Advertisement
తెలుగు ఎడ్యుకేషన్ డైలీ కరెంట్ అఫైర్స్ 12 నవంబర్ 2023
Telugu Current Affairs

తెలుగు ఎడ్యుకేషన్ డైలీ కరెంట్ అఫైర్స్ 12 నవంబర్ 2023

తెలుగు ఎడ్యుకేషన్ డైలీ కరెంట్ అఫైర్స్ నవంబర్ 12, 2023. తాజా జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

పోర్‌బందర్‌లో వార్షిక నేవీ ఎడ్యుకేషన్ సొసైటీ కాన్ఫరెన్స్

వార్షిక నేవీ ఎడ్యుకేషన్ సొసైటీ కాన్ఫరెన్స్ 2023ను నవంబర్ 9-10 తేదీలలో పోర్ బందర్‌లో నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ అధ్యక్షతన జరిగింది. ఈ కాన్ఫరెన్స్‌లో దేశవ్యాప్తంగా ఉన్న నేవీ చిల్డ్రన్ స్కూల్‌ల అకడమిక్ మరియు అడ్మినిస్ట్రేటివ్ అధికారులు పాల్గొన్నారు.

ఈ కాన్ఫరెన్స్‌లో భాగంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ, మేనేజ్‌మెంట్ అడ్వైజరీ కమిటీ మరియు అకడమిక్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఈ కమిటీలు నౌకాదళ పాఠశాలలలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలుకు నిర్దిష్ట ఫ్రేమ్‌వర్క్‌ ఏర్పాటుపై చర్చించాయి. ఇదే వేదిక ద్వారా గత విద్యా సంవత్సరంలో అకడమిక్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎన్‌సిఎస్‌లకు రోలింగ్ ట్రోఫీలు అందించారు. అదనంగా,ప్రతినిధుల కోసం నేవీ చిల్డ్రన్ స్కూల్ పోర్ బందర్‌లో గైడెడ్ టూర్ నిర్వహించబడింది.

వార్షిక నేవీ ఎడ్యుకేషన్ సొసైటీ కాన్ఫరెన్స్ భారత నౌకాదళానికి ఒక ముఖ్యమైన కార్యక్రమం. ఇది విద్యావేత్తలకు విద్యలో ఉత్తమ అభ్యాసాలను చర్చించడానికి మరియు పంచుకోవడానికి ఒక వేదికను అందిస్తుంది. ఎన్‌సిఎస్‌లు మరియు వారి విద్యార్థుల విజయాలను గుర్తించడానికి కూడా ఈ సదస్సు అవకాశం కల్పిస్తుంది.

తూర్పు నౌకాదళ కమాండ్‌గా రియర్ అడ్మిరల్ రాజేష్ ధంఖర్

తూర్పు నౌకాదళానికి చెందిన స్వోర్డ్ ఆర్మ్, ఈస్టర్న్ ఫ్లీట్‌కు కమాండ్‌గా రియర్ అడ్మిరల్ రాజేష్ ధంఖర్ నవంబర్ 10 న బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో జరిగిన వేడుకలో రియర్ అడ్మిరల్ గుర్చరణ్ సింగ్ నుండి ఈ బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇది వరకు ఐఎన్ఎస్ ఢిల్లీలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా, ఐఎన్ఎస్ ముంబై, విక్రమాదిత్య మరియు ఘరియాల్‌లో కమాండింగ్ ఆఫీసర్‌గా సేవలు అందించారు.

రియర్ అడ్మిరల్ రాజేష్ ధంఖర్ 1990లో భారత నౌకాదళంలో తన కెరీర్ ప్రారంభించారు. ఈయన నావిగేషన్ & డైరెక్షన్‌లో నిపుణుడు. తన 33 సంవత్సరాల కెరీరులో ఉత్తమ ఫ్లాగ్ ఆఫీసరుగా గుర్తింపు సాధించారు. ఈయన యుద్ధనౌకలైన పాండిచ్చేరి, గోదావరి, కోరా మరియు మైసూర్‌లలో కీలక బాధ్యతలు వహించారు.

ఈయన ప్రాజెక్ట్ 15 శిక్షణ బృందంలో భాగంగా నావిగేషన్ & డైరెక్షన్ స్కూల్ మరియు సింగపూర్‌లోని ఆఫీసర్స్ క్యాడెట్ స్కూల్‌లో సేవలు అందించారు. 2015లో యెమెన్‌లోని అడెన్ మరియు అల్-హొడైడా నుండి భారతీయ పౌరుల నాన్ కంబాటెంట్ ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్ కోసం నావో సేన మెడల్ (గ్యాలంట్రీ) అందుకున్నారు.

తూర్పు నౌకాదళం అనేది భారత నౌకాదళానికి చెందిన ఒక ప్రాంతీయ నౌకాదళ విభాగం. దీనిని తూర్పు నౌకాదళ కమాండ్ యొక్క 'స్వోర్డ్ ఆర్మ్' లేదా సన్‌రైజ్ ఫ్లీట్ అని పిలుస్తారు. దీని ప్రధాన కార్యాలయం తూర్పు తీరంలో విశాఖపట్నంలో ఉంది. ఫ్లీట్ అనగా ఒక అడ్మినిస్ట్రేటివ్ కింద పనిచేసే నౌకల సమూహం. భారత నౌకాదళానికి దేశంలో మొత్తం 7 కమాండ్‌లు ఉన్నాయి. వీటి ప్రధాన స్థావరాలు ముంబై, గోవా, కార్వార్, కొచ్చి, చెన్నై, విశాఖపట్నం, కోల్‌కతా మరియు పోర్ట్ బ్లెయిర్‌లో ఉన్నాయి.

పాలస్తీనాలో ఇజ్రాయెల్ సెటిల్మెంట్లకు వ్యతిరేకంగా భారత్ ఓటు

ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ సెటిల్మెంట్ కార్యకలాపాలను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు వేసింది. ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన 145 దేశాలలో భారతదేశం ఒకటి. పాలస్తీనా భూభాగాల్లో భూ ఆక్రమణలు మరియు హింసను ఖండిస్తూ ఈ తీర్మానం వేయబడింది.

అయితే ఇటీవలే గాజా స్ట్రిప్‌లో తక్షణ, దీర్ఘకాలిక మానవతావాద కాల్పుల విరమణను కోరుతూ ఐక్యరాజ్య సమితి నిర్వహించిన ఓటింగ్‌లో భారతదేశం గైర్హాజరైన సంగతి తెలిసిందే, అయితే ప్రస్తుత తీర్మానానికి భారత్ మద్దతు ప్రకటించడం ప్రపంచ రాజకీయ, దౌత్య వర్గాలను నివ్వెరపరిచింది. తూర్పు జెరూసలేం మరియు సిరియన్ గోలన్ హైట్స్‌తో సహా ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో ఇజ్రాయెల్ స్థిరనివాసాల ఏర్పాటును ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి ఈ తీర్మానం సమర్పించింది.

భూ ఆక్రమణ, రక్షిత వ్యక్తుల జీవనోపాధికి విఘాతం, పౌరులను బలవంతంగా తరలించడం మరియు పాలస్తీనా భూభాగాల్లో ఆక్రమణలను ఈ తీర్మానం ప్రత్యేకంగా ఖండిస్తుంది. ఈ తీర్మానానికి భారత్ సహా 145 దేశాలు మద్దతు తెలిపాయి. యునైటెడ్ స్టేట్స్, కెనడా మరియు ఇజ్రాయెల్ వంటి ఏడు దేశాలు దీనికి వ్యతిరేకంగా ఓటు వేయగా, 18 దేశాలు తటస్థంగా ఉన్నాయి. ఈ తీర్మానానికి అనుకూలంగా భారతదేశం అనూహ్య ఓటు వేయడం ప్రత్యేకించి ఇజ్రాయెల్ దృష్టిని ఆకర్షించింది.

ఇజ్రాయెల్‌తో భారత్‌కు ఉన్న సంబంధాలు చాలా ఏళ్లుగా సంక్లిష్టంగా ఉన్నాయి. 1992 నుండి రెండు దేశాలు దౌత్య సంబంధాలను కొనసాగిస్తున్నప్పటికీ, భారత ప్రభుత్వాలు పాలస్తీనా వాదానికి మద్దతుగా ఉన్నాయి. అయితే ఇటీవలి సంవత్సరాలలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి చేస్తున్న తీర్మానాలపై ఓటింగ్‌కు భారతదేశం దూరంగా ఉంటూ వస్తుంది. భారత ప్రభుత్వం ఇదే రాజనీతిని రష్యా, ఉక్రెయిన్ వివాదంలో కూడా ప్రదర్శించింది.

నయీ చేతన - 2.0 కార్యక్రమం ప్రారంభం

లింగ-ఆధారిత హింసకు వ్యతిరేకంగా గత ఏడాది ప్రారంభించిన జాతీయ ప్రచార కార్యక్రమం నయీ చేతన యొక్క రెండవ ఎడిషన్ 'నయీ చేతన – 2.0'ను గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి మద్దతుగా తొమ్మిది మంత్రిత్వ శాఖలు నవంబర్ 11న ఢిల్లీలో సమావేశమయ్యాయి. దీనికి గ్రామీణాభివృద్ధి మంత్రి చరణ్‌జిత్ సింగ్ అధ్యక్షత వహించారు.

ఈ ప్రచార కార్యక్రమాన్ని నవంబర్ 25న నిర్వహించే 'ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయోలెన్స్ ఎగైనెస్ట్ విమెన్' సందర్బంగా ప్రారంభించనున్నారు. ఇది డిసెంబర్ 23 వరకు 34 భారత రాష్ట్రాలు మరియు యూటీలలో జరగనుంది. దీనికి దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ యొక్క స్వయం-సహాయక సంఘాల నెట్‌వర్కులోని 9.8 కోట్లకు పైగా గ్రామీణ మహిళా సభ్యులు నాయకత్వం వహిస్తారు.

ఈ కార్యక్రమానికి మద్దతుగా పాల్గొనే 9 మంత్రిత్వ శాఖలలో పంచాయితీ రాజ్, మహిళా మరియు శిశు అభివృద్ధి, హోం వ్యవహారాలు, న్యాయ శాఖ, సమాచార & ప్రసారాలు, యువజన వ్యవహారాలు మరియు క్రీడలు, విద్య మరియు అక్షరాస్యత, సామాజిక న్యాయం మరియు సాధికారత, అలాగే ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి.

దీన్ దయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (DAY-NRLM) అనేది భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన కార్యక్రమం. ఇది 2011లో స్వర్ణజయంతి గ్రామ స్వరోజ్‌గార్ యోజన (SGSY) యొక్క పునరుద్ధరించబడిన సంస్కరణగా ప్రారంభించబడింది, ఇది స్థిరమైన గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరచడంతో పాటుగా గ్రామీణ పేదలకు, ముఖ్యంగా మహిళలకు ఆర్థిక సేవలను మెరుగుపరచడం ద్వారా పేదరికం తగ్గింపును ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించబడింది.

తెలుగు నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు

టాలీవుడ్ రిషి కపూర్' అని పిలుచుకునే ప్రముఖ తెలుగు నటుడు చంద్ర మోహన్ అనారోగ్యంతో 80 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో నవంబర్ 11న మరణించారు. చంద్ర మోహన్ దాదాపు 150 సినిమాల్లో ప్రధాన పాత్రలతో సహా 932 చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షుకుల ఆధరణ పొందారు.

చంద్రమోహన్ 1945 మే 23న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పమిడిముక్కల గ్రామంలో జన్మించారు. మేడూరులోని ఉన్నత పాఠశాలలో చదువుకున్న ఆయన, బాపట్ల వ్యవసాయ కళాశాలలో పట్టభద్రుడయ్యాడు. చంద్రమోహన్ ప్రముఖ చలనచిత్ర నిర్మాత కె. విశ్వనాథ్ దగ్గర బంధువు.

చంద్ర మోహన్ 1966లో రంగుల రాట్నం సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఇందులో నటనకు గాను ఉత్తమ నటుడిగా రాష్ట్ర నంది అవార్డును అందుకున్నారు. పదహారేళ్ల వయసు (1978) చిత్రం కోసం ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. చంద్ర మోహన్ హీరోగా, హాస్యనటుడిగా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బహుముఖ పాత్రలకు ప్రసిద్ది చెందారు.

నమీబియాలోని వాల్విస్ బేను సందర్శించిన ఐఎన్ఎస్ సుమేధ

భారత నౌకాదళనికి చెందిన ఐఎన్ఎస్ సుమేధ నవంబర్ 10-13 మధ్య నమీబియాలోని వాల్విస్ బేలో సుహృద్భావ సందర్శనను నిర్వహించింది. ఈ సందర్శన సమయంలో, ఐఎన్ఎస్ సుమేధ నమీబియా నేవీ సిబ్బందితో క్రాస్ డెక్ సందర్శనలను చేపట్టింది. అదే సమయంలో స్థానిక ప్రజల కోసం వైద్య శిబరం, ఆయుర్వేద మరియు యోగాపై సెషన్‌ను కూడా నిర్వహించింది. ఈ పర్యటన భారతదేశం మరియు నమీబియా మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, సముద్ర ప్రాంతంలో సహకారాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా జరిగింది.

ఐఎన్ఎస్ సుమేధ భారత నౌకాదళానికి చెందిన మూడవ సరయూ-క్లాస్ పెట్రోలింగ్ నౌక. దీనిని గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ ద్వారా స్వదేశీంగా ఫ్లీట్ సపోర్ట్ ఆపరేషన్స్ మరియు ఆఫ్‌షోర్ పెట్రోలింగ్‌ని చేపట్టడానికి రూపొందించారు. ఐఎన్ఎస్ సుమేధ 21 మే 2011న గోవా షిప్‌యార్డ్‌లో ప్రారంభించబడింది, దీనిని 11 మార్చి 2014న భారత నౌకాదళానికి అప్పగించారు. ఇది 2,200 టన్నుల బరువు, 105 మీ పొడవు ఉంటుంది. దీని గరిష్ట వేగం 25 నాటికల్ మైళ్ళు.

Post Comment