కరెంటు అఫైర్స్ – జూన్ 2022 | డెఫెన్స్ & సెక్యూరిటీ అఫైర్స్
Magazine 2022

కరెంటు అఫైర్స్ – జూన్ 2022 | డెఫెన్స్ & సెక్యూరిటీ అఫైర్స్

ఐఎన్ఎస్ నిషాంక్, ఐఎన్ఎస్ అక్షయ్ నౌకలకు ఘనంగా వీడ్కోలు

భారతీయ నావికాదళంలో ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్న ఐఎన్ఎస్ నిషాంక్, ఐఎన్ఎస్ అక్షయ్ నౌకలకు ఇండియన్ నేవీ ఘనంగా వీడ్కోలు పలికింది. గత 32 ఏళ్లుగా సేవలు అందించిన ఈ నౌకలకు ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో నిలిపివేయనున్నారు.

బీసీఏఎస్ డైరెక్టర్ జనరల్‌గా జుల్ఫికర్ హసన్

బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) కొత్త డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి జుల్ఫికర్ హసన్ నియమితులయ్యారు. పశ్చిమ బెంగాల్ కేడరుకు చెందిన జుల్ఫికర్ హసన్  ప్రస్తుతం ఢిల్లీలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ప్రత్యేక డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు.

'ఎక్స్ ఖాన్ క్వెస్ట్ 2022' వ్యాయామంలో పాల్గొన్న భారత సైన్యం

మంగోలియాలో 14 రోజుల నిడివితో నిర్వహిస్తున్న బహుళజాతి శాంతి పరిరక్షక వ్యాయామం “ఎక్స్ ఖాన్ క్వెస్ట్ 2022” కు భారత సైన్యం హాజరయ్యింది. ఇందులో భారతదేశంతో సహా 16 దేశాలకు చెందిన సైనిక బృందాలు పాల్గున్నాయి. భారత సైన్యానికి లడఖ్ స్కౌట్స్ నుండి ఒక బృందం ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ వ్యాయామాన్ని మంగోలియా అధ్యక్షుడు ఉఖ్‌నాగిన్ ఖురేల్‌సుఖ్  ప్రారంభించారు.

'రిమ్ ఆఫ్ పసిఫిక్'లో పాల్గొనేందుకు భారత్ సిద్ధం

యూఎస్ఏ నేతృత్వంలో జరగనున్న ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళ యుద్ధ క్రీడల సముద్ర కసరత్తు 'రిమ్ ఆఫ్ ది పసిఫిక్' (RIMPAC)లో భారత్ పాల్గొనేందుకు సిద్దమయ్యింది. త్వరలో ప్రారంభమయ్యే ఈ 28వ ఎడిషన్‌ సముద్ర కసరత్తులో 26 ఇతర దేశాలు కూడా పాల్గొనున్నాయి. ఈ సముద్ర కసరత్తులో ఇండియా మొదటిసారి 2014 లో పాల్గొంది. దీనిని 1971 నుండి ఏటా నిర్వహిస్తున్నారు.

సైన్యంలో స్వల్పకాలిక నియామకాల కోసం 'అగ్నిపథ్' స్కీమ్‌' ప్రారంభం

సాయుధ దళాలలో స్వల్పకాలిక నియామకాలు చేపట్టేందుకు భారత ప్రభుత్వం కొత్తగా 'అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్' ప్రారంభించింది. ఈ నియామక ప్రకటన ద్వారా ఇండియన్ ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ యందు నాలుగు ఏళ్ళ కాలపరిమితితో ఉద్యోగాలు కల్పించనున్నారు. నాలుగేళ్ళ తరువాత ఇందులో కేవలం 25 శాతం మంది మాత్రమే రెగ్యులర్ చేయబడతారు, మిగతా వారు తమ సేవల నుండి వాలెంటరీ రూపంలో వైదొలగవలసి ఉంటుంది. ఈ పథకం ద్వారా ఎంపికైన సైనికులను 'అగ్నివీర్'లు గా పరిగణిస్తారు.

అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ స్క్వాడ్రన్ 840 ప్రారంభం

ఇండియన్ కోస్ట్ గార్డ్‌ కొత్తగా 840 స్క్వాడ్రన్ పేరుతో అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ALH) మార్క్-III ప్రారంభించింది. ఈస్ట్రన్ కోస్ట్ గార్డ్ రీజియన్ కమాండర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఏపీ బడోలా దీనిని చెన్నైలో ప్రారంభించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించిన ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ పూర్తి స్వదేశీ సాంకేతికతో రూపొందబడింది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఆధునిక రాడార్‌లను ఉపయోగించి నిర్దిష్టమైన విజువల్ రేంజ్ గుర్తించే సామర్థ్యం కలిగిఉంది. ఇది తూర్పు ప్రాంతంలో రక్షణ దళం రూపొందించుకున్న మొదటి ఎయిర్‌క్రాఫ్టుగా నిలిచింది.

ఎన్ఐఏ చీఫ్‌గా ఐపీఎస్ అధికారి దినకర్ గుప్తా

పంజాబ్ పోలీస్ మాజీ చీఫ్ అయిన దినకర్ గుప్తా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఈ పదవిలో ఈయన 31 మార్చి 2024 వరకు కొనసాగనున్నారు.

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది భారతదేశం యొక్క ప్రాధమిక కౌంటర్ టెర్రరిస్ట్ టాస్క్ ఫోర్స్. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క వ్రాతపూర్వక ఆదేశాల ప్రకారం, రాష్ట్రాల అనుమతితో సంబంధం లేకుండా దేశమంతటా ఉగ్రవాద సంబంధిత నేరాల దర్యాప్తును డీల్ చేసే అధికారం ఈ  ఏజెన్సీకి ఉంటుంది.

ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా తపన్ కుమార్

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) నూతన డైరెక్టర్‌గా సీనియర్ ఐపిఎస్ అధికారి తపన్ కుమార్ దేకాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. 58 ఏళ్ల దేకా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రత్యేక డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అలానె జమ్మూ మరియు కాశ్మీర్‌లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలకు కూడా ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.

 

Post Comment