ముఖ్యమైన రోజులు మరియు తేదీలు డిసెంబర్ 2023 కోసం చదవండి. డిసెంబర్ నెలలో జరుపుకునే వివిధ జాతీయ దినోత్సవాలు మరియు అంతర్జాతీయ దినోత్సవాల వివరాలు తెలుసుకోండి. ప్రముఖుల పుట్టిన రోజులు, మరణాల సమాచారం కూడా పొందండి. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది.
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం - డిసెంబర్ 1
ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనిని మొదటిసారి 1988లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రారంభించింది. ఈ రోజున హెచ్ఐవి సంక్రమణ వ్యాప్తి వలన కలిగే ఎయిడ్స్ మహమ్మారి గురించి అవగాహన కల్పించడంతో పాటుగా వ్యాధితో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తారు.
ఎయిడ్స్ అనేది హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ వలన సంక్రమించే అంటువ్యాధి. హెచ్ఐవి రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది మరియు ఇన్ఫెక్షన్ మరియు వ్యాధులతో పోరాడే శరీర సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తుంది. ఇది రక్తం, వీర్యం లేదా యోని ద్రవాల ద్వారా ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తుంది.
జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం - డిసెంబర్ 2
జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవంను ఏటా డిసెంబర్ 2వ తేదీన నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని1984లో డిసెంబర్ 2 మరియు 3 తేదీల్లో భోపాల్ గ్యాస్ విపత్తులో మరణించిన వారిని స్మరించుకునేందుకు నిర్వహిస్తారు. మిథైల్ ఐసోసైనేట్ అనే ప్రాణాంతక గ్యాస్ లీకేజీ కారణంగా ఆ రోజున భోపాల్‌లో వేలాది మంది చనిపోయారు.
ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం - డిసెంబర్ 2
ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 2 న జరుపుకుంటారు . ప్రత్యేకంగా మహిళల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడానికి ఈ రోజు జరుపుకుంటారు. దీనిని 2001 లో మొదటిసారి ప్రారంబించారు.
ఇండియన్ నేవీ డే - డిసెంబర్ 4
1971 ఇండో-పాక్ యుద్ధంలో 'ఆపరేషన్ ట్రైడెంట్'లో భారత నావికాదళం యొక్క పాత్రను గుర్తించి, సాధించిన విజయాలను గుర్తుచేసుకోవడానికి, భారతదేశం ప్రతి సంవత్సరం డిసెంబర్ 04ని నేవీ డేగా జరుపుకుంటుంది. ఆపరేషన్ ట్రైడెంట్ సమయంలో భారత నావికాదళం పీఎన్ఎస్ ఖైబర్‌తో సహా నాలుగు పాకిస్తానీ నౌకలను నేలమట్టం చేసింది. వందలాది మంది పాకిస్తాన్ నేవీ సిబ్బందిని చంపింది. ఈ రోజున, 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో మరణించిన వారిని కూడా స్మరించుకుంటారు.
అంతర్జాతీయ వాలంటీర్ దినోత్సవం - డిసెంబర్ 5
అంతర్జాతీయ వాలంటీర్ దినోత్సవంను ఏటా డిసెంబర్ 5వ తేదీన నిర్వహిస్తారు. దీనినే అంతర్జాతీయ వాలంటీర్ డే ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ అని కూడా అంటారు. దీనిని 1985లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రారంభించింది. ప్రపంచం అంతటా సేవలు అందిస్తున్న వాలంటీర్ల పనిని గుర్తించి, ప్రోత్సహించడానికి ఈ వేడుక నిర్వహిస్తారు.
ప్రపంచ నేల దినోత్సవం - డిసెంబర్ 5
వరల్డ్ సాయిల్ డేను (WSD) ప్రతి సంవత్సరం డిసెంబర్ 5 న జరుపుకుంటారు. ఆరోగ్యకరమైన నేల యొక్క ప్రాముఖ్యతపై దృష్టి కేంద్రీకరించడానికి మరియు నేల వనరుల స్థిరమైన నిర్వహణపై అవగహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
భారత్-బంగ్లాదేశ్ "మైత్రి దివస్" - డిసెంబర్ 6
భారత్ & బంగ్లాదేశ్ లు డిసెంబర్ 06 ని మైత్రి దివస్ (ఫ్రెండ్‌షిప్ డే)గా జరుపుకుంటాయి. బంగ్లాదేశ్ స్వతంత్ర, సార్వభౌమ దేశంగా ఏర్పడటంలో భారత్ ఎంతో సహాయం చేసింది. ఇండో పాక్ యుద్ధం 1971 లేదా బంగ్లా లిబరేషన్ వార్ 1971లో భారత సైన్యం చేతిలో పాకిస్తాన్ అవమానకరమైన ఓటమి కూడా భారతదేశ బంగ్లాదేశ్ సంబంధాలను బలోపేతం చేసింది. డిసెంబర్ 6, 1971న బంగ్లాదేశ్‌తో ద్వైపాక్షిక దౌత్య సంబంధాలను నెలకొల్పిన మొదటి దేశాలలో భారతదేశం ఒకటి.
మహాపరినిర్వాన్ దివస్ - డిసెంబర్ 6
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన మహాపరినిర్వాన్ దివస్'గా జరుపుకోనున్నారు. భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ భారతదేశ హిందూ సమాజంలో అంటరానివారిపై ఆర్థిక మరియు సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయ న్యాయనిపుణుడు, ఆర్థికవేత్త మరియు సంఘ సంస్కర్త, తరువాత హిందూమతాన్ని త్యజించి దళిత బౌద్ధ ఉద్యమాన్ని ప్రేరేపించారు.
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ లో ఉన్నత విద్యను పూర్తిచేసిన అంబేద్కర్, భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీకి ఛైర్మన్‌గా, జవహర్‌లాల్ నెహ్రూ మొదటి మంత్రివర్గంలో న్యాయ మరియు న్యాయ శాఖ మంత్రిగా పనిచేశారు.
ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే - డిసెంబర్ 7
అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 7 న జరుపుకుంటారు. 1996లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 7 ను అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవంగా అధికారికంగా గుర్తించింది. అంతర్జాతీయ పౌర విమానయాన ఒప్పందంపై సంతకం చేసిన 50వ వార్షికోత్సవం అయిన 7 డిసెంబర్ 1994 గౌరవార్థం దీనిని జరుపుకుంటారు.
అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం - డిసెంబర్ 9
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబరు 9న జరుపుకుంటారు. దీనిని 2003 అక్టోబరు 31న ఐక్యరాజ్యసమితి నిర్వహించిన అవినీతి వ్యతిరేక సదస్సు ద్వారా నిర్ణయించారు. ఈ రోజున అవినీతికి సహకరించడం ద్వారా పేద ప్రజల జీవన ప్రమాణాలు ఏవిధంగా ప్రభావితం అవుతాయో, దాని కారణంగా వివిధ రంగాల్లో అస్థిరత పెరిగిపోయి. అంతిమంగా అది మౌలిక వసతుల వైఫల్యానికి, రాజ్య వైఫల్యానికి ఎలా దారి తీస్తుందో అవగాహనా కల్పిస్తారు.
అదే సమయంలో అవినీతి నిర్ములనలో ప్రభుత్వాలు, ప్రయివేటు సంస్థలు, ఎన్జీవోలు, మీడియా, వ్యక్తుల పాత్రను గుర్తిచేస్తారు. పౌరులలో అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచుకోవాల్సి ప్రాముఖ్యతను తెలియజేస్తారు.
మానవ హక్కుల దినోత్సవం - డిసెంబర్ 10
మానవ హక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇది 1948లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనను ఆమోదించిన రోజు. మానవ హక్కులలో జీవించే హక్కు మరియు స్వేచ్ఛ, బానిసత్వం మరియు హింస నుండి విముక్తి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, పని మరియు విద్య హక్కు వంటివి ఉంటాయి. ఈ రోజున పౌరులలో వారి హక్కులపై అవగాహనా కల్పిస్తారు.
ఇంటర్నేషనల్ మౌంటైన్ డే - డిసెంబర్ 11
ప్రతి సంవత్సరం డిసెంబర్ 11 న అంతర్జాతీయ పర్వత దినోత్సవం నిర్వహిస్తారు. పర్వతాల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుపుకుంటారు. ఈ రోజున జీవ వైవిధ్యంలో కీలక భూమిక పోషించే పర్వత పర్యావరణ వ్యవస్థల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తారు.
యూనిసెఫ్ డే - డిసెంబర్ 11
యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ యొక్క దినోత్సవాన్ని ఏటా డిసెంబర్ 11న నిర్వహిస్తారు. ఇది యూనిసెఫ్ ఆవిర్భావ దినోత్సవం. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనాథ పిల్లలకు మానవతా సహాయం అందిస్తుంది.
జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం - డిసెంబర్ 14
ప్రతి సంవత్సరం డిసెంబర్ 14న జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం జరుపుకుంటారు. ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకతపై ప్రజలలో అవగాహనా పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
విజయ్ దివస్ - డిసెంబర్ 16
డిసెంబర్ 16 1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత సాయుధ దళాల విజయానికి గుర్తుగా భారత్ ఏటా డిసెంబర్ 16 ను విజయ్ దివస్ పేరుతో ఉత్సవాలు జరుపుకుంటుంది. 1971 ఇండో-పాకిస్తాన్ వివాదం బంగ్లాదేశ్ లిబరేషన్ కు సంబంధించింది. సాంప్రదాయకంగా ఆధిపత్యం వహించిన పశ్చిమ పాకిస్థానీయులు మరియు మెజారిటీ తూర్పు పాకిస్థానీయుల మధ్య జరిగిన సంఘర్షణ ద్వారా ఈ వివాదం ప్రేరేపించబడింది. దీనిని తూర్పు పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంగా చెప్పొచ్చు.
11 భారత వైమానిక స్థావరాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేయడంతో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది . ఈ దాడికి ప్రతీకారంగా, మాజీ భారత ప్రధాని ఇందిరా గాంధీ పాకిస్తాన్‌పై యుద్ధం చేయమని భారత సైన్యాన్ని ఆదేశించింది, డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 16 వరకు 13 రోజుల పాటు పోరాడి భారతదేశం గెలిచింది, ఫలితంగా బంగ్లాదేశ్ పుట్టింది.
జాతీయ మైనారిటీల హక్కుల దినోత్సవం - డిసెంబర్ 18
భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 18 న జాతీయ మైనారిటీల హక్కుల దినోత్సవం జరుపుకుంటారు. మైనారిటీల హక్కుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. 1992లో దీని మొదటిసారి ప్రారంభించారు.
అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం - డిసెంబర్ 18
అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంను ప్రతి సంవత్సరం డిసెంబర్ 18న నిర్వహిస్తారు. 2000 లో యుఎన్ జనరల్ అసెంబ్లీ దీనిని ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలసదారులకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు, వారికీ తగిన గుర్తింపు, ఆసరా కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
జాతీయ గణిత దినోత్సవం - డిసెంబర్ 22
ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా ఏటా డిసెంబర్ 22 న జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు.భారతదేశంలో మొదటి జాతీయ గణిత దినోత్సవాన్ని 22 డిసెంబర్ 2012 న ప్రారంభించారు. అప్పటి భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ రోజు ప్రకటించారు.
శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ బ్రిటీష్ పరిపాలనా కాలంలో భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్తగా ప్రసిద్ధి చెందారు. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఆయన ఒకరు. శుద్ధ గణితంలో ఈయనకు శాస్త్రీయమైన శిక్షణ లేకపోయినా గణిత విశ్లేషణ, సంఖ్యా శాస్త్రం, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాల్లో విశేషమైన కృషి చేశాడు.
కిసాన్ దివాస్ - డిసెంబర్ 23
ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న భారతదేశంలో రైతుల దినోత్సవం లేదా కిసాన్ దివస్‌ను జరుపుకుంటారు. భారతదేశంలోని రైతుల జీవితాలను మెరుగుపరచడానికి అనేక విధానాలను ప్రారంభించిన రైతు నాయకుడు, భారతదేశ 5వ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ పుట్టినరోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం - డిసెంబర్ 24
వినియోగదారుల ప్రయోజనాలు, హక్కుల రక్షణపై అవగహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటారు.
గుడ్ గవర్నెన్స్ డే - డిసెంబర్ 25
భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబరు 25వ తేదీన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి రోజున సుపరిపాలన దినోత్సవం జరుపుకుంటారు. ప్రభుత్వంలో జవాబుదారీతనం గురించి భారత ప్రజలలో అవగాహన పెంపొందించడం ద్వారా ప్రధాని వాజ్‌పేయిని గౌరవించటానికి 2014లో గుడ్ గవర్నెన్స్ డే స్థాపించబడింది.