తెలుగులో అబ్దుల్ కలాం బయోగ్రఫీ | APJ Abdul Kalam
Biographies

తెలుగులో అబ్దుల్ కలాం బయోగ్రఫీ | APJ Abdul Kalam

అబ్దుల్ కలాం జీవిత చరిత్రను తెలుసుకోవాలంటే రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవన్ వరకు, సెయింట్ జోసెఫ్ కాలేజీ నుండి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా వరకు, పేపర్ బాయ్ నుండి భారత రత్న వరకు చాల విషయాలు స్మరించుకోవాలి. ఈ రామేశ్వరం బస్తీ కుర్రోడిని మీకు పరిచయం చేసేందుకు ఏదో తటపటాయిస్తుంది.

కలాంను మీకు ఎలా పరిచయం చేయాలి, ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా, దార్శనికత కలిగిన లీడరుగా, భారతరత్న విజేతగా లేక యువతను దిశా నిర్దేశించిన రచయితగానా...వీటన్నింటి కంటే కలాంలో నాకు ఒక గొప్ప  మానవతావాది కనిపిస్తారు. కలాం మనిషిని ఎరిగిన మనిషి. మనిషి మూలాలకు కట్టుబడిన మనిషి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధ్యక్షుడుగా ఉన్న సమయంలో కూడా, ఆయన రామేశ్వరం నాటి కలాంనే కనిపించారు. ఇంత బలమైన వ్యక్తత్వం కలాంకు ఎక్కుడ నుండి అబ్బింది. ఇది  తెలియాలంటే తమిళనాడు మీదగా, పంబన్ బ్రిడ్జి దాటి..రామేశ్వరం పాత రోజుల వరకు వెళ్ళాలి.

కలాం జీవిత విశేషాలు

ఎపిజె అబ్దుల్ కలాం బాల్యం

కలాం, 15 అక్టోబరు 1931లో తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో, ఒక తమిళ ఉమ్మడి ముస్లిం కుటుంబంలో జన్మించారు. కలాం పూర్తిపేరు అవూల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. తండ్రి జైనులబ్ధీన్ మరకాయర్ ఒక పడవ యజమాని. తల్లి ఆషియమ్మ గృహిణి. వీరి ఉమ్మడి కుటుంబంలో కలాం అందరికంటే చిన్నవాడు.

కలాం బాల్యమంతా తండ్రి జైనులబ్ధీన్, మరో ముగ్గురు స్నేహితుల నడుమ గడిచిపోయింది. కలాంకు చిన్ననాటి నుండి స్నేహితులు అంటే ప్రాణం. తన వయస్సుకు మించిన వారితో స్నేహం చేసేవాడు. అందులో షంషుద్దీన్ అనే వార్తాపత్రికల పంపిణీదారుడుతో కలాంకు మంచి స్నేహం కుదిరింది. ఈ స్నేహితుడు ద్వారా ప్రపంచంలో జరిగే వార్తంశాలు తెలుసుకునే వాడు. ఒకానొక సమయంలో ఈ స్నేహితుడు కోసం కలాం పేపర్ బాయిగా పనిచేసిన సంధర్భాలు ఉన్నాయి.

కలాంలో చిన్ననాటి నుండి ఒక జిజ్ఞాసి ఉన్నాడు. ఆ జిజ్ఞాసి తెలియని ప్రతి విషయాన్ని తెలుసుకునే విధంగా కలాంను పురిగొల్పేవాడు. అందులో దేవుడు నుండి సైన్స్ వరకు అనేక అంశాలు ఉండేవి. ప్రధానంగా తండ్రి నుండి నేర్చుకున్న మత పరమైన ఫీలోసఫీ కలాంను ఎక్కువ ఆకర్షించేది. మిగతా అంశాలు బావ జలాలుద్దీన్, మిత్రుడు షంషుద్దీన్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసేవాడు. కలాం బాల్యమంతా వీరి ముగ్గురితోనే ముడిపడి ఉంది. రామేశ్వరంలో కలాం ప్రాథమిక విద్య పూర్తిచేసాక, సెకండరీ ఎడ్యుకేషన్ కోసం రామనాథపురానికి వెళ్లాల్సి వచ్చింది.

రామేశ్వరం నుండి రామనాథపురం

స్నేహుతులను విడిసి రామనాథపురంలో అడుగుపెట్టిన కలాంకు జీవితంలో మొదటిసారి ఒంటరితనం వేధించింది. ఈ ఒంటరితనం నుండి కలాంలోని 15 ఏళ్ళ జిజ్ఞాసి మళ్ళీ మేల్కొన్నాడు . ఈ సమయంలో రామనాథపురం పాఠశాల ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమెన్'తో స్నేహం కుదిరింది. వీరిద్దరి మధ్య గురుశిష్యలకు మించిన అనుబంధం ఏర్పడింది. విశాల దృక్పథంతో ఆయన చెప్పే పాఠాలు, మాటలు కలాంను విశేషంగా ఆకర్షించాయి.

ఆయన్ని చూశాక ఒక మనిషి, ఇంకో మనిషిని ఎంతలా ప్రభావితం చేయగలరో జీవితంలో మొదటిసారి కలాం తెలుసుకున్నారు. జీవితంలో విజయం సాధించాలంటే, కోరిక, నమ్మకం, ఆశ ఉండాలనే జీవిత పాఠాలను ఆయనే దగ్గరే నేర్చుకున్నాడు. జీవితంలో ఏదైనా నెరవేరాలి అనుకునే ముందు దాని కోసం గట్టిగా ఆకాంక్షించు..అది తప్పక నెరవేరుతుందనే ఆయన ఉపదేశం కలాంపై గట్టిగా పనిచేసింది.

కలాం కన్న మొదటి కల

కలాంకు చిన్ననాటి నుండి ఆకాశపు రహస్యాల గురించి, పక్షుల ప్రయాణం గురించి అమితాశక్తి ఉండేది. సముద్ర కొంగలు, గువ్వలు ఎగరడం చూస్తూ పెరిగిన కలాంకు, వాటిలా ఆకాశంలో ఎగరాలనే కోరిక బలంగా ఉండేది. ఇయదురై సోలోమెన్ ఉపదేశాల ప్రభావముతో ఆ జ్ఞపకాలు మరోసారి కలాంను గిలిగింతలు పెట్టాయి.

దీనితో కలాం తన జీవితంలో మొదటిసారి ఒక అందమైన కల కన్నారు. ఆ కలలో తాను పైలట్ అవ్వాలనుకున్నారు. భవిష్యత్తులో కలాం పైలట్ కాకపోయినా, రామేశ్వరం నుండి విమానం ఎక్కిన మొదటి పిల్లోడు అయ్యాడు. రామనాథపురంలో చదువు పూర్తిచేసుకున్నాక ఇంటర్మీడియేట్ కోసం తిరుచినాపల్లి సెయింట్ జోసెఫ్ కాలేజీకు మకాం మార్చాడు. ఇదే కాలేజీలో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తిచేశాడు.

భౌతికశాస్తంపై ప్రేమలో పడ్డ కలాం

సెయింట్ జోసెఫ్ యందు చదువుతున్న రోజుల్లో, ఇంగ్లీష్ లెక్చరర్ టీఎన్ సెకీరాతో కలాంకు సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ సాన్నిహిత్యం కాస్త ఇంగ్లీష్ సాహిత్యంపై మక్కువ కలిగేలా చేసింది.  దీనితో కలాం ఇంగ్లీషులోని సర్వశేష్ఠ కృతులన్నీ చదవడం ప్రారంభించాడు. ఈ క్రమంలో టాల్ స్టాయ్, స్కాట్, హార్డీ వంటి రచయితల పట్ల అభిమానం పెంచుకున్నాడు.

ఆ తర్వాత రోజుల్లో తత్త్వశాస్త్ర గ్రంథాలపై కలాం మనసు పారేసుకున్నాడు. దాదాపుగా ఆ సమయంలోనే భౌతికశాస్త్రం పట్ల కలాంకు అమితమైన ఆసక్తి ఏర్పడింది. ఇదే కాలేజీ నుండి కలాం 1954 లో భౌతికశాస్త్రంలో పట్టా పొందాడు.

సెయింట్ జోసెఫ్ కాలేజీలో భౌతికశాస్త్ర పట్టా పొందాక, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసేందుకు మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరాడు. ఇక్కడ చదువుతున్న రోజుల్లోనే పైలట్ అవ్వాలనే ఆశయం నెరవేర్చుకునేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యాడు. ఖాళీ ఉన్న 8 సీట్ల కోసం జరిపిన ఆ పరీక్షలో కలాంకు 9వ ర్యాంకు వచ్చింది.

ఈ విఫల ప్రయత్నం తర్వాత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) యందు ఏరోనాటికల్ డెవెలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ శాస్త్రవేత్తగా చేరారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సర్వీస్ (DRDS) యందు ఉద్యోగిగా చేరాక భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చెయ్యటం ద్వారా కెరీర్ ప్రారంభించారు. ఇక్కడ పనిచేస్తున్న రోజుల్లోనే ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్'తో కలాంకు సాన్నిహిత్యం ఏర్పడించి. సారాభాయి ఆధ్వర్యంలో పనిచేస్తున్న INCOSPAR కమిటీలో కలాం కూడా ఉన్నారు.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో కలాం అనుభవాలు

DRDO ఉద్యోగంతో కలాం సంతృప్తి చెందలేదు. 1969 లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) లో చేరి, ఇస్రో యొక్క మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III) ప్రయోగానికి డైరెక్టరుగా చేసే అవకాశం దక్కించుకున్నారు. జూలై 1980 లో ఇదే SLV-III వాహక నౌక ద్వారా, రోహిణి ఉపగ్రహాన్ని భూమికి దగ్గరలో ఉండే కక్ష్యలో చేర్చి విజయవంతం అయ్యారు.

ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా కలాం చెబుతూ ఉంటారు. 1970, 1990 మధ్య కాలంలో, కలాం పోలార్ SLV, SLV-III ప్రాజెక్టుల అభివృద్ధిక కోసం పనిచేశారు. ఈ రెండు ప్రాజెక్టులు సక్సెస్ చేసి చూపించారు. 1970 లలో స్థానికంగా తయారైన SLV రాకెట్ ఉపయోగించి రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ద్వారా ఇస్రో చరిత్రలో అతి అరుదైన మైలురాయిని నమోదు చేసి భారతదేశ మిస్సైల్ మ్యానుగా కీర్తించబడ్డారు.

ఇస్రోలో సాధించిన విజయాల తర్వాత, 1992 - 1999 మధ్య ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహాదారుగా పనిచేసే అవకాశం కలాంకు దక్కింది. ఈ కాలంలోనే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ముఖ్యకార్యదర్శిగా కూడా వ్యవహరించారు. ఈ సమయంలో జరిపిన పోఖ్రాన్ అణు పరీక్షలలో కలాం కీలక రాజకీయ, సాంకేతిక పాత్ర వహించారు.

కలాం కృషి ఫలితంగానే 1998లో పోఖ్రాన్-II అణుపరీక్షలు విజయవంతం అయ్యాయి. ఈ అణు పరీక్షలు భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చింది. మన భారతీయాల వలన ఏమీ సాధ్యంకాదు అనేవారికి..కలాం చెప్పే ఒక మాట.. "మనం పేదవాళ్లం కాదు, మన ఆలోచనలే పేదగాఉంటాయి.” మనం కూడా పెద్దగా ఆలోచిస్తే ఏదైనా సాధించవచ్చు’’ .

భారత 11వ రాష్ట్రపతిగా కలాం ప్రమాణస్వీకారం

కలాంకు  మొదటి నుండి రాజకీయాలపై లేదు. కలాంను రాజకీయాల్లోకి రప్పించేందుకు వాజ్‌పేయి గారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆయన ఆహ్వానించిన ప్రతిసారి కలాం సున్నితంగా తిరస్కరించేసే వారు. వాజ్‌పేయి రెండవ సారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంధర్భంలో, ఏకంగా క్యాబినేట్ మినిస్టర్ పదవి ఆఫర్ చేశారు. కాని కలాం ఆసక్తి చూపలేదు.

2002 ప్రధానిమంత్రి కార్యాలయం నుండి కలాంకు పిలుపు వచ్చింది. ఈ సారి ఏకంగా కలాంను రాష్ట్రపతి కావాలని వాజ్‌పేయి ఆకాంక్షించరు. ఈసారి కలాంకు తిరస్కరించే అవకాసం లభించలేదు. దీనితో 2002 అధ్యక్ష ఎన్నికలలో, బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డిఏ ప్రభుత్వం ద్వారా కలాం రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడ్డారు. కలాం బరిలో ఉండటంతో కాంగ్రెస్ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వామపక్షాలు లక్ష్మి సహగల్'ను మరో అభ్యర్థిగా నిలబెట్టినా ..కలాం 922,884 ఓట్లతో చారిత్రాత్మక విజయం సాధించి, కెఆర్ నారాయణన్ తరువాత భారత 11 వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసారు.

వాజ్‌పేయి గారు కలాంను ఏ ఉద్యేశంతో రాష్ట్రపతిగా అవకాశం కల్పించినా..కలాం రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించడం దేశం గర్వించదగ్గ కొన్ని గొప్ప సంఘటనలలో ఒకటిగా చెప్పొచ్చు. అధ్యక్షుడైన తరువాత కూడా, కలాం సాధారణ పౌరుడుగానే రాష్ట్రపతి భవన్ యందు జీవించారు. కామన్‌ సివిల్‌ కోడ్‌కు రాష్ట్రపతిగా కలాం మద్దతు ప్రకటించి ప్రత్యేకత సాటుకున్నారు.

సామాన్య పౌరులకు రాష్ట్రపతి గేట్లు తెరిచి పీపుల్ ప్రెసిడెంటుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన అధ్యక్ష పదవిలో ఉన్న ఐదేళ్లు రాష్ట్రపతి భవన్ పిల్లలు, పెద్దలతో చిన్నపాటి జాతరను తలపించేది. రాష్ట్రపతిగా కలాం చూపిన హుందాతనం ప్రతీ భారతీయుడు మనషులో చెరగని ముద్ర వేచింది. కలాంకు రెండవ సారి భారత అధ్యక్షులుగా ఉండే అవకాశం దక్కినా, తనకు ఎంతో ఇష్టమైన టీచింగ్ వృత్తి కోసం ఆ అవకాశాన్ని వదులుకున్నారు .

అసాధారణమైన జీవనశైలి కలాం సొంతం

కలాం తుది శ్వాస వరకు అతి సాధారణమైన జీవితాన్ని గడిపారు. ఆయన ఏరోజు హోదాను ప్రదర్శించలేదు. రామేశ్వరంలో తండ్రి దగ్గర నేర్చుకున్న విలువలకు జీవితాంతం కట్టుబడి ఉన్నారు. బతికున్నంత కాలం ప్రకృతి కోసం, సైన్స్ కోసం, దేశం కోసమే ఆలోచించారు. ఒక్క మాటలో చెప్పాలంటే విజ్ఞానం, నిరాడంబరత, నిజాయితీల కలబోతే శ్రీ అబ్దుల్ కలాం. ఆయన భారత రక్షణ, క్షిపణి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎంతగా కృషి చేశారో, దేశ యువతలో ఆత్మవిశ్వసం నింపేందుకు అంతే మనసు పెట్టారు.

గాంధీజీ జీవితానికి, కలాం జీవితానికి దగ్గర సారూప్యత ఉంది. వీరిద్దరూ విభిన్న రంగాలకు చెందిన వారైనా జీవనశైలిలో మెజారిటీ అంశాలు ఒకే విధంగా ఉంటాయి. ఒకొనొక సమయంలో వ్యక్తత్వం నిర్మించుకునేందుకు గాంధీజీ గారు ఎంత కఠినమైన నియమాలను నిర్దేశించుకున్నారో..వాటిని కలాం చిన్ననాటి నుండే అలవర్చుకున్నారు. ఇద్దరూ గొప్ప శాంతి కాముకులు, మానవతా వాదులు, అవినీతి వ్యతిరేకులు, మత సామరస్యం కోసం పాటుపడ్డారు. ఇద్దరూ భగవద్గీతతో సహా ఇతర మత గ్రంథలు కూడా చదివేవారు. రాజకీయాలకు దూరంగా ఉన్నారు. దేశం కోసం నిస్వార్ధంగా కృషి చేశారు.

అందుకే కలాంను ఒక శాస్త్రవేత్తగా, ఒక రాష్ట్రపతిగా కంటే ఒక గొప్ప మానవతా వాదిగా చెప్పొచ్చు. వివాహం చేసుకుంటే జీవితాంతం వారి బాగుకోసం, వారికి ఆస్తులు కూడబెట్టేందుకే సమయం వెచ్చించాల్సి వస్తుందని, జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోయారు. మాంసాహారం తింటే జీవ సమతుల్యం దారి తప్పడంతో పాటుగా మనిషి సహజ ఆలోచన పరిధి మందగిస్తుందని, శాకాహారనికి కట్టుబడ్డారు. జీవితంలో ఏ రోజూ మద్యపానం జోలికి పోలేదు. కచ్చితమైన వ్యక్తిగత క్రమశిక్షణకు మానవ రూపం ఏమైనా ఉండి ఉంటే ..అది ఖచ్చితంగా కలాం అయ్యి ఉంటారు.

కలాంకు వ్యక్తిగత ఆస్తులపైనా ఏనాడూ మమకారం కలగలేదు. మీరు కలాంను ముందు నుండి గమనించి ఉంటె ఒకే రకమైన చొక్కాతో, ఒకే రకమైన హెయిర్ స్టైలతో కనిపిస్తారు. రాష్ట్రపతిగా ఎన్నికయ్యాక, కలాంకు ఎంతో బలవంతంగా సూట్ ధరించాల్సి వచ్చింది. అది నచ్చని కలాం, ఈ తాబేలులాంటి సూటులో తనను చూసుకోవడం ఇబ్బందిగా ఉందని తనపై తాను జోకులు వేచుకునే వారు.

కలాం రాష్ట్రపతి భవన్ యందు ఉన్నన్ని రోజులు ఒక్క రూపాయీ కూడా వృథా చేయలేదు. తన వ్యక్తిగత అభిరుచులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం ఖర్చుచేసే ప్రతీ రూపాయని కలాం వ్యక్తిగత ఖాతా నుండి చెల్లించేవారు. అదే సంధర్భంలో సహాయం ఆశించి వచ్చిన ప్రతీ వారిని లేదనకుండా సాగనంపే వారు.

కలాంకు ముగ్గురమ్మలు అంటే ఇష్టం

కలాంకు కళాకారులు అంటే మహా ఇష్టం. అలానే మానవతా వాదులు అంటే ప్రత్యేక అభిమానం ఉండేది. అలా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని, మదర్ థెరిస్సా గారిని కలాం ప్రత్యేకంగా ఆరాధించే వారు. అమ్మలకు సంబంధించి అవకాశం వచ్చిన ప్రతీ సందర్భంలోను, నాకు ముగ్గురు అమ్మలు అంటూ సంబర పడేవారు. వారందరిని తాను కలవగలిగానని చెప్పేవారు.

ఆ ముగ్గురు అమ్మలలో ఒకరు కలాం సొంత అమ్మ కాగా, మరొకరు భారత సంగీత సరస్వతి ఎంఎస్ సుబ్బలక్ష్మి, మరొకరు ప్రపంచానికి అమ్మ అయినా మదర్ థెరిస్సా' అని చెప్పేవారు. 1950లో తిరుచ్చిలో చదువుకునే రోజుల్లో 'ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు' పాటను పదేపదే వింటూ పరవశించే వారు.. అప్పటి నుంచి ఎంఎస్ సుబ్బలక్ష్మి సంగీతానికి అభిమాని అయ్యారు. అలానే దేశం కాని దేశంలో పుట్టి, భారత దేశానికి నలభైఏళ్ల పాటు అమూల్య సేవల్ని అందించిన మదర్ థెరిస్సా గారు అన్నా కలాంకు ఎనలేని గౌరవం.

కలాం ఒక గొప్ప రచయిత

కలాం సెయింట్ జోసెఫ్ యందు చదువుకునే రోజుల్లో విపరీతంగా పుస్తకాలు చదివేవారు. ఈ క్రమంలోనే కలాంలోని రచయిత మేలుకున్నాడు. తరుసుగా కవితలు, పాటలు రాసేవారు. ఒకొనొక సంధర్భంలో రచనపై విపరీతమైన ప్రేమ పెంచుకున్నారు. రచన ద్వారా దేశాన్ని, సామాన్య ప్రజల జీవితాలను ముఖ్యంగా యువత, విద్యార్థుల ఆలోచన పరిధిని మార్చాలన్న బలమైన ఆకాంక్ష కలాంలో కనిపించేది. వివిధ అంశాలపై కలాంకు ఉన్న లోతైన అవగాహన, విషయ నైపుణ్యత ఆయన్ని సీరియస్ రచయితగా మార్చాయి.

1998 లో భారతదేశం యొక్క భవిష్యత్తు మరియు దేశ ఆర్థిక అభివృద్ధికి సంబంధించి "ఇండియా 2020: ఎ విజన్ ఫర్ ది న్యూ మిలీనియం" పేరుతో మొదటి పుస్తకం రచించారు. 2020 నాటికి భారతదేశం ప్రపంచంలోని నాలుగు అగ్ర ఆర్థిక శక్తులలో ఎలా ఎదగగలదో ఈ పుస్తకం ద్వారా తెలిపారు. ఈ క్రమంలో సొంతగా మరియు ఇతర సహా రచయితలతో కలిసి దాదాపు 25 గొప్పగొప్ప పుస్తకాలూ మనకు అందించారు. రాష్ట్రపతిగా ఉన్న ఐదేళ్లలో దాదాపు ఐదు పుస్తకాలు రచించారు. ప్రధానంగా యువతను ఉద్దేశించి రాసిన Ignited Minds, Turning Points, Thoughts for Change, You are Unique వంటి పుస్తకాలు ఎందరో యువతని విజయం వైపు నడిపించాయి.

కలాం పుట్టినరోజున ప్రపంచ విద్యార్థి దినోత్సవం

కలాంకు టీచింగ్ అంటే ఎనలేని ఇష్టం. విద్యార్థులతో గడపటం అంతకంటే ఎక్కువ ఇష్టం. రాష్ట్రపతిగా ఉన్న రోజుల్లో కూడా ఎన్నో యూనివర్సిటీలకు, స్కూళ్లకు పోయి విద్యార్థులతో సమయం వెచ్చించే వారు. భవిష్యత్తులో ఏం కావాలని అనుకుంటున్నారో, ఇప్పటి నుండే కలలు కనండి అంటూ ఉత్సాహపరిచే వారు.

చివరికి ఆయన చివరి క్షేణాలలో కూడా, షిల్లాంగ్‌ ఏఐఎంలో విద్యార్థులతో సంభాషిస్తూ తుదిశ్వాస విడిచారు. విద్యార్థులపై కలాంకు ఉన్న ఇష్టానికి గాను, ఉపాధ్యాయ వృత్తిపై కలాంకు ఉన్న అంకితభావంకు గాను 2010 లో కలాం జన్మదినమైన అక్టోబర్ 15 తేదీను, ప్రపంచ విద్యార్థి దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. కలాంకు దక్కిన అతి గొప్ప గౌరవాలలో ఇది ఒకటిగా చెప్పొచ్చు.

కలాం 2020 విజన్

రాష్ట్రపతిగా ఉన్న రోజుల్లో కలాం దేశ సుస్థిరాభివృద్ధి & పర్యావరణ పరిరక్షణ కోసం ఆలోచించేవారు. భారత అధ్యక్ష పదివిని విడిశాక కూడా అనేక యూనివర్సిటీలలో వీటికి సంబంధించి ప్రసంగించారు. ఆధునిక భారత్‌ను నిర్మించేందుకు యువత నడుంబిగించాలని కోరేవారు. భారత సమాజంపై ప్రభావం చూపిస్తున్న ఆర్థిక, సామాజిక సవాళ్లను పరిష్కరించే దిశగా చొరవతీసుకోవాలని సూచించేవారు.

భవిష్యత్ భారతమైన విద్యార్థులు, యువతలో స్ఫూర్తి రగిలిస్తూ.. జాతి నిర్మాణంలో వారు భాగస్వామ్యం అయ్యేలా ప్రోత్సహించేవారు. గ్రామాలు, చిన్న పట్టణాల్లో ఉపాధి, ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వాలు మరింత కృషి చేయాలని గుర్తుచేసేవారు. ఆర్థిక, సామాజిక సవాళ్ల పరిష్కారానికి యువత వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని ఆకాంక్షించేవారు.

మానవుని మనుగడకు, దేశ సుస్థిరాభివృద్ధికి పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను తెలియపరిచేవారు. 2020 నాటికి భారత్ ఏ స్థానంలో ఉండాలో 20 ఏళ్ళ ముందుగా ప్రణాళిక చేసారు. దురదృష్టం కొలది 2020 నాటికి ఆయన మనల్ని విడిచి వెళ్లినా..ఆయన కన్న కలల వైపు భారత్ అడుగులు వేస్తుందనేది మాత్రం అక్షర సత్యం.

కలాం అందుకున్న అవార్డులు

కలాంకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన "భారతరత్న" తో పాటుగా పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను భారత ప్రభుత్వం అందించింది. వీటితో పాటుగా ఇందిరాగాంధీ అవార్డు ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్, వీర్ సావర్కర్ అవార్డు, శాస్త్రా రామానుజన్ ప్రైజ్, వాన్ బ్రాన్ అవార్డు వంటి ఇతర అవార్డులు కూడా వరించాయి.

కలాం దాదాపు 50 కి పైగా జాతీయ, అంతర్జాతీయ యూనివర్శిటీల నుండి గౌరవ డాక్టరేట్లు అందరుకున్నారు. కలాం తన జీవితంలో ఏమైనా ఆస్తులు సంపాదించి ఉంటె ..అవి కేవలం ఇవి మాత్రమే.

చివరి మాట

రామేశ్వరం బస్తీ కుర్రోడుగా, ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా ..ఆయన పోషించిన ప్రతి పాత్ర భారతీయుడికీ స్ఫూర్తిదాయకం. కలాం చూపిన హుందాతనం, నిరాడంబరత, నిజాయితీ, క్రమశిక్షణ ఈనాటి యువతకు మార్గనిర్దేశకం.

భారత ప్రజల అత్యంత ప్రియమైన రాష్ట్రపతిగా మన్ననలు అందుకున్న ఏపీజే అబ్దుల్ కలాం, అర్దాంతంగా మనల్ని విడిచి వెళ్ళిపోయినా, ఆయన వదిలిన విజ్ఞానం, నడవడిక, ఆయన చేతలు, మాటలు ఎప్పటికీ భారతీయలను స్ఫూర్తిని ఇస్తూనే ఉంటాయి.

కలాం ఒక కర్మ యోగి, ఒక విజేత, అంతకు మించి ఆయన మన భరతమాత ముద్దుబిడ్డ. చివరిగా కలాం చెప్పిన ఒక గొప్ప మాటతో ముగిద్దాం.  "జీవితం, నీకు విజయాలను అందించదు, అవకాశాలను మాత్రమే ఇస్తుంది. ఆ అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి నీ చేతుల్లో ఉంటుంది".

కలాం చెప్పిన కొన్ని మంచి మాటలు

"Don’t take rest after your first victory because if you fail in second, more lips are waiting to say that your first victory was just luck."
“Unless India stands up to the world, no one will respect us. In this world, fear has no place. Only strength respects strength.”
“No matter what is the environment around you, it is always possible to maintain brand of integrity.”
“The best brains of the nations may be found on the last benches of the classrooms.”
“I'm not a handsome guy, but I can give my hand to someone who needs help. Beauty is in the heart, not in the face.”
"Failure will never overtake me if my determination to succeed is strong enough."
"Creativity is seeing the same thing but thinking differently."
"To succeed in your mission, you must have single-minded devotion to your goal."
“All Birds find shelter during rain. But Eagle avoids rain by flying above clouds.”
“If you fail, never give up because F.A.I.L. means “First Attempt In Learning”. End is not the end, if fact E.N.D. means “Effort Never Dies.” If you get No as an answer, remember N.O. means “Next Opportunity”, So let’s be positive.”
"Dream, dream, dream. Dreams transform into thoughts and thoughts result in action."
"All of us do not have equal talent. But , all of us have an equal opportunity to develop our talents."

Post Comment