సెప్టెంబరు 2022 సంబంధించి జాతీయ, అంతర్జాతీయ కరెంటు అఫైర్స్ తెలుగులో ఉచితంగా చదవండి. వివిధ పోటీ పరీక్షలకు సిద్దమోతున్న అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా నేషనల్, ఇంటర్నేషనల్, సైన్స్ & టెక్నాలజీ, డిఫెన్స్ & సెక్యూరిటీ, బిజినెస్ & ఎకానమీ, అవార్డులు, వార్తల్లో వ్యక్తులు, స్పోర్ట్ విభాగాలకు సంబంధించి పూర్తిస్థాయి తాజా వర్తమాన అంశాలను మీకు అందిస్తున్నాం.
కరెంట్ అఫైర్స్ - సెప్టెంబరు 2022
ఇండియన్ అఫైర్స్
మణిపూర్ షుమంగ్ లీలా ఫెస్టివల్ ప్రారంభం
50వ మణిపూర్ షుమంగ్ లీలా ఫెస్టివల్ 2022, ఇంఫాల్‌లోని ప్యాలెస్ కాంపౌండ్‌లో, ఇబోయైమా షుమంగ్ లీలా షాంగ్లెన్‌లో ప్రారంభమైంది. షుమంగ్ లీలా అనేది మణిపూర్ థియేటర్ ఆర్ట్స్ యొక్క సాంప్రదాయ రూపం. ఈ వేడుకలో మహిళా కళాకారులూ వివిధ వేషాలు ధరించి వీక్షకులను మెప్పిస్తారు. ఇది ఒకరకమైన హాస్య వేడుక.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత పర్యటన
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నాలుగు రోజుల భారత్ పర్యటన నిమిత్తం ఆగష్టు 2న న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆమె పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సంప్రదింపులు జరుపనున్నారు. ఇదే సమయంలో విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకరుతో పాటుగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్‌లను కలవనున్నారు.
షేక్ హసీనా చివరిసారిగా అక్టోబర్ 2019లో భారత్ సందర్శించారు. ఇటీవలి సంవత్సరాలలో ఇరు దేశాల మధ్య అత్యుత్తమ సంబంధాలు కొనసాగుతున్నాయి.
ఒడిశా వ్యవసాయ పండుగ 'నుఖాయ్' 2022
ఒడిషాలో నుఖాయ్ వార్షిక పంట పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఇది పశ్చిమ ఒడిశా మరియు సిమ్‌డేగాలోని పొరుగు ప్రాంతాలలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. గణేష్ చతుర్థి పండుగ మరుసటి రోజు దీనిని జరుపుకుంటారు. ఈ సంధర్బంగా రైతులు కొత్త వ్యవసాయ ఏడాదికి ఆహ్వానం పలుకుతూ, మంచి వర్షాలు, వ్యవసాయానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితుల కోసం ఆకాంక్షిస్తూ భూమి మాతను పూజిస్తారు.
భారత్-జపాన్ 2+2 విదేశీ & రక్షణ మంత్రివర్గ సమావేశం
రెండవ భారతదేశం-జపాన్ 2+2 విదేశీ మరియు రక్షణ మంత్రుల సమావేశంను 08 సెప్టెంబరు 2022 టోక్యోలో నిర్వహించారు. ఈ సమావేశంలో భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి డాక్టర్. ఎస్. జైశంకరుతో పాటుగా జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి, రక్షణ మంత్రి యసుకాజు హమదాలు పాల్గున్నారు.
ఈ సమావేశంలో ప్రధానంగా ఇరు దేశాల మధ్య పరస్పర ఆసక్తులు మరియు ఆందోళనలకు సంబంధించిన ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై, ముఖ్యంగా ఇండో-పసిఫిక్ మరియు ఉక్రెయిన్ యుద్ధంపై చర్చలు జరిగాయి. అదే సమయంలో ఇరుదేశాల భద్రత మరియు రక్షణ సహకారాన్ని పెంపొందించే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు. 2022 ఏడాది భారత్ - జపాన్ దేశాల మధ్య 70 ఏళ్ళ ద్వైపాక్షిక బంధానికి మైలురాయి అయ్యింది.
దేశంలో అతిపెద్ద రబ్బరు డ్యామ్ ప్రారంభం
బీహార్ ముఖ్యమంత్రి, నితీష్ కుమార్ గయాలోని ఫల్గు నదిపై భారతదేశంలోనే అతి పొడవైన రబ్బర్ డ్యామ్ 'గయాజీ డ్యామ్'ను ప్రారంభించారు. 411 మీటర్ల పొడవు, 3 మీటర్ల ఎత్తుతో నిర్మించిన ఈ డ్యామ్ నిర్మాణానికి దాదాపు 312 కోట్లు ఖర్చు చేసారు.
హిందువులు మరియు బౌద్ధమతాల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గయాలో నిర్మించబడిన ఈ రబ్బరు డ్యామ్, పితృపక్ష మేళా సందర్భంగా తమ పూర్వీకుల పిండ దానం మరియు తర్పణం చేయడానికి వచ్చే ప్రజలకు సౌకర్యార్థంగా ఉండనుంది.
నాగాలాండ్‌లో తొలిసారిగా నాగా మిర్చా ఫెస్టివల్
నాగాలాండ్ రాజధాని కొహిమా పరిధిలోని, సెయిహమా గ్రామంలో తొలిసారిగా నాగా మిర్చా (నాగా కింగ్ చిల్లీ) ఫెస్టివల్ నిర్వహించారు. ఈ ఉత్సవాలు నాగాలాండ్ హార్టికల్చర్ డిపార్టుమెంటు కనుసన్నలలో నిర్వహించబాయి. నాగా మిర్చా అనేది నాగాలాండ్‌కు చెందిన ఒకరకమైన మిరప జాతి. నాగాలాండ్ నుండి మొదటి జీఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తిగా నాగా మిర్చా గుర్తింపు పొందింది.
G20 సమ్మిట్ 2023కి భారత్ ఆతిథ్యం
వచ్చే ఏడాది సెప్టెంబరు 9 మరియు 10వ తేదీల్లో జరిగే G20 లీడర్స్ సమ్మిట్ 2023 కి భారతదేశ రాజధాని న్యూఢిల్లీ ఆతిధ్యం ఇవ్వనుంది. అదే సమయంలో భారతదేశం ఈ ఏడాది డిసెంబర్ 1 నుండి వచ్చే ఏడాది నవంబర్ 30 వరకు ఒక సంవత్సరం పాటు G20 అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం దక్కించుకుంది.
అదే సమయంలో ఈ సమావేశంలో అతిధి దేశాలుగా పాల్గునేందుకు బాంగ్లాదేశ్, ఈజిప్టు, మారిషస్, నెథర్లాండ్, నైజీరియా, ఒమాన్, సింగపూర్, స్పెయిన్ మరియు యూఏఈ దేశాలను భారత్ ఆహ్వానిస్తుంది.
G20 అనేది ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల యొక్క ఇంటర్ గవర్నమెంటల్ ఫోరమ్. ఈ కూటమిలో ఆస్ట్రేలియా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశం, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యూకే , యూఎస్ మరియు యూరోపియన్ యూనియన్‌తో సహా 19 దేశాలు ఉన్నాయి.
హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ప్రారంభించిన అమిత్ షా
హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏడాదిపాటు జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా 17 సెప్టెంబరు 2022న ప్రారంభించారు. జాతీయ జెండాలను ఎగురవేసి పారామిలటరీ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఇక మీదట 17 సెప్టెంబరును హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోనున్నారు.
ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, కర్ణాటక రవాణా శాఖ మంత్రి శ్రీరాములు, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ విముక్తి కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్య్ర సమరయోధులకు అధికారికంగా నివాళు అర్పించారు.
సెప్టెంబర్ 17, 1948లో జరిగిన ఆపరేషన్ పోలో తర్వాత అప్పటి హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాల్పుల విరమణ ప్రకటించడం ద్వారా, బ్రిటీష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందిన 13 నెలల తర్వాత హైదరాబాద్‌ను ఇండియన్ యూనియన్‌లో చేర్చడానికి మార్గం సుగమం అయ్యింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది రోజుల అధికారిక బతుకమ్మ ఉత్సవాలు 25 సెప్టెంబర్ 2022న ఘనంగా ప్రారంభమైయ్యాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్రంలో మరియు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో కూడా జరుపుకునే సంప్రాదయ అమ్మవారి పండుగ. 24 జూన్, 2014 న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం "బతుకమ్మ పండుగ"ని టి స్టేట్ ఫెస్టివల్‌గా ప్రకటించింది.
ప్రతి సంవత్సరం ఈ పండుగను శాతవాహన క్యాలెండర్ ప్రకారం పితృ అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు, సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్-అక్టోబర్‌లో. దుర్గా నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ జరుపుకుంటారు.
తొమ్మిది రోజుల ఈ వార్షిక ఉత్సవాల్లో, ప్రత్యేకంగా అమర్చిన పూల చుట్టూ మహిళలు మరియు బాలికలు బతుకమ్మ పాటలు పాడుతూ, నృత్యం చేస్తారు. పండుగ ముగిశాక స్థానిక చెరువుల్లో పూలమాలలు వేసి నిమజ్జనం చేస్తారు.
గులాం నబీ ఆజాద్ కొత్తపార్టీ ఆవిష్కరణ
కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ రాజకీయ నాయకుడు గులాం నబీ ఆజాద్, 26 సెప్టెంబర్ 2022 న 'డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ' పేరుతో తన కొత్త పార్టీని జమ్మూ కాశ్మీరులో ప్రారంభించారు. ఇటీవలే వివిధ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ నుండి నిష్క్రమించిన అజాజ్, 2014 నుండి 2021 మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. అలానే 2005 నుండి 2008 వరకు జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.
అయోధ్యలో లతా మంగేష్కర్ చౌక్ ప్రారంభం
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ 93వ జయంతి సందర్భంగా అయోధ్యలో లతా మంగేష్కర్ చౌక్‌ను 28 సెప్టెంబర్ 2022 న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. కూడలిలో లతా మంగేష్కర్ గౌరవార్దంగా 14 టన్నుల బరువున్న 40 అడుగుల పొడవు మరియు 12 మీటర్ల ఎత్తున్న వీణను ఏర్పాటు చేశారు.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై ఐదేళ్ల నిషేధం
దేశ అంతర్గత భద్రతకు పెను ముప్పు పొంచి ఉన్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) మరియు దాని అనుబంధ సంస్థలపై కేంద్రం ఐదేళ్లపాటు నిషేధం విధించింది. పీఎఫ్‌ఐ మరియు దాని అనుబంధ ఫ్రంట్‌లు దేశంలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని, ఇవి దేశ సమగ్రత, సార్వభౌమాధికారం మరియు భద్రతకు విఘాతం కలిగిస్తున్నాయని మరియు దేశంలోని ప్రజా శాంతి మరియు మత సామరస్యానికి భంగం కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని నోటిఫికేషన్ పేర్కొంది. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967 (37 ఆఫ్ 1967)లోని సెక్షన్ 3లోని సబ్-సెక్షన్ (1) ద్వారా నిషేధం అమలు చేసారు.
ఇంటర్నేషనల్ అఫైర్స్
మొదటి హోమియోపతి ఇంటర్నేషనల్ హెల్త్ సమ్మిట్
దుబాయ్ సిటీ మొదటి హోమియోపతి ఇంటర్నేషనల్ హెల్త్ సమ్మిట్‌కు ఆతిధ్యం ఇచ్చింది. వాతావరణ మార్పులు మరియు గ్లోబల్ వార్మింగ్ వల్ల కలిగే వ్యాధులు" అనే థీమ్‌తో " నిర్వహించిన వరల్డ్ హెల్త్ సమ్మిట్ ఫర్ ప్రైడ్ ఆఫ్ హోమియోపతి" మొదటి ఎడిషన్ ఆగస్టు 29 న దుబాయ్‌లో ఘనంగా జరిగింది. సమ్మిట్‌ను బర్నేట్ హోమియోపతీ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించింది.
యూకే తదుపరి ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్
బ్రిటన్ ప్రధానమంత్రి ఎన్నికలలో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి లిజ్ ట్రస్ ప్రత్యర్థి రిషి సునక్‌ను ఓడించి యూకే తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీనితో థెరిసా మే, మార్గరెట్ థాచర్ తర్వాత బ్రిటన్ ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన మూడవ మహిళగా లిజ్ ట్రస్ నిలిచారు. 27 జులై 2022 న యూకే మాజీ పీఎం బోరిస్ జాన్సన్ రాజకీయ కారణాలతో పీఎం పదివికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు చోటు చేసుకున్నాయి.
యూకే కొత్త హోం సెక్రటరీగా సుయెల్లా బ్రేవర్‌మాన్
యునైటెడ్ కింగ్‌డమ్ కొత్త హోం సెక్రటరీగా భారతీయ సంతతికి చెందిన న్యాయవాది సుయెల్లా బ్రేవర్‌మాన్ నియమితులయ్యారు. ఈమె తల్లిదండ్రులు బ్రేవర్‌మాన్ క్రిస్టీ మరియు ఉమా ఫెర్నాండెజ్'లు భారతీయ మూలానికి చెందినవారు, వీరు 1960లలో వరుసగా కెన్యా మరియు మారిషస్ నుండి బ్రిటన్‌కు వలస వెళ్లారు.
బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ విద్యార్థి స్కాలర్‌షిప్
భారత పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో బంగాబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ విద్యార్థి స్కాలర్‌షిప్‌ను ప్రదానం చేశారు. ఈ స్కాలర్‌షిప్‌ను 1971 భారత్ - పాకిస్తాన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనిక కుటుంబాలకు చెందిన క్లాస్ 10 నుండి క్లాస్ 12 పిల్లలకు అందజేస్తారు.
82,000 భారతీయ విద్యార్థులకు యూఎస్ స్టూడెంట్ వీసా జారీ
యుఎస్ ఎంబసీ రికార్డు స్థాయిలో 82,000 స్టూడెంట్ వీసాలను భారతీయ విద్యార్థులకు జారీ చేసి వార్తకెక్కింది. వీసాల జారీ ప్రాధాన్యత ఇతర దేశాలతో సరిపోల్చితే భారత విద్యార్థులకు అధిక ప్రాధన్యత లభించింది. 2021-22 అకాడమిక్సం ఇయర్ సంబంధించి 167,582 మంది విద్యార్థులు యూఎస్ స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసారు. యూఎస్ యందు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులలో 20 శాతం మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు.
యూఎన్ మానవ హక్కుల హైకమిషనర్‌గా వోల్కర్ టర్క్
ఆస్ట్రియా దౌత్యవేత్త వోల్కర్ టర్క్ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ తదుపరి చీఫ్‌గా నియమితులయ్యారు. ఆగష్టు 31న మానవ హక్కుల హైకమిషనర్‌గా పదవీ విరమణ చేసిన చిలీ మాజీ అధ్యక్షురాలు మిచెల్ బాచెలెట్ స్థానంలోకి ఈయన త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ హోదాలో వచ్చే నాలుగేళ్ళ కాలానికి బాధ్యతలు నిర్వర్తిస్తాడు.
5వ ఇండియా - యూఎస్ మారిటైమ్ సెక్యూరిటీ డైలాగ్
5వ భారతదేశం - యూఎస్ మారిటైమ్ సెక్యూరిటీ డైలాగ్ (MSD) 08 సెప్టెంబర్ 2022 న న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశాల్లో శ్రీ సందీప్‌తో కూడిన భారత ప్రతినిధి బృందం పాల్గునగా, యూఎస్ ప్రతినిధి బృందానికి దక్షిణ మరియు మధ్య ఆసియా వ్యవహారాల సహాయ కార్యదర్శి డోనాల్డ్ నాయకత్వం వహించారు.
మారిటైమ్ సెక్యూరిటీ డైలాగ్ యందు పాల్గున్న అధికారులు దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ప్రాంతం & ఇండో -పసిఫిక్‌కు సంబంధించిన ప్రాంతీయ సమస్యలను చర్చించడంతో పాటుగా, అంతర్జాతీయ సముద్ర భద్రత, సమ్మిళిత వృద్ధి మరియు పరస్పర శ్రేయస్సుకు తోడ్పడే ఉచిత, బహిరంగ మరియు సమ్మిళిత సహకారాన్ని బలోపేతం చేసే కార్యక్రమాల కోసం మాట్లాడారు.
బ్రిటన్ రాణి ఎలిజబెత్ II (96) కన్నుమూశారు
బ్రిటీష్ చరిత్రలో ఎక్కువ కాలం పాలించిన చక్రవర్తి క్వీన్ ఎలిజబెత్ II , 96 సంవత్సరాల వయస్సులో అనారోగ్యంతో స్కాట్లాండ్‌లో మరణించారు మరణించారు. 1952 లో తండ్రి మరణం తర్వాత సింహాసనాన్ని అధిష్టించిన ఆమె, సెప్టెంబరు 8, 2022న మరణించే వరకు సుమారు 70 ఏళ్ళు పాలించారు. క్వీన్ ఎలిజబెత్ II మరణం తర్వాత 73 ఏళ్ళ ఆమె పెద్ద కుమారుడు రాయల్ చార్లెస్ బ్రిటిష్ సింహాసనాన్ని అధిష్టించనున్నారు.
యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా వెనెస్సా నకేట్
యునిసెఫ్ యొక్క యూఎన్ చిల్డ్రన్స్ ఫండ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉగాండాకు చెందిన 25 ఏళ్ల వాతావరణ కార్యకర్త వెనెస్సా నకేట్ నియమితులయ్యారు. గుడ్‌విల్ అంబాసిడర్లు ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్ కోసం అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి తరపున పని చేస్తారు.
యునిసెఫ్ అనగా యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అని అర్ధం. దీనిని ఇప్పుడు అధికారికంగా యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ అని కూడా అంటారు. యునిసెఫ్ ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు మానవతా మరియు అభివృద్ధి సహాయాన్ని అందిస్తుంది.
జీ4 & బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం
విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్, సెప్టెంబర్ 22న జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి డాక్టర్ నలేడి పండోర్ అధ్యక్షత వహించారు.
అలానే బ్రెజిల్ విదేశాంగ మంత్రి కార్లోస్ ఫ్రాంకా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్, మరియు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వారి ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహించారు. 2023లో దక్షిణాఫ్రికా బ్రిక్స్ అధ్యక్షతన జరిగే XV బ్రిక్స్ సదస్సు నిర్వహణకు ఈ మంత్రుల బృందం తమ పూర్తి మద్దతు తెలిపింది.
ఇదే సమయంలో డాక్టర్ ఎస్ జైశంకర్ విదేశాంగ మంత్రుల G-4 సమావేశానికి ఆతిథ్యం ఇచ్చారు. బ్రెజిల్ విదేశాంగ మంత్రి కార్లోస్ ఫ్రాంకా, జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి, జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్‌బాక్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సీట్ల కోసం ఒకదానికొకటి మద్దతు ఇచ్చే బ్రెజిల్, జర్మనీ, ఇండియా మరియు జపాన్‌లతో కూడిన నాలుగు దేశాల కూటమిని G4 దేశాలు అంటారు. దీనిని 2005 లో స్థాపించారు.
ఎడ్వర్డ్ స్నోడెన్‌కు రష్యా పౌరసత్వం మంజూరు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ కాంట్రాక్టర్ ఎడ్వర్డ్ స్నోడెన్‌కు రష్యా పౌరసత్వం మంజూరు చేసారు. ఎడ్వర్డ్ స్నోడెన్ 2013 కి ముందు యూఎస్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్‌ఎస్‌ఎ) యందు పని చేసే వాడు. 2013 లో ఎన్‌ఎస్‌ఎ యొక్క రహస్య ఫైళ్ళను లీక్ చేసిన తరువాత నుండి ఆయన రష్యాలో ఆశ్రయం పొందుతున్నాడు.
గూఢచర్యం ఆరోపణలపై క్రిమినల్ విచారణను ఎదుర్కొనేందుకు యూఎస్ అధికారులు సంవత్సరాలుగా ఎడ్వర్డ్ స్నోడెన్‌ను అమెరికాకు తిరిగి రావాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా విదేశీయలకు రష్యన్ పౌరసత్వం మంజూరు చేసిన వ్యక్తుల జాబితాలో ఎడ్వర్డ్ స్నోడెన్ 72వ వాడు.
ఇటలీ మొదటి మహిళా పీఎంగా జార్జియా మెలోనీ
ఇటలీ మొదటి మహిళా ప్రధానమంత్రిగా జార్జియా మెలోన ఎన్నికయ్యారు. ఇటీవలే జరిగిన ఇటాలియన్ ఎన్నికలలో బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ నాయకురాలు అయినా జార్జియా మెలోని, తన ప్రత్యర్థి మారియో డ్రాఘీని భారీ తేడాతో ఓడించారు.
సౌదీ అరేబియా ప్రధానిగా మహ్మద్ బిన్ సల్మాన్
సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆ దేశ ప్రధానమంత్రిగా నియమితుడయ్యాడు. మహమ్మద్ బిన్ సల్మాన్ ఇదివరకు సౌదీ అరేబియా డిఫెన్స్ మినిస్టరుగా పనిచేసారు. సౌదీ అరేబియా రాయల్ డిక్రీ ప్రకారం డిఫెన్స్ మినిస్టరు ఉన్నవారికి ప్రధానమంత్రి ప్రమోషన్ లభిస్తుంది.
వార్తల్లో వ్యక్తులు
ఏఐఎఫ్ఎఫ్ కొత్త అధ్యక్షుడిగా కళ్యాణ్ చౌబే
ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ యొక్క కొత్త అధ్యక్షుడిగా శ్రీ కళ్యాణ్ చౌబే ఎన్నికయ్యారు. కళ్యాణ్ చౌబే తన ఫుట్‌బాల్ కెరీరులో కోల్‌కతాలోని మోహన్ బగాన్ మరియు ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్‌లకు గోల్‌కీపర్‌గా ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఎన్నికలో ప్రత్యర్థిగా పోటీ చేసిన మాజీ ఇండియన్ స్ట్రైకర్ భైచుంగ్ భూటియా ఓటమి పాలయ్యారు.
NHPC చైర్మనుగా యమునా కుమార్ చౌబే
ప్రభుత్వ యాజమాన్యంలోని నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క నూతన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా యమునా కుమార్ చౌబే బాధ్యతలు స్వీకరించారు. 59 ఏళ్ళ చౌబే, ఖరగ్‌పూర్‌లోని ఐఐటీ నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ పూర్తిచేశారు. అతను 1985లో NHPC లో 540 MW యందు ప్రొబేషనరీ ఎగ్జిక్యూటివ్ (సివిల్)గా కెరీర్ ప్రారంభించారు.
టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మరణించారు
టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ, 04 సెప్టెంబరు 2022న ముంబై సమీపంలోని పాల్ఘర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. లండన్ బిజినెస్ స్కూల్‌లో చదువుకున్న సైరస్ మిస్త్రీ, 2012 లో టాటా గ్రూప్‌కు చైర్మన్ అయ్యారు. 75 ఏళ్ల తర్వాత టాటా గ్రూప్ ఛైర్మన్‌గా పదవీ విరమణ చేసిన రతన్ టాటా తర్వాత మిస్త్రీ బాధ్యతలు చేపట్టారు.
టాటా గ్రూప్‌కు సైరస్ ఆరో ఛైర్మన్ మరియు టాటా ఛైర్మను బాధ్యతలు స్వీకరించిన మొదటి నాన్ ఇండియానుగా గుర్తింపు పడ్డారు. సైరస్ 2006లో టాటా సన్స్ బోర్డులో డైరెక్టర్‌గా చేరారు మరియు అప్పటి నుండి మిస్త్రీ కుటుంబానికి టాటా బోర్డులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2016 లో వివిధ వ్యాపార నిర్ణయ కారణాలతో చైర్మన్ హోదా నుండి తొలగింపబడ్డారు.
కెనడాలో భారత తదుపరి హైకమిషనరుగా సంజయ్ వర్మ
సీనియర్ దౌత్యవేత్త సంజయ్ కుమార్ వర్మ కెనడాలో భారత తదుపరి హైకమిషనర్‌గా నియమితులయ్యారు. 1988 ఐఆర్ఎఫ్ బ్యాచుకు చెందిన సంజయ్ కుమార్ వర్మ త్వరలో ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. అలానే ప్రస్తుతం చికాగోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్న అమిత్ కుమార్, రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు తదుపరి రాయబారిగా నియమితులయ్యారు.
పుణ్యకోటి దత్తు యోజన బ్రాండ్ అంబాసిడర్‌గా కిచ్చా సుదీప్
కర్ణాటక ప్రభుత్వం తమ ''పుణ్యకోటి దత్తు యోజన'' పశు దత్తత పథకానికి బ్రాండ్ అంబాసిడర్‌గా కన్నడ నటుడు సుదీప్‌ను నియమించింది. సుదీప్ పుట్టినరోజు సందర్భంగా పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభు బి చవాన్ ఓ ట్వీట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. పుణ్యకోటి దత్తు యోజన పథకం అనేది పశు దత్తత అంశానికి సంబంధించింది. ఈ పథకం ద్వారా పౌరులు లేదా ఆర్గనైజషన్లు ఏడాదికి 11,000 రూపాయలు చెల్లించి గోవులు తమ పేరిట దత్తత తీసుకోవచ్చు.
షిప్పింగ్ కార్పొరేషన్ సీఎండీగా బినేష్ కుమార్ త్యాగి
కెప్టెన్ బినేష్ కుమార్ త్యాగి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SCI) ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. త్యాగి 1990లో ట్రైనీ నాటికల్ ఆఫీసరుగా షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఇదే సంస్థలో డైరెక్టర్ ఆఫ్ లైనర్ మరియు ప్యాసింజర్ సర్వీసెస్'గా పనిచేస్తున్నరు.
ప్రముఖ తెలుగు నటుడు కృష్ణం రాజు కన్నుమూత
ప్రముఖ తెలుగు నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణం రాజు గారు 83 ఏటా అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. జీవన తరంగాలు, భక్త కన్నప్ప వంటి సినిమాలతో పాపులర్ అయినా కృష్ణం రాజు గారు సుమారు 180 తెలుగు సినిమాల్లో నటించారు. మొత్తం కెరీరులో తన ఉత్తమ నటనకు గాను 5 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకున్నారు.
జపాన్‌లో భారత తదుపరి రాయబారిగా సిబి జార్జ్
జపాన్‌లో భారత తదుపరి రాయబారిగా సీనియర్ దౌత్యవేత్త సిబి జార్జ్ నియమితులయ్యారు. 1993-బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీసుకు చెందిన సిబి జార్జ్, ప్రస్తుతం కువైట్ యందు భారత రాయబారిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఇండియా సీఈఓగా సంజయ్ ఖన్నా
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్ప్ యొక్క ఇండియా వ్యాపార సముదాయానికి సంబంధించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు కంట్రీ మేనేజర్‌గా సంజయ్ ఖన్నాని నియమించింది. సంజయ్ ఖన్నా ప్రస్తుతం ఇదే సంస్థలో ఉన్నతిస్థాయి ఎగ్జిక్యూటివ్ టీంకు నాయకత్వం వహిస్తున్నాడు.
ఎరిట్రియాలో భారత రాయబారిగా ప్రకాష్ చంద్
సీనియర్ దౌత్యవేత్త ప్రకాష్ చంద్, ఎరిట్రియా తదుపరి భారత రాయబారిగా నియమితులయ్యారు. ప్రకాష్ చంద్ ప్రస్తుతం ఇండోనేసియాలో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఆయన ఎరిట్రియా తదుపరి భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎరిట్రియా ఎర్ర సముద్ర తీరంలో ఉన్న చిన్న ఈశాన్య ఆఫ్రికా దేశం. ఇది ఇథియోపియా, సుడాన్ మరియు జిబౌటీలతో సరిహద్దులను పంచుకుంటుంది. దీని రాజధాని నగరం అస్మారా.
పిఎం కేర్స్‌కు ట్రస్టీగా రతన్ టాటా
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కెటి థామస్, లోక్‌సభ మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండాలను పిఎం కేర్స్ ఫండ్ ట్రస్టీలుగా నామినేట్ చేసినట్లు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. వీరితో పాటుగా హోమ్ మినిస్టర్ మరియు ఫైనాన్స్ మినిస్టర్ ఇందులో ట్రస్టీలుగా ఉండనున్నారు.
27 మార్చ్ 2022 కోవిడ్-19 మహమ్మారి సమయంలో పీఎం కేర్స్ ఫండ్ సృష్టించబడింది. కోవిడ్ వంటి మహమ్మారి వల్ల ఎదురయ్యే అత్యవసర లేదా బాధాకరమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవడానికి మరియు బాధిత వ్యక్తులకు ఉపశమనాన్ని అందించడం కోసం ఈ ఫండ్ స్థాపించబడింది.
ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్‌గా రాజీవ్ బహ్ల్
డాక్టర్ రాజీవ్ బహ్ల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) డైరెక్టర్ జనరల్‌గా మరియు డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా నియమితులయ్యారు. రాజీవ్ బహ్ల్ ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఆఫీసరుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
హాకీ ఇండియా అధ్యక్షుడిగా దిలీప్ టిర్కీ
హాకీ ఇండియా నూతన అధ్యక్షుడిగా భారత మాజీ పురుషుల కెప్టెన్ దిలీప్ టిర్కీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దిలీప్ టిర్కీ 1998 ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జట్టులో సభ్యుడుగా ఉన్నారు. దీనితో హాకీ ఇండియాకు అధ్యక్షుడు అయినా తొలి క్రీడాకారుడిగా నిలిచాడు.
ఈఎస్ఐసీ డైరెక్టర్ జనరల్‌గా రాజేంద్ర కుమార్
సీనియర్ బ్యూరోక్రాట్ రాజేంద్ర కుమార్ ఎంప్లొయ్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. రాజేంద్ర కుమార్ 1992 తమిళనాడు కేడర్‌కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి.
భారత తదుపరి అటార్నీ జనరల్‌గా ఆర్ వెంకటరమణి
భారత కొత్త అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణి నియమితులయ్యారు. ప్రస్తుత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పదవీకాలం సెప్టెంబరు 30తో ముగిసిన తర్వాత వచ్చే మూడేళ్ళ కాలానికి ఆర్ వెంకటరమణి బాధ్యతలు స్వీకరించనున్నారు. భారతదేశ అటార్నీ జనరల్ దేశంలోని అత్యున్నత న్యాయ అధికారిగా పరిగణించ బడతారు. అటార్నీ జనరల్ భారత ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారునిగా వ్యవహరిస్తారు.
టైమ్ మ్యాగజైన్ 100 ఎమర్జింగ్ లీడర్స్ జాబితాలో ఆకాష్ అంబానీ
భారతీయ బిలియనీర్ ముఖేష్ అంబానీ కుమారుడు మరియు భారతదేశపు అతిపెద్ద టెలికాం సంస్థ జియో అధినేత ఆకాష్ అంబానీ టైమ్ మ్యాగజైన్ 100 ఎమర్జింగ్ లీడర్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. అలానే ఈ జాబితాలో ఇండియా నుండి చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడుగా నిలిచాడు. అయితే ఈ జాబితాలో భారతీయ సంతతికి చెందిన మరో అమెరికన్ బిజినెస్ లీడర్ అమ్రపాలి గన్ కూడా ఉన్నారు. ఆకాష్ అంబానీ ఈ ఏడాది జూన్లో రిలయన్స్ జియో బాధ్యతలు స్వీకరించారు.
ప్రభుత్వ పథకాలు & ఫాలసీలు
దేశ వ్యాప్తంగా రాష్ట్రీయ పోషణ్ మాహ్ ప్రారంభం
మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 1 నుండి 30 వరకు దేశవ్యాప్తంగా 5వ రాష్ట్రీయ పోషణ్ మాహ్ 2022 వేడుకలను జరపనుంది. ఈ ఏడాది "మహిళా ఔర్ స్వాస్థ్య" మరియు "బ ఔర్ శిక్ష"పై కీలక దృష్టితో గ్రామ పంచాయతీలను పోషణ్ పంచాయితీలుగా మార్చే లక్ష్యంతో పని చేయనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 8 మార్చి 2018న రాజస్థాన్‌లోని జుంజును నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రోగ్రాం ద్వారా ఆరేళ్లలోపు పిల్లలకు, యుక్తవయస్సులో ఉన్న బాలికలకు, గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లుల కోసం పోషకాహారం అందిస్తున్నారు.
రాజస్థాన్ మహిళల కోసం 'మహిళా నిధి' పథకం
తెలంగాణ తర్వాత దేశంలోనే మహిళా నిధి పథకాన్ని ఏర్పాటు చేసిన రెండో రాష్ట్రంగా రాజస్థాన్ అవతరించింది. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు నిర్వహించే మహిళలకు సులభమైన రుణాలను అందించడానికి 'మహిళా నిధి' పేరుతో నూతన క్రెడిట్ స్కీంను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రారంభించారు.
మహిళా సమానత్వ దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన ఈ పథకం ఆ రాష్ట్రంలోని మహిళా పారిశ్రామికవేత్తలకు మరియు మహిళా స్వయం సహాయక బృందాల కోసం వ్యాపార రుణాలను అందించనుంది.
ఢిల్లీలోని రాజ్‌పథ్ మార్గానికి కర్తవ్య మార్గంగా పేరు మార్పు
న్యూఢిల్లీలోని చారిత్రాత్మక రాజ్‌పథ్ మరియు సెంట్రల్ విస్టా లాన్‌లకు 'కర్తవ్య మార్గం' గా పేరు మార్చనున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కింద నిర్మించిన ఈ రహదారిని మీడియా మరియు ప్రభుత్వ పత్రాల్లో 'సెంట్రల్ విస్టా అవెన్యూ'గా పేర్కొన్నారు. సెప్టెంబరు 08 న ప్రధాని మోదీ దీని ప్రారంభించనున్నారు. ఈ సంధర్బంగా దీనికి 'కర్తవ్య పాత్' అని పేరు పెట్టె అవకాశం ఉంది.
స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా యోజన అప్‌గ్రేడ్
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (PM - SHRI) యోజన పథకాన్ని అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ పధకం ద్వారా వచ్చే రెండు మూడేళ్లలో దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను అభివృద్ధి చేసి, అప్‌గ్రేడ్ చేయనున్నట్లు వెల్లడించారు.
తమిళనాడులో పుదుమై పెన్ పథకం ప్రారంభం
బాలిక విద్యను ప్రోత్సహించేందుకు గాను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 'పుధుమై పెన్' అనే నూతన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 6 నుండి 12వ తరగతి బాలిక విద్యార్థులకు నెలకు 1000/- ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. దాదాపు 6 లక్షల బాలిక విద్యార్థులను కవర్ చేస్తున్న ఈ పథకం కోసం ఏటా 700 కోట్లు బడ్జెట్ కేటాయించనున్నారు.
త్రిపురలో భారతదేశపు మొట్టమొదటి బయో-విలేజ్ సెటప్
త్రిపుర ప్రభుత్వం భారతదేశపు మొట్టమొదటి బయో-విలేజ్ సెటప్ చేసిన ఘనతను దక్కించుకుంది. త్రిపుర ప్రభుత్వం దాదాపు 100 గ్రామాలను బయో-విలేజులుగా మార్చే లక్ష్యంతో పనిచేస్తుంది. ఈ జాబితాలో త్రిపుర రాష్ట్రంలోని దస్పరా గిరిజన గ్రామం మొదటిగా చోటు సంపాదించుకుంది. బయో-విలేజ్ సెటప్ అనగా పర్యావరణ కాలుష్య రహిత వస్తువులను మాత్రమే ఉపయోగించం అని అర్ధం.
బెంగళూరులో రెండురోజుల మంథన్ సదస్సు
కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు బెంగళూరులో రెండు రోజుల జాతీయ సదస్సు 'మంథన్'ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్స్ & హైవేస్ నిర్వహించింది. ఈ సదస్సు రోడ్ ఇన్ఫ్రా, మొబిలిటీ మరియు లాజిస్టిక్స్ ఏకోసిస్టమ్ యందు నూతన సాంకేతికత అభివృద్ధి వ్యూహాల కోసం నిర్వహించారు.
యుఎస్‌లో సేతు ప్రోగ్రామ్ ప్రారంభించిన పీయూష్ గోయల్
యూఎస్ ఆధారిత పెట్టుబడిదారులతో భారతదేశంలోని వ్యవస్థాపకులను కనెక్ట్ చేయడానికి వాణిజ్యం & పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ SETU (సపోర్టింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇన్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ అప్‌స్కిల్లింగ్) అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ వేదిక భారతదేశంలో స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థకు సంబంధించిన నిర్దిష్ట సమస్యలపై దృష్టి సారించే పనిలో భాగంగా యూఎస్ ఆధారిత పెట్టుబడిదారులకు మరియు స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థ నాయకులకు మెంటర్‌షిప్ మరియు నిధులు, మార్కెట్ యాక్సెస్ మరియు వాణిజ్యీకరణతో సహా వివిధ రంగాలతో అనుసంధానిస్తుంది.
రైల్వే భూముల దీర్ఘకాలిక లీజు విధానానికి కేబినెట్ ఆమోదం
రైల్వే భూముల దీర్ఘకాలిక లీజు విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి గతి శక్తి అమలు కోసం రైల్వే ల్యాండ్ పాలసీని సవరించాలన్న రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
దీనితో గతంలో ఉన్న 5 ఏళ్ళ లీజు ఒప్పందం స్థానంలో 35 ఏళ్ళ దీర్ఘకాలిక లీజు విధానం అమలులోకి రానుంది. ఇదే సమయంలో రైల్వే ల్యాండ్ లైసెన్సింగ్ ఫీజును మార్కెట్ విలువలో 6% నుండి 1.5% వరకు మూడు వంతులు తగ్గిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం ప్రారంభం
భారత రాష్ట్రపతి, శ్రీమతి ద్రౌపది ముర్ము వర్చువల్‌గా ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్‌ను సెప్టెంబర్ 9, 2022న ప్రారంభించారు. 2025 నాటికి దేశం నుండి టిబి నిర్మూలించేందుకు ఈ మిషన్ పని చేయనుంది. దీనితో పాటుగా ఆమె నిక్షయ్ 2.0 పోర్టల్ కూడా ప్రారంభించారు. నిక్షయ్ పోర్టల్ యందు రిజిస్టర్ చేసుకునే టీబీ రోగులకు 1-3 ఏళ్ళ నిడివితో వైద్య సేవలు, మెడిసిన్ అందిస్తారు.
ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ ప్రకారం, 2030 నాటికి అన్ని దేశాలు టిబిని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ భారత ప్రభుత్వం 2025 నాటికి ఈ మైలురాయి చేరేందుకు లక్ష్యంగా పెట్టుకుంది.
ఒడిశాలో వర్షపు నీటి సంరక్షణ పథకం ప్రారంభం
ఒడిశా ప్రభుత్వం “ఛాటా” ( కమ్యూనిటీ హార్నెస్సింగ్ అండ్ హార్వెస్టింగ్ రెయిన్వాటర్ హార్వెస్టింగ్ ) పేరుతో రెయిన్వాటర్ హార్వెస్టింగ్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని గత నెలలో నవీన్ కుమార్ క్యాబినెట్ ఆమోదించింది. దీనిని వచ్చే ఐదేళ్లపాటు అమలు చేయనున్నారు.
ఈ పథకం ద్వారా ప్రతి ఇంటి టెర్రేస్ పై పడే వర్షపు నీటిని నేలలోకి పంపించడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించనున్నారు. ఇకపోతే పైకప్పు వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాన్ని తప్పనిసరి చేసిన భారతదేశంలోని మొదటి రాష్ట్రంగా తమిళనాడు ఉంది.
మేఘాలయలో 'రెసిడెంట్స్ సేఫ్టీ & సెక్యూరిటీ' పోర్టల్ ప్రారంభం
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా పౌరుల భద్రత కోసం "మేఘాలయ రెసిడెంట్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ యాక్ట్ (MRSSA) పోర్టల్ ప్రారంభించారు. ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా సుమారు 6 వేల విలేజిలకు సంబంధించి బలమైన గూఢచార వ్యవస్థను రూపొందించనున్నారు.
కునో నేషనల్ పార్క్‌లో చిరుత పునరుద్ధరణ ప్రాజెక్ట్
మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్‌లో ప్రపంచంలోని మొట్టమొదటి చిరుత పునరావాస ప్రాజెక్ట్‌ను పీఎం నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ ప్రోజెక్టులో భాగంగా భారతదేశంలో అంతరించిపోయిన అడవి చిరుతలను తిరిగి పరిచయం చేసేందుకు, ప్రాజెక్ట్ చీతా కింద నమీబియా నుండి తీసుకురాబడిన 8 చిరుతలను కునో నేషనల్ పార్క్‌లో విడుదల చేసారు. 1950 తరువాత ఇండియాలో చిరుతల ప్రస్తావన ఇదే మొదటిసారి.
తెలంగాణలో మొట్టమొదటి ఫారెస్ట్ యూనివర్సిటీ
భారతదేశంలో మొట్టమొదటి ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. హైదరాబాద్‌లోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌సిఆర్‌ఐ)ని పూర్తి స్థాయి అటవీ విశ్వవిద్యాలయంగా విస్తరించదానికి తెలంగాణా శాసనసభ, అటవీ విశ్వవిద్యాలయం (UOF) చట్టం 2022 కి ఆమోదం తెలిపింది.
ఈ ప్రణాళికలో భాగంగా ఏఫ్‌సిఆర్‌ఐని 'ఫస్ట్-ఎవర్ యూనివర్శిటీ ఆఫ్ ఫారెస్ట్రీ'గా అప్‌గ్రేడ్ చేయడంతో పాటుగా, 18 రకాల ఫారెస్ట్రీ కోర్సులు అందుబాటులోకి తీసుకురానుంది. దీనితో ఇది దేశంలోనే మొదటి యూనివర్శిటీ ఆఫ్ ఫారెస్ట్రీ'గా, ప్రపంచంలో మూడోవ యూనివర్శిటీ ఆఫ్ ఫారెస్ట్రీ'గా నిలువనుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చైనా, రష్యా దేశాలలో మాత్రమే ఫారెస్ట్రీ యూనివర్సిటీలు అందుబాటులో ఉన్నాయి.
బీఎల్ఓ ఈ-పత్రికను ప్రారంభించిన ఎలక్షన్ కమిషన్
బూత్ లెవల్ ఆఫీసర్స్, ఎలక్షన్ కమీషన్‌తో ప్రత్యక్ష సంభాషణను మెరుగు పర్చుకోవడానికి కొత్తగా బీఎల్ఓ e-పత్రికను భారత ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ద్వైమాసిక ఇ-మ్యాగజైన్‌నుగా ప్రచురించే ఈ పత్రిక గ్రౌండ్ లెవల్ నుండి సూచనలను, అభిప్రాయాలు, అభ్యాసాలు మరియు విజయ గాథలను పంచుకోవడానికి ఒక వేదికను అందిస్తుంది.
తమిళనాడులో చీఫ్ మినిస్టర్ బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం
తమిళనాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1.14 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చేందుకు కొత్తగా 'ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని' ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించారు. ఈ పథకం మొదటి దశను 1,545 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1 నుండి 5వ తరగతి విద్యార్థులకు అమలు చేయనున్నారు.
ఇదే వేదిక ద్వారా 30 ఏళ్లుగా నిరుపేదలకు ఆహారం అందించేందుకు కేవలం ఒక్క రూపాయికే ఇడ్లీలను అమ్మిన కోయంబత్తూరుకు చెందిన ప్రఖ్యాత ' ఇడ్లీ పాటి' కమలతల్‌ను సీఎం స్టాలిన్ సత్కరించారు.
ఇన్స్పిరేషన్ డేగా పునీత్ రాజ్‌కుమార్ జన్మదినోత్సవం
ప్రముఖ కన్నడ నటుడు దివంగత పునీత్ రాజ్‌కుమార్ పుట్టినరోజు అయినా మార్చి 17 ని స్ఫూర్తి దినంగా జరుపుకోవాలని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి కర్ణాటక మార్చి 17ని స్ఫూర్తి దినంగా జరుపుకోనుంది అని కన్నడ సాంస్కృతిక శాఖ మరియు ఇంధన శాఖ మంత్రి వాసుదేవ్ సునీల్ కుమార్ ధృవీకరించారు. పునీత్ రాజ్‌కుమార్ గత ఏడాది అక్టోబర్ 29న గుండెపోటుతో మృతి చెందారు.
నంజరాయన్ ట్యాంకుకు పక్షుల అభయారణ్యంగా గుర్తింపు
తమిళనాడు ప్రభుత్వం తిరుప్పూర్ జిల్లాలోని నంజరాయన్ ట్యాంక్‌ను రాష్ట్రంలోని 17 వ పక్షుల అభయారణ్యంగా ప్రకటించింది. నంజరాయన్ ట్యాంక్ దాదాపు 126 హెక్టర్లలో తిరుప్పూర్ జిల్లాలో విస్తరించి ఉంది. సుమారు 7.5 కోట్ల ప్రభుత్వ నిధులతో నంజరాయన్ ట్యాంక్‌ను పక్షుల అభయారణ్యంగా మారుస్తున్నట్లు ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కె. రామచంద్రన్ వెల్లడించారు.
తెలంగాణలో ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ కోటా
తెలంగాణ సిఎం చంద్రశేఖర్ రావు ఎస్టీ రిజర్వేషన్లను 6 నుండి 10 % కి పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి కేంద్రాన్ని అభ్యర్థిస్తూ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. అదే సమయంలో రాష్ట్రంలో ఉన్న గిరిజనల కోసం గిరిజన బంధు పథకాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పథకం పరిధిలో సొంత వ్యాపారాలు చేసుకునేందుకు ప్రతి ట్రైబల్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు.
బీహార్ ప్రభుత్వం పాఠశాలల్లో 'నో-బ్యాగ్ డే'
విద్యార్థులపై చదువుల భారాన్ని తగ్గించేందుకు బీహార్ ప్రభుత్వం పాఠశాలల్లో 'నో-బ్యాగ్ డే' నిబంధనను అమలులోకి తేనుంది. అలానే కనీసం వారానికి ఒకసారి తప్పనిసరిగా గేమ్స్ పీరియడ్ కూడా అమలు చేయనుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2022 నిబంధనలకు అనుగుణంగా త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది.
చండీగఢ్ ఎయిర్‌పోర్టుకు భగత్ సింగ్ పేరు
చండీగఢ్ విమానాశ్రయానికి స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పేరు మార్చనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన నెలవారీ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రకటించారు. దీనికి సంబంధించి గత నెలలో పంజాబ్ మరియు చండీగఢ్ ప్రభుత్వాలు తమ ఆమోదాన్ని తెలిపాయి. గతంలో చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉండే ఈ విమానాశ్రయం ఇకముందు భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మారనుంది.
స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ కార్యక్రమం ప్రారంభం
పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 2025-26 నాటికి వాయు కాలుష్యాన్ని 40 శాతానికి తగ్గించడానికి కొత్తగా స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ కార్యక్రమంను ప్రారంభించనుంది. ఈ ప్రణాళికలలో భాగంగా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం 2019 ప్రకారం దేశంలోని 131 నగరాలకు స్వచ్ఛ వాయు ర్యాంకింగ్‌ను అమలు చేయనుంది.
ఇందులో భాగంగా ఈ 131 నగరాలను జనాభా ఆధారంగా మూడు గ్రూపులుగా వర్గీకరించారు. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 47 నగరాలు మొదటి గ్రూపులో, 3 నుండి 10 లక్షల మధ్య జనాభా కలిగిన 44 నగరాలు రెండవ గ్రూపులో, మూడవ సమూహంలో 3 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న 40 నగరాలను పొందుపర్చారు.
ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ట్రైబ్స్ విడుదల
షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలు ప్రచురించిన 'ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ట్రైబ్స్ ఇన్ ఒడిశా' ను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విడుదల చేశారు. ఇందులో దాదాపు 62 ట్రైబల్ కమ్యూనిటీలకు సంబంధించిన చరిత్ర, సంప్రదాయాలు మరియు సంస్కృతులను డాక్యుమెంట్ చేసారు. 3,800 పేజీలు. 418 రీసెర్చ్ ఆర్టికల్స్ కలిగిన ఈ ఐదు సంకలన సంపుటాలను షెడ్యూల్డ్ క్యాస్ట్ & షెడ్యూల్డ్ ట్రైబ్స్ రీసెర్చ్ & ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ రూపొందించింది.
ఉత్తరప్రదేశ్‌కు 'ఆయుష్మాన్ ఉత్కృష్ట అవార్డు
ఉత్తరప్రదేశ్‌కు 2022 ఏడాదికి గాను ఆయుష్మాన్ ఉత్కృష్ట అవార్డు అందుకుంది. జాతీయ ఆరోగ్య సౌకర్యాల రిజిస్టర్‌లో 28728 ఆరోగ్య సౌకర్యాలు జోడించడం ద్వారా ఉత్తరప్రదేశ్ ఈ అవార్డును దక్కించుకుంది. అలాగే దాదాపు 2 కోట్ల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాను సృష్టించిన రెండవ ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది.
'సైన్ లెర్న్' మొబైల్ యాప్ ప్రారంభం
భారతీయ సంకేత భాష నిఘంటువును ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం 10000 పదాలతో కూడిన సైన్ లెర్న్ అనే భారతీయ సంకేత భాష (ISL) నిఘంటువు మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ రెండింటికీ అందుబాటులో ఉండే ఈ యాప్‌ను సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ సహాయ మంత్రి ప్రతిమా భూమిక్ ప్రారంభించారు.
'విజిట్ ఏపీ' ప్రచార కార్యక్రమంను ప్రారంభించిన జగన్
27 సెప్టెంబర్ 2022 ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజిట్ ఆంధ్రప్రదేశ్ 2023 ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో జరుపుకుంటున్న వివిధ రాష్ట్ర పండుగల బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రామాన్ని టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించింది.
బిజినెస్ & ఎకానమీ అఫైర్స్
స్టార్‌బక్స్ నూతన సీఈఓగా లక్ష్మణ్ నరసింహన్
పాపులర్ గ్లోబల్ కాఫీ బ్రాండ్ స్టార్‌బక్స్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా భారతీయ సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ నియమితులయ్యారు. ఏప్రిల్ 2023 వరకు ఈ సంస్థ తాత్కాలిక చీఫ్‌గా కొనసాగనున్న హోవార్డ్ షుల్ట్జ్ స్థానంలో అక్టోబర్ 1న ఈయన బాధ్యతలు స్వీకరించనున్నారు. దీనితో అమెరికన్ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న భారతీయ సంతతికి చెందిన వ్యక్తుల జాబితాలో ఈయన కూడా చేరారు. ఈ జాబితాలో ఇప్పటికే క్రీంది లిస్టులో ఉన్నవారు సీఈఓలుగా ఉన్నారు.
- సుందర్ పిచాయ్ - ఆల్ఫాబెట్ (గూగుల్)
- సత్య నాదెళ్ల - మైక్రోసాఫ్ట్
- పరాగ్ అగర్వాల్ - ట్విట్టర్
- లీనా నాయర్ - చానెల్
- శాంతను నారాయణ్ - అడోబ్ ఇంక్
- అరవింద్ కృష్ణ - ఐబీఎం
- రాజ్ సుబ్రమణ్యం - ఫెడెక్స్
ట్రాన్స్‌జెండర్ల కోసం 'రెయిన్‌బో ఖాతాను' ప్రారంభించిన ESAF
ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ కోసం ప్రత్యేకంగా 'రెయిన్‌బో సేవింగ్స్ ఖాతాను' ప్రారంభించింది. ఈ ఖాతాదారులకు అధిక వడ్డీ రేటు మరియు అధునాతన డెబిట్ కార్డ్ సౌకర్యాలు అందిస్తుంది. కేరళ ప్రధాన కేంద్రంగా నడుస్తున్న ఈ బ్యాంకు 2017 లో ప్రారంభించబడింది. 2015 నుండి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అకౌంట్ ఓపినింగ్ దరఖాస్తులో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ కోసం ప్రత్యేక జండర్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇండిగో నూతన సీఈఓగా పీటర్ ఎల్బర్స్
భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పీటర్ ఎల్బర్స్ నియమితులయ్యారు. 30 సెప్టెంబరు 2022 రిటైర్ కాబోతున్న ప్రస్తుత్త సీఈఓ రోనోజోయ్ దత్తా స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. పీటర్ ఎల్బర్స్ గతంలో కేఎల్ఎమ్ రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్ సీఈఓగా పనిచేశారు.
ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 7%కి పెరుగుదల
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం జూలై 2022లో 6.71 శాతం నుండి ఆగస్టు నెలలో 7 శాతానికి పెరిగింది. ఈ సంఖ్య వరుసగా ఎనిమిదో నెలలో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క కంఫర్ట్ జోన్ 2-6% కంటే ఎక్కువగా ఉంది. ఇకపోతే ప్రధాన ద్రవ్యోల్బణం జూలైలో 0.46 శాతం నుండి ఆగస్టులో 0.52 శాతానికి పెరిగింది.
ఎయిర్ ఇండియా “విహాన్” గా రీబ్రాండింగ్
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా కొత్తగా భారతీయ హృదయంతో ప్రపంచ స్థాయి గ్లోబల్ ఎయిర్‌లైన్‌గా మరోసారి స్థిరపడేందుకు విహాన్ AI అనే కాంప్రహెన్షన్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. వినియోగదారులకు మరింతంగా చేరువ అయ్యేందుకు ఎయిర్ ఇండియా కంపెనీని 'విహాన్'గా రీబ్రాండ్ చేయనున్నట్లు ప్రకటించింది.
టాటా ఎయిర్‌లైన్స్ 1932లో ఏర్పడింది· 1946 లో ఎయిర్‌లైన్ జాతీయం చేయబడింది మరియు ఎయిర్ ఇండియాగా పేరు మార్చబడింది· 2007 లో ఎయిర్ ఇండియాతో సంబంధం లేని దేశీయ ఆపరేటర్ ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను విలీనం చేయబడింది. 2022 లో ఎయిర్ ఇండియా తిరిగి టాటా గ్రూప్ యాజమాన్యంలోకి చేరింది.
ఎన్‌పిసిఐ ఎండీ & సీఈఓగా మరోమారు దిలీప్ అస్బే
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా మరో ఐదేళ్ల కాలానికి దిలీప్ అస్బేని తిరిగి నియమించింది. అస్బే 2018లో మాజీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ అభయ ప్రసాద్ హోటా నుండి ఎన్‌పిసిఐ యొక్క సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది యూపీఐ, భారత్ బిల్ పే, రూపే కార్డ్, ఫాస్ట్ టాగ్ వంటి సేవలను సులభతరం చేసే ఒక అంబ్రెల్లా సంస్థ. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మద్దతు మరియు మార్గదర్శకత్వంతో 2008లో ఏర్పాటు చేయబడింది.
బ్రిటానియా సీఈఓగా రజనీత్ కోహ్లి
భారతదేశపు అతిపెద్ద బేకరీ ఫుడ్స్ కంపెనీ బ్రిటానియా ఇండస్ట్రీస్ తమ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా రజనీత్ కోహ్లీని నియమించింది. రజనీత్ కోహ్లీ గతంలో కోకో కోల సంస్థలో వివిధ బాధ్యతలు నిర్వర్తించారు.
డిఫెన్స్ & సెక్యూరిటీ అఫైర్స్
సీఈఆర్టీ-ఇన్ సైబర్ సెక్యూరిటీ ఎక్సర్‌సైజ్ "సినర్జీ"
ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In), సింగపూర్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సహకారంతో 13 దేశాల ఉమ్మడి సైబర్ సెక్యూరిటీ ఎక్సర్‌సైజ్ “సినర్జీ”ని విజయవంతంగా నిర్వహించాయి. ఇది ఇంటర్నేషనల్ కౌంటర్ రాన్సమ్‌వేర్ ఇనిషియేటివ్- రెసిలెన్స్ వర్కింగ్ గ్రూప్‌లో ఒక భాగం.
సైబర్ సెక్యూరిటీ ఎక్సర్‌సైజ్ “సినర్జీ” ద్వారా రాన్సమ్‌వేర్ మరియు సైబర్ దోపిడీ దాడులకు వ్యతిరేకంగా బలమైన రక్షణ నెట్‌వర్క్ స్థితిస్థాపకతను నిర్మించడానికి ఈ సభ్య-దేశాలు వ్యూహాత్మకంగా పని చేస్తున్నాయి.
తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ ప్రారంభం
భారత్‌లో దేశీయంగా రూపొందించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇదే వేదిక ద్వారా వలసవాద గతాన్ని తొలగించి, సుసంపన్నమైన భారతీయ సముద్ర వారసత్వానికి తగినట్లుగా కొత్త నౌకాదళ ఎన్సైన్ (నిషాన్)ని కూడా ప్రధాన మంత్రి ఆవిష్కరించారు.
ఇదే సందర్భంలో భారత నౌకాదళానికి చెందిన కొత్త జెండాను ఛత్రపతి శివాజీకి అంకితం చేశారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సందర్భంగా 'ఆత్మనిర్భర్' పరిధిలో రూపొందించిన ఐఎన్‌ఎస్ విక్రాంత్ రాబోయే 25 సంవత్సరాలలో హిందూ మహాసముద్ర పరిధిలో సముద్ర భద్రత & రక్షణను పెంపొందించనుంది.
ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ఇండియన్ నేవీ ఇన్-హౌస్ వార్‌షిప్ డిజైన్ బ్యూరో (WDB) డిజైన్ చేసింది. దీనిని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పబ్లిక్ సెక్టార్ షిప్‌యార్డ్ ద్వారా నిర్మించబడింది. విక్రాంత్ అత్యాధునిక ఆటోమేషన్ ఫీచర్‌లతో నిర్మించబడింది. భారతదేశ సముద్ర చరిత్రలో ఇప్పటివరకు నిర్మించిన అతిపెద్ద నౌక ఇది.
262.5 మీ పొడవు మరియు 61.6 మీ వెడల్పు గల విక్రాంత్ 7,500 నాటికల్ మైళ్ల పరిధిలో గరిష్టంగా 28 నాట్ల వేగంతో సేవలు అందించనుంది. ఓడలో దాదాపు 2,200 కంపార్ట్‌మెంట్లు ఉన్నాయి, ఇవి మహిళా అధికారులతో పాటుగా 1,600 మంది ఇతర నావికా సిబ్బంది కోసం రూపొందించబడ్డాయి.
దేశీయంగా తయారు చేసిన అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లు (ALH) మరియు లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA)తో పాటు MiG-29K ఫైటర్ జెట్‌లు, Kamov-31, MH-60R మల్టీ-రోల్ హెలికాప్టర్‌లతో కూడిన 30 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో కూడిన ఎయిర్ వింగ్‌ను ఐఎన్‌ఎస్ విక్రాంత్ ఆపరేట్ చేయగలదు.
వోస్టాక్-2022 ఎక్సర్‌సైజ్‌లో భారత ఆర్మీ బృందం
రష్యాలో వోస్టాక్-2022 ఎక్సర్‌సైజ్‌లో ఇండియన్ ఆర్మీ కంటెంజెంట్ పాల్గొంది. ఈ ఎక్సర్‌సైజ్ 01 నుండి 07 సెప్టెంబర్ 2022 వరకు రష్యాలోని తూర్పు మిలిటరీ డిస్ట్రిక్ట్‌లోని శిక్షణా మైదానంలో బహుపాక్షిక వ్యూహాత్మక మరియు కమాండ్ ఎక్సర్‌సైజ్ వోస్టాక్-2022 జరగనున్నట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఎక్సర్‌సైజ్ యందు భారత ఆర్మీకి చెందిన 7/8 గూర్ఖా రైఫిల్స్ ప్రాతినిధ్యం వహిస్తుంది. రాబోయే ఏడు రోజులలో ఉమ్మడి ఫీల్డ్ ట్రైనింగ్ వ్యాయామాలు, పోరాట చర్చలు మరియు ఫైర్‌పవర్ వ్యాయామాలు చేపట్టనున్నారు.
ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే నాలుగు రోజుల నేపాల్ పర్యటన
నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ ప్రభురామ్ శర్మ ఆహ్వానం మేరకు భారత ఆర్మీ చీఫ్, జనరల్ మనోజ్ పాండే నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నేపాల్ చేరుకున్నారు. ఈ సంధర్బంగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేకు నేపాల్ ప్రెసిడెంట్ బిధ్యా దేవి భండారీ గౌరవ జనరల్ ఆఫ్ నేపాల్ ఆర్మీ హోదాను ప్రదానం చేశారు.
చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా జనరల్ మనోజ్ పాండే నేపాల్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటన ద్వారా ఇరుదేశాల మధ్య ప్రస్తుత ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను పెంపొందించుకోవడంతో పాటుగా పరస్పర ఆసక్తి ఉన్న రంగాలలో మరింత సహకారాన్ని మరియు అవకాశాలని కల్పించుకోనున్నారు.
లంబాకు సింగపూర్ 'మెరిటోరియస్ సర్వీస్ మెడల్'
భారత నావికాదళ మాజీ చీఫ్, అడ్మిరల్ సునీల్ లాంబాకు సింగపూర్ యొక్క ప్రతిష్టాత్మక సైనిక పురస్కారం, పింగట్ జాసా గెమిలాంగ్ (టెంటెరా) లేదా మెరిటోరియస్ సర్వీస్ మెడల్ వరించింది. ఈ అధ్యక్షుడు హలీమా యాకోబ్ చేతుల మీదుగా అందించారు. పింగట్ జాసా గెమిలాంగ్ అనేది సింగపూర్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ అందించే మూడవ అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు.
ప్రాజెక్ట్ 17A యొక్క మూడవ స్టెల్త్ ఫ్రిగేట్ 'తారాగిరి' ప్రారంభం
రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL), ప్రాజెక్ట్ 17A యొక్క మూడవ స్టెల్త్ ఫ్రిగేట్ తారాగిరిని ప్రారంభించింది. దాదాపు రూ. 25,700 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ఓడలో అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లు, అధునాతన యాక్షన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటి సౌకర్యాలు అమర్చనున్నారు. ఈ ఓడ ఆగస్టు 2025 నాటికి డెలివరీ చేయబడుతుందని భావిస్తున్నారు. ఈ నౌక సుమారుగా 3510 టన్నుల బరువుతో రూపొందనుంది.
జపాన్-ఇండియా మారిటైమ్ ఎక్సర్‌సైజ్ (JIMEX) 2022
భారత నౌకాదళం ఆతిథ్యమిచ్చిన జపాన్ ఇండియా మారిటైమ్ ఎక్సర్‌సైజ్ 2022 (JIMEX 22) యొక్క ఆరవ ఎడిషన్ 11 సెప్టెంబరు 2022 న బంగాళాఖాతంలో ప్రారంభమైంది. జపాన్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ షిప్‌లకు హిరాటా తోషియుకి, కమాండర్ ఎస్కార్ట్ ఫ్లోటిల్లా ఫోర్ నాయకత్వం వహిస్తుండగా, ఇండియన్ నేవల్ షిప్‌లకు సంజయ్ భల్లా, ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఈస్టర్న్ ఫ్లీట్ నాయకత్వం వహిస్తున్నారు.
సైన్యం, వైమానిక దళాల ఉమ్మడి వ్యాయామం - గగన్ స్ట్రైక్
భారత సైన్యం & భారత వైమానిక దళం సంయుక్త వ్యాయామం 'గగన్ స్ట్రైక్' నిర్వహించాయి. పంజాబ్ యందు నిర్వహించిన ఈ ఉమ్మడి వ్యాయామంలో భారత సైన్యానికి చెందిన ఖార్గా కార్ప్స్ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క దళాలు పాల్గొన్నాయి. నాలుగు రోజుల నిడివితో సాగనున్న ఈ వ్యాయామం ద్వారా భూతల బలగాలకు మరియు వైమానిక దళాలకు మధ్య సమన్వయం పెంపొందించనున్నారు.
కిబితు మిలిటరీ గారిసన్‌కు బిపిన్ రావత్ పేరు
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ, వాలాంగ్ నుండి కిబితు వరకు ఉన్న 22 కి.మీ పొడవైన రహదారికి 'జనరల్ బిపిన్ రావత్ మార్గ్' గా నామకరణం చేసారు. 1999-2000 ఏడాది మధ్య బిపిన్ రావత్ ఈ ప్రాంతంలో విధులు నిర్వర్తించారు.
అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజావ్ జిల్లాలోని కిబితు మిలిటరీ గారిసన్, చైనాతో సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతంతో పనిచేసిన సమయంలో భారతదేశ మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జనరల్ బిపిన్ రావత్ వ్యక్తిగత అనుబంధం కలిగి ఉన్నారు. ఆయన గౌరవార్థం ఈ మార్గానికి జనరల్ బిపిన్ రావత్ మిలిటరీ గారిసన్‌గా పేరు పెట్టారు.
ఎక్సర్‌సైజ్ కాకడు -2022
రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ నిర్వహిస్తున్న ఎక్సర్‌సైజ్ కాకడు -2022 లో పాల్గునేందుకు భారతదేశం నుండి ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్ఎస్ సత్పురా మరియు P8 I మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ బయలుదేరాయి. కాకడు 2022 లేదా KA22 వ్యాయామం సెప్టెంబర్ 12న ఆస్ట్రేలియాలోని డార్విన్‌లో జరుగనుంది. రెండు వారాల నిడివితో సాగనున్న ఈ ఎక్సర్‌సైజ్ యందు 14 దేశాల నేవీ దళాలు పాల్గొంటాయి.
ఐఎన్‌ఎస్ అజయ్ 32 ఏళ్ళ సర్వీస్ తర్వాత డీకమీషన్డ్
యాంటీ సబ్‌మెరైన్ షిప్ ఐఎన్‌ఎస్ అజయ్ 32 సంవత్సరాల అద్భుతమైన సేవలను అందించిన తర్వాత 19 సెప్టెంబర్ 2022న డీకమిషన్ చేయబడింది. ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో ఐఎన్‌ఎస్ అజయ్ డీకమిషన్ వేడుకను సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు.
ఐఎన్‌ఎస్ అజయ్ వెస్ట్రన్ నేవల్ కమాండ్‌కు చెందిన అభయ్ క్లాస్ యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ కార్వెట్. ఈ ఓడ జనవరి 24, 1990న అప్పటి USSR యొక్క పోటీ పోర్ట్, జార్జియాలో ప్రారంభించబడింది. ఐఎన్‌ఎస్ అజయ్ 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో ఆపరేషన్ తల్వార్ యందు మరియు 2001లో ఆపరేషన్ పరాక్రమ్‌తో సహా పలు కీలకమైన ఆపరేషన్ల యందు దేశానికి సేవలు అందించింది.
కార్గిల్ ఇంటర్నేషనల్ మారథాన్ 2022
ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే లడఖ్‌లో కార్గిల్ ఇంటర్నేషనల్ మారథాన్‌ను ప్రారంభించారు. 42 కిలోమీటర్ల మేర సాగే ఈవెంట్‌లను లడఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ నిర్వహిస్తుంది. ఈ మారథాన్ యందు సుమారు 2 వేల రన్నర్లు పాల్గొనున్నారు.
GRSE కి ప్రతిష్టాత్మక 'రాజభాషా కీర్తి పురస్కారం
గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్, కోల్‌కతాకు భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మక 'రాజ్‌భాషా కీర్తి పురస్కారం' ను అందించింది. రాజభాషా కీర్తి పురస్కారం అనేది అధికారిక భాషా అమలుచేసే సంస్థలకు భారత ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్
తూర్పు ఆర్మీ కమాండ్ చీఫ్‌గా పదవీ విరమణ చేసిన లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా (సీడీఎస్) నియమితులయ్యారు. 2020 లో ఏర్పాటు చేసిన ఈ హోదాకు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా జనరల్ బిపిన్ రావత్ బాధ్యతలు స్వీకరించారు. గత డిసెంబరులో ఆయన హఠాత్తు మరణం తర్వాత గత 9 నెలలుగా ఈ పోస్టు ఖాళీగా ఉంది.
డ్రగ్స్ నెట్‌వర్క్‌ల విచ్ఛిన్నం కోసం ఆపరేషన్ గరుడ
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అంతర్జాతీయ అనుసంధానాలతో మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌లను విచ్ఛిన్నం చేయడానికి బహుళ-దశల ఆపరేషన్ గరుడను ప్రారంభించింది. ఇందులో భాగంగా హిందూ మహాసముద్ర ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి ఇంటర్‌పోల్ మరియు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ద్వారా అంతర్జాతీయ అధికార పరిధిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ సమన్వయంతో పని చేయనుంది.
రిపోర్టులు & ర్యాంకులు
ప్రపంచ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) డేటా ప్రకారం, 2021 చివరి మూడు నెలల్లో భారతదేశం యునైటెడ్ కింగ్‌డమ్‌ను అధిగమించి ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఈ జాబితాలో ఒక దశాబ్దం క్రితం భారతదేశం 11వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం యూఎస్, చైనా, జపాన్ మరియు జర్మనీల తర్వాత 5వ స్థానంలో నిలిచింది.
ఇదిఇలా ఉండగా 2029 నాటికి జర్మనీ, జపాన్‌లను వెనక్కి నెట్టి భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నట్లు ఎస్బీఐ పరిశోధన రిపోర్టు అంచనా వేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత ఎకానమీ వృద్ధి 7 శాతంగా అంచనా వేయబడింది.
భారతదేశపు మొట్టమొదటి ఎల్‌ఎన్‌జి గ్రీన్ ట్రక్ ప్రారంభం
ఇండియన్ స్టార్టప్ 'బ్లూ ఎనర్జీ మోటార్స్', భారతదేశం యొక్క మొట్టమొదటి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జి) ఇంధనంతో నడిచే గ్రీన్ ట్రక్కుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ తయారీ కేంద్రాన్ని సెప్టెంబరు 2 న కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. బ్లూ ఎనర్జీ మోటార్స్ తయారీ కేంద్రం పూణేలోని చకాన్‌లో స్థాపించారు.
యునెస్కో లెర్నింగ్ సిటీల నెట్‌వర్క్‌లో 3 భారతీయ నగరాలు
తెలంగాణలోని రెండవ అతిపెద్ద నగరం వరంగల్, కేరళలోని నిలంబూర్ మరియు త్రిసూర్ నగరాలు ఐక్యరాజ్యసమితి విద్యా, వైజ్ఞానిక మరియు సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్‌లో చోటు దక్కించుకున్నాయి.
సిటీస్ ఆఫ్ లెర్నింగ్ అనేది టెరిటరీ-ఆధారిత వెబ్ ప్లాట్‌ఫారమ్. ఇంటరాక్టివ్ మ్యాప్‌లు, ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లేలిస్ట్‌లు మరియు డిజిటల్ ఓపెన్ బ్యాడ్జ్‌లను ఉపయోగించి యువత కోసం ప్రత్యేకమైన అభ్యాస మార్గాలను అందించే నగరాలను ఈ జాబితాలో చోటు కల్పిస్తారు.
బీసీసీఐ టైటిల్ స్పాన్సర్‌గా మాస్టర్ కార్డ్
బిసిసిఐ టైటిల్‌గా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా 2022-23 సీజన్ అంతర్జాతీయ మ్యాచ్‌లకు గ్లోబల్ పేమెంట్స్ అండ్ టెక్నాలజీ కంపెనీ మాస్టర్ కార్డ్ టైటిల్ స్పాన్సర్‌గా ఉంటుందని ధృవీకరించింది. గతంలో ఇండియన్ మొబైల్ పేమెంట్ యాప్ కంపెనీ పేటిఎమ్ బీసీసీఐ టైటిల్ స్పాన్సర్‌గా ఉండేది.
యూఎన్డీపీ మానవ అభివృద్ధి సూచికలో ఇండియాకు 132వ స్థానం
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) విడుదల చేసిన 2021 మానవ అభివృద్ధి సూచిక (HDI)లో భారత్ 132వ స్థానంలో నిలిచింది. 199 దేశాలకు సంబంధించి విడుదల చేసిన ఈ ర్యాంకింగులో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో నిలువగా, తర్వాత స్థానాలలో నార్వే, ఐస్‌ల్యాండ్ దేశాలు ఉన్నాయి.
మిగతా ఆసియా దేశాలలో శ్రీలంక 73వ స్థానంలో, చైనా 79వ స్థానంలో, బంగ్లాదేశ్ 129వ స్థానంలో, భూటాన్ 127వ స్థానంలో భారత్ కంటే ముందర నిలిచాయి. 2020లో ఇండియా 131వ స్థానంలో ఉండగా ప్రస్తుతం ఒకస్థానం దిగజారి 132వ స్థానంలో నిలిచింది.
భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ ఫ్రైట్ ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
నీతి ఆయోగ్ మరియు వరల్డ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (WRI) భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ ఫ్రైట్ ప్లాట్‌ఫారమ్ ఇ-ఫాస్ట్ ఇండియా ( ఎలక్ట్రిక్ ఫ్రైట్ యాక్సిలరేటర్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్‌పోర్ట్) ఆవిష్కరించాయి. ఇ-ఫాస్ట్ ఇండియా అనేది ఏకీకృత ఇ-ఫ్రైట్ ప్లాట్‌ఫారమ్, ఇది సరుకు రవాణా రంగాన్ని డీకార్బనైజేషన్ చేయడానికి మార్గం సుగమం చేయనుంది.
పెట్టుబడులను ఆకర్షించే రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రస్థానం
2022 మొదటి ఏడు నెలల్లో పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. డిపార్టుమెంట్ ఫర్ ప్రమేషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ నివేదిక ప్రకారం గత 7 నెలలలో ఇండియాలో 1,71,285 కోట్ల పెట్టుబడులు రాగా, అందులో సుమారు 40361 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఆకర్షించబడ్డాయి.
భారత అత్యుత్తమ జంతు ప్రదర్శనశాలగా డార్జిలింగ్ జూ
డార్జిలింగ్‌లోని పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ (PNHZP) దేశంలోనే అత్యుత్తమ జూగా ఎంపికైంది. పద్మజ నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ పట్టణంలో 67.56 ఎకరాల విస్తీర్ణంతో, సగటున 7,000 అడుగుల ఎత్తులో భారతదేశంలోనే అతిపెద్ద ఎత్తైన జంతుప్రదర్శనశాలగా ఉంది. ఇది 1958లో ప్రారంభించబడింది.
సెంట్రల్ జూ అథారిటీ విడుదల చేసిన ఈ ర్యాంకింగులో చెన్నైలోని అరిగినర్ అన్నా జూలాజికల్ పార్క్ రెండవ స్థానంలో నిలువగా, మైసూరులోని శ్రీ చామరాజేంద్ర జూలాజికల్ గార్డెన్ మూడవ స్థానంలో నిలిచింది. ఇదే జాబితాలో కోల్‌కతాలోని అలీపూర్ జూలాజికల్ గార్డెన్ నాల్గవ స్థానంలో నిలిచింది.
దేశంలో తొలి డిజిటల్ అడ్రసింగ్ స్మార్ట్ సిటీగా ఇండోర్
ఇండోర్ పూర్తిగా డిజిటల్ అడ్రసింగ్ సిస్టమ్‌ను అమలుచేసిన దేశంలోని మొదటి స్మార్ట్ సిటీగా అవతరించింది. దీనికి సంబంధించి ఇండోర్ ప్రభుత్వం, పాట డిజిటల్ అడ్రస్ యాపుతో MOU సంతకం చేసింది. ఈ సంస్థ ప్రభుత్వ ఏజెన్సీలకు, ఎమర్జెన్సీ సర్వీస్లు మరియు ఇతర పౌరసేవ కార్యాలయాలకు సంబంధించి జియోట్యాగింగ్ సదుపాయంతో డిజిటల్ అడ్రసింగ్ సిస్టమ్‌ను రూపొందించింది.
గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్‌లో ఇండియాకు నాల్గవ స్థానం
బ్లాక్‌చెయిన్ పరిశోధన సంస్థ చైనాలిసిస్ రిపోర్ట్ చేసిన 2022 గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్‌లో భారతదేశం నాల్గవ ర్యాంలో నిలిచింది. ఈ జబితాలో వియాత్నం నెంబర్ 1 స్థానంలో ఉంది. ఈ ర్యాంకింగులో యూఎస్, యూకే, రష్యాల కంటే భారత్ ముందు వరుసలో ఉంది. ఈ ఇండెక్స్ క్రిప్టోకరెన్సీలను స్వీకరించే లేదా డిజిటల్ ఆస్తులలో పెట్టుబడి పెట్టే దేశాలను ట్రాక్ చేస్తుంది.
మొదటి “క్లీన్ అండ్ సుజల్ ప్రదేశ్ ” గా అండమాన్
అండమాన్ మరియు నికోబార్ దీవులు భారతదేశం యొక్క మొదటి స్వచ్ఛ సుజల్ ప్రదేశ్‌గా ప్రకటించబడ్డాయి. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దీనికి సంబంధించిన సర్టిఫికెటును పోర్ట్ బ్లెయిర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డీకే జోషికి అందజేశారు. స్వచ్ఛ సుజల్ ప్రదేశ్ అనేది గ్రామీణ ప్రాంతాలకు చెందిన పరిసరాలు మరియు నీటి స్వచ్చతకు సంబంధించిన కార్యక్రమం.
కాశ్మీర్‌లో మొట్టమొదటి మల్టీప్లెక్స్ ప్రారంభం
జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కాశ్మీర్ సోనావర్ ప్రాంతంలో మొట్టమొదటి మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు. 1990 లో కాశ్మీర్ యందు సినిమా థియేటర్లు మూసివేత తరువాత ఆ ప్రాంతంలో థియేటర్ ప్రారంభం కావడం ఇదే మొదటిసారి. శ్రీనగర్‌కు చెందిన కాశ్మీరీ పండిట్ నిర్మించిన ఈ ఐనాక్స్ మల్టీప్లెక్స్ పూర్తి కావడానికి ఐదు సంవత్సరాలు పట్టింది.
దేశంలో మొదటి దుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ నోటిఫైడ్
భారతదేశంలోని మొట్టమొదటి దుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ తమిళంలో నోటిఫై చేయబడింది. తంజావూరు తీరప్రాంత జలాలను కవర్ చేసే పాక్ బేలో తమిళనాడు ప్రభుత్వం దీనిని నోటిఫై చేసింది. అంతరించిపోతున్న దుగాంగులను సంరక్షించడమే ధ్యేయంగా దీని ఏర్పాటు చేస్తున్నారు.
దుగోంగ్ అనేది సిరేనియా క్లాసుకి చెందిన సముద్రపు క్షీరదం. దీనిని సముద్రపు ఆవు అని కూడా అంటారు. దీనికి చెందిన చాల జాతులు 18వ శతాబ్దంలో అంతరించిపోయాయి. ప్రస్తుతం ఉన్న కొన్ని కూడా అంతరించే జాబితాలో ఉన్నాయి. దుగోంగ్స్ ఒకప్పుడు దక్షిణ చైనా జలాల్లో శాంతియుతంగా తేలుతూ ఉండేవి. వేట, ఓడలతో ఢీకొనడం మరియు ఇతర మానవ జోక్యాల కారణంగా ఈ సున్నితమైన సముద్ర క్షీరదాలు క్రియాత్మకంగా అంతరించిపోతున్నాయి.
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో భారతదేశంకు 40వ ర్యాంక్
వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ యొక్క గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2022 లో భారతదేశం 40వ ర్యాంకులో నిలిచింది. 2015లో 81వ స్థానంలో ఉన్న భారత్ గత ఏడాది 46 వ స్థానంలో నిలిచింది. 7 ఏళ్లలో 41 స్థానాలు ఎగబాకి 40వ స్థానానికి చేరుకుంది.
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో స్విట్జర్లాండ్ వరుసగా 12వ సంవత్సరం కూడా ఆవిష్కరణలలో ప్రపంచంలోనే అగ్రగామిగా కొనసాగుతోంది. ఈ జాబితాలో యూఎస్ రెండో స్థానంలో ఉండగా, స్వీడన్, యూకే, నెదర్లాండ్స్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది ఏటా రూపొందించే నూతన ఉత్పత్తుల పేటెంట్‌లకు సంబంధించిన అంశం. దీనిని 2007 లో భారతీయ విద్యావేత్త సౌమిత్ర దత్తా ప్రారంభించారు.
అవార్డులు & గౌరవాలు
67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డు 2022 విజేతలు
టైమ్స్ గ్రూప్ నిర్వహించే 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుక హాట్టహాసంగా జరిగింది. ఈ అవార్డు వేదిక ద్వారా 2021 ఉత్తమ భారతీయ హిందీ-భాషా చిత్రాలను సత్కరించింది. ఈ అవార్డు వేడుకకు రణవీర్ సింగ్, అర్జున్ కపూర్ హోస్టులుగా వ్యవరించారు. ఇందులో సర్దార్ ఉద్దం చిత్రం అత్యధికంగా 9 అవార్డులు అందుకోగా, షేర్షా చిత్రం 7 అవార్డులతో రెండవ స్థానంలో నిలిచింది. అవార్డుల పూర్తి జాబితా
- ఉత్తమ చిత్రం - షేర్షా
- ఉత్తమ దర్శకుడు - విష్ణువర్ధన్ (షేర్షా)
- ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) - సర్దార్ ఉద్దం
- ఉత్తమ నటుడు - రణవీర్ సింగ్ (83 కపిల్ దేవ్)
- ఉత్తమ నటి - కృతి సనన్ ( మిమీ)
- ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ - సుభాష్ ఘాయ్
64వ రామన్ మెగసెసే అవార్డు 2022 విజేతలు
రామన్ మెగసెసే అవార్డ్ ఫౌండేషన్ (RMAF) 64వ రామన్ మెగసెసే అవార్డ్ 2022 విజేతలను ప్రకటించింది. 2022 సంబంధించి ఈ అవార్డులను కంబోడియాకి చెందిన సైకియాట్రిస్ట్ సోథెరా చిమ్, జపానుకు చెందిన నేత్ర వైద్యుడు తదాషి హట్టోరి, ఫిలిప్పీన్స్ శిశువైద్యుడు బెర్నాడెట్ మాడ్రిడ్, ఇండోనేషియాకు చెందిన సామాజిక కార్యకర్త గ్యారీ బెంచెగిబ్'లు అందుకున్నారు.
రామన్ మెగసెసే అవార్డు అనేది ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే యొక్క జ్ఞాపకార్దంగా 1958 లో స్థాపించారు. ఈ అవార్డును వివిధ రంగాలలో అత్యుత్తమ కృషి చేసే ఆసియా వ్యక్తులకు అందిస్తారు. ఈ ఏడాది ఇండియా నుండి కేరళ మాజీ ఆరోగ్య మంత్రి కెకె శైలజకు ఈ ఏడాది మెగసెసే అవార్డు 2022కు నామినేట్ చేయగా ఆమె స్వీకరించడానికి నిరాకరించారు.
బరాక్ ఒబామాకు ఎమ్మీ అవార్డు
యునైటెడ్ స్టేట్స్ మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ “అవర్ గ్రేట్ నేషనల్ పార్క్స్” కోసం బెస్ట్ నేరేషన్ విభాగంలో ఎమ్మీ అవార్డును గెలుచుకున్నారు. దీనితో ఎమ్మీ అవార్డు అందుకున్న రెండవ అమెరికా అధ్యక్షుడుగా నిలిచారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డ్వైట్ డి. ఐసెన్‌హోవర్ గతంలో ఎమ్మీ అవార్డు అందుకున్న మొదటి అధ్యక్షుడుగా ఉన్నారు. ఇదిలా ఉండగా బరాక్ ఒబామా గతంలో 'ఏ ప్రోమిస్డ్ ల్యాండ్' ఆడియో బుక్ కోసం గ్రామీ అవార్డు కూడా అందుకున్నారు.
పశ్చిమ బెంగాల్‌కు అంతర్జాతీయ ట్రావెల్ అవార్డు
పశ్చిమ బెంగాల్, ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉన్న పసిఫిక్ ఏరియా ట్రావెల్ రైటర్స్ అసోసియేషన్ అందించే ఇంటర్నేషనల్ ట్రావెల్ అవార్డు 2023 అందుకోనుంది. ఈ అవార్డును మార్చి 9, 2023న బెర్లిన్‌లో జరిగే వరల్డ్ టూరిజం అండ్ ఏవియేషన్ లీడర్స్ సమ్మిట్‌లో ప్రదానం చేస్తారు. ఈ అవార్డును బెస్ట్ డెస్టినేషన్ ఫర్ కల్చర్ కేటగిరిలో అందించారు. పసిఫిక్ ఏరియా ట్రావెల్ రైటర్స్ అసోసియేషన్ 1998 లో స్థాపించబడింది.
తనికెళ్ల భరణికి లోక్ నాయక్ సాహిత్య పురస్కారం
తెలుగు నటుడు తనికెళ్ల భరణి 2022 ఏడాదికి సంబంధించి లోక్ నాయక్ ఫౌండేషన్ యొక్క వార్షిక సాహిత్య పురస్కారం అందుకున్నారు. విశాఖపట్నంలోని కళాభారతి ఆడిటోరియంలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో 18వ లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డు అందుకున్నారు.
74వ ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డులు 2022
74వ ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డ్‌ల వేడుక 13 సెప్టెంబరు 2022 న లాస్ ఏంజిల్స్ నగరంలో హాట్టహాసంగా జరిగింది. జూన్ 1, 2021 నుండి మే 31, 2022 వరకు అమెరికన్ ప్రైమ్ టైమ్ టెలివిజన్ ప్రోగ్రామింగ్‌లో ప్రచారమైన ఉత్తమమైన టెలివిజన్ షోలకు ఈ అవార్డులు అందించారు. ఈ అవార్డుల వేడుకకు కెనన్ థాంప్సన్ హోస్టుగా వ్యవహరించారు. అవార్డుల పూర్తి జాబితా కోసం క్లిక్ చేయండి.
స్వాతి పిరమల్‌కు అత్యున్నత ఫ్రెంచ్ పౌర గౌరవం
ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త మరియు పారిశ్రామికవేత్త డాక్టర్ స్వాతి పిరమల్ వ్యాపారం మరియు పరిశ్రమలు, సైన్స్, మెడిసిన్ రంగాలలో మరియు ఇండో-ఫ్రెంచ్ సంబంధాలను బలోపేతం చేయడంలో ఆమె చేసిన కృషికి గాను ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పౌరగౌరవం చెవాలియర్ డి లా లెజియన్ డి'హానర్ (నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ ) దక్కించుకున్నారు. స్వాతి పిరమల్ ప్రస్తుతం పిరమల్ గ్రూప్‌కు వైస్ ఛైర్‌పర్సనుగా ఉన్నారు.
గుజరాతీ చిత్రం 'ఛెలో షో' కు ఆస్కార్ ఎంట్రీ
గుజరాతీ చిత్రం 'ఛెలో షో' కు ఆస్కార్ 2023 సంబంధించి అధికారిక ఎంట్రీ లభించింది. గుజరాత్‌లోని సౌరాష్ట్ర గ్రామంలో చిన్నతనంలో సినిమాల పట్ల ప్రేమలో పడిన పాన్ నలిన్ జ్ఞాపకాల ప్రేరణ నుండి రూపొందిన ఈ చిత్రంను, ఆస్కార్ 2023 అవార్డుల నామినేషన్ సంబంధించి భారతదేశం యొక్క అధికారిక ఎంట్రీగా ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎఫ్‌ఐ) ప్రెసిడెంట్ టిపి అగర్వాల్ వెల్లడించారు.
రచయిత్రి మీనా కందసామికి హెర్మన్ కెస్టన్ అవార్డు
భారత రచయిత్రి మరియు కవయిత్రి మీనా కందసామి 2022 ఏడాదికి గాను పెన్ ఇంటర్నేషనల్ రైటర్స్ అసోసియేషన్ యొక్క హెర్మన్ కెస్టన్ బహుమతిని గెలుచుకున్నారు. చెన్నైలో జన్మించిన మీనా కందసామి క్యాస్ట్ సిస్టంకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.
ఈవార్డును జర్మన్ నవలా రచయిత హెర్మన్ కెస్టన్ జ్ఞాపకార్థం 1985 లో స్థాపించారు. 1920 జర్మనీలో న్యూ ఆబ్జెక్టివిటీ ఉద్యమం యొక్క ప్రధాన సాహిత్య వ్యక్తులలో హెర్మన్ కెస్టన్ ఒకడు.
సుయెల్లా బ్రేవర్‌మాన్'కు క్వీన్ ఎలిజబెత్ II అవార్డు
భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్ హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్‌మన్ మొట్టమొదటి క్వీన్ ఎలిజబెత్ II ఉమెన్ ఆఫ్ ద ఇయర్ విజేతగా ఎంపికయ్యారు. ఈ అవార్డును ఆమె ఆసియన్ అచీవర్స్ అవార్డ్స్ వేడుకలో అందుకోనున్నారు. ఈ అవార్డును 2020 లో ప్రారంభించారు. దీనిని బ్రిటన్లో అత్యుత్తమ సేవలు అందించిన దక్షిణాన ఆసియాకు చెందిన వ్యక్తులకు అందిస్తారు.
ఇటీవలే యునైటెడ్ కింగ్‌డమ్ కొత్త ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లిజ్ ట్రస్ తన హోం సెక్రటరీగా సుయెల్లా బ్రేవర్‌మన్‌ను నియమించుకున్నారు. సుయెల్లా బ్రవర్‌మన్ గతంలో 2020-2022 మధ్య అటార్నీ జనరల్‌గా పనిచేసారు.
కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ASQ అవార్డు
కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ 2021-22లో 'మిషన్ సేఫ్‌గార్డింగ్' కార్యక్రమాన్ని నిశితంగా అమలు చేసినందుకు గాను ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) స్థాపించిన ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డు-2022ని గెలుచుకుంది. ఈ అవార్డును గ్లోబల్ ఏవియేషన్ సెక్టార్ యందు అత్త్యుత్తమ గౌరవంగా భావిస్తారు.
బ్రేక్‌త్రూ ప్రైజ్ 2023 విజేతలు
అతిపెద్ద సైన్స్ గుర్తింపు అవార్డుగా భావించే బ్రేక్‌త్రూ ప్రైజ్ 2023 విజేతలను ది బ్రేక్‌త్రూ ప్రైజ్ ఫౌండేషన్ ప్రకటించింది. 2012 లో సెర్గీ బ్రిన్, ప్రిస్సిల్లా చాన్, జూలియా, యూరి మిల్నర్ మరియు మార్క్ జుకర్‌బర్గ్ స్థాపించిన ఈ అవార్డును ఫండమెంటల్ ఫిజిక్స్, లైఫ్ సైన్సెస్ మరియు మ్యాథమెటిక్స్ రంగాలలో పురోగతి సాధించిన శాస్త్రవేత్తలకు అందించబడతాయి. అవార్డు గ్రహీతకు 3 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ అందిస్తారు.
బ్రేక్‌త్రూ ప్రైజ్ 2023 మ్యాథమెటికల్ - సైద్ధాంతిక కంప్యూటర్ సైన్స్ మరియు గణితంలో అనేక ఆవిష్కరణలు చేసినందుకు గణితంలో బ్రేక్‌త్రూ ప్రైజ్ అవార్డును డేనియల్ ఎ. స్పీల్‌మాన్‌కు అందజేశారు.
బ్రేక్‌త్రూ ప్రైజ్ 2023 ఫండమెంటల్ ఫిజిక్స్ - ఫండమెంటల్ ఫిజిక్స్‌లో బ్రేక్‌త్రూ ప్రైజ్‌ను చార్లెస్ హెచ్. బెన్నెట్, గిల్లెస్ బ్రాస్సార్డ్, డేవిడ్ డ్యూచ్ మరియు పీటర్ షోర్ క్వాంటం ఇన్ఫర్మేషన్‌లో చేసిన కృషికి గాను దక్కించుకున్నారు.
బ్రేక్‌త్రూ ప్రైజ్ 2023 లైఫ్ సైన్సెస్ - ఈ ఏడాది లైఫ్ సైన్సెస్‌లో మూడు బ్రేక్‌త్రూ బహుమతులు ఇవ్వబడ్డాయి. ఇందులో మొదటిది సెల్యులార్ ఆర్గనైజేషన్ యొక్క కొత్త మెకానిజంను కనుగొన్నందుకు క్లిఫ్ఫోర్డ్ బ్రాంగ్విన్ అందుకున్నారు.
రెండవది అమైనో యాసిడ్ సీక్వెన్స్ నుండి ప్రోటీన్ల యొక్క త్రిమితీయ నిర్మాణాన్ని వేగంగా మరియు ఖచ్చితంగా అంచనా వేయగల ఆల్ఫాఫోల్డ్ అనే డీప్-లెర్నింగ్ పద్ధతిని అభివృద్ధి చేసిన డెమిస్ హస్సాబిస్ మరియు జాన్ జంపర్ అందుకున్నారు. ఇక మూడవది నార్కోలెప్సీకి గల కారణాలను కనిపెట్టినందుకు ఇమ్మాన్యుయేల్ మిగ్నోట్ మరియు మసాషి యనగిసావాలకు అందించారు.
68వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో 68వ జాతీయ చలనచిత్ర అవార్డులను 30 సెప్టెంబర్ 2022న ప్రదానం చేసారు. ఈ అవార్డుల వేడుకలో తమిళ చిత్రం సూరరై పొట్రు అత్యధికంగా 5 అవార్డులు దక్కించుకుంది. అలానే బాలీవుడ్ సీనియర్ నటి మరియు దర్శికరాలు ఆశా పరేఖ్ 2020 ఏడాదికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. పూర్తి అవార్డుల జాబితా.
- బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ - సూరరై పొట్రు (తమిళ్)
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు: ఆశా పరేఖ్
- ఉత్తమ పుస్తకం - ది లాంగెస్ట్ కిస్
- ఉత్తమ దర్శకత్వం - అయ్యప్పనం కోషియుమ్ (మలయాళం)
- ప్రజాదరణ పొందిన చిత్రం - తాన్హాజీ (హిందీ)
- ఉత్తమ బాలల చిత్రం - సుమి (మరాఠి)
కుమార్ సాను, శైలేంద్ర సింగ్ లకు లతా మంగేష్కర్ అవార్డు
ప్రముఖ నేపథ్య గాయకులు కుమార్ సాను, శైలేంద్ర సింగ్ మరియు సంగీత-స్వరకర్త ద్వయం ఆనంద్-మిలింద్‌లకు జాతీయ లతా మంగేష్కర్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును 28 సెప్టెంబర్ 2022న జరిగిన లతా మంగేష్కర్ జయంతి వేడుకలలో అందించారు.
స్పోర్ట్స్ అఫైర్స్
పల్లతురుతి బోట్ క్లబ్‌కు నెహ్రూ ట్రోఫీ
పున్నమడ సరస్సుపై జరిగిన 68వ ఎడిషన్ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ (ఎన్‌టిబిఆర్)లో పల్లతురుతి బోట్ క్లబ్ (పిబిసి) విజేతగా నిలిచింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాల విరామం తర్వాత జరిగిన బోట్ రేస్ యొక్క ఈ ఎడిషన్‌ను అండమాన్ మరియు నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ డికె జోషి ఫ్లాగ్ ఆఫ్ చేసారు.
డైమండ్ లీగ్ 2022 టైటిల్ విజేతగా నీరజ్ చోప్రా
జ్యూరిచ్ డైమండ్ లీగ్ ఫైనల్ పురుషుల జావెలిన్ ఈవెంట్ యందు భారతీయ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా విజేతగా నిలిచాడు. దీనితో డైమండ్ లీగ్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి భారతీయ జావెలిన్ త్రోయరుగా రికార్డు సాధించాడు. ఈ పోటీ రౌండ్ 2లో నీరజ్ చోప్రా యొక్క 88.44 మీటర్లు విజేతగా నిలువగా, చెక్ జాకుబ్ వడ్లెజ్ 86.94 మీటర్లతో రెండవ స్థానంలో నిలిచాడు.
నీరజ్ చోప్రా గడిచిన 12 నెలలలో ఒలింపిక్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ స్వర్ణం సాధించిన తొలి భారతీయుడుతో పాటుగా, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన తొలి భారతీయుడుగా, ఇప్పుడు డైమండ్ లీగ్ ఛాంపియన్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి భారతీయ జావెలిన్ త్రోయరుగా చారిత్రాత్మక రికార్డులు నమోదు చేసాడు.
మొదటిసారి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు సిక్కిం ఆతిథ్యం
ఈశాన్య హిమాలయ రాష్ట్రమైన సిక్కిం, చరిత్రలో మొదటిసారి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. రాబోయే రంజీ ట్రోఫీలో మొత్తం 3 మ్యాచ్‌లు ఈ రాష్ట్రంలో నిర్వహించనున్నారు. అదే సమయంలో 2 కూచ్ బెహార్ ట్రోఫీ మ్యాచులు, 3 సీకే నాయుడు ట్రోఫీ మ్యాచులు ఇక్కడ జరుగనున్నాయి. ఈ మ్యాచులకు రంగ్‌పో సమీపంలోని మైనింగ్ క్రికెట్ గ్రౌండ్ ఆతిధ్యం ఇవ్వనుంది.
ఆసియా కప్ 2022 శ్రీలంక సొంతం
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ 2022 ఫైనల్‌లో శ్రీలంక 23 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి 6వ ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో ఏడు విజయాలతో భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా ఉండగా, శ్రీలంక ఆరు విజయాలతో రెండో స్థానంలో ఉంది.
ఈ టోర్నీలో శ్రీలంక అత్యధికంగా 14 ఆసియా కప్‌లు ఆడగా, భారత్, పాకిస్థాన్ మరియు బంగ్లాదేశ్ 13 చొప్పున ఆడాయి. ఆసియా కప్ 2022 శ్రీలంకలో జరగాల్సి ఉండగా వివిధ రాజకీయ కారణాలతో దుబాయ్ యందు నిర్వహించారు.
యూఎస్ ఓపెన్ 2022 విజేతలు
ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన యూఎస్ ఓపెన్ 2022 ఫైనల్లో స్పానిష్ టీన్ సంచలనం కార్లోస్ అల్కరాజ్, నార్వేకు చెందిన కాస్పర్ రూడ్‌ను 6-4, 2-6, 7-6 (7-1), 6-3తో ఓడించి యూఎస్ ఓపెన్ 2022 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.
తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకున్న 19 ఏళ్ళ కార్లోస్ అల్కరాజ్, పెట్ సంప్రాస్ (1990 యూఎస్ ఓపెన్), రఫెల్ నాదల్ (2005 ఫ్రెంచ్ ఓపెన్) తరువాత అతిచిన్న వయసులో గ్రాండ్‌స్లామ్ దక్కించుకున్న క్రీడాకారుడిగా నిలిచాడు.
యూఎస్ ఓపెన్ 2022 మహిళల సింగిల్స్ టైటిల్‌ను పోలాండ్ దేశానికి చెందిన ఇగా స్వియాటెక్ దక్కించుకున్నారు. ఫైనల్‌లో 6–2, 7–6తో ప్రత్యర్థి ఓన్స్ జబీర్‌ను ఓడించడం ద్వారా తన కెరీరులో మూడవ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సొంతం చేసుకుంది. ఇగా స్వియాటెక్ ఇది వరకు 2020, 2021 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచారు.
యూఎస్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్ అనేది న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో ప్రతి సంవత్సరం జరిగే హార్డ్‌కోర్ట్ టెన్నిస్ టోర్నమెంట్. ఇది 1987 లో మొదటిసారి ప్రారంభించారు. టెన్నిస్ ఓపెన్ కాలక్రమానుసారం ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ మరియు వింబుల్డన్ తరువాత సంవత్సరంలో నాల్గవ మరియు చివరి గ్రాండ్ స్లామ్ టోర్నమెంటుగా యూఎస్ ఓపెన్ నిర్వహిస్తారు.
విరాట్ కోహ్లీకి 50 మిలియన్ల ట్విట్టర్ ఫాలోవర్లు
మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్విట్టర్‌లో 50 మిలియన్ల మంది ఫాలోవర్లను చేరుకున్న మొదటి క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. అలానే మరో సోషల్ మీడియా వేదిక అయినా ఇన్‌స్టాగ్రామ్ యందు కూడా గరిష్టంగా 211 మిలియన్ల ఫాలోవర్లను కోహ్లీ కలిగి ఉన్నాడు.
రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో వినేష్ ఫోగట్'కు కాంస్యం
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా వినేష్ ఫోగాట్ నిలిచింది. సెప్టెంబరు 14న సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో జరిగిన 53 కిలోగ్రాముల విభాగంలో విజేతగా నిలవడంతో ఈ రికార్డు నమోదు చేసింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో ఇది ఆమెకు రెండవ పతకం. అంతకు ముందు 2019లో ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
SAFF U-17 ఛాంపియన్‌షిప్ భారత్ కైవసం
భారతదేశం SAFF అండర్-17 ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను రెండవసారి కైవసం చేసుకుంది. సెప్టెంబర్ 14న కొలంబోలో జరిగిన ఫైనల్‌లో నేపాల్‌ను 4-0తో ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. బాబీ సింగ్, కొరౌ సింగ్, కెప్టెన్ వన్‌లాల్పెకా గైట్, మరియు అమన్ తలా ఒక్కో గోల్ చేసి భారత్‌కు విజయాన్ని అందించారు. గతంలో 2019లో భారతదేశం SAFF అండర్-17 ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకుంది. అలానే SAFF మహిళల అండర్-17 ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను బంగాదేశ్ సొంతం చేసుకుంది.
ప్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోజర్ ఫెదరర్
అత్యంత ప్రజాదరణ కలిగిన లెజెండరీ స్విస్ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ 41 సంవత్సరాల వయస్సులో ప్రొఫెషనల్ టెన్నిస్ నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. 20 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన రోజర్ ఫెదరర్ ఈ నెల చివరిలో జరిగే లావర్ కప్ తర్వాత టెన్నిస్ నుండి రిటైర్ కానున్నాడు.
బెంగళూరు ఎఫ్‌సికి మొదటి డ్యూరాండ్ కప్
కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన డ్యూరాండ్ కప్ తుదిపోరులో బెంగళూరు ఎఫ్‌సి, ముంబై సిటీ ఎఫ్‌సిని 2-1 తేడాతో తేడాతో ఓడించి తన తొలి డ్యూరాండ్ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ ఫుట్‌బాల్ సీజన్ ఓపెనర్‌లో మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. డ్యూరాండ్ కప్ మొదటిసారి మూడు రాష్ట్రాలలో (కొలకత్తా, గువాహటి, ఇంఫాల్) నిర్వహించారు.
డురాండ్ కప్ భారతదేశంలోని పురాతన ఫుట్‌బాల్ టోర్నమెంట్. దీనిని 1888 లో బ్రిటీష్ ఇండియా విదేశాంగ కార్యదర్శి సర్ హెన్రీ మోర్టిమర్ డ్యూరాండ్ 1888లో ప్రారంభించారు, డ్యూరాండ్ కప్ ప్రారంభంలో బ్రిటిష్ సాయుధ దళాలు, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ మరియు ఇతర సాయుధ విభాగాల మధ్య సిమ్లాలో జరిగేది.
రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో బజరంగ్ పునియాకు కాంస్యం
బెల్‌గ్రేడ్‌లో జరిగిన ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ 2022 చివరి రోజున పురుషుల 65 కేజీల విభాగంలో భారత రెజ్లర్ బజరంగ్ పునియా కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. కాంస్య పథకానికి సంబంధించి జరిగిన పోరులో బజరంగ్ పునియా 11-9 తో ప్రత్యర్థి సెబాస్టియన్ రివెరా ప్యూర్టో రికోను ఓడించి భారతదేశంకు రెండవ పతకాన్ని అందించాడు.
వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్‌లో దేవేంద్రకు రజతం
భారత జావెలిన్ త్రోయర్, దేవేంద్ర ఝఝరియా మొరాకోలో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్‌లో రజత పతకాన్ని సాధించాడు. పారాలింపిక్స్ యందు స్వర్ణ పతాకాన్ని సాధించిన దేవేంద్ర ఝఝరియా, తాజాగా 60.97 మీటర్ల దూరం జావెలిన్ విసిరి దేశానికి రజత పతకాన్ని అందించాడు.
జులన్ గోస్వామి రిటైర్మెంట్
ఇండియన్ లెజండరీ మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి సెప్టెంబర్ 24 న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకించారు. 2022 లో ఇంగ్లాండుతో కెరీర్ ప్రారంభించిన 39 ఏళ్ల జులన్, అదే జట్టుతో లార్డ్స్ యందు చివరి మ్యాచు ఆడి రిటైర్ అయ్యింది. కెరీరులో మోత్తం 255 మ్యాచులు ఆడిన ఆమె 2018లో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 200 వికెట్లు తీసిన ప్రపంచంలోనే మొదటి మహిళా క్రికెటర్‌గా నిలిచింది.
నేషనల్ గేమ్స్ 2022 ప్రారంభం
36వ నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా 2022 క్రీడలకు గుజరాత్ ఆతిథ్యం ఇస్తుంది.ఈ క్రీడలు సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 12 వరకు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్‌కోట్ లలో నిర్వహించనున్నారు. సుమారు 36 క్రీడా ఈవెంట్‌లతో జరిగే జాతీయ క్రీడల పోటీల్లో దేశ వ్యాప్తంగా 7 వేలకు పైగా క్రీడాకారులు పోటీ పడనున్నారు.
దులీప్ ట్రోఫీ వెస్ట్ జోన్ సొంతం
భారత దేశవాళీ దులీప్ ట్రోఫీని వెస్ట్ జోన్ సొంతం చేసుకుంది. సౌత్ జోన్‌పై తుది పోరులో 294 పరుగుల తేడాతో విజయం సాధించింది. వెస్ట్ జోన్ జట్టుకు అజంకా రహానే నాయకత్వం వహించాడు. యశస్వి జైస్వాల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకోగా, జయదేవ్ ఉనద్కత్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ దక్కించుకున్నాడు.
దులీప్ ట్రోఫీ అనేది దేశీయ ఫస్ట్-క్లాస్ క్రికెట్ టోర్నమెంట్. ఈ ట్రోఫీ మొదటి ఎడిషన్ 1961–62 మధ్య నిర్వహించారు. ఈ టోర్నీలో బీసీసీఐ ఎంపిక చేసిన జట్లు జోన్ల వారీగా పోటీ పడతాయి. ఇందులో మొత్తం 5 జోన్లు నార్త్ జోన్, ఈస్ట్ జోన్, సౌత్ జోన్, సెంట్రల్ జోన్, వెస్ట్ జోన్ పేర్లతో ఉంటాయి. ఈ టోర్నీలో వెస్ట్ జోన్ 19 టైటిల్స్ మరియు నార్త్ జోన్ 18 విజయాలతో అత్యంత విజయవంతమైన జట్లుగా ఉన్నాయి.