించిన ఈ ఈవెంట్ యందు పాల్గొనేందుకు దాదాపు 12వేల మంది పౌరులు రిజిస్టర్ చేసుకున్నారు.
- 42.2-కిమీల నిడివితో సాగే పూర్తి మారథాన్‌ను తూర్పు నౌకాదళ కమాండ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఇందులో 500 మందికి పైగా పాల్గొన్నారు.
- హాఫ్ మారథాన్‌లో 1,600 మంది రన్నర్లు పాల్గొన్నారు. డిజిఎన్‌పి వైజాగ్ వైస్ అడ్మిరల్ జి శ్రీనివాసన్ ఫ్లాగ్ ఆఫ్ చేశారు.
- 10 కిలోమీటర్ల పరుగును నగర పోలీస్ కమిషనర్ ఎ రవిశంకర్ జెండా ఊపి ప్రారంభించారు. దీనిలో 2,700 మందికి పైగా రన్నర్లు పాల్గొన్నారు.
- 5-కిమీల పరుగులో 7,000 మంది రన్నర్లు పాల్గొన్నారు. దీనిని అడ్మిరల్ సమీర్ సక్సేనా ఫ్లాగ్ ఆఫ్ చేశారు.
భారత్ మరియు శ్రీలంక నౌకాదళల మధ్య సముద్ర భద్రత సమావేశం
భారతదేశం మరియు శ్రీలంక యొక్క నౌకాదళ మరియు కోస్ట్ గార్డ్స్ ప్రతినిధుల మధ్య వార్షిక ఇంటెర్నేషన్ మారిటైమ్ బోర్డర్ లైన్ (ఐఎంబీఎల్) సమావేశం యొక్క 33వ ఎడిషన్ 03 నవంబర్ 2023 న ఐఎంఎస్ సుమిత్రలో జరిగింది. ఈ సమావేశం పాక్ బే (పాక్ జలసంధి) లోని ఇండో-శ్రీలంక మారిటైమ్ బౌండరీ లైన్ ఆఫ్ పాయింట్ కాలిమేర్ వద్ద జరిగింది.
ఈ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి తమిళనాడు మరియు పుదుచ్చేరి నేవల్ ఏరియా (ఫోట్నా) కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్ రియర్ అడ్మిరల్ రవి కుమార్ ధింగ్రా నేతృత్వం వహించగా, శ్రీలంక ప్రతినిధి బృందానికి నార్త్ సెంట్రల్ నేవల్ ఏరియా కమాండర్ రియర్ అడ్మిరల్ బాంక్స్ బనగోడ నేతృత్వం వహించారు.
ఈ సమావేశానికి శ్రీలంక నార్త్ సెంట్రల్ నావల్ ఏరియా డిప్యూటీ కమాండర్ ఎన్ రణసింగ్, డైరెక్టర్ నావల్ ఇంటెలిజెన్స్ కమోడోర్ ఎస్‌జె కుమార మరియు డైరెక్టర్ నావల్ ఆపరేషన్స్ కమోడోర్ ఎడి వీరసింగ్, భారత కోస్ట్ గార్డ్ రీజినల్ హెడ్ క్వార్టర్స్ (ఈస్ట్) డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ పిఎన్ అనూప్, కొలంబోలోని భారత హైకమిషన్‌కు రక్షణ సలహాదారు కెప్టెన్ ఎం ఆనంద్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
రెండు నౌకాదళాలు పాక్ బే మరియు గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతంలో సముద్ర భద్రత, మత్స్యకారుల భద్రత మరియు నిషిద్ధ వస్తువుల రవాణాను అరికట్టడానికి చర్యలు వంటి అనేక అంశాలపై చర్చించాయి. కమ్యూనికేషన్ ఛానెల్‌లను మెరుగుపరచడానికి మరియు సమాచారాన్ని మరింత ప్రభావవంతంగా పంచుకోవడానికి కూడా వారు అంగీకరించారు. ఈ సమావేశం రెండు నౌకాదళాలు సముద్ర భద్రత విషయాలలో తమ సహకారాన్ని మరియు సమన్వయాన్ని బలోపేతం చేయడానికి ఒక వేదిక. భారతదేశం మరియు శ్రీలంక మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక సంబంధాలలో ఇది ముఖ్యమైన భాగం.
మలేషియా విదేశాంగ మంత్రి జాంబ్రీ అబ్దుల్ కదిర్ భారత్ పర్యటన
మలేషియా విదేశాంగ మంత్రి జాంబ్రీ అబ్దుల్ కదిర్ నవంబర్ 5-8 తేదీలలో భారతదేశంలో పర్యటించారు. విదేశాంగ మంత్రి హోదాలో ఆయన భారత్ యందు పర్యటించడం ఇదే తొలిసారి. 12 ఏళ్ళ తర్వాత నిర్వహిస్తున్న 6వ ఇండియా-మలేషియా జాయింట్ కమిషన్ మీటింగ్ యందు పాల్గొనేందుకు ఆయన ఇండియాకు విచ్చేసారు. రెండు దేశాల మధ్య మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం ఈ పర్యటన లక్ష్యం.
న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన ఈ 6వ ఇండియా-మలేషియా జాయింట్ కమిషన్ యందు డాక్టర్ ఎస్ జైశంకర్‌తో కలిసి ఆయన సహాధ్యక్షత వహించారు. రాజకీయ, రక్షణ, భద్రత, ఆర్థిక, వాణిజ్యం మరియు పెట్టుబడులు, ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, పర్యాటకం మరియు ప్రజలకు సంబంధించిన రంగాలలో మలేషియాతో మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్యం యొక్క పురోగతిని ఈ జాయింట్ కమిషన్ సమావేశం సమీక్షించింది.
ఈ పర్యటనలో జాంబ్రీ అబ్దుల్ కదిర్, భారత ఉపరాష్ట్రపతి ధన్‌ఖర్‌తో కూడా భేటీ అయ్యారు. భారతదేశం మరియు మలేషియా మధ్య ఇప్పటికే ఉన్న సంబంధాలను బలోపేతం చేయడానికి మరియు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ ద్వైపాక్షిక విషయాలను చర్చించడానికి ఈ పర్యటన ఒక అవకాశాన్ని కల్పిస్తుందని భావిస్తున్నారు. ఈ పర్యటన గణనీయమైన దౌత్యపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
జల్ దీపావళి - ఉమెన్ ఫర్ వాటర్, వాటర్ ఫర్ విమెన్ క్యాంపెయిన్
మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ తన ఫ్లాగ్‌షిప్ స్కీమ్ అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్) కింద "జల్ దీపావళి - ఉమెన్ ఫర్ వాటర్, వాటర్ ఫర్ విమెన్ క్యాంపెయిన్" అనే ప్రగతిశీల కార్యక్రమాన్ని నవంబర్ 7న ప్రారంభించింది. ఈ ప్రచారం కింద వాటర్ గవర్నెన్స్‌లో మహిళల భాగస్వామ్యాన్నిపెంపొందించేందుకు మహిళా స్వయం సహాయక సంఘాలను 550 కంటే ఎక్కువ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లను సందర్శించడానికి ఏర్పాట్లు చేసింది.
జల్ దీపావళి యొక్క మొదటి దశ ప్రచారంలో అన్ని రాష్ట్రాలు/యూటీలు (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద 5 రాష్ట్రాలు మినహా) నుండి 15,000 కంటే ఎక్కువ మహిళా స్వయం సహాయక సంఘాలు పాల్గొనే అవకాశం ఉంది. ప్రస్తుతం భారతదేశంలో 3,000 కంటే ఎక్కువ నీటి శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. ఇవి రోజుకి 65,000 మిలియన్ లీటర్ల కంటే ఎక్కువ నీటి శుద్ధి చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి.
సాధారణంగా గృహ నీటి నిర్వహణలో మహిళలలే కీలకపాత్ర పోషిస్తారు. కాబట్టి నీటి శుద్ధి ప్రక్రియలు మరియు అవస్థాపన గురించి వారిలో అవగాహన కల్పించడం ద్వారా మహిళలకు సాధికారత కల్పించడంతో పాటుగా, వారి గృహాలకు సురక్షితమైన మరియు స్వచ్ఛమైన త్రాగునీటి ప్రాప్యతను నిర్ధారించే వారి సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. సాంప్రదాయకంగా పురుషులు ఆధిపత్యం చెలాయించే ఈ రంగాలలో మహిళల చేరిక ద్వారా వైవిధ్యాన్ని ప్రోత్సహించడంతో పాటుగా లింగ సమానత్వ సమస్యలను పరిష్కరించడం ఈ ప్రచారం లక్ష్యం.
ఇందులో భాగంగా మహిళలకు నీటి శుద్ధి ప్లాంట్లు & నీటి పరీక్ష సౌకర్యాల పనితీరులో అవగాహన కల్పించడం, మహిళా స్వయం సహాయక సంఘాలు రూపొందించిన సావనీర్‌లు & కథనాల ద్వారా చేరిక & ప్రమేయాన్ని ప్రోత్సహించం, అమృత్ పథకం & నీటి మౌలిక సదుపాయాల గురించి మహిళలకు అవగాహన కల్పించడం & అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంకు నేషనల్ అర్బన్ లైవాలిహుడ్ మిషన్ మరియు ఒడిషా అర్బన్ అకాడమీ నాలెడ్జ్ సహా భాగస్వామ్యం వహిస్తున్నాయి.
స్వచ్ఛ్ దీపావళి శుభ్ దీపావళి ప్రచార కార్యక్రమం ప్రారంభం
మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, 'స్వచ్ఛ్ దీపావళి, శుభ దీపావళి' అనే మరో ప్రచార కార్యక్రమాన్ని నవంబర్ 6 నుండి 12 వరకు నిర్వహించింది. దీపావళి ఉత్సవాల పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడం, ప్రత్యేకించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించడం మరియు స్థానికంగా తయారైన ఉత్పత్తులను ఎంచుకోమని ప్రజలను ప్రోత్సహించడం ఈ ప్రచారం యొక్క ప్రధాన లక్ష్యం.
దీపావళి సందర్భంగా పరిశుభ్రత కేవలం ఇళ్లకే పరిమితం కాకుండా, వీధులు, మార్కెట్లు మరియు పరిసరాలు శుభ్రంగా ఉండేలా ఈ కార్యక్రమం పౌరులను భాగస్వామ్యం చేస్తుంది. దేశంలో పండుగ వాతావరణానికి అనుగుణంగా, గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ్ భారత్ మిషన్-అర్బన్ 2.0 దీనిని నిర్వహిస్తుంది.
పౌరుల జీవనశైలిలో పర్యావరణాన్ని పరిరక్షించడం మరియు సంరక్షించడం అలవాటు చర్యగా మార్చడం కూడా ప్రచార లక్ష్యాలలో ఒకటి. స్వచ్ఛ్ దీపావళి శుభ్ దీపావళి ద్వారా క్లీన్, గ్రీన్ మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత దీపావళిని జరుపుకోవాలని ప్రభుత్వం ప్రజలను కోరుతుంది.