Advertisement
Daily Current affairs in Telugu : 15 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్
Telugu Current Affairs

Daily Current affairs in Telugu : 15 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్

Daily Current affairs in Telugu 15 December 2023. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

హురున్ ఇండియా యొక్క ‘టాప్ 100 అండర్ 30’ జాబితాలో జెప్టో ఫౌండర్స్

హురున్ ఇండియా టాప్ 100 అండర్ 30 లిస్ట్ 2023 లో క్విక్ కామర్స్ యాప్ జెప్టో (Zepto) వ్యవస్థాపకులు అయిన కైవల్య వోహ్రా (21) మరియు ఆదిత్ పలిచా (22) అగ్రస్థానంలో నిలిచారు. ఈ జాబితా 30 ఏళ్లు మరియు అంతకంటే తక్కువ వయస్సు గల 100 మంది వ్యవస్థాపకులు, వారి సంబంధిత రంగాలలో చూపించిన అసాధారణమైన నైపుణ్యం ఆధారంగా రూపొందించబడింది. జెప్టో ఈ ఏడాది $200 మిలియన్లకు పైగా పెట్టుబడులను పొందటంతో పాటుగా, 2023 యొక్క మొదటి భారతీయ యునికార్న్ హోదాను సాధించింది.

ఈ జాబితాలో రెండవ స్థానంలో భాంజు వ్యవస్థాపకుడు నీలకంఠ భాను ప్రకాష్ (24), మూడవ స్థానంలో స్పేస్ టెక్నాలజీ దిగంతరాకు చెందిన రాహుల్ రావత్ (24), నాల్గువ స్థానంలో బికాయా సహ వ్యవస్థాపకురాలు సోనాక్షి నాథస్ని, ఐదవ స్థానంలో భారత్ అగ్రి సహ వ్యవస్థాపకుడు సాయి గోలే  ఉన్నారు.

ముంబై ప్రొఫెసర్‌కు రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ప్రైజ్

రసాయన శాస్త్ర విద్యకు చేసిన కృషికి గుర్తింపుగా ముంబైకి చెందిన ప్రొఫెసర్ సవితా లాడేజ్, రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ యొక్క నైహోల్మ్ ప్రైజ్ ఫర్ ఎడ్యుకేషన్ విజేతగా ఎంపికయ్యారు. సవితా లాడేజ్ హోమీ భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో రసాయన శాస్త్ర అధ్యాపకురాలుగా సేవలు అందిస్తున్నారు. £5000, మెడల్ మరియు సర్టిఫికేట్‌ను

రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ యొక్క ప్రైజెస్ పోర్ట్‌ఫోలియో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది మరియు అత్యంత ప్రతిష్టాత్మకమైనది, రసాయన శాస్త్రాలను అభివృద్ధి చేయడంలో వ్యక్తులు, బృందాలు మరియు సంస్థలు సాధించిన విజయాలను గుర్తిస్తుంది. విజేతలకు 5000 పౌండ్ల ప్రైజ్ మనీ, మెడల్ మరియు సర్టిఫికేట్‌ అందజేస్తుంది.

దేశంలో అత్యంత వేగవంతమైన సోలార్ ఎలక్ట్రిక్ బోట్ ప్రారంభం

బార్రాకుడా పేరుతొ భారతదేశం యొక్క అత్యంత వేగవంతమైన సోలార్-ఎలక్ట్రిక్ బోట్, కేరళలోని అలప్పుజలోని నవగతి పనవల్లి యార్డ్‌లో లాంచ్ చేయబడింది. ఈ అత్యాధునిక నౌకను మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ మరియు నావాల్ట్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

14-మీటర్ల పొడవు మరియు 4.4-మీటర్ల వెడల్పు గల ఈ బోటులో రెండు 50 kW ఎలక్ట్రిక్ మోటార్లు, మెరైన్-గ్రేడ్ ఎల్ఈపి బ్యాటరీ మరియు 6 kW సోలార్ పవర్ ఉన్నాయి. ఇది 12 నాట్ల గరిష్ట వేగంతో, ఒకే ఛార్జ్‌పై 7 గంటల నిడివితో పనిచేస్తుంది. ఇది 12 మంది ప్రయాణీకులకు వసతి కల్పిస్తుంది, అలానే ఇది శబ్దం లేని, కంపనం లేని మరియు కాలుష్య రహిత ప్రయాణాన్ని అందిస్తుంది.

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐకానిక్ నెం.7 జెర్సీ రిటైర్డ్

భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారికంగా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ధరించే ఐకానిక్ నంబర్ 7 జెర్సీని రిటైర్ చేసింది. అనగా నంబర్ 7 జెర్సీ భవిష్యత్తులో ఏ ఆటగాడికి బీసీసీఐ కేటాయించాడు. భారత క్రికెట్టుకు ధోని చేసిన సేవలకు గౌరవార్దంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ధరించిన నంబర్ 10 జెర్సీ తర్వాత, బిసిసిఐ ద్వారా రిటైర్ అయిన రెండవ జెర్సీగా ధోనీ నంబర్ 7 అవతరించింది.

సాధారణంగా భారత్‌ జట్టు తరుపున అరంగేట్రం చేసే ముందు తనకు కావలసిన జెర్సీ నంబర్‌ను ఎంచుకోవడానికి బీసీసీఐ క్రీడాకారులకు అనుమతీస్తుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం, వారు 1 నుండి 100 మధ్య ఏదైనా సంఖ్యను ఎంచుకోవడానికి అనుమతించబడతారు. అయితే బీసీసీఐ ఇకపై నెం.7 జెర్సీని యువ క్రికెటర్లకు అందుబాటులో ఉంచదు. ధోని చివరిసారిగా 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో భారత్ తరపున ఈ జెర్సీతో కనిపించాడు.

ధోని భారతదేశపు అత్యుత్తమ వైట్-బాల్ కెప్టెన్‌లలో ఒకరిగా నిలిచాడు, అతని హయాంలో భారత్ జట్టు వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. అలానే ఆయన నాయతకత్వంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్‌ ఐదు సార్లు విజేతగా నిలిచింది.

అలీ అబు & డానియల్ బారెన్‌బోయిమ్‌కు ఇందిరా గాంధీ శాంతి బహుమతి

ప్రఖ్యాత పియానిస్ట్ డేనియల్ బారెన్‌బోయిమ్ మరియు శాంతి కార్యకర్త అలీ అబు అవ్వాద్‌లకు సంయుక్తంగా 2023 ఇందిరా గాంధీ శాంతి బహుమతి అందించబడింది. ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయెల్-హమాస్ వివాదానికి అహింసాయుత పరిష్కారం దిశగా వారు చేసిన కృషికి వీరు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని అంతర్జాతీయ జ్యూరీ మరియు ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్  బారెన్‌బోయిమ్ మరియు అవ్వద్‌లను ఎంపిక చేసింది.

ఇందిరా గాంధీ శాంతి బహుమతి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జ్ఞాపకార్థం 1986లో స్థాపించబడింది. దీనిని ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ అందిస్తుంది. ఈ అవార్డు విజేతలకు రూ.25 లక్షల నగదు బహుమతి, ప్రశంసా పత్రం అందిస్తారు. ప్రపంచ శాంతి మరియు అభివృద్ధికి కృషి చేసే వ్యక్తులు లేదా సంస్థలకు ఈ అవార్డు ఇవ్వబడుతుంది.

Post Comment