21 మార్చి 2024 కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుగులో పొందండి. వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాం.
సీబీఎస్ఈ కొత్త చీఫ్‌గా సీనియర్ బ్యూరోక్రాట్ రాహుల్ సింగ్ నియామకం
సీనియర్ బ్యూరోక్రాట్ రాహుల్ సింగ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) యొక్క చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఇటీవలే నీతి ఆయోగ్‌లో సలహాదారుగా నియమితులైన నిధి ఛిబ్బర్ స్థానంలో ఆయన నియమితులవుతారు.
బీహార్ కేడర్‌కు చెందిన ఈయన, 1996-బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారి. రాహుల్ సింగ్ ఇదివరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ యందు అదనపు కార్యదర్శిగా సేవలు అందించారు.
- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) అనేది దేశంలో జాతీయ స్థాయి విద్యా విధానాన్ని అమలు చేసే విద్యా మండలి.
- సీబీఎస్ఈ బోర్డును మాధ్యమిక విద్యా రంగంలో అంతర్-రాష్ట్ర ఏకీకరణ కోసం 1929లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
- భారతదేశంలో 27,000 కంటే ఎక్కువ పాఠశాలలు మరియు 28 విదేశీ దేశాలలో 240 పాఠశాలలు ఈ బోర్డుకి అనుబంధంగా ఉన్నాయి.
- కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాలు ఇతర ప్రైవేట్ పాఠశాలలు సీబీఎస్ఈ బోర్డు పరిధిలోనే ఉన్నాయి.
- ఈ పాఠశాలలు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) యొక్క సిలబస్ బోధిస్తాయి.
- సీబీఎస్ఈ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
అరుణాచల్ ప్రదేశ్‌లో దేశంలో మొదటి ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ యూనిట్ ప్రారంభం
అరుణాచల్ ప్రదేశ్‌లో భారతదేశపు మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించబడింది. భారతదేశంలోని అతిపెద్ద ఆయిల్ పామ్ డెవలప్‌మెంట్ కంపెనీలలో ఒకటైన 3ఎఫ్ ఆయిల్ పామ్ ద్వారా ఇది నిర్మించబడింది. ఈ ప్రాజెక్టు 55 వేల కోట్ల విలువతో అరుణాచల్ ప్రదేశ్‌లోని దిగువ దిబాంగ్ వ్యాలీలోని రోయింగ్‌లో నిర్మించారు.
అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభోత్సవం వర్చువల్‌గా మార్చి 9, 2024న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేత నిర్వహించబడింది. ఈశాన్య రాష్ట్రాలు పామాయిల్ ఉత్పత్తికి ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో ఆయిల్ పామ్ సాగుకు అనువైన 1,30,000 హెక్టార్ల భూమిని ఇటీవలే గుర్తించారు.
.రు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ మరియు త్రిపురలలో పామాయిల్ ఉత్పత్తి పరిధి 8.4 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది , తినదగిన నూనె ఉత్పత్తిలో ఆత్మనిర్భర్తను సాధించడంలో ఈశాన్యం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రాంతం జాతీయ నూనె ఉత్పత్తి సామర్థ్యంలో 38 శాతం వాటా కలిగిఉంది.
ప్రస్తుతం ఈ ప్రాంతంలో 30 లక్షల మొక్కలు నాటే సామర్థ్యంతో 30కి పైగా నర్సరీలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం 2025-26 నాటికి ఈ ప్రాంతంలో పామాయిల్ ఉత్పత్తిని 11.20 లక్షల టన్నులకు పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సాగు చేసే రైతులకు హెక్టారుకు రూ. 1,00,000 ప్రత్యేక సహాయం అందించబడుతుంది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచింది. మార్చి 17న న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 ఫైనల్ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆర్సిబి జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి కప్ సొంతం చేసుకుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన ఎల్లీస్ పెర్రీ ఆరెంజ్ క్యాప్ గ్రహీతగా నిలిచింది. ఆర్సిబి జట్టుకు చెందిన శ్రేయాంక పాటిల్ పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకుంది. స్మృతి మంధాన నేతృత్వంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇది మొదటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్. ముంబై ఇండియన్ మొదటి సీజన్ విజేతగా నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుసగా రెండవ ఏడాది కూడా రన్నరప్'గా నిలిచింది.
డబ్ల్యుపీఎల్ 2024 అవార్డులు | అవార్డు విజేత | ప్రైజ్ మనీ | |
---|---|---|---|
1 | విజేత | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | రూ.6 కోట్లు |
2 | రన్నరప్ | ఢిల్లీ క్యాపిటల్స్ | రూ.3 కోట్లు |
3 | ఆరెంజ్ క్యాప్ | ఎల్లీస్ పెర్రీ | రూ. 5 లక్షలు |
4 | పర్పుల్ క్యాప్ | శ్రేయాంక పాటిల్ | రూ. 5 లక్షలు |
5 | ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ | శ్రేయాంక పాటిల్ | రూ. 5 లక్షలు |
6 | అత్యంత విలువైన క్రీడాకారిణి | దీప్తి శర్మ | రూ. 5 లక్షలు |
7 | సీజన్‌లో శక్తివంతమైన స్ట్రైకర్ | జార్జియా వేర్‌హామ్ | రూ. 5 లక్షలు |
8 | సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు | షఫాలీ వర్మ | రూ. 5 లక్షలు |
9 | ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ | సోఫీ మోలినక్స్ | రూ. 2.5 లక్షలు |
10 | ఫైనల్ యొక్క శక్తివంతమైన స్ట్రైకర్ | షఫాలీ వర్మ | రూ. 1 లక్ష |
పీడబ్ల్యూడీ కేటగిరీలో ఈసిఐ నేషనల్ ఐకాన్‌గా శీతల్ దేవి
భారత ఎన్నికల సంఘం పారా-ఆర్చర్ మరియు అర్జున అవార్డు గ్రహీత శీతల్ దేవిని పీడబ్ల్యూడీ కేటగిరీలో నేషనల్ ఐకాన్‌గా ప్రకటించారు. మార్చి 16న ఢిల్లీలో జరిగిన ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ టీమ్ మరియు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ టీమ్ మధ్య జరిగిన ఎగ్జిబిషన్ క్రికెట్ మ్యాచ్‌లో ఆమె పేరును ప్రకటించారు.
దివ్యాంగులు మరియు సీనియర్ సిటిజన్ ఓటర్లను ప్రోత్సహించేందుకు ఈ చొరవ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్‌తో కలిసి ఎన్నికల సంఘం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వికలాంగులు, సీనియర్ సిటిజన్ ఓటర్ల కోసం ప్రత్యేక ఓటర్ గైడ్‌ను ఎలక్షన్ కమిషన్ ఆవిష్కరించింది. ఈ సమగ్ర బుక్‌లెట్ పోలింగ్ స్టేషన్‌లలో వారికీ సంబందించిన మౌలిక సదుపాయాలు, సమాచార మరియు విధానపరమైన వివరాలతో సహా దివ్యాంగులు మరియు సీనియర్ సిటిజన్‌లకు అందుబాటులో ఉండే అవసరమైన నిబంధనలను వివరిస్తుంది.
- శీతల్ దేవి జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లా లోయిదర్ గ్రామంకు చెందిన భారతీయ పారా-ఆర్చర్.
- శీతల్ దేవి ఫోకోమెలియా అని పిలువబడే అరుదైన వైకల్యంతో జన్మించారు.
- ఈమె చేతులు లేని మొదటి మరియు ఏకైక అంతర్జాతీయ పారా-ఆర్చరీ ఛాంపియన్‌గా గుర్తింపు పొందారు.
- శీతల్ దేవి 2022 ఆసియా పారా గేమ్స్‌లో మహిళల డబుల్ కాంపౌండ్ ఈవెంట్ యందు రజత పతకాన్ని గెలుచుకున్నారు.
- మిక్స్‌డ్ డబుల్స్ మరియు మహిళల వ్యక్తిగత విభాగంలో ఈమె రెండు బంగారు పతకాలను కూడా అందుకుంది.
- శీతల్ దేవి 2024లో భారత ప్రభుత్వం నుండి అర్జున అవార్డును అందుకున్నారు.
పహారీలకు 10% రిజర్వేషన్ ఆమోదించిన జమ్మూ & కాశ్మీర్
జమ్మూ మరియు కాశ్మీర్ ప్రభుత్వం పహారీలు మరియు ఇతర మూడు తెగలకు 10 % రిజర్వేషన్లను ఆమోదించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన బడ్జెట్ సెషన్‌లో కేంద్ర ప్రభుత్వం పహారీ జాతి తెగ, పెద్దారి తెగ, కోలిస్ మరియు గడ్డ బ్రాహ్మణుల రిజర్వేషన్లను (జమ్మూ & కాశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) చట్టం, 2023) పార్లమెంట్ యందు ఆమోదించింది. దీనితో జమ్మూ మరియు కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ రిజర్వేషన్లను ఆమోదిస్తూ అధికారిక ప్రకటన చేశారు.
- ఈ నిర్ణయంతో ఈ ప్రాంతంలో షెడ్యూల్డ్ తెగల (ఎస్టీలు) మొత్తం రిజర్వేషన్లు 20 శాతంకు పెరిగాయి.
- ఎస్టీ జాబితా కింద గుజ్జర్లు, బకర్వాల్‌లు 10 % రిజర్వేషన్లను అనుభవిస్తున్నారు.
- జమ్మూ కాశ్మీర్‌లోని పర్వత ప్రాంతాలలో నివసించే పహారీ తెగకు మొదటిసారిగా గిరిజన హోదా లభించింది.
- ఈ హోదా వారికి ఎస్టీ కమ్యూనిటీల కోసం రిజర్వు చేయబడిన విద్యా మరియు ఉపాధి అవకాశాలను అందిస్తుంది.
ఈ చర్య సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల కమిషన్ సిఫార్సులను అనుసరిస్తుంది. జమ్మూ మరియు కాశ్మీర్ ప్రభుత్వం ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీలు) రిజర్వేషన్లను 8%కి విస్తరించింది, అలానే ఓబీసీ జాబితాలో మరో 15 కొత్త కులాలను చేర్చింది.
టిఎం కృష్ణకు సంగీత కళానిధి అవార్డు ప్రధానం
ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు తొడూరు మడబుసి కృష్ణకు 2024 సంవత్సరానికి గాను సంగీత కళానిధి అవార్డు అందించబడింది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, మార్చి 17, 2024న జరిగిన సమావేశంలో ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేసింది.
మద్రాసులో జన్మించిన టిఎం కృష్ణ, భారతీయ కర్నాటక గాయకుడుగా, రచయితగా, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందారు. 12 ఏళ్ళ వయస్సులో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ నుండి స్పిరిట్ ఆఫ్ యూత్ సిరీస్‌లో అతని తొలి కచేరీ నుండి కెరీర్ ప్రారంభించిన ఆయన0, అప్పటి నుండి మద్రాస్ మ్యూజిక్ అకాడమీ, నేషనల్ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఇండియా), జాన్ ఎఫ్ కెన్నెడీ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, లింకన్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ ఉత్సవాలు మరియు వేదికలలో విస్తృతంగా ప్రదర్శనలు ఇచ్చారు.
టిఎం కృష్ణ 2016 సంవత్సరంలో రామన్ మెగసెసే అవార్డు అందుకున్నారు. కళాకారుడిగా, భారతదేశంలోని లోతైన సామాజిక విభజనలను నయం చేయడానికి, కులం మరియు తరగతి యొక్క అడ్డంకులను బద్దలు కొట్టడానికి, సంగీతాన్ని కొందరికి మాత్రమే కాకుండా సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ఆయన చేసిన కృషికి గాను ఈ అవార్డు అందించబడింది.
- దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటి సంగీత అకాడమీలలో మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ ఒకటి.
- మద్రాస్ మ్యూజిక్ అకాడెమీని 1928లో స్థాపించారు.
- 1930లలో భారతీయ శాస్త్రీయ నృత్య రూపమైన భరతనాట్యంను పునరుజ్జీవనంలో చేయడంలో ఇది కీలక పాత్ర పోషించింది.
- 1929 నుండి కర్ణాటక సంగీత రంగానికి కృషి చేసిన వ్యక్తులను గుర్తించి, వారికి సంగీత కళానిధి బిరుదుతో సత్కరిస్తోంది.
- మొదటి సంగీత కళానిధి బిరుదును టీవి సుబ్బారావు మరియు ఎంఎస్ రామస్వామి అయ్యర్ దక్కించుకున్నారు.
- మాద్రాసు మ్యూజిక్ అకాడమీ నుండి సంగీత కళానిధి అవార్డు అందుకున్న మొదటి మహిళ ఎంఎస్ సుబ్బులక్ష్మి.
పోఖారా సిటీని తన పర్యాటక రాజధానిగా ప్రకటించిన నేపాల్
నేపాల్ ప్రభుత్వం గండకి ప్రావిన్స్‌లోని ఒక సుందరమైన నగరం పోఖారాను ఈ హిమాలయ దేశం యొక్క పర్యాటక రాజధానిగా ప్రకటించింది. ప్రకృతి సౌందర్యం మరియు అడ్వెంచర్ టూరిజంకు ప్రసిద్ధి చెందిన ఈ నగరం, ఇప్పటికే నేపాల్ పర్యాటక కేంద్రంగా గుర్తింపు కలిగిఉంది, అయితే తాజా చొరవ అంతర్జాతీయ వేదికపై ఈ నగరానికి పర్యాటక బ్రాండింగ్ కల్పించే చర్యలో భాగంగా ఉంది.
మార్చి 18న ఫేవా సరస్సు ఒడ్డున ఉన్న బరాహి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేడుకలో నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ఈ అధికారిక ప్రకటన చేశారు. ఇక మీదట పోఖారాలోని డిస్కోలు, నైట్‌క్లబ్‌లు మరియు ప్రత్యక్ష సంగీత వేదికలతో సహా వ్యాపార కార్యకలాపాలు రాత్రంతా తెరిచి ఉంటాయని కూడా ప్రకటించబడింది.
- పోఖారా నగరం నేపాల్‌లోని అత్యంత అందమైన పర్యాటక నగరాలలో ఒకటి.
- పోఖారా ఖాట్మండు నుండి 200 కి.మీ దూరంలో, సముద్ర మట్టానికి 827 మీ. ఎత్తులో ఉంది.
- పోఖరా లోయ అన్నపూర్ణ శ్రేణి ఒడిలో ఉంది.
- ప్రపంచంలోని పది ఎత్తైన పర్వతాలలో మూడు (ధౌలగిరి, అన్నపూర్ణ-I మరియు మనస్లు) ఈ లోయ నుండి 15 కి.మీ సరళ దూరంలో ఉన్నాయి.
- పోఖారా ప్రసిద్ధి చెందిన ఫేవా, బెగ్నాస్, రూపా, ఖస్తే, దీపాంగ్, మైదీ, గుండే, న్యూరానీ, కమల్‌పోఖారి మరియు పోఖారా సేటి క్యాచ్‌మెంట్ వంటి తొమ్మిది సరస్సులను కలిగిఉంది.
- పోఖారా వ్యాలీ లేక్ క్లస్టర్ రామ్‌సర్ సైట్‌గా జాబితా చేయబడింది.
- నేపాల్‌లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో పోఖారా ఒకటి.
లడఖ్ రాష్ట్ర హోదా కోసం సోనమ్ వాంగ్‌చుక్ 21 రోజుల నిరాహార దీక్ష
ప్రముఖ వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, లడఖ్ రాష్ట్ర హోదా కోసం మార్చి 6 నుండి 26 మర్చి 2024 వరకు 21 రోజుల పాటు నిరాహార దీక్ష నిర్వహించారు. మార్చి 26న నిరాహార దీక్షను ముగించిన అతడు, ఇది మొదటి దశ ముగింపు మాత్రమే అని నొక్కి చెప్పారు. లడఖ్ రాష్ట్ర హోదా కోసం, హిమాలయ పర్యావరణ పరిరక్షణ కోసం తన పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు.
వాంగ్‌చుక్ నిరాహారదీక్షకు లడఖ్‌లో గణనీయమైన మద్దతు లభించింది. గడిసిన మూడు వారాలలో 60,000 నుండి 70,000 మంది ప్రజలు ఇక్కడకు వచ్చి తనకు సంగీభావం ప్రకటించినట్లు వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు -10 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయినప్పటికీ 350 మంది తనతో కలిసి ఉపవాస దీక్షలో పాల్గొన్నారని చెప్పారు.
లడఖ్‌లోని హిమాలయ పర్వతాల దుర్బలమైన పర్యావరణ వ్యవస్థను మరియు ఇక్కడ అభివృద్ధి చెందుతున్న ప్రత్యేకమైన దేశీయ గిరిజన సంస్కృతులను రక్షించడానికి మా ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోం మంత్రి అమిత్ షాల స్పృహను గుర్తు చేయడానికి మరియు మేల్కొల్పడానికి తాము ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
- 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ నుండి విడిగా లడఖ్‌కు కేంద్రపాలిత ప్రాంతం హోదా లభించింది.
- అయితే, లడఖ్ నివాసితులు తమ సాంస్కృతిక గుర్తింపు మరియు రాజకీయ ప్రాతినిధ్యాన్ని పలుచన చేస్తారనే భయంతో ఈ హోదాపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
- ఈ ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పిస్తూ, భారత రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చలని డిమాండ్ చేస్తున్నారు.
- ఆరవ షెడ్యూల్ భారతదేశంలోని గిరిజన సంఘాలకు ప్రత్యేక హక్కులు మరియు స్వయంప్రతిపత్తిని అందిస్తుంది.
- ఈ షెడ్యూల్‌లో చేర్చడం వల్ల లడఖీలు వారి భూమి, వనరులు మరియు సాంస్కృతిక గుర్తింపుపై అధిక నియంత్రణను పొందుతారు.
లడఖ్ ప్రాంతానికి చెందిన సోనమ్ వాంగ్‌చుక్ ప్రముఖ విద్యా సంస్కరణవాదిగా, వాతావరణ కార్యకర్తగా గుర్తింపు పొందారు. హై-ఎలిటిట్యూడ్ హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ స్కూల్స్‌లో తన వినూత్న విద్యా పద్ధతులకు ఆయన ప్రసిద్ధి చెందారు. బాలీవుడ్ చిత్రం 3 ఇడియట్స్ ఈయన జీవితం ఆధారంగానే చిత్రించబడింది.
సీషెల్స్‌లో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ లామిటియే 2024
ఇండియన్ ఆర్మీ మరియు సీషెల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ లామిటియే (LAMITIYE) పదవ ఎడిషన్, సీషెల్స్ డిఫెన్స్‌లో మార్చి 18 నుండి 27 మధ్య నిర్వహించబడింది. పది రోజుల పాటు సాగిన ఈ విన్యాసాల్లో భారత సైన్యానికి చెందిన గూర్ఖా రైఫిల్స్ మరియు సీషెల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఎస్‌డిఎఫ్) చెందిన దళాలు పాల్గొన్నాయి.
2001 నుండి నిర్వహిస్తున్న ఈ ద్వైవార్షిక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్, భారతదేశం మరియు సీషెల్స్ మధ్య బలమైన రక్షణ సహకారాన్ని నొక్కి చెబుతుంది. తాజా ఎక్సర్సైజ్ శాంతి నిర్వహణ కార్యకలాపాలపై ఐక్యరాజ్యసమితి చార్టర్ యొక్క VII అధ్యాయం క్రింద ప్రత్యేకంగా సెమీ-అర్బన్ పరిసరాలలో ఉప-సాంప్రదాయ కార్యకలాపాలలో రెండు దళాల మధ్య పరస్పర సహకారం మెరుగుపరచడంపై దృష్టి పెట్టింది.
క్రియోల్ భాషలో లామిటీ (ఫ్రెండ్‌షిప్ ఇన్ క్రియోల్) అనగా స్నేహం అని అర్ధం. ఈ వ్యాయామం రెండు సైన్యాల మధ్య నైపుణ్యాలు, అనుభవాలు మరియు మంచి అభ్యాసాలను ఇచ్చిపుచ్చుకోవడంతో పాటు ద్వైపాక్షిక సైనిక సంబంధాలను కూడా పెంపొందిస్తుంది భావిస్తున్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర భద్రతను నిర్ధారించడంలో భారతదేశం మరియు సీషెల్స్ మధ్య కొనసాగుతున్న భాగస్వామ్యానికి "లామిటియే 2024" నిదర్శనంగా పనిచేస్తుంది.
సీషెల్స్ అనేది హిందూ మహాసముద్రంలో తూర్పు ఆఫ్రికాలో ఉన్న 115 ద్వీపాలతో కూడిన ద్వీపసమూహం. ఈ ద్విపాలు అనేక బీచ్‌లు, పగడపు దిబ్బలు మరియు ప్రకృతి దృశ్యాలకు నిలయంగా ఉంది. అలాగే ఈ ద్విపాలు భారీ ఆల్డబ్రా తాబేళ్లు వంటి అరుదైన జంతువులకు ఆవాసంగా ఉన్నాయి. ఈ ద్విపాలు ఆఫ్రికా ప్రధాన భూభాగానికి తూర్పున 1,500 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
- దేశం : సీషెల్స్
- ఖండం : ఆఫ్రికా
- రాజధాని : విక్టోరియా
- కరెన్సీ : సీచెలోయిస్ రూపాయి
- అధికారిక భాషలు : ఫ్రెంచ్ , ఇంగ్లీష్ , సెచెలోయిస్ క్రియోల్
- అధ్యక్షుడు : అల రాంకలవాన్